CINEMATelugu Cinema

తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి ప్రేమ కథా చిత్రం… బాలరాజు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ప్రేమ కథా చిత్రం “బాలరాజు”. ఈ చిత్రం 26 ఫిబ్రవరి 1948 నాడు విడుదలైంది. ఈ సినిమా విడుదలయ్యే వరకు కూడా సినిమాలలో నటించే కథానాయకులు అంటే ముందుగా గుర్తొచ్చేది నారాయణరావు, చిత్తూరు నాగయ్య, ఈలపాటి రఘురామయ్య గార్లు మాత్రమే. వీరు సినిమా హీరోలుగా ముందు వరుసలో ఉంటూ ఉండేవారు. వీరంతా కూడా దాదాపు 35 సంవత్సరాలు పైబడిన వారే. పాతిక సంవత్సరాలైనా నిండాని కుర్రవాడు కథనాయకుడుగా రావడం అనేది అక్కినేని నాగేశ్వరావు గారితోనే ప్రారంభమైంది. అక్కినేని నాగేశ్వరావు గారిని పూర్తిస్థాయి కథనాయకుడిగా చూపించిన చిత్రం “బాలరాజు” (1948).

ఈ సినిమాతోనే అక్కినేని నాగేశ్వరావు గారికి హీరోగా ప్రేక్షకాదరణ మొదలైంది. మామూలు ప్రేక్షకుడికి మస్తిష్కంలో కూడా అక్కినేని గారు హీరో అనే ముద్ర పడిపోయింది. తెలుగు సినిమా టాకీలు మొదలైనప్పటినుండి బాలరాజు (1948) సినిమా విడుదలైన నాటికి తెలుగు చిత్రాలను తీసుకుంటే ప్రేమ ప్రధాన కథాంశంగా వచ్చిన మొట్టమొదటి సినిమా “బాలరాజు”. అంతకుముందు వచ్చిన సాంఘిక చిత్రాలు గానీ, జానపద చిత్రాలు గానీ, ఏ సినిమాను తీసుకున్నా కూడా ప్రేమ అనేది అంతర్గతంగా చిన్న సన్నివేశంగా ఉంటుంది తప్ప పూర్తిగా సినిమా అంతా కూడా ప్రేమ మీద నడిచేటటువంటి చిత్రాలు బాలరాజు వచ్చేవరకు ఇంకేమీ రాలేదు.

అందుకని ఆ తరువాత రోజులలో ఎన్ని వందల, వేల చిత్రాలు వచ్చినా అన్నిటికీ ఆది, పునాది “బాలరాజు” చిత్రం అని చెప్పవచ్చు. ఈ సినిమా కథ ఎన్నుకోవడం వెనకాల, ఈ సినిమాకు కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు, కథానాయిక వరలక్ష్మి, అప్పటివరకు వేశ్య పాత్రలకు పరిమితం అయిన నటి అంజలి దేవి గారిని ఇతర నటీనటులను ఎన్నుకోవడం వెనకాల ఈ సినిమా చిత్రీకరణలో ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ రోజుల్లో పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందాయి. పేరుకే “బాలరాజు” సినిమా. కానీ ఈ సినిమాలో రాజులు ఉండరు, రాజ్యాలు ఉండవు. మనసు కలవాలే గానీ మహేంద్రుడు వచ్చినా మటు మార్చి మాయం చేయలేడు. బాలరాజు చిత్రం కథలో సూత్రం ఇది. ఈ సినిమా ఇంద్రలోకం లో మొదలవుతుంది.

అక్కినేని నాగేశ్వరావు గారి పాత్ర పరంగా చూసుకుంటే బాలరాజు సినిమాలో తాను ధీరోదాత్తుడు కాడు, ఉదాత్తుడు కాడు, బలశాలి కాడు, సాహసవంతుడు కాడు. నిజానికి తాను చాలా అమాయకుడు. కథానాయకి (వరలక్ష్మి) తనను చాలా సార్లు బ్రతికిస్తుంది, అనేకమార్లు కాపాడుతుంది. ఆ అమ్మాయి ప్రేమంటే ఏమిటో నేర్పుతుంది. ఆ రోజుల్లో బాలరాజు సినిమాలో కొత్తదనం ఉండటం వలన అక్కినేని నాగేశ్వరావు గారిని నిజమైన హీరోగా సామాన్య ప్రేక్షకులు అంగీకరించారు. అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్గు, పొడవైన జుట్టు, బాలరాజు మీస కట్టు ప్రేక్షకులకు చాలా బాగా అనిపించాయి. కుర్రవాళ్ళంతా అక్కినేని నాగేశ్వరావు గారి ఆహార్యాన్ని అనుకరించడం ప్రారంభించారు. ఈ సినిమా తర్వాత అక్కినేని నాగేశ్వరావు గారి “కీలుగుఱ్ఱం” సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాల తరువాత అక్కినేని నాగేశ్వరావు గారు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. “బాలరాజు” (1948) సినిమా అక్కినేని నాగేశ్వరరావు సినీప్రస్థానంలో ఏడవ సినిమా.

చిత్ర విశేషాలు….

దర్శకత్వం   :    ఘంటసాల బాలరామాయ్య 

సహాయ దర్శకుడు :  యం.కొండయ్య

నిర్మాణం   :     ఘంటసాల బలరామయ్య

తారాగణం  :   అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి, కస్తూరి శివరావు, అంజలీదేవి

సంగీతం    :    గాలిపెంచల నరసింహారావు, (సహాయకులు: ఘంటసాల, సి.ఆర్‌.సుబ్బరామన్‌)

నేపథ్య గాయకులు :  అక్కినేని నాగేశ్వరావు, యస్. వరలక్ష్మి, ఘంటసాల, కస్తూరి శివరావు, వి.సరళ, ఉడుతా సరోజినీ, పిఠాపురం నాగేశ్వరరావు

కథ, మాటలు, పాటలు  : సముద్రాల రాఘవాచార్య,

(సహాయకులు: మల్లాది రామకృష్ణశాస్త్రి)

ఛాయాగ్రహణం  :   పి. శ్రీధర్

కళా దర్శకుడు  :   ఎస్.వి.ఎస్. రామారావు

కూర్పు      :   LM లాల్

నిర్మాణ సంస్థ    :    ప్రతిభా పిక్చర్స్

పంపిణీ  :   పూర్ణ సినిమాలు

నిడివి      :     163 నిమిషాలు

విడుదల తేదీ   :     26 ఫిబ్రవరి 1948

భాష     :     తెలుగు

చిత్ర కథ సంక్షిప్తంగా…

ఈ చిత్ర కథ స్వర్గంలో ప్రారంభమవుతుంది. ఒక దేవకన్య మోహిని మరియు ఒక యక్ష ప్రేమలో ఉన్నారు. సువర్లోకానికి అధిపతి అయిన ఇంద్రుడికి మోహిని పట్ల మోజు ఉంటుంది. ఇంద్రుడి దూత అయిన కుబేరుడు ఆ ప్రేమికులను విడదీయలేక యక్షుడిని మనిషిగా పుట్టమని శపిస్తాడు. ఇంద్రుడి అభిలాషను మోహిని అంగీకరించదు. దాంతో ఆగ్రహించిన ఇంద్రుడు మోహినిని మనిషిగా పుట్టమని శపించి తన ప్రేమికుడి కోసం దేవుడయ్యాడు. యక్షుడు (భూలోక బాలరాజు) ఒక గొర్రెల కాపరి ద్వారా పెరిగాడు. మోహిని ఒక పొలంలో కమ్మ నాయుడుకు తారసపడుతుంది. దాంతో అతను ఆమెను చేరదీసి పెంచి పెద్దచేసి ఆమెకు సీత అని పేరు పెడతాడు. ఆమె పెరిగేకొద్దీ, ఆమెకు వివాహం చేయాలని తనను చుట్టుప్రక్కల వారు ఒత్తిడి తెస్తుంటారు. ఆమె తన ఇంట్లో అడుగుపెట్టిన తరువాత సంపాదించిన తన సంపద తనతోనే వెళ్ళిపోతుందని, తనను వదిలేస్తే తన సంపాదన మాయమవుతుందని భయపడి, ఆమె పెళ్లికి నిరాకరించి అడవిలోనే ఒక ఏకాంత గోపురంలో ఉంచుతాడు.

బాలరాజు మరియు అతని సహచరుడు యలమంద ఆ మార్గం గుండా వెళతారు. బాలరాజు తన వేణువుపై వాయించే సంగీతానికి ఆకర్షితుడై సీత అతనిని కలవడానికి తప్పించుకుంటుంది. ఆమెకు తాను గుర్తుంటాడు, కానీ శాపం కారణంగా బాలరాజుకు జ్ఞాపకశక్తి నశిస్తుంది. కానీ సీత తమ ప్రేమను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. కోపోద్రిక్తుడైన ఒక మహర్షి కథనాయకుడిని పాములా మార్చినప్పుడు చిత్ర కథ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది. బాలరాజు తన జ్ఞాపకశక్తిని తిరిగి పొందుతాడు. తన సీతతో ప్రేమలో ఉన్నాడని తెలుసుకుంటాడు. ఇంద్రుడు మరోసారి ఈ ప్రేమికులను విడదీసే ప్రయత్నం చేస్తాడు. ఇక వేదన భరించలేక, దేవతలు ప్రత్యక్షమయినవుడు సీత ఇంద్రుడిని శపించడానికి సిద్ధంగా ఉంటుంది. దాంతో ఇంద్రుడు సీతను క్షమించమని కోరతాడు. ఇంద్రుడు ఆ దంపతులను సువర్లోకానికి ఆహ్వానిస్తాడు. కానీ బాలరాజు మరియు మోహినిలు భూమిపైనే సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు.

నటీనటుల ఎంపిక…

ఘంటసాల బలరామయ్య గారు “సీతారామ జననం” అయిపోయాక పౌరాణీకాలను ప్రక్కన పెట్టి, జానపదాలు తీద్దామనుకున్నారు. ఘంటసాల బలరామయ్య గారు 1946లో “ముగ్గురు మరాఠీలు” అనే ఒక సినిమాను విడుదల చేశారు. ఆ సినిమాలో గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ, సి.హెచ్.నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు గార్లు ఉన్నారు. ఘంటసాల బలరామయ్య గారు తీసిన మొట్టమొదటి జానపద చిత్రం “ముగ్గురు మరాఠీలు”. ఈ సినిమా 100 రోజులు ఆడింది. మళ్లీ జానపద చిత్రం తీయాలని రచయిత సముద్రాల రాఘవాచార్య గారిని కథ వ్రాయమన్నారు. తాను వ్రాసిన కథనే “బాలరాజు” కథ. ఈ సినిమాకు మాటలు, కథ, పాటలు సముద్రాల రాఘవాచార్య గారు వ్రాశారు. ఆ సినిమాలో నటీనటులను ఎంపిక చేయాలనుకున్నప్పుడు ప్రేమ కథ కాబట్టి అప్పటికే అక్కినేని నాగేశ్వరావు గారు  బలరామయ్యగారు తీసిన రెండు సినిమాలలో నటించారు.

దాంతో సహజంగానే “బాలరాజు” సినిమాలో కూడా అక్కినేని గారిని తీసుకున్నారు ఘంటసాల బలరామయ్య గారు. తన వెంటపడుతూ పాటలు పాడే అమ్మాయి కావాలి కనుక యస్.వరలక్ష్మి ని తీసుకున్నారు. అంతకు ముందే ఎస్.వరలక్ష్మి గారు అక్కినేని నాగేశ్వరరావు గారు రెండు సినిమాలలో నటించారు. అక్కినేని గారు నటించిన రెండో సినిమా “మాయలోకం” లో యస్.వరలక్ష్మి గారే హీరోయిన్. పల్నాటి యుద్ధం సినిమాలో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రక్కన యస్.వరలక్ష్మి గారే హీరోయిన్. దాంతో సహజంగానే ఈ సినిమాలో కూడా యస్.వరలక్ష్మి గారిని హీరోయిన్ గా తీసుకున్నారు. అప్పటికింకా అంజలీదేవి గారు హీరోయిన్ అవ్వలేదు. గొల్లభామ సినిమాలో వేశ్య పాత్రతో మొదలుపెట్టి చిన్న చిన్నగా వేశ్య పాత్రలే వేస్తూ వస్తున్నారు. అందుకని ఈ సినిమాలో ఇంద్రలోకంలో కథ నడిచేంతవరకు అంజలీదేవి గారినే మోహినీ పాత్రకు తీసుకున్నారు. మొదట్లో 20 నిమిషాలు మాత్రమే ఆమె కనబడతారు.

ఇంకా అక్కినేని నాగేశ్వరరావు గారు సహచరుడిగా వేసిన వారు కస్తూరి శివరావు గారు. తాను అప్పటికే “ముగ్గురు మరాఠీలు” లో మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే సహజంగానే తనను ఇందులో కొనసాగించారు. టాకీలు రాకముందు, మూకీ సినిమాలు ఉన్నప్పుడు మూకీ సినిమాల వెనక వ్యాఖ్యానం చెబుతూవుండేవారు కస్తూరి శివరావు గారు. “ఈ సినిమాకు వ్యాఖ్యానం కస్తూరి శివ రావు గారు” అని పేపరు ప్రకటనలో వ్రాసేవారు, అంతటి ప్రసిద్ధులు తాను. తన వ్యాఖ్యానం వినడానికి ఎక్కువ మంది సినిమాకు వస్తుండేవారు. కస్తూరి శివరావు గారు ఈ సినిమాకి ముందు చిన్నచితకా వేశాలు వేస్తూ వచ్చారు. ఇది తనకు ఏడో సినిమా. అక్కినేని గారికి ఈ సినిమా ఎంత పేరు తెచ్చిందో, కస్తూరి శివ గారికి కూడా అంతే పేరు తెచ్చింది. ఈ సినిమా తర్వాత చాలా వైభవొపేతమైన సినిమాలలో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు, యస్. వరలక్ష్మి, అంజలి దేవి, కస్తూరి శివ రావు గార్లు తర్వాత సినిమాలలో కొనసాగుతూ వచ్చారు. సీతారాం, సుబ్బారావు, కృష్ణయ్య, నారాయణరావు, ఆదిశేషయ్య మొదలగు నటీనటులు అప్పట్లో నాటకాలు వేసి సినిమాలకు వచ్చిన వాళ్ళు. కానీ ఈనాటి ప్రేక్షకులకు అంతగా పరిచయం ఉన్నవాళ్లు కాదు. ఈ విధంగా నటీనటులంతా సిద్ధమయ్యారు.

చిత్ర దర్శక, నిర్మాత ఘంటసాల బలరామయ్య గారి నేపథ్యం…

ఈ సినిమాకు దర్శకులు మరియు నిర్మాత కూడా ఘంటసాల బలరామయ్య గారే. అక్కినేని నాగేశ్వరరావు గారిని  మొట్టమొదటిసారిగా చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన వ్యక్తి ఘంటసాల బలరామయ్య గారు. అక్కినేని నాగేశ్వరావు గారితో నిర్మించిన మూడో సినిమా “బాలరాజు”. ఘంటసాల బలరామయ్య గారు నెల్లూరు జిల్లా పొట్టిపాడు గ్రామా వాస్తవ్యులు. ఆయన అక్కినేని నాగేశ్వరావు గారి కంటే 18 సంవత్సరాలు పెద్దవారు. వాళ్ళ అన్నయ్య ఘంటశాల రాధాకృష్ణయ్య గారు నాటకాలలో వేషాలు వేస్తూ ఉండేవారు. అన్నయ్యతో పాటు ఘంటసాల బలరామయ్య గారికి కూడా నాటకాలు అలవాటయ్యాయి. అప్పటికి బలరామయ్య గారు ఎక్కువగా చదువుకోలేదు. తనను జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు పంపించారు. కో – ఆపరేటివ్ ట్రైనింగ్ లో శిక్షణ కూడా ఇప్పిస్తే దానిని పూర్తి చేయకుండానే తన అన్నయ్యతో కలిసి నాటకాలకు వెళ్లేవారు.

ఘంటసాల రాధాకృష్ణయ్య, ఘంటసాల బలరామయ్య గార్లు ఇద్దరు కలిసి రామదాసు అనే సినిమాలో నటిద్దామని అప్పట్లో కలకత్తా వెళ్లారు. ఆ సినిమాలో రాధాకృష్ణయ్య గారికి సినిమాలో వేషం దొరికింది. కానీ ఘంటసాల బలరామయ్య గారికి పాత్ర దొరకలేదు. దాంతో నిరాశ చెందకుండా సినిమా ఏ విధంగా తీస్తారనే దానిమీద పూర్తి అవగాహన వచ్చేలా పని నేర్చుకున్నారు. ఘంటసాల రాధాకృష్ణయ్య గారు “శ్రీరామ” అనే చిత్ర నిర్మాణ  సంస్థను మొదలుపెట్టి సినిమాలు నిర్మిస్తే, దాంట్లో సినిమా నిర్మాణం ఏ విధంగా ఉంటుందో బలరామయ్య  గారు తెలుసుకున్నారు. అలా తన మిత్రులతో కలిసి సొంతంగా “కుబేర ఫిల్మ్స్” అనే చిత్ర నిర్మాణ సంస్థను మొదలుపెట్టి “సతీ తులసి”, “భక్త మార్కండేయ” (1938), మైరావణ (1940) అనే  రెండు సినిమాలను తీశారు.

ఆ తరువాత భాగస్వాములుగా విడిపోయి ఘంటసాల బలరామయ్య గారు 1941లో సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించి “ప్రతిభ ఫిలిమ్స్” అని పెట్టారు. అందువలన తనను ప్రతిభ బలరామయ్య అంటుండేవారు. ప్రతిభ సంస్థ మొదలుపెట్టాక మొదట సినిమాగా పార్వతీ కళ్యాణం (1941) అనే పౌరాణిక చిత్రం తీశారు. ఆ తరువాత గరుడ గర్వభంగం (1943) అనే పౌరాణిక సినిమా తీశారు. ఆయన తీసిన మూడవ పౌరాణిక చిత్రం శ్రీ సీతా రామ జననం (1942). దానిలో శ్రీరాముని పాత్రకు ముందుగా ఒక కుర్రాడిని ఎంచుకున్నారు. తనకు స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. దాదాపు ఆ కుర్రాడినే ఖాయం చేసినంత పనిచేశారు. అనుకోకుండా ఒకరోజు  బలరామయ్య గారు రైలులో ప్రయాణం చేస్తుండగా తనకు అక్కినేని నాగేశ్వరరావు గారు తారసపడడం, దాంతో అక్కినేని నాగేశ్వరరావు గారిని తీసుకురావడం, ఆయననే శ్రీ సీతారామ జననం సినిమాకు ఎంపిక చేయడం జరిగింది.

ఘంటసాల బలరామయ్య గారు శ్రీరాముడు పాత్ర కోసం మొట్టమొదటి ఎంపిక చేసినబడిన కుర్రాడు ఏమైపోయాడో తెలియదు గానీ అక్కినేని నాగేశ్వరావు గారికి “శ్రీ సీతారామ జననం” సినిమాలో అవకాశం దక్కింది. కాంభోజరాజు కథ ఆధారంగా నిర్మించిన 1945 నాటి తెలుగు జానపద చలన చిత్రం “మాయాలోకం” సినిమాలో కూడా గూడవల్లి రామ బ్రహ్మంగారు  అక్కినేని నాగేశ్వరావు గారికి అవకాశం ఇచ్చారు. ఘంటసాల బలరామయ్య గారు, గూడవల్లి రామబ్రహ్మం గారు కలిసి అక్కినేని నాగేశ్వరావు గారి సినీ జీవితాన్ని ఏడు, ఎనిమిది సంవత్సరాలుగా తనకు మంచి పాత్రలు ఇస్తూ, తనకు గట్టి పునాది వేయడానికి ఇద్దరు కూడా తోడ్పడ్డారు. ప్రముఖ సంగీత దర్శకులు ఎస్.ఎస్.థమన్ ఘంటసాల బలరామయ్య గారి మనుమడు.

సంగీతం…

ఈ సినిమాలో చెప్పుకోదగినది సంగీతం. అద్భుతమైన పాటలు ఉన్నాయి. ఈ సినిమా మొత్తం 20 పాటలు ఉంటే అందులో కొన్ని ఒక నిమిషం పాటు, కొన్ని కొన్ని రెండున్నర నిమిషాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం అందించింది గాలి పెంచల నరసింహారావు గారు. ఆయన సహాయకుడిగా జి.వెంకటేశ్వరరావు గారు పనిచేశారు. జి.వెంకటేశ్వరరావు గారు అక్కినేని నాగేశ్వరావు గారి రూమ్ మేట్. అక్కినేని గారి ఊరు గుడివాడ దగ్గర పల్లెటూరు. జి.వెంకటేశ్వర రావు గారి ఊరు కూడా గుడివాడ దగ్గర పల్లెటూరు. వీరిద్దరికీ సినిమాలోకి రాకముందు నుంచే పరిచయం. అక్కినేని గారు సినిమాల్లోకి రాకముందు నాటకాలు వేస్తూ ఉండేవారు. జి. వెంకటేశ్వర రావు కూడా సినిమాలలోకి రాకముందు నాటకాలలో హార్మోనియం లాంటి వాయిస్తూ ఉండేవారు.

అక్కినేని నాగేశ్వరావు గారి “సీతారామ జననం” లో జి.వెంకటేశ్వరరావు గారు ఒక పాత్ర కూడా వేశారు. ఆయనే ఘంటసాల వెంకటేశ్వరరావు. ఈయన గాలి పెంచల నరసింహారావు గారి దగ్గర సహాయకుడిగా పని చేశారు. అందువలన ఈ సినిమా పేర్లలో సంగీతం గాలి పెంచల నరసింహారావు, ఘంటసాల వెంకటేశ్వరరావు అని ఉంటుంది. కొన్ని పాటలను ఘంటసాల గారే ట్యూన్ చేశారని చెబుతారు. కానీ ప్రధాన సంగీత దర్శకులు గాలి పెంచల నరసింహా రావు గారు కాబట్టి ఆయన పేరు మీదే సంగీతం దర్శకత్వం అని ఉంటుంది. ఈ సినిమాకు సంగీతం సహాయం చేసినటువంటి వ్యక్తి స.ఆర్.సుబ్బరామన్ గారు. సి.ఆర్.సుబ్బరామన్ గారు అనగానే దేవదాసు సినిమా గుర్తొస్తుంది. తాను ఈ సినిమాకు గాలి పెంచల నరసింహారావు గారికి సహాయకుడిగా ఉన్నారు. ముగ్గురు ఉద్దండులు కలిసి ఈ సినిమాను 20 పాటలకు సంగీతం సమకూర్చారు.

ఎవ్వరి పాటలకు వారే నేపథ్య గానం…

అప్పటికే నేపథ్య గానం వచ్చింది. కానీ ఎవరి పాటలు వాళ్లే పాడుకుంటున్నారు. ఘంటసాల గారు “స్వర్గసీమ” సినిమాలో సి.హెచ్.నారాయణ రావు గారికి ఒక చిన్న పాటలో చరణం నేపథ్య గీతంగా పాడారు. అక్కినేని గారు, వరలక్ష్మి గారు ఎవరి పాటలు వారే  పాడుకోవాలి. కస్తూరి శివరావు గారు కూడా తన పాటలు తానే పాడుకునేవారు. అక్కినేని గారు అంతకుముందు నాటకాలలో ఆడవేషం వేయడం వలన ఒకటి రెండు పాటలు ఆడ గొంతులాగా వస్తుంది. దాంతో ఆ పాటలలో “చెలియా కానరావా ఇక” పాటకు ఘంటసాల గారు నేపథ్య గానం చేశారు. ఆ తర్వాత అక్కినేని గారు పోషించిన పాత్రలలో సగానికి పైగా ఘంటసాల గారే నేపథ్య గానం చేశారు. ఆ విధంగా పాటలు సిద్ధమైనాయి.

20 పాటలు వద్దు కొన్ని తీసేయమని ఘంటసాల బలరామయ్య గారిని అడుగగా వరలక్ష్మి గారు చాలా బాగా పాడారు ఆ పాటలు తీసేయడం ఇష్టం లేదు అని బలరామయ్య గారు ఆ పాటలు తీసేయడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత సినిమా విజయోత్సవంలో బలరామయ్య గారు మాట్లాడుతూ ఈ సినిమా కేవలం వరలక్ష్మి గారి వలన విజయవంతమైనదని, “బాలరాజు సినిమా అంటే ఎస్.వరలక్ష్మి అని,  ఎస్.వరలక్ష్మి అంటే బాలరాజు సినిమా అని చెప్పుకోవచ్చు” అన్నారు. ఆ విజయోత్సవంలో ఎస్.వరలక్ష్మి గారికి డైమండ్ రింగ్ బహుకరించారు ఘంటసాల బలరామయ్య గారు. అడవిలో సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా చిత్రీకరణ అడవిలో మొదలుపెట్టారు. అడవికి వెళ్లి కొన్ని సన్నివేశాలు తీశారు. కానీ కెమెరాలో సరిగ్గా రాకపోవడంతో మళ్లీ స్టూడియోలోనే సెట్టింగ్ వేసి తీశారు. అయినా కూడా సన్నివేశాలు చాలా సహజంగా వచ్చాయి.

విడుదల…

బాలరాజు సినిమా చిత్రీకరణ పూర్తయ్యి 26 ఫిబ్రవరి 1948 నాడు పది ప్రింట్లతో విడుదలైంది. విజయవాడలోని జై హింద్ సినిమా థియేటరు “బాలరాజు” సినిమాతోనే మొదలైంది. ఈ సినిమా ఎంత విజయవంతమైనది అంటే విడుదలైన మొదటి రోజు నుండి కూడా విపరీతమైన ప్రేక్షకాదరణ తెచ్చుకుంది. అంతవరకు కుటుంబ సంబంధాలు, జానపదాల్లో కత్తి యుద్ధాలు, పల్నాటి యుద్ధంలో యుద్ధ సన్నివేశాలు చూడడమే కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకోవడం, అందులోనూ యుక్త వయస్సులో ఉన్న వారు ప్రేమించుకోవడం ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. ఆ రోజులలో పల్లెటూరి నుండి ఎడ్ల బండ్లు కట్టుకొని దానిపై “బాలరాజు సినిమా” బోర్డు పెట్టుకొని మరీ వెళ్లేవారు. ఈ సినిమా 100 రోజుల ప్రదర్శింపబడడంతో పాటు, 25 వారాలు ప్రదర్శింపబడి రజతోత్సవం జరుపుకుంది. ఒక తెలుగు సినిమా వంద రోజుల ఉత్సవం చేయడం ఈ సినిమాతోనే మొదలైంది. అంటే శతదినోత్సవం చేయడం ఈ సినిమాతోనే ప్రారంభమైందన్న మాట.

ఖాళీ దొరకని థియేటర్లు…

ఈ సినిమాకు థియేటర్లలో ప్రేక్షకులు నిండిపోయి కొత్త సినిమాలకు ఖాళీ దొరకక, కొత్త థియేటర్లు కట్టడం మొదలైంది. ఈ సినిమా విడుదలైన రెండు నెలలకు “చంద్రలేఖ” అనే తమిళ సినిమా విడుదలైంది. అది కూడా రజతోత్సవం చేసుకుంది. తెలుగుదేశంలో రజతోత్సవం చేసుకున్న తొలి సినిమా “చంద్రలేఖ”. తెలుగులో మొదటి రజతోత్సవ చిత్రం “బాలరాజు” అయితే, తెలుగుదేశంలో రజతోత్సవం చేసుకున్న తొలి తమిళ సినిమా “చంద్రలేఖ”. ఈ రెండు చిత్రాలు సమాంతరంగా ఆడాయి. “బాలరాజు” సినిమాతో అక్కినేని నాగేశ్వరావు గారు యువకులకు కలల హీరో అయిపోయారు. యువకులకు ఆరాధ్య దైవంగా తనను యువకులను అనుకరించడం మొదలుపెట్టినారు. జైహింద్ టాకీసులో వంద రోజులు ఆడినప్పుడు విజయవాడ వచ్చిన అక్కినేని గారిని ఒక అమ్మాయి చూడడానికి వచ్చింది. ఆ సమయంలో జరిగిన తోపులాటలో ఆ అమ్మాయి మురికిగుంటలో పడిపోయింది. ఆ అమ్మాయి ఆ తరువాత 14 సంవత్సరాలకు అక్కినేని గారి “మంచి మనసులు” శత దినోత్సవ వేడుకల సమయంలో వేదికపై ఈ విషయాన్ని వెల్లడించింది. ఆవిడే మహానటి సావిత్రి గారు.

విశేషాలు…

★ బాలరాజు సినిమా అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఏడో చిత్రం.

★ బాలరాజు సినిమా కంటే ముందు ప్రతిభ పిక్చర్స్‌ బ్యానర్ లో ఘంటసాల బలరామయ్య గారు అక్కినేని నాగేశ్వరావు గారు కథానాయకుడుగా “ముగ్గురు మరాఠీలు” అనే జానపద చిత్రాన్ని తీశారు. ఆ చిత్రం వంద రోజులు ఆడిన విజయోత్సాహంతో “బాలరాజు” చిత్రానికి శ్రీకారం చుట్టారు.

★ తెలుగులో మొట్టమొదటి రజతోత్సవ చిత్రం కూడా “బాలరాజు” సినిమానే.

★ బాలరాజు సినిమాలో 20 పాటలున్నాయి.

★ అక్కినేనికి నాగేశ్వరావు గారికి తొలిసారి నేపథ్యగానం చేసే అవకాశం ఘంటసాల వెంకటేశ్వరరావు గారికే దక్కింది. అది కూడా బాలరాజు సినిమాతోనే దక్కింది.

★ అక్కినేని నాగేశ్వరావు, ఘంటసాల గార్లు మద్రాసులో రూమ్మేట్స్‌.

★ అప్పట్లో అక్కినేని గారు తన పాటలు తానే స్వయంగా పాడుకొనేవారు. ఇందులో “చెలియా కనరావా”… పాట పాడేటప్పుడు పక్కన ఎస్‌.వరలక్ష్మిదీ, తనదీ ఒకే శ్రుతిలో ఉండటం, పైగా తన గాత్రంలో స్త్రీత్వం వినిపించడం అక్కినేనికి నాగేశ్వరావు గారికి ససేమిరా నచ్చలేదు. దాంతో బలరామయ్య గారి దగ్గరకు వెళ్లి “నేపథ్య గానం సదుపాయం వచ్చింది. ఈ పాటను ఘంటసాలతో పాడించండి” అనడంతో ఈ సినిమాలో పాడే అవకాశం ఘంటసాల గారికి దక్కింది.

★ అప్పటి వరకూ చిన్న వేషాలు వేసిన కస్తూరి శివరావు గారు “యలమంద” పాత్ర వేసి ఎంతో పేరు తెచ్చుకొన్నారు.

★ “తీయని వెన్నెల రేయి” అనే పాటలో నర్తించిన అంజలీదేవి గారు ఆ తరువాతి కాలంలో కథానాయికగా ఎదిగారు.

★ అప్పట్లో చిన్న సినిమా కేంద్రాలైన మదనపల్లి, ప్రొద్దుటూరులలో కూడా రజతోత్సవాలు జరిగాయి. అలాంటి కేంద్రాలెన్నింట్లోనో బాలరాజు సినిమా వంద రోజులాడింది.

★ బాలరాజు సినిమా కురిపించిన వసూళ్లు చూసి చిత్రశాలల నిర్మాణానికి చాలా మంది ఉత్సాహం చూపించారు.

★ ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారిని చూసి ఆంధ్రదేశంలో పొడుగాటి జుట్టుని పెంచిన మగాళ్లెందరో. ఆ కేశాలంకరణ, మీసకట్టు “బాలరాజు స్టైల్‌” గా పేరొందాయి.

★ బాలరాజు సినిమా విడుదలయ్యాక చాన్నాళ్లు నాగేశ్వరరావు గారిని “బాలరాజు” అనే పిలిచేవారు.

★ నాగేశ్వరరావు గారి అర్థాంగి అన్నపూర్ణ గారు పెళ్లిచూపులు చూసింది బాలరాజు సినిమా చూసే, కానీ కీలుగుఱ్ఱం సినిమా తరువాత పెళ్లి అయ్యింది.

Show More
Back to top button