మనం తీసుకునే ఆహారం నమలడానికి సులువుగా ఉండేలా.. బియ్యాన్ని ఎక్కువ పాలిష్ చేయిస్తుంటారు. దీని వల్ల చూడటానికి అన్నం తెల్లగా మెరుస్తూ, సన్నగా ఉంటుంది. కానీ, బియ్యంలో ఉండే పోషకాలన్నీ ఈ పాలిష్ ప్రక్రియలో తొలగి పోతున్నాయి. సాధారణంగా పాలిష్ చేయని బియ్యం చూడటానికి గోధుమ రంగులో ఉంటాయి. పాలిష్ చేయని బియ్యంతో పోలిస్తే, పాలిష్ చేసిన బియ్యంలో ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది. అతిగా పాలిష్ చేసిన బియ్యాన్ని తిన్నా పెద్దగా లాభం ఉండదు.
అదే పాలిష్ చేయని బియ్యాన్ని తింటే ఐరన్, మెగ్నీషియం, జింక్, కాల్షియం శరీరానికి అందుతాయి. పాలిష్ చేసిన బియ్యంలో తేమ, బయోటిన్, ఖనిజాలు, నియాసిన్, ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటుంది. ఆహార నిపుణుల ప్రకారం ఫైబర్, ప్రోటీన్ లేని బియ్యంతో వండిన ఆహారం అసంపూర్ణమైనది.
డయాబెటిస్ వచ్చే రిస్క్
పాలిషింగ్ చేసేటప్పుడు కీలకమైన విటమిన్లు, ఖనిజాలు పోతాయి. బియ్యం పై పొరల్లో మధుమేహం రాకుండా కాపాడే పోషకాలు ఉంటాయి. పాలిష్ చేసినప్పుడు అవి తొలగిపోతాయి. దీంతో వాటిని తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని కొన్ని సర్వేల్లో తేలింది.
అతిగా పాలిష్ చేసిన బియ్యం తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి, డయాబెటిస్ ఉన్న వారిని బ్రౌన్ రైస్ తినమని వైద్యులు సూచిస్తారు. బ్రౌన్ రైస్ అంటే పాలిష్ చేయని బియ్యం. వీటినే ముడి బియ్యం అని కూడా అంటారు. మన పూర్వీకులు దంపుడు బియ్యాన్ని మాత్రమే తినేవారు. ఆ రోజుల్లో పాలిష్ విధానం లేదు. దీంతో బియ్యంలో అన్ని పోషకాలు అంది ఆరోగ్యంగా ఉండేవారు.