ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని అని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది” అంటూ సుఖదుఃఖాలు సినిమాలో గొప్ప జీవన సత్యాన్ని ఆవిష్కరిస్తూ సాగిన పాటలో నటించిన కథానాయిక నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిజానికీ ఆ చిత్రంలో ఆమె పాత్ర చిన్నదే కావొచ్చు. కానీ ఆమె దృష్టిలో ఏ పాత్రలోనైనా మెప్పించడం ముఖ్యం. అది చిన్నదా పెద్దదా అని ఆమె ఏనాడూ పట్టించుకోలేదు. ఆత్మవిశ్వాసానికి, స్వయంకృషిని జోడించి నటనా జీవితంలో ఉత్తుంగ శిఖరాన్ని అందుకున్న కళాభినేత్రి ఆమె. ఆవిడే వాణిశ్రీ. తన అస్తిత్వ విచికిత్సలో ప్రగాఢమైన లోతులను శోధించి, నిజ జీవితంలోనూ క్రమబద్ధతనూ, సార్థకతనూ ఆవిడ సాధించారు.
ఆమె ఆత్మ విశ్వాసం పొగరుగా, ఆమె ధైర్యం ఎదిరింపుగా కనిపించినా ఆమె నిజ జీవితంలో నిజాయితీ అనే సూత్రాన్నే నమ్మేవారు. తన అంకురిత దీక్ష, నిరంతర కృషి, అసమాన నటనా ప్రతిభతో తెలుగు చిత్రరంగంలో మహానటి సావిత్రి తరువాత తరంలో అంతటి కళాభినేత్రిగా పేరు తెచ్చుకున్నారు వాణిశ్రీ. ప్రేమ్ నగర్, దసరా బుల్లోడు, ఆరాధన, జీవిత చక్రం, రంగుల రాట్నం, శ్రీకృష్ణ తులాభారం, భక్త కన్నప్ప, బొబ్బిలి రాజా ఇలా తెలుగులో అత్యధిక సిల్వర్ జూబ్లీ చిత్రాలలో రాణించిన కథనాయికగా వాణిశ్రీ ని పేర్కొనవచ్చు.
ఒక కళాకారిణిగా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తపన ఉండేది తప్ప, ఆ పాత్ర యొక్క స్వభావాన్ని ఆమె ఏనాడూ పెద్దగా పట్టించుకోలేదు. ఏ పాత్రనైనా చేసి తన ప్రతిభను చాటుకోవాలని ఉత్సాహమే తప్ప, ఆ రోజులలో సినీ పరిశ్రమలో తన ప్రభావముద్ర వేయాలని ఏనాడూ ఆలోచించలేదు. హాస్య పాత్రలతోనే తెలుగులో ఆమె నట జీవితం ఆరంభమైనా, కేవలం వాటికే పరిమితం కాకుండా ఉండాలనే తపనతో కథానాయకగా ఎదగడానికి ఆమె అహర్నిశలు కృషి చేశారు.
చిత్ర రంగంలో ప్రవేశించిన తొలినాళ్ళలో హాస్య పాత్రలు, రెండవ కథానాయికగా ప్రాధాన్యమున్న పాత్రలు, చెల్లెలి పాత్రలు ధరించిన వాణిశ్రీ ఆశయానికీ, వాస్తవానికీ మధ్య అనివార్యంగా ఉండే పెనుగులాటను స్థిరచిత్తంతో నిభాయించుకుంటూ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారానే చెప్పాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే నానుడిలాగా తెలుగు చలనచిత్ర రంగంలో ఉన్నత శిఖరాలను అందుకునే సత్తా ఆమెకు ఉందని తెలిసినా, అందుకు అవకాశం వచ్చేవరకు పరభాషా చిత్రాలలో కథానాయికగా మెప్పిస్తూనే, మాతృభాషలో కూడా నెగ్గాలని ఆమె అహరహం తపిస్తూ ఉండేవారు.
ఇంతింతై వటుడింతై అన్నట్లు నటనపై ఆసక్తితో నాటకాలలో ప్రజాదరణ పొందిన “రక్తకన్నీరు నాటకం”లో కథానాయకుడి భార్యగా నాటకరంగ ప్రవేశంతో మొదలైన వాణిశ్రీ ప్రస్థానం, అంచెలంచెలుగా ఎదిగి కన్నడ దర్శకులు హుణనూరు కృష్ణమూర్తి చిత్రం వీరసంకల్పలో కథానాయికగా సినీ ప్రస్థానం కొనసాగించి తన 16 యేండ్ల నటజీవితంలో సుమారు 317 పైచిలుకు చిత్రాలలో నటించారు వాణిశ్రీ.
గీత రచయిత ఆత్రేయ ప్రేమ్ నగర్ సినిమాలో “తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా, యేరులా సెలయేరులా, కలకలా గలగలా కదిలి వచ్చింది కన్నె అప్సరా” అని అభివర్ణించిన అచ్చ తెలుగు నాయిక వాణిశ్రీ. 1970వ దశకాన్ని వూగించి, పాలించి, శాసించిన ఒకే ఒక కథానాయిక వాణిశ్రీ. హీరోయిన్ అనే పదానికి తెలుగులో ఒక శైలి, ఒక నివేదిక ఆమె. అభినయం, ఆహార్యం, నడవడిక, ఫ్యాషన్ దేనిలో అయినా సంచలనమే. హీరోలతో సమానమైన ఇమేజ్ ని సంపాదించుకున్న ఏకైక కథానాయిక వాణిశ్రీ. అలనాటి ప్రేక్షకుల కలల రారాణి, వెండితెర గడపకు కలెక్షన్ల పారాణి వాణిశ్రీ. కేవలం తెలుగు చలనచిత్ర రంగంలోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో కూడా తన పయనం వికసించింది.
సెక్రటరీ లాంటి పలు తెలుగు నవలా చిత్రాలలో అభినయించి నవలా చిత్రాల కథనాయికగా ఆమె ఓ బ్రాండ్ అయ్యారు. నవలా కథానాయకులకు ప్రత్యేకంగా నిలబడిన ఏకైక హీరోయిన్ వాణిశ్రీ అని చెప్పవచ్చు. ఆమె నటనా ప్రస్థానంలో చేసిన పౌరాణిక, జానపద, ప్రయోగాత్మక చిత్రాలు నటిగా ఆమెలోని పరిపూర్ణతకు ప్రతీకలు. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవితో పోటాపోటీగా అత్తకు యముడు అమ్మాయికి మొగుడులో అభినయించి చెరిగిపోని సంచలనం సృష్టించారు. నటనకు వయస్సుతో పనిలేదని నిరూపించిన ఆవిడ బొబ్బిలి రాజా, సీతారత్నం గారి అబ్బాయి, ఏమండీ ఆవిడ వచ్చింది, రౌడీ మొగుడు లాంటి చిత్రాలు వన్నె దగ్గని ఆవిడ నటనాభిమానానికి సజీవ సాక్షాలు. ఈ రోజు ఆమె జన్మదినం. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలు మీకోసం..
జీవిత విశేషాలు…
జన్మ నామం : రత్న కుమారి
ఇతర పేర్లు : వాణిశ్రీ
జననం : 03 ఆగస్టు 1948
స్వస్థలం : నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తి : నటి
జీవిత భాగస్వామి : కరుణాకరన్
పిల్లలు : అభినయ వెంకటేశ కార్తీక్, అనుపమ
పురస్కారాలు : ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, నంది అవార్డు..
నేపథ్యం…
వాణిశ్రీ అసలు పేరు రత్న కుమారి. ఆవిడ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు లో జన్మించారు. వాణిశ్రీ నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేట్ బి.వి.యస్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి వరకు చదువుకున్నారు. తరువాత కుటుంబ ఆర్థిక, సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఆమె తల్లి తన మకాం మద్రాసుకు మార్చింది. నెల్లూరు అనే చిన్న పట్టణం నుండి మహానగరానికి వలస వచ్చిన వారు ఎదుర్కొన్న అనిశ్చితి, యాదృశ్చికత ఆమె జీవిత గమనాన్ని ప్రభావితం చేశాయి. జీవితం తనంతట తానే గడిచిపోయేది. ఆమె మాత్రం గట్టిగా కృషి చేసేవారు. చిన్ననాటి నుండి ఆమెకు బాగా చదువుకోవాలనే కోరిక ఉండేది. చదువుతోపాటు లలిత కళల మీద కూడా ఆసక్తి బలంగా ఉండేది. దీనికి కృషి తోడై కాలగమనంలో ఉన్నత శిఖరాలను అందుకోవడానికి ఆమెకు పునాది పడింది. ఆమె ఒకవైపు మద్రాసులో ఆంధ్ర మహిళా సభలో చదువుకుంటూనే, కొంతకాలం వీణ వాయించడం, నాట్యం చేయడం నేర్చుకున్నారు. మెట్రిక్ తో చదువు నిలిపివేసి వీణ మాస్టర్ ప్రేరణతో మూడేళ్లు భరతనాట్యం నేర్చుకున్నారు.
తొలి చిత్రం “వీర సంకల్ప” (కన్నడ)…
టి.ఆర్.మాలవ్య వద్ద మొదలైన నాట్య శిక్షణ, ఆ తరువాత వెంపటిచ్చిన సత్యం వద్ద సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. అదే సమయంలో నటన పట్ల వాణిశ్రీకి ఉన్న ఆసక్తి ఆమెను నాటక రంగం వైపు నడిపించింది. అప్పట్లో ప్రజాదరణ పొందిన నాటకమైన “రక్తకన్నీరు” నాటకంలో కథానాయకుడి భార్యగానూ, చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటకంలో చిట్టెమ్మగా నటించి నాటక ప్రియుల అభిమానం చూరగొన్నారు. చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటకంలో “చిట్టెమ్మ” గా ఆమె నటనను చూసిన హుణనూరు కృష్ణమూర్తి తాను రూపొందిస్తున్న కన్నడ చిత్రం “వీర సంకల్ప” (1962 – 1963) లో కథానాయికగా ఎంపిక చేశారు.
“వీర సంకల్ప” చిత్రం తరువాత గౌరీ ప్రొడక్షన్స్ భావనారాయణ, ప్రముఖ జానపద చిత్ర దర్శకులు బి.విఠలాచార్య లు ఆమెను మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన బంగారు తిమ్మరాజు, నవగ్రహ పూజామహిమ చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాయి. కన్నడ, తమిళ చిత్రాలలో కథానాయికగా నటించిన వాణిశ్రీ తెలుగులో కథానాయికగా నటించడానికి చాలా ఓపికగా ఎదురుచూడవలసి వచ్చింది. తెలుగులో ఆమె సంభాషణలు పలికిన మొట్టమొదటి చిత్రం బంగారు తిమ్మరాజు. ఎ. వి. ఎం సంస్థ వారు కూడా కాంట్రాక్టు పద్ధతి కింద రెండు సినిమాలకు కుదుర్చుకున్నారు.
ఆరంభంలో హాస్య పాత్రలతో…
కన్నడంలో కథానాయకగా నటిస్తున్నా కూడా ఆమెకు తెలుగులో చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకోవలసి వచ్చేది. ఆ రోజులలో గిరిజ, గీతాంజలి, రమాప్రభ, మీనా కుమారి వంటి హాస్య తారల మాదిరిగా వాణిశ్రీకి కూడా హాస్య పాత్రలు వచ్చేవి. లేదంటే రెండవ కథానాయిక పాత్రలు లభించేవి. విడ్డూరం ఏమిటంటే ఒకవైపు తమిళంలో శివాజీ గణేషన్, ఎం.జి.రామచంద్రన్, కన్నడంలో రాజ్ కుమార్ వంటి అగ్ర హీరోల సరసన కథనాయికగా నటిస్తున్న సమయంలోనే తెలుగులో బాలకృష్ణ, రాజబాబు వంటి హాస్యనటులకు జోడిగా అవకాశాలు దక్కేవి. అయినా కూడా వాటికి వెనుకంజ వేయడానికి ఇష్టపడని వాణిశ్రీ ఆమె ఆత్మవిశ్వానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు.
ఆ రోజుల్లో ఎన్టీఆర్ హీరోగా నటించిన “ఉమ్మడి కుటుంబం” చిత్రంలో ఒక హాస్యభరిత అంతర్నాటకంలో “సతీసావిత్రి” గా ఆమె కనిపిస్తారు. విచిత్రం ఏమిటంటే వాణిశ్రీ అగ్రనటిగా పేరు ప్రఖ్యాతులు గడించిన తరువాత “సతీసావిత్రి” చిత్రంలో టైటిల్ పాత్ర పోషించడం వాణిశ్రీ పోషించడం అందులో కూడా ఎన్టీఆర్ “యముడు” గానే నటించడం ఒక అద్భుతమనే చెప్పాలి. ఒక కళాకారిణిగా వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలనే తపన ఆమెలో ఉండేది, తప్ప పాత్ర స్వభావాన్ని ఆమె ఏనాడూ పెద్దగా పట్టించుకోకపోయేవారు. ఒక కళాకారిణిగా ఏ పాత్ర పోషించినా అందులో తన ప్రతిభను చాటుకోవాలనే ఉత్సాహమే తప్ప అప్పట్లో ఆమె ఇమేజ్ గురించి ఆలోచించేవారు కాదు. హాస్య పాత్రలకే పరిమితం కాకుండా కథానాయిక అవ్వాలనే తపనతో అహర్నిశలు కృషి చేశారు.
రత్నకుమారి నుండి వాణిశ్రీ గా…
నిజానికి వాణిశ్రీ హాస్య పాత్రలను పోషిస్తున్న తరుణంలో స్వర్గీయ బి.యన్.రెడ్డి గారి “బంగారు పంజరం” చిత్రంలో ఆమెకు కథానాయిక పాత్రను ఇచ్చారు. కానీ ఆ చిత్ర నిర్మాణం విపరీతంగా ఆలస్యమైంది. ఈ లోగా ఆమె ఏ చిన్న పాత్ర లభించినా వదలకుండా పోషించేవారు. దాంతో బి.యన్.రెడ్డి “ఇక్కడ నిన్ను నా సినిమాలో కథానాయికగా తీసుకుంటే, నీవు మరోవైపు చిన్నచితకా పాత్రలు పోషిస్తే ఎలా అమ్మా? ఏ పాత్ర దొరికితే అది చేసేస్తున్నావు. నీవు కొంతకాలం నిరీక్షించాలి. మంచి పాత్రలు వచ్చేవరకు ఆగాలి” అని గొడవ పెట్టేవారు. అయితే బంగారు పంజరం సినిమా కథను సిద్ధం చేసుకోవడానికి బి.ఎన్.రెడ్డికి సుమారు మూడేళ్లు పట్టింది.
ఈలోపు ఏడు లేదా ఎనిమిది సన్నివేశాలు ఉంటే చాలు ఏ చిత్రంలోనైనా వాణిశ్రీ నటించడానికి సిద్ధపడేవారు. పాత్ర చిన్నదా లేక పెద్దదా అని ఏనాడు పట్టించుకోలేదు. రకరకాల పాత్రలు చేసి పరిణితి సాధించడమే లక్ష్యంగా ఆమె కృషి సాగించారు. చలనచిత్ర రంగంలో కథానాయికగా ఉన్నత శిఖరాలను అందుకునే సత్తా తనకు ఉందని వాణిశ్రీకి తెలుసు. అయితే అందుకు అవకాశం వచ్చే సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది. పరభాష చిత్రాలలో కథానాయికగా మెప్పిస్తున్న ఆమె మాతృభాషలో కూడా నెగ్గాలని ఆమె అహరహం తపిస్తూ ఉండేవారు. ఆమె అసలు పేరు రత్నకుమారి కాగా “నాదీ ఆడజన్మే” చిత్రంలో అవకాశం కోసం వెళ్ళినపుడు ఎస్. వి. రంగారావు ఆమె పేరును వాణిశ్రీ గా మార్చారు.
మలుపుతిప్పిన “మరపురాని కథ”…
వాస్తవానికి, ఆశయానికి మధ్య అనివార్యంగా ఉండే పెనుగులాటను స్థిరచిత్తంతో నిభాయించుకుంటూ హాస్య పాత్రలను, రెండవ ప్రాధాన్యమున్న కథానాయిక, చెల్లెలి పాత్రలు ధరించసాగారు. ఆ క్రమంలోనే వచ్చిన “సుఖదుఃఖాలు” చిత్రంలో “ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని” అనే వ్రాసిన కృష్ణశాస్త్రి పాటతో తన నటనా ప్రాభవం పాకిపోయింది. ఈ చిత్రంలో పాత్ర చిన్నదే. అయినా ఆమె మామూలు హాస్యపాత్రలకు భిన్నమైన భూమికను ఇందులో పోషించారు. ఆటుపోట్లని ఎదిరించి నిలిచే స్థైర్యం, ప్రతిభ, కార్యదీక్ష మూర్తీభవించిన వాణిశ్రీని సహజంగానే అదృష్టం పలకరించింది.
వి.రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మరపురాని కథ (1967) చిత్రం ద్వారా వాణిశ్రీ కి తెలుగులో తొలిసారిగా కథానాయికగా నటించే అవకాశం కలిగించింది. ఆమె నటజీవితంలో మరుపురాని మైలురాయి చిత్రంగా నిలిచిపోయింది. నిజానికి మరుపురాని కథ చిత్రంలో కథనాయిక సావిత్రిని అనుకున్నారు. తమిళంలో శివాజీ గణేషన్, సావిత్రి నటించిన “కై కొడుత్త దైవమ్” (1964) సినిమాను తెలుగులో మరపురాని కథగా తీశారు. ఇందులో ఎన్టీ రామారావు సరసన సావిత్రి నటించాలి. ఆ సమయంలో సావిత్రి గర్భవతి కావడంచేత చిత్ర నిర్మాణం బడ్జెట్ అంచనాలను దాటిపోయేటట్లుగా కనిపించడంతో నిర్మాత డూండీ మనసు మార్చుకొని కృష్ణ, చంద్రమోహన్, వాణిశ్రీ లతో “మరుపురాని కథ” ను నిర్మించారు. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది.
కథానాయిక స్థానం సుస్థిరం చేసిన ఆత్మీయులు…
మరపురాని కథ మంచి పేరు తెచ్చినా కూడా ఆ తరువాత తెలుగులో కథానాయికగా మరిన్ని అవకాశాలు రావడానికి వాణిశ్రీకి చాలా రోజులు పట్టింది. అయినా ఆమె ఏమాత్రం నిరుత్సాహపడలేదు. తన భవిష్యత్తు పట్ల తనకు గల ఆత్మవిశ్వాసమే ఆమెను నిరాశపడకుండా చేసేది. “మరపురాని కథ” విజయం అనంతరం వాణిశ్రీ కి “ఆత్మీయులు” చిత్రం మంచి పేరు తెచ్చింది. “ఆత్మీయులు” చిత్రంలో అక్కినేనికి చెల్లెలుగా నటిస్తావా? లేక ప్రియురాలు పాత్ర పోషిస్తావా? అని అడిగితే విస్తృత పరిధి లేకపోయినా కథానాయిక పాత్రనే పోషించడానికి ఆమె ఒప్పుకున్నారు.
“ఆత్మీయులు” చిత్రం హిట్ కావడంతో ఇక ఎన్టీఆర్ తో పాటు ఇతర హీరోలు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల సరసన ఆమెకు కథానాయికగా స్థిరపడే అవకాశం కలిగించింది. “నిండు హృదయాలు” చిత్రంలో మొదట వేరే కథానాయికను అనుకొని కారణాంతరాల వల్ల ఆ పాత్రకు వాణిశ్రీని తీసుకున్నారు. అడుగడుగునా అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో అధిగమించి తన ప్రతిభను నిరూపించుకున్నారు వాణిశ్రీ. కనుకనే ఆనాటి అగ్ర హీరోల సమ్మతి పొంది కథానాయికగా స్థిరపడగలిగారు. పైగా ఆ దశలో సావిత్రి గారు తల్లి పాత్రలు వదిన పాత్రలు వేయడం, జమున గారు పెళ్లి చేసుకుని చిత్రాలను తగ్గించుకోవడం, కొన్ని కారణాల వలన కృష్ణకుమారి కూడా తెరమరుగు కావడం వంటి పరిణామాల మధ్య అగ్రనటుల సరసన కథానాయికగా ఉన్న ఖాళీని ఆమె భర్తీ చేశారు.
నవలా కథానాయిక…
సావిత్రి తరం తరువాత రెండు దశాబ్దాలు కథానాయికగా నిలబడిన వాణిశ్రీ తెలుగు సినిమా తిరిగిన కొత్త మలుపులు, కొత్త కథలతో, పాత్రలకనుగుణంగా తనను తాను మలుచుకున్నారు. ఆమె చేసిన రకరకాల పాత్రలను ఆ తరంలో గానీ, ఈ తరంలో గానీ తెలుగులో మరొక కథానాయిక చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. నటనలో ఆమె హావాభావాలు ఒక సంచలనం అని చెప్పాలి. తన సంభాషణలతో చెప్పలేని విషయాలు ఓ చిన్న అభినయంతో చూపిన ప్రజ్ఞా ఆమె సొంతం. పొగరు, విగరు, పౌరుషం, సాహసం కథనాయకులతో సమానంగా చూపించి సాహసంతో మెప్పించిన ఏకైక కథానాయిక వాణిశ్రీ. తెలుగు సినిమా పాటలో దృశ్యపరమైన వేగాన్ని, ఉద్వేగాన్ని నిండుగా పండించిన మెరుపుతీగ వాణిశ్రీ. ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరావు, సావిత్రి లను అద్భుతమైన జంటగా పరిగణించేవారు. ఆ తరువాత వాణిశ్రీ, నాగేశ్వరావు జంట దశాబ్దంన్నరకు పైగా అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
దేవదాసు, డాక్టర్ చక్రవర్తి చిత్రాలలో అక్కినేని, సావిత్రి జంటకు ఎంత పేరు వచ్చిందో ఆ తరువాత వాణిశ్రీ, అక్కినేని కలిసి నటించిన “ప్రేమ్ నగర్”, “విచిత్రబంధం”, “సెక్రటరీ” వంటి నవలా చిత్రాలకు అంతకు ధీటైన పేరు వచ్చింది. తెలుగు నాట నవలలు రాజ్యమేలుతున్న కాలంలో వాటిలోని పాత్రను వాణిశ్రీని దృష్టిలో పెట్టుకొని కథానాయిక పాత్ర సృష్టించారా అనిపించేంత సహజంగా వాటిలో లీనమై వాణిశ్రీ నటించిన సీరియల్స్, నవలలు చదివే వేలాది మంది తెలుగు గృహణిలకు యువతీ, యువకులకు ఆమె ఆరాధ్య దేవతగా మారిపోయారు.
“జీవన తరంగాలు” లో సరోజ, “విచిత్ర బంధం” లో సంధ్య, “ప్రేమ్ నగర్” లో లత, “సెక్రటరీ” లో జయంతి పాత్రలు అనుకున్నట్టుగా వాణిశ్రీకి శాశ్వతమైన కీర్తిని తెచ్చిపెట్టాయి. “ప్రేమ్ నగర్” చిత్రంలో లత పాత్ర ఆమెకి ఎంత పేరు తెచ్చి పెట్టిందంటే “ప్రేమ్ నగర్” చిత్రాన్ని తమిళంలో పునర్నిర్మించినప్పుడు వాణిశ్రీతోనే ఆ పాత్ర చేయించారు. తమిళంలో శివాజీ గణేషన్ కథానాయకుడిగా “వసంతమాళిగై” పేరుతో ఆ చిత్రం అఖండ విజయం సాధించి కథానాయికగా తమిళంలో కూడా వాణిశ్రీ స్థానాన్ని సుస్థిరం చేసింది.
ద్విపాత్రాభినయం…
వాణిశ్రీ తమిళంలో 75 చిత్రాలతో వైవిద్య భరితమైన పాత్రలను పోషించారు. ఎం.జీ.ఆర్ తో మూడు చిత్రాల్లో నటించగా, శివాజీ గణేశన్ తో నటించిన “నల్లదొరు కుడుంబం”, “పుణ్యభూమి” (హిందీలో మదర్ ఇండియా) చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. హిందీలో హేమమాలిని దిపాత్రాభినయం చేసిన “సీతా ఔర్ గీత” చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో వాణిశ్రీ తో నిర్మించారు. గంగ – మంగ పేరుతో విడుదలైన ఆ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. అదేవిధంగా వాణిశ్రీ రెండు పాత్రలు పోషించిన “ఇద్దరు అమ్మాయిలు” చక్కని కుటుంబ కథ చిత్రం గా ప్రేక్షకాదరణ పొందింది. అక్కినేని నాగేశ్వరావు, శోభన్ బాబుల సరసన అమాయకురాలైన మధ్యతరగతి పేద యువతి గానూ, అహంకారం మూర్తిభవించిన సంపన్న యువతి గానూ వాణిశ్రీ నటించారు. ఇందులో అహంకారి పాత్రకు “విచిత్రబంధం” లో సంధ్య పాత్రకు దగ్గర పోలికలు ఉన్నాయి.
వాణిశ్రీకి నవలా కథానాయికగా పేరు తెచ్చిన మరో నవలా చిత్రం “చక్రవాకం”. ఒకవైపు నవలా చిత్రాలలో నటిస్తూనే మరోవైపు “దెబ్బకు ఠా దొంగల ముఠా”, “జగత్ కిలాడీలు” వంటి చిత్రాలలో కూడా నటించారు. “దసరా బుల్లోడు” లో ఆమె చేసిన రాధ పాత్ర బాగా ప్రేక్షకాదరణ పొందింది. “దసరా బుల్లోడు” లో వాణిశ్రీ కట్టు, బొట్టును ఆ రోజుల్లో పల్లెటూర్లలో కూడా చాలామంది యువతులు అనుసరించారు. ఆ తరువాత “ప్రేమ్ నగర్” సినిమాలో ఆమె అలంకరణ, జడ, వస్త్రధారణ చాలామందికి అది ఆదర్శమైంది. మ్యాచింగ్ చీర, చేతుల వరకు జాకెట్లతో పాటు మ్యాచింగ్ గల రంగు బొట్టు అప్పట్లో వాణిశ్రీ పాత్ర ద్వారా అద్భుతంగా ప్రచారం అయ్యాయి. అలా అందాలు ఒలకబోస్తూనే, “వింత కథ” అనే చిత్రంలో శృంగార ప్రధానమైన పాత్రను ధరించారు. ఏ సర్టిఫికెట్ పొందిన ఆ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాగే “రాజా రమేష్” లో నాగేశ్వరరావు భార్య రాణిగా, కథానాయకురాలు, జీవనజ్యోతి, కృష్ణవేణి చిత్రాలలో ఆమె పోషించిన పాత్రలు ఆమెను మహానటిగా నిలబెట్టాయి.
సెకండ్ ఇన్నింగ్స్ లో అత్త పాత్రలో…
వాణిశ్రీ 1978 లో డాక్టరు కరుణాకరన్ వివాహం చేసుకుని చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 23 మే 2020 నాడు 36 ఏళ్ల వయసులో గుండె పోటు కారణంగా ఆమె తన కుమారుడు అభినయ వెంకటేశ కార్తీక్‌ను కోల్పోయారు. వివాహమైన తరువాత పూర్తిగా తనదైన జీవితంలోకి వెళ్లిపోయిన వాణిశ్రీ ఆపైన చాలా కాలానికి మెగాస్టార్ చిరంజీవి నటించిన “అత్తకు యముడు అమ్మాయికి మొగుడు” (1989) తో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత నాగార్జున, సుమన్, బాలకృష్ణ వంటి ఆధునికతరం హీరోలతో అత్తపాత్రలు చేశారు. అయితే సీతారత్నం గారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది, బొబ్బిలి రాజా, బొంబాయి ప్రియుడు చిత్రాలలో నటించారు. ఒకటి రెండు సినిమాలలో కొన్ని ఇబ్బందికరమైన సన్నివేశాలు, సంభాషణలు ఆమె జీర్ణించుకోలేకపోయారు.
అసభ్యంగా చూపించే అత్త పాత్రలను ఆమె నిరాకరించారు. సినిమాలో అలాంటి పాత్ర సృష్టించే రచయిత, దర్శకులు తనకు అక్క చెల్లెలు అత్త వాళ్ళు ఉన్నారని మర్చిపోకూడదు. మర్చిపోతే వికృతమైన ఆలోచనలు వచ్చి వావివరుసలకు సంబంధం లేని శృంగార సన్నివేశాలు పుట్టుకొస్తాయని ఆమెను నిశితంగా విమర్శించారు. చిన్నప్పుటి నుండే ఆధ్యాత్మికత అలవాటయి భగవద్గీత పుస్తకం కొన్నారు వాణిశ్రీ. జిడ్డు కృష్ణమూర్తి, రమణ మహర్షి వంటి వారి బోధనలు ఆమెలో తాత్విక జిజ్ఞాసను రేకర్తించాయి. ఎవరు ఏ దారిన అనుసరించినా అంతిమ లక్ష్యం భగవంతుడేనని వాణిశ్రీ బలమైన నమ్మకం.