Telugu Cinema

తెలుగు తెరపై వెలిగిన కన్నడ సౌందర్యం. నటి సౌందర్య.

సినీ వినీలాశంలో వెలిసిన సౌందర్య ఓ ధృవతార. నిండైన నటనకు ఆమె మారు పేరు. ఆమె నవ్వు మల్లెల జల్లు. ఆమె హావభావాల వెనుక సప్తస్వరాలు గోచరిస్తాయి. తరగని దరహాసం ఆమెకు దేవుడిచ్చిన వరం. ప్రేక్షక జనం ఆమెను మంచి నటిగా గుర్తించి మంగళహారతులు పట్టారు. ఒక ఆదర్శవంతమైన నటిగా, నిర్మాత గా అభిమానులచేత తెలుగింటి ఆడపడుచు లా కీర్తింపబడిన అభిమానుల ఇలవేల్పు సౌందర్య.

అభినయం అనే పుష్పానికి సౌందర్యం అనే తావిని మిళితం చేసి గ్లామర్ అనే పదాన్ని వెండితెర పై ఆవిష్కరించిన అందాల అభినయమున్న నటి “సౌందర్య”. సాటిలేని సౌందర్యం చక్కని అభినయం. సినీ వినీలాకాశంలో అతి తక్కువ సమయంలో చందమామ లా ఓ వెలుగు వెలిగి, భువిని వీడి ధ్రువతార లాగా ఆకాశంలో అంతర్థానమైన ఒక అభినవ, అభినయ తార నటి సౌందర్య.

ఆమె క్రీగంట చూస్తే జేగంటలే. చిత్రసీమకు కాసుల పంటలే. తాను కళ్లెత్తితే కనకాభిషేకాలు. అభినయానికి మెచ్చి అభిమానలోకం పుష్పాభిషేకాలు, అనేక చిత్రాల రజతోత్సవాలు. సొగసైన కళ్లతోనూ నటించిన నట విదుషీమణి వెండితెర పై పుష్కర కాలం పట్టాభిషేకం చేసుకున్నారు. అగ్రకథానాయకిగా గౌరవించబడ్డారు సౌందర్య. అందరికీ వినోదాన్ని పంచి, ఉన్నతమైన రంగుల జీవితాన్ని సాధించి, విపరీతమైన జనాభిమానాన్ని సొంతం చేసుకుని, వీటన్నిటి కోసం కాలంతో పోటీపడి పరుగులు తీసి అతి పిన్న వయస్సులోనే అభిమానులకు శోకాన్ని మిగిల్చి వెళ్లిన దయార్థ హృదయలు సౌందర్య.

మనం తీసుకెళ్లేది రెండే.. ఒకటి కర్మ.. ఒకటి గౌరవం. అలాంటి ఒక అరుదైన గౌరవాన్ని, తన అద్భుతమైన అభినయంతో తనతో పాటు తీసుకెళ్లిన నిత్యవసంతం, వెండితెర ప్రయాణానికి ఆకర్షణీయ రూపం నటి సౌందర్య. జీవితంలో కష్టపడి కూడబెట్టి, ఆ సంపాదనతో జీవితాన్ని ఆస్వాదించే సమయంలో అర్థాంతరంగా జీవితం ముగించారు. కన్నడ దేశంలో పుట్టి, తెలుగు దేశంలో ఒక వెలుగు వెలిగి తాను తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో మొత్తంగా కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది. 12 సంవత్సరాలు నటిగా అభినయం ప్రదర్శించిన తాను బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    సౌమ్య

ఇతర పేర్లు  :    సౌందర్య 

జననం    :  17 జూలై 1971

స్వస్థలం   :    ముళబాగల్, కోలారు జిల్లా, కర్ణాటక

నివాసం   :    మద్రాసు 

తండ్రి   :   కె.యస్.సత్యనారాయణ 

తల్లి     :    మంజుల

వృత్తి      :    నటి (1992 – 2004)

జీవిత భాగస్వామి   :   జి.ఎస్.రఘు (2003-2004)

మరణం    : 17 ఏప్రిల్ 2004 బెంగళూరు, ఇండియా

జననం..

సౌందర్య గారు కర్ణాటకలోని కోలూరు జిల్లా లోని ముల్బాగల్ తాలూకా గంజిగుంటే గ్రామంలో  కె.యస్.సత్యనారాయణ మరియు మంజుల దంపతులకు జన్మించారు.

సౌందర్య గారి అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. సినిమా పరిశ్రమకు వచ్చాక తన పేరు సౌందర్య గా మార్చుకున్నారు.

సౌందర్య గారి తండ్రి కన్నడ సినిమా రచయిత మరియు నిర్మాత.

తాను బెంగుళూరులో యం.బి.బి.యస్ మొదటి సంవత్సరం చదువుతుండగా సినిమా లలో అవకాశం రావడంతో తన మెడిసిన్ చదువుకు స్వస్తి చెప్పి కన్నడ చిత్రం గంధర్వ తో సినీ రంగ ప్రవేశం చేశారు.

తెలుగు, కన్నడ, తమిళం, హిందీ మరియు మలయాళ చిత్రాలలో అభినయించిన సౌందర్య గారు తెలుగు సినిమా చరిత్రలో గొప్ప నటీమణులలో ఒకరిగా మరియు ఒకప్పటి సూపర్ స్టార్ మహానటి సావిత్రి తర్వాత అత్యంత విజయవంతమైన నటిగా పేరుగాంచారు.

2002లో తాను కన్నడ చిత్రం ద్వీప తో నిర్మాతగా ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డుతో బాటు మూడు ప్రాంతీయ పురస్కారాలు అందుకున్నారు. అమ్మోరు (1994), పవిత్ర బంధం (1996), అంతఃపురం (1998), రాజా (1999), దోని సాగలి (1998) వంటి చిత్రాలలో సౌందర్య గారు నటనకు నంది అవార్డులు , ఉత్తమ నటిగా రెండు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు మరియు దక్షిణాది ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు.

సినీ ప్రస్థానం..

సౌందర్య గారు తాను యం.బి.బి.యస్ మొదటి సంవత్సరం చదువుతుండగానే తనకు సినిమా లలో అవకాశం వచ్చింది. యొక్క మొదటి చిత్రం S. సిద్దలింగయ్య దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం గంధర్వ 1992లో విడుదలైంది. 1993 లో పి.ఎన్. రామచంద్రరావు గారు దర్శకత్వం వహించిన మానవరాలి పెళ్లి చిత్రం తో తెలుగు లో ఆరంగ్రేటం చేశారు. సౌందర్య గారు 12 సంవత్సరాల వ్యవధిలో తెలుగులో సుమారు 100కి పైగా సినిమాల్లో నటించారు.

సౌందర్య గారు తన మాతృభాష అయిన కన్నడతో ప్రారంభించి తెలుగు చిత్రాలతో అత్యంత ప్రజాదరణ పొందారు. తెలుగులో తాను ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ.వి.వి సత్యనారాయణ రావు గారు దర్శకత్వం వహించిన హలో బ్రదర్ (1994) తో తనకు వాణిజ్యపరంగా మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో తాను నాగార్జున మరియు రమ్యకృష్ణ లతో కలిసి నటించారు.

సౌందర్య గారు కోడి రామకృష్ణ గారి దర్శకత్వం వహించిన అమ్మోరులో అద్భుతమైన అభినయం ప్రదర్శించి పురస్కారం గెలుచుకున్నారు. ఇందులో రమ్య కృష్ణ మరియు సురేష్‌లతో కలిసి సౌందర్య గారు భవాని పాత్రను పోషించారు. భవాని అమ్మోరు దేవి భక్తురాలు. 1995లో సౌందర్య గారి పదకొండు చిత్రాలు వేటగాడు, బాలరాజు బంగారుపెళ్ళాం, మాయదారి కుటుంబం, మాయాబజార్, అమ్మోరు, రిక్షావోడు, పుట్టింటి గౌరవం, రాముడొచ్చాడు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, జగదేక వీరుడు మొదలగు చిత్రాలు విడుదలయ్యాయి. తమిళంలో, సౌందర్య గారు తన తొలి చిత్రం పొన్నుమణికి , కార్తీక్ మరియు శివకుమార్‌ల సరసన మానసిక వికలాంగురాలి పాత్రను పోషించినందుకు ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు.

1997లో, పవిత్ర బంధం , పెళ్లి చేసుకుందాం, అమ్మ దొంగ , మా ఆయన బంగారం, ఓసి నా మరదలా మరియు ఆరో ప్రాణం చిత్రాలతో తన విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించారు. తన అభినయానికి పరిశ్రమ నలుమూలల నుండి ప్రశంసలు అందుకున్నారు. సౌందర్య గారు దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి అరుణాచలం చిత్రంలో నటించారు. ఇది తమిళ చిత్రసీమలో 1997లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. చిత్ర పరిశ్రమ తనను గోల్డెన్ హ్యాండ్‌గా భావించినప్పటికీ, మాజీ దర్శకుడి కుమార్తెగా, ఆమె ఎప్పుడూ విజయాన్ని తన సొంతంగా ఏనాడూ భావించలేదు.  36 విభాగాలలో టీమ్‌వర్క్‌గా భావించేవారు.

1998లో చిరంజీవి సరసన గుణశేఖర్ దర్శకత్వం వహించిన చూడాలని వుంది చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. విమర్శకుల నుండి ప్రశంసలు పొందిన ఈ విజయం తనను పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఆమె అదే సంవత్సరం తమిళంలో కమల్ హాసన్ మరియు ప్రభుదేవాతో కలిసి నటించిన “కాథల కాథల” చిత్రం సింగీతం శ్రీనివాస రావు గారు దర్శకత్వం వహించిన “నవ్వండి లవ్వండి” పేరుతో తెలుగులోకి డబ్ చేయబడింది. పెళ్లి పీటలు మరియు శ్రీరాములయ్య , నిన్నే ప్రేమిస్తా మరియు కన్నడలో దోని సాగలి చిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. కృష్ణవంశీ గారు దర్శకత్వం వహించిన అంతఃపురం, సౌందర్య తన కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆ చిత్రానికి తాను ఉత్తమ నటిగా రాష్ట్ర నంది అవార్డు మరియు ఉత్తమ నటిగా వరుసగా రెండవ ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు.

తెలుగు సినిమా యొక్క అత్యంత అందమైన జంటలు “ఎన్టీఆర్ మరియు సావిత్రి, ఏయన్నార్ మరియు వాణిశ్రీ , చిరంజీవి మరియు విజయశాంతి, దగ్గుబాటి వెంకటేష్ మరియు సౌందర్య”. వెంకటేష్ సరసన సౌందర్య గారు నటించిన “రాజా”1999లో విడుదలై మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో తనకు మూడవ ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. రజనీకాంత్ సరసన పడయప్ప , నాగార్జున సరసన ఆజాద్ మరియు జె.డి.చక్రవర్తి సరసన ప్రేమకు వేళాయెరా, ప్రేమకు స్వాగతం చిత్రాలతో బాటు తాను నటించిన అరుంధతి తన స్థానాన్ని మరింత పటిష్టం చేశాయి. అదే సంవత్సరంలో తాను హిందీ చిత్రం సూర్యవంశంలో అమితాబ్ బచ్చన్ సరసన నటించారు.

2000లో చిరంజీవి సరసన అన్నయ్య, వెంకటేష్ సరసన జయం మనదేరా, దేవీ పుత్రుడు, నాగార్జున , శ్రీకాంత్‌ లతో నిన్నే ప్రేమిస్తా తో పాటు ఎదురులేని మనిషి,చిరంజీవి సరసన శ్రీ మంజునాథ, జగపతి బాబు సరసన పెళ్లి పీటలు, దొంగాట చిత్రాలలో నటించారు. సౌందర్య గారు పాటలలో కూడా అతిథి పాత్రలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావుతో దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన మాయాబజార్, నాగార్జునతో అధిపతి, శుభలగ్నం లో అలీతో ప్రత్యేక పాటలలో నర్తించారు.

2004లో బాలకృష్ణ గారు నర్తనశాల పునర్నిర్మించాలని ప్రకటించారు. ఆ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది . సౌందర్య గారు ద్రౌపది పాత్రలో నటించడానికి సంతకం చేశారు. కానీ సౌందర్య గారి మరణంతో ఆ చిత్రం ఆగిపోయింది.

దాసరి నారాయణరావు , కె. రాఘవేంద్రరావు , సింగీతం శ్రీనివాసరావు , ఎ. కోదండరామి రెడ్డి , ప్రియదర్శన్ , గిరీష్ కాసరవల్లి , యస్.వి.కృష్ణా రెడ్డి , కె.యస్.రవికుమార్, కృష్ణ వంశీ , కోడి రామకృష్ణ , ఇ.వి.వి సత్యనారాయణ, ముత్యాల సుబ్బయ్య , గుణశేఖర్ , పి. వాసు , ముప్పలనేని శివ , భారతి కన్నన్ , సుందర్. సి వంటి దాదాపు అందరు అగ్ర దర్శకులతో సౌందర్య గారు పని చేశారు.

ఆమె ప్రధాన నటులందరి సరసన నటించారు. సూపర్ స్టార్ కృష్ణతో 5 సినిమాలు, మెగా స్టార్ చిరంజీవితో 4 తెలుగు మరియు 1 కన్నడ చిత్రం, మోహన్‌లాల్ 1 చిత్రం, నాగార్జున తో 5 సినిమాలు, వెంకటేష్ తో 8 సినిమాలు, జగపతి బాబు తో 7 సినిమాలు, మోహన్ బాబు తో 5 సినిమాలు, రాజశేఖర్ తో 5 సినిమాలు, సుమన్ 3 సినిమాల్లో, హరికృష్ణ 2 సినిమాల్లో, శ్రీకాంత్ , సాయికుమార్ లతో 5 సినిమాల్లో, రాజేంద్రప్రసాద్ తో 4 సినిమాల్లో, నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమాలో నటించారు. తాను వినోద్ కుమార్, నరేష్ , సురేష్ , హరీష్ , అబ్బాస్ , వినీత్ , వడ్డే నవీన్ , రమేష్ బాబు , అవినాష్ , భాను చందర్ మరియు జెడి చక్రవర్తి వంటి అనేక ఇతర హీరోలతో కూడా నటించారు.

తమిళంలో, ఆమె సూపర్ స్టార్ రజనీకాంత్‌ తో 2 సినిమాలకు, కమల్ హాసన్‌తో ఒక సినిమాకి, కార్తీక్‌తో 2 సినిమాలకు, అర్జున్ సర్జా తో తమిళంలో 1 మరియు కన్నడలో 1 సినిమాకి , విజయకాంత్ తో 2 సినిమాలకు  మరియు పార్తిబన్‌తో 2 సినిమాలకు  కలిసి పనిచేశారు. ఆమె విక్రమ్ , ఆనంద్ , రెహమాన్ , ఈరమన రోజావే శివ సరసన కూడా నటించారు. అలాగే పడయప్పలో శివాజీ గణేషన్‌తో కలిసి నటించారు.

కన్నడ లో…

సౌందర్య గారు తన కన్నడ లో తొలి చిత్రంతోనే తన సినీ ప్రస్థానం మొదలెట్టారు. ఆమె కన్నడ చిత్రం గంధర్వ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. విష్ణువర్ధన్, అనంత్ నాగ్, రవిచంద్రన్ , శశికుమార్ , రమేష్ అరవింద్ మరియు అవినాష్‌లతో కలిసి నటించారు. 1996లో, ఆమె రవిచంద్రన్ మరియు చిరంజీవిలతో కలిసి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ సిపాయి లో నటించారు. అది తిరిగి తెలుగులో మేజర్ గా డబ్ చేయబడింది . 2002లో, సౌందర్య గారు చిత్రాన్ని నిర్మించారు. ద్వీప చిత్రానికి ఉత్తమ చలనచిత్రం (నిర్మాత) గా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. తాను శ్రీ “మంజునాథ” చిత్రంలో కూడా అంబరీష్‌తో కలిసి నటించారు. తన చివరి చిత్రం ఆప్తమిత్ర. విష్ణువర్ధన్ మరియు రమేష్ అరవింద్ నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. సౌందర్య గారి మరణాంతం ఈ చిత్రం 2004లో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు.

ఇతర భాషలు…

సౌందర్య గారు హిందీ చిత్రం సూర్యవంశ్ లో , అమితాబ్ బచ్చన్ సరసన నటించారు.

అలాగే రజనీకాంత్ మరియు కమల్ హాసన్‌ గార్లతో కలిసి అరుణాచలం మరియు పడయప్పతో సహా పలు విజయవంతమైన తమిళ చిత్రాలలో నటించారు.

ఆమె మలయాళంలో మోహన్‌లాల్ మరియు శ్రీనివాసన్‌లతో కలిసి “కిలిచుండన్ మాంపజం” మరియు జయరామ్‌తో “యాత్రాకారుడు శ్రద్ధక్కు” అనే చిత్రంలో నటించారు.

సౌందర్య గారు విజయవంతమైన తమిళ టీవీ సిరీస్ కొలంగల్‌ తో తన టీవీ అరంగేట్రం చేయబోయింది.

ఎన్నికల ప్రచారంలో బిజెపి కి మద్దతు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీతో సౌందర్య గారు 2 నెలల ఒప్పందం కారణంగా తమిళ టీవీ సిరీస్ కొలంగల్‌ సిబ్బందిలో చేరలేకపోయారు.

కనుక తన స్థానంలో నటి దేవయానిని తీసుకున్నారు.

వ్యక్తిగత జీవితం…

సౌందర్య గారు అష్ట గ్రామంలో జన్మించారు. తాను స్మార్థ బ్రాహ్మణి కుటుంబానికి చెందిన వారు. తాను ఆర్.ఎస్.ఎస్.తో ప్రభావితమై భారతీయ జనతా పార్టీ లో చేరారు. సౌందర్య గారు తన బాల్య స్నేహితుడు, తన మేనమామ,  సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయిన జి.ఎస్.రఘును 27 ఏప్రిల్ 2003  నాడు వివాహం చేసుకున్నారు. నటిగా ఎంత తీరిక లేకుండా ఉన్నా కూడా తాను ప్రజాహిత, సేవా కార్యక్రమాలు చేపట్టడం పై ఎంతో ఉత్సుకత ప్రదర్శించేవారు. సౌందర్య గారు తాను మరణించే నాటికి ‘కమ్లి’ అనే చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు. కె.ఎన్.టి.శాస్త్రి గారు దీనికి దర్శకుడిగా వహించేవారు.

సౌందర్య గారు “అమర సౌందర్య సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్” (ASSET) ద్వారా తన భర్త, తన ఆడపడుచు సహకారంతో అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్నాటక, ములబాగల్ తాలూకాలోని తన గ్రామం గంగికుంటను అభివృద్ధి చేశారు. సౌందర్య గారు ఓ అనాథాశ్రమాన్ని, “అమర సౌందర్య విద్యాలయ” పేరుతో ఓ పాఠశాలను కూడా స్థాపించారు. తన తమ్ముడు అమరనాథ్ సహకారంతో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా తన భర్త, ఆడపడుచుల కలలను సాకారం చేస్తూ విద్యాలయాలను స్థాపించారు. సహాయ సహకారాలను అందించారు. సౌందర్య గారు మరణించినా కూడా వీరి కుటుంబం ఇప్పటికీ ఆ విద్యాలయాలకు ధన సహాయం చేస్తూనే ఉన్నారు.

పాక్షిక చిత్ర సమాహారం..

మనవరాలి పెళ్ళి.. మేడమ్.. అల్లరి ప్రేమికుడు.. రాజేంద్రుడు గజేంద్రుడు.. హలో బ్రదర్.. అమ్మోరు..

ప్రేమకు వేళాయెరా.. రాజా.. నెంబర్ వన్.. అమ్మ దొంగా.. అమ్మనా కోడలా.. టాప్ హీరో.. అన్నయ్య.. రిక్షావోడు.. 9 నెలలు..

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు.. ప్రియరాగాలు.. అంతఃపురం.. రైతుభారతం.. పోస్ట్‌మాన్.. పెదరాయుడు.. జయం మనదేరా.. పెళ్ళి చేసుకుందాం.. నరసింహ… శ్రీరాములయ్య.. సీతయ్య.. శ్వేతనాగు..

మాయలోడు.. దేవీ పుత్రుడు.. అరుంధతి.. ఆజాద్.. అరుణాచలం.. ఎదురులేని మనిషి.. పవిత్ర బంధం..

సూపర్ పోలీస్.. నిన్నే ప్రేమిస్తా.. శ్రీ మంజునాథ.. జగదేకవీరుడు.. మూడు ముక్కలాట.. మా ఆయన బంగారం..

దొంగాట.. రాముడొచ్చాడు.. సర్దుకుపోదాం రండి.. రాయుడు.. ఆరో ప్రాణం.. తాంబూలాలు.. నాగ దేవత..

చూడాలని ఉంది.. శుభలగ్నం (అతిథి పాత్ర).. అన్నా చెల్లెలు.. తారక రాముడు.. నా మనసిస్తా రా..

కొండవీటి సింహాసనం.. శివ్ శంకర్..

పురస్కారాలు…

1995 వ సంవత్సరం లో అమ్మోరు తెలుగు చిత్రానికి గానూ ఉత్తమ నటి గా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్   పురస్కారం గెలుచుకున్నారు..

1996  వ సంవత్సరం లో పవిత్ర బంధం తెలుగు చిత్రానికి గానూ ఉత్తమ నటి గా నంది అవార్డు                         అందుకున్నారు..         

1998 వ సంవత్సరం లో దోని సాగాలి చిత్రానికి గానూ ఉత్తమ నటి గా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు           దక్కించుకున్నారు.

1998 వ సంవత్సరం లో అంతపురం తెలుగు చిత్రానికి గానూ ఉత్తమ నటి గా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్   కైవసం చేసుకున్నారు..

1998 వ సంవత్సరం లో అంతఃపురం తెలుగు చిత్రానికి గానూ ప్రత్యేక జ్యూరీ అవార్డు క్రింద నంది పురస్కారం గెలుచుకున్నారు..

1999 వ సంవత్సరం లో తెలుగు చిత్రం రాజా లో నటించినందుకు గానూ ఉత్తమ నటి గా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ దక్కించుకున్నారు..

2003 వ సంవత్సరం లో ద్వీపా చిత్రం లో నటించినందుకు గానూ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ క్రింద జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుచుకున్నారు..

2003 వ సంవత్సరంలో ద్వీపా చిత్రం లో అభినయించినందుకు గానూ ఉత్తమ నటి గా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారం దక్కించుకున్నారు..           

2003 వ సంవత్సరం లో కన్నడ చిత్రం ద్వీపా లో నటించినందుకు గానూ ఉత్తమ నటి గా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్  అందుకున్నారు..        

2003 వ సంవత్సరం లో కన్నడ చిత్రం ద్వీపా ను నిర్మించినందుకు గానూ ఉత్తమ చిత్రం గా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ గెలుచుకున్నారు..

2004 వ సంవత్సరం లో కన్నడ చిత్రం ఆప్తమిత్ర లో నటించినందుకు గానూ సౌందర్య గారు తన మరణానంతరం ఉత్తమ నటి గా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్  పురస్కారం  అందుకున్నారు..

నిష్క్రమణం…

సౌందర్య గారు తన సోదరుడు అమర్‌నాథ్‌ తో కలిసి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో బెంగళూరు నుండి కరీంనగర్‌కు వెళుతుండగా జరిగిన విమాన ప్రమాదంలో 17 ఏప్రిల్ 2004న మరణించారు.

కానీ విధి చాల విచిత్రమైనది. సౌందర్య గారి తండ్రి సౌందర్య గారు పుట్టినప్పుడే తన జాతకం వ్రాశారు.

తాను చివరగా నటించిన “శివ శంకర్” చిత్రీకరణ జరుగుతుంది. దానికి సంబంధించిన హాస్పిటల్ సెట్ అన్నపూర్ణ స్టూడియో లో వేశారు.

అనుకోకుండా ఆ సెట్ మొత్తం విరిగిపోయి ఆమె కూర్చున్న స్థలం లోనే పడిపోయింది.

అదృష్టవశాత్తు ఒక్క క్షణం ముందు సెట్ విరిగి పడుతున్న శబ్దానికి తాను ప్రక్కకు తప్పుకోవడంతో ఆ రోజు ప్రమాదం నుంచి బయట పడ్డారు.

కొన్నాళ్ళకు తాను కరీంనగర్ బీజేపీ సమావేశానికి పార్టీ వారు ఏర్పాటుచేసిన ఒక హెలికాప్టర్, ఒక రోజు ముందే సాంకేతిక సమస్య వల్ల ఆ హెలికాప్టర్ మొరాయించింది.

సౌందర్య గారు వాస్తవానికి కరీంనగర్ వెళ్లి భాజపా అభ్యర్థి విద్యాసాగర్ రావు గారి ప్రచారంలో పాల్గొని అక్కడి నుంచి హైదరాబాద్ కు వచ్చి కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి గార్లకు ప్రచారం చేసి ఆ తరువాత తాను మద్రాసులో తమిళ సినిమా చిత్రీకరణకు వెళ్లవలసి ఉంది. అందుకోసం తాను ఒక హెలీకాప్టర్ బుక్ చేసింది. అప్పటిదాకా ఆ హెలీకాప్టర్ ములాయం సింగ్ యాదవ్ గారి ఎన్నికల ప్రచారంలో ఉంది. దాన్ని ఆయన వాయిదా చేసుకోవడంతో రద్దయిపోయింది. “2.30కు జెట్ ఎయిర్ వేస్ ఫ్లైట్ ఉందమ్మా.. అందులో వచ్చేయండి” అన్నారు చిట్టి. దాంతో సౌందర్య గారి అన్నయ్య అమర్ “ఏంటి మీరిలా విమానం అంటారు.. విజయశాంతి హెలీకాప్టర్ లో తిరిగింది. మీ కథానాయకి విజయశాంతి కన్నా తక్కువా. అంత ఇబ్బంది పడమంటారేమిటి?” అన్నాడు.

దాంతో చిట్టి “నేను పరిచయం చేసిన కథానాయిక నాకు అందరు హీరోయిన్లకన్నా ఎక్కువే. హెలీకాప్టర్ లేదు కదా! అందుకే అలా అన్నానన్నారు చిట్టి. తన మిత్రుడి హెలీకాప్టర్ ఉందన్నాడు అమర్. టూ సీటర్ హెలీకాప్టర్ అది. దాన్నే బుక్ చేశారు. హెలీకాప్టర్ పెద్దది కదా అని తాను ఎక్కువ లగేజీ తెచ్చుకుంది. స్టాఫ్ తో పంపవలసిన లగేజి అంతా వెనక్కి పంపించడం ఇష్టం లేక ఆ హెలీకాప్టర్ లోకి ఎక్కించేశారు. జరగాల్సిన తప్పల్లా కూడా ఫైవ్ సీటర్ లో పట్టాల్సిన సామగ్రి టూ సీటర్ లో పెట్టడమే. అంత లగేజీ పెట్టకూడదని హెలీకాప్టర్ సిబ్బింది కూడా చెప్పలేదు. హెలీకాప్టర్ టేకాఫ్ తీసుకోగానే ఆ సామాగ్రి వెనక్కి జరిగిపోవడం, హెలీకాప్టర్ కుప్పకూలడం క్షణాల్లో జరిగిపోయింది. ఇంకేముంది ప్రమాదం జరగడం సౌందర్య గారు నిష్క్రమించడం క్షణాల్లో జరిగిపోయాయి.

ఆస్తుల వివాదం…

సౌందర్య గారికి తల్లి మంజుల, భర్త జీ.ఎస్. రఘు, సోదరుడు అమరనాథ్, అతని భార్య బి. నిర్మల, వీరి కుమారుడు సాత్విక్ (అమరనాథ్, బి. నిర్మల దంపతుల) ఉన్నారు.

సౌందర్య గారు మృతి చెందిన తరువాత ఆస్తుల పంపకాల విషయమై వారి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి.

ఆ సమయంలో సౌందర్య గారు 15 ఫిబ్రవరి 2003 నాడు వీలునామా వ్రాశారని, ఆమె వీలునామా ప్రకారం ఆస్తులు పంపిణీ చేయాలని అమరనాథ్ భార్య నిర్మల 2009లో బెంగలూరు లోని మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు.

సౌందర్య గారు ఎలాంటి వీలునామా రాయలేదని, నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య గారి తల్లి మంజుల, భర్త రఘు కోర్టును ఆశ్రయించారు.

అప్పటి నుండి కోర్టులో వివాదం నడుస్తోంది. తన అత్త మంజుల, వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్షసాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేసింది.

సౌందర్య గారు వ్రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల న్యాయవాది ధనరాజ్, సౌందర్య గారి భర్త రఘు, ఆమె తల్లి మంజులపై పరువు నష్టం దావా కేసు వేశారు.

ఈ వివాదాలతో ఇంత కాలం వీరు కోర్టు చుట్టూ తిరిగారు. 3 డిసెంబరు 2013 వ తేదీన వీరంతా రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు.

విశేషాలు…

★ సౌందర్య గారి అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు తాను తన పేరును సౌందర్యగా మార్చుకున్నది.

★ సౌందర్య గారు ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, తన తండ్రి యొక్క స్నేహితుడు, గంధర్వ (1992) చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు.

★ తరువాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తాను మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయఢంకా మ్రోగించింది.

★ సాందర్య గారు కన్నడ, తమిళం, మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ చిత్రంలో కూడా నటించారు.

హిందీలో ఆమె అమితాబ్ బచ్చన్ తో కలిసి సూర్యవంశ్ అనే చిత్రంలో నటించారు.

★ సౌందర్య గారు గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రం జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు పలు పురస్కారాలు అందుకుంది.

★ ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ ఛాయాచిత్రగ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి.

పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ఈ చిత్రం ప్రదర్శింపబడింది.

★ సౌందర్య 17 ఏప్రిల్ 2004 నాడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఎన్నికల సందర్భంగా, భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతూ ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రసంగించడానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.

★ సౌందర్య గారి సోదరుడు, కన్నడ చిత్రాల నిర్మాత అయిన అమర్ నాధ్ కూడా ఆ ప్రమాదంలో మరణించాడు.

★ ఆమె కన్నడంలో నటించిన ఆఖరి చిత్రం “ఆప్త మిత్ర” విజయం సాధించింది.

★ ప్రస్తుతం ఆమె జ్ఞాపకార్ధం “సౌందర్య స్మారక పురస్కారం”ను కర్ణాటకాంధ్ర లలితకళ అకాడమి వారు ప్రతీ సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీమణులకు బహుకరిస్తున్నారు.

Show More
Back to top button