ఇటీవల శ్రీలంక గడ్డపై పల్లెకెలె వేదికగా జరిగిన టీ 20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ టీం ఇండియా జట్టు శ్రీలంక జట్టును చిత్తు చిత్తుగా ఓడించి 3-0 తేడాతో టీ -20 సిరీస్‌ను కైవసం చేసుకోవడం ఎంతైనా గొప్ప విషయమే. అయితే ఈ సిరీస్ విజయం యువ టీం ఇండియా జట్టుకు అంత అలవోకగా ఏమి దక్కలేదు. యువకులతో కూడిన శ్రీలంక జట్టు సైతం తామేమి తక్కువ తినలేదు అన్నట్లుగా యువ టీం ఇండియా జట్టుకు గట్టి పోటీని ఇచ్చి మరీ గెలిచినంత పనిచేసింది.
కానీ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ టీం ఇండియా జట్టు శ్రీలంక జట్టు పెట్టిన కఠిన పరీక్షను సైతం అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొని అసలు సిసలు ప్రొఫెషనల్ ఆటతీరు కనబరచడంతో మన వాళ్ళ దూకుడైన ఆటతీరు ముందు శ్రీలంక జట్టు పాచికలు, వారి గేమ్ ప్లాన్ ఏ మాత్రం పారలేదు. ఎందుకంటే అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో యువ టీం ఇండియా జట్టు ఆటగాళ్లు ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా సమిష్టి ప్రదర్శన కనబరచడంతో టీం ఇండియాకు ఈ టీ -20 సిరీస్ విజయం నల్లేరు మీద నడకే అయ్యింది.
ముఖ్యంగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్ మన్ గిల్ మంచి శుభారంభం ఇవ్వగా, ఆ తర్వాత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తనకే సాధ్యమైన 30 డిగ్రీ షాట్‌లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటం, రిషబ్ పంత్ సైతం అటు కీపర్‌గా, ఇటు బ్యాట్స్ మ్యాన్‌గా తన స్థానానికి సరి అయిన న్యాయం చేయడం, శివం దూబె, రింకు సింగ్ సైతం అడపదడప మంచి ఇన్నింగ్స్‌లు ఆడటం, ఇక అల్ రౌండర్ల పాత్రను వాషింగ్టన్ సుందర్,పరాగ్‌లు చాలా చక్కగా పోషించడంతో పాటు, బౌలర్లు అర్షదీప్ సింగ్, రవి బిష్నోయ్‌లు బౌలింగ్ విభాగంలో మంచి వాడి, వేడి ప్రదర్శించి ప్రత్యర్థి బ్యాట్స్ మ్యాన్ల దూకుడుకు కళ్లెం వేసి వారి వికెట్లను నేలకూల్చడం వెరసి టీం ఇండియా జట్టు ప్రత్యర్థి జట్టు శ్రీలంక పై పూర్తిగా పైచేయి సాధించినట్లయింది.
ఇంకా చెప్పుకుంటూ పోతే గతంలో తీవ్ర ఒత్తిడికి లోనై గెలవాల్సిన మ్యాచ్‌లను సైతం టీం ఇండియా పలు సందర్భాలలో కోల్పోయి కోట్లాది మంది అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసేది అనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు టీం ఇండియా జట్టుకు తీవ్ర ఒత్తిడి, సంకట పరిస్థితి ఎదురైనా ఏ మాత్రం నిగ్రహం, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తమ సత్తా, ప్రతాపం చూపే పలువురు యువ ఆటగాళ్లు ఇప్పుడు అందుబాటులో ఉండటంతో టీం ఇండియా జట్టుకు ఇక తిరుగు, ఎదురులేకుండాపోయింది అనే మాట అక్షర సత్యం.
ఏదిఏమైనా ఇటీవల సీనియర్లు అయినా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా వంటి కాకలుతీరిన ఉద్దండులైన ముగ్గురు టీం ఇండియా ఆటగాళ్లు టీ -20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ టీం ఇండియా జట్టు ఆటగాళ్లు అదరక, బెదరక మంచి టీం స్పిరిట్‌ను కనబరచి శ్రీలంక జట్టును వారి స్వంత గడ్డపై 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి టీ 20 సిరీస్‌ను కైవసం చేసుకోవడం ఎంతైనా ఓక గొప్ప శుభపరిణామం.
ఏమైనా 2007లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో టీం ఇండియా టీ- 20 విశ్వ కప్ గెలిచిన తర్వాత మళ్ళీ దాదాపుగా 17 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలోని టీం ఇండియా 2024 టీ- 20 విశ్వ కప్‌ను ఇటీవలే కైవసం చేసుకోవడంతో ఎక్కడలేని ఆత్మ స్థైర్యం, వెయ్యి ఏనుగుల బలం వచ్చి పడినట్లయింది టీం ఇండియా జట్టుకు. దీంతో ప్రస్తుతం ఎంతో పటిష్టంగా వున్న టీం ఇండియా జట్టును విదేశీ గడ్డపై సైతం ప్రత్యర్థి జట్లు ఎదుర్కోవడం అంత సులువు ఏ మాత్రం కాదని అందరికీ తెలిసివచ్చినట్లయింది.