CINEMATelugu Cinema

తమిళ తొలి సూపర్ స్టార్ త్యాగరాజ భాగవతార్ జైలు జీవితం

1942లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం వారు “రెడ్ క్రాస్” కోసం విరాళాలు సేకరించినప్పుడు త్యాగరాజన్ భాగవతార్ గారి సంగీత కచ్చేరీలు ఏర్పాటు చేసింది. అప్పటికే సినిమాలలో నటుడుగా ఎవరెస్టు శిఖర స్థాయిలో ఉన్నారు. ఆ విరాళాల సేకరణ కచ్చేరీలు అయ్యాక తనకు బ్రిటిషు ప్రభుత్వం “రావు బహుదూర్” బిరుదు ఇవ్వాలనుకుంది. ఆ ప్రతిపాదనను త్యాగరాజన్ భాగవతార్ గారు  సున్నితంగా తిరస్కరించారు. తన సొంత ఊరిలో ప్రస్తుతం బి.హెచ్.ఇ.యల్ పరిశ్రమ ఉన్న ప్రాంతమంతా వ్రాసిస్తాం తీసుకోమన్నారు బ్రిటిషు వారు. కానీ త్యాగరాజన్ భాగవతార్ గారు అది కూడా వద్దన్నారు. నేను సమాజ సేవ కోసం కచ్చేరీలు చేస్తున్నాను, ప్రతిఫలాలు ఆశించడం భావ్యం కాదు. మీరు నా పట్ల చూపిస్తున్న గౌరవ ఆదరణకు కృతజ్ఞతలు అని బ్రిటిషు వారికి చెప్పారు.

ఇలా కొనసాగుతున్న తన వైభవానికి పరాకాష్ట 1944లో విడుదలైన తాను కథానాయకుడిగా తాను తీసిన తొమ్మిదవ చిత్రం “హరిదాస్”. ఈ హరిదాస్ చిత్రమే తెలుగులో పాండురంగ మహత్యం గా వచ్చింది. హరిదాస్ చిత్రం సృష్టించిన రికార్డులు తమిళంలో ఆ తర్వాత 50 సంవత్సరాల వరకు ఏ చిత్రం కూడా అధిగమించలేకపోయింది. 1944 దీపావళికి విడుదలైన త్యాగరాజన్ భాగవతార్ “హరిదాస్” చిత్రం 1946 దీపావళి వరకు ఒకే థియేటర్లో నడిచింది. ఆ విధంగా మూడు వరస దీపావళిలు చూసిన తొలి చిత్రం “హరిదాస్” అయ్యింది.    మామూలుగా సినిమా థియేటర్లు మారుతూ 130 వారాలు ఆడింది. ఆ సినిమా మీద వచ్చిన లాభాలతో నిర్మాతలు ఏకంగా స్పిన్నింగ్ మిల్ నే స్థాపించగలిగారు. త్యాగరాజన్ భాగవతార్ గారు సంగీత కచ్చేరీలు వాణిజ్య పరంగా కాకుండా దేవాలయాల్లో గానీ, పాఠశాలలలో గానీ చేసినప్పుడు తాను ఏమాత్రం పారితోషికం తీసుకునేవారు కాదు.

హరిదాస్ సినిమా ఘనవిజయంతో 1944లో త్యాగరాజన్ భాగవతార్ గారు ఒక్కో సినిమాకు లక్ష రూపాయలు పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు. ఆ సినిమాతో ఒకేసారి 12 సినిమాలకు సంతకాలు చేశారు. అప్పటివరకు పది సంవత్సరాల కాలంలో 8 సినిమాలలో మాత్రమే నటించారు. హరిదాస్ సినిమా విడుదలైన రెండు నెలలలోనే తాను హత్య నేరం కింద యావజ్జీవ ఖైదుగా జైలుకు వెళ్లాల్సి రావడం తన జీవితాన్ని అకస్మాత్తుగా కమ్మేసిన చీకటి తెర. హరిదాసు సినిమా సృష్టించిన ప్రభంజనాన్ని ఆయన చూడలేకపోయారు. మద్రాసు సెంట్రల్ స్టేషన్ ఎదురుగా ఉన్న జైల్లో ఖైదీగా ఉంటూ బయట మోర్ మార్కెట్ లో లౌడ్ స్పీకర్లలో వచ్చే తన హరిదాసు చిత్రంలో తాను పాడిన పాటలు వింటుంటే ఆయన మనఃస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. జైలు బయట ప్రేక్షకులు ఆయనకు విజయహారతులు పడుతున్నారు, జేజేలు చెబుతున్నారు. పూనకం వచ్చినట్లుగా హరిదాస్ సినిమాని చూసిన వాళ్ళే మళ్లీ మళ్లీ చూస్తున్నారు. త్యాగరాజ భాగవతార్ మాత్రం ఆ సంవత్సరాలలో జైలు గదుల్లో ఒంటరిగా ఏకాంతంలో ఉండిపోయారు. ప్రేక్షకులైతే తన సూపర్ స్టార్ నిర్దోషి అని జైలు బయటే నమ్మకంతోనే ఉన్నారు.  

భాగవతార్ గారి జీవితానికి, సినీ ప్రస్థానానికి జైలు చివరి అధ్యాయం కాదు. ఆ తర్వాత రెండేళ్లలో న్యాయస్థానాల్లో ఉన్న లండన్ ప్రీవీ కౌన్సిల్ కు వెళ్లి పోరాడిన పిమ్మట 30 నెలల తర్వాత ఆయన నిరపరాధిగా విడుదలయ్యారు.   ఇప్పటికి కూడా తమిళనాడు చరిత్రలో యం.కె.టి. భాగవతార్ గారికి పడిన శిక్ష గానీ, అది రద్దయిన వైనం గానీ ఒక మచ్చగా న్యాయస్థాన విశ్లేషకులు భావిస్తుంటారు. 1947లో జైలు నుండి నిర్దోషిగా విడుదలయ్యి బయటకు వచ్చిన తర్వాత ప్రజలలో ఆయనకు ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. కానీ అప్పటికే సినిమాల యొక్క ధోరణి మారిపోయింది. కాబట్టి తన పూర్వ వైభవాన్ని పొందలేకపోయారు. 1959 వచ్చే వరకు తాను ఐదు సినిమాలలో నటించినా, నిర్మించినా ఏవి కూడా తనని పూర్వ స్థాయిలో నిలబెట్టలేదు. చివరి సంవత్సరాలలో దేవాలయాల సందర్శనలు, పుణ్యతీర్ధాల  ఏర్పాటల్లోనూ, ఆశ్రమాల నివాసంలోను గడిపారు. సంగీత స్వరార్చన చేస్తూనే 1959లో తన 49 వ సంవత్సరంలో కన్నుమూశారు త్యాగరాజన్ భాగవతార్ మొట్టమొదటి తమిళ సూపర్ స్టార్.

జీవిత విశేషాలు…

జన్మ నామం :  మాయవరం కృష్ణసామి త్యాగరాజ భాగవతార్

ఇతర పేర్లు   :    యం.కె. త్యాగరాజ భాగవతార్

జననం    :    01 మార్చి 1910

స్వస్థలం   :    మాయవరం , తంజోర్ జిల్లా , మద్రాసు ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా

తండ్రి  :     కృష్ణసామి ఆచారి

తల్లి  :     మాణిక్కమ్మాళ్

జీవిత భాగస్వామి :    కమలం, రాజం

పిల్లలు   :   సుశీల, సరోజ, రవీంద్రన్

వృత్తి      :   నటుడు, గాయకుడు

బిరుదు  :   భాగవతార్

మరణం     :     01 నవంబర్ 1959 (వయస్సు 49), మద్రాసు , తమిళనాడు రాష్ట్రం , భారతదేశం

యన్.సి.లక్ష్మీకాంతన్ నేపథ్యం..

యన్.సి లక్ష్మీకాంతన్ అనే వ్యక్తి తమిళనాడులో పేద కుటుంబంలో పుట్టి ఇంటర్మీడియట్ వరకు చదువుకుందాం అనుకున్నాడు. తనకున్న ఆర్థిక పరిస్థితులు తన చదువుకు పెద్దగా సహకరించలేదు. ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలన్న తపన తనకు ఉండేది. దాంతో తాను వక్రమార్గాలు పట్టి మోసాలు, నకిలీ సంతకాలు, నకిలీ ధ్రువపత్రాలు, వృత్తిగా ఎంచుకున్నాడు. ఆ క్రమంలో మద్రాసులో “డైలీ ఎక్స్ ప్రెస్” అనే ఒక పత్రికను కొన్నాడు. కొని ఆ యజమానికి డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు ఇచ్చాను అని నకిలీ రశీదు తయారుచేయించి తన వద్ద ఉంచుకున్నాడు.

ఆ “డైలీ ఎక్స్ ప్రెస్” పత్రిక యజమాని “తనకు లక్ష్మీకాంతం పత్రిక కొన్నారు, కానీ డబ్బులు ఇవ్వలేదు” అని కోర్టుకు వెళ్లాడు. కోర్టులో లక్ష్మీకాంతం ఆ నకిలీ రశీదు చూపించాడు. నేను పత్రిక కొన్నాను తాను సంతకం చేసాడు అందుకు సాక్ష్యం ఆ రశీదు అని లక్ష్మీకాంతం అన్నాడు. కానీ అది నకిలీ సంతకం అని తేలింది. కేసు ఓడిపోతానని తెలిసిన లక్ష్మీకాంతన్ పోలీసులకు దొరక్కుండా పారిపోయాడు. మొత్తానికి తనను పోలీసులు వెతికి పట్టుకొచ్చి శిక్ష వేయించి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుంటే మళ్ళీ దూకి  పారిపోయాడు. మళ్లీ వెతికి పట్టుకొచ్చి ఈ నేరాలన్నిటికీ కలిపి పది సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. అలా పది సంవత్సరాలు జైలులో ఉండి 1943లో జైలు నుంచి బయటకు వచ్చారు.


సినిమా తూతు పత్రికలో అశ్లీల వార్తలు వ్రాసిన లక్ష్మీకాంతన్..

తేలికగా సంపాదించడానికి అలవాటు పడిన ప్రాణం, డబ్బులు  నకిలీ పత్రాలు, మోసాలు అలవాటయ్యాయి. జైలుకు వెళ్ళివచ్చినా భయం లేదు. 1943వ సంవత్సరంలో అతను “సినిమా తూతు” అనే చలనచిత్ర వారపత్రికను ప్రారంభించాడు. అందులో బెదిరింపు చర్యలు చేసేవాడు. యెల్లో జర్నలిజంకు అలవాటు పడ్డాడు. నీలి వార్తలు ఎక్కువగా వ్రాసేవారు. సంఘంలో పెద్దలని, పరపతి ఉన్న వాళ్ళని, పేరు ప్రతిష్టలు ఉన్న వారిని వృత్తిరీత్యా ఎంచుకునేవాడు. వైద్యులను, చలనచిత్ర పరిశ్రమకు చెందిన వారిని, న్యాయవాదులను ఎంచుకునే వాడు. వారినే లక్ష్యంగా పెట్టుకొని పుకార్లు, అవాకులు చవాకులు, అశ్లీల వార్తలు ఎక్కువగా వ్రాస్తుండేవారు.

వ్రాసేముందు సదరు వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించి వచ్చేవారం మీ గురించి వ్రాస్తున్నాను, నాకు కావలిసినంత డబ్బులు ఇస్తే వ్రాయకుండా ఆపేస్తానని బెదిరించేవారు. కొందరు తన బెదిరింపులకు లొంగేవారు. అలా తన బెదిరింపులకు బాధితులుగా ఉన్నవారిలో త్యాగరాజ భాగవతార్ ఒకరు. తనను బెదిరిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని తన వెనకాల పడ్డాడు. నటుడు యన్.యస్ కృష్ణన్ మరియు సినిమా స్టూడియో యజమాని శ్రీరాములు నాయుడు సినీ నిర్మాత (పక్షిరాజు స్టూడియో యజమాని) వీళ్ల గురించి కూడా “సినిమా తూతు” అనే పత్రికలో లక్ష్మీకాంతన్ వ్రాస్తూ ఉండేవారు.

 అక్రమార్జనే ధ్యేయంగా లక్ష్మీకాంతన్..

సదరు వ్యక్తులు లక్ష్మీకాంతన్ బెదిరింపులకు లొంగలేదు సరికదా మీరు గవర్నర్ గారికి ఒక ఫిర్యాదు లేఖ వ్రాశారు. గవర్నర్ గారు విచారణ చేసి లైసెన్స్ లేకుండా నడుపుతున్న “సినిమా తూతు” అనే పత్రికను నిషేధించి ఆపేశారు. దాంతో లక్ష్మీకాంతన్ కు వారిపైన విపరీతమైన ద్వేషం కలిగింది. లక్ష్మీకాంతన్ వారిపైన కక్ష పెంచుకున్నాడు. తాను ఆగస్టు 1944 లో అనంత అయ్యర్ వద్ద “హిందూ నేషన్” అనే పత్రిక కొనుక్కుని సినిమా వాళ్లపై అబద్ధపు వార్తలు రాయడం ప్రారంభించాడు. ముఖ్యంగా ఈ ముగ్గురు భాగవతార్, కృష్ణన్, శ్రీరాములు నాయుడు మరియు మరికొందరు అగ్ర నటులు, నటీమణులు మరియు ఆనాటి సినీ వ్యక్తులపై తన అపకీర్తి కథలను కొనసాగించాడు.

అలా ఈ పత్రికలో టప్పుడు వార్తలు వ్రాసి బాగా డబ్బులు సంపాదించాడు. సొంతంగా ప్రెస్ పెట్టుకున్నాడు, పైగా సొంత ఇల్లు కూడా కొన్నాడు. ఆ ఇల్లు కొన్నప్పుడు అందులో ఇంతకుముందు వడివేలు కిరాయికి ఉన్నడు. తనను ఖాళీ చేయించాలి అనుకున్న లక్ష్మీకాంతన్ మాటలు ఖాతరు చేయలేదు. తన ఇంటిలో ఉంటున్న వడివేలు అతని మరదలు గురించి “హిందూ నేషన్” పత్రికలో పుకార్లు వ్రాసేవాడు లక్ష్మీకాంతన్. దాంతో కోపోద్రిక్తుడైన వడివేలు “నేను ఇల్లు ఖాళీ చేయను. ఏం చేసుకుంటావో చేసుకో” అని లక్ష్మికాంతన్ తో అన్నాడు.  లక్ష్మీకాంతన్ ఇంజంక్షన్ ఆర్డర్ కోసం న్యాయస్థానంలో కేసు వేస్తున్న సమయంలో 1944 అక్టోబర్ లో లక్ష్మీకాంతన్ ను ఎవరో పొడిచారు.  దాంతో చిన్న గాయం అయ్యింది. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి వెళితే ఇదేమి పెద్ద గాయం కాదు కదా మేము కేసు నమోదు చేసుకోమన్నారు. దాంతో చేసేది ఏమి లేక వెళ్ళిపోయాడు.


సి.యన్ లక్ష్మీకాంతన్ పై హత్యయత్నం…

ఇల్లు ఖాళీ చేయించే పని మీదే కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు లక్ష్మీకాంతన్. తన ఇల్లు గురించిన కేసు 10 నవంబరు 1944 నాడు విచారణకు రావాలసి ఉంది. 08 నవంబర్ 1944 లక్ష్మీకాంతం తన న్యాయవాదిని సంప్రదించి పైన పేర్కొన్న కొన్ని పేపర్లను టైప్ చేయించుకోవడానికి వెళ్లాలనుకున్నాడు. లక్ష్మీకాంతన్ రిక్షాలో వెళుతుండగా ఎవరో ఇద్దరు వ్యక్తులు రిక్షాను తోసేశారు. లక్ష్మీకాంతన్ క్రింద పడిపోయాడు. వచ్చిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు కత్తితో పొడిచారు. లక్ష్మీకాంతన్ కి పొట్ట మీద ఎడమవైపున లోపలకు చాకు దిగింది. రెండో వ్యక్తి వచ్చి రిక్షావాడిని దూరంగా తోసేసి అతను కూడా లక్ష్మీకాంతన్ ను పొడిచేశాడు. మొదటి వ్యక్తి ముందే పారిపోయాడు. తరువాత రెండో అతను కూడా లక్ష్మీకాంతాన్ ను వదిలించుకుని పారిపోయాడు.  

లక్ష్మీకాంతన్ తన పొట్టలో దిగిన కత్తిని తీసి రోడ్డుపై పడేసి అలాగే నడుచుకుంటూ న్యాయవాది దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మీకాంతన్ ను పొడిచిన స్థలం నుండి న్యాయవాది ఇంటివద్దకు 150 అడుగుల దూరం మాత్రమే ఉంది. న్యాయవాదికి విషయం చెప్పగా లక్ష్మీకాంతన్ కు ఒకతనిని ఇచ్చి తోడుగా పంపించాడు. దవాఖానకు వెళ్లే త్రోవలోనే ఉన్న పోలీస్ స్టేషన్ లో పోలీసు అధికారి కృష్ణన్ నంబియార్ ను బయటకు పిలిచి రక్తం కారుతున్న తన పొట్టను పట్టుకొని అతనికి నివేదిక ఇవ్వగా దానిని పోలీసు అధికారి కృష్ణన్ నంబియార్ కాగితంపై వ్రాసాడు. అక్కడినుండి వెళ్లి దవాఖానలో చేరారు లక్ష్మికాంతన్. ఇదంతా 08 నవంబరు 1944 ఉదయం 10 గంటలకు జరిగింది. ఈ వార్తలన్నీ అప్పట్లో ఉన్న ఇండియన్ ఎక్స్ ప్రెస్ అనే పత్రికలో వ్రాశారు.

దవాఖానకు వెళ్ళాక సి.యన్.లక్ష్మీకాంతన్ కి ఆరోగ్యం కుదుటపడుతుందని భావించారు. కానీ అనుకోని పరిస్థితుల్లో 09 నవంబరు 1944 ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో లక్ష్మీకాంతన్ కన్నుమూశారు.

యం.కె.టి భాగవతార్ అరెస్టు..

సి.యన్.లక్ష్మీకాంతన్ తాను పోలీస్ స్టేషన్ లో ఏం చెప్పారో తెలియదు. కానీ దవాఖానలో ఎవరు పొడిచారు అనే విషయానికి సమాధానం చెప్పలేదు. సి.యన్.లక్ష్మీకాంతన్ మరణం తరువాత 48 గంటలలోనే వడివేలు అనే అతని అరెస్టు చేశారు. వడివేలే పొడిచాడా తెలియదు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో లక్ష్మీకాంతన్ ఏం చెప్పాడో తెలియదు. వడివేలును అరెస్ట్ చేసిన రెండు వారాల తర్వాత నాగలింగం అనే అతనిని అరెస్టు చేశారు. నాగలింగం అనే వ్యక్తి తాను వడివేలుకు లక్ష్మీకాంతన్ ను పొడిచే విషయంలో సహాయం చేశారు అని అరెస్టు చేశారు.

మరికొన్ని రోజులకు లక్ష్మీకాంతన్ కేసులో జయానందన్ అనే ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ జయానందన్ పై కూడా గతంలో పేపర్లో వ్రాశారు లక్ష్మీకాంతన్. ఉన్నట్టుండి ఆర్యవీరసేనన్ అనే (సినిమాలలో స్టంట్ మాస్టర్) వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఒక పచారీ కొట్టు అతడిని, ఒక కానిస్టేబుల్ ని అరెస్ట్ చేశారు. ఇదంతా ఒక 45 రోజుల వ్యవధిలోనే జరిగింది. చిట్టచివరికి డిసెంబరు 1944 లో అప్పటి హాస్య నటుడు ఎన్.ఎస్ కృష్ణన్ ని కోయంబత్తూరు లో అరెస్టు చేశారు. యం.కె.టి భాగవతార్ ని మద్రాసులో అరెస్టు చేశారు. అలాగే పది రోజుల తర్వాత  ఎస్.ఎం శ్రీరాములు నాయుడును అరెస్టు చేశారు. వారందరినీ జైలుకు పంపించారు. ఆ రోజు జైలుకు వెళ్లిన సూపర్ స్టార్ యం.కె.టి భాగవతార్ రెండున్నర సంవత్సరాలు జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.

విచారణ కథనం ప్రకారం…

అసలు ఈ కేసులో వెనకాల ఏం జరిగింది? ఆరోజు ఏం జరిగింది? త్యాగరాజు భాగవతార్, ఎన్.ఎస్ కృష్ణన్ ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది అనే దానికి ఆధారాలు ఏమిటంటే ఆరోజు వెలువడిన తీర్పు మాత్రమే.  విచారణ కథనం ప్రకారం సి.యన్.లక్ష్మీకాంతన్ వడివేలును ఇల్లు ఖాళీ చేయమని అడిగాడు. కానీ వడివేలు ఖాళీ చేయలేదు. అప్పటికే త్యాగరాజన్ భాగవతార్ పైన, ఎన్.ఎస్ కృష్ణన్ పైన, శ్రీరాములు నాయుడు మీద పేపరులో లక్ష్మీకాంతన్ తప్పుడు వార్తలు వ్రాసినాడు కాబట్టి వాళ్లకు తెలిసింది. వడివేలు మీద కూడా వ్రాస్తున్నాడని సినిమాలో స్టంట్ మాస్టర్ గా పనిచేస్తున్న ఆర్యవీరసేనన్ ద్వారా వడివేలు సంగతి తెలుసుకొని అతడిని పిలిపించి “హిందూ నేషన్” యజమాని లక్ష్మీకాంతన్ అనే వ్యక్తి మీద హత్యకు ప్రణాళికలు వేశారు అని విచారణ ద్వారా ఆరోపించారు.

విచారణ కథనం ప్రకారం వారి వాదన ఇలా ఉంది “హత్యకు రెండు రోజుల ముందు ఎన్.ఎస్ కృష్ణన్, త్యాగరాజ భాగవతార్ శ్రీరాములు నాయుడిని ఒక స్టూడియోలో కలుసుకున్నారు. ఆ స్టూడియోలో మీరు మా పేరు బయటకు రాకుండా చూడండి. తరువాత మీరు అరెస్టు అయితే మా పేరు ప్రతిష్టలతో మిమ్మల్ని బయటకు తీసుకు వస్తాము. ఆ చుట్టుప్రక్కల ఎవ్వరు లేకుండా మేము ఒక కానిస్టేబుల్ పంపిస్తాము. బయానా పూర్వకంగా 500 రూపాయలు తీసుకోండి. హత్య పూర్తయినాక మరో రెండు వేల రూపాయలు ఇస్తాను అని త్యాగరాజని భాగవతార్, శ్రీరాములు నాయుడు, యన్.యస్. కృష్ణన్ చెప్పారు” అని విచారణ బృందం కోర్టులో వాదించింది.  నిజంగా ఇలా జరిగిందా లేదా తెలియదు. ఈ వాదనలన్నీ జరుగుతున్నప్పుడు ఇంత మందిని అరెస్ట్ చేశారు.

ఎస్.ఎం శ్రీరాములు నాయుడు విడుదల…

అలా వాదనలు జరిగాక కొన్నాళ్లకు 20 ఏప్రిల్ 1945 నాడు శ్రీరాములు నాయుడుని విడుదల చేశారు. ఎందుకంటే ఆ సమయంలో నేను అక్కడ లేను, వేరే దగ్గర ఉన్నాను అని సాక్షాదారాలతో సహా నిరూపించాడు. హాస్యనటులు ఎన్.ఎస్ కృష్ణన్ కూడా తాను హత్య సమయంలో సేలంలో ఉన్నానని సాక్షాదారాలు చూపించారు. కానీ కోర్టు నమ్మలేదు. 22 ఏప్రిల్ 1945 నాడు చిట్టచివరి వాదనలు వినిపించాల్సిన సమయం. 22వ తారీకు ఉదయం మొదలుపెట్టి 23వ తారీకు సాయంకాలం వరకు రెండు రోజులు పాటు నిర్విరామంగా అందరి వాదనలు విన్నాక న్యాయమూర్తి తొమ్మిది మంది న్యాయవాదులు గల జ్యూరీ సభ్యులకి కేసు గురించి వివరించి ఈ కేసు తీర్పు చెప్పండి అని సూచించారు.

యావజ్జీవ ఖైదు ఖరారు చేసిన జ్యూరీ సభ్యులు…

ఆ తొమ్మిది మంది న్యాయవాదులు మూడు గంటలు చర్చించుకుని యం.కె.టి భాగవతార్, యన్.యస్ కృష్ణన్ ఇద్దరు కూడా ఇందులో నిందితులే, వాళ్ళే ఈ హత్యకు ప్రేరేపించారు. హత్య చేసిన వారు నాగలింగం, వడివేలు మొదలగువారు, ప్రేరేపించినదంతా యం.కె.టి భాగవతార్ అని 6:3 నిష్పత్తిలో ఆరుగురు న్యాయవాదులు అవునన్నారు, ముగ్గురు న్యాయవాదులు కాదన్నారు. దాంతో వారికి వారికి శిక్షణ ఖరారు చేశారు. 23 ఏప్రిల్ 1945 సాయంకాలం అనేకమంది నిర్మాతలు కోర్టు దగ్గరికి పూలమాలలతో వచ్చారు. ఎందుకంటే అప్పటికే యం.కె.టి భాగవతార్ గారు అప్పటికే పన్నెండు సినిమాలుకు సంతకాలు చేశారు, మరికొన్ని సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఆ సినిమాల నిర్మాణం జరుగకపోతే వారంతా ఆర్థికంగా బోలెడంత నష్టపోతారు. కానీ కొద్దిసేపటి తర్వాత వీరిని విడుదల చేయడం లేదు. వీరే హత్యకు ప్రేరేపించారు కాబట్టి వీళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది అని తీర్పు వచ్చింది. అలా తీర్పు వచ్చేసరికి ఆ నిర్మాతలు అంతా పూలదండలను చించిపడేసి అందరూ వెనక్కి వెళ్ళిపోయారు.

లండన్ ప్రివ్యూ కౌన్సిల్ కు విజ్ఞప్తి…

అప్పటికే హరిదాసు సినిమా 41 వారాలు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ ఉంది. అప్పటికే కథానాయకులు యం.కె.టి భాగవతార్ గారు ఆరు నెలలుగా జైల్లోనే ఉన్నారు. మరొక రెండు సంవత్సరాలు జీవితాన్ని జైలులోనే కొనసాగించారు. 29 అక్టోబరు 1945 నాడు త్యాగరాజ భాగవతార్ గారు తాను న్యాయస్థానం ముందుంచిన అభ్యర్థనను ప్రధాన న్యాయస్థానం (హైకోర్టు) తిరస్కరించింది. దాంతో తన న్యాయవాదులతో చర్చించి తరువాత ఏ కోర్టుకు వెళ్లాలని అనుకున్నప్పుడు లండన్ లో ప్రివ్యూ కౌన్సిల్ కు ఆ కేసును పంపించారు. లండన్ ప్రివ్యూ కౌన్సిల్ వారు సుప్రీంకోర్టు లాంటి వాళ్ళు. వాళ్ళకి విజ్ఞప్తి చేసుకున్నారు. ఎందుకంటే అప్పటికి ఇంకా భారతదేశంలో సుప్రీంకోర్టును స్థాపించలేదు.

జైలు నుండి త్యాగరాజన్ భాగవతార్ విడుదల…

తమిళ ప్రముఖ నటులు యం.కె త్యాగరాజ భాగవతార్ గారు తాను జైలులో నిర్భందించి సంవత్సరంన్నర తరువాత జూన్ 1946లో ఈ కేసును మరొకసారి పరిశీలించాలని లండన్ ప్రివ్యూ కౌన్సిల్ వారు ఈ కేసును వెనక్కి పంపించారు. 24 ఫిబ్రవరి 1947 నాడు మద్రాసు ప్రధాన న్యాయస్థానం (హైకోర్టు) బెంచ్ ముందుకు వచ్చింది. ఈసారి వాళ్ళు రెండు రోజులు మాత్రమే విచారించారు.

అప్పట్లో ఇచ్చిన తీర్పు ప్రకారం “రెండున్నర సంవత్సరాల క్రితం ఇచ్చిన తీర్పులో తప్పు ఉంది. వీరు మాత్రమే హత్య చేశారనడానికి ఆధారం లేదు. సి.యన్ లక్ష్మీకాంతన్ కు చాలామంది శత్రువులు ఉన్నారు. వాళ్లలో ఎవరైనా ఈ హత్య చేసి ఉండొచ్చు. విచారణ సభ్యులు సమర్పించిన ఆధారాలు బలంగా లేవు. వీరికి శిక్ష ఎందుకు వేసారో తెలియదు. కావున అందరిని కూడా విడుదల చేయాలి” అని తీర్పు వెలువరించింది. 25 ఏప్రిల్ 1947 మధ్యాహ్నం ఒంటిగంట పదిహేను నిమిషాలకు యం.కె త్యాగరాజ భాగవతార్ మొట్టమొదటి తమిళ సూపర్ స్టార్ గారు జైలు నుంచి బయటికి వచ్చారు. కానీ రెండున్నర సంవత్సరాలలో కోల్పోయిన తన సినీ ప్రస్థానాన్ని ఎవ్వరూ వెనక్కి తీసుకురాలేకపోయారు.

తనలో మార్పు తీసుకువచ్చిన జైలు జీవితం..

జైలు నుండి బయటకు వచ్చిన తరువాత తాను ఏమీ మాట్లాడకుండా తన ఊరు వెళ్ళిపోయారు. దేవాలయానికి వెళ్లి ప్రార్థనలు చేసుకున్నారు. హాస్యనటులు యన్.యస్ కృష్ణన్ మాత్రం యధావిదిగా తాను సినిమాలలో నటిస్తూ ఉండిపోయారు. యం.కె త్యాగరాజ భాగవతార్ గారు అప్పటివరకు తాను సినిమాల కోసం సంతకం చేసిన నిర్మాతలు అందరూ తిరుచ్చి వెళ్లారు. సినిమాలకు బయానాగా చెక్కులు ఇస్తామని వచ్చారు. కానీ తాను అడ్వాన్సులు తీసుకోలేదు.

ఎందుకంటే ఈ నిర్మాతలే తాను జైలులో ఉండగా అదే అడ్వాన్సులు వెనక్కి ఇవ్వాలని ఆ కుటుంబాన్ని వేదించడము, ఆయన తన ఆస్తులను అమ్ముకోవాల్సిరావడం, యం.కె త్యాగరాజ భాగవతార్ గారు జైలు నుండి బయటకి వచ్చే పరిస్థితి లేదు అట్నుంచి అటే అండమాన్ నికోబార్ జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆ నిర్మాతలంతా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ యం.కె త్యాగరాజ భాగవతార్ గారికి గుర్తుకున్నాయి. మళ్ళీ అలాంటి నిర్మాతల దగ్గరికి ఎందుకని తాను ఎవరికి దగ్గర అడ్వాన్సులు తీసుకోలేదు. తానే సొంతంగా సినిమా తీయడానికి సంకల్పించి కొత్త సినిమాను ప్రారంభించారు.

సొంతంగా “రాజముక్తి” సినిమా తీసిన భాగవతార్…

భాగవతార్ గారు రాజ ముక్తి అనే సినిమాను తీశారు. అది 1948లో విడుదలైంది. కాకపోతే మద్రాసు ప్రెసిడెన్సీ లో తనకు అంత అవమానం జరిగింది. ఏమాత్రం తనకు సంబంధం లేకుండా తనను జైల్లో పెట్టారని, పెట్టించారని ఆ సినిమాను మద్రాసులో కాకుండా పూణేలో చిత్రీకరించారు.  సహజంగానే రాజ ముక్తి లో ప్రధాన పాత్ర యం.కె త్యాగరాజ భాగవతార్ గారు నటించారు. తనతో పాటుగా ఎం.జి.రామచంద్రన్ మరియు అతని భార్య వి.ఎన్ జానకి, ఎం.జి రామచంద్రన్ తమ్ముడు చక్రపాణి గార్లు అందరూ ఈ సినిమాలో ఉన్నారు. ఆ సినిమా వచ్చేటప్పటికి తమిళ సినిమాల ట్రెండ్ మారిపోయింది. దాంతో రాజముక్తి సినిమా అనుకున్నంతగా ప్రజాదరణ పొందలేదు. జానపదాలు, పౌరాణికాలు, త్యాగరాజన్ భాగవతార్ గారి పాటలు ఇష్టమున్నప్పటికీ కూడా అలాంటి సన్నివేశాలు వేరే సినిమాలలో ఉండడంతో ప్రేక్షకులను ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో భాగవతార్ గారికి నష్టం వచ్చింది.

నిర్లిప్తమైన ధోరణికి అలవాటు పడ్డ భాగవతార్..

త్యాగరాజన్ భాగవతార్ గారికి తనకున్న అనేకమంది అభిమానులలో ఒక అభిమాని ఫిడెల్ కంపెనీ యజమాని “హరిరామ సేథ్” రాజముక్తి సినిమాకు ఎంత నష్టం వచ్చిందో చెప్పండి నేను ఆదుకుంటాను, నేను మొత్తం డబ్బులు మీకు ఇచ్చేస్తాను అన్నాడు. కానీ నిజానికి త్యాగరాజన్ భాగవతార్ గారి వ్యక్తిత్వం విషయానికి వస్తే తనను దగ్గరుండి పరిశీలించిన వారు తనని విపరీతంగా ఇష్టపడేవారు. త్యాగరాజన్ భాగవతార్ గారి స్వభావము, ఆయన వ్యక్తిత్వమును కూడా ప్రజలు అభిమానిస్తుండేవారు. ఆయన ఎవరి వద్ద కూడా సహాయం తీసుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. తాను సంపాదించినదంతా స్వయంకృషితో సంపాదించినదే. అందుకని తన అభిమాని హరిరామ్ సేథ్ డబ్బులు ఇస్తానన్నా కూడా భాగవతార్ గారు స్వీకరించలేదు.

అలాగే రాజముక్తి సినిమా జరిగేటప్పుడు భాగవతార్ గారి అమ్మగారు చనిపోయారు. ఆయన ఎన్ని బాధలు ఉన్నా ఒక్క కన్నీటి చుక్క కార్చలేదు. కానీ వాళ్ళ అమ్మగారు పోయినప్పుడు తాను చిన్న పిల్లవాడిలా వెక్కి వెక్కి ఏడ్చారు. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు తనలో వచ్చిన  ఆధ్యాత్మికత ఆలోచనల వలన దేని గురించి కూడా ఎక్కువగా బాధపడేవాడు కాదు. తనను కేసులో ఇరికించిన వారిపై పగ సాధించాలనో, ఆయన గురించి ఎవరు ఈ విధంగా చేశారో అన్వేషించాలనో, నష్టమొచ్చిందని బాధపడడమో లేక మళ్లీ కచేరీలు చేసి సంపాదించాలనో ఇలాంటి ఆలోచనలు ఏవి ఉండేవి కాదు. ఒక రకమైన నిర్లిప్తమైన ధోరణికి అలవాటు పడిపోయారు యం.కె త్యాగరాజ భాగవతార్ గారు.

చివరి సినిమా “పుదు వజ్వు” (1957)..

త్యాగరాజన్ భాగవతార్ గారు 1952లో “అమర కవి” అనే సినిమా తీశారు. శ్యామల (1952) అనే ఇంకో సినిమా తీశారు. 1957లో చిట్టచివరిగా సొంతంగా “పుదు వజ్వు” అనే సినిమా నిర్మించారు. ఎన్ని సినిమాలు తీసినా కూడా ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. అన్నీ నష్టాన్నే తెచ్చిపెట్టాయి. తన సన్నిహితులు భాగవతార్ యొక్క మంచితనం గురించే చెబుతూ ఉండేవారు. భాగవతార్ గారు బయటకు రాగానే తన తరపున వాదించిన న్యాయవాది యతిరాజ్ గారికి ఒక బంగారుపళ్లెం బహుకరించారు. అమరకవి సినిమా పాటలకోసం టి.రాజేంద్రన్ రాజగోపాల్ అనే ఒక కవి భాగవతార్ కోసం వచ్చారు. ఆ సమయంలో త్యాగరాజన్ భాగవతార్ గారు భోజనం చేస్తున్నారు. తనను కూడా భోజనానికి ఆహ్వానించారు.

అప్పుడు త్యాగరాజు గారికి బంగారు పళ్లెం లోను, అతిథి కవి టి.రాజేంద్రన్ రాజగోపాల్ గారికి అరిటాకులోను భోజనం పెట్టారు. అప్పుడు త్యాగరాజన్ భాగవతార్ గారు ఆయన బంగారుపళ్లెం ను రాజేంద్రన్ రాజగోపాల్ కు మార్చి తనతో మీలో ఉన్న కవికి నేను ఇచ్చే బహుమానం ఇదే అన్నారు. భోజనం పూర్తయ్యాక ఆ బంగారుపళ్లెం ను తనకే బహుకరించి, అమరకవి సినిమాలో పాటలు వ్రాయడానికి అవకాశం వచ్చేలా చేశారు. అలాగే టి.ఆర్.మహాలింగం గారి అబ్బాయి బడికి వెళ్ళడానికి ముందు త్యాగరాజన్ భాగవతార్ గారిచే కచ్చేరి పెట్టించి తనకు వెయ్యి రూపాయలు పారితోషికంగా త్యాగరాజన్ భాగవతార్ గారికి ఇచ్చారు. ఆ వెయ్యి రూపాయలు తీసుకున్న త్యాగరాజన్ భాగవతార్ గారు దానికి అదనంగా ఒక వంద రూపాయలు చేర్చి పదకొండు వందల రూపాయలు టి.ఆర్. మహాలింగం గారి కొడుకుకు ఇవ్వడంతో బాటు ఒక బంగారు పెన్నును కూడా తనకు బహుకరించారు.

ఆధ్యాత్మిక ధోరణి…

త్యాగరాజ భాగవతార్ గారు ఒక పాఠశాల విరాళాల కోసం పాట కచ్చేరీ చేయగా ఆ పాఠశాల వారు ఒక వెండి పళ్లెంను బహుకరించబోయారు. అప్పుడు భాగవతార్ గారు పాఠశాల యాజమాన్యంతో “నేను ఎన్నో ఐశ్వర్యాలు చూశాను, జైలులో రెండున్నర సంవత్సరాలు ప్రభుత్వానికి అతిథిగా ఉన్నాను. నాకు ఇదంతా అవసరమా” అని దానిని తిరస్కరించారు. ఆయన సినిమాలు సరిగ్గా ఆడకపోవడం, నష్టాలు రావడం, ఇలా ఎన్ని జరిగినా గానీ ఆయన దిగులు పడలేదు, ఒకరి వద్ద తన ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టలేదు, ఆత్మగౌరవం పోగొట్టుకోలేదు, ఆత్మవిశ్వాసాన్ని వదులుకోలేదు. చివరి రోజులలో దేవాలయాలకు ఎక్కువగా వెళ్లేవారు. పుట్టపర్తి సాయిబాబా దగ్గరకు కూడా వెళ్ళొచ్చారు. కొన్నిసార్లు నెలల తరబడి ఆశ్రమాలలో ఉండేవారు. ఇలా ఆయన ఆధ్యాత్మికంగా వేదాంత ధోరణితోటి సాంత్వన పొందడానికి ప్రయత్నిస్తున్న రోజులలో ఎస్.ఎస్ రాజేంద్రన్ వచ్చి మద్రాసు వచ్చేయండి, మీకు జీవిత పురస్కారం ఇస్తాము, బంగారు పురస్కారం అందజేస్తాము అన్నారు. అయినా కూడా ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు భాగవతార్ గారు.

కుటుంబం…

ఇక కుటుంబ విషయానికి వస్తే త్యాగరాజ భాగవతార్ గారికి కమల అనే ఆవిడతో పెళ్లయ్యింది. త్యాగరాజ భాగవతార్ గారు తాను పావలాకోడి సినిమా తీస్తున్నప్పుడే పెద్దమ్మాయి “సుశీల” జన్మించింది. ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలకు “సరోజ” అనే అమ్మాయి జన్మించింది. 1939లో రవీంద్రన్ అనే కొడుకు పుట్టాడు. సరోజ, రవీంద్రన్ లు చనిపోయారు. సుశీల మద్రాసులో ఉంటున్నారు. త్యాగరాజ భాగవతార్ గారికి చివరి రోజులలో మధుమేహం వ్యాధి వచ్చింది. దాంతో తనకు కంటి చూపు మందగించింది. తన చిట్టచివరి కచ్చేరి తాను చనిపోవడానికి పది రోజులు ముందు “పొలాచ్చి” లో జరిగింది. ఆ సంగీత కచ్చేరి జరిగేటప్పుడు మధ్య మధ్యలో ఆగి ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఆ సభ జరుగుతున్నప్పుడు ఒక అభిమాని వచ్చి మీ మధుమేహ వ్యాధికి ఈ ఆయుర్వేద మందు బాగా పనిచేస్తుందని ఇచ్చాడు. అది తీసుకున్నాక తనకు జబ్బు మరీ ఎక్కువైపోయింది. దాంతో అభిమానులు భాగవతార్ గారిని అక్కడ నుంచి పొలాచ్చి రైల్వే స్టేషన్ కు తీసుకువచ్చారు.

అంతిమ ఘడియలు…

త్యాగరాజన్ భాగవతార్ గారు రైల్వే స్టేషన్ కు వచ్చి రైలు కోసం వేచి చూస్తుండగా కరెంటు పోయింది. తన వెంట వచ్చిన వారిలో ఒకరు ఇది శుభసూచకం కాదు, వెనక్కి వెళ్ళిపోయి రేపు వద్దాం అన్నారు. కానీ దానికి త్యాగరాజన్ భాగవతార్ గారు ఒప్పుకోలేదు. ఏం పర్వాలేదు. ఇలాంటివి ఎన్ని చూడలేదు నా జీవితంలో. అంతమాత్రానికే వెనక్కి వెళ్ళిపోతామా? అని రైలు రాగానే ఎక్కి మద్రాసుకి వెళ్ళిపోయారు. 22 అక్టోబరు 1959 ఆయనకు కేవలం 49 సంవత్సరాల వయస్సు. వైద్యులు చికిత్స చేశారు. కానీ ఎంతకూ అదుపులోకి రాలేదు. చిట్టచివరికి 01 నవంబరు 1959 సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు త్యాగరాజన్ భాగవతార్ గారి ప్రాణాలు అనంత వాయువులో విలీనమయ్యాయి.

అక్కడి నుండి భాగవతార్ గారి మృతదేహాన్ని తిరుచ్చికి తీసుకెళ్లి, తిరుచ్చి శివార్లలోని చిన్న గ్రామమైన సంగిలియాండపురంలో ఖననం చేశారు. ఆయన అంత్యక్రియల ఊరేగింపు సాయంత్రం 4.30 గంటలకు ఆయన ఇంటి నుండి కంటోన్మెంట్‌లో ప్రారంభమైంది. అధిక సంఖ్యలో గుమిగూడిన వీక్షకుల కారణంగా శ్మశానవాటికకు చేరుకోవడానికి దాదాపు 4 గంటల సమయం పట్టింది. త్యాగరాజన్ భాగవతార్ గారి అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ప్రముఖ సంగీత విద్వాంసులు సిర్కాళి గోవిందరాజన్ రెండు పాటలు పాడారు. ఆయన అంత్యక్రియలలో సిర్కాళి గోవిందరాజన్ పాడిన పాటలు రికార్డులుగా విడుదలై శ్రోతలు అభిమానులు పదేపదే వింటుండేవారు.

కాలసర్పం కాటువేసిన కళాకారుడు భాగవతార్..

పేరు ప్రతిష్టలు చాలా భయంకరమైనవి, కొన్నిసార్లు ప్రమాదకరమైనవి కూడా. ఒక వ్యక్తి మంచిగా సత్ప్రవర్తనతో జీవిస్తున్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళ పొరపాటు, ఎదుటి వాళ్ళ అసూయ లాంటివన్నీ కలిసి జీవితంలో అనూహ్యమైన లోతుల్లోకి నెట్టేయవచ్చు అని త్యాగరాజన్ భాగవతార్ గారి జీవితం చెబుతుంది. 30 ఏళ్ల వయస్సుకే ఆకాశం అంచుల్ని తాకేటటువంటి కీర్తిని అర్జించిన త్యాగరాజన్ భాగవతార్ గారు 34 ఏళ్ల వయస్సులో తగిలిన అనుకోని ఎదురుదెబ్బలకు తన మిగతా జీవితాన్ని బలిచేయవలసి వచ్చింది.

49 ఏళ్లకే నూరేళ్లు నిండిన త్యాగరాజన్ భాగవతార్ గారు కాలసర్పం కాటు వేసిన కళాకారులు, విధి వక్రీకరించిన విద్వాంసులు, న్యాయమూర్తుల న్యాయవ్యవస్థల చదరంగంలో చెక్ వేయబడ్డ నిస్సహాయుడు. ఆయన జీవితం ఎలా అంతమైనప్పటికీ తమిళ సంగీత ప్రియుల హృదయాలలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అద్వితీయ సంగీత సామ్రాట్, తమిళ చలనచిత్ర చరిత్రలో ఒక అధ్యాయాన్ని ఏర్పరచుకోవడమే కాదు, తన జీవితా అనుభవాలనే ఒక చరిత్రగా తమిళ ప్రజలకు అందించిన మొట్టమొదటి తమిళ సూపర్ స్టార్ మాయవరం కృష్ణసామి త్యాగరాజ భాగవతార్. అప్పటికి ఇప్పటికీ తరతరాలకు తమిళ ప్రేక్షకులకు సూపర్ స్టార్ త్యాగరాజన్ భాగవతార్.Show More
Back to top button