GREAT PERSONALITIESTelugu Cinema

భారతీయ గాత్ర సంగీత సామ్రాజ్ఞి… భారతరత్న యం.యస్.సుబ్బలక్ష్మి..

పదేళ్ళ బాలిక పాఠశాల ఆవరణలో సుబ్బలక్ష్మి ఇసుకలో ఆడుకుంటుంది. ఇంతలో ఎవరో వచ్చి తన చేతులకు, బట్టలకు ఉన్న దుమ్మంతా దులిపి, ఎత్తుకొని తీసుకెళ్లి వేదిక మీద వీణ వాయిస్తున్న తన తల్లి పక్కన కూర్చోబెట్టారు. ఆ బాలికను తన తల్లి దగ్గరకు తీసుకొని పాడమని చెప్పింది. ఏవో రెండు పాటలు రాగ రంజితంగా పాడిన ఆ చిన్నారి పాప అద్భుత గాన ప్రావీణ్యానికి అక్కడున్న పండితులు అంతా కూడా ఆశ్చర్యపోయి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు.

అది జరిగిన చాలా ఏళ్ల తర్వాత అది ఓ అంతర్జాతీయ సంగీతోత్సవ వేదిక పైన ఎందరో ప్రపంచ ప్రసిద్ధ విద్వాంసుల ముందు అప్పుడే ఆమె సంగీత కచేరి ముగించింది. అక్కడున్న వాళ్లలో తన్మయ భావనతో అందరి కళ్ళలోనూ స్వచ్ఛమైన ఆధ్యాత్మికమైన వెలుగు కనబడుతుంది. ఆమె తర్వాత సుప్రసిద్ధ ఆధునిక సంగీత సమ్మేళనం గా పిలుచుకునే “జూబిన్ మెహతా” కచేరి చేయాలి. కనీసం 150 సంగీత వాయిద్యాలతో ఆయన వేదికను అలంకరిస్తారు. ప్రపంచంలోని గొప్ప సంగీతకారులలో ఆయన ఒకరు.

కానీ ఆ రోజున తాను వేదిక నెక్కడానికి వెనక మందు సంకోచిస్తున్నారు. కారణం ఒక స్వరంతో వేల మందిని సంగీత పారవశ్యంలో తేలియాడించిన ఆమె స్వరం ముందు వందలాది తన వాయిద్యాలు ఏపాటివి. ఏమైతేనేమీ అని భక్తి పూర్వకంగా వినయభావంతో “జుబిన్ మెహతా” ఆమె ముందు నిలిచి చేతులు జోడించి ఆశీర్వచనాలు తీసుకుని ధైర్యంగా వేదిక ఎక్కాడు. ఈ రెండు సంఘటనల మధ్య చాలా తేడానే ఉండవచ్చు. కానీ అనితర సాధ్యమైన గాత్ర సంగీత సామ్రాజ్ఞిగా పేరుగాంచిన “ఎమ్మెస్ సుబ్బలక్ష్మి” గారే. ఆనాటి ఆ “అమ్మాయి”, ఆ తర్వాత “ఆమె”.

గాంధీజీ గారు ప్రత్యేకంగా యం.యస్‌.సుబ్బలక్ష్మి గారి చేత మీరా భజనలు పాడించుకున్నారు. ఆమె పాటలంటే గాంధీజీ గారికి ఎంతోఇష్టం. “హరి తుమ్‌ హరో” అనే పాటను గాంధీజీ గారి కోసం ప్రత్యేకంగా పాడి రికార్డు చేసింది. “నేను మామూలు ప్రధాన మంత్రిని. ఆమె సంగీత సామ్రాజ్యానికి మహారాణి” అని పండిట్‌ నెహ్రు గారు సుబ్బలక్ష్మి గారిని ప్రస్తుతించారు. ఇలా తన సంగీత కచేరీలలో తనను తాను మరిచి భక్తిభావంతో యం.యస్‌. సుబ్బలక్ష్మి గారి సంగీత కళావైదుష్యానికి ముగ్దులైన పెద్దలెందరో ఎన్నో విధాలుగా ప్రశంసించారు.

ఆమె కంఠం అత్యంత మధురం. భజన పాడుతూ అందులోనే ఆమె పరవశులైపోతారు. ఆమె సంగీత ఆధ్యాత్మిక స్వరం తెలుగుజాతికి ఓ వరం. ప్రార్థన సమయంలో ఎవరైనా అలా భగవంతునిలో లీనం అవ్వాలి. తాను పాడిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం తెలుగువారి గుండెల్లో భక్తిభావాలను ప్రసరింపచేస్తుంది. నిండైన భారతీయ సంస్కృతికి ఆ సుమధుర గాయని నిలువెత్తు నిదర్శనం. భారత దేశమంటే ఒక గంగానది, ఒక హిమాలయం, ఓ సుబ్బలక్ష్మి అనిపించుకున్న తాను ప్రతిష్టాత్మక భారతర్నత పురస్కారాన్ని అందుకున్న తొలి గాయకురాలిగా చరత్ర సృష్టించిన మహోన్నత గాయని సుబ్బలక్ష్మి గారు.

1954 సంవత్సరంలో పద్మభూషణ్‌ దక్కించుకున్న సుబ్బులక్ష్మి గారిని 1998 సంవత్సరంలో భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం అయిన “భారతరత్న” వరించింది. కర్ణాటక సంగీతంలో నోబెల్‌ బహుమతి లాంటిదని పేరున్న “సంగీత కళానిధి” బిరుదు పొందిన తొలి మహిళ తాను. ఆ బిరుదును 1968వ సంవత్సరంలో మ్యూజిక్‌ అకాడమీ తనకు ప్రధానం చేసింది. సుబ్బలక్ష్మి గారి పూర్తి పేరు మధురై షుణ్ముకవడివు సుబ్బులక్ష్మి.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    మధురై షణ్ముఖవడివు సుబ్బు లక్ష్మి

ఇతర పేర్లు  :    ఎం.ఎస్.సుబ్బు లక్ష్మి 

జననం    :     16 సెప్టెంబరు 1916  

స్వస్థలం   :    మదురై, తమిళనాడు రాష్ట్రం

వృత్తి      :    కర్నాటక సంగీత, గాయకురాలు, నటి

తండ్రి    :   సుబ్రహ్మణ్య అయ్యర్

తల్లి     :   షణ్ముఖవడివు అమ్మాళ్

జీవిత భాగస్వామి    :  త్యాగరాజన్ సదాశివన్ 

పిల్లలు   :      రాధా విశ్వనాథన్

మరణ కారణం  :  ఊపిరితిత్తుల న్యుమోనియా, హృదయ సంబంధ సమస్యలతో

మరణం    :   11 డిసెంబరు 2004 (వయసు 88), చెన్నై, తమిళనాడు రాష్ట్రం

నేపథ్యం…

యం.యస్.సుబ్బలక్ష్మి గారు తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో 16 సెప్టెంబర్ 1916 నాడు న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్, వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ దంపతులకు జన్మించారు. చిన్నప్పుడు సుబ్బలక్ష్మి గారిని ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు. సుబ్బలక్ష్మి గారి తల్లి గారే ఆమెకు ఆది గురువు. తన పదేళ్ళ ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆమెలో భక్తితత్వానికి బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్ గారు. సుబ్బులక్ష్మి గారు శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించారు కనుకనే తన జీవితకాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించారు.

తన బాల్యంలో పాఠశాలలో అకారణంగా టీచరు కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్ళడం మానేసిన సుబ్బులక్ష్మి గారు తన అక్క, అన్నదమ్ములతో కలసి సంగీత సాధన చేసి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపునిచ్చి, తదనంతర కాలంలో జాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగారు. తన అమ్మమ్మ అక్కమ్మాళ్ వయోలిన్ విద్వాంసురాలు, తల్లి వీణా వాదన తరుచూ వాళ్ళ ఇంటికి వచ్చే సంగీత కళాకారుల సందడి సుబ్బలక్ష్మి గారిని కళా ప్రపంచంలోకి తీసుకువచ్చాయి.

సంగీత సాధనే ఆమెకు సర్వస్వం అయ్యింది. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి “ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్”, “సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్” వంటి దిగ్దంతుల వద్ద శిక్షణ పొందారు. తాను తల్లితో కలిసి 12వ వేట వేదికనెక్కి పాడినప్పుడు సంగీతా ఆకాశంలో ఓ కొత్త తార ఉదయించినట్లయ్యింది. నాటి నుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉన్నారు. అప్పుడే తను మొట్టమొదటిసారిగా హెచ్.ఎం.వి కోసం ఆల్బమ్ అందించారు.

సంగీత ప్రపంచంలో కి సుబ్బలక్ష్మి..

సుబ్బలక్ష్మి గారి లోని ప్రతిభను గుర్తించిన తన తల్లి మధురై నుంచి చెన్నైకి మకాం మార్చటంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. 1932లో తన పదహారో యేట అనుకోకుండా సుబ్బలక్ష్మి గారికి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వేదికపై పాడే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఓ సాయంత్రం అకాడమీ ఒక మహా విద్వాంసుడి కోసం ఎదురుచూస్తోంది. ఆయన సుప్రసిద్ధ “అరియక్కుడి రామానుజ అయ్యర్” గారు. కానీ చివరి క్షణంలో తాను కచేరీకి రాలేకపోతున్నానని తన బదులు మరొకని పంపుతున్నానని లేఖ వ్రాశారు. అయితే ఆయన పంపిన సంగీత విద్వాంసురాలికి సుమారు 16 ఏళ్లు కూడా ఉండవు. అది చూసి అక్కడున్న వాళ్లంతా నిరుత్సాహపడి ఈ అమ్మాయి ఏం పాడుతుంది అబ్బా అనుకున్నారు.

కానీ ఇవేమీ పట్టించుకోని ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు వేదికనెక్కి కచేరీకి సిద్ధమైంది. ఎమ్మెస్ వెనుక తల్లి షణ్ముఖవడివు తంబుర వేసింది. సుబ్బలక్ష్మి గారు తన స్వరంతో కోమల గంధర్వ గాన సౌరభాన్ని రవళించేలా పాడారు. ఆ సమయంలో సంగీత ప్రపంచంలో ఉద్ధండులైన “టైగర్ వరదాచారి”, “వీణాకారైకుడి సాంబశివయ్యర్”, “చెంబై వైద్యనాథ భాగవతార్” వంటి సంగీతజ్ఞులందరూ ఆమె ఎదురుగా ముందు వరుసలో కూర్చుని ఉన్నారు. అందరి ముఖాలలో సంభ్రమాశ్చర్యాలు తొణికిసలాడాయి. అంత చిన్న వయస్సులో మ్యూజిక్ అకాడమీ వేదికపై పాడి అందరి ప్రశంసలు అందుకున్న కళాకారులు చాలా అరుదు. అందరి నోటా పొగడ్తలు.

అమ్మడు నీ కంఠంలో వీణ తంత్రులు మ్రోగుతున్నాయి అని కారైకుడి వారు అభినందించారు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు పాడుతుంటే ఆమె వదనంలో ప్రశాంతత, ప్రసన్నత లాస్యం చేస్తుంటాయి. రాగాలాపన, కీర్తన, నెరవు, స్వర కల్పన ఏదైనా సరే నాద సౌందర్యంతో నిండి ఉంటాయి. కర్ణాటక సంగీతంలో తలమాణికమైన పల్లవిని పాడడంలో తన తల్లి సుబ్బలక్ష్మి గారికి ప్రత్యేకంగా శిక్షణను ఇప్పించారు. అందుకే ఆమెకు మృదంగ సంబంధమైన లెక్కలన్నీ తెలుసు. “పల్లవి” పాడడం అంటే పాండిత్య ప్రకర్షతో కూడిన పని, నిర్దిష్టమైన లయ, జ్ఞానం, ధారణ శక్తి గణిత శాస్త్ర సూక్ష్మాలు ఇవన్నీ కలిగి ఉండాలి.

అవన్నీ అమలు పుష్కలంగా ఉండటం వల్ల తనకు సాధ్యమైంది.

సుబ్బలక్ష్మి గారు పాడుతుంటే తలలో మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు.

కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. తన గానం ధ్యానంలా సాగేది.

సుమారు పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు, దేశభక్తి గేయాలు పాడారు.

తాను ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బులక్ష్మి గారి అరుదైన ప్రత్యేకత.

శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతో పాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం సుబ్బలక్ష్మి గారికి మాత్రమే సాధ్యం.

ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సంగీత సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం.

త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి గారు తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు.

సుబ్బలక్ష్మి గారు తన సంగీత ప్రస్థానంలో విశ్వవ్యాప్తంగా రెండువేల పైచిలుకు కచేరీలు చేశారు. వాటిలో తన స్వలాభం కోసం చేసినవి పాతిక శాతం కూడా ఉండవు.

గాయనిగా సంపాదించినదంతా ప్రజాహిత కార్యక్రమాలకు దానధర్మాలకు వినియోగించిన నిస్వార్థ పరురాలు సుబ్బలక్ష్మి గారు.

తాను కచేరి ద్వారా సేకరించిన సొమ్ము రెండు కోట్లకు పైనే. అవన్నీ కూడా సేవా కార్యక్రమాలకే వినియోగించేవారు.

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారంటే మహాత్మా గాంధీ గారికి సైతం ఇష్టంగా ఉండేది. “భక్తి భావం ఆమె కంఠంలో ద్యోతకమైనట్టు మరే గాత్రంలోనూ ఉండదని” గాంధీ గారు భావించేవారు.

వైవాహిక జీవితం…

యం.యస్.సుబ్బలక్ష్మి గారికి సంగీతం జీవితంలో ఒక మలుపు అయితే, రెండో మలుపు తన గురువు, మార్గదర్శి, “ఆనంద వికటన్” పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది అయిన “త్యాగరాజన్ సదాశివం” తో పరిచయం. “ఆనంద వికటన్” పత్రిక తరఫున ఆమెను కలవబోయిన సదాశివం సుబ్బలక్ష్మి గారికి కొండంత అండగా కనిపించాడు. తనతో పరిచయం కాస్త ప్రణయంగా మారి చివరికి అది పెళ్లి వరకు దారితీసింది. సదాశివంకు అప్పటికే ఆయనకు పెళ్లయి, ఇద్దరు కూతుళ్లు, బోలెడంత కుటుంబ భారం. అయినా ఇవేమీ పట్టించుకోని పదహారేళ్ళ సుబ్బలక్ష్మి గారు ముప్పై నాలుగేళ్ల “సదా శివం” ను 1940 లో పెళ్లాడారు.

సుబ్బలక్ష్మి గారికి సంతానం లేదు. ఆమె తన భర్త సదాశివం తొలి భార్య కుమార్తె రాధను పెంచుకున్నారు. అసలు నేను పాడగలనని ఏనాడు అనుకోలేదు అని సుబ్బలక్ష్మి గారు అంటుండేవారు. పెళ్లయ్యాక సదశివం యొక్క ఉద్యోగం పోయింది. దాంతో సుబ్బలక్ష్మి గారు మీరు దారి చూపితే నెలకు వంద రూపాయలు నేను గడిస్తాను అంది ఆ ధైర్యలక్ష్మి. తనకు సంతానం కలగకపోయిన సవతి కూతుళ్లను సొంతం చేసుకుంది సంతాన లక్ష్మి. “సేవాసదనం”, “శకుంతలై” సినిమాలలో నటించి నటన విరమించుకున్నా, దేశసేవకై తన భర్త పత్రిక పెడతాను అంటే భర్తకు నిధులు సమకూర్చేందుకు సావిత్రి సినిమాలో నటించిన ధనలక్ష్మి సుబ్బలక్ష్మి గారు.

సంగీతం తర్వాత తన భర్తే తన దైవంగా భావించే తాను, ఆయనను భర్తగా పొందే విషయంలో తాను ఎంతో అదృష్టవంతురాలునని సుబ్బలక్ష్మి గారు చెబుతుండేవారు. తన భర్తను ఎంపిక చేసుకునే విషయంలో తాను తప్పటడుగు వేసి ఉంటే తన జీవితం దుర్భరమయ్యేదని ఆమె భావిస్తారు. తన భర్త తనకు తోడుగా, నీడగా ఉండటం వల్లే తనకి ఇలాంటి ఉజ్వల భవిష్యత్తు సాధ్యమైందని తన ఉద్దేశ్యం. సుమారు 56 ఏళ్ళు తోడు నీడగా, గురువుగా, మార్గదర్శి మాణిక్యాన్ని కాపాడే ఆదిశేషునిలా ఉన్న భర్త సదా శివం 1997లో మరణించారు. తన భర్త మరణానంతరం తాను కనీసం తంబూరమైన తాకలేదు.

సినీ రంగంలో…

పదహారేళ్ళ వయసులో 34 ఏళ్ల సదా శివం ను పిల్లాడిన సుబ్బలక్ష్మి గారు, అప్పటికే ఆయనకు ఇద్దరు కూతుర్లు బోలెడంత కుటుంబ భారంతో సతమతం అవుతుండడంతో ఆ బాధ్యతలో తాను కూడా పాలు పంచుకున్నారు సుబ్బలక్ష్మి గారు.

పెళ్లి తరువాత తన భర్త సదాశివం ఉద్యోగం పోవడంతో మీరు దారి చూపిస్తే నెలకు వంద రూపాయలు నేను గడిస్తాను అని ధైర్యం చెప్పారు.

1938 సంవత్సరంలో “సేవాసదనం” సినిమా ద్వారా సుబ్బులక్ష్మి గారు సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

నటేశ అయ్యర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సుబ్బలక్ష్మి గారు అతడి సరసన సుమతిగా నటించారు.

సదాశివన్ సినీ నిర్మాత కూడా కావడంతో సుబ్బులక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదు.

తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించారు. 1940 వ సంవత్సరంలో “శకుంతలై” అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించారు. 1945 వ సంవత్సరంలో నిర్మించబడిన “మీరా” చిత్రం హిందీలో పునర్నిర్మించబడి కూడా విజయవంతం కావడంతో సుబ్బులక్ష్మి గారి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమయింది. “మీరా” సినిమాలోని తన నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. “మీరా” తన ఆఖరి సినిమా. భక్తి గాయనిగా సుబ్బులక్ష్మి గారు పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ గారి కృషి ఎంతో ఉంది.

తెర పై కూడా విజయవంతం..

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు తొలినాటి “సేవా సదన్”, “శాకుంతలై”, “సావిత్రి”, “మీరా” చిత్రాల్లో నటించారు. “శాకుంతలై” సినిమాలో ముగ్ధమనోహరమైన ముని కన్నెగా తన నటన ఆసామాన్యం. “సేవాసదన్” లో ఆధునిక యువతిగా నటించారు. “శాకుంతలై” సినిమాలో తాను పాడిన పాటలన్నీ హిట్ అయ్యాయి. దక్షిణ భారతదేశంలో తన పాటలు వినపడని ఇల్లు లేదు. “సావిత్రి” లో నారదునిగా నటించి, పాడిన కీర్తనలు బహుళ ప్రజాదరణ పొందాయి. ఇక “మీరా” సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సాక్షాత్తు మీరాబాయి తెరపై కనిపింపజేశారు. “మీరా” లో తన సరసన చిత్తూరు నాగయ్య గారు నటించారు.

స్వర సంకలనం…

★ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ కోసం తిరుమల తిరుపతి దేవస్థానంవారికి తెలుగు లో “శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం” గానం ఆలపించారు.

★ బ్రహ్మ కడిగిన పాదము.. వాతాపి గణ పతిం భజే.. భజ గోవిందం మూడమతే… అనే  అన్నమాచార్య కీర్తన లను ఆలపించారు.         

★ తిరుమల తిరుపతి దేవస్థానంవారి కోసం  “శ్రీ వెంకటేశ్వర పంచరత్నమాల” ను ఆలపించారు.                                   

★ రేడియో రేసిటాల్స్ వాల్యూమ్ 2 త్యాగరాజు గారు స్వరకర్త గా ఉన్న “ఆడ మోడి గలదా”..  చారుకేశి రాగం, ఆది తాళం లో సుబ్బలక్ష్మి గారు ఆలపించారు.

★ సుబ్బులక్ష్మి ఎం.ఎస్ లైవ్   ఆల్బం లో  పాపనాసం శివన్ స్వరకర్త గా ఉన్న “అంబా నీ”..      అతనా రాగంలో ఆది తాళంలో ఆలపించారు.

★ ఎం.ఎస్.ఓల్డ్ జెమ్స్ ఆల్బం లో సుబ్రహ్మణ్య భారతి స్వరకర్త గా ఉన్న అరుల్ పురివై.. హంస ధ్వని రాగం ఆది తాళం సుబ్బలక్ష్మి గారు ఆలపించారు.

పురస్కారాలు…

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి పేరు వినని సంగీత ప్రియులు ఉండరు. మీరాబాయి ఎటువంటి తాధాత్మతతో శ్రీకృష్ణ భజనలు గానం చేసిందో, అంతే నిబద్ధతతో మరో మీరాబాయిని తలపించేలా సుబ్బలక్ష్మి గానం చేసేవారు.

భారతీయులనే కాకుండా అంతర్జాతీయంగా శ్రోతలను తన గానంతో మంత్ర ముగ్దులను చేసిన తాను 60 ఏళ్లుగా అందుకున్న పురస్కారాలు, సన్మానాలు అనేకం.

తన జీవితకాలంలో సంగీత ప్రపంచంలో బహుశా ఎవరూ సాధించని, ఛేదించని రికార్డులు, రివార్డులు తాను అందుకున్నారు.

తాను ఎక్కని “శిఖరం” లేదు, పొందని “బహుమానం” లేదు.

అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఎన్నో సుబ్బులక్ష్మి గాత్రానికి దాసోహమంటూ తన ముందు వాలాయి.

★ 1954 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం సుబ్బలక్ష్మి గారికి పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు.

★ 1965 వ సంవత్సరంలో ది మ్యూజిక్ అకాడమి చెన్నై, తమిళనాడు వారు “సంగీతకళానిధి” అనే బిరుదు ఇచ్చి  గౌరవించారు. ఈ బిరుదు మొట్టమొదటి సారిగా స్త్రీ గాయకురాలు అందుకోవడం విశేషం.

★ 1971 వ సంవత్సరంలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ వారు డాక్టరేట్  బిరుదునిచ్చి సన్మానం చేశారు.

★ 1974 వ సంవత్సరంలో ఢిల్లీ యూనివర్సిటి, ఢిల్లీ వారు డాక్టరేట్  బిరుదునిచ్చి గౌరవించారు.

★ 1974 వ సంవత్సరంలో ఫిలిప్ఫీన్స్ ప్రభుత్వం  వారు సుబ్బలక్ష్మి గారికి “రామన్ మెగసెసే పురస్కారం” ఇచ్చి సత్కరించారు.

★ 1975 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం     వారు పద్మవిభూషణ్ బిరుదునిచ్చి సన్మానం చేశారు.

★ 1980 వ సంవత్సరంలో బెనారస్ యూనివర్సిటి, ఉత్తరప్రదేశ్ వారు గౌరవ డాక్టరేట్  బిరుదునిచ్చి గౌరవించారు.

★ 1987 వ సంవత్సరంలో యూనివర్సిటి ఆఫ్ మద్రాస్ తమిళనాడు వారు డాక్టరేట్  బిరుదునిచ్చి సన్మానం జరిపించారు. 

★ 1988 వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు సుబ్బలక్ష్మి గారికి కాళిదాస్ సమ్మాన్ అనే బిరుదునిచ్చి సత్కరించారు.

★ 1990 వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ వారు ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా అవార్డు   ఇచ్చి ఘనంగా సన్మానం చేశారు.

★ 1998 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం నుండి సంగీత విభాగం క్రింద మొట్టమొదటి సారిగా భారతీయ అత్యున్నత పురస్కారం అయిన “భారతరత్న” అందుకుని

చరిత్ర సృస్టించిన వ్యక్తి, స్త్రీ, గాయకురాలు సుబ్బలక్ష్మి గారు.

★ 2004 సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వం సుబ్బలక్ష్మి గారికి జీవిత సాఫల్య పురస్కారం ( లైఫ్ టైం అచీవమెంట్ అవార్డు )  ఇచ్చి ఘనంగా సత్కరించింది.

మరణం…

సుబ్బలక్ష్మి గారి ఆహార్యం భారతీయ సాంప్రదాయ స్త్రీకి ప్రతీకగా ఉంటుంది. నిండైన విగ్రహం, ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమ బొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతో పాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం కేవలం సుబ్బలక్ష్మి గారికి మాత్రమే సాధ్యమైంది.

ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించిన సుబ్బలక్ష్మి గారు “రాయల్ ఆల్బర్ట్ హాల్”, లండన్ లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణి గారిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలు పొందారు మహాగాయని సుబ్బలక్ష్మి గారు.

ఇంటింటా పవిత్ర సుమసుగంధాలను వెదజల్లిన “సుప్రభాత” గీతమై ప్రతి ఇంటా ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మిన.

విష్ణు సహస్రనామ నిత్యస్తోత్రమై ఈ ధరణీతలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార.

సుబ్బలక్ష్మి గారు 11 డిసెంబర్ 2004 నాడు హృదయ సంబంధమైన సమస్యలతో చెన్నైలో ఈ మర్త్య ప్రపంచాన్ని విడిచిపెట్టి శ్రీవెంకటేశ్వరుని లో లీనం అయిపోయారు.

Show More
Back to top button