CINEMATelugu Cinema

తెలుగు చిత్రసీమలో బొట్టులేని బామ్మ పాత్రలకు ప్రసిద్ధి.. రావి రాధాకుమారి..

సాధారణంగా సినీనటులు కానీ, క్రీడాకారులు కానీ, ప్రముఖంగా పేరు ప్రఖ్యాతులు పొందిన వారు ఎక్కడైనా అగుపిస్తే చాలు అభిమానులు ఎగబడిపోతుంటారు. వారి అభిమాన జల్లులు కురిపిస్తుంటారు. ఆ ప్రముఖులు గుడికి వెళితే అక్కడ జనాలు దేవుడిని చూడకుండా ఆ ప్రముఖులనే చూస్తుంటారు. అప్పుడు వారికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వారి అభిమానం వారిది. అభిమానులే లేకుంటే కళాకారులు లేరు కదా. అలా ఒక్కసారి కనకదుర్గమ్మ గుడికి వెళ్ళిన ఒక ప్రముఖ నటీమణికి ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఒక నటీమణి తన భర్తతో కలిసి నడుచుకుంటూ మెట్లు ఎక్కుతున్నారు. అక్కడ నలుగురు కుర్రాళ్ళు మెట్ల మీద కూర్చొని “ఒరేయ్ అల్లు రామలింగయ్య పెళ్ళాం వెళ్ళిపోతుంది రా” అన్నారు. వెంటనే వెనక్కితిరిగి చూసిన సదరు నటీమణి భర్త “ఏంటి బాబు రామలింగయ్య పెళ్ళాం కాదు, రావి కొండలు రావు పెళ్ళాం” అన్నారు. అప్పుడు ఆ నలుగురు “లేదండి చూడగానే ఆపుకోలేక సినిమాలో రామలింగయ్య గారి పెళ్ళాం అనబోయి ఇలా అన్నాము” అన్నారు. ఆ నటీమణి భర్త రావి కొండలు రావు గారు, ఆ నటీమణి పేరు రావి రాధాకుమారి గారు.

రావి రాధాకుమారి అనగానే మనకు ఎక్కువగా బామ్మ పాత్రలే గుర్తుకువస్తాయి. “ఒరేయ్ నాటకాల సచ్చినోడా” అంటూ “చందమామ” చిత్రంలో తిట్ల దండకం అందుకున్న బామ్మ ని తెలుగు ప్రేక్షకులు ఎవ్వరూ మర్చిపోలేరు. గయ్యాళితనం, సాత్వికత్వం రెండు కలబోసిన పాత్రలో నటించి మెప్పించారు. రాధాకుమారి గారు నటిగా, సహాయ నటిగా తెలుగు తెరపై తనదైన ముద్ర వేశారు. తనకు ఊహ తెలిసిన నాటి నుండే నాటకాలు అనుబంధం ఉన్న నటి రాధాకుమారి. తండ్రి కోరిక మేరకు సినిమా పరిశ్రమలో ప్రవేశించిన రాధాకుమారి గారు తొలి సినిమా “తేనెమనసులు” సినిమాలోకి రాకమునుపే ఆమె దాదాపు పదివేలకు పైగా నాటకాలు వేశారు.

నిర్మలమ్మ, జె.వి.సోమయాజులు, రమణ మూర్తి లతో కలిసి ఆమె నాటకాలు ఆడారు. సాంఘిక, గద్య, పద్య నాటకాలు వేసిన రాధాకుమారి గారు ప్రఖ్యాత నటులు, పాత్రికేయులు అయిన రావి కొండలరావు గారి సతీమణి. వీరిరువురు కలిసి దాదాపు వంద సినిమాలలో నటించారు. నటిగా, గృహిణిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన రాధాకుమారి గారు ఐదు తరాల నటీనటులతో కలిసి పనిచేశారు. నాలుగోతరం నుండి అయిదవతరానికి మారే సమయంలో కొంత విరామం ఇచ్చారు. ఆ విరామానికి ముందు వరకు అక్క, వదిన, అమ్మ పాటలకే పరిమితమైన తనకు బామ్మగా ప్రమోషన్ వచ్చిందని చెప్పేవారు. రాధాకుమారి గారు పెద్దగా చదువుకోలేదు. అందువలన తనకు మరో వ్యాపకం తెలియదు. తాను నటించకుండా ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుందని తరాలు, అంతరాలు ఉన్నప్పటికీ నటిస్తూనే ఉండేవారు.

రాధాకుమారి గారి స్వస్థలం విజయనగరం. నాటక రంగంపై ఉన్న మక్కువతో పదేళ్ల వయస్సులోనే అటువైపు అడుగులు వేశారు. ఆ తరువాత వెండితెర ప్రవేశం చేసి 400 పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు. పలు ధారావాహికల లోనూ నటించారు. అనువాద కళాకారిణి గాను తాను 100 సినిమాలకు పనిచేశారు. నటిగా “తేనెమనసులు” ఆమె తొలి చిత్రం. అందులో కథానాయకుడు కృష్ణకు సవతి తల్లిగా నటించారు. దాగుడుమూతలు, అమ్మాయి పెళ్లి, బడిపంతులు, రంగులరాట్నం, అందాల రాముడు, మాష్టారు కాపురం, ప్రేమఖైదీ, బైరవద్వీపం, నువ్వు లేక నేను లేను, ఆర్య, మహాత్మా, బృందావనం, వాంటెడ్ లాంటి చిత్రాలలో తాను నటించి చక్కటి గుర్తింపుని తెచ్చుకున్నారు.  ఒకరికి ఒకరు, చందమామ చిత్రాల తరువాత బామ్మ పాత్ర అంటే రాధాకుమారి గారినే ప్రేక్షకులు గుర్తుకు తెచ్చుకుంటారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :  రాధాకుమారి

ఇతర పేర్లు   :    రావి రాధాకుమారి

జననం    :    1942

స్వస్థలం   :  విజయనగరం

తండ్రి  :  పొడుగు వెంకట రమణమూర్తి

తల్లి  :  సాలూరి సూర్యప్రకాశమ్మ

జీవిత భాగస్వామి :  రావి కొండలరావు

పిల్లలు   :   ఒక కుమారుడు

వృత్తి      :   సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటి

మరణ కారణం   :   గుండెపోటు

మరణం   :   08 మార్చి 2012, హైదరాబాదు, తెలంగాణ


బాల్యం...

రాధా కుమారి గారు 1942లో విజయనగరంలో పద్మశాలి కుటుంబంలో జన్మించారు. రాధాకుమారి గారి తండ్రి గారి పేరు పొడుగు వెంకట రమణమూర్తి, అమ్మ గారి పేరు సాలూరి సూర్యప్రకాశమ్మ. తన అమ్మ నాన్నలకు ఆరుగురు సంతానం. ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక అక్క, ఇద్దరు చెల్లెలు ఉన్నారు. రాధాకుమారి నాన్న గారు వృత్తిరీత్యా పాత్రికేయులు. ఆయనకు మద్రాసులో “కొరడా” అనే పత్రిక ఉండేది. ఆ పత్రికకు బోలెడు డబ్బులు ఖర్చు అయ్యేవి. దాంతో రాధాకుమారి గారి అమ్మగారి నగలు కుదవపెట్టి పత్రిక నడిపేవారు. వాళ్ళ నాన్నగారు పత్రిక పెట్టి డబ్బంతా ఖర్చుచేయడంతో వారు పేదరికంలో కూరుకుపోయారు. ఆ సమయంలో వారు అమ్మమ్మ గారి ఇంట్లోనే ఉండేవాళ్ళు. వారిని వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యలే పెంచి పెద్దచేశారు.

రాధాకుమారి గారు మరియు వాళ్ళ అక్కయ్య మూడు, నాలుగు తరగతి వరకు వీధి బడిలోనే చదువుకున్నారు. చిన్నపిల్లల వయస్సులో వారు స్నేహితురాలతో కలిసి చింతగింజలతో ఆడుకోవడం, గీతలు గీసి తొక్కుడుబిల్ల ఆడుకోవడం లాంటి బాల్య జ్ఞాపకాలు బాగానే ఉన్నాయి. రాధాకుమారి గారు బాల్యంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చీర కట్టుకుంటే “ఎప్పుడు నువ్వే చీరలు కట్టుకుంటావు, మాకు కట్టు” అని తాను మారాం చేసేవారు. దానికి బదులిస్తూ వాళ్ళ అమ్మగారు “నువ్వు కూడా చీరలు కట్టుకునే సమయం వస్తుందిలే” అనేవారు. రాధాకుమారి గారి అమ్మ గారు వారిని ఎప్పుడూ కొట్టేవారు కాదు. చాలా ప్రేమగా చూసుకునేవారు. ఆ రోజుల్లో సాయంత్రం ఆరు దాటిందంటే చాలు ఆడపిల్ల గుమ్మం దాటకూడదు. ఎప్పుడన్నా అలా గుమ్మంలో నిలుచుంటే సూరమ్మ కూతురు గుమ్మంలో నిలుచుంది అని అమ్మలక్కలు అనేవారు.

నిద్రలో నడిచే అలవాటు...

రాధాకుమారి గారికి రాత్రిపూట నిద్రలో నడిచి వెళ్లిపోయే జబ్బు ఉండేది. నిద్రపోతూ, నిద్రపోతూ లేచి నడిచి వెళ్లిపోయేవారు. అలా ఎక్కడికి వెళ్ళేవారో ఆమెకు తెలిసేది కాదు. పగటిపూట స్నేహితురాళ్ళతో చాలాసేపు ఆడుకుని ఉంటారు గనుక తన మిత్రులు గుర్తుకు వచ్చేలా నడుచుకుంటూ వెళ్లిపోయేవారు. తాను అలా వెళ్లిపోయినప్పుడు వాళ్ళ అమ్మగారు లేచి అమ్మాయి లేదని చూసుకొని వెనక్కి తీసుకువచ్చి పడుకోబెట్టేవారు. ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఇంట్లో ఉండగా నిద్రలో నడిచి వెళుతుంటే ఆమె ఎటువెళ్తుందో చూద్దామని ఆమెను అనుసరిస్తూ వెళ్లారు. రాధాకుమారి గారు పగలు ఎక్కువగా వారికి ఎదురు ఇంట్లో అత్త వరుస అయ్యే ఆవిడ ఇంట్లో చాలాసేపు కూర్చునే అలవాటు వలన ఆ రాత్రి నడుచుకుంటూ వెళ్లి వాళ్ళ గుమ్మంలో కూర్చున్నారు. దాంతో వాళ్ళ నాన్న గారు ఆవిడ వీపుపై అయిదు వేళ్ళు అచ్చుపడేలా చరిచారు. దాంతో ఆమెకు మెలకువ వచ్చింది. ఆ రోజు నుంచి ఆ జబ్బు మళ్ళీ ఆమెకు ఎప్పుడూ రాలేదు.

నాటకాలు…

రాధాకుమారి గారు తాను వీధి బడిలో చదువుకున్నప్పుడు ఆ బడిలోనే చిన్న చిన్న నాటకాలు వేసేవారు. అది చూసి బయటవారు మీ అమ్మాయి చాలా బాగా నాటకాలు వేస్తుందని వాళ్ళ నాన్నగారికి చెప్పేవారు. ఏదైనా నాటక సంఘం వారు కొత్త నాటకాలు వేస్తుంటే రాధాకుమారి గారి నాన్నగారి వద్దకు వచ్చి మీ అమ్మాయిని నాటకాలకు పంపించండి అనేవారు. అలా తన పదకొండో సంవత్సరంలోనే ఎన్జీవో (గుమస్తా) అనే నాటకంలో ఇద్దరు పిల్లల తల్లి వేషం వేశారు. అందులో జె.వి.సోమయాజులు గారు, జె.వి.రమణమూర్తి గారు కూడా నటించారు. ఆ నాటకంలో రాధాకుమారి గారికి ప్రథమ బహుమతి లభించింది. పరిషత్తులో జరిగిన నాటకానికి “పంతం కనక లింగేశ్వర రావు”, “స్థానం నరసింహారావు” గార్లు జడ్జిగా వ్యవహరించారు.

అలా సాగిన నాటక ప్రస్థానం తన నాటక ప్రస్థానంలో పదివేల నాటకాల వరకు నడిచింది. రాధాకుమారి గారు నాటకాలు వేయడం, తాను సినిమాలలోకి రావడం వాళ్ళ అమ్మగారికి పెద్దగా ఇష్టం ఉండేది కాదు. కానీ వాళ్ళ నాన్నగారికి చాలా ఇష్టం. మీ అమ్మాయి నాటకాలలో బాగా చేస్తుందని తనతో చెబుతుంటే సంతోషపడేవారు. ఆమెను సినిమా నటిని చేయాలని కూడా వాళ్ళ నాన్నగారు అభిలాషపడేవారు. రాధాకుమారి వాళ్ళ నాన్న గారు విశాఖపట్నంలో పూర్ణ వారి వద్ద మేనేజర్ గా ఉండేవారు. అలా సినిమా వాళ్ళతో కూడా ఆయనకు పరిచయాలు ఉండేవి. తనకు పదహారు సంవత్సరాల వయస్సున్నప్పుడు వాళ్ళ నాన్నగారికి ఉన్న పరిచయంతో తాపీచాణక్య గారికి ఆమెను చూపించారు. అప్పుడు ఆవిడ సన్నగా పీలగా ఉండేవారు. అందువలన మరీ చిన్నపిల్ల కదా, కాస్త ఒళ్ళు వచ్చిన తర్వాత చూద్దాంలే అని చెప్పి తనను పంపించారు.

సినీ ప్రస్థానం…

రాధాకుమారి గారు నాటకాలు వేస్తున్న సమయంలో రావి కొండలరావు గారు వ్రాసిన “నాలుగిళ్ల చావడి” నాటకంలో నటించారు. ఆ నాటకాన్ని ఆచార్య ఆత్రేయ గారు కూడా చూశారు. అదే సమయంలో దర్శకులు అదుర్తి సుబ్బారావు గారు పన్నెండు మంది కొత్త నటీనటులతో “తేనె మనసులు” సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తూ అందులో రాధాకుమారి గారికి ఒక వేషం ఇచ్చారు. ఆ సినిమా ద్వారానే సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా నటుడిగా పరిచయం అయ్యారు. “తేనె మనసులు” సినిమాలో నటిగా ప్రస్థానం మొదలుపెట్టిన తాను నాటకాల ద్వారా సినిమా నటి అయ్యారు. “తేనె మనసులు” సినిమాలో చేస్తున్నప్పుడు ఆ చిత్రానికి దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు. ఆ సినిమాలో నటిస్తున్న నటీనటులు అంతా కొత్తవారే కాబట్టి ఆదుర్తి గారు అంటే భయపడే వారు.

దాంతో ఆదుర్తి గారు కొన్ని సన్నివేశాలను ఆ సినిమా సహాయ దర్శకులు కె.విశ్వనాథ్ గారితో నువ్వు చిత్రీకరించవయ్యా అని చెప్పి వెళ్ళిపోయేవారు. ఒక సన్నివేశం చిత్రీకరణ చేస్తున్న సమయంలో ఆదుర్తి సుబ్బారావు గారు వచ్చి రాధాకుమారి గారిని చూసి ఆ చేతులు ఏమిటలా పెట్టుకున్నావు. ఆ చేతులతో ఏదో ఒకటి చేసేయ్ అన్నారు. మరొక సందర్భంలో కూడా చూసి ఆ చేతులేంటి అమ్మాయి అన్నారు. మరి చేతులు ఎక్కడ పెట్టుకోవాలి సార్ అని రాధాకుమారి గారు అన్నారు. వెంటనే “నా నెత్తిన పెట్టు తీసుకొచ్చి. కొత్త వాళ్ళని పెట్టుకున్నాను చూడు నా కర్మ” అన్నారు. దానికి రాధాకుమారి గారు ముందు బాధపడ్డా కూడా తర్వాత నవ్వుకున్నారు. ఆ తరువాత ఆదుర్తి గారు వచ్చి బాధపడ్డావా అని రాధాకుమారి గారిని అడిగారు. మొదటి సినిమా కదా సార్. కెమెరా ముందు ఎలా నటించాలో తెలియదు. ఇప్పుడు మాత్రం అన్నీ తెలుసుకునే వస్తున్నాను అని రాధాకుమారి గారు అన్నారు.

భార్యభర్తలుగా సినిమాలలో సెంచరీ కొట్టిన జంట…

రావికొండలు రావు, రాధాకుమారిలది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. అయితే వీరి ప్రేమ వివాహంలో సినిమాలలో మాదిరిగా ప్రేమ పాటలు, పోరాటాలు లేవని రావికొండలు రావు గారు చెబుతుండేవారు. నిజానికి రాధాకుమారి గారు విజయనగరంలో నాటకాలలో నటించేవారు. రావికొండలు రావు గారు శ్రీకాకుళం నుంచి నాటకాల ట్రూప్ తో విజయనగరానికి నాటక పోటీలకు వెళ్లినప్పుడు రాధాకుమారి గారితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది.

ఆ తరువాత కాలంలో రాధాకుమారి గారు డబ్బింగ్ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలలో భాగంగా రావికొండలు రావు గారి ఇంట్లోనే అద్దెకు దిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. వీరిరువురు తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్లో నాటకాలలో ఆడవేషాలు ఎక్కువగా మగవారే వేసేవారు. రాధాకుమారి గారిని పెళ్లి చేసుకుంటే ఆ కొరత తీరుతుందని తాను భావించానని రావి కొండలరావు గారు పలు సందర్భాలలో చెప్పేవారు. నిజజీవితంలో భార్యాభర్తలు సినీ జీవితంలో వెండితెరపై అవే పాత్రలలో నటించడం చాలా అరుదు. రావి కొండలరావు, రాధాకుమారి గార్లు 127 సినిమాలలో వెండితెర పై భార్యాభర్తలుగా నటించారు. భార్యభర్తలుగా ఉంటూనే సినిమాలలో సెంచరీ కొట్టిన జంట వారిది.

బొట్టు లేని బామ్మ పాత్రలే ఎక్కువగా…

రాధాకుమారి గారు ఎన్టీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరావు గారు, శోభన్ బాబు గారు, సూపర్ కృష్ణ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గార్ల లాంటి అందరి సినిమాలలో చేసిన రాధాకుమారి గారు, దాని తరువాత ఐదు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు. ఎందువలన అనగా బాలకృష్ణ, చిరంజీవి గార్లకు వరుసకు తల్లిపాత్రలు వేస్తే బాగానే ఉంటుంది. ఆ తరువాత వచ్చిన ఉదయ్ కిరణ్ లాంటి వారికి తల్లి పాత్రలు వేస్తే బాగుండదు కదా. ఆ సమయంలో టీవీ సీరియల్స్, రేడియో నాటకాలు, సొంత నాటకాలు వేసేవారు.

రెండవ ఇన్నింగ్స్ లో బామ్మ పాత్రలు వేయడం ప్రారంభించారు. “నువ్వు లేక నేను లేను” అనే సినిమా ద్వారా బామ్మ పాత్ర వేయనారంభించిన రాధాకుమారి గారు “ఒకరికొకరు”, “హోలీ” అనే సినిమాలు చేశారు. కృష్ణవంశీ గారి “చందమామ” సినిమాలో ఒక హీరోకు బామ్మగా వేశారు. ఆ పాత్ర చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అయితే రాధాకుమారి ఎక్కువశాతం బొట్టు పెట్టుకోకుండా బొట్టు లేని బామ్మ గానే నటించేవారు. బొట్టు ఉంటే మొగుడు ఉండాలి. మొగుడు ఉంటే తన పాత్రకు ప్రాధాన్యత ఉండదు. అందుకని కాబోలు రాధాకుమారి గారు కథ ప్రాధాన్యతను బట్టి బొట్టులేని బామ్మ పాత్రలనే చేశారు.

అగ్రనటులతో…

కథానాయకుడు, పూలరంగడు, బృందావనం, భైరవద్వీపం, అన్నా చెల్లెలు తదితర సినిమాలలో రాధాకుమారి గారు చాలా మంచి పాత్రలు చేశారు. గుణచిత్ర నటిగా ఎన్నో సినిమాలు చేశారు. ఆ రోజులలో పిచ్చి గంతులు, కామెడీ ఉండేది కాదు. సందర్భానుసారం కామెడీ ఎక్కువగా ఉండేది. “అత్త పుట్టింటికి కోడలు” అనే సినిమా చేసిన రాధాకుమారి గారు అందులో కూడా సందర్భానుసారం హాస్యం ఎక్కువగా ఉంది. “రమాప్రభ”, “రామలింగయ్య” గారు, రావి కొండలు రావు గారు, రాధాకుమారి పలువురు నటీనటులు అందరూ కలిసి చేశారు. అందులో మంచి హాస్యం ఉంది. “మల్లమ్మ కథ” సినిమాలో ఒకటి ప్రతికూల ఛాయలున్న పాత్రను చేశారు రాధాకుమారి గారు.

నాగభూషణం గారితో, సత్యనారాయణ గారితో చాలా సినిమాలు చేశారు. శ్రీదేవి, జయసుధ మొదలగు వారికి తల్లిగాను సినిమాలలో చేశారు. రాధాకుమారి గారు నటించిన 350 సినిమాలలో దాదాపు 200 సినిమాలలో అల్లు రామలింగయ్య గారి కలయికలోనే నటించారు. “పూలరంగడు” సినిమాలో రాధాకుమారి గారు అల్లు రామలింగయ్య గారితో కలిసి నటించారు. వారిరువురి జంట విజయవంతం అయ్యింది. దాంతో వారి కలయికలో అనేక సినిమాలలో నటిస్తూ వచ్చారు. కొండలురావు గారితో జంటగా 100 సినిమాల పైనే నటించారు. రమణారెడ్డి గారు, రేలంగి గార్లతో కూడా నటించారు. “దీర్ఘ సుమంగళి” అనే సినిమాలో రేలంగి గారికి మూడో భార్యగా చేశారు. ఆ సినిమా చేస్తున్నప్పుడు రేలంగి గారు ప్రక్కన లడ్డు లాంటి అమ్మాయిని పెట్టారు, నాకు సరిగ్గా లైటింగ్ చేయండి కెమెరాతో అనేవారు రేలంగి గారు.

ఖచ్చితమైన సమయపాలన…

రాధాకుమారి గారు, వారి భర్త రావి కొండలురావు గారు నాటకాలు, సినిమాలలో ఉన్నప్పటికీ ఇద్దరం సర్దుకుపోయేవారు. వాళ్ళ ఒక్కగానొక్క కుమారుడిని రాధాకుమారి గారి అమ్మగారి వద్ద పెట్టి చదివించేవారు. ఆ అబ్బాయి వాళ్ళ అన్నయ్య గారి పిల్లలతో పాటు విజయనగరంలో చదువుకుంటుండేవారు. ఆరవ తరగతి వచ్చేసరికి మద్రాసుకు పిలిపించుకున్నారు. రావి కొండలు రావు గారితో పాటు వాళ్ళ అమ్మగారు కూడా కొన్ని రోజులు ఉండి వెళ్లేవారు. వాళ్ళ అత్తగారికి కూడా మాతో ఉండేది కానీ ఆవిడకి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు వెళ్ళిపోయేవారు. ఏడు గంటలకు షూటింగ్ అయితే రాధాకుమారి గారు అయిదు గంటలకే తయారై సిద్ధంగా ఉండేవారు. తాను చనిపోయేవరకు తనకు అదే అలవాటుగా ఉండేది. కారు డ్రైవర్లు కూడా అదే అంటుండేవారట. “కారు రాగానే వెంటనే ఎవ్వరూ ఎక్కరండి. అరగంట ఆలస్యం చేస్తారు. మీరు కారు రాగానే వెంటనే ఎక్కేస్తారు కదా. ఆలస్యం చేయరు అని కారు డ్రైవర్లు అంటుండేవారు. రాధాకుమారి గారు ఐదింటికి తన భర్త కొండలరావు గారికి వంట చేసి తాను చిత్రీకరణకు వెళ్లేవారు. కొండలురావు గారు మధ్యాహ్నం వచ్చి తినేవారు. రాత్రికి చపాతి తెప్పించుకుని వారు తింటుండే వారు.

ఎవర్ గ్రీన్ “ఆంటీ”…

రాధాకుమారి గారు ఐదో తరం వరకు పనిచేస్తూ వచ్చారు. తరాల గురించి చెప్పాల్సి వస్తే ఎన్.టి.రామారావు గారిది, ఏఎన్ఆర్ గారిది ఒక తరం. వారి క్రమశిక్షణ, సమయపాలన వేరుగా ఉండేది. వారి వద్ద ఎవరితో ఎలా మాట్లాడాలో రాధాకుమారి గారు నేర్చుకున్నారు. ఆ తరువాత కృష్ణ గారు, శోభన్ బాబు గారి తరం. వీరి తరం పరవాలేదు. ఆ తరువాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారి తరం. వారు వచ్చినా కూడా ఒకరికి ఒకరు ఆప్యాయంగా ఉండేవారు. ఆ తరువాత తర్వాత వచ్చిన ఐదవతరం వారు హాయ్ అంటే హాయ్ అనుకుంటూ వెళ్లిపోతుండేవారు. అది కాస్త బాధ కలిగిస్తూ ఉంటుంది అనేవారు రాధాకుమారి గారు. హీరో తరుణ్ రాధాకుమారి గారిని ఆంటీ అని అంటుండేవాడు. “ఏంటి మీ అమ్మ కూడా నన్ను ఆంటీ అంటుంది నువ్వు కూడా ఆంటీ అంటావు” అని తరుణ్ ని అడిగితే “నువ్వు ఎవరు గ్రీన్ ఆంటీవి” అంటుంటారు.

పుట్టపర్తి సాయిబాబా భక్తులు…

రాధాకుమారి గారు పుట్టపర్తి సాయిబాబా భక్తులు. అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వచ్చేవారు. ఆయన సేవా కార్యక్రమాల్లో తాను చురుగ్గా పాల్గొంటుండేవారు. తాను ప్రొద్దుపోకపోవడం వలన సినిమాలలో నటిస్తుండేవారు. చెన్నైలో మనవళ్లతో హాయిగా కాలం గడపే తాను హైదరాబాదు వచ్చి సీరియల్స్ లో నటించేవారు. రాధాకుమారి గారు చెన్నైలో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడేవారు. ఎందుకంటే కొడుకు, కోడలు తనను చాలా బాగా చూసుకుంటారు. మనవళ్ళతో హాయిగా ఆడుకుంటూ ఉండేవారు. కానీ రావి కొండలు రావు గారు హైదరాబాదు లోనే ఉండడానికి ఇష్టపడడం వలన వాళ్ళు మోతీనగర్ లోని ఒక అపార్ట్ మెంట్ లో ఉండేవారు. కొండలు రావు గారు రచయిత గనుక ఏదో ఒకటి వ్రాసుకుంటూ కూర్చునేవారు. పుస్తకాలు ముందు వేసుకొని తన పని తాను చేసుకునేవారు.

మరణం…

ప్రముఖ నటి రావి రాధాకుమారి గారు తన 75 సంవత్సరాల వయస్సులో 08 మార్చి 2012 నాడు గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో గుండెపోటు కారణంగా మరణించారు. తాను ప్రముఖ నటులు రావి కొండలరావు గారి సతీమణి. 2001వ సంవత్సరంలో మద్రాసు నుంచి హైదరాబాదు నగరానికి వచ్చిన రావికొండలు రావు దంపతులు మోతీనగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. అపార్ట్మెంట్ వాసులు జరుపుకునే ఎలాంటి కార్యక్రమములోనైనా ఇద్దరు పాల్గొనేవారు. తన సినీ జీవితంలో జరిగిన అనుభవాలను మహిళలకు చెబుతూ ఉండేవారు. తాను కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

హైదరాబాదులోని మోతినగర్ లో నివాసం ఉంటున్న ఆమెకు తెల్లవారుజామున 3:00 సమయంలో తీవ్ర ఆయాసం రావడంతో హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రాధాకుమారి గారు మరణించే సమయానికి రావి కొండలరావు గారు అమెరికా ప్రయాణంలో ఉన్నారు. ప్రవాసాంధ్రులు నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం తాను అక్కడికి వెళుతున్నారు. తాను దుబాయ్ విమానాశ్రయంలో ఉండగానే విషయం తెలియడంతో తిరుగు ప్రయాణం అయ్యారు. రావి రాధాకుమారి గారు తన భర్త రావి కొండలరావుతో కలిసి అనేక చిత్రాల్లో కలిసి నటించారు. చిత్ర పరిశ్రమలో ఏ వేడుక జరిగినా పార్వతీ పరమేశ్వరుల్లా ఇద్దరూ కలిసి వచ్చి అభినందనలు, ఆశీస్సులు అందజేయడం చూడముచ్చటగా ఉండేది.

Show More
Back to top button