Telugu Politics
Trending

జగన్‌ను ఈ వ్యవస్థ గట్టెక్కిస్తుందా?

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ గెలవడానికి ప్రధానంగా సీఎం జగన్ ప్రవేశపెట్టిన రెండు వ్యవస్థలు సహాయపడతాయని రాష్ట్రవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది. అయితే, దీనిపై శాస్త్రీయంగా విశ్లేషణ చేసి చూస్తే.. జగన్ మళ్లీ సీఎంగా అవతారం ఎత్తుతారో లేదా ఈసారి డీలా పడతారో చర్చిద్దాం.

వాలంటీర్ వ్యవస్థ

2019 ఆగస్టు 15న సీఎం జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ వైసీపీ మళ్లీ గెలవడానికి ఓ ముఖ్యమైన ఆయుధంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఉన్న వాలంటీర్లే నేడు అత్యంత ఆయుధంగా మారనున్నారు. వీరే జగన్‌ను విజయ తీరాలకు చేర్చుతారని జగన్ పూర్తిగా నమ్ముతున్నారు. అయితే, ఒక వాలంటీర్ పరిధిలో ఉన్న 50 కుటుంబాలలో 40 కుటుంబాలు జగన్ ఇచ్చిన పథకాలు మంచిగా ఉన్నాయని నమ్ముతుంటే.. మరో 10 కుటుంబాలు మాత్రం తమ దగ్గర నుంచి పరోక్షంగా ఏదో విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వ్యతిరేకంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ 10 కుటుంబాల వ్యతిరేకత ఎన్నికల్లో పెద్ద ప్రభావం పడదేమో అన్నట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల వాలంటీర్లు, దాదాపు రెండు లక్షల సచివాలయ ఉద్యోగులు, ఆ ఉద్యోగుల కుటుంబాలు ఓట్లు వేసి గెలిపిస్తాయని అంచానా వేస్తున్నారు. వారు తప్పని సరిగా ఓట్లు వేయడానికి కారణం.. మరో పార్టీ అధికారంలోకి వస్తే వారి ఉద్యోగాలకు గ్యారెంటీ ఉండదేమో అన్న అనుమానం ఉండడమే. అయితే ఈ ఉద్యోగులే కాక తమ పరిధిలో ఉన్న 50 కుటుంబాల ఓట్లు వేయించడంలో కూడా వాలంటీర్‌లు ముఖ్యపాత్ర వహిస్తారని సీఎం జగన్‌ నమ్ముతున్నారు.

వైసీపీ అధికారంలోకి రాగానే తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలో ఇళ్లు లేని దాదాపు 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం. ఇది కూడా ప్రస్తుత ఎన్నికల్లో కీలక పాత్ర వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ 31 లక్షల కుటుంబాలలో కనీసం 20 లక్షల కుటుంబాలు ఓట్లు వేసినా.. అది కూడా ఒక్కో కుటుంబంలో రెండు ఓట్లు చెప్పున వేసుకున్న భారీ మొత్తంలో ఓట్లు రావచ్చని తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

నవరత్నాలు కీలకంగా మారనున్నాయా..?

నవరత్నాల పథకాల ద్వారా 125 సార్లు బటన్ నొక్కి నేరుగా ప్రజలు బ్యాంకు ఖాతాల్లో రూ.2.5 లక్షల కోట్ల నిధులు వేశా అని ఇటీవల సీఎం జగన్ సిద్ధం సభలో చెప్పడం తెలిసిందే. అయితే, ఈ నవరత్నాల పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు చాలా వరకు పాజిటివ్‌గా ఉన్నా, కొన్ని కుటుంబాల్లో మాత్రం పరోక్షంగా మన డబ్బులే ఇస్తున్నారని వ్యతిరేకిస్తున్నారు. కాగా, సగానికి పైగా పాజిటివ్‌గా ఉన్న కుటుంబాలు మాత్రం జగన్‌కే ఓటు వేస్తే తప్పక గెలిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

Show More
Back to top button