HEALTH & LIFESTYLE

శలభాసనంతో నడుము నొప్పికి చెక్!

ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ ఫుడ్‌తో పాటు వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి అవసరం చాలా ఉంది. ప్రతిరోజు ఆసనాలు వేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అధిక బరువులెత్తడం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్ను సమస్యలు అధికమవుతున్నాయి. సులభంగా చేయగలిగే శలభాసనంతో వెన్నుకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆసనం వేసినప్పుడు మనిషి ఆకృతి మిడత ఆకారంలో ఉంటుంది. దీన్ని శలభాసనం అంటారు.

డైలీ ఈ ఆసనం వేస్తే వెన్నులో డిస్క్‌లు పక్కకు జరిగిన వారికి ఆపరేషన్ లేకుండానే కోలుకోవచ్చు. ఈ ఆసనం బిగుసుకుపోయిన వెన్నుముకను సరి చేస్తుంది. శలభాసనంతో వెన్ను, నడుము నొప్పుల నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది. శలభాసనం మూత్రకోశ సమస్యలు నివారిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరిచి.. జీర్ణశక్తి పెరుగుతుంది.  

శలభాసనం ఎలా వేయాలి ?

నేల మీద రెండు కాళ్లూ చాచి బోర్లాపడుకోవాలి. ముఖం నేలమీద వాల్చి చేతులు వెనుకకు చాపాలి. ఊపిరి వదిలి, తల, ఛాతీ, కాళ్లు ఒకసారి వీలైనంత పైకి ఎత్తాలి. పక్కటెముకలు గానీ, మోచేతులు గానీ నేల మీద ఆనకుండా కేవలం పొట్ట మాత్రమే నేల మీద ఉండి శరీరం బరువునంతా మోస్తూ ఉండాలి.

పిరుదు కండరాలను సంకోచింపచేసి, తొడల దగ్గర కండరాలను సాగతీయాలి. రెండు కాళ్లను పూర్తిగా చాపి ఉంచాలి. తొడల దగ్గర మోకాళ్లు, చీల మండలాలు తాకుతూ ఉండాలి.

శరీరం బరువును చేతుల మీద మోపకూడదు. ఈ స్థితిలో ఒకటి రెండు నిముషాలు ఉండాలి, శ్వాసక్రియ మామూలుగానే ఉండాలి.

ప్రారంభంలో ఛాతీని, కాళ్లను పైకి ఎత్తడం కష్టమనిపించినా కొన్నాళ్ల సాధన తరువాత అది సులువవుతుంది.

నడుము కింద నొప్పి ఎక్కువగా ఉన్నవారు ఈ ఆసనంలో కాళ్లను వెనుకకు ముడుచుకోవాలి. తొడలను ఎడం చేసి నేలకు నిలువుగా ఉండాలి.

గమనిక: గర్భిణులు, పొత్తి కడుపులో అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు.

Show More
Back to top button