CINEMAGREAT PERSONALITIESTelugu Cinema

చిత్రసీమ లో అవిస్మరణీయ మహోన్నతుడు.. ఘంటసాల బలరామయ్య..

ఘంటసాల బలరామయ్య (05 జులై 1906 – 29 అక్టోబరు 1953)

తెలుగు టాకీ చిత్రాలు మొదలైన తొలినాళ్ళలో చిత్ర పరిశ్రమను ముందుకు తీసుకెళ్లే దిశగా పటిష్ఠమైన పునాదులు వేసిన ప్రముఖులు చాలామందే ఉన్నారు. ఆ దశాబ్దంలో చిత్రాలు నిర్మించిన లేదా దర్శకత్వం వహించిన ప్రముఖులందరూ కూడా చిత్తశుద్ధి, క్రమశిక్షణ, అంకితభావం ఇవన్నీ ఉన్నవాళ్లే. అందుకే ఎనభై, తొంభై సంవత్సరాల తర్వాత కూడా అలనాటి చిత్రాల ప్రస్తావన ఎప్పుడో, ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. వీళ్ళందరూ కూడా కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా, కళాసేవ దృష్టితో, ఉత్తమ అభిరుచితో, ఉత్తమ సంగీతంతో కొన్ని ప్రమాణాలకు కట్టుబడి నష్టాలు వచ్చినా రాజీ పడకుండా, విలువలు దిగజార్చకుండా సినిమాలు నిర్మించిన ప్రముఖులే..

ఈనాటి వేల కోట్ల రూపాయల చిత్ర పరిశ్రమకి మూల స్తంభాలు అని చెప్పుకోవడానికి, ఒప్పుకోవడానికి మనం ఏమాత్రం సందేహించనవసరం లేదు. ఆ రోజుల్లో పలానా సినిమాలో హీరో ఎవరు అని చూడకుండా, పలానా సినిమాని నిర్మించింది ఎవరు అని చూసి సినిమాకు వెళ్లేవారు ప్రేక్షకులు. అంటే తమ బ్యానరు పేరును హీరోలా నిలబెట్టుకున్న సంస్థలు చాలానే ఉన్నాయి. రోహిణీ, వాహినీ, రాజరాజేశ్వరి, శోభనాచల, రేణుక, భరణి, సారథి, జెమినీ మొదలైనవి. ఇలాంటి బ్యానరు లో చేర్చాల్సిన మంచి నిర్మాణ సంస్థ ప్రతిభా పిక్చర్స్. ప్రతిభా పిక్చర్స్ వ్యవస్థాపకులు, అధినేత ఘంటసాల బలరామయ్య గారు.

ఘంటసాల బలరామయ్య గారు అనగానే వెంటనే గుర్తొచ్చే విషయాలు రెండు. ఒకటి అక్కినేని నాగేశ్వరావు గారిని హీరోగా వెండితెరకు పరిచయం చేయడం, రెండోది 1948లో విడుదలై అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను తిరగ వ్రాసిన బాలరాజు సినిమా ను తన స్వీయ దర్శకత్వంలో నిర్మించడం. ఘంటసాల బలరామయ్య గారు సినీ రంగంలో ఉన్నది కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే. 1933 నుండి 1953 వరకు. 1953లో ఒక సినిమా తీస్తూనే మరణించారు. ఈ ఇరవై సంవత్సరాలలో తన దర్శకత్వంలో వచ్చినవి తొమ్మిది సినిమాలు మాత్రమే. అందులో మూడు పౌరాణికాలు, అయిదు జానపదాలు, ఒక సాంఘిక చిత్రం ఉన్నాయి.

తాను దర్శకుడిగా మారకముందు రెండు చిత్రాలను నిర్మించారు. ఈ రకంగా తాను తీసిన సినిమాలు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. రంగస్థలం నటుడిగా, గాయకుడిగా తన కళా జీవితాన్ని ప్రారంభించి చిత్ర నిర్మాణ పరిశీలకుడిగా, నిర్మాతగా, ఆ తరువాత దర్శక నిర్మాతగా ఎదిగినటువంటి ప్రయాణంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి. తాను చిత్ర రంగం ప్రవేశం చేసిన మొదటి పది సంవత్సరాల వరకు కూడా వాళ్ల అన్నయ్య మరియు తమ్ముడు గార్లు ఘంటసాల బాలరామయ్య గారు నిర్మించిన చిత్రాలలో నటులుగా కొనసాగారు.

@ జీవిత విశేషాలు…

జన్మ నామం :    ఘంటసాల బలరామయ్య

ఇతర పేర్లు  :    ఘంటసాల బలరామయ్య

జననం    :     05 జులై 1906 

స్వస్థలం   :   పొట్టెపాలెం, నెల్లూరు మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ 

వృత్తి      :   తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు.

పిల్లలు  :  నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు 

మతం    :   హిందూ మతం

మరణ కారణం  :  గుండెపోటు 

మరణం    :    29 అక్టోబరు 1953 

చెన్నై, భారత దేశం

@ నేపథ్యం…

ఘంటసాల బాలరామయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు కి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొట్టెపాలెం లో 05 జూలై 1906న ఘంటసాల బలరామయ్య గారు జన్మించారు. వీరు నలుగురు అన్నదమ్ములు. పెద్దవాడు సూర్యరామయ్య, రెండోవాడు రాధాకృష్ణయ్య, మూడోవాడు ఘంటసాల బలరామయ్య, నాలుగో వాడు శేషాచలం. పెద్దవాడు అయిన సూర్య రామయ్య గారు నెల్లూరులో మైకా గనుల్లో పనిచేస్తుండేవారు. చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు మరణించారు. దాంతో వాళ్ళ అమ్మగారు ఈ ముగ్గురిని తీసుకొని పెద్దబ్బాయి దగ్గరికి నెల్లూరు వెళ్లారు. ఘంటసాల బాలరామయ్య గారు తన అన్నయ్య గారి వద్ద ఉండి హై స్కూల్ చదువుతూ ఉండేవారు. పదవతరగతి పూర్తి అవ్వగానే “కోపరేటివ్ ఇన్స్పెక్టర్ శిక్షణ ఇప్పించారు. ఆ రోజుల్లో తొందరగా ఉద్యోగం రావడానికి ఆ శిక్షణ తీసుకునేవారు.

@ నాటక రంగం…

ఘంటసాల బలరామయ్య గారు ఉద్యోగం కంటే నాటక రంగం బాగా ఆకర్షించింది.  వాళ్ళ అన్నయ్య రాధాకృష్ణ, వాళ్ళ తమ్ముడు శేషచలం గార్లు కూడా నాటకాలు వేస్తుండేవారు. రాధాకృష్ణ గారికి సొంతంగా నాటక సంస్థ ఉండేది. నాటకాలను రూపొందిస్తూ, నాటకాలు వేసేవారు రాధాకృష్ణ గారు. దాంతో బలరామయ్య గారికి రంగస్థలం మీద మోజు పెరిగింది. చక్కని పాటలు కూడా పాడేవారు ఘంటసాల బలరామయ్య గారు. కలకత్తాలో ఉండే ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మాత “మోతిలాల్ ఛబ్రియా” గారు దానికి అధిపతి. తాను వ్యాపారాత్మకంగా తెలుగు సినిమాలు తీస్తుండేవారు. 1933లో సావిత్రి అనే సినిమా తీశారు. అప్పట్లో రంగస్థల నటులే సినిమాలలో నటిస్తుండేవారు. కనుక మద్రాసు నుండి కొంతమందిని రంగస్థలం కళాకారులను కలకత్తా తీసుకెళ్లి అక్కడ సినిమాలు నిర్మించాలని తలంచి రాధాకృష్ణ నాటకం వారిని కలకత్తా పిలిపించారు.

@ సినీ నేపథ్యం…

రాధాకృష్ణ గారు వేస్తున్న “భక్త రామదాసు” నాటకాన్ని సినిమాగా తీయాలనే “మోతిలాల్ ఛబ్రియా” గారి అభిలాష మేరకు రాధాకృష్ణ గారి బృందం కలకత్తా వచ్చేశారు. రాధాకృష్ణ గారు కలకత్తా వెళుతూ వెళుతూ ఘంటసాల బలరామయ్య గారిని, శేషచలం గారిని వెంటబెట్టుకు వెళ్లారు. అలాగే కలకత్తా వెళ్లిన రాధాకృష్ణ గారినే “భక్త రామదాసు” చిత్రానికి దర్శకత్వం వహించమని మోతిలాల్ ఛబ్రియా గారు సూచించారు. దాంతో రాధాకృష్ణ గారు ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నప్పుడు కొన్ని చోట్ల ఇబ్బందులు వచ్చాయి. అందువలన చిత్తజల్లు పుల్లయ్య గారు మిగిలిన చిత్రాన్ని పూర్తి చేశారు. తెరమీద దర్శకుల పేరు మోతిలాల్ ఛబ్రియా గారి మిత్రులు అక్తర్ నవాజ్ పేరు వేశారు.

ఈ సినిమాలో రాధాకృష్ణ, శేషాచలం లకు మాత్రమే అవకాశం దొరికింది. ఘంటసాల బలరామయ్య గారికి అవకాశం దక్కలేదు. అయినా సరే ఆ సినిమా నిర్మాణం దగ్గర నుంచి చూసిన ఘంటసాల బలరామయ్య గారు సినిమా మీద అవగాహనతో పాటు, సినిమా తీయాలి అనే ఆలోచన వచ్చింది. కలకత్తా లో చిత్రీకరణ అయిపోగానే తిరిగి అందరూ నెల్లూరు వచ్చేసారు. నెల్లూరులో మరుపూరు కోదండరామిరెడ్డి గారితో కలిసి ఘంటసాల బలరామయ్య గారు “శ్రీరామ ఫిలిమ్స్” అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మొదటగా “సతీ తులసి” అనే అంశాన్ని ఎన్నుకొని చిత్తపు నరసింహారావు గారిని దర్శకులుగా పెట్టి సినిమా తీశారు.

చిత్తపు నరసింహారావు గారు “సతీ తులసి” అనే సినిమాకు మరపూరు కోదండరామిరెడ్డి, ఘంటసాల బలరామయ్య గారి నిర్వహణ అని తెరపై వేశారు. ఆ సినిమా చక్కటి విజయం సాధించింది. ఆ సినిమాలో నారదుడిగా రాధాకృష్ణ గారు, ముని కుమారుడు నిత్యానంద గా ఘంటసాల బాలరామయ్య గారి తమ్ముడు శేషచలం గారు నటించారు. 1936లో తీసిన “సతీ తులసి” అనే సినిమా కు ఆ రోజుల్లోనే రెండు వేల రూపాయలు తో ముని ఆశ్రమాన్ని సెట్ వేయించారు. రాక్షసులు ఆశ్రమాన్ని ధ్వంసం చేసే సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ఆ సినిమా తరువాత మరపూరు కోదండరామ రెడ్డి గారితో అభిప్రాయ భేదాలు రావడంతో ఘంటసాల బలరామయ్య గారు ఆ చిత్ర నిర్మాణ సంస్థల నుంచి బయటికి వచ్చేసారు.

@ ఉమ్మడి గా కుబేర ఫిలిమ్స్ స్థాపన…

నెల్లూరు కే చెందిన వెంకురెడ్డి తో కలిసి “కుబేర స్టూడియో”, “కుబేర ఫిలిమ్స్” ని స్థాపించారు ఘంటసాల బలరామయ్య గారు. మొదటి సినిమాగా 1938లో భక్త మార్కండేయ సినిమా చిత్రీకరించారు. ఈ చిత్రపు నరసింహారావు గారి తమ్ముడు చిత్రపు నారాయణమూర్తి గారిని దర్శకుడిగా పరిచయం చేశారు. ఈ చిత్రంలో రాధాకృష్ణ గారు ముని పాత్రను, తమ్ముడు శేషాచలం బ్రహ్మ పాత్రను ధరించారు. తాపీ ధర్మారావు గారి సిఫారసు మేరకు ఆఫీసులో అసిస్టెంట్ గా పేకేటి శివరాం గారిని తీసుకున్నారు. ఈ సినిమా లో సీనియర్ శ్రీరంజని గారు ప్రధాన పాత్రలో నటించారు.

సీనియర్ శ్రీరంజని గారి చెల్లెలు మహాలక్ష్మితో ముని బాలిక పాత్ర వేయించారు. మహాలక్ష్మి తరువాత రోజులలో జూనియర్ శ్రీరంజని గా పేరు తెచ్చుకున్నారు. అనేక సినిమాలలో నటించారు. కుబేర ఫిలిమ్స్ బ్యానర్ లో ఘంటసాల బలరామయ్య గారు నిర్మించిన “భక్త మార్కండేయ” చిత్రం చక్కటి విజయం సాధించింది. 1939లో చిత్రపు నారాయణ మూర్తి గారితో “మైరావణ” చిత్రం నిర్మించి 21 డిసెంబర్ 1939 నాడు విడుదల చేశారు. ఇందులో కాంచనమాల గారు చంద్రసేన అనే ప్రధాన పాత్రను  పోషించారు. ఇందులో ఘంటసాల బలరామయ్య గారి అన్న రాధాకృష్ణ గారికి, తమ్ముడు శేషాచలం గారికి కూడా పాత్రలు ఉన్నాయి. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించి లాభాలు తెచ్చి పెట్టింది. కానీ నిర్మాత వెంకురెడ్డి తో అభిప్రాయ భేదాలు వచ్చాయి. దాంతో ఆ నిర్మాణ సంస్థ లో నుండి కూడా బయటికి వచ్చేసారు ఘంటసాల బలరామయ్య గారు.

@ “ప్రతిభా పిక్చర్స్” పై దర్శక, నిర్మాత గా…

ఘంటసాల బలరామయ్య గారు సొంతంగా మిత్రుల సాయంతో “ప్రతిభా పిక్చర్స్” స్థాపించారు. తాను నిర్మాతగానే కాకుండా, తొలిసారి దర్శకత్వం వహించి తీసిన తొలి చిత్రం “పార్వతి కళ్యాణం”. ఇందులో ఘంటసాల బలరామయ్య గారి అన్నగారు రాధాకృష్ణయ్య గారు శివుడి గాను, తమ్ముడు శేషాచలం మన్మథుడు గాను నటించారు. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. అప్పుడప్పుడే మద్రాసు పట్టణాన్ని రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు అలుముకోవడంతో నెల్లూరు తిరిగి వచ్చిన ఘంటసాల బలరామయ్య గారు, వారి అన్నదమ్ములు తిరిగి యుద్ధ వాతావరణం తగ్గినాక మద్రాసు కు చేరుకున్నారు. “ప్రతిభా పిక్చర్స్ లో ఘంటసాల బలరామయ్య గారు తీసిన రెండవ సినిమా “గరుడ గర్వభంగం”.

ఈ సినిమాలో భానుమతి రామకృష్ణ గారు “సత్యభామ” పాత్రను పోషించారు. ఈ సినిమా కూడా చక్కటి విజయం సాధించింది. ఇందులో గరుత్మంతుడి పాత్రలో వేదంత రాఘవయ్య గారు నటించారు. ఈ చిత్రంతో వేదాంత రాఘవయ్య గారు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. ఆ తరువాత సినిమా “సీతారామ జననం” సినిమా తెరకెక్కించారు ఘంటసాల బలరామయ్య గారు. అప్పటివరకు తెలుగు సినిమాలలో (జానపదాలు, పౌరాణికాలు, సాంఘీకాలు) 35 – 40 సంవత్సరాల మధ్య వయస్కులు హీరోలుగా ఉండేవారు.  కానీ “సీతారామ జననం” సినిమాకు 18 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు కావాలి.

ఇది ఘంటసాల బలరామయ్య గారికి సవాలుగా మారింది. అప్పటివరకు ఉన్న హీరోలు ఆ వయస్సు వారు కాదు. అ వయస్సు వారిని వెతికే పనిలో ఆంధ్రదేశమంతటా తిరగసాగారు. అలాంటి సందర్భంలో బెజవాడ రైల్వే స్టేషన్ లో రైలు ఆగి ఉన్నప్పుడు ఒక కుర్రవాడిని చూసి “సీతారామ జనం” లో ఆ పాత్రకు సరిపోతాడని గ్రహించి ఆ పిల్లవాడిని పిలిచి ఆ సినిమాలో వేషం ఉంది నటిస్తావా అని అడగడం, తాను ఒప్పుకోవడం జరిగింది. ఆ తరువాత పిల్లవాడిది గుడివాడ అని తెలుసుకొని ఘంటసాల బలరామయ్య గారు గుడివాడ వెళ్లి ఆ కుర్రవాడి అన్నయ్యతో మాట్లాడి తనను కూడా ఒప్పించారు. దాంతో “సీతారామ జననం”సినిమా కోసం అక్కినేని నాగేశ్వరరావు గారు 08 మే 1944న మద్రాసులో అడుగు పెట్టారు.

@ సీతారామ జననం…

పొద్దుటూరి రాజు అనే కుర్రవాడిని కూడా “సీతారామ జననం” సినిమాలో తీసుకున్నారు. అక్కినేని గారు పొడవుగా ఉండటం వలన తనకు రాముడిగా, పొద్దుటూరు రాజు ని లక్ష్మణుడి పాత్రలలో నటింపజేశారు. ఆ విధంగా శ్రీరాముడి పాత్రలో కథానాయకుడిగా అక్కినేని నాగేశ్వరావు గారు చిత్రరంగ ప్రవేశం చేశారు. ఈ సినిమా ఓ మాదిరి విజయం సాధించింది. ఈ సినిమాలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఒక చిన్న పాత్రలో నటించారు. అక్కినేని గారిని ఘంటసాల బలరామయ్య గారు కొడుకులా చూసుకునేవారు. ఈ “సీతారామ జననం” లోనే కాకుండా ఘంటసాల బలరామయ్య గారు తీసిన అన్ని సినిమాలలో అక్కినేని గారిని నటింపజేశారు. అక్కినేని గారికి సిల్క్ లాల్చీ కుట్టించేవారు. పెద్దలతో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించారు.

@ బాలరాజు…

“సీతారామ జననం” తరువాత తన పంథాను మార్చుకొని జానపద చిత్రంగా “ముగ్గురు మరాఠీలు” అనే చిత్రం తీశారు. ఇందులో కూడా అక్కినేని గారు నటించారు. ఈ సినిమా ద్వారా కస్తూరి శివరావు గారు తారాపథాన్ని అందుకున్నారు. “బాలరాజు” చిత్రంతో శివరావు గారు సినిమాలలో పూర్తిస్థాయిగా స్థిరపడిపోయారు. ఈ చిత్రం 1946లో విడుదలై విజయం సాధించింది. ఆ తరువాత తెలుగులో మొదటి రజతోత్సవ చిత్రం బాలరాజు సినిమాని అక్కినేని నాగేశ్వరరావు, యస్.వరలక్ష్మి గార్లతో తెరకెక్కించారు ఘంటసాల బలరామయ్య గారు. ఈ సినిమా 26 ఫిబ్రవరి 1948 నాడు విడుదలైంది.

పౌరాణిక చిత్రాలే కాదు జానపద చిత్రాలను కూడా రూపొందించడంలో దిట్ట అని నిరూపించుకున్నారు. ఈ సినిమాలోని ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి నేపథ్య గానం చేశారు. “బాలరాజు” చిత్ర విజయం ఎంతగా ప్రభావితం చేసిందంటే ఆ సినిమా తెచ్చిన లాభాలు చూసి సినిమా థియేటర్లు నిర్మించడానికి ముందుకు రావడం, ఆ సినిమా చూడడానికి ఎడ్లబండ్లు కట్టుకొని పల్లెటూరు నుంచి పట్టణాలకు రావడం విశేషం. ఆ తరువాత అక్కినేని గారితోనే “స్వప్న సుందరి” అనే జానపద సినిమా తీశారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే అక్కినేని గారికి వివాహం జరిగింది. “స్వప్న సుందరి” చిత్రీకరణ ఆపేసి ఘంటసాల బలరామయ్య గారు దగ్గరుండి అక్కినేని గారి వివాహం జరిపించారు. అంజలి, జి.వరలక్ష్మి అక్కినేని గార్లతో “స్వప్న సుందరి” చిత్రం కొనసాగుతుండగా ఆ చిత్రాన్ని మధ్యలోనే ఆపి ఇంకో సినిమాను మొదలుపెట్టారు. ఆ సినిమా పేరు “శ్రీ లక్ష్మమ్మ కథ”.

@ శ్రీ లక్ష్మమ్మ కథ…

1947లో పెందుర్తి సుబ్బారావు గారు శ్రీ లక్ష్మమ్మ కథ ను (బుర్రకథ ను) సినిమాగా తీయాలనుకొని త్రిపురనేని గోపీచంద్ గారితో కథ వ్రాయించుకున్నారు. దాని చిత్రీకరణ కొంతకాలం తర్వాత ఆగిపోయింది.  దీనిని నటి కృష్ణవేణి గారు తీసుకొని శోభనాచల స్టూడియోలో దానిని కొనసాగించారు. చదలవాడ నారాయణరావు గారు, మాలతి, సులోచన, కృష్ణవేణి మొదలగు నటీనటులుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది తెలిసిన ఘంటసాల బలరామయ్య గారు తాను కూడా శ్రీ లక్ష్మమ్మ కథ చిత్రీకరణ మొదలుపెట్టారు (ముందుగా తాను తీద్దామనుకున్న కథ ఇది). టీ.వీ.ఎస్ శాస్త్రి గారు వద్దని వారించారు, కానీ ఘంటసాల బలరామయ్య గారు వినలేదు. 19 రోజులలో ఈ సినిమాని పూర్తి చేశారు.

“స్వప్న సుందరి” లో నటించిన నటీనటులతోనే ఈ సినిమా చిత్రీకరించారు. వారికి నాలుగింతలు పారితోషికం ఇచ్చి సినిమా పూర్తి చేసి, కృష్ణవేణి గారు తీసిన “లక్ష్మమ్మ” సినిమా విడుదల రోజు 19 ఫిబ్రవరి 1950 నాడు ఈ సినిమాను కూడా విడుదల చేశారు.  దురదృష్టవశాత్తు తక్కువ రోజులలో సినిమా నిర్మించడం, నాలుగింతలు పారితోషికం ఇవ్వడం, ఫిల్మ్ అయిపోతే బొంబాయి నుండి విమానంలో తెప్పించడంతో ఖర్చులు ఎక్కువయ్యి కృష్ణవేణి గారి సినిమా ముందు నిలువలేక పరాజయం పాలయ్యింది. ఆ తరువాత రోజులలో పెట్టిన పెట్టుబడి వచ్చేసింది. సెన్సార్ కంటే ముందే ప్రింట్లన్నీ వేయించారు. దాంతో సెన్సార్ కట్ లు లేకుండానే ఈ సినిమా థియేటర్లకు వెళ్లిపోయింది. పోలీస్ కమిషనర్ గారికి తెలిసి ప్రింట్లన్నీ ఆపించేసి, కత్తిరించి మళ్ళీ విడుదల చేశారు.  ఇన్ని గొడవలతో “శ్రీ లక్ష్మమ్మ కథ” అనుకున్నంతగా ఆడలేదు.

@ కుటుంబం…

ఘంటసాల బాలరామయ్య గారికి నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. పెద్దబ్బాయి కృష్ణమూర్తి, శ్రీనివాస మూర్తి రెండో అబ్బాయి, శివకుమార్ మూడవ అబ్బాయి, నాలుగో అబ్బాయి శివాజీ. ఆ తరువాత ముగ్గురు అమ్మాయిలు. పెద్దబ్బాయి కృష్ణమూర్తి గారు కొంతకాలం సినిమాలు కొనసాగించి మరణించారు. మూడో అబ్బాయి శివకుమార్ గారు సాలూరు రాజేశ్వర రావు గారి దగ్గర సంగీతం నేర్చుకుని డ్రమ్మర్ గా స్థిరపడ్డారు. జి.ఆనంద్ గారు నిర్వహించే “స్వరమాధురి” సంస్థలో మ్యూజిక్ కండక్టర్ గా పని చేస్తుండేవారు. అదే “స్వరమాధురి” లో పనిచేస్తున్న సావిత్రి గారిని శివకుమార్ గారు వివాహం చేసుకున్నారు.

సావిత్రి గారు ప్రముఖ గాయని పి.వసంత గారి చెల్లెలు. శివకుమార్ గారికి ఇద్దరు పిల్లలు. శ్రీనివాస సాయి, యామిని గార్లు. శివకుమార్ గారు అతి చిన్న వయసులో 49లో మరణించారు. శ్రీనివాస సాయి నాన్న గారు మరణించే సమయానికి పన్నెండు సంవత్సరాలకే కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకున్న శ్రీనివాస సాయి పదిహేడు సంవత్సరాలు సంగీత దర్శకుల దగ్గర పనిచేసి సొంతంగా సంగీత దర్శకుడు అయ్యారు. తాను మొట్టమొదటి సినిమాతోనే ఘనవిజయం సాధించారు. ఆ శ్రీనివాస సాయి నే మన యువతరం సంగీత దర్శకులు ఎస్.ఎస్.తమన్ గారు. తన చెల్లెలు యామిని గారు కూడా పాటలు పాడుతారు.

@ చిత్ర సమాహారం…

★ దర్శకుడిగా…

చిన్న కోడలు (1952)

శ్రీ లక్ష్మమ్మ కథ (1950)

స్వప్న సుందరి (1950)

బాలరాజు (1948)

ముగ్గురు మరటీలు (1946)

గరుడ గర్వభంగం (1943)

శ్రీ సీతా రామ జననం (1942)

పార్వతీ కళ్యాణం (1941)

★ నిర్మాత గా…

స్వప్న సుందరి (1950)

గరుడ గర్వభంగం (1943)

పార్వతీ కళ్యాణం (1941)

మహిరావణ (1940)

భక్త మార్కండేయ (1938)

★ నటుడిగా..

సతీ తులసి (1936)

రామదాసు (1933)..

@ శివ సాయుజ్యం…

తాను దర్శకత్వం వహించిన చిత్రాలు, నిర్మించిన చిత్రాలు తక్కువే కావచ్చు. కానీ గుర్తుండిపోయేలా తన సినీ ప్రస్థానాన్ని గొప్పగా మలుచుకుకున్నారు ఘంటసాల బాలరామయ్య గారు. మధ్యలో ఆపేసిన “స్వప్న సుందరి” సినిమాను పూర్తి చేసి 10 నవంబరు 1950లో విడుదల చేశారు. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తరువాత “చిన్న కోడలు” అనే ఒకే ఒక సాంఘిక సినిమా చిత్రీకరించి విడుదల చేశారు. ఇందులో రక్త కన్నీరు నాగభూషణం గారు ఒక చిన్న పాత్ర వేశారు. నిజానికి ఘంటసాల బాలరామయ్య గారు పార్కులో పేకాడుతూ ఉన్న రోజులలో నాగభూషణం గారు అల్లరి చేస్తూ పార్కుల చుట్టూ తిరిగేవారు. తనను గుర్తు పట్టి ఆ “చిన్న కోడలు” సినిమా లో వేషం ఇచ్చారు. ఆ తరువాత జానపద చిత్రంగా “రేచుక్క” అనే చిత్రాన్ని 1953లో ప్రారంభించారు ఘంటసాల బలరామయ్య గారు.

ఈ సినిమా ప్రారంభించి 3 రీళ్ళు పూర్తి అయిపోగానే అనుకోకుండా ఒకనాడు మరణించార. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో 29 అక్టోబర్ 1953లో అర్ధరాత్రి శివసాయుజ్యం పొందారు. ఆగిపోయిన “రేచుక్క” చిత్రాన్ని పి.పుల్లయ్య గారు పూర్తి చేశారు. ఆ సినిమా ఎన్టీఆర్ గారితో తీశారు ఘంటసాల బలరామయ్య గారు. అక్కినేని గారు వేరే సినిమా ఒప్పుకొని ఉండడం వలన ఆ సినిమాలో నటించకపోయినందుకు బాధపడుతూ ఘంటసాల బాలరామయ్య గారి చివరి చిత్రంలో  నేనుండాలి అని పట్టుబట్టి కొన్ని క్షణాల పాటు ఆ సినిమాలో కనిపించారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈ సినిమా నిర్మాతగా ఘంటసాల కృష్ణమూర్తి గారి పేరు వేశారు. ప్రతిభ పిక్చర్స్ బ్యానర్లో ఘంటసాల కృష్ణమూర్తి గారు “ఏది నిజం”, “దొంగలున్నారు జాగ్రత్త” సినిమాలు నిర్మించారు. కానీ అవేవీ పెద్దగా విజయవంతం కాలేదు. ఆ తర్వాత ప్రతిభా పిక్చర్స్ కాలగర్భంలో కలిసిపోయింది.

@ ప్రత్యేకతలు…

ఘంటసాల బాలరామయ్య గారి ఒక్కో సినిమాకు ఒక్కో ప్రత్యేకత ఉంది.

★ “సీతారామ జననం” లో అక్కినేని నాగేశ్వరావు గారిని కథనాయకుడి గా పరిచయం చేయడం.

★ ఆ దశాబ్దంలో అనేక విజయవంతమైన పౌరాణిక చిత్రాలకు దర్శకత్వం వహించిన చిత్రపు నారాయణ మూర్తి గారిని మొట్టమొదటిసారిగా దర్శకుడిగా పరిచయం చేసింది ఘంటసాల బలరామయ్య గారే.

★ ఆ తరువాత రోజులలో దర్శకుడు గాను, హాస్యనటుడు గాను, నిర్మాత గాను చేసిన పేకేటి శివరాం గారిని తొలి అవకాశం ఆఫీసు అసిస్టెంట్ గా అవకాశం ఇచ్చింది ఘంటసాల బలరామయ్య గారే.

★ అప్పటివరకు మార్కండేయ అనే సినిమాకు తెర వెనకే పని చేస్తున్న మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని తాను నిర్మించిన ఏకైక సాంఘిక చిత్రం చిన్న కోడలు ద్వారా మాటల రచయితగా పరిచయం చేసింది ఘంటసాల బలరామయ్య గారే.

★ ఘంటసాల బలరామయ్య గారు దర్శకత్వం వహిస్తూ తాను సినిమా చిత్రీకరణ మధ్యలో ఉండగా చనిపోతే మిగిలిన చిత్రం వాళ్ళ అబ్బాయి పూర్తి చేశారు. ఆ చిత్రం రేచుక్క. ఆ చిత్రం ద్వారా పరిచయం అయిన ప్రమీల అనే నటీమణి, ఆ తరువాత రోజుల్లో దేవికగా పేరు తెచ్చుకున్నారు. ఆమెను పరిచయం చేసింది కూడా ప్రతిభా పిక్చర్స్ వారు మాత్రమే.

★ అక్కినేని గారికి నేపథ్య గానం చేసిన మొట్టమొదటి చిత్రం ఘంటసాల బలరామయ్య గారి బాలరాజు చిత్రంతోనే.

★ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మొట్టమొదటిసారిగా సినిమాలో ఒక చిన్న వేషంతో తెరమీద కనిపించింది కూడా ఘంటసాల బలరామయ్య గారి “సీతారామ జననం” తోనే.

★ ఘంటసాల వెంకటేశ్వర రావు, రావు బాలసరస్వతీ దేవి గార్లు కలిసి పాడిన మొట్టమొదటి సినిమా “స్వప్న సుందరి” సినిమా ఘంటసాల బలరామయ్య గారిదే.

★ “దొంగలున్నారు జాగ్రత్త” సినిమాతో కే.వీ.మహదేవన్ గారిని నేరుగా తెలుగు చిత్రాలకు పరిచయం చేసింది ఘంటసాల బలరామయ్య గారి అబ్బాయి ఘంటసాల కృష్ణమూర్తి గారే.

★ ఘంటసాల బలరామయ్య గారి మరణం తరువాత ఘంటసాల కృష్ణమూర్తి గారు కొనసాగించిన ప్రతిభా పిక్చర్స్ వారు నిర్మించిన “ఏది నిజం” చిత్రంతోనే అప్పటివరకు చిన్నాచితకా వేషాలు వేసిన “రక్త కన్నీరు” నాగభూషణం గారిని కథానాయకుడిగా పరిచయం  అయ్యారు.

Show More
Back to top button