CINEMATelugu Cinema

తెలుగు సినీ పరిశ్రమలో దాన కర్ణుడు.. మందాడి ప్రభాకర రెడ్డి…

పంతొమ్మిది ఏళ్ల కుర్రాడు హైదరాబాదు నుండి బొంబాయి  వెళుతున్న రైలు బండిలో కూర్చుని కలలు కంటున్నాడు. తనకు హిందీ బాగా వచ్చు. తాను బొంబాయి చేరుకోగానే పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు పూలమాలలు పట్టుకుని స్వాగతం పలుకుతారు. తాను ఒక హోటల్ గదిలో బసచేస్తాడు. నాలుగు రోజులు ఉండి నలుగురు దర్శకులు చూస్తే నాలుగు సినిమా అవకాశాలు రావచ్చును. సినిమా అవకాశాలు వస్తే హోటల్ గదులు ఖాళీ చేసి ఏ “మెరీన్ డ్రైవ్” లోనో ఫ్లాట్ తీసుకోవచ్చును. స్టేషనులో బండి ఆగగానే అతను మళ్ళీ మామూలు ప్రపంచంలోకి వచ్చిపడ్డాడు. ఉత్సాహంగా నవ్వుకున్నాడు. విక్టోరియా టర్మినల్ లో బండి ఆగగానే అంత ఉత్సాహంతో దిగి హోటల్ ఎక్కడుందో కనుక్కొని ఒక పెట్టేసుకొని అక్కడికి చేరినాడు. హిందీలో ప్రావీణ్యం ఉండడంతో హైదరాబాదులో ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ కుర్రాడు రాత్రికి రాత్రి బొంబాయి వెళ్ళిపోయి అక్కడ చిత్రాల్లో నటించేద్దామని అనుకున్నాడు.

దాంతో తాను ఎవ్వరికీ చెప్పకుండా చేయకుండా ఉన్న డబ్బులు పట్టుకుని మర్నాడు బొంబాయి ప్రయాణం కట్టాడు. తాను బొంబాయిలో ఉన్న వారం రోజులు దర్శక, నిర్మాతలను కలుద్దామని స్టూడియోలు చుట్టేస్తున్నాడు. తిరగగా తిరగగా ద్వార పాలకుల దయవల్ల అతనికి ఇద్దరు దర్శకులు దర్శనమిచ్చారు. “ఇప్పుడు నువ్వు కుర్రవాడివి. నువ్వు కొన్నాళ్ళు పోయాక ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ మాత్రం ఉండకు అని ఆ దర్శకులు ఆ అబ్బాయితో అన్నారు. వాళ్ళు, వాళ్ళ మాటంటే విశ్వాసం కలవాడు కాబట్టి ఆ కుర్రాడు అక్కడ ఉండలేదు. అక్కడి నుండి తిరిగి హైదరాబాదుకు వచ్చేసి బుద్ధిమంతుడల్లే మళ్లీ చదువుకుని డాక్టరు అయ్యాడు. తానే నటులు ప్రభాకర రెడ్డి గారు.

ప్రభాకర రెడ్డి గారిది విలక్షణ గాత్రం, విలక్షణ నటన. తనవి విలక్షణ కథలు, విలక్షణ పాత్రలు. పౌరాణికాలు కావొచ్చు, జానపదాలు కావొచ్చు, సాంఘికాలు, చారిత్రకాలు, కౌబాయ్ పాత్రలు వుండొచ్చు , జేమ్స్‌బాండ్, అభ్యుదయా భావాలు, విప్లవ భావాలు అన్ని పాత్రలతో ప్రభాకర రెడ్డి గారు ప్రేక్షకులను మెప్పించారు. ప్రభాకర్ రెడ్డి గారు గుత్తా రామినీడు  గారు దర్శకత్వం వహించిన “చివరకు మిగిలేది” చిత్రంతో చిత్రసీమకు పరిచయం అయ్యారు. స్వతహాగా డాక్టరు అయిన ప్రభాకర రెడ్డి గారు తన తొలి సినిమాలో కూడా డాక్టరు (సైకియాట్రిస్ట్‌గా) పాత్రలోనే నటించారు. ఆ తర్వాత మూడు దశాబ్దాల్లో దాదాపు 500 పైగా సినిమాలలో నటించారు. ప్రభాకర రెడ్డి గారు దాదాపు 21 తెలుగు సినిమాలకు కథలు వ్రాశారు. వాటిలో కొన్ని అత్యంత విజయవంతమయ్యాయి. వాటిలో పండంటి కాపురం , పచ్చని సంసారం , ధర్మాత్ముడు , గృహప్రవేశం , గాంధీ పుట్టిన దేశం , కార్తీక దీపం మరియు నాకు స్వతంత్రం వచ్చింది మొదలైనవి. ప్రభాకర రెడ్డి గారు కామ్రేడ్ (1996) చిత్రానికి రచన చేయడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో నటసార్వభౌముడుగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారకరామారావు గారు దర్శకుడిగా, నిర్మాతగా కూడా బహుముఖ ప్రజ్ఞ కనబర్చడమే కాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటులను కూడా పరిచయం చేశారు. తాను పరిచయం చేసిన ఎంతో మంది నటులు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ గారి హయాంలో చిత్రపరిశ్రమకు పరిచయం అయిన వారిలో డాక్టరు మందడి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకరు. నందమూరి తారకరామారావు గారు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వార్తలు వ్రాస్తూ ప్రజల్లోకి పంపేవారు.

అంతే కాకుండా అన్న గారికి వ్యతిరేకంగా “మండలాధీశుడు” అనే సినిమాను కూడా ప్రభాకరరెడ్డి గారు తీయడం గమనార్హం. ఈ సినిమా కోసం తనకు నటులు కృష్ణ గారు కూడా పూర్తి సహకారాన్ని అందించారు. నందమూరి తారకరామారావు గారు తాలూకా వ్యవస్థను తీసుకువచ్చారు. ఇప్పుడు వీటిని నియోజకవర్గాలు అంటున్నారు.ఈ క్రమంలోనే ఇక ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించిన ప్రభాకర్ రెడ్డి గారు కథ సిద్ధం చేసి సినిమాను కూడా రూపొందించారు. ఆ సినిమా అప్పట్లో అఖండ విజయం కూడా సాధించింది. ఆ తరువాత ప్రభాకర రెడ్డి గారికి, నందమూరి గారికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇది అప్పట్లో చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారిపోయింది.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    మందాడి ప్రభాకర రెడ్డి 

ఇతర పేర్లు  :  ఎం. ప్రభాకర రెడ్డి  

జననం    :     08 అక్టోబరు 1935    

స్వస్థలం   :    తుంగతుర్తి, సూర్యాపేట జిల్లా, తెలంగాణ

వృత్తి      :     నటుడు, రచయిత, వైద్యుడు 

తండ్రి    :     లక్ష్మారెడ్డి 

తల్లి     :     కౌసల్య

విద్య    :      వైద్యవిద్య

జీవిత భాగస్వామి :  సంయుక్త 

పిల్లలు  :     గంగ, శైలజ, లక్ష్మి, విశాలాక్షి 

మరణం  :   26 నవంబరు 1997, 

హైదరాబాదు , తెలంగాణ , భారతదేశం..

నేపథ్యం…

మందాడి ప్రభాకరరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం లోని సూర్యాపేట జిల్లా, తుంగతుర్తిలో లక్ష్మారెడ్డి, కౌసల్య దంపతులకు 08 అక్టోబరు 1935 నాడు జన్మించారు. మందాడి లక్ష్మారెడ్డి, కౌసల్యాదేవి దంపతులకు ప్రభాకర రెడ్డి గారు రెండో సంతానం. ప్రభాకర రెడ్డి నాన్న గారు తుంగతుర్తి చుట్టుపక్కల 40 గ్రామాలకు దొర. లక్ష్మారెడ్డి గారికి ఐదుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. ప్రభాకర రెడ్డి గారి చదువు ఏడవ తరగతి వరకు అటు ఇటు గానే సాగింది. ఎందుకనగా అప్పుడే అక్కడ రజాకార్ల తిరుగుబాట్లు జరుగుతుండేవి. తాను పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు అతని హుషారు, ఉత్సాహం చూసి పెద్దవాళ్ళు తనని బుర్రకథలు నాటకాలలో పెట్టించారు. తాను బుర్రకథలు, రాజకీయం చెప్పి రంజింప చేసేవారు. ప్రభాకర్ రెడ్డి గారు బుర్రకథల నుండి నాటకాల లోకి వచ్చారు. వాళ్ళ ఊర్లోని పాఠశాల అభివృద్ధికి డబ్బు కావలసినప్పుడు అతను నాటకాలు ప్రదర్శించి ఆ డబ్బును పాఠశాల అభివృధికి వినియోగింపజేశారు.

బాల్యం…

ప్రభాకర రెడ్డి గారు 1953లో మెట్రిక్ పాసయ్యారు. ఆ తరువాత తాను హైదరాబాదు సిటీ కళాశాలలోకి ప్రవేశించారు. కళాశాలకు రాగానే అతని ఉత్సాహం మరింత పెరిగిపోయింది. అక్కడ నాటకాలు, వక్తృత్వ పోటీలు నిర్వహించేవారు. దాంతో తన ప్రతిభను నిరూపించుకోవడం కోసం నాటకాలు బాగా వేయడం మొదలుపెట్టారు. వక్తృత్వపోటీలలో పాల్గొని బహుమతులు కూడా గెలుచుకునేవారు. వీటి ద్వారా ప్రభాకర్ రెడ్డి గారికి కళాశాలలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ మంచి పేరుతో అతను కళాశాలకు కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. అంతర్ కళాశాలల నాటక పోటీలలో పాల్గొంటూ  బహుమతులు, మెప్పులు కూడా దక్కించుకున్నారు.

ప్రభాకర రెడ్డికి గారికి సినిమాలలో నటించాలనే ఉద్దేశం అప్పటికి అంత బాగా పాదుకోకపోయినా ఇతర విద్యార్థులు, పెద్దవాళ్లు మాత్రం తనని ప్రోత్సహించేవారు. ఇలా ఒకవైపు చదువు, నాటకాలు కొనసాగిస్తూనే సినిమా దర్శకులకు, నిర్మాతలకు ఫోటోలు పంపుతూ ఉత్తరాలు వ్రాయసాగాడు. అయితే ఫలితం మాత్రం దక్కలేదు. ప్రభాకర్ రెడ్డి గారు ఇతర విద్యార్థుల్లో కెల్లా  కాస్త భారీగా కావడం వలన అతనికి వయస్సు మళ్ళిన పాత్రలను ధరించేవాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు, ఎస్వీ రంగారావు గార్లను ఆదర్శంగా పెట్టుకుని, వారు నటిస్తున్న చిత్రాలను చూస్తూ వారిలాగా నటించాలని చాలా తాపత్రయపడేవారు.

సినీ రంగ ప్రవేశం….

ప్రభాకర రెడ్డి గారు తన ఇంటర్మీడియట్ పూర్తవ్వగానే ఉస్మానియా వైద్య కళాశాలలో చేరారు. కళాశాలలో చేరిన దగ్గర నుండి తాను చదువును, ఇతర కార్యకలాపాలను ఒక్కలాగే చూడసాగారు. ప్రతీ సంవత్సరం జరిగే ఆంధ్రాభ్యుదయ ఉత్సవాలకు కార్యదర్శి గా పనిచేసి ఉత్సవాలను హుషారుగా, జయప్రదంగా జరిపించేందుకు కృషి చేసేవారు. అంతే హుషారుగా నాటకాలలో కూడా నటిస్తూ తన ఉనికిని చాటేవారు. మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతుండగా ఒక సంఘటన జరిగింది. ఆంధ్రాభ్యుదయ ఉత్సవాల్లో ప్రదర్శించిన 40, 50 నాటికలు ప్రదర్శింపబడేవి.

వాటికి జడ్జిలు ఉండేవారు, బహుమతులు నిర్ణయించేవారు. ప్రభాకర రెడ్డి గారు మెడిసిన్ నాలుగో సంవత్సరంలో ఉండగా జడ్జీలుగా వచ్చిన వారిలో ఇద్దరు సినిమా దర్శకులు కూడా ఉన్నారు. వారు తాపీ చాణక్య, రామినీడు గార్లు బహుమతులు ఇవ్వడమే కాకుండా, రామినీడు గారు మరో చిత్రమైన బహుమానం కూడా పెట్టారు. ఆ బహుమతి పొందిన వారికి విధిగా సినిమా అవకాశం కూడా కలగచేస్తానని హామీ ఇచ్చారు. ఇంకేముంది ప్రతీ ఒక్కరూ ఆ చిత్ర బహుమతి కోసమే ప్రయత్నం చేశారు. కానీ ఆ బహుమతిని ప్రభాకర్ రెడ్డి గారు దక్కించుకున్నారు. ఆ బహుమతి పొందడానికి తాను ఎంతో కృషి చేశారు.

తొలి సినిమా “చివరకు మిగిలేది”.. 

ఫలితాలు తెలిపిన రోజున ప్రభాకర రెడ్డి గారికి ఆనందానికి అవధులు లేవు. ఆ అవకాశం తనని వరించింది. ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న అవకాశం ఈ రకంగా వచ్చినందుకు తాను మురిసిపోయారు. అప్పుడు రామినీడు గారు “మా ఇంటి మహాలక్ష్మి” సినిమా తీస్తున్నారు. ఇది హైదరాబాదులోనే చిత్రీకరణ చేస్తున్నందు వల్ల ప్రభాకర రెడ్డి గారూ తరచూ స్టూడియో కు వెళ్లి చిత్రీకరణ వ్యవహారాలు చూసేవారు. తన తర్వాత చిత్రంలో వేషం ఇస్తానని రామినీడు గారు ప్రభాకర రెడ్డి గారికి మాట ఇచ్చారు. తాను మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండగానే అతనికి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. రామినీడు గారి “చివరికి మిగిలేది” లో ప్రభాకర రెడ్డి గారికి మంచి పాత్ర ఇచ్చారు. కొంత చిత్రీకరణ అయిన తర్వాత మళ్ళీ ప్రభాకర రెడ్డి గారు వెళ్లి చదువు పూర్తి చేసారు.

బి.ఏ. సుబ్బారావు “భీష్మ”… 

1960లో ప్రభాకర రెడ్డి గారి పేరు పెరిగింది. అతని పేరుతో పాటు ఎం.బీ.బీ.ఎస్ అనే అక్షరాలు కూడా వచ్చి చేరాయి.  “చివరకు మిగిలేది” లో నటించడానికి వచ్చినప్పుడు మొదట తనకు బాగా భయం కలిగింది. ఎందువలన అనగా ఆరోజు సెట్ లో సావిత్రి గారి ప్రక్కన నటించవలసి వచ్చింది. సావిత్రి, రామిరెడ్డి గార్లు ప్రభాకర రెడ్డి గారికి బాగా ధైర్యం చెప్పి ఉత్సాహం కలిగించారు. దాంతో తాను మొదటి టేక్ ఓకే చేశాడు. “చివరికి మిగిలేది” చిత్రంలో ప్రభాకర్ రెడ్డికి మంచి పేరు వచ్చింది. మంచి నటుడు వచ్చారని పత్రికలు వ్రాశాయి, ప్రజలు కూడా అదే మాట అన్నారు. ఈ చిత్రం తర్వాత అతను తన ఊరు వెళ్లి పోయారు. బి.ఏ.సుబ్బారావు గారి “భీష్మ” చిత్రంలో శాంతనుడి పాత్ర ఎవరికి ఇద్దామనుకుంటూ ఉండగా చాణక్య గారు ప్రభాకర రెడ్డి గారి పేరు సూచించారు.

ప్రభాకర రెడ్డి గారికి టెలిగ్రామ్ వెళ్ళింది. దాని అందుకున్న ప్రభాకర రెడ్డి గారు మద్రాసుకు ప్రయాణం కట్టారు. సుబ్బారావు గారు అతనికి మేకప్ టెస్ట్ చేసి చూసి శాంతనుడు పాత్రను నిర్ణయించారు. అది అతని రెండో పాత్ర. ఈ చిత్రం జరుగుతూ ఉండగానే అతనికి “తండ్రులు కొడుకులు” చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ చిత్రంలో ప్రభాకర రెడ్డి గారు దుష్ట భూమికను ధరించి నేర్పుగా నిర్వహించాడు. “మహామంత్ర తిమ్మరసు”, “కలిమిలేములు”, “సిరిసంపదలు”, “రక్తసంబంధం”, “వేములవాడ భీమకవి”, “శ్రీకృష్ణార్జునయుద్ధం”  తదితర చిత్రాలలో ప్రభాకర రెడ్డి గారు నటించారు. డాక్టర్ ప్రభాకర రెడ్డి గారికి డాక్టర్ అనిపించుకుందామనే కోరిక లేదు. అందుకనే అతను ఆవృత్తికి, ఆ పదానికి కూడా స్వస్థి చెప్పారు.

విలనిజానికి చిరునామా…

ఒకానొక దశలో తెలుగు సినిమాలలో ప్రతినాయకుడు అంటే ప్రభాకర రెడ్డి గారే గుర్తొచ్చేవారు. తన తరువాత పరిశ్రమకు వచ్చిన సత్యనారాయణ, త్యాగరాజు వంటి వారి కలయికలో కూడా తాను అద్భుతంగా నటించారు. ఈ నేపథ్యంలో ప్రభాకర రెడ్డి గారు “పునర్జన్మ” (1963), “దొరికితే దొంగలు” (1965), “మోసగాళ్లకు మొనగాడు”, “రక్తసింధూరం”, “ఉమ్మడి కుటుంబం” (1960), “కంచుకోట” (1967), “మాతృదేవత”, “జగత్ కిలాడీలు” (1967), “మారిన మనిషి” (1970), “రామాలయం” (1971),  “నిజరూపాలు”, “అమ్మ మాట”, “కూతురు కోడలు”, “కిలాడి బుల్లోడు” (1972), “ఒక నారి వంద తుపాకులు”, “దేశోద్ధారకులు” (1973), అల్లూరి సీతారామరాజు”, “కన్నవారి కలలు”, “అందరూ దొంగలే”, “నిప్పులాంటిమనిషి” (1974),  “కథానాయకుని కథ” (1975), “గోరింటాకు”, “యుగంధర్”, “సంఘం మారాలి” (1979), “గురు”, “రాముడు పరుశ రాముడు” (1980), “ఆయన కలియుగ దైవం”, “సంఘర్షణ” (1983) తదితర చిత్రాలలో దుష్ట పాత్రల పోషణలో ఒక ఒరవడితో విలక్షణ నటనాశైలితో తనదైన ఒక శకాన్ని నెలకొల్పారు ప్రభాకర రెడ్డి గారు.

గుణ చిత్ర నటులుగా….

ప్రభాకర్ రెడ్డి గారు కేవలం ప్రతినాయక పాత్రలకే పరిమితం కాకుండా, సగటు ప్రేక్షకుడితో సానుభూతి పొందే గుణచిత్ర పాత్రలు కూడా అద్భుతంగా పోషించి మెప్పించారు. ప్రభాకర్ రెడ్డి గారు “హరిశ్చంద్రుడు”, “నాకు స్వతంత్ర్యం వచ్చింది” (1975), “పండంటి కాపురం”, “రెండు కుటుంబాల కథ”, “తీర్పు” (1975) చిత్రాలలో నటించారు. “మట్టిలోమాణిక్యం” లో భానుమతి గారికి భర్త గా, “ముందడుగు” (1973) లో బీదవాడిగా వీధుల్లో అడుక్కునే పాత్ర మరుపురానిది. “చిన్న కోడలు” (1990) సినిమాల్లో తమిళంలో శివాజీ గణేషన్ పోషించిన మామ పాత్రను ప్రభాకర రెడ్డి గారు చాలా గొప్పగా పోషించారు. అలా సహాయ నటుడి పాత్ర పోషణ లోనూ చక్కని ప్రతిభ ను కనబరిచిన వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు పౌరాణిక చిత్రాలలో సైతం మెప్పించారు. 1961లో బి.ఏ.సుబ్బారావు గారు తీసిన “భీష్మ” చిత్రంలో శాంతనుడు గా, “నర్తనశాల” (1963), “సరస్వతి శపథం” లో (1966) బ్రహ్మగా, “శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహత్యం” (1980), “శ్రీ కృష్ణావతారం” చిత్రంలో బలరాముడుగా, ఇంకా ధర్మరాజు వంటి అనుకూల పౌరాణిక పాత్రలలో గొప్పగా నటించి ఏ పాత్రనైనా అవలీలగా పోషించి మెప్పించగలరని నిరూపించగలిగారు ప్రభాకర రెడ్డి గారు.

రచయిత, దర్శక నిర్మాతగా…

ప్రభాకర్ రెడ్డి గారు కేవలం నటనకే పరిమితం కాలేదు. సుమారు 20 చిత్రాలకు కథలను సమకూర్చారు. 27 చిత్రాలను స్వయంగా నిర్మించారు. ఈ చిత్రాలను చక్కని కుటుంబ, సామాజిక, సమైక్యతలను చాటి చెప్పినవే కావడం తనలో ఉత్తమ అభిరుచికి దర్పణం. “గాంధీ పుట్టిన దేశం”, “నాకు స్వతంత్య్రం వచ్చింది”, “పల్లె పిలిచింది”, “యువతరం కదిలింది”, “ధర్మాత్ముడు”, “గృహప్రవేశం”, “కార్తీకదీపం”, “కల్యాణ తిలకం” వంటి చిత్రాలను ప్రభాకర్ రెడ్డి గారు నిర్మించగా అవన్నీ కూడా బాగా ప్రేక్షకరణ పొందాయి.

ప్రభాకర్ రెడ్డి గారు నిర్మాత గానే కాక, ఒకానొక దశలో తాను దర్శకుడుగా కూడా ఐదు చిత్రాలను రూపొందించారు. తన దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం “ప్రతిభావంతుడు” (1986). ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా “మండలాధీశుడు” (1987), “ప్రచండ భారతం” (1988), “గండిపేట రహస్యం” (1989) వంటి చిత్రాలను రూపొందించారు. కామ్రేడ్ అన్న చిత్రాన్ని భానుచందర్ హీరోగా తీశారు, కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.

కుటుంబం…

ప్రభాకర రెడ్డి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెడిసిన్‌ పూర్తి చేశారు. ప్రభాకర రెడ్డి గారికి నలుగురు ఆడపిల్లలు గంగ, శైలజ, లక్ష్మి, విశాలాక్షి. ప్రభాకర రెడ్డి గారు వారి గ్రామ దేవత గంగమ్మ పేరు పెద్ద కూతురుకు పెట్టారు. అమ్మవారి మీద భక్తితో తమ సంతానానికి అమ్మవారి పేర్లు పెట్టారు. వాళ్ళు నలుగురు మద్రాసు లోని “హోలీ ఏంజెల్స్‌” పాఠశాలలో చదువుకున్నారు. పేరెంట్‌ టీచర్‌ మీటింగ్స్‌కి ప్రభాకర రెడ్డి గారు వచ్చేవారు. విశాలాక్షి తన తండ్రి లాగే మెడిసిన్‌ చదివింది. ప్రభాకర రెడ్డి గారి కుటుంబం తన కళ్ల ముందే ఉండాలనే ఉద్దేశంతో వారి అందరికీ హైదరాబాదు సంబంధాలే చేశారు. ప్రభాకర రెడ్డి గారు తన భాగస్వామితో సినిమా కథలు, సన్నివేశాల గురించి చర్చించేవారు. ఆమె బెంగాలీ కథలు చదివి, సినిమాలు చూసి, అందులో పాత్రలు ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో ఆమె ప్రభాకర రెడ్డి గారికి వివరించేవారు. వారి సంభాషణల నుంచి కొత్త కథలు వచ్చేవి.

మరణం…

చాలా మంది నటీనటులు యాక్టర్ని కావాలనుకుంటే డాక్టర్ని అయ్యాను అని చెబుతుంటారు. కానీ మందాడి ప్రభాకర రెడ్డి గారు మాత్రం ఎం.బి.బి.ఎస్ చదివి డాక్టర్ అయ్యి నాటకాలు అంటే మోజుపడి సినిమా రంగం పట్ల ఆకర్షితులయ్యారు. అలా డాక్టరు అయిన తొలి తెలుగు నటుడు మన ప్రభాకర్ రెడ్డి గారు. తాను నటుడిగా, రచయితగా మరియు నిర్మాతగా తెలుగు సినీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. దాదాపు 500 పైన సినిమాలో నటించారు. దాదాపు 21 చిత్రాలకు కథలను వ్రాశారు. ప్రభాకర్ రెడ్డి గారు మద్రాసులో ఉన్నప్పుడు తన ఇంట్లో ఎంతో మందికి ఆశ్రయము ఇచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సమాఖ్య ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా పనిచేశారు.

ప్రభుత్వంతో చర్చలు జరిపి కార్మికులకు చాలా మంచి పనులు చేసిన ప్రభాకర్ రెడ్డి గారు 26 నవంబరు 1997 వ తేదీన తన 62వ యేట హైదరాబాదులో మరణించారు. నటుడిగా, దర్శకుడిగా ప్రభాకర రెడ్డి గారికి మంచి పేరు వచ్చింది. కానీ తనకు తగిన గౌరవ పురస్కారాలు దక్కలేదనే వెలితి మాత్రం తనకు ఉండేది. ప్రభాకర రెడ్డి గారికి పెద్దపెద్ద అవార్డులు రాకపోవచ్చు. కానీ తనను అందరూ గౌరవించేవారు. నిజానికి తానే పదవులు వద్దనుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు. నేదురుమల్లి గారు ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి తరచూ వచ్చి వెళ్తుండేవారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు కూడా కొన్ని పదవులు ఇవ్వజూశారు. కానీ ప్రభాకర్ రెడ్డి గారు వాటిని సున్నితంగా తిరస్కరించారు. రాజ్యసభ సీట్లు కూడా వద్దనుకున్నారు ప్రభాకర్ రెడ్డి గారు.

దాతృత్వం…

ప్రభాకర రెడ్డి గారి స్వగ్రామం తుంగతుర్తిలో వారికి 30 ఎకరాల భూమి ఉండేది. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాదుకు వచ్చినప్పుడు సినీ కార్మికులకు రాకపోకలు కష్టమయ్యేవి. దానితో కార్మికులకు హైదరాబాదులోను సొంత ఇల్లు కట్టించాలంటూ ప్రభాకర రెడ్డి గారు ప్రభుత్వానికి ఉత్తరం వ్రాశారు. కార్మికులకు 10 ఎకరాల భూమిని కేటాయించమన్నారు. కొంత సొమ్ము కడితే ప్రభుత్వం భూమి ఇస్తామంది. దాంతో ప్రభాకర రెడ్డి గారు తనకున్న భూమిని అంతా ఆమ్మి ప్రభుత్వానికి సొమ్ము కట్టారు. కార్మికులందరికీ 20 ఎకరాలు చాలు కాబట్టి మరో 57 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాదులో తన 10 ఎకరాల భూమిని సినీ కార్మికుల ఇండ్ల కోసం దానం చేసినారు. ఇప్పుడు దాని విలువ దాదాపు 600 కోట్ల రూపాయలు. భారత దేశ సినీ చరిత్రలో ఏ నటుడు కూడా ఇంత విలువైన భూమిని దానం చేయలేదు. ప్రభాకర రెడ్డి గారు తనకు చెందిన పది ఎకరాలతో పాటు ప్రభుత్వం ద్వారా కొంత భూమిని ఇప్పించి 4,000 మంది కార్మికులకు ఇల్లు కట్టించినారు. దానిని చిత్రపురి కాలనీగా పిలుస్తున్నారు.

Show More
Back to top button