1940 వ దశబ్దంలో సినీరంగ ప్రవేశం చేయాలంటే రంగస్థలం మీద నాటక ప్రదర్శన అర్హతలాగా తప్పనిసరిగా ఉండేది. అప్పట్లో ఆ ఆనవాయితీ 95 శాతం నటులకు పైగా వర్తిస్తుంది. రంగస్థల నాటక అనుభవం లేకుండా సినిమాలలో నటించిన నటీనటులు 1940వ దశాబ్దంలో వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఆ కోవకు చెందిన నటులు జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు. 1940 దశకంలో ఏమాత్రం రంగస్థలం అనుభవం ఎక్కువగా లేకపోయినా, సంగీత పరిజ్ఞానం అంతగా లేకపోయినా తాను నటించిన మొదటి చిత్రంతోనే తనదైన ముద్ర వేసి, తన పద్యాలు తానే పాడుకుని, తాను ధరించిన పాత్రకు తానే సాటి అని నిరూపించుకుని తన పేరు చెబితే ఆ చారిత్రాత్మక పాత్రను, ఆ చారిత్రాత్మక పాత్ర పేరు చెబితే తన పేరును గుర్తించేలాగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, శ్రీనాథుడు పాత్రధారి “జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు”, ఆ చిత్రం పేరు “భక్త పోతన”. ఇది 1943లో విడుదలైన కె.వి.రెడ్డి గారి దర్శకత్వంలోని మొట్టమొదటి చిత్రం.
శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణదేవరాయల పేర్లు చెబితే నందమూరి తారకరామారావు గారు ఎలా గుర్తొస్తారో, శ్రీనాథుడు అనగానే ఇప్పటికీ స్ఫురించే పేరు జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు. 1940 – 1955 సంవత్సరాలలో తెలుగు చలనచిత్ర సీమలో సమర్థులైన గుణచిత్ర నటుల జాబితా తీస్తే అందులో మొదటి వరుసలో పరిగణిలోకి తీసుకునే నటుడి పేరు “జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి” గారు. 1943లో వచ్చిన “భక్త పోతన” లో నటించిన శ్రీనాథుడు పాత్రను ఆనాటి ప్రేక్షకులు ఎలా మెచ్చుకున్నారో, పన్నెండేళ్ల తరువాత 1954 వ సంవత్సరంలో వచ్చిన కె.వి.రెడ్డి గారి అద్భుతమైన విజయం సాధించిన మరో చిత్రం “పెద్దమనుషులు” లో ప్రధాన ప్రతినాయక ధర్మారావు పాత్రకు కూడా అంతే పేరు తెచ్చుకున్నారు జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు. నిజానికి ఈ రెండు చిత్రాలకు తనకు వచ్చిన పేరు గమనిస్తే తాను చాలా చిత్రాలలో నటించారనే అనుమానం కలుగుతుంది.
జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు పదకొండు సంవత్సరాలలో ఏడు చిత్రాలలో మాత్రమే నటించారు. అందులో రెండు చిత్రాలు “భక్త పోతన”, “పెద్దమనుషులు”. ఇవి అద్భుతమైన విజయం సాధిస్తే మరో మూడు చిత్రాలు “మాయామశ్చీంద్ర”, “భీష్మ”, “భలే రాముడు” లాంటివి విజయవంతమైన చిత్రాలు. మిగిలిన రెండు సినిమాలు ఆయన సొంతంగా నిర్మించి, కథనాయకుడుగా నటించిన చిత్రాలు “గీతాంజలి”, “ఆకాశరాజు”. ఆ రెండు చిత్రాలు కూడా “ఘోర పరాజయాలు”. తన జమీందారు ఆస్తిని కూడా అధిక భాగం హరింపజేయడం అనేది చిత్రపరిశ్రమలో ఆర్థికంగా నష్టం కలిగించే సినిమాలు నేర్పే గుణపాఠం. కేవలం ఏడు సినిమాలతోనే అలనాటి సినిమాల ప్రస్తావన వస్తే తన పేరు ప్రస్థావన వచ్చేలా గుర్తింపు పొందిన నటుడు జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు.
జీవిత విశేషాలు…
- జన్మ నామం : జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి
- ఇతర పేర్లు : గౌరీ నాథ శాస్త్రి
- జననం : 14 మే 1904
- స్వస్థలం : పిలపర్రు , తెనాలి, ఆంధ్రప్రదేశ్
- వృత్తి : నటులు, గుణ చిత్ర నటులు..
- తండ్రి : పురుషోత్తం
- తల్లి : రుక్మిణి
- జీవిత భాగస్వామి : యజ్ఞేశ్వరి (మరణం), తూములూరు సీతారామమ్మ
- పిల్లలు : సుశీల , శకుంతల, ఇందిర (1953)
- మరణ కారణం : అనారోగ్య కారణం
- మరణం : 24 ఫిబ్రవరి 1958
నేపథ్యం..
జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారి 14 మే 1904 నాడు జన్మించారు. వారి కుటుంబం తాత ముత్తాతల నాటి నుంచి బాగా ధనవంతులు. వాళ్ళ నాన్న గారి పేరు పురుషోత్తం, అమ్మ గారి పేరు రుక్మిణి. వారి స్వస్థలం తెనాలికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న “పిలపర్రు”. చుట్టుప్రక్కల వారికి వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర వడలి అనే ఊరు చుట్టుప్రక్కల కూడా వారికి భూములు ఉండేవి. అందువలన వారికి గుడివాడలో కూడా నివాస గృహాలు ఉండేవి. పురుషోత్తం, రుక్మిణి గార్లకు దాదాపు పదిమంది సంతానం పుట్టి చనిపోయారు. గౌరీ పంచాక్షరీ మంత్రం జపిస్తే తరువాత పుట్టబోయే సంతానం నిలుస్తుందని వారికి ఎవరు చెప్పారు. అందువలన వారు ఆ తరువాత తమకు పుట్టిన అబ్బాయికి గౌరీనాథ శాస్త్రి అని పేరు పెట్టుకున్నారు.
ఆ తరువాత పుట్టిన మరొక అబ్బాయి గౌరీనాథ శాస్త్రి గారి తమ్ముడికి శ్రీరామశాస్త్రి అని పేరు పెట్టుకున్నారు. పుట్టుకతోనే వారు అగర్భ శ్రీమంతులు కాబట్టి గౌరీనాథ శాస్త్రి గారు చదువు మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా లేక లేక పుట్టిన పిల్లలు కాబట్టి వారిని చాలా గారాబంగా చూసుకునేవారు. చిన్నప్పటి నుంచి కూడా వారు పదవతరగతి దాటి చదువుకున్న దాఖలాలు ఎక్కడ కూడా లేవు. చిన్నప్పటి నుండి వాళ్ళ అబ్బాయికి మంచి గాత్రం ఉంది అన్న విషయం గమనించిన గౌరీ నాథ శాస్త్రి గారికి, శ్రీరామ శాస్త్రి గారికి చిన్నతనం నుండి సంగీతంలో శిక్షణ ఇప్పించారు. హిందుస్థానీ సంగీతంతో పాటు ఆధ్యాత్మిక కీర్తనలు కూడా అభ్యసించారు గౌరీనాథ శాస్త్రి గారు. తన ఆస్తులను చూసుకోవడంతోనే తన సమయం అంతా గడిచిపోయేది.
రెండవ వివాహం…
గౌరీనాథ శాస్త్రి గారికి సంగీతంతో పాటు నాటకాలు అంటే చిన్నతనం నుండి ఆసక్తి ఉండేది. ధనవంతుల అబ్బాయి కావడంతో చిన్నప్పటి నుండి నాటకాలలో వేషాలు వేయడం కుదరలేదు. శాస్త్రి గారికి అప్పటి అలవాటు ప్రకారం తనకు చిన్నవయసులోనే పెళ్లి చేశారు. తన భార్య పేరు “యజ్ఞేశ్వరి”. వారికి ముగ్గురు ఆడపిల్లలు జన్మిస్తే, ఒకరు చనిపోగా ఇద్దరు మిగిలారు. ఆ పిల్లల పేర్లు సుశీల, శకుంతల. దురదృష్టవశాత్తు గౌరీనాథ శాస్త్రి గారికి తన పాతికేళ్ల వయస్సులోనే భార్య వియోగం సంభవించింది. ఆ తరువాత 1929లో ఆయనకు ద్వితీయ వివాహం జరిగింది. ఆమె పేరు “తుములూరు సీతారామమ్మ”. ఆమె గుంటూరుకు చెందిన న్యాయవాది నాగభూషణం గారి అమ్మాయి. జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారి జీవితం పది సంవత్సరాల పాటు సజావుగా సాగిపోయింది. 1940 – 1941లో జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారి జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన, ఈరోజు మనం ఇలా మాట్లాడుకోవడానికి పునాది అని చెప్పడం జరిగింది. అప్పటికీ టాకీలు మొదలై పది సంవత్సరాలు అయ్యింది. ప్రజలలో సినిమాల పట్ల ఆసక్తి బాగా పెరిగింది.
కమలాకర కామేశ్వరరావు తో పరిచయం…
గుడివాడలో వాహినీ వారి “సుమంగళి”, “దేవత” సినిమాలు చూడడానికి వెళ్ళినప్పుడు గౌరీనాథ శాస్త్రి గారికి ఒక కుర్రాడు పరిచయమయ్యారు. తనతో గౌరీనాథ శాస్త్రి గారు కూర్చొని ఏ సినిమా ఏ విధంగా ఉంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ కుర్రాడే కమలాకర కామేశ్వరరావు గారు. అప్పటికే ఆయన మద్రాసులో వాహినీ స్టూడియోలో సహాకార దర్శకుడిగా పనిచేస్తున్నారు. కానీ వాహినీ వారి సినిమాలు విడుదల అయినప్పుడు వారికి ప్రతినిధిగా ఆంధ్ర ప్రాంతంలోకి వచ్చి ఆ సినిమాలు ప్రదర్శించే థియేటర్లలో వసూళ్ళ సంగతి చూసుకుంటూ ప్రేక్షకుల అభిప్రాయాలు కూడా కనుక్కునేవారు.
కమలాకర కామేశ్వరరావు గారు ఆ క్రమంలోనే జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారికి కమలాకర కామేశ్వరరావు గారికి పరిచయం కలిగింది. “దేవత” సినిమా పూర్తి అయ్యి “భక్త పోతన” సినిమా నిర్మిద్దామని అనుకున్నారు వాహినీ భాగస్వాములు. దర్శకుడుగా తమ సంస్థలో పనిచేస్తున్న కె.వి.రెడ్డి గారికి అవకాశం ఇద్దామని అనుకున్నారు. ఆ సంస్థ భాగస్వాములు కొత్తవారికి అవకాశాలు ఇద్దామా, వద్దా అని అందులోని భాగస్వాములు ఆలోచిస్తున్నారు. అందులో సింహభాగం పెట్టుబడి పెట్టిన కె.వి.రెడ్డి గారి మిత్రుడు మూలా నారాయణస్వామి గారు కె.వి.రెడ్డి గారికి దర్శకత్వ బాధ్యతలు వచ్చేలాగా చేశారు. “నష్టాలు వస్తే నేను భరిస్తాను, ఇతని మీద నాకు నమ్మకం ఉంది” అని మిగతా భాగస్వాములు అందరికీ ఆయన హామీ ఇచ్చారు.
తొలి సినిమా “భక్త పోతన”…
“భక్త పోతన” చిత్రానికి తారాగణం ఎంపిక చేసే విషయంలో శ్రీనాథుని పాత్ర ప్రసక్తి వచ్చినప్పుడు అప్పటికే చిత్ర రంగంలో ఉన్న నటుల కంటే కొత్త వారైతే బాగుంటుందనుకున్నారు ఆ సినిమా సహాకార దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు. ఆయన జంధ్యాల గౌరి నాథ శాస్త్రి గారి గురించి కె.వి.రెడ్డి గారికి సిఫారసు చేశారు. ఆ విధంగా జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారిని మద్రాసుకు పిలిపించి స్క్రీన్ టెస్ట్ చేసి శ్రీనాథుడు పాత్రకు ఎంపిక చేశారు. జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు కూడా వారి నమ్మకాలను ఏమాత్రం వమ్ముచేయకుండా “భక్త పోతన” చిత్రంలో శ్రీనాథుని పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. కేవలం మూల నారాయణస్వామి గారి మద్దతుతోనే తాను కొనసాగుతున్నారు కాబట్టి కె.వి.రెడ్డి గారు దర్శకత్వ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. అప్పటికే మూడు సినిమాలు అనుభవం ఉన్న బి.యన్.రెడ్డి గారిని నిర్మాణ పర్యవేక్షకుడిగా నియమించారు.
“భక్త పోతన” సినిమా చిత్రీకరణ జరిగే రోజులలో కె.వి.రెడ్డి గారు నటీనటులకు రిహార్సల్ చేయించేవారు. చివరలో బి.యన్.రెడ్డి గారు కొన్ని కొన్ని మార్పులు సూచించేవారు. అలాంటి సందర్భంలో జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు కె.వి.రెడ్డి గారి వైపే నిలబడి మీరు చెప్పినట్లే చేద్దామని అనేవారు. ఆ సందర్భాన్ని ఉదాహరిస్తూ ఒకవేళ గౌరీనాథ శాస్త్రి గారు సీనియర్ దర్శకులు అని బి.యన్.రెడ్డి గారి వైపే నిలబడి ఉంటే నా పరిస్థితి మరోలా ఉండేదని నరసరాజు గారితో చెప్పుకునేవారు. ఆ సినిమాలో జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు తన పద్యాలు తానే పాడుకున్నారు. “భక్త పోతన” 07 జనవరి 1943 నాడు విడుదలైంది. ఆ రోజులలో పోటీగా “బాలనాగమ్మ” సినిమా విడుదలైంది. ఆ సినిమాలు పోటీగా నిలబడి “భక్త పోతన” ఘనవిజయ సాధించింది. భక్త పోతన సినిమా అందరితోపాటుగా గౌరీ నాథ శాస్త్రి గారికి కూడా అద్భుతమైన పేరు తెచ్చిపెట్టింది. “భక్త పోతన” సినిమాలో మాదిరిగా శ్రీనాథుడు ఈ విధంగానే ఉంటాడు అనే ప్రేక్షకులకు అత్యంత బలీయంగా ముద్రించగలిగారు.
రెండవ చిత్రం “భీష్మ”…
జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారికి తన మొదటి సినిమా “భక్త పోతన” విజయంతోనే అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడ్డాయి. అయితే డబ్బుల కోసం సినిమాలలో వేషాలు వేయాల్సిన అవసరం ఆయనకు లేదు. పైగా కుటుంబాన్ని మద్రాసుకు ఇంకా మార్చలేదు. అందువలన వెంటవెంటనే సినిమాలు ఒప్పుకోలేదు. 1943 లోనే “భక్త పోతన” తరువాత ఆయన ప్రధాన పాత్ర ధరించిన రెండవ చిత్రం 10 ఫిబ్రవరి 1945 నాడు విడుదలైన “భీష్మ” చిత్రం. దీనిని శోభనాచల ప్రొడక్షన్స్ అధినేత “మీర్జాపురం రాజావారు” నిర్మించారు. మచిలీపట్నం కు చెందిన చిత్రపు నారాయణమూర్తి గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో “భీష్మ” గా జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు నటిస్తే, కృష్ణుడిగా సి.ఎస్.ఆర్. ఆంజనేయులు గారు నటించారు. అంబ గా నిర్మాత అయిన మీర్జాపురం రాజా వారి భార్య “కృష్ణవేణి” గారు నటించారు. సీనియర్ శ్రీరంజని చెల్లెలు అయిన జూనియర్ శ్రీరంజని గారు మొట్టమొదటిగా వెండితెరకు ఈ సినిమాతోనే పరిచయం అయ్యారు. భీష్మ చిత్రం జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు నటించిన రెండవ చిత్రం. అలాగే ఆ తరువాత రోజులలో మరొక నిర్మాత అయిన నటి లక్ష్మీరాజ్యం గారు కూడా భీష్మలో మరొక ముఖ్యపాత్ర పోషించారు. ఈ భీష్మ చిత్రం “భక్తపోతన” అంత ఘనవిజయం సాధించకపోయినా విజయవంతమైన చిత్రంగానే పరిగణింపబడింది.
“మాయా మశ్చీంద్ర” సినిమా…
భీష్మ చిత్రం తరువాత సంవత్సరానికి 14 జనవరి 1946 నాడు జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు నటించిన మూడవ చిత్రం మాయ మాశ్చీంద్ర చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర మశ్చీంద్రుడుగా జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు నటిస్తే, రాణిగా అప్పటి ప్రముఖ తార పసుపులేటి కన్నాంబ గారు నటించారు. నటి మాలతీ గారు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాకు పి.పుల్లయ్య గారు దర్శకత్వం వహించారు. ఆ తరువాత రోజులలో ప్రముఖ గుణచిత్ర నటులైన ముక్కామల గారు నటించిన మొట్టమొదటి చిత్రం కూడా మాయామాశ్చీంద్ర నే. ఈ మూడు సినిమాలలో నటించేటప్పుడు జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు కేవలం తన పాత్రకే పరిమితం కాకుండా సినిమా నిర్మాణ క్రమాన్ని, వివిధ విభాగాల్ని దగ్గరగా ఉండి పరిశీలించేవారు జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు. ఆ అనుభవంతోటి ఆయనకు స్వతంత్రంగా సినిమా నిర్మాణం చేపట్టాలనే ఆలోచన వచ్చింది. ఎవరినో పెట్టుబడి పెట్టమని అడగాల్సిన అవసరం ఆయనకు లేదు. జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు ధనవంతులు. వందల ఎకరాలకు వారసులు. తాను సినిమా రంగంలో ఐదేళ్ల నుండి కొనసాగుతున్నా కూడా తన కుటుంబాన్ని మద్రాసుకు మార్చలేదు. పిడమర్రు, మద్రాసు వచ్చిపోతూ మార్గమధ్యలో గుడివాడ కూడా వెళ్ళివస్తుండేవారు.
ఎన్టీఆర్ గారితో పరిచయం…
జంధ్యాల గౌరినాథ శాస్త్రి గారు సొంతంగా సినిమాలు తీద్దామని అనుకున్నప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన “మహారథి కర్ణ”. ఆ సినిమా ప్రయత్నాలు నటీనటుల కోసం, రంగస్థలం కళాకారుల కోసం అన్వేషనలో బెజవాడకు వెళ్ళినప్పుడు గౌరినాథ శాస్త్రి గారికి యుక్తవయస్సులో ఉన్న ఒక కుర్రాడు పరిచయం అయ్యాడు. తాను స్ఫురద్రూపి. తనలో తెలియని ఆకర్షణ, రాజసం ఉట్టిపడుతుండేది. ఆ కుర్రాడికి అప్పుడే నాటకాలు అనుభవం ఉంది. ప్రతీరోజూ బెజవాడ నుండి గుంటూరు వెళ్లి బి.ఎ చదువుకుంటున్నాడు. జంధ్యాల గౌరినాథ శాస్త్రిగారికి ఆ కుర్రాడితో “మహారథి కర్ణ” లో ఆత్రుతగా ఏదో ఒక పాత్ర వేయించాలని ఉండేది.
జంధ్యాల గౌరినాథ శాస్త్రి గారు తరచూ ఆ కుర్రాడిని రిక్షాలో కూర్చోబెట్టుకుని విజయవాడ అంతా తిరుగుతూ సినిమాల గురించి విశేషాలన్నీ చెబుతూ ఉండేవారు. కానీ ఆ కుర్రాడు మాత్రం డిగ్రీ అయ్యేంత వరకు సినిమాల గురించి ఏమీ ఆలోచించుకోదల్చుకోలేదు అనేవాడు. ఆ కుర్రాడు రెండు సంవత్సరాల తరువాత సినీరంగ ప్రవేశం చేసి దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంలో ప్రకంపనాలు కలిగించి, ప్రభంజనాలు సృష్టించారు. అతనే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారు. ఎన్టీఆర్ సినిమా రంగ ప్రవేశం చేసిన తరువాత పది సంవత్సరాల పాటు గౌరీనాథ శాస్త్రి గారు సినీరంగంలో కొనసాగినప్పటికీ ఇద్దరు కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. కానీ జంధ్యాల గౌరినాథ శాస్త్రి గారు నటించిన రెండవ, మూడవ సినిమాలు “భీష్మ” మరియు “మాయా మశ్చీంద్ర” రెండు సినిమాలు కూడా ఎన్టీఆర్ హీరోగా ఆ తరువాత దశాబ్దంలో పునర్నిర్మాణం జరిగాయి.
నిర్మాతగా నిరాశపరిచిన తొలిచిత్రం “గీతాంజలి”…
జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు “మహారథి కర్ణ” సినిమా ఆలోచనలు మానుకొని జంధ్యాల గౌరినాథ శాస్త్రి గారు మరొక సాంఘిక చిత్రం నిర్మిద్దాం అనుకున్నారు. మరో రెండేళ్ల తర్వాత జంధ్యాల గౌరినాథ శాస్త్రి గారు “శ్యామల ఫిలిమ్స్” అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి “గీతాంజలి” అనే సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. 1947 వ సంవత్సరంలో చిత్రీకరణ జరుపుకొని 09 మార్చి 1948 శివరాత్రి రోజున “గీతాంజలి” చిత్రం విడుదలైంది. అప్పటికే మహాత్మా గాంధీ గారు హత్యకు గురై నెల రోజులు దాటింది. ఆ సినిమాలో “రఘుపతి రాఘవ రాజారాం”, “వైష్ణవ జయతే” అనే పాటలు ఆ సినిమాలో చేర్చారు. ఈ విషయాన్ని కూడా ప్రచార ప్రకటనలో ప్రముఖంగా వాడుకున్నారు. జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు కథనాయకుడు, పూర్ణిమ కథానాయకి, శ్రీరంజని మరొక ప్రధాన పాత్రలో నటించారు.
“గీతాంజలి” సినిమాను దర్శకులు “తంగిరాల హనుమంతరావు” గారు నిర్మించారు. సినిమా విడుదలకు వారం రోజుల ముందు పత్రికలో ప్రకటనలు ఇచ్చారు. నవీనమైన గాథ, అపూర్వమైన సంగీతం, అసదృశ్యమైన తెలుగు సాంఘిక చిత్రం అని పత్రికా ప్రకటనలో అన్నారు. కానీ “గీతాంజలి” సినిమాను ప్రేక్షకులు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏది ఏమైనా జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారి మొట్టమొదటి సినిమా గీతాంజలి భారీగా నష్టాన్ని చవిచూసింద. కొంత ఆస్తిని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు తన కుమార్తెలిద్దరికీ వివాహం చేశారు. పెద్ద కుమార్తె సుశీలకు గుడివాడకు చెందిన డాక్టరు రాధాకృష్ణమూర్తి గారితోను, రెండో కుమార్తె శకుంతలను నండూరుకు చెందిన తాడేపల్లి నరసింహమూర్తి గారితోను వివాహం జరిపించారు.
నష్టాల ఖాతా పెంచిన చిత్రం “ఆకాశరాజు”…
ఒక సినిమాలో దెబ్బతిన్నా కానీ రెండో సినిమా ప్రయత్నాలు ఆపలేదు. 1950 ప్రాంతాల్లో జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు భార్యతో కలిసి మద్రాసుకు మకాం మార్చారు. ఆ రెండో చిత్రం “ఆకాశరాజు”. ఆ బ్యానర్ పేరు త్రిమూర్తి ఫిల్మ్స్ అని పెట్టారు. అద్దంకి శ్రీరామమూర్తి, సి.ఎస్.ఆర్ లాంటి బాగా పేరున్న నటులే నటించారు. ఆ తర్వాత రోజుల్లో ప్రముఖ గుణచిత్ర నటులు, రచయిత ఆయన రావికొండల రావు గారి సొంత అన్నయ్య ఆర్.కె.రావు గారు ఈ చిత్రంలో ప్రధాన హాస్య పాత్ర పోషించారు. ఆ సినిమాకు జ్యోతిష్ సిన్హా దర్శకులు. ప్రధాన పాత్రలో దుర్మార్గుడైన రాజుగా జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు నటించారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు స్క్రిప్టు సమకూర్చిన ఏకైక చిత్రం ఈ “ఆకాశరాజు”. ఈ చిత్రం 16 ఫిబ్రవరి 1951 నాడు విడుదల అయ్యింది. జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు చేసిన రెండో ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. “ఆకాశరాజు” చిత్రం కూడా నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. ఆయన నష్టాల ఖాతా మరింత పెరిగిపోయింది.
“పెద్ద మనుషులు” సినిమా…
“ఆకాశరాజు” చిత్రం తరువాత జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారిని ఈరోజుకు కూడా గుర్తుంచుకునేలా చేసిన సినిమా “పెద్దమనుషులు”. ఆయనకు ఇందులో ప్రధాన పాత్ర అవకాశం వచ్చింది. ఈ చిత్ర దర్శకులు కె.వి. రెడ్డి గారు. ఇందులో గౌరీనాథ శాస్త్రి గారికి ప్రధాన పాత్ర లభించడానికి ఒక పెద్ద కథ ఉంది. జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారి మామగారు తుములూరు నాగభూషణం గారు గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఒకరోజు తాను మంగళగిరిలో ఒక దేవాలయానికి వెళ్లారు. ఆ దేవాలయం ఎదురుగా ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. చూడడానికి ఆమె తనలో తాను ఏదో మాట్లాడుకుంటుంది అనుకున్నట్టుగా ఉంది. ఆమెను పలకరించిన నాగభూషణం గారు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. కొంచెం నెమ్మదిగా వివరాలు సేకరించిన మీదట ఆమె కె.వి.రెడ్డి గారి తల్లి అని తెలుసుకున్నారు. అప్పుడు నాగభూషణం గారు కె.వి.రెడ్డి గారికి ఫోన్ చేసి పిలిపించి వాళ్ళమ్మ గారిని అప్పగించారు.
అప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూ కె.వి.రెడ్డి గారు తనకు ఏ సహాయం కావాలన్నా అడగండి అని చెప్పారు. అప్పుడు “నాకు ఏమి సహాయం వద్దండీ, మా అల్లుడు జంధ్యాల గౌరినాథ శాస్త్రి గారు మీ మొట్టమొదటి సినిమాలో నటించారు రెండు సినిమాలు నిర్మించి చాలా పోగొట్టుకున్నారు. తనకు మళ్ళీ సినిమాల్లో అవకాశం వస్తే బాగుండు. మీరు తనకు సినిమాల్లో అవకాశం ఇప్పించండి” అని అడిగారు. దాంతో తాను తీయబోయే పెద్దమనుషులు చిత్రానికి ప్రధాన పాత్రకు జంధ్యాల గౌరి నాథ శాస్త్రి గారిని ఖరారు చేశారు కె.వి.రెడ్డి గారు. పాతాళభైరవి చిత్రం విజయవంతమైన తరువాత కె.వి.రెడ్డి గారి నిర్ణయాలను ప్రశ్నించడానికి ఎవ్వరికీ ధైర్యం చాలేది కాదు.
పెద్ద మనుషులు చిత్రానికి కూడా నిర్మాతగా కె.వి.రెడ్డి గారి పేరు వేశారు. నాగభూషణం గారు చెప్పారనే కాకుండా జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారి నటన సామర్థ్యం మీద కె.వి.రెడ్డి గారికి ఉన్న నమ్మకంతో కూడా పెద్ద మనుషులు చిత్రంలో ప్రధాన పాత్రకు తీసుకున్నారు అని డి.వి నరసరాజు గారు తన ఆత్మకథలో వ్రాసుకున్నారు. 1951 చివర్లో నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభమైతే రెండున్నర సంవత్సరాల తరువాత 11 మార్చి 1954 నాడు ఈ సినిమా విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయంలో జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారికి అధిక శాతం ఘనత దక్కింది. తన మొదటి చిత్రం భక్త పోతన తరువాత మళ్లీ పదకొండు సంవత్సరాలకు కె.వి.రెడ్డి గారి “పెద్ద మనుషులు” చిత్రంలో నటించడం, ఆ సినిమా కూడా మంచి చిత్రాల జాబితాలో చేరడం గమనించదగ్గ విషయం.
భలే రాముడు సినిమా…
“పెద్ద మనుషులు” సినిమా జరుగుతుండగానే జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు అంతకుముందు నిర్మించిన “గీతాంజలి” సినిమాను మార్పులు చేర్పులు చేసి విడుదల చేద్దామని అనుకున్నారు. దానికి కె.వి.రెడ్డి గారు సాయం చేశారు. కానీ గీతాంజలి చిత్రాన్ని మళ్లీ విడుదల చేద్దాం అనుకున్న గౌరీ నాథ శాస్త్రి గారి ప్రయత్నాలు ఫలించలేదు. జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు “పెద్దమనుషులు” సినిమా నిర్మాణ సమయంలో (జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారి వివాహం అయ్యి పాతిక సంవత్సరాలకి) 1953 వ సంవత్సరంలో మూడవ కుమార్తె జన్మించింది. ఆమెకు ఇందిరా అని పేరు పెట్టుకున్నారు. “పెద్దమనుషులు” సినిమా విడుదలైన తరువాత జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారికి మరొక సినిమాలో నటించడానికి అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు “భలే రాముడు”. అక్కినేని, సావిత్రి నాయకా, నాయికలు. అప్పటికే “దేవదాసు” లాంటి విజయవంతం అయిన చిత్రానికి దర్శకత్వం వహించిన “వేదాంతం రాఘవయ్య” గారు “భలే రాముడు” చిత్రానికి దర్శకత్వం వహించారు. కథానాయిక తండ్రి పాత్రలో జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు నటించారు. 06 ఏప్రిల్ 1956లో విడుదలైన ఈ సినిమా పర్వాలేదు అనిపించింది.
మరణం…
జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారికి అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో సినిమాలలో తప్పనిసరిగా నటించాల్సిన అవసరం ఏర్పడింది. “భలే రాముడు” సినిమా అయిపోగానే ఆయనకు రెండు సినిమాలలో అవకాశం వచ్చింది. ఒకటి శ్రీరామాంజనేయ యుద్ధం, రెండోది భక్త రామదాసు. శ్రీ రామాంజనేయ యుద్ధంలో హనుమంతుడి పాత్రకు జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారిని ఎంపిక చేశారు. మరో సినిమా “భక్త రామదాసు” లో రామదాసు తర్వాత అత్యంత బలీయమైన కబీరు పాత్రకు జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారిని ఎన్నుకున్నారు. ఇంతలోనే గౌరీ నాథ శాస్త్రి గారికి ఆరోగ్యం కాస్త దెబ్బతింది.
దాంతో ఆయన మధ్య మధ్యలో గుడివాడ లోని తన పెద్దమ్మాయి సుశీల గారి ఇంటికి వెళుతుండేవారు. డాక్టరు రాధాకృష్ణమూర్తి గారు రక్త పరీక్షలు చేసి మధుమేహం వ్యాధి ఉందని చెప్పి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని సూచించారు. తన ఆరోగ్యం మీద ఎంతో నమ్మకం ఉంచుకొన్న గౌరీ నాథ శాస్త్రి గారు తన అల్లుడుగారు చెప్పిన సలహాలను సీరియస్ గా తీసుకోలేదు. అనారోగ్యం తీవ్రతరం అవుతుండటంతో జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారిని గుడివాడ తీసుకురాక తప్పలేదు. టి.బి. కూడా వచ్చిందేమోనని కుటుంబ సభ్యుల సందేహం. అలా అనారోగ్యంగా ఉంటూనే తన పెద్దమ్మాయి ఇంట్లో 24 ఫిబ్రవరి 1958 రాత్రి కన్నుమూశారు జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు.
చిన్న వయస్సులో మరణం…
జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు మరణించే నాటికి తనకు 54 సంవత్సరాల వయస్సు కూడా నిండలేదు. ఆనాటి జీవన ప్రమాణాలతో పోలిస్తే తనది చిన్న వయస్సు అని చెప్పుకోవాలి. ఆ తరువాత రోజు వచ్చిన దినపత్రికలలో గౌరీనాథ శాస్త్రి గారి మరణ వార్తను ఇలా ప్రచురించారు. జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు హృద్రోగంతో మరణించారు. వారి వయస్సు 54 సంవత్సరాలు. వీరికి 95 సంవత్సరాలు గల తల్లి, భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు” అని ఆంధ్ర దిన పత్రికలో వ్రాశారు. ఆయన మరణించిన రెండు రోజులకు మద్రాసులో చిత్తూరు నాగయ్య గారు, ముదిగొండ లింగమూర్తి గారి ఆధ్వర్యంలో నాగయ్య గారి ఫిలిం కంపెనీలో సంతాప సభ జరిగింది. జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు నటించినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ జంధ్యాల గౌరి నాథ శాస్త్రి గారు చిత్ర పరిశ్రమలో సంపాదించుకున్న గౌరవానికి ఆ నివాళి సభ చక్కటి ఉదాహరణ. ఆయన మరణించే నాటికి తన చిన్న కుమార్తె వయసు నాలుగు సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాత వారి బాగోగులన్నీ గౌరి నాథ శాస్త్రి మామగారు తుములూరు నాగభూషణం గారు చూసుకున్నారు. గౌరి నాథ శాస్త్రి గారి సతీమణి సీతారామమ్మ గారు 2002 సంవత్సరం వరకు కూడా జీవించి ఉన్నారు.
ముగింపు…
జంధ్యాల గౌరి నాథ శాస్త్రి గారు మరణించే నాటికి ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న రెండు సినిమాలు చిత్రీకరణ మధ్యలో ఉన్నాయి. శ్రీరామాంజనేయ యుద్ధం, భక్త రామదాసు. ఆ రెండింటిలో ఆయన ధరించిన ప్రధాన పాత్రలు చాలా కీలకమైనవి. మధ్యలో ముగించడానికి వీలయ్యే పాత్రలు కావు. అందుకని ఆ రెండు సినిమాలలో కూడా జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు నటించిన భాగాలన్నింటిని వేరే నటులతో పునః చిత్రీకరణ చేయాల్సిన అవసరం వచ్చింది. శ్రీ రామాంజనేయ యుద్ధం సినిమాలో జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారు ధరించిన హనుమంతుడి పాత్రకు రాజనాల గారిని తీసుకున్నారు. భక్త రామదాసు చిత్రంలో కబీరు పాత్రలో గౌరీ నాథ శాస్త్రి గారికి బదులుగా గుమ్మడి గారిని తీసుకున్నారు.
శ్రీ రామాంజనేయ యుద్ధం 1958 లోనూ, భక్త రామదాసు చాలా ఆలస్యంగా 1964 లోను విడుదలయ్యాయి. గౌరీ నాథ శాస్త్రి గారు నిర్మించిన రెండు చిత్రాలు ఆయనను ఆర్థికంగా దెబ్బతీయకపోయి ఉంటే, ఆయన అంత చిన్న వయస్సులో మరణించకుండా ఉండి ఉంటే తాను మరిన్ని మంచి పాత్రలలో ఆయనను చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు ఉండి ఉండేది. ఇప్పటికీ కూడా తెలుగు సినిమా స్వర్ణ యుగంలో కె.వి.రెడ్డి గారి దర్శకత్వ జీవితంలో మంచి చిత్రాల జాబితా చెప్పండి అంటే అందులో “భక్త పోతన”, “పెద్దమనుషులు” చిత్రాలకు స్థానం లభిస్తుంది. ఆ రెండు చిత్రాల ప్రసక్తి వచ్చినంత కాలం చక్కటి సహజ నటులు జంధ్యాల గౌరీ నాథ శాస్త్రి గారి పేరు కూడా గుర్తుండిపోతుంది.