CINEMATelugu Cinema

తెలుగు చిత్రసీమలో శృంగార, హస్య, బీభత్స, క్రోధాది నవ్య నవరసేంద్రరావు.. పింగళి నాగేంద్ర రావు.

నెరసిన తెల్ల జుట్టు, గౌరవభావం కలిగించే తెల్ల ఫ్రేము కళ్లజోడు, తెలుగుతనం ఉట్టిపడే తెల్లటి సగం చేతుల జుబ్బా, అంతకు మించి తెల్లని మల్లు పంచె. వీటన్నింటి వెనుకా దాగున్న నల్లటి మేనిఛాయ. ఆయనే మన అస్మదీయ పింగళినాగేంద్రరావు. శృంగార, హస్య, బీభత్స, క్రోధాది నవ్య నవరసేంద్రరావు. పింగళి నాగేంద్రరావు తెలుగు సినిమా చరిత్రలో చరిత్ర సృష్టించిన సినిమాలకి, చరిత్రలో నిలిచిపోయే సినిమాలకి కథ, మాటలు, పాటలు వ్రాశారు. ముఖ్యంగా 1950 – 60 దశకంలో తాను వ్రాసిన సినిమాలన్నీ కూడా ఇప్పటికీ తెలుగు వాళ్ళు విరగబడి చూస్తున్నారు. అదే తన కలం బలం. తాను వ్రాసిన సినిమాలలో పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు, చారిత్రకాలు ఉన్నాయి. తెలుగుభాషా పరిణామ శాస్త్రం ప్రకారం తెలుగు భాషను పెంచి పోషించిన సినీ కవి, రచయిత పింగళి నాగేందర్రావు. పింగళి గారు సినిమాల్లోకి రావడానికి ముందే అపారమైన పాండిత్యం గలవారు. అందువలన తాను 1950 – 60 ప్రాంతంలో తెలుగు సినిమా రంగంలో మకుటం లేని మహారాజుగా వెలిగిపోయారు.

సాంఘికాలు, జానపదాలు, పౌరాణికాలు, చారిత్రకాల్లో తనదైన ముద్ర వేయడమే కాకుండా శాశ్వతత్వం ఆపాదించారు. సాంఘికాలలో “పెళ్లి చేసి చూడు”, “పెళ్లినాటి ప్రమాణాలు”, “మిస్సమ్మ”, “గుండమ్మ కథ”, “అప్పుచేసి పప్పుకూడు”. జానపదాల్లోకి వస్తే “గుణసుందరి కథ”, “చంద్రహారం”, “పాతాళభైరవి”, “జగదేకవీరుని కథ”, “భాగ్యచక్రం”. పౌరాణికాల్లోకి వస్తే “మాయాబజార్”, “హరిశ్చంద్ర”, “శ్రీకృష్ణార్జున యుద్ధం”, “శ్రీకృష్ణ విజయం”, “శ్రీకృష్ణసత్య”. చారిత్రాత్మక చిత్రాల విషయానికి వస్తే “మహాకవి కాళిదాసు”,  “మహామంత్రి తిమ్మరుసు”, “చాణక్య చంద్రగుప్త” ఈ సినిమాలన్నింటి వెనక ఉన్న రచయిత పింగళి నాగేంద్రరావు గారు. పింగళి గారు రెండు సార్లు సినిమాల్లోకి వెళ్లి పరాజయం పొంది వెనక్కి వచ్చేసారు. మూడోసారి వెళ్లి అత్యంత విజయవంతమైన రచయితగా నిలదొక్కుకొని చరిత్ర సృష్టించారు.

పింగళి నాగేంద్ర రావు గారు తెలుగు సినిమాకి కొత్త మాటలు చెప్పారు. తెలుగు సినిమాకు కొత్త దారిని చూపారు. తెలుగు సినిమాకు కొత్త నడక నేర్పించారు. రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపినట్టు సినీమయ జగమును వ్రాతక్రీడకు ఉసిగొలిపిన రచయిత తాను. పదబంధాలతో ఆడుకోవడం, వాక్యాలతో పాడుకోవడం వాటితో జనాన్ని ఆకట్టుకోవడం పింగళి గారికి కలంతో పెట్టిన విద్య. పాళితో వెటకారాలు, చమత్కారాలు నూరడం, అవి జనం కోరడం పరిపాటిగా మార్చిన ఘనుడు. మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు అన్నట్లు “ఎవరు పుట్టించకుండా మాటలెలా పుడతాయి” అని. నిజమే ఎవ్వరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి. అందుకే పింగళి గారు కొత్త కొత్త మాటలను సృష్టించారు. వాటిని తన రచనలతో సినిమాల ద్వారా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లారు. అవి జనాల నోళ్లలో కలకాలం నానేలా చేయగలిగారు.

పింగళి అనగానే పింగళి సూరన్న కూడా గుర్తొస్తారు. ఆయన 15వ శతాబ్దంలో “కళాపూర్ణోదయం” అనే కావ్యం వ్రాశారు. వీరంతా మహారాష్ట్రలోని పింగళి అనే గ్రామం నుండి వచ్చారు. అందువలన వీరికి పింగళి అనే పేరు వచ్చింది అంటారు. మహారాష్ట్రలోని పింగళి అనే గ్రామం నుండి 14వ శతాబ్దంలో వచ్చి దివిసీమ లో స్థిరపడిపోయారు. అక్కన్న, మాదన్నలు కూడా పింగళి వంశం వారే. పింగళి వెంకయ్య (భారతదేశ చిహ్నాం రూపకల్పన చేసిన వారు) గారు కూడా పింగళి వంశం వారే.  పింగళి వంశానికి అత్యంత ఘనమైన చరిత్ర ఉంది. ఆ వంశం నుండి వచ్చిన రచయితనే పింగళి నాగేంద్రరావు గారు. ఆయన కలం సృష్టించిన మాటలు, పాటలు కోట్లాది మంది సినీ ప్రేక్షకుల మీద మత్తుమందు జల్లి తమ వశం చేసుకున్నాయి. రాబోయే తరాల వారిని కూడా చేసుకుంటాయి.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    పింగళి నాగేంద్రరావు 

ఇతర పేర్లు  :  పింగళి, మాటల మాంత్రికుడు  

జననం    :    29 డిసెంబరు 1901  

స్వస్థలం   :    రాజాం , బొబ్బిలి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ 

వృత్తి      :     రచయిత, పత్రికా ఉపసంపాదకుడు

తండ్రి     :   గోపాలకృష్ణయ్య

తల్లి      :    మహాలక్ష్మమ్మ 

జీవిత భాగస్వామి :   బ్రహ్మచారి ( అవివాహితులు ) 

మరణ కారణం   :    కాన్సర్ 

మరణం   :   06 మే 1971

నేపథ్యం…

పింగళి నాగేంద్రరావు గారు 29 డిసెంబర్ 1914 నాడు శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న రాజాం లో జన్మించారు. రాజాం అనే ఊరు తాండ్రపాపారాయుడు పుట్టిన ఊరే కావడం విశేషం. పింగళి గారి ఒక బాబాయి డిప్యూటీ కలెక్టర్, ఇంకొక బాబాయి ప్లీడరు గా పనిచేశారు. పింగళి గారు బొబ్బిలిలోనే జన్మించినా కూడా తన తల్లిది “దివిసీమ” కావడంతో తన బాల్యమంతా మచిలీపట్టణం లోనే సాగింది. వాళ్ళ నాన్న గోపాలకృష్ణయ్య, అమ్మ మహాలక్ష్మమ్మ గారు. గోపాలకృష్ణయ్య గారు దివి తాలూకు యార్లగడ్డలో కొన్ని రోజులు కరణంగా పనిచేశారు. పింగళి గారు మచిలీపట్నం లో ఆంధ్ర జాతీయ కళాశాలలో చదువుకున్నారు.

ఆ జాతీయ కళాశాలను స్థాపించిన వారు “కోపల్లె హనుమంతరావు” గారు. ఆ కళాశాల మొదలుపెట్టిన తరువాత మొదటి బ్యాచ్ లో పింగళి నాగేంద్రరావు గారు కూడా ఒకరు.  “మంగినపూడి పురుషోత్తమ శర్మ” ఆయన పెద్ద కవి అయ్యారు. “మాధవపెద్ది వెంకటరామయ్య” గారు వీధి నాటకాలు వేసేవారు, సినిమాలలో కూడా నటించారు. వీరంతా పింగళి గారి సహాధ్యాయులు. ఆంధ్ర జాతీయ కళాశాల మచిలీపట్నం లో మొదలుపెట్టినప్పుడు దానికి చాలామంది వెన్నుదన్నుగా నిలిచారు. వారిలో కొంతమంది “భోగరాజు పట్టాభి సీతారామయ్య”, “ముట్నూరు కృష్ణారావు” లాంటివారు కళాశాలను ప్రోత్సహించారు. వీరంతా మొదటి బ్యాచ్ వారు అవ్వడంతో వీరితో కలిసి చదువుకునే అవకాశం పింగళి గారికి కలిగింది. అందువలన తన ఆలోచనలో పరిణితి రావడం జరిగింది.

ఖరగ్ పూర్ లో ఉద్యోగం…

పింగళి గారు మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేశారు. ఆ వెంటనే టెక్నికల్ ఉద్యోగానికి వెళ్లకుండా ముందుగా బందరులో ఉపాధ్యాయులుగా పని చేశారు. పింగళి గారు తాను చదువుకునే రోజులలో కవితలు, నాటకాలు వ్రాస్తుండేవారు. 1917 వ సంవత్సరంలో తన 16వ యేట కలకత్తా దగ్గరలో గల ఖరగ్ పూర్ వెళ్లారు. అక్కడ తన జీవితం ఒక రకమైన మలుపు తిరిగింది. బ్రిటిష్ వారి రైల్వే వర్క్ షాప్ ఖరగ్ పూర్ లో ఉండేది. పింగళి గారు అందులో పనిచేశారు. తనకు ఆరోగ్యం అంతగా సహకరించక పోవడం వలన తనను వర్క్ షాప్ కంటే కార్యాలయం లోనే ఉంచితే బావుంటుందని ఆఫీసులోనే ఉంచారు. తనకు వరసకు బావ అయిన దండపాణి తో కలిసి “వర్కర్స్ యూనియన్” స్థాపించారు. రామజోగ రావు అనే యోగ మాస్టారు ఉపన్యాసాలకు మరియు దివ్యజ్ఞాన సమాజం వాళ్ళ ఉపన్యాసాలకు ప్రభావితమై పింగళి గారు వర్క్ షాప్ లో ఉద్యోగం మానేసి ఈ దివ్యజ్ఞాన సమాజం వారితో కలిసి ఉత్తర భారతదేశం అంతట తిరుగుతూ గుజరాత్ లో సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. ఆయనకు అప్పటికే 19 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. 15 రోజులు అక్కడే ఉన్న పింగళి గారు జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. సబర్మతీ ఆశ్రమంలోని వాతావరణం చూసిన తరువాత తనకు ఆ ఆలోచన వచ్చింది. ఇంత చిన్న వయస్సులో ఈ వైరాగ్యం రావడం సబబు కాదని సబర్మతి ఆశ్రమంలో ఉన్న “కాక కలేల్కర్” అనే వ్యక్తి కృష్ణాజిల్లా కాంగ్రెస్ నాయకులు ధన్వాడ రామచంద్రారావు గారికి ఒక సిఫారసు లేఖను వ్రాశారు.

శారద పత్రిక లో చేరిక…

అప్పటికే కాంగ్రెస్ స్వాతంత్య్రం కోసం జాతీయ ఉద్యమం చేస్తుంది. పింగళి గారు ఆ సిఫారసు లేఖతో ఆ కాంగ్రెస్ జాతీయ ఉద్యమంలో చేశారు. అందువలన పింగళి గారు వెనక్కి తిరిగి తన స్వంత స్థానం కృష్ణా జిల్లాకు వచ్చి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తనకు జీతంతో కూడిన నిర్వాహకుడిగా పని కల్పించారు. కాంగ్రెస్ లో అలా ఉంటూనే దేశభక్తి గీతాలు వ్రాసి జన్మభూమి అనే ఒక పుస్తకం కూడా వేశారు. ఆ పుస్తకం ఉద్యమానికి ఉత్ప్రేరకంగా, ఊపిరిగా ఉపయోగపడ్డాయి. కానీ ఆ పుస్తకం చదివిన కృష్ణా జిల్లా కలెక్టరు పింగళి గారిని హెచ్చరించి వదిలిపెట్టారు.  పింగళి గారు కాంగ్రెస్ లో కొనసాగుతుండగా ఆ కార్యాలయాన్ని సందర్శించిన “భోగరాజు పట్టాభి సీతారామయ్య” గారు పింగళి గారికి జీతం ఇవ్వలేమని, కాంగ్రెస్ పార్టీ విరాళాల మీద కొనసాగుతుందని చెప్పి తాను కౌతా శ్రీరామ శాస్త్రి (శారద పత్రిక వ్యవస్థాపకులు) గారికి సిఫారసు లేఖ వ్రాశారు. ఆ లేఖ పట్టుకొని వచ్చి కౌతా శ్రీరామశాస్త్రి గారిని కలిశారు పింగళి. అక్కడ నుండి తన జీవితం పెద్ద మలుపు తిరిగింది. కేవలం ఒక సంవత్సరం మాత్రమే నడిచిన శారద పత్రికలో పనిచేశారు. శారద పత్రికలో పనిచేస్తూనే తాను బెంగాలీ నుండి తెలుగులోకి అనువాదం చేసిన నాటకాలను “కృష్ణ పత్రిక” లో ప్రచురించేవారు పింగళి.

ఇండియన్ డ్రమటిక్ అసోసియేషన్ లో…

తన సొంత నాటకాలు “జేబున్నిస్సా”, “వింధ్యారాణి” లాంటి నాటకాలు కూడా వ్రాసి కృష్ణా పత్రికలో ప్రచురించారు. “ఇండియన్ డ్రమటిక్ అసోసియేషన్” లో ఉండే డి.వి. సుబ్బారావు (బందరు) తో స్నేహం ఏర్పడింది. పింగళి నాగేంద్ర రావు గారు వ్రాసిన నాటకాలు డి.వి.సుబ్బారావు గారు వేయిస్తుండేవారు. “శారదా” పత్రిక ఆగిపోవడంతో అందులో పని చేస్తున్న పింగళి గారు ఖాళీగా ఉండటానికి చూసిన డి.వి.సుబ్బారావు గారు పింగళి గారికి  “ఇండియన్ డ్రమటిక్ అసోసియేషన్” లో కార్యదర్శి హోదా కల్పించారు. అలా పింగళి గారు దాదాపు 20 సంవత్సరాలు (1926 నుండి 1946 వరకు) “ఇండియన్ డ్రమటిక్ అసోసియేషన్” లో కొనసాగారు. ఈ 20 సంవత్సరాలలో ప్రేక్షకులలో నాటకాల అభిరుచి ఏ విధంగా ఉందో పసిగట్టేశారు. అలా పద్దెనిమిది సంవత్సరాలు గడిచింది. 1940 ఆ ప్రాంతంలో తాను వ్రాసిన వింధ్యారాణి నాటకం బాగా ప్రేక్షకులు చేత ఆదరింపబడుతుంది. ఈ నాటకాన్ని సినిమాగా తీద్దామని తన మిత్రులంతా అనుకున్నారు. బందరులో ఉన్న దుర్గా నాగేశ్వరరావు గారు పెట్టుబడి పెడతాను అనడంతో పింగళి గారు స్క్రిప్టు పనుల మీద కూర్చున్నారు.  

మొదట పద్యం రచన “భలేపెళ్లి” సినిమాలో..

మద్రాసులో జగన్నాథ్ అనే సినిమా దర్శకుడు “తారుమారు” అనే ఆరు రీళ్ళ సినిమా తీశారు. తాను ఒక పని కోసం బందరు వచ్చి డి.వి.సుబ్బారావు, దుర్గ నాగేశ్వరరావు గార్లను కలిశారు. తాను తీసిన ఆరు రీళ్ళ సినిమాకు తోడుగా ఇంకో సినిమా తీసి రెంటిని కలిపి విడుదల చేద్దాం అనే ప్రతిపాదన తీసుకువచ్చారు. దాంతో వారు కూడా ఒప్పుకున్నారు. దర్శకులు జగన్నాథ్ గారు కథ సూచించగా “భలే పెళ్లి” అనే సినిమాకు పింగళి గారు సంభాషణలు వ్రాశారు. దాంతో పాటలు కూడా పింగళి గారినే వ్రాయమని జగన్నాథ్ గారు ఒత్తిడి చేయగా తాను మొదట ఒక పద్యం వ్రాశారు. ఇది పద్యం, పాట కాదు కదా. సినిమాకు పాటలు ముఖ్యం. కావున పాటలు వ్రాయమని జగన్నాథ్ గారు చెప్పారు. నిజానికి పాటలు వ్రాయడం తెలియని పింగళి గారు తెల్లమొహం వేశారు. తాను ముందు వ్రాసిన పద్యానికి జందాల గౌరీనాథ శాస్త్రి గారు ట్యూన్ చేశారు. అలా పద్యంతో మొదలైన తన పాటల రచనతో “భలే పెళ్లి” సినిమాలో ఐదు పాటలు వ్రాశారు.

మహాప్రస్థానం ను పోలిన తొలి పద్య రచన…

“భలే పెళ్లి” దర్శకులు జగన్నాథ్ గారు అంతకు ముందు తాను తీసిన ఆరు రీళ్ళ సినిమా “తారుమారు” తో కలిపి 1942లో ఆ రెండు సినిమాలు కలిపి విడుదల చేశారు. “తారుమారు” సినిమాకి కొడవగంటి కుటుంబరావు గారు పాటలు వ్రాస్తే, “భలే పెళ్లి” సినిమాకి పింగళి గారు కథ, మాటలు, పాటలు వ్రాశారు. కూచిబొట్ల శివరామకృష్ణయ్య, జయంతి రంగన్న, గరికపాటి రాజారావు లాంటి వాళ్ళు తారాగణంగా “భలే పెళ్లి” సినిమాలో నటించారు. ఇందులో పింగళి గారు పద్యం లాంటి పాట వ్రాశారు. ఈ పాట ఆరోజుల్లో శ్రీశ్రీ గారు వ్రాసిన “మహాప్రస్థానం” లాగా ఉంటుంది. “మనోహరీ అని అనేక కన్నెల కనీసం ఒక్కపరి అనాలిరా, అనాది నుండి ధనేశులుండి కొనేది కన్నెల మీరండి, హలో హలో భలేపెళ్లి అని విశాల విశ్వం చాటింది, మల్లవరం శ్రీ వల్లభరాయుని భలే భలే ఈ పెళ్లి”. ఈ పాటను మహాప్రస్థానం “పదండి ముందుకు, పదండి తోసుకు” పాట మాదిరిగా ఉంటుంది. ఈ పాట అప్పట్లో ప్రాబల్యంలో ఉన్న “కన్యాశుల్కం” గురించి చూపుతూ వ్రాశారు. సినిమా విడుదలైంది ఓ మాదిరిగా ఆడింది. ఇంతలోనే 1942లో రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ యుద్ధానికి సముద్ర తీర ప్రాంతాలు ప్రభావితం అయ్యాయి. దాంతో సినిమా నిర్మాణం అంతా మద్రాసులోనే కాబట్టి సినిమాల నిర్మాణాన్ని తాత్కాలికంగా ఆపేశారు.

వింధ్యారాణి…

రెండవ ప్రపంచ యుద్ధం మొదలవ్వడం, సినిమా నిర్మాణాలు ఆగిపోవడంతో పింగళి గారు తిరిగి బందరు వచ్చేసారు. రెండో ప్రపంచ యుద్ధం సమసిపోగానే మళ్లీ వెళ్లి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మిత్రులతో కలిసి వీరు వైజయంతి ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ స్థాపించారు. వీరు జెమినీ స్టూడియో వారి సహాయం తీసుకుని “వింధ్యారాణి” సినిమా నిర్మించారు. డి.వి.సుబ్బారావు, పుష్పవల్లి, జి.వరలక్ష్మి మొదలగు వారు ఇందులో నటించారు. దానికి పింగళి గారు కథ, మాటలు,పాటలు వ్రాశారు. 1946లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో 12 పాటలు వ్రాశారు పింగళి గారు. కానీ ఈ సినిమా బాగా ఆడలేదు. దాంతో పింగళి గారికి వైరాగ్యం వచ్చింది. తాను సినిమా రచయితగా పనికిరానేమో అనుకుని వెనక్కి తిరిగి బందరు వచ్చేసారు. వెనక్కి వచ్చి మళ్ళీ నాటకాలు వ్రాయడం మొదలుపెట్టారు.

“గుణసుందరి కథ”…

కమలాకర కామేశ్వరరావు గారు బందరు లో సినిమాలు చూస్తూ, సమీక్షలు వ్రాస్తుండేవారు. ఆ సమీక్షలు చూసిన సినిమా వాళ్ళు ఆయనని పిలిపించుకొని తనను వారి దర్శకత్వ శాఖలో పెట్టుకున్నారు. ఆ కమలాకర కామేశ్వరరావు గారు పింగళి గారికి మిత్రులు. దాంతో కె.వి.రెడ్డి గారు తీయబోయే ఒక జానపద చిత్రానికి కమలాకర కామేశ్వరరావు గారి సిఫారసు మేరకు పింగళి నాగేంద్రరావు గారిని పిలిపించి ఆ జానపద చిత్రానికి కథ మాటలు, పాటలు, వ్రాయించారు కె.వి.రెడ్డి గారు. ఆ సినిమా పేరు “గుణసుందరి కథ”. ఈ సినిమాలో పాత్రలు పేర్లు విచిత్రంగా పెట్టారు. హరమతి, కాలమతి లాంటి పేర్లు గిడిగిడి, ఠెంకణాలు లాంటి ఊత పదాలు ప్రవేశపెట్టారు. దైవాధీనం, సొంతకారీ లాంటి పద ప్రయోగాలు చేశారు. పాటలు కూడా ఆకట్టుకునేలా వ్రాశారు. సంగీత దర్శకులు ఓగిరాల రామచంద్ర రావు గారే ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.

ఈ సినిమాలో పెద్దపెద్ద తారలు లేరు. కస్తూరి శివరావు, జూనియర్ శ్రీ రంజని నాయకా, నాయికలు. ఈ సినిమా అంతా శోకరసంతో ఉంటుంది. అలాంటి సినిమాను కూడా ప్రేక్షకుల ఆదరించేలాగా బ్రహ్మాండంగా మాటలు, పాటలు వ్రాసి కె.వి.రెడ్డి గారి దర్శకత్వంలో పింగళి గారు కలిసి ఇద్దరూ ఆ సినిమాను విజయవంతం చేసేశారు. ఆ సినిమా 29 డిసెంబర్ 1949 నాడు విడుదలైంది. అప్పటికే పింగళి గారి వయసు 48 సంవత్సరాలు. మొట్టమొదటిగా పింగళి గారికి అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన చిత్రం “గుణసుందరి కథ”. అప్పటివరకు సినిమాలు మూడు ఆటలే (మ్యాట్ని, మొదటి ఆట, రెండవ ఆట) ఉండేవి. ఈ సినిమా నుండి ఉదయం ఆట కూడా మొదలై నాలుగు ఆటలు ఆడించడం మొదలుపెట్టారు. రాజమహేంద్రవరం లో రెండవ ఆట తరువాత కూడా 5వ షో వేశారు. అలా పింగళి నాగేంద్రరావు గారు, కె.వి.రెడ్డి గారి కలయిక 15 సంవత్సరాల పాటు అత్యద్భుతంగా సాగి అనేక విజయవంతమైన చిత్రాల రూపకల్పనకు పునాదిగా నిలిచింది. అక్కడి నుండి పాటలలోనూ, మాటలలోనూ సొంత ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు.

పాతాళ భైరవి…

విజయ ప్రొడక్షన్ వారు స్థాపించిన నాగిరెడ్డి, చక్రపాణిలు “షావుకారు” అనే సాంఘిక సినిమా తీశారు. పేరొచ్చింది కానీ ఆ సినిమాకు డబ్బులు రాలేదు. అప్పటికే “గుణసుందరి కథ” లాంటి విజయవంతమైన సినిమా తీసిన కె.వి.రెడ్డి గారిని పిలిపించి విజయా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఒక సినిమా తీయమన్నారు. అలాగే పింగళి గారిని పిలిచి “అల్లావుద్దీన్ అద్భుతదీపం” లాంటి కథను వ్రాయమన్నారు. అప్పుడు పింగళి గారు వ్రాసిన “తోటరాముడు” కథనే “పాతాళభైరవి” గా తీశారు. ఎన్టీఆర్ గారికి మొట్టమొదటిసారిగా మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమా “పాతాళభైరవి”. ఇందులో వీర రసం, హాస్యం, సాహసం కలిపి అద్భుతమైన మాటలు, పాటలు వ్రాశారు పింగళి గారు. తాను వ్రాసిన ప్రేమ యుగళగీతాలు ప్రజాదరణ పొందాయి. “తోటరాముడు”, “నేపాల మాంత్రికుడు”, “బాలకృష్ణకు అంజిగాడు”, రేలంగికి “వీర ధీర శూర సేనుడు”, “పాతాళ భైరవి”, “సదా జపుడు” ఇలా ప్రేక్షకులకు కొత్తదనం అనిపించేలా పాత్రల పేర్లు పెట్టారు.

సంభాషణలు ఒక సామెత లాగా ఉన్నాయి. “సాహసం చేయరా డింభకా రాజకుమారి నీ సొంతమవుతుంది రా”, “ఓ భగవంతుడా కొడుకుని ఇమ్మంటే రాక్షసుడు ఇచ్చావేమిటి”? లాంటి ఊతపదాలే కాకుండా “నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా”, “నరుడా ఏమి నీ కోరిక” లాంటి సంభాషణలతో ప్రేక్షకులను మెప్పించారు. పాటలు కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. “ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు”, “వినవే బాల నా ప్రేమ గోల”,   “కలవరమాయే మదిలో”, “ఎంత ఘాటు ప్రేమయో” లాంటి పాటలు అజరామరంగా మిగిలిపోయాయి. ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తరువాత పింగళి గారు ఏ సినిమాకైనా మాటలు వ్రాశారంటే  సినిమా విజయవంతం అవుతుంది అనే అంచనాకు వచ్చారు ప్రేక్షకులు.

మాయాబజార్…

తెలుగు సినిమా చరిత్రలో “నభూతో న భవిష్యత్” అనిపించిన సినిమా “మాయాబజార్” (1957). ఆ సినిమాను అప్పటినుండి ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం ఆ సినిమా ఖచ్చితంగా ఉండిపోతుంది. దానికి అంత శాశ్వతత్వం ఆపాదించడానికి ముఖ్య కారణం “పింగళి నాగేంద్ర రావు” గారు అని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. అందులో ఒక్కొక్క పాత్రను తీర్చిదిద్దిన విధానం, ఆయన మాటల్లో వాడిన ప్రయోగాలు అనితర సాధ్యం. ఆ సినిమాలలో ఘటోత్కచుడు ఒక మాట చెప్తారు “ఎవరూ సృష్టించకపోతే మాట ఎలా పుడతాయి” అని. మాయాబజార్ లో ఎన్నో కొత్త మాటలు సృష్టించారు. ఆ మాటలు కేవలం పింగళి నాగేంద్రరావు గారు వ్రాసినవి. అవి తెలుగు వాడుక భాషలో లేవు అని ప్రేక్షకులకు తెలియదు. అస్మదీయులు, తస్మదీయులు అనే పదాన్ని తానే సృష్టించారు. వెయ్యండ్రా వీరతాడు అనే సంభాషణలో వీరతాడు అనే పదం తాను సృష్టించినదే. పాతాళభైరవిలో “గురు” అనే మాట కూడా పింగళి గారు సృష్టించినదే. “రసపట్టులో తర్కం కూడదు”, “గోంగూర శాకాంబరి దేవి ప్రసాదం”, “మీరు ధర్మాత్ములు కాదని తెలిసినా అన్నగారితో ప్రమాదమే”, “అస్మదీయులు తస్మదీయులు”, “దుష్టచతుష్టయం”, “హాయ్ హాయ్ నాయకా”, “వేసుకో వీరతాడు” ఇలాంటి సంభాషణలు తాను సృష్టించినవే.

అర్థవంతమైన సారాంశంతో…

రచయిత అనేవాడు తన మెదడును ఎలా, ఎంత పదునుగా ఉపయోగిస్తాడో అన్నదానికి రెండు ఉదాహరణలు. “అమ్మా సుభద్రా నీవు వీరపత్నివి, వీరమాతవు. నీవు ఇంత బేలవు అనుకోలేదు. అన్నగారి తాత్పర్యం తెలిసింది కదా, ఇంకా అల్లరి ఎందుకు? ఇక్కడ నీమొర ఆలకించే వాళ్ళు ఎవరూ లేరు. నీ దిక్కున చోటికి వెళ్లవచ్చు” అని సుభద్ర తో శ్రీకృష్ణుడు ఒక సందర్భంలో అంటాడు. ఇందులో అద్భుతమైన తాత్పర్యం ఉంది. అలాగే “వెనక్కి తిరగడం మనకు తెలియని విద్య” అని అభిమన్యుడు రథసారధిగా ఉన్న మాధవపెద్ది వెంకట రామయ్యతో అంటాడు. అందులో కూడా అర్థవంతమైన సారాంశం ఉంది. పింగళి గారు పాటలు కూడా అద్భుతంగా వ్రాసారు. ఈ సినిమాలో ఉన్న పాటలలో ఉన్న మాటలతో వచ్చిన సినిమా పేర్లు ఏ రచయిత పాటల్లోను రాలేదు. “చూపులు కలిసిన శుభవేళ”, “లాహిరి లాహిరి లాహిరిలో”, “వివాహ భోజనంబు”, “హై హై నాయకా”, “ఆహ నా పెళ్ళంట” ఇలా. అలాగే పాతాళభైరవి సినిమాలో పింగళి గారు వ్రాసిన పాటలలోని మాటలు కూడా సినిమా పేర్లతో వచ్చాయి. “ఎంత ఘాటు ప్రేమయో”, “పాపం పసివాడు”. మిస్సమ్మలోని పాటలలో మాటల ద్వారా “రావోయి చందమామ”. ఇంతటి అరుదైన గౌరవం కేవలం పింగళి నాగేంద్రరావు గారి పాటలకు మాత్రమే దక్కింది. 

మరణం…

పింగళి గారు తాను వ్రాసిన సినిమాలు “గుండమ్మ కథ”, “మిస్సమ్మ”, “శ్రీకృష్ణార్జున యుద్ధం”, “మహామంత్రి తిమ్మరసు”, “మహాకవి కాళిదాసు”  ఇలాంటి సినిమాలకు పింగళి గారు రచనలు చేశారు. ఆయన చివరి రోజులలో వ్రాసిన సినిమాలు నిరాశ పరుస్తూ వచ్చాయి. “మాయాబజార్” తరువాత “జగదేకవీరుని కథ”, “గుండమ్మ కథ”, “మహామంత్రి  తిమ్మరసు”, “శ్రీకృష్ణార్జున యుద్ధం” వరకు పింగళి గారు వ్రాసిన సినిమాలు విజయవంతం అయ్యాయి. ఆ తర్వాత కే.వీ.రెడ్డి గారి ప్రాభవం ఎలా తగ్గిందో, పింగళి గారి ప్రాభవం కూడా అలాగే తగ్గిపోయింది. “సత్యహరిశ్చంద్ర”, “ప్రమీలార్జునీయం”, “శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ”, “ఉమా చండీ గౌరీ శంకరుల కథ” మొదలగు సినిమాలు పింగళి గారి పాత సినిమాల మాదిరిగా విజయవంతం కాలేదు. పింగళి గారి ప్రాభవం తగ్గుతూ వచ్చింది. పింగళి గారి చిట్టచివరి సినిమా ఆయన చనిపోయాక విడుదలైంది. పింగళి గారు 06 మే 1971 నాడు కన్నుమూశారు. ఆయన చనిపోయాక మూడు సినిమాలు విడుదలయ్యాయి. “శ్రీకృష్ణ సత్య”, “నీతి నిజాయితీ”, “చాణక్య చంద్రగుప్త”. తన చిట్టచివరి సినిమా “చాణక్య చంద్రగుప్త”. ఈ సినిమాకు కథ, మాటలు మాత్రమే పింగళి గారు వ్రాశారు. పాటలు వ్రాయలేదు. 

పింగళి “ఆజన్మ బ్రహ్మచారి”… 

పింగళి గారు “ఆజన్మ బ్రహ్మచారి”. తాను జీవితాంతం పెళ్లి చేసుకోలేదు. కానీ తాను వ్రాసిన రచనలు పెళ్లి చుట్టూ తిరిగాయి. “భలే పెళ్లి”, “పెళ్లి చేసి చూడు”, “పెళ్లి నాటి ప్రమాణాలు”, “మాయాబజార్” లో (శశిరేఖ పరిణయం), “శ్రీకృష్ణార్జున యుద్ధం” లో (సుభద్ర కళ్యాణం) ఇలా ఎన్నో పెళ్లి చుట్టూ తిరిగే సినిమాలకు పని చేశారు. కానీ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు. అందుకని ఎవరో అన్నారట “ఆయన సినీ లోక కళ్యాణం కోసం తన కళ్యాణం గురించి కూడా పట్టించుకోలేదు” అని. పింగళి గారికి ఒకసారి సన్మానం చేసి పూలమాల వేస్తే అది పిల్లలకు ఇచ్చారట. ఇంటికి తీసుకెళ్లొచ్చు కదా అని ఎవరో అడుగగా దానికి సమాధానంగా నాకు పెళ్లి కాలేదు, ఇంటికి తీసుకెళ్తే జనాలు వేరే రకంగా అనుకుంటారని అన్నారట. నాకు పెళ్లి కాలేదు కానీ 30 మంది పిల్లలు ఉన్నారని పింగళి గారు అనేవారు. అంటే తాను వ్రాసిన 30 సినిమాలే తన 30 మంది పిల్లలు. పింగళి గారికి అనేక పురస్కారాలు వచ్చాయి. కానీ వాటి గురించి తాను ఏ రోజూ చెప్పుకోలేదు. “పెళ్లినాటి ప్రమాణాలు”, “మహాకవి కాళిదాసు”, “మహామంత్రి తిమ్మరుసు” చిత్రాలకు జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ప్రశంసా పత్రాలు వచ్చాయి. పింగళి గారు విజయా ప్రొడక్షన్స్ లో పూర్తిస్థాయి రచయితగా ఉండిపోయారు. కే.వి.రెడ్డి, చక్రపాణి లకు ఎక్కువగా రచనలు చేశారు.

ఆడు పోతే నేను పోయినట్టే కదా..

పింగళి గారు చనిపోయినప్పుడు “ఆంధ్ర పత్రిక” వారు పింగళి గారికి బదులుగా చక్రపాణి గారి ఫోటో వేశారు. అది చూసి విశాఖపట్నం నుండి భమిడిపాటి రామగోపాలం, ఎన్.వి.ఎల్ గార్లు “ఆంధ్ర పత్రిక” కు ఫోన్ చేసి ఆ తప్పిదం గురించి చెప్పారు. దానికి మరునాడు “ఆంధ్ర పత్రిక” వారు సవరణ కూడా వేశారు. ఈ విషయం గురించి చక్రపాణి గారితో “ఆంధ్ర పత్రిక” వారు మాట్లాడుతూ “పింగళి గారు పోయారు, మేము పొరపాటున ఫోటో మీది వేశామని చెబుతుండగా దానికి చక్రపాణి గారు చాలా ఓపికతో సమాధానమిస్తూ “ఏమైంది నా ఫోటో వేస్తే, ఆడు పోతే నేను పోయినట్టే కదా” అన్నారట. అంతగా విజయా ప్రొడక్షన్స్ వాళ్ళు పింగళి గారిని ప్రేమించేవారు, అభిమానించేవారు, గౌరవించేవారు కూడానూ. అందుకే పింగళి గారు చనిపోయిన తరువాత కూడా తన పాటల ద్వారా, తన మాటల ద్వారా అజరామరం చిరంజీవి అయ్యారు. అదేవిధంగా తెలుగు సినిమాకు కొత్త మాటలు నేర్పారు, కొత్త నడక నేర్పారు. ఆయన మాట వ్రాసినా, ఆయన పాట వ్రాసినా అది పింగళి నాగేంద్రరావు గారి శైలి అనేలా చేశారు. ఆయన వ్రాసింది తక్కువే, కానీ వ్రాసింది ప్రతిదీ కూడా ఎక్కువ కాలం నిలిచింది, నిలిచేలా చేసిన పింగళి గారి ప్రతిభ, అంకితభావం తన ప్రతీ మాటలోనూ కనిపిస్తుంది.

Show More
Back to top button