CINEMATelugu Cinema

ఆకాశ రామన్నకు ప్రేమలేఖ

కథ, కథనంలో ఎంతో వైవిధ్యం కనబరుస్తూ యువతరాన్ని గిలిగింతలు పెట్టే సునిశితమైన హాస్యంతో, చక్కని ప్రణయ సన్నివేశాలతో జంధ్యాల తీసిన “శ్రీ వారికి ప్రేమలేఖ” చిత్రం విషయాలు గురించి తెలుసుకుందాం. ఈనాడు పత్రిక గ్రూప్స్ కు చెందిన చతుర పత్రికలో పొత్తూరి విజయలక్ష్మి రాసినటువంటి ప్రేమలేఖ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కథలో ప్రధానాంశం ఏంటంటే ఓ అల్లరి పిల్ల.. మగవారి నైజం గురించి తన స్నేహితులతో పందెం కాస్తూ ఒక ఆకాశ రామన్నకు ప్రేమ లేఖ రాస్తుంది.

ఆ ప్రేమలేఖ ఆనందరావు అనే బ్రహ్మచారి వద్దకు చేరుతుంది. ఆ తర్వాత ఆనందరావు, అల్లరి పిల్ల ఎలా కలుసుకున్నారు అన్నదే కథాంశం. ఇక ఈ చిత్రంలో ఆనందరావుగా నరేష్ నటించారు. కథానాయికగా పూర్ణిమ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.1983 నవంబర్ 2న వైజాగ్ పరిసర ప్రాంతమైన భీమునిపట్నం వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు. ఆ రోజు నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు నిర్విరామంగా షూటింగ్ మొత్తం వైజాగ్ పరిసరాల్లోనే జరిగింది. మిగిలిన షూటింగ్ ను డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు సారథి స్టూడియోలో తీశారు. 19 లక్షల వ్యయంతో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. 1984 ఫిబ్రవరి 24న విడుదలైంది.

ఈ చిత్రంలో జంధ్యాలగారు పాత్రలకు, పరిస్థితులకు తగ్గట్టు రాసిన డైలాగుల ప్రభంజనానికి ప్రేక్షకులు ముగ్ధులైపోయారు. అడుగు అడుగునా సస్పెన్స్‌తో సాగే ఈ కథలో.. ఆ సస్పెన్స్ నుంచి జంధ్యాల హ్యూమర్‌ను పుట్టించారు. ఇక మిగిలిన పాత్రల విషయానికొస్తే చీటికి మాటికి అందరినీ భయపెట్టే పాత్రలో వీరభద్రరావు, కథలు చెప్పి హింసించే పాత్రలో శ్రీలక్ష్మి, రకరకాల వంటల ప్రయోగాలు చేసే పాత్రలో సంగీత, పేకాట ప్రియునిగా నూతన ప్రసాద్ అద్భుతంగా నటించారు.

ఇక అతిథి పాత్రలో సుత్తివేలు చక్కటి హాస్యాన్ని పండించారు. పాటల విషయానికొస్తే ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. ఈ సినిమా హీరో నరేష్ కి మంచి స్టార్ డమ్ తెచ్చి పెట్టడమే కాకుండా.. కమర్షియల్ హిట్‌‌ను అందించింది. ఈ సినిమాను తమిళ్‌లో రీమేక్ చేయగా అక్కడ హీరో పాత్రలో కూడా నరేష్ నటించగా.. మంచి హిట్టయ్యింది. ఈ చిత్రానికి జంధ్యాలకు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్, ఉత్తమ ఎడిటర్‌గా గౌతంరాజుకు నంది అవార్డులు లభించాయి.


Show More
Back to top button