కొసరాజు రాఘవయ్య (03 సెప్టెంబరు 1905 – 27 అక్టోబరు 1986)
సినిమా లలో సంగీతమూ, సాహిత్యమూ సమపాళ్ళలో మేళవించబడ్డ “పాట” అనే ప్రక్రియ ప్రారంభమయ్యినప్పటి నుండి “గేయ రచన” మొదలయ్యింది. టాకీ లు మొదలైన తొలిరోజుల్లో బాగా ప్రాచుర్యం పొందిన పౌరాణికాల్ని, ఆ నాటక ఫక్కీ చెడకుండా అలాగే యధాతథంగా చలన చిత్రాలుగా మలచేవారు. అందువలన రంగస్థలం మీద నటీనటులుగా తెరమీద కనిపించే వాళ్లే తమ పద్యాల్నీ పాటల్నీ తామే పాడుకొనేవారు. రంగస్థలంతో సంబంధమున్న కవులే సినిమాలకూ పాటలు వ్రాసేవాళ్ళు. ఆ విధంగా ఆనాడు నాటక కవులుగా ఉన్న చందాల కేశవదాసు, పాపట్ల కాంతయ్య, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, దైతా గోపాలం వంటి కవులు తొలినాటి సినిమాపాటలకు సృష్టికల్పన చేశారు. ఈ పాటలన్నీ గ్రాంధిక భాషా గుబాళింపులతో నిండి, వాటి స్వరగతులు కీర్తనా పద్ధతిలోగానీ మరాఠీ నాటక మెట్లతో గానీ వుండేవి.
రాను రానూ ఆ ధోరణి తగ్గి పాటలలో భావ ప్రాధాన్యత పెరగడం ప్రారంభమయ్యింది. “వందేమాతరం”, “మాలపిల్ల” తదితర చిత్రాలతో ఈ పెంపు పరిపక్వమైంది. తెలుగు సినిమాకు చిలకపచ్చ చీర కట్టి, తరువాత ఆ చీర కొంగే లాగి చిలిపి ఆటలు ఆడిన ఉద్దండపిండ, కొంటె కోదండ కవులు సముద్రాల, పింగళి, మల్లాది, సదాశివ బ్రహ్మం, తాపీ ధర్మా రావు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి లాంటి వారు చాలా మందే ఉన్నారు. వారిలో కొసరాజు రాఘవయ్య చౌదరి గారు ఒకరు. పల్లె ఒడి, పల్లె బడి, పల్లె నుడి జానపదాల నాడి కొసరాజు రాఘవయ్య గారికి తెలిసినట్టుగా మరొకరికి తెలియదేమో అన్నట్టుగా తన పాటలు ఉంటాయి. అందువల్లనే “జానపదాల రసరాజు మా కొసరాజు” అని సి.నారాయణ రెడ్డి గారు ప్రశంసించారు.
జముకుల కథలు, పాములోళ్ళ పాటలు, గంగిరెద్దుల గీతాలు సహా ఎన్నో పాటలు వ్రాశారు కొసరాజు గారు. వ్యంగ్యం, హాస్యం కలగలిపి తెలుగు పాటల రచనలు చేసేవారు. జానపద పాటలకు లాలిత్యాన్ని, సాంఘిక పాటలకు పొగరును అద్దేవారు కొసరాజు గారు. తాను ఏ పాట వ్రాసినా ఈ ముద్ర ప్రస్పుటంగా కనిపించేది. కొసరాజు గారికి హాస్యం అంటే అమితమైన ప్రేమ. అందుకే ఆయన పాటల్లో హాస్యం అనేది తప్పనిసరిగా తొణికిసలాడుతుండేది. తాను చేసే విమర్శల్లో కూడా హాస్యం కనిపించేది. ఆరోజుల్లో పలువురు నిర్మాతలు ఆయన చేత పాటలు రాయించుకునేందుకు తన ఇంటి చుట్టూ తిరిగేవారు. సినిమా జనాలకు కావాల్సిన విధంగా వందలాది పాటలు వ్రాశారు కొసరాజు గారు.
“రైతు బిడ్డ” అనే సినిమాలో కొసరాజు రాఘవయ్య గారు కథనాయకుడిగా నటించారు. ఆ రోజులలో తెలుగు సినిమాకు అంతగా గుర్తింపు లేదు కనుకనే తాను జనాలకు పెద్దగా తెలియదు. కానీ తెలుగులో మొట్ట మొదటి సూపర్ స్టార్ గా కొసరాజు రాఘవయ్య చౌదరి గా చెప్పుకోవచ్చు. తాను ఫెళ్లుమని నవ్వితే, ఆ నవ్వు తన కంఠాన్ని మించిపోయేది. తనది నిత్యం రైతు వేషమే. తెల్లటి ఖద్దరు, నల్లటి గొడుగుతో సౌమ్యభాషణతో కనిపించేవారు కొసరాజు గారు. తనకు జానపద వరసలు తెలుసు గనక, అలాంటి వరసల్లోనే పాటలు వ్రాసి, తన వరసలోనే పాడితే, కొందరు సంగీతదర్శకులు ఆ వరసల్నే తీసుకుని, మెరుగులు దిద్దడం కూడా వుండేది.
జానపద గీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టారు కొసరాజు రాఘవయ్య చౌదరి గారు. “ఏరువాక సాగాలోరన్నో” అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా, “రామయతండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ” అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లో ఆద్యంతం కొసరాజు గారి ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. అప్పట్లోనే కాదు, ఇప్పటికీ ఆయన పాటలను విని హాయిగా నవ్వుకోని వారు లేరు. ఆయన అనుభవసారాన్ని మనసులోనే అభినందించనివారు లేరు. ఇప్పటికీ అవి అమృత ధారాలే, తెలుగువారి మనసు మైదానంలో కురుస్తున్న తేనె వానలే. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు పాటను ప్రభావితం చేసిన కొసరాజు గారి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా మనసారా ఒకసారి తనను స్మరించుకుందాం.
@ జీవిత విశేషాలు…
జన్మ నామం : కొసరాజు రాఘవయ్య చౌదరి
ఇతర పేర్లు : కొసరాజు
జననం : 03 సెప్టెంబరు 1905
స్వస్థలం : చింతాయపాలెం గ్రామం, కర్లపాలెం మండలం, గుంటూరు జిల్లా.
వృత్తి : సుప్రసిద్ధ కవి, రచయిత.
తండ్రి : సుబ్బయ్య
తల్లి : లక్ష్మమ్మ
జీవిత భాగస్వామి : సీతారామమ్మ
మతం : హిందూ మతం
మరణ కారణం : వృద్ధాప్యం
మరణం : 27 అక్టోబరు 1986
చెన్నై, భారత దేశం
@ నేపథ్యం…
కొసరాజు రాఘవయ్య చౌదరి గారు 03 సెప్టెంబరు 1905లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయపాలెంలో జన్మించారు. వీరి తల్లి లక్ష్మమ్మ, తండ్రి సుబ్బయ్య. నిజానికి తన సొంతవూరు అప్పికట్ల. అక్కడ ఒకే ఒక వీధిబడి వుండేది. ఆ బడిలో నాలుగో తరగతి తర్వాత ఇంక పై తరగతి లేదు. అందుచేత తాను నాలుగో తరగతి చదివేసినా కూడా ఊరికే కూచోవడం ఇష్టం లేక మళ్ళీ నాలుగో తరగతి చదివేశారు. నాలుగో తరగతి తప్పితే మళ్లీ చదవడం వేరు, పాసై మళ్లీ చదవడం వేరు. అలా “డబల్ ఎమ్.ఏ”లాగా, కొసరాజు గారు చిన్నతనంలోనే “డబల్ నాలుగు” డిగ్రీ పొందారు. అంతటితో కొసరాజు గారు ఊరుకోలేదు.
తన తల్లి మేనమామ వెంకటప్పయ్యగారు గొప్ప పండితులు. తమ వంశంలో వున్న ఆ సాహితీ రక్తం “రాఘవయ్య” గారి లోనూ ప్రవహించి, ఉత్తేజపరిచింది. ఆ ఉత్సాహంతో వీధిబడిలో వుండగానే తాను బాలరామాయణం, ఆంధ్ర నామ సంగ్రహం వంటి గ్రంథాలు క్షుణ్ణంగా చదివారు. వరుసకు పెదనాన్న అయిన త్రిపురనేని రామస్వామి గారి నుండి అచ్చ తెలుగు నుడికారము, తర్కవితర్కాలు, తెలుగు భాషా సౌందర్యము గురించి తెలుసుకున్నారు. తన తల్లి మేనమామ వెంకటప్పయ్య గారి ప్రోత్సాహం, రక్తం రాఘవయ్య గారిలోనూ ప్రవహించి, పన్నెండేళ్ళ వయసులోనే అష్టావధానం చేసే స్థాయికి చేరుకున్నారు. బాలకవిగా పేరు సంపాదించారు. “రైతు పత్రిక” లో సబ్ ఎడిటర్ గా కూడా పనిచేశారు.
@ బాల్యం…
కొండముది నరసింహం పంతులుగారనే , పండితులు, విమర్శకులు ఆ గ్రామంలోనే వుండేవారు. కొసరాజు గారికి కొండముది గారి ప్రోత్సాహం లభించింది. నరసింహంగారు భజనపద్ధతిలో రామాయణం వ్రాసి, ప్రదర్శనలు ఇప్పించేవారు. ఆ బాల ప్రదర్శనలో పాల్గొన్న రాఘవయ్య చౌదరి గారు రాముడి పాత్రధారి. అప్పటికే తన కంఠం లౌడ్ స్పీకర్లా వుండేది. పాటా, మాటా నేర్పిన నరసింహం గారే, పొలాల గట్లమీద కొసరాజు గారిని కూచోబెట్టి సంస్కృతాంధ్ర భాషలు నేర్పేవారు, సాహిత్య సభలకు కూడా తిప్పేవారు. అది ఎంత దూరం వెళ్లిందంటే, పన్నెండో ఏటికే కొసరాజు గారు అష్టావధానాలు చెయ్యడం ఆరంభించారు. బాలకవి అని బిరుదును కూడా పొందారు. సినిమాల లోకి వచ్చిన తర్వాత “కొసరాజు” గారు ఎంత పాప్యులరో, బాల్యదశలో “బాలకవి” గా తాను అంత ప్రసిద్ధి. పత్రికల్లో కవితలు వ్రాయడానికీ, “రైతుపత్రిక” లో సహాయ సంపాదకులుగా పనిచెయ్యడానికీ స్కూలు, కాలేజీ చదువులు చదవకపోవడం ఏ మాత్రం అడ్డురాలేదు.
@ సినీ నేపథ్యం…
కొసరాజు గారు కొంతకాలం “రైతు పత్రిక” లో ఉప సంపాదకులుగా పనిచేశారు. జమీన్రైతు ఉద్యమం లేచిన తర్వాత, కొసరాజు గారు రైతుని సమర్థిస్తూ ఎన్నో పాటలూ, పద్యాలూ వ్రాసి సభలలో పాడేవారు. ఆ సందర్భంలోనే తాను “కడగండ్లు” అనే పుస్తకం వ్రాశారు. ఆ పుస్తకానికి పీఠిక వ్రాయమని కొసరాజు గారు ఎందరో సాహితీ వేత్తలనూ, రాజకీయవేత్తలనూ అర్థించారు. ఆ పుస్తకం చదివి, అందరూ “మనకెందుకులే” అని వెనుకంజ వేశారు. కానీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు మాత్రం “నేను వ్రాస్తాను” అని, ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం వ్రాశారట. అది అచ్చయిపోయింది. రైతు మహాసభల్లో కొసరాజు గారు పాల్గొని, పద్యాలు గొంతెత్తి చదువుతూ వుంటే అందరూ “ఆహా” అనేవారు. అప్పుడే ఆయనకు కవిరత్న అన్న బిరుదుకూడా ఇచ్చారు.
సాహితీ పోషకులైన జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారి ద్వారా రాఘవయ్య చౌదరికి గూడవల్లి రామబ్రహ్మం, సముద్రాల రాఘవాచార్య గార్లతో ఏర్పడిన పరిచయం తాను సినిమాల్లో ప్రవేశించడానికి కారణమైంది. అలా చేస్తున్న సందర్భంలో గూడవల్లి రామబ్రహ్మం గారి “రైతుబిడ్డ” చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అలా తాను సినీరంగ ప్రవేశం చేశారు. తనకు సముద్రాల రాఘవాచార్య గారితో మంచి స్నేహం ఉండేది. సముద్రాల గారు కొన్ని పాటలు వ్రాయగా, మరికొన్ని కొసరాజు గారు వ్రాసేవారు. అలా గూడవల్లి గారి చిత్రాలకు పనిచేశారు కొసరాజు రాఘవయ్య చౌదరి గారు. తాను ఖాళీగా ఉండి అవకాశాలు రాకపోవడంతో రైతుబిడ్డ చిత్రం తరువాత మళ్ళీ ఊరెళ్ళి వ్యవసాయం చేసుకోసాగారు.
కొసరాజు గారు కలం, బలం బాగా తెలిసిన డి.వి.నరసరాజు గారు, కేవీ రెడ్డి గారికి పరిచయం చేశారు. అలా వాహినీ వారి “పెద్దమనుషులు” కోసం కేవీ రెడ్డి గారు, కొసరాజు గారిని పిలిపించి ఆ సినిమాలో “నందామయ గురుడ నందామయా”, “శివ మూర్తివి గణనాథా” పాటలు వ్రాయించారు. ఆ పాటలు విశేషాదరణ పొందాయి. ఆ రెండు పాటల పల్లవులు తెలుగునేలపైన విశేషంగా జనాల్లో నానిపోయాయి. అదే సమయంలో బి.ఏ.సుబ్బారావు గారి “రాజు-పేద” లో “జేబులో బొమ్మా జేజేల బొమ్మా” అనే పాట వ్రాసి అలరించారు. అందులోనే కొసరాజు గారు వ్రాసిన “కళ్ళు తెరచి కనరా మారింది మారింది మన రాజకీయమే మారింది” వంటి పాటలు సైతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కొసరాజు రాఘవయ్య గారు ఎక్కువగా ప్రజలలో నానుతున్న పదాలతోనే పాటలు పలికించేవారు. అలాగే ఆయన పాటల్లో పలు సామెతలు, అనేక నానుళ్ళు వినిపించేవి. అందువల్లే కొసరాజు గారి పాటలను జానపద బాణీలు పలికాయని అంటారు. బాల్యంలోనే అనేక ఊళ్ళు తిరగడం వల్ల ఆ యా ప్రాంతాల్లోని పల్లె పదాలను పట్టేసిన కొసరాజు గారు వాటిని, తన రచనల్లో పెట్టేశారు. అందువల్లే కొసరాజును గారిని “జానపద కవిరత్న” అని కీర్తించారు. రోజులు మారాయి లో కొసరాజు గారు వ్రాసిన “ఒలియో ఒలి పొలియో పొలి రావేలు గలవాడా రారా పొలి”, “రండయ్య పోదాము మనము లేచి రండయ్య పోదాము” పాటలు ఆకట్టుకున్నాయి. అన్నిటినీ మించి ఆ చిత్రంలోని “ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా” పాట ఈ నాటికీ జనాన్ని పులకింప చేస్తూనే ఉంది. జయం మనదే చిత్రంలో “వస్తుందోయ్ వస్తుంది”, “వీరగంధం తెచ్చినామయా వీరులెవ్వరో లేచి రండయా”, “దేశభక్తి గల అయ్యల్లారా జాలిగుండెగల ఆలోచించండి” , “చిలకన్న చిలకవే బంగారు చిలకవే పంచవన్నెల రామ చిలుకవే” వంటి పాటలు విశేషాదరణ చూరగొన్నాయి.
కొసరాజు గారికి కవిరాజు “త్రిపురనేని రామస్వామి చౌదరి” వరుసకు పెదనాన్న అవుతారు. అందువలన రామస్వామి చౌదరి గారి ప్రభావం కూడా కొసరాజు గారిపై ఎంతో ఉందని చెప్పవచ్చు. ఆయన రాసిన వీరగంధము తెచ్చినారము గేయంలోని మకుటాన్నే అటు ఇటుగా మార్చి జయం మనదే లో పలికించారు కొసరాజు గారు. హరిశ్చంద్ర లోని “చిన్నకత్తి పెద్దకత్తి నాదేనయా చిందేసే వీరబాహు” పాట, తోడికోడళ్ళు లోని “ఆడుతు పాడుతు పనిచేస్తుంటే” గీతం తెలుగువారిని ఓ ఊపు ఊపేశాయి. మంచి మనసుకు మంచి రోజులు లోని “అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే” , “కలవారి స్వార్థము నిరుపేద దుఃఖమూ ఏ నాటికైనా మారేనా” వంటి పాటలు ఎంతగానో అలరించాయి. ఇక ఇల్లరికం లోని “నిలువవే వాలుకనులదానా”, “బలే ఛాన్సులే బలే ఛాన్సులే” పాటలూ కూడా మరపురాకుండా మురిపించాయి.
కొసరాజు గారి పాట అనగానే జానపద బాణీ మాత్రమే అనుకుంటే పొరబాటు పడ్డట్టే. మాంగల్యబలం లోని “తిరుపతి వెంకటేశ్వరా దొరా నీవే దిక్కని నమ్మినామురా” పాట ఆ రోజుల్లో విశేషంగా జనాన్ని మురిపించింది. ఇప్పటికీ పలువురు శ్రీశ్రీ గారు వ్రారాశారని చెప్పే శభాష్ రాముడు లోని “జయమ్ము నిశ్చయమ్మురా” పాట సైతం కొసరాజు కలం నుండి జాలువారినదే. రక్తసంబంధం లోని “మంచి రోజు వస్తుంది మాకు బతుకునిస్తుంది” పాట ఎంతో మందిలో ఆశాభావం నింపుతుంది. ఇక లవకుశ లోని “ఏ నిమిషానికి ఏమి జరుగునో” పాటలో జీవితసత్యాలూ బోధ పడతాయి. యన్టీఆర్ గారు తొలిసారి త్రిపాత్రిభినయం చేసిన కులగౌరవం లోని “మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం” అంటూ సాగే గీతం కూడా కొసరాజు గారు వ్రాసినదే. ఇలా చెప్పుకుంటూ పోతే జానపద బాణీలకు అతీతంగానూ కొసరాజు గారి పాళీ సాగింది.
కానీ, “కొసరాజు గారు అంటే జానపదం, జానపద బాణీ అంటే కొసరాజు పాట అనే నానుడి నిలచిపోయింది. అందుకు తగ్గట్టుగా జనం చేత చప్పట్లు కొట్టించి, చిందులు వేయించిన గేయాలెన్నో ఉన్నాయి. “చెంగు చెంగునా గంతులు వేయాలి” (నమ్మినబంటు), “ఏటి ఒడ్డున మా ఊరు” (రాజమకుటం), “నీటైన పడచున్నదోయ్ నా రాజా నీకే నా లబ్జన్నదోయ్” (రాణీ రత్నప్రభ), “ముద్దబంతి పూలు పెట్టి” (కలసివుంటే కలదు సుఖం), “అయ్యయ్యో చేతిలో డబ్బులు” (కులగోత్రాలు), “మావ మావా మావా” (మంచి మనసులు), “రామన్న రాముడు కోదండరాముడు” (లవకుశ), “గౌరమ్మా నీ మొగుడెవరమ్మా” (మూగమనసులు), “దేశమ్ము మారిందోయ్” (రాముడు-భీముడు), “నీతికి నిలబడి నిజాయితీగా” (పూలరంగడు), “వినవయ్యా రామయ్యా ఏమయ్యా భీమయ్యా” (కథానాయకుడు), “సై సై జోడెడ్లా బండీ” (వరకట్నం), “చూడర నాన్నా లోకం” (కోడలు దిద్దిన కాపురం), “బులి బులి ఎర్రని బుగ్గలదానా” (శ్రీమంతుడు), “నూకాలమ్మను నేనే” (తాత-మనవడు), “శ్రీశైలా మల్లయ్యా” (కృష్ణవేణి) ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో పాటలు కొసరాజు గారి చేతి నుండి జాలువారినవే. ఇలా మూడున్నర దశాబ్దాల కాలంలో కొసరాజు గారు మొత్తము 200 చిత్రాలకు 1000 పాటలు వ్రాశారు.
@ గ్రామీణ సంస్కృతికి నిలువుటద్దం గా “రోజులు మారాయి”..
కొసరాజు రాఘవయ్య చౌదరి గారు వ్రాసిన పాటలు గ్రామీణ సంస్కృతిని ఆణువణువునా ప్రతిభింభింపజేస్తాయి. ఈ గీతాలలో అధిక భాగం మూడు స్థాయిలను అంటే వైయుక్తిక, సామాజిక, దేశ స్థాయిలను సృశించేవిగా ఉంటాయి. కొసరాజు గారు వ్రాసిన పాటల్లో అటు గ్రామ్య పదాల జోరు, ఇటు గ్రాంథిక పదాల హోరు సమానాంతరంగా సాగాయి. ఉదాహరణకి “రండయ్యా పోదాము మనము” అనే పాటలో “గట్లు తన్నుకు పంట కాలువలు పారాలి”, “ఏళ్ళు కోళ్లేకమై ఎగసి నీళ్లురకాలి” వంటి పాదాల్లో గ్రామ్య భాష అందాలు మనల్ని ఆనందపరుస్తాయి. ఇదే పాటలో “భూమి కరుణించి పులకాంకురంబెత్తి”, “గర్భదారిద్ర్యమ్ము కడతేరి పోవాలి” వంటి పాదాల్లో గ్రాంధిక భాష కొంత గాబరా కలిగిస్తుంది.
“ఏరువాక సాగారో” పాట ఈ చిత్రానికి మకుటాయమానం. ఈ పాటను కొసరాజు గారు “పాలేరు” చిత్రం కోసం 1953లో వ్రాయగా, మాస్టర్ వేణు ఆ పాటకి స్వరకల్పన చేశారు. కానీ ఆ సినిమా పురిట్లోనే సంధి కొట్టుకొని పోవడంతో దర్శక నిర్మాతలు దానిని “రోజులు మారాయి” లో ఉపయోగించుకున్నారు. ఆ రోజుల్లో ఈ పాట ఊరు వాడా అదరగొట్టేసింది. పాట వచ్చినప్పుడు థియేటర్లో ప్రేక్షకులు ఆనందంతో తెరమీదకి డబ్బులు విసిరేవారు. థియేటర్ నిర్వాహకులు సినిమా విశ్రాంతి సమయంలో స్థానిక కళాకారులను తీసుకొచ్చి ఈ పాటకు నృత్యం చేయించేవారు.
ఈ పాట కోసమే జనం పదే పదే సినిమా హాల్లోకి రావడం గమనించిన సారథి ఫిలిమ్స్ వారు ఈ ఒక్క పాటకు చేతితో రంగులద్ది కొన్ని కేంద్రాలలో విడుదల చేశారు. అప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ హిట్ ఫార్ములను తిరగరాసి కొత్త ఒరవడి సృష్టించింది ఈ పాట. నాట్లు వేసే సందర్భంలో “మా రాజ వినవయ్యా” అని ఇంకో చక్కని పాట ఉంది. ఈ గీతములోని సాహిత్యం ఎంతటి పాషాణ హృదయులకైనా కంటనీరు తెప్పించేటంత కరుణరసాత్మకంగా ఉంటుంది. ఇలా ఈ చిత్రంలోని పాటలన్నీ సాహిత్యామృత ఝరులే. మాట వరసకైనా ఒక అసభ్య గీతం లేని ఈ చిత్రం నిర్మాతల ఉత్తమ అభిరుచికి తిరుగులేని సాక్ష్యం.
@ రచనా శైలి…
కొసరాజు గారు సిగరెట్టు మీద రాసిన “సరదా సరదా సిగరెట్టు” అనే పాట తన ముఖ్యమైన వాటిల్లో చెప్పుకోదగింది. ఆ గేయంలో పొగతాగితే “ఊపిరితిత్తుల కేన్సర్ కిదియే కారణమన్నారు డాక్టర్లు”అని ఒక పాత్ర అంటే, రెండో పాత్ర వెంటనే, “కాదన్నారులే పెద్ద యాక్టర్లు” అని అప్పట్లో పెద్దపెద్ద యాక్టర్లు సిగరెట్ల వ్యాపార ప్రకటనలు ఇవ్వటం, సినిమాల్లో సిగరెట్లు తాగటాన్ని గ్లామరైజ్ చెయ్యటం, మీద విసిరిన మంచి చెణుకు అనే చెప్పాలి. ఆ తరువాత మళ్ళీ మొదటి పాత్ర “థియేటర్లలో పొగతాగటమే నిషేధించినారందుకే” అంటే రెండో పాత్ర “కలెక్షన్లు లేవందుకే” అని చాలా సునిశితమైన హాస్యం తో నవ్వించడం ఈ పాటకి గొప్ప హంగుని తెచ్చిపెట్టింది.
అదేవిధంగా పేకాట గురించిన పాట “అయయో చేతులొ డబ్బులు పోయెనే, అయయో జేబులు ఖాళీ ఆయెనే” అనేది కరుణ, హాస్యం కలగలిసి మెరిసిన పాట. ఆ పాట చివరగా అంతా పోయాక కూడా, “గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు, మళ్ళీ ఆడి గెల్వవచ్చు, ఇంకా పెట్టుబడెవడిచ్చు, ఇల్లు కుదువబెట్టవచ్చు, ఛాన్సు తగిలితే ఈ దెబ్బతొ మన కరువు తీరవచ్చు” అంటూ జూదగాళ్ళ మనోభావాలని అద్భుతంగా పట్టుకుంటుంది. అంతటితో ఆగకుండా, “పోతే?” అనే సందేహం, దానికి “అనుభవమ్ము వచ్చు” అనే తిరుగులేని సమాధానం ఈ పాటలో రక్తినీ సూక్తినీ ముక్తాయించటానికి పనికొచ్చాయి.
ఇలాంటిదే మరో ఇల్లరికం అల్లుడి మీద పాట “భలే ఛాన్సులే, భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే” అనేది. దీన్లో అత్తమామల ఆస్తికోసం ఇల్లరికపు అల్లుళ్ళు ఎలాటివైనా భరిస్తారనే విషయాన్ని కళ్ళక్కట్టినట్టు చూపిస్తూ “జుట్టు పట్టుకుని బైటకీడ్చినా చూరుపట్టుకుని వేలాడి, దూషణభూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచేవాడికి భలే ఛాన్సులే” అనటం కూడా చక్కటి ప్రయోగం.
ఈ కోవకు చెందినదే మరో పాట “చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అనేది. దీన్లో జనానికి, దేశానికి నష్టం కలిగించే పన్లు చేసేవాళ్ళే నిజమైన చవటలని చూపించటం జరిగింది. ఉదాహరణకి ఒక పాత్ర “బడా బడా టెండర్లను పాడి ప్రాజెక్టులు కట్టించాను, వరద దెబ్బకు కొట్టుకుపోతే మళ్ళీ టెండరు పాడాను, చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అంటుంది. మొత్తం మీద ఇలాంటి పాటల్లో ఒక వంక సున్నితమైన హాస్యాన్ని రుచిచూపిస్తూనే, మరో వంక దురాచారాల్ని, దురలవాట్లని చమత్కారం, అవహేళన మేళవించి ఎత్తిచూపటం జరిగింది.
@ భూలోక చాప చుట్టి…
కవిరత్నా మూవీస్ పతాకంపై కొసరాజు రాఘవయ్య చౌదరి సమర్పణలో యన్టీఆర్ గారు హీరోగా దాసరి గారి దర్శకత్వంలో “విశ్వరూపం” సినిమా రూపొందింది. ఆ తరువాత ఆయన తనయుడు భానుప్రసాద్ కొన్ని చిత్రాలు నిర్మించారు. ”పేరు కొసరాజు, కానీ తనకు తెలుగంటే పెద్దమోజు” అని స్వయంగా ప్రకటించుకున్న జానపద గీతాల రారాజు గురించి ఎంత వ్రాసినా కూడా తక్కువనే చెప్పాలి. తెలుగు పదం, తెలుగు పద్యం, తెలుగుతనం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిత్వం తనది. జానపద గీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి గారు. తాను చివరిసారిగా సురేష్ ప్రొడక్షన్ వారి ”గురుబ్రహ్మ”చిత్రానికి 27 అక్టోబరు 1986 వ తేదీన ”వినరా, ఆంధ్రకు మారా” అనే బుర్రకథను వ్రాసి అదే రోజు రాత్రి పది గంటలకు భూలోక చాప చుట్టి, స్వర్గ లోకానికి పయనమయ్యారు.
మన తెలుగునాట సినిమా మాధ్యమంతో చివరంటు జానపదాన్ని కాపాడి పెంచి పోషించి గీతాల ద్వారా పద్యాల ద్వారా బతికించిన బట్టి కట్టించిన నిత్య జానపద కృషీవలురు మన కొసరాజు గారు. యక్షగానాలు, వీధి భాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళ పాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో మరెన్నో విలక్షణ రీతిలో జానపద సాహిత్య కన్నెకు అలంకారప్రాయంగా తీర్చిదిద్దారు. నిజంగా ఒక తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించారు, పల్లె సీమ ఉనికిని కాపాడారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి జానపద పితామహుడు మన కొసరాజు గారే. కొసరాజు గారి పాట జానపద బాణీని గుర్తు చేస్తూ ఈ నాటికీ తెలుగువారి మదిలో చిందులు వేస్తూనే ఉంది.
@ కొసరాజు గారి గేయ రచనల్లో కొన్ని..
★ శివశివ మూర్తివి గణనాధా నీవు శివుని కుమారుడవు (పెద్దమనుషులు 1954)
★ ఏరువాక సాగరోరన్నొ చిన్నన్న నీ కష్టమంతా తీరునురో (రోజులు మారాయి 1955)..
★ వీరగంధం తెచ్చినామయా వీరులెవరో లేచి రండయ్య (జయం మనదే 1956)..
★ ఆడుతు పాడతు పనిజేస్తుంటే అలుపు సొలుపేమున్నది (తోడికోడళ్ళు 1957)..
★ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట (మంచి మనసుకు మంచి రోజులు 1958)..
★ నిలువవే వాలుకనులదానా వయ్యారి హంస నడక దాన (ఇల్లరికం 1959)..
★ బలే ఛాన్స్‌లే బలే ఛాన్స్‌లే లలలాం లక్కీ ఛాన్స్‌లే (ఇల్లరికం 1959)..
★ పదపదవే వయారి గాలి పఠమా పైన పక్షి లాగా ఎగురుతూనే (కులదైవం 1960)..
★ ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచివచ్చే చిట్టెమ్మా (కలసి వుంటే కలదు సుఖం 1961)..
★ అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే (కులగోత్రాలు 1962)..
★ మావ మావా మావా ఏమే ఏమే భామా (మంచి మనసులు 1962)..
★ ఏనిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు (లవకుశ 1963)..
★ గౌరమ్మా నీమొగుడెవరవమ్మా ఎవరమ్మా వాడెవ (మూగ మనసులు 1964)..
★ దేశమ్ము మారిందోయీ కాలమ్ము మారిందోయి (రాముడు భీముడు 1964)..
★ బులి బులి ఎర్రని బుగ్గలదానా చెంపకు చారెడు కన్నులదానా (శ్రీమంతుడు 1971)..
★ రామయ తండ్రి ఓ రామయ తండ్రి మా నోములన్ని (సంపూర్ణ రామాయణం 1971)..
★ నాయిడోళ్ళింటి కాడ నల్లతుమ్మ చెట్టు కింద నాయుడేమన్నాడే (అందరూ దొంగలే 1974)..