CINEMATelugu Cinema

వెండితెర పై వన్నె తరగని వెన్నెల సోయగం మాయాబజార్.

మాయాబజార్ తెలుగు చలనచిత్రం.. (విడుదల… 27 మార్చి 1957)

తాజమహల్ ను మళ్ళీ అంత అందంగా ఎవరైనా నిర్మించగలరా..? మోనాలిసా చిత్రాన్ని మరలా గీయగలరా.. జాతిపిత మహాత్మా గాంధీ లాంటి నాయకుడిని, మదర్ థెరిసా లాంటి సేవామూర్తిని మళ్ళీ ఊహించగలమా.. యుగాలు గడిచినా కొన్ని అద్భుతాలు అజరామరంగా నిలిచిపోతాయి. “మాయాబజార్” చిత్రం కూడా అంతే. తెలుగు వారు కన్నులరా చూసి అనుభవించిన అదృష్టం ఈ “మాయాబజార్” చిత్రం.

తెలుగు చిత్ర సీమలో నవరస సమ్మేళనంతో ఆద్యంతము ఆసక్తికరంగా సాగే కథలు మూడే మూడు ఉన్నాయి. “లవకుశ”, “నర్తనశాల”,  “మాయాబజార్”. ఈ మూడు కథలు ఒక్కసారి ప్రారంభమైతే వేటికవే ప్రవాహ వేగంతో సాగిపోతాయి. దృష్యానికి, దృష్యానికి మధ్య సత్సంబంధం ఉంటుంది. ఎక్కడ అతుకుపెట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఏ కథలు తీసుకున్నా కూడా వాటిల్లో ఇతర అంశాలు కలపాల్సి ఉంటుంది. వాటిల్లో ఒకటి మాయాబజార్. 27 మార్చి 1957 లో విడుదలయిన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది.

ఈ చిత్రం అద్భుతం, అమోఘం, మహాత్తరం, శిఖర సమానం, గగన సదృశ్యం ఇలా ఎన్ని విశేషణాలు వాడినా సరిపోదు. వర్షంలో తడవని వారు, ఈ సినిమా చూడని తెలుగువారు ఉండరు. ఈ చిత్రం విడుదలయ్యి 66 సంవత్సరాలలో ఇన్ని తరాల వారిని, ఇన్ని దశబ్దాలుగా అల్లరిస్తూనే ఉంది. వన్నె తరగని చిత్రం. భారతదేశంలో అన్ని భాషలలో ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ చిత్రాలు 10 చెప్పమంటే ఖచ్చితంగా “మాయాబజార్” చిత్రం ముందు వరుసలో ఉంటుంది.

ఈ మధ్య సిఎన్‌ఎన్-న్యూస్18 టీవీ చానెల్ నిర్వహించిన సర్వేలో భారతీయ సినిమాల్లో సర్వకాలిక అత్యుత్తమమైన చిత్రంగా ఎంపికైన సినిమా “మాయాబజార్”. ఈ చిత్రం ఆంధ్ర దేశమంతటా 27 మార్చి  1957 వ తేదీన విడుదలై అత్యద్భుత విజయం సాధించింది. 2023 మార్చి నాటికి  66 ఏండ్లు పూర్తిచేసుకొన్న ఈ సినిమాపై వివిధ టెలివిజన్ ప్రసార వాహినులు (ఛానళ్ళు), వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రత్యేక వ్యాసాలు అందించాయి.

How the Telugu classic Cinema, Mayabazar, set a trend

సినిమాకు సంబంధించిన 24 విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తే ఎలా ఉంటుందో ఈ చిత్ర విజయం నిరూపించింది. తరతరాలుగా తెలుగువారు పదిలపరుచుకోగల జ్ఞాపకాల పేటిక ఈ చిత్రం. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎవ్వరూ ఎప్పటికీ కదల్చలేని స్థిరమైన మైలురాయి ఈ చిత్రం. సినిమా కథకి వెండితెర అనువాదానికి పాఠ్యగ్రంథం ఈ చిత్రం. తెలుగు వాడి ఆస్తి, తెలుగువాడి సంతకం, తెలుగువాడి జ్ఞాపకం, తెలుగువాడి సర్వస్వం ఈ చిత్రం.

ప్రధాన తారాగణం…

  • నందమూరి తారక రామారావు.. (కృష్ణుడు)
  • అక్కినేని నాగేశ్వరరావు.. (అభిమన్యుడు)
  • సావిత్రి..   శశిరేఖ (బలరాముని కుమార్తె)
  • ఎస్.వి.రంగారావు.. (ఘటోత్కచుడు)
  • రేలంగి..  (లక్ష్మణ కుమారుడు)
  • గుమ్మడి వెంకటేశ్వరరావు.. (బలరాముడు)
  • ముక్కామల..  (దుర్యోధనుడు)
  • సి.ఎస్.ఆర్. ఆంజనేయులు.. (శకుని)
  • ఛాయా దేవి..  రేవతీ దేవి (బలరాముని భార్య)
  • ఋష్యేంద్రమణి..  (సుభద్ర)
  • సంధ్య…   (రుక్మిణి)
  • నాగభూషణం…   (సాత్యకి)
  • మిక్కిలినేని…   (కర్ణుడు)
  • ఆర్.నాగేశ్వరరావు..  (దుశ్శాసనుడు)
  • రమణారెడ్డి…   (చినమయ)
  • అల్లు రామలింగయ్య..  (తానాశర్మ)
  • వంగర వెంకటసుబ్బయ్య..  (తందాన శాస్త్రి)
  • సూర్యకాంతం…   (హిడింబి)

మాయాబజార్ సంక్షిప్త కథ..

బలరామ కృష్ణుల చెల్లెలు, పాండవుల్లో ఒకడైన అర్జునుడి భార్య సుభద్ర తన కొడుకు అభిమన్యుడితో పాటుగా పుట్టిల్లు అయిన ద్వారక వస్తుంది. బావా మరదళ్ళైన అభిమన్యుడు, శశిరేఖలు చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఆప్యాయంగా మసులుకొంటూ ఉంటారు. బల పరాక్రమాల్లో పాండవుల వారసునిగా నిరూపించుకుంటూ ఉన్న అభిమన్యుడిపై శశిరేఖ ముచ్చటపడిన సందర్భంలో కృష్ణుడి ప్రోద్భలంతో సుభద్ర అన్నగారు బలరాముడిని వరం కోరుకుని తన కుమారుడు అభిమన్యునికి, శశిరేఖను ఇచ్చి పెళ్ళి చేసే విషయంలో మాట తీసుకుంటుంది. ఆపైన సుభద్ర, అభిమన్యుడు ఇంద్రప్రస్థానికి తరలి వెళ్ళిపోతారు.

కౌరవులతో ఆడిన మాయ జూదంలో పాండవులు రాజ్యాన్ని, సంపదనీ, తమనీ, చివరికి ద్రౌపదిని కూడా ఒడ్డి ఓడిపోయి ద్రౌపదికి తీవ్ర అవమానం జరుగుతుంది. ఆపైన రాజ్యం కోల్పోయి 12 ఏళ్ళ వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం వెళ్తారు. రాజ్యసంపదలు కోల్పోయి సుభద్ర అభిమన్యుడితో సహా తన పుట్టిల్లు ద్వారకకు తిరిగి వస్తుంది. దానికి ముందే కృష్ణుడి ద్వారా ఈ వివరాలు తెలిసిన బలరాముడు హస్తినాపురం వెళ్ళి కౌరవులను మందలించి, పాండవుల రాజ్యాన్ని వారికి ఇప్పిస్తానని ఆగ్రహావేశాలతో బయలుదేరుతాడు. బలరాముని మనస్తత్వం తెలిసిన శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణులతో సహా ఆయనను అతిగా ముఖస్తుతి చేసి, పాండవులు బలరాముని అవమానిస్తూ మాట్లాడారని కల్పించి తమ విజయం ధర్మ జూదంలో జరిగిన విజయమేనని నమ్మిస్తారు.

How the Telugu classic Cinema, Mayabazar, set a trend

దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడు తనకు శశిరేఖను ఇచ్చి వివాహం చేయమని వరం కోరుకుంటాడు, అప్పటికే పొంగిపోయివున్న బలరాముడు అంగీకరిస్తాడు. పాండవులు రాజ్యాన్ని పోగొట్టుకోవడం, వాళ్ళ పేదరికం చూసి బలరాముడు తన కుమార్తెను అభిమన్యుడికి ఇవ్వననడం. కృష్ణుని రంగప్రవేశం  ఘటోత్కచుడి మాయాజాలం. ఇలా ఆసక్తికర పరిణామాల క్రమముంటుంది. ఈ నేపథ్యంలో బోలేడంత వినోదం ఉంటుంది. ఆబాలగోపాలన్ని ఆకట్టుకోగల అంతస్సూత్రమే విజయమంత్రంగా మారింది. అంతస్తుల తారతమ్యాలతో పెళ్లిళ్ళు ఆగిపోవడమనే సోషల్ డ్రామాలు ఈనాటికి సజీవంగా నడుస్తున్నాయి. కాబట్టే ఇప్పటికీ ప్రేక్షకుల్ని ఈ సినిమా విపరీతంగా కట్టిపడేయగలుగుతుంది.

మాయాబజార్ కు ముందు, తరువాత..

మాయాబజార్ కథతో ఇప్పటివరకు భారతీయ సినిమా చరిత్రలో దాదాపు పదకొండు చిత్రాలు వచ్చాయి. 1957లో విజయా వారి మాయబజార్ రాకముందు 7 చిత్రాలు, వచ్చిన తర్వాత 4 చిత్రాలు తెలుగు సహా పలు భారతీయ భాషల్లో శశిరేఖా పరిణయం కథాంశంగా సినిమాలు వచ్చాయి.

1..  మూకీ (మూగ) సినిమాల కాలంలో 1925లో బాబూరావు పైంటర్ దర్శకత్వంలో “మాయాబజార్ ఉరఫ్ సురేఖా హరన్” విడుదలయ్యింది. ఇందులో కథానాయకుడు వి.శాంతారాం.

2.. టాకీ సినిమాలు వచ్చిన తరువాత అదే పేరుతో “మాయాబజార్ ఉరఫ్ సురేఖా హరన్” చిత్రికరించారు. హిందీలో తీసిన ఈ చిత్రం 1932లో విడుదలయ్యింది. నానూభాయి వకీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

3… అదే కథతో తమిళంలో “మాయాబజార్ ఉరఫ్ వత్సల కళ్యాణ్” గా సినిమా వచ్చింది. తమిళ రూపకానికి ఆర్.పద్మనాభన్ దర్శకత్వం వహించారు. 1935 లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. 

4.. “మాయాబజార్ ఉరఫ్ శశిరేఖా పరిణయం” పేరుతో 1936లో పి.వి.దాసు దర్శకత్వంలో తెలుగులో ఈ సినిమాను చిత్రీకరించారు. ఇందులో శశిరేఖగా శాంతకుమారి నటించింది. ఇది తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి మాయాబజార్ చిత్రం.

5.. ఇదే కథతో మరాఠీలో “మాయాబజార్” సినిమా 1939లో వచ్చింది. ఈ చిత్రానికి జి.వి.పవార్ దర్శకత్వం వహించారు.

6.. ఇదే కథతో ఏక కాలంలో మరాఠి మరియు హిందీలో 1949లో “మాయాబజార్ ఉరఫ్ వత్సలా హరన్”గా చిత్రికరించారు. ఈ చిత్రానికి ధర్మదత్తాధికారి దర్శకత్వం వహించారు.

7.. ఇదే కథతో “వీర ఘటోత్కచ ఉరఫ్ సురేఖా హరన్” పేరుతో హిందీలో సినిమా తీశారు. 1949లో చిత్రీకరించిన ఈ చిత్రానికి నానాభట్ గారూ దర్శకత్వం వహించారు. వీరు ప్రముఖ దర్శకులు మహేష్ భట్ గారి నాన్నగారు. ఇందులో మీనాకుమారి శశిరేఖగా నటించారు.

8.. ఇదే కథతో తెలుగు, తమిళ భాషలలో “మాయాబజార్” అనే చిత్రాన్ని నిర్మించారు. 1957లో చిత్రీకరించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు కె.వి.రెడ్డి గారు దర్శకత్వం వహించారు. ఆ తరువాత 14 సంవత్సరాలకు 1971లో దీనిని హిందీలోకి అనువాదం చేశారు.

How the Telugu classic Cinema, Mayabazar, set a trend

9.. ఇదే కథతో బాబూభాయి మిస్త్రీ 1958లో హిందీ మాయాబజార్‌ అనే చిత్రాన్ని చిత్రికరించారు. ఈ చిత్రంలో కథానాయిక అనితా గుహా. తరువాత ఈ సినిమా “వీర ఘటోత్కచ” పేరుతో తెలుగు, తమిళ, కన్నడ భాషలలోకి అనువదించబడింది.

10.. ఇదే కథతో హిందీలో “వీర్ ఘటోత్కచ” సినిమా చిత్రికరించారు. దీనికి శాంతిలాల్ సోనీ దర్శకత్వం వహించారు.

11.. ఇదే కథతో 1984లో బాబూభాయి మిస్త్రీ హిందీలోను, గుజరాతీలోను   “మాయాబజార్” చిత్రం రంగులలో చిత్రీకరించారు.

మాయాబజార్ సినిమా ప్రారంభానికి బాలారిష్టాలు..

స్క్రిప్టు అంతా సిద్ధం అయిపోయింది. సినిమా చిత్రీకరణ ప్రారంభోత్సవం చేయాల్సి ఉన్న సమయంలో పిడుగులాంటి వార్త వచ్చి పడింది. ఈ సినిమా నిర్మాణం ఆపేస్తున్నట్లు నిర్మాతలు చక్రపాణి, నాగిరెడ్డిలు ప్రకటించేశారు. సినిమా ఎందుకు ఆపేశారో కె.వి.రెడ్డి గారికి అర్థం కాలేదు. కానీ అంతకుముందు “చంద్రహారం” తీసి నష్టాల్లో ఉన్నారు. మళ్ళీ ఈ సినిమా వల్ల నష్టం వస్తే కోలుకోలేరని అంత భారీ బడ్జెట్ తో సినిమా కష్టం అని తెల్చేశారు. మాయాబజార్ స్క్రిప్టు కోసమే ఒక సంవత్సరం కష్టపడ్డారు కె.వి.రెడ్డి గారూ. సినిమా ఆపేసరికి ఏ.వి.యం. చెట్టియార్ గారూ ఆ స్క్రిప్టుతో మాయాబజార్ చేయడానికి ముందుకు వచ్చారు. ఏ.వి.యం.పిక్చర్స్ స్థాపించి లేతమనుషులు, భక్త ప్రహ్లాద లాంటి చిత్రాలు తీశారు.

చిత్ర పంపిణీదారు పూర్ణచంద్రరావు గారి ద్వారా కె.వి.రెడ్డి గారిని సంప్రదించి ఆ చిత్రం మాకు తీయమని ఏ.వి.యం. చెట్టియార్ గారూ అడిగారు. దానికి కె.వి.రెడ్డి గారు నేను ఆ స్క్రిప్టు కోసం సంవత్సరం కష్టపడ్డాను విజయా సంస్థ కోసం. వారికే తీస్తాను అని అన్నారు. దాంతో  ఏ.వి.యం. చెట్టియార్ గారూ తన ప్రయత్నం విరమించుకున్నారు. ఆ తర్వాత సుందర్ లాల్ మెహతా అనే వ్యక్తి కూడా కె.వి.రెడ్డి గారిని సంప్రదించారు. అయినా కె.వి.రెడ్డి గారు ఒప్పుకోలేదు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న నాగిరెడ్డి, చక్రపాణి గార్లు మనసు మార్చుకుని పంపిణీదారు పూర్ణచంద్రరావు గారిని పంపించి వాళ్ళు పరిమిత బడ్జెట్ షరతుతో మళ్ళీ సినిమా పట్టాలకెక్కింది.

“శ్రీకృష్ణుడు”గా నందమూరి తారకరామారావు..

కె.వి.రెడ్డి గారూ మాయాబజార్ సినిమా అనుకోగానే అందులో ప్రధాన పాత్రలలో ఒకటైన శ్రీకృష్ణుడు పాత్ర ఎవరితో చేయించాలా అని సుదీర్ఘ ఆలోచన అనంతరం తనకు తట్టిన పేరు నందమూరి తారకరామారావు గారూ. అంతకు ముందు ఎన్టీఆర్ గారూ “ఇద్దరు పెళ్ళాలు” చిత్రంలో కొద్దిసేపు కొద్దిసేపు అలా కనిపించారు. ఆ తరువాత ఘంటశాల గారూ 1956లో నిర్మించిన “సొంతవూరు” లో రెండు నిముషాలు కృష్ణుడు పాత్ర ధరించారు. కానీ ప్రేక్షకులకు శ్రీకృష్ణుడు పాత్ర అంటే ఈలపాటి రఘురామయ్య గారే గుర్తొస్తారు. దాంతో ఎన్టీఆర్ గారిని ప్రేక్షకులు శ్రీకృష్ణుడుగా అంగీకరించలేదు.

అందువలన ఎన్టీఆర్ గారూ కె.వి.రెడ్డి గారిని శ్రీకృష్ణుడు పాత్ర తనకు సరిపోదని, ఇంకెవరినైనా ఆ పాత్రకు ఎంచుకోమని చెప్పారు. కానీ ఎందుకో కె.వి.రెడ్డి గారికి ఎన్టీఆర్ గారి మీదనే విపరీతమైన నమ్మకం. అందుకే కె.వి.రెడ్డి గారూ ఎన్టీఆర్ గారిని ఎలాగోలా ఒప్పించేశారు. కె.వి.రెడ్డి గారూ, పింగళి నాగేంద్రరావు గార్లు కళా దర్శకులు మాధవపెద్ది గోఖలే, కళాధర్ లతో చర్చించి శ్రీకృష్ణుడు పాత్రకి ఆహార్యం ఎలా ఉండాలో డజన్ల కొద్దీ స్కెచ్ లు గీయించి, దాన్లోంచి ఒక దానిని అంతిమంగా తీసుకున్నారు.

శ్రీకృష్ణుడుకి సినిమాలలో ఇంతకుముందు సగం కిరీటమే ఉండేది. అలా కాకుండా లోహంతో పూర్తి కిరీటం తయారు చేయించి, మడిమకుటం లాంటి రంగుల రాళ్ళు అద్దిన కిరీటం తయారు చేయించారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, మెడలో వనమాల, కౌస్తభం లాంటివి ఆహార్యంగా ఎంపిక చేశారు. పీతాంబరం, భక్తవత్సలం కలిసి ఎన్టీఆర్ గారికి మేకప్ వేశారు. లోపల ఎన్టీఆర్ గారికి మేకప్ జరుగుతుంది. బయట అందరూ ఆత్రుతగా చూస్తున్నారు. సముద్రాల సీనియర్, ఘంటశాల, త్రివిక్రమరావు, నాగిరెడ్డి, చక్రపాణి, పింగళి నాగేశ్వరావు లాంటి వారు ఉన్నారు.

సినిమా చిత్రీకరణ శ్రీకృష్ణుడు పాత్రతోనే మొదలవుతుంది. ఎన్టీఆర్ గారికి మేకప్ వేశారు. చిత్రీకరణ ప్రారంభం అవుతుండగా సరిగ్గా 9 గంటలకు ఎన్టీఆర్ గారూ శ్రీకృష్ణుడు వేషంతో నడుచుకుంటూ వస్తున్నారు. ఆ సన్నివేశాన్ని చూసిన వారంతా కూడా ఎన్టీఆర్ గారూ వస్తున్నారా, లేక సాక్షాత్తు శ్రీకృష్ణుడే నడిచి వస్తున్నాడో అర్థం కాక ఎన్టీఆర్ గారి వైపు తదేకంగా చూస్తుండిపోయారు.  కె.వి.రెడ్డి గారిని అభినందించారు. తెలుగువారి శ్రీకృష్ణుడు జన్మించినది మాయాబజార్ సినిమా నుండే అని చెప్పుకోవాలి.

ఆ తరువాత ఎన్టీఆర్ గారూ 18 సినిమాలలో పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడుగా నటించారు. 25 సంవత్సరాలలో 33 చిత్రాలలో ఎన్టీఆర్ గారూ శ్రీకృష్ణుడుగా నటించారు. మాయాబజార్ కు, దానవీర శూర కర్ణ సినిమాకు మధ్యలో 20 సంవత్సరాల వ్యత్యాసం ఉండి. అయినా కూడా శ్రీకృష్ణుడు పాత్రలో ఏమాత్రం ఔన్నత్యం ఏమాత్రం తగ్గలేదు. ఆ రోజుల్లో సుమారు 50 వేల క్యాలెండర్లు ఎన్టీఆర్ గారూ శ్రీకృష్ణుడుగా ఉన్న చిత్రాలను అచ్చువేయించారట. అక్కినేని నాగేశ్వరావు గారి తల్లి గారూ, ఎన్టీఆర్ గారూ శ్రీకృష్ణుడుగా వేషం ధరించిన బొమ్మను తన పూజ గదిలో పెట్టుకున్నారు. అంటే ఎన్టీఆర్ గారూ ధరించిన శ్రీకృష్ణుడు పాత్ర ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.

“శశిరేఖ”గా సావిత్రి నటన అమోఘం…

ఒక సినిమా కథ యొక్క స్క్రిప్ట్ సరిగ్గా ఉంటే నటీనటుల నుండి అద్భుతమైన నటన వెలికితీయవచ్చు. నటులు ప్రతిభావంతులయితే ప్రేక్షకుల ఆనందానికి అవధులుండవు. సావిత్రి గారూ తన అద్భుతమైన నటనా చాతుర్యంతో అటు ప్రేక్షకలోకాన్ని, ఇటు దర్శక నిర్మాతల్ని మెప్పించారు. దర్శకుడు చెప్పిన సన్నివేశాల్ని, సూచనలను శ్రద్ధగా, ఏకాగ్రతతో, మనసుపెట్టి వినేవారు. ఒక్కసారి నటనలోకి దిగితే బయటి ప్రపంచంతో సంబంధం లేనట్లుగా నటనలో లీనమైపోయేవారు.

How the Telugu classic Cinema, Mayabazar, set a trend

మాయాబజార్ లోని “ఆహా నా పెళ్లంట” పాటలో “తాళి కట్టవచ్చునంట తగని సిగ్గు నాకంట” అనే సన్నివేశంలో క్రౌర్యం గానూ, సౌమ్యం గానూ నర్తించడంలో సావిత్రి గారి నటన అద్భుతం, అనితర సాధ్యం. ఘటోత్కచుడు శశిరేఖ గా మారే సందర్భంలో పాత్రకు సంబంధించిన లక్షణాలు ఏమాత్రం మారకుండా కఠినమైన స్వరంతో గంభీరమైన సంభాషణలు పలికించడం మహానటి సావిత్రి గారికే సాధ్యమైంది. సహజ నటనతో ఆకట్టుకునే సావిత్రి గారూ సెట్లో ఎక్కువగా రిహార్సల్స్ కు సమయం కేటాయించాల్సిన అవసరం వచ్చేది కాదు. అంత గొప్ప నటి కనుకనే ఆవిడ గారూ మహానటి అనిపించుకోగలిగారు .

“ఘటోత్కచుడు” గా యస్.వి.రంగారావు..

“విశ్వ నట చక్రవర్తి” గా దక్షిణ భారత చలనచిత్ర రంగంలో స్టార్ స్టేటస్‌ను అనుభవించిన మొట్టమొదటి క్యారెక్టర్ నటుడు యస్.వి.రంగారావు గారూ. వీరి నటనాచాతుర్యం గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడు. ఘటోత్కచుడు పాత్రకు యస్.వి.రంగారావు గారిని ఎంచుకున్నారు. కానీ ఘటోత్కచుడు యువకుడు. ఆ పాత్ర పోషించే యస్.వి.రంగారావు గారూ పెద్దవారు. ఎలా అని ముందు సంకోచించారు దర్శకులు కె.వి.రెడ్డి గారూ.

ఆ తరువాత రాక్షస పాత్ర కాబట్టి ఆ మాత్రం ఉండాలి పర్లేదు అనుకున్నారు. యస్.వి.రంగారావు గారి నటన, పింగళి నాగేంద్రరావు గారి సంభాషణల నడుమ దర్శకులు కె.వి.రెడ్డి గారి సందేహాలు పటాపంచలైపోయాయి.

యస్.వి.రంగారావు గారు ప్రతీ సన్నివేశంలో కళ్ళతో, కనుబొమ్మలతో, నొసటితో, నోటితో, బహువులతో, చేతులతో, యదతో, ఉదరంతో, తనువులోని ప్రతీ అవయవంతో నటించారు. చక్కటి హాస్యాన్ని, అద్భుతరసాన్ని పండించారు.

అజరామర సంగీతం..

ఇప్పటికీ “మాయాబజార్” చిత్రంలోని పాటలకు అశేష ప్రేక్షకాధరణ ఉంది. ఘంటశాల గారితో విజయా సంస్థ వారికి అయిదు చిత్రాలకు పనిచేసేలా ఒప్పందం ఉంది. తమ అయిదో చిత్రం “మిస్సమ్మ” దర్శకులు యల్.వీ.ప్రసాద్ గారూ సాలూరు రాజేశ్వరరావు గారిని సంగీత దర్శకులుగా తీసుకున్నారు. మాయాబజార్ కు కూడా సాలూరు రాజేశ్వరరావు గారినే తీసుకున్నారు. ఓ నాలుగు పాటలు సంగీతం అందించిన అనంతరం దర్శకులు కె.వి.రెడ్డి గారికి, సాలూరు రాజేశ్వరరావు గారికి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో సాలూరు గారిని వద్దని ఆ స్థానంలో ఘంటశాల మాస్టారు గారిని తీసుకున్నారు. “శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా చిన్నారి శశిరేఖ వర్థిల్లవమ్మా”, “లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా”, “నీకోసమే నే జీవించునది”, “కుశలమా కుశలమా నవ వసంత మధురిమా”, ఆహా నా పెళ్లంట, ఓహో నా పెళ్లంట”, “వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు” లాంటి మధురమైన పాటలు అందించారు. ఘంటశాల గారూ తన మాధుర్యమైన శ్రావ్యంతో అద్భుతంగా పాటలను ఆలపించారు. ఇప్పటికీ కూడా దారి వెంబడి వెళుతున్నప్పుడు ఎక్కడైనా దూరంగా మైకులో ఆ పాటలు వినబడుతూ వుంటే మనసు ఉల్లాసంగా గాలిలో తేలిపోతూ ఉంటుంది.

మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహక మాయాజాలం..

ఛాయాగ్రాహక మాయాజాలం లో సిద్ధహస్తులు మార్కస్ బార్ట్లే గారూ. కెమెరా మాంత్రికుడుగా ప్రసిద్ధి చెందిన వీరు మాయాబజార్ చిత్రానికి గుండెకాయ లాంటి వాడు. వీరు తెరపై చేసిన అద్భుతాలు అసాధారణమైనవి. “లాహిరి లాహిరి లాహిరిలో” పాట చిత్రీకరణ ఇందుకు ఉదాహరణ. అభిమన్యుడు, శశిరేఖ పడవలో విహరిస్తూ పాడుకునే ఆ పాటను వేర్వేరు ప్రాంతాలలో చిత్రీకరించారు. సినిమా చూసే ప్రేక్షకులకు ఈ తేడా అగపించదు. మొదట మద్రాసు నుండి ఆంధ్రప్రదేశ్ వచ్చే దారిలో ఎన్నూరు అనే గ్రామంలో గల సరస్సులో చిత్రీకరించారు.

వాహినీ స్టూడియోలో పున్నమి వెన్నెల సోయగాన్ని సృష్టించారు. పగటివేళ నదిపై వెన్నెల కిరణాలు ప్రతిఫలిస్తున్నట్లుగా చేయడం కోసం ఫిల్టర్స్ ఉపయోగించారు. తెల్లటి గడ్డి (సెట్టింగు) వెన్నెల వెలుతురులో మెరిసిపోతున్నట్లుగా అద్భుతంగా చిత్రికరించారు. లైటింగ్ లో గానీ, ఎడిటింగ్ లో గానీ దుర్భిణీ వేసి వెతికినా అగుపించనంత చక్కగా చిత్రీకరించడం ఒక్క “బార్ట్లే” కే సాధ్యం. సాంకేతికంగా తెలుగు సినిమా చరిత్రలో “లాహిరి లాహిరి లాహిరిలో” పాట చిత్రీకరణ నిస్సందేహంగా ఓ అద్భుతం అని చెప్పాలి. మాయాబజార్ లో ఘటోత్కచుడు సృష్టించిన వస్తువులు మాయమయ్యే దృశ్యాలయితే నభూతో నభవిష్యత్ అన్నట్లుంటాయి.

గింబళి (చాప) చుట్టుకునే సన్నివేశం అయితే ఇప్పటికీ ఊహకు అందదు. “వివాహ భోజనంబు వింతైన వంటకంబు” పాట మొత్తం కూడా సెట్టింగే. సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రమే ఉన్న ఆ రోజులలో లడ్డూలు నోట్లోకి పోవడం వంటి సన్నివేశాలకు ఎక్కువ సమయం పట్టింది. ఛాయాగ్రహకులు “మార్కస్ బార్ట్లే” కు పన్నెండు మంది సహాయకులు, పన్నెండు మంది ఉప సహాయకులు ఉండేవారు. విధి నిర్వాహణలో చాలా కఠినంగా ఉండేవాడు. కొంచెం కోపిష్టి కూడనూ. కెమెరా ఛాయల్లోకి దర్శకున్ని తప్ప వేరేవ్వరిని ఆ ఛాయల్లోకి కూడా రానిచ్చేవారు కాదు.

తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో చిత్రీకరణ…

మాయాబజార్ చిత్రాన్ని ఒకేసారి చిత్రీకరించారు. రామారావు గారూ, సావిత్రి, యాస్వీయార్, ఋష్యేంద్రమణి (సుభద్ర), సంధ్య (రుక్మిణి) తమిళంలో అవే పాత్రలు పోషించారు. కె.వి.రెడ్డి గారూ చిత్రీకరణ ఉదయం 7 గంటలకు మొదలుపెట్టి, సాయంత్రం 6 గంటలకు ముగించేవారు. ఏ సంభాషణ ఎంతసేపు చెప్పాలో స్క్రిప్టులో వ్రాసుకునేవారు. స్టాప్ వాచ్ పెట్టుకుని ఖచ్చితంగా ఆ సంభాషణ నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా జాగ్రత్తపడేవారు. స్క్రిప్ట్ కోసం దాదాపు సంవత్సరం సమయం తీసుకునేవారు. కె.వి.రెడ్డి గారూ ఒక్కో సినిమాకు కనీసం మూడేళ్లు సమయం తీసుకునేవారు.

సినిమా ఎన్నో విభాగాల సమాహారం. ఎక్కడ తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. మాయాబజార్లో ఎక్కడా కూడా తేడా రాలేదు. అన్ని రసాలు సమపాళ్లలో ఉండడం ఈ చిత్రానికి అనుకూలంగా మారింది. హాస్యం అద్భుతంగా పండింది. సూర్యకాంతం, చదలవాడ, రేలంగి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, నల్ల రామూర్తి లాంటి వారు హాస్యంలో తమదైన మార్కు చూపించారు. మాయ శశిరేఖ కాలు తొక్కినప్పుడు లక్ష్మణకుమారుడు (రేలంగి)  చూపించే హావభావాలు హాస్య నటులకు అమూల్య పాఠాలు.

“ఎంత మదమెంత కావరమెంత పొగరు” వంటి సంభాషణలతో పింగళి నాగేంద్రరావు గారి కలం కదం తొక్కింది. “వీరతాళ్లు”, “తస్మధీయులు” వంటి పదాలు జన సామాన్యంలో కలిసిపోవడం విశేషం. కళాధర్, గోఖలేల కళా దర్శకత్వం ప్రేక్షకుల్ని ఒడుపుగా కథాకాలంలోకి తీసుకెళ్ళింది. ఎ.కృష్ణన్, వి.శివరాంల శబ్దాగ్రహణం, జంబులింగం, కళ్యాణంల కూర్పు, పీతాంబరం, భక్తవత్సలం మేకప్, ఘంటశాల, మాధవపెద్ది, లీల, వసంత కుమారి, సుశీల, జిక్కీల నేపథ్యగానం అన్నీ కలిసి మాయాబజార్ ని “నభూతో నభవిష్యతి” అనేలా తీర్చిదిద్దాయి.

విడుదల..

నిర్మాతలు చక్రపాణి, నాగిరెడ్డి గార్ల మనసుల్లో చిత్రం విజయం గురించి ఒకటే ఆలోచన. చక్రపాణి, నాగిరెడ్డి, కె.వి.రెడ్డి గార్ల కుటుంబ సభ్యులు, వాళ్ళ ముఖ్యమైన స్నేహితులు మాత్రమే ప్రివ్యూ షో కు హాజరయ్యారు. సినిమా బాగా వచ్చిందని ఒకరినొకరు అభినందించుకున్నారు. కానీ ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందోనన్న సందేహం అందరిలోనూ ఉంది. అప్పటికే భారీ బడ్జెట్ తో తీసిన “చంద్రహారం” సినిమా ఫ్లాప్ అయ్యి ఉండడంతో నాగిరెడ్డి, చక్రపాణి గార్లలో టెన్షన్ పెరిగిపోయింది. సినిమా విడుదలయ్యాక లక్ష్మణ కుమారుడిని మరీ పనికిమాలినవాడిలా చూపించారు. హాస్యం కోసం అతన్ని బఫూన్ లా మార్చారు.

సినిమా అంతా మసాలా దట్టించారు అని ప్రముఖులు విమర్శలతో దాడి చేశారు. కానీ ప్రేక్షకులు ఎస్విఆర్ నటన బాగుంది. ఎన్టీఆర్ కృష్ణుడిలా అచ్చుగుద్దినట్టు సరిపోయాడు. సావిత్రి బాగా నటించింది. ఇలాంటి కామెంట్లు వినిపించాయి. కొన్ని రోజుల తర్వాత సూపర్ హిట్ అని తేలిపోయింది. అప్పుడు చూడాలీ చక్రపాణి, నాగిరెడ్డి గార్ల మొహాల్లో ఆనందం అంతులేనిది. కానీ మొదటి నుంచి చివరిదాకా నింపాదిగా ఉన్న వ్యక్తి మాత్రం ఒకే ఒక్కడు కె.వి.రెడ్డి గారూ. స్క్రిప్ట్ మీద నటుల మీద పూర్తి నమ్మకం ఉంది. సినిమా బాగా ఆడుతుంది అన్నారు. అదే నమ్మకంతో సంతోషంగా ఉన్నారు. కాకపోతే సినిమా విజయవంతం అయ్యాక మరింత సంతోషంగా కనిపించారు.

తెలుగులో ఈ చిత్రం 24 కేంద్రాల‌లో శతదినోత్సవం జరుపుకుంది. 4 సెంట‌ర్స్ లో ర‌జ‌తోత్స‌వం జ‌రుపుకుంది. ఇక రిపీట్ ర‌న్స్ లో లెక్క‌లేన‌న్ని సార్లు విడుద‌లై, ప్ర‌తీసారి వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించిందీ చిత్రం. ఆ రోజుల్లో 2 లక్షల రూపాయలతో సినిమా తీస్తే భారీ బడ్జెట్ చిత్రం అనేవారు. అలాంటిది ఈ సినిమాకు సుమారు 6 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అతిరథ, మహారథ, మహా మహారథులు ఈ చిత్రంలో నటించారు. తెలుగువారి అత్యంత అభిమాన‌పాత్ర‌మైన చిత్రంగా ప‌లుమార్లు మాయాబ‌జార్ ఎన్నిక‌యింది. ఇక 2013 మేలో ఐబీయ‌న్ సంస్థ నిర్వ‌హించిన పోల్ లో కే.వీ.రెడ్డి గారూ రూపొందించిన మాయాబ‌జార్ భార‌త‌దేశంలో అత్య‌ద్భుత చిత్రంగా ఎన్నిక‌యింది. వంద‌లాది ప‌ర‌భాషా చిత్రాల‌ను త్రోసి రాజ‌ని విజ‌యావారి మాయాబ‌జార్ ఆ ఘ‌న‌త‌ను సాధించుకోవ‌డంలో తెలుగువారి సినిమా అభిమానం కూడా క‌నిపిస్తుంది. ఇక తెలుగునాట ఎంతోమందికి, చిత్ర ప్ర‌ముఖుల‌కు సైతం అభిమాన చిత్రంగా మాయాబ‌జార్ నిల‌చింది.

రంగుల్లోకి మాయాబజార్ చిత్రం…

నలుపు, తెలుపులో ఉన్న ఈ చిత్రాన్ని గోల్డ్‌స్టోన్ అనే సంస్థ 2010 జనవరి 30 న రంగుల్లో విడుదల చేశారు. మాయాబజార్ పాత ఫిల్ములో సౌండ్ ట్రాక్‌లన్నీ పూర్తిగా అరిగిపోవడంతో వినసొంపుగా లేవు. అందుకని వాటి మూలం చెడకుండా నేపథ్య సంగీతాన్ని మొత్తం రీరికార్డింగ్ చేశారు. దాని తర్వాత సినిమాను 70 ఎం.ఎం. డీటీఎస్ కి మార్చారు. ఇందుకోసం దాదాపు 165 మంది సాంకేతిక నిపుణులు దాదాపు ఏడాది సమయం పాటు పనిచేశారు.

How the Telugu classic Cinema, Mayabazar, set a trend

పాత మాయా బజార్ కు కొత్త మాయా బజార్ కు తేడాలు..

చాలా సన్నివేశాలు గానీ, పాటలు గానీ, పూర్తిగా తొలగించడం గానీ , పాక్షికంగా తొలగించడం గానీ జరిగింది.

లల్లి లలా – కొంత భాగం..

చూపులు కలసిన శుభవేళ – పూర్తిగా..

భళి భళి దేవా – పూర్తిగా..

విన్నావా యశోదమ్మా – కొంత భాగం..

మోహిని భస్మాసుర నృత్యనాటిక – పూర్తిగా..

శకుని పై చిత్రించిన పద్యం – పూర్తిగా..

రేలంగి – పెళ్ళికి రిహార్సిల్స్ – పూర్తిగా..

పాండవ బంధుకోటి బంధు – పద్యం – పూర్తిగా..

ఇంకా, కొద్ది పాటి మార్పులు ఉన్నాయి. అయినా, ఈ ప్రయత్నం కూడా బహుళ ప్రజాదరణ పొందింది. 50 రోజుల పండుగ కూడా జరుపుకుంది.

మాటలు లేని చోటుల్లో కెమెరా మరింత అద్భుతంగా పనిచేస్తుంది. ఉదాహరణకు చిన్న పిల్లగా ఆడుకుంటున్న శశిరేఖ ఉద్యానవనంలో ఒక కొలను గట్టున అలవోకగా కూర్చుంటుంది. కెమెరా ఆమె మొహమ్మీదనుంచి మెల్లగా పాన్ అయి కొలనులోని తామరమొగ్గను చూపిస్తుంది. గడచి పోతున్న కాలానికి గుర్తుగా కొలనులో అలలు రేగడమూ, ఆ మొగ్గ మెల్లగా విచ్చుకోవడమూ, ఆ తర్వాత కెమెరా మెల్లగా వెనక్కి తిరిగి శశిరేఖ మొహాన్ని చూపడమూ జరుగుతాయి. ఇప్పుడక్కడ నవయవ్వనవతి యైన శశిరేఖ అంటే సావిత్రి ఉంటుంది.

Show More
Back to top button