పెద్దల మాట చద్దన్నం మూట అనే నానుడి అప్పుడప్పుడూ వింటూ ఉంటాం. పెద్దల మాటను చద్దన్నంతో ఊరికే పోల్చలేదు. దానిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే.. ఈ రెండింటికి పోలిక పెట్టారు. ముఖ్యంగా వేసవిలో చద్దన్న తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఎండాకాలంలో ప్రతిరోజూ ఉదయాన్నే చద్దన్నం తింటే వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
చద్దన్నంతో ప్రయోజనాలు
రాత్రి వండిన అన్నం మరుసటి రోజు ఉదయం చద్దన్నంగా మారుతుంది. దాన్ని మజ్జిగలో వేసి తింటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. చద్దన్నంలో పెరుగు వేసి.. మిరపకాయ, ఉల్లిపాయతో నంజుకుని తింటే ఆ టేస్టే వేరు. చద్దన్నం తింటే తక్షణ శక్తి వస్తుంది. ఇది డీహైడ్రేషన్, అలసట, బలహీనతను దూరం చేసే శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది.
చద్దన్నంలో పొటాషియం, సోడియం, క్లోరైడ్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి.
చద్దన్నం తింటే ఎముకల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. అలాగే పలు రకాల ఇన్‌ఫెక్షన్లు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను నివారిస్తుందని వైద్యులు చెబుతున్నారు.