CINEMATelugu Cinema

తెలుగు చిత్రసీమలో విభిన్న పాత్రల విలక్షణ నటులు.. గోవిందరాజుల సుబ్బారావు..

గోవిందరాజుల సుబ్బారావు (11 నవంబరు 1895 – 28 అక్టోబరు 1959)

రంగస్థలం నటనకు, వెండితెరపై నటనకు, ఆకాశవాణిలో ప్రసారమయ్యే నాటకాలలోని నటనకు పాటించవలసిన నియమాల్ని పాటిస్తూ, చూపవలసిన తేడాను చూపిస్తూ, ఏ రంగంలో నటిస్తే దానిపై ఏకాగ్రత చూపాలో తెలిసే ప్రజ్ఞాశాలి అనదగిన వారు అతి కొద్దిమంది ఉంటారు. తెలుగు సినిమాలలో దృఢ వ్యక్తిత్వం గల వయస్సు మళ్ళిన పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచి, తెలుగు సినిమా చరిత్రలో తనదైన స్థానాన్ని మిగుల్చుకున్న గుణచిత్ర నటులు, ఆనాటి సినీ ప్రఖ్యాత నటులు స్వర్గీయ గోవిందరాజుల వెంకట సుబ్బారావు గారు.

మూకీల నుంచి ముక్తిని పొందినట్టుగా తెలుగుసినిమా టాకీల దిశగా అడుగులు వేస్తున్న రోజులలో తెనాలి నుంచి మద్రాసు వెళ్లి నటుడిగా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించారు సుబ్బారావు గారు. పసికందులు, చిన్న పిల్లలు ఏడుస్తున్నా లేక విసిగిస్తున్నా వారిని భయపెట్టడానికి అడుగో మాయల మరాఠీ వస్తున్నాడు, నిన్ను ఎత్తుకుపోతాడు అని భయపెడితే ఠక్కున ఏడుపు ఆపేసి బిర్ర బిగుసుకుపోయేవారు పిల్లలు. “బాలనాగమ్మ” చిత్రంలో నటించి మాయల మరాఠిగా అంతటి పేరు తెచ్చుకున్నారు గోవిందరాజుల సుబ్బారావు గారు. అప్పట్లో మాయలు, అల్లరి పనులు చేసే పిల్లల్ని మాయల మరాఠీ అని పిలిచేవారు.

1938 నుండి 1959 లో తాను మరణించే వరకు సుమారు 20 సంవత్సరాలలో అతి తక్కువ సినిమాలలో నటించినా కూడా తాను గుర్తు పెట్టుకునే పాత్రలు చాలానే ఉన్నాయి. తెలుగులో తీవ్ర సంచలనం సృష్టించిన మొట్టమొదటి అభ్యుదయవాద సాంఘిక చిత్రం మాలపిల్ల (1938) లో ఆనాటి సమాజంలో సనాతన ఛాందసవాద తండ్రిగా నటించి ఆ రోజుల్లోనే ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటులు గోవిందరాజుల సుబ్బారావు గారు.

తెలుగు వారికి వికట్టహాసంతో తన పాత్రలకు ప్రాణం పోసిన మాయల పకీరు (బాల నాగమ్మ), తెలుగులో తొలి పూర్తిస్థాయి చారిత్రాత్మక చిత్రం (పల్నాటి యుద్ధం) లో బ్రహ్మనాయుడు, ఆ రోజుల్లోనే ఒక క్యారెక్టర్ పాత్ర పేరును సినిమా పేరుగా పెట్టిన “షావుకారు” చిత్రంలో షావుకారి పాత్రలో, ఆరోజుల్లో అద్భుతమైన విజయం సాధించిన “గుణసుందరి కథ” లో ఉగ్రసేనుడి పాత్రలో, కన్యాశుల్కంలో లబ్ధావధానులు ఇలా ఎన్నో పాత్రలలో జీవించిన నటులు గోవిందరాజుల వెంకట సుబ్బారావు గారు.

ఆ రోజుల్లో నాటక రంగంలో విపరీతమైన అనుభవం సంపాదించి తర్వాత తాను సినీ రంగ ప్రవేశం చేశారు. తమ సమకాలీనుల్లో ఎవరికీ లేనన్ని ప్రత్యేకతలు తనకున్నాయి. వృత్తిరీత్యా తాను నికార్సైన డిగ్రీ చదువుకున్న అలోపతి వైద్యులు, ప్రవృత్తి రీత్యా ప్రొఫెషనల్ గా నాటకాలు వేసే నటులు. కేవలం వైద్యులు, నటులు మాత్రమే కాదు, చిన్నపాటి శాస్త్రవేత్త కూడా. ప్రఖ్యాత శాస్త్రవేత్త “ఐన్ స్టీన్” తో సంప్రదింపులు జరిపిన ఘనత సుబ్బారావు గారిదే.

రామాయణం యొక్క కాలాల గురించి పరిశోధన చేసిన వ్యక్తి తాను. అప్పటి వయస్సు దృష్ట్యా “కన్యాశుల్కం” లో గిరిశం పాత్ర దక్కలేదు. కానీ రంగస్థలం మీద తాను ఎన్నోసార్లు ఆరాధించిన పాత్ర “గిరీశం”. అందుకే సుబ్బారావు గారు మరణించినప్పుడు వార్తా పత్రికలలో “అభినవ గిరీశం అస్తమించారు” అని వ్రాశారు.  తనకున్న ప్రత్యేకతల దృష్ట్యా కాకుండా అన్నిటికీ మించి తన మంచితనం, సేవా గుణం, బహుముఖ ప్రజ్ఞత్వం, సజ్జన సాంగత్యం ఇలాంటి సుగుణాల వల్ల తనకు తన సమకాలీనులు ఎంతో గౌరవం ఇస్తుండేవారు. కేవలం సినీ నటులు అనే కాకుండా వ్యక్తిగతంగా సంఘంలోనే పలుకుబడి, ప్రతిష్ట, గౌరవం ఉండేవి.

@ జీవిత విశేషాలు…

జన్మ నామం :    గోవిందరాజు వెంకట సుబ్బారావు 

ఇతర పేర్లు  :    గోవిందరాజుల సుబ్బారావు 

జననం    :     11 నవంబర్ 1895 

స్వస్థలం   :   వలివేరు, తెనాలి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ 

వృత్తి      :   వైద్యుడు, నటుడు

జీవిత భాగస్వామి  :   కామేశ్వరమ్మ

మతం    :   హిందూ మతం

మరణ కారణం  :  వృద్ధాప్యం 

మరణం    :    29 అక్టోబర్ 1959 

చెన్నై, భారత దేశం

@ నేపథ్యం…

డాక్టరు గోవిందరాజుల వెంకట సుబ్బారావు గారు 11 నవంబరు 1895 లో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలికి ఆరు మైళ్ళ దూరంలో వున్న “వలివేరు” సుబ్బారావు గారి స్వగ్రామం. కాలక్రమంలో వారు తెనాలి వచ్చేశారు. తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉండేవారు. సుబ్బారావు గారు 12 ఏళ్ల వయస్సులో ఉండగానే తన తండ్రి గారు మరణించారు. దాంతో ఆ ముగ్గురిని తన తల్లి పెంచి పెద్ద చేసింది. సుబ్బారావు గారికి తన తమ్ముడు, చెల్లెలు అంటే విపరీతమైన ప్రేమ ఉండేది. తనకు మూడేళ్ళ వయస్సులో ఉండగానే బందరులో గల బుట్టయ్యపేట లోని హాలులో మొట్టమొదటిసారిగా సారంగధర నాటకం చూశారు.

అందులో సారంగధరుడు ఎర్ర చమ్కీ దుస్తులతో, చిత్రాంగి ఆకుపచ్చని బెనారస్ చీరతో నడియాడి కులికినట్లు జీవితాంతం గుర్తున్నాయని తాను చివరి రోజుల్లో ఒక వ్యాసంలో చెప్పారు. సుబ్బారావు గారికి ఊహ తెలిసినప్పటినుండి నాటకాలు అంటే ఆసక్తి. చదువు చెడిపోతుంది అనే ఉద్దేశ్యంతో వాళ్ళమ్మ గారు ఒక్క బేడా కాసైనా ఇచ్చేది కాదు. వాళ్ళ నానమ్మ గారి దగ్గర ఆ బేడా డబ్బులు సంగ్రహించి నాటకాలకు వెళుతుండేవారు. నాటకాలు వేసే వాళ్ళు రిహార్సలు చేస్తుండగా కిటికీలోంచి తొంగి చూసి సుబ్బారావు గారు వారు పాడే పద్యాలను అనుకరిస్తూ తాను కూడా పాడేవారు. తోట వెంకటాచలం, దాములూరి శేషాచలం గారు వేసే నాటకాలలోని పద్యాలను గ్రహించి సుబ్బారావు గారు సాధన చేస్తూ ఉండేవారు.

@ నాటకాలు…

గోవిందరాజుల సుబ్బారావు గారు 1909 వ సంవత్సరంలో పదవ తరగతి (ఐదవ ఫారం) చదువుతున్నారు. వారి తెలుగు మాష్టారు మెతకగా ఉండేవారు. దాంతో తన మిత్రుడు దావులూరు నరసింహారావు గారితో కలిసి సుబ్బారావు గారు తెలుగు మాష్టారును ఆటపట్టిస్తూ ఉండేవారు. గణిత మాష్టారు పిలుపుమేరకు “మర్చంట్ ఆఫ్ వెనిస్” అనే ఆంగ్ల నాటకాన్ని స్కూల్ ఇన్స్పెక్టర్ గురుస్వామి అయ్యర్ ముందు ప్రదర్శించారు. 1910 వ సంవత్సరంలో 5వ జార్జి పట్టాభిషేకం ఇంగ్లాండులో జరిగింది. భారతదేశం అంతటా ఉత్సవాలు జరిగాయి. తెనాలిలో ఉత్సవాల సందర్భంగా “హ్యాండీ ఆండీ” ఆంగ్ల నాటకం ప్రదర్శించారు. దానిలో సుబ్బారావు గారు ఆండీ వేషం వేశారు.

అప్పటికి ఇంకా తెలుగు నాటకాలలో వ్రేలు పెట్టలేదు. ఎందుకంటే ఆ కాలంలో పద్యాలు, కీర్తనలు, రాగస్వర, తాళయుక్తంగా పాడకపోతే తెలుగు నాటకాలలో కష్టం. వాళ్ళ మాస్టారు డీ.సీ.కృష్ణయ్య గారు “ప్రతాపరుద్రీయం” అనే నాటకాన్ని ప్రాక్టీస్ చేయిస్తుండగా సుబ్బారావు గారు తనకు వేషం అడిగితే ఇవ్వలేదు. దాంతో తనకు పట్టుదల మరింత పెరిగిపోయింది. అంతలోనే పాఠశాల చదివు అయిపోయింది. పూర్వపు విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా వారు “గయోపాఖ్యానం” నాటకం వేస్తున్నారు. శ్రీకృష్ణ పాత్ర వేస్తున్న పిల్లల మర్రి సుందర రామయ్య గారి వద్దకు వెళ్లి నాటకంలో పాత్ర కావాలని అడుగగా పద్యాలు లేని సాత్యకి, భీముని పాత్ర ఇచ్చారు. దాంతో సంతృప్తి పడిన సుబ్బారావు గారు అందులో నటించారు.

@ డాక్టరు చదువు…

1913లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో “బొబ్బిలి యుద్ధం” అనే నాటకం వేశారు. అందులో హైదర్ జంగ్ పాత్ర ఒకసారి, బుస్సి పాత్ర ఒకసారి వేశారు. చదువుకోసం సుబ్బారావు గారు మద్రాసు వెళ్లారు. లైసెన్స్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఎంబిబిఎస్ కు సమానమైన చదువు) చదువుకున్నారు. 1915 – 16 ప్రాంతంలో “నార్థరన్ సర్కార్ ప్రోగ్రెస్సివ్ యూనియన్ వారు వీడ్కోలు సభ ఏర్పాటు చేసినప్పుడు అందులో “కన్యాశుల్కం” అనే నాటకం వేశారు. అదే సభలో “ప్రతాపరుద్రీయం” అనే నాటకం కూడా వేశారు. దాంట్లో సుబ్బారావు గారు “యుగంధరుడు” పాత్ర ధరించారు.

ఆ నాటకం ముగిసిన రెండు రోజులకు తెనాలి నుండి మద్రాసు కు వచ్చి గాఢ నిద్రలో ఉన్న సుబ్బారావు గారిని లేపి తెలుగు పత్రికలో సుబ్బారావు గారి గురించి వ్రాసినదంతా చూపించారు. “రామ విలాస సభ” తెనాలి వారి నాటక సభ తరపున నాటకాలు వేయాల్సిందిగా సలహా ఇచ్చారు. సుబ్బారావు గారి చదువు అయిపోయింది. కనుక తాను తెనాలి తిరిగి వచ్చేశారు. సుబ్బారావు గారు ఒకవైపు డాక్టరుగా సాధన చేస్తూనే ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి చుట్టుప్రక్కల గల మైలవరం, విజయనగరం, బందరు లాంటి పట్టణాలలో “యుగంధరుడి” పాత్రలో నాటకాలు వేసేవారు.

@ డాక్టరు గా ప్రాక్టీసు….

ఒకవైపు డాక్టరు గా ప్రజలకు ఉచితంగా వైద్యం, శస్త్ర చికిత్సలు చేసేవారు. ఎవరైనా రోగి రాలేని పరిస్థితి ఉంటే తన గుర్రపు బండి ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్లి అవసరమైతే శస్త్ర చికిత్సలు కూడా చేసేవారు. తనకు నటుడుగానే కాకుండా డాక్టరుగా కూడా బాగా పేరు ఉండేది. తెనాలిలో కామేశ్వరమ్మ గారితో వివాహం జరిగింది. పగలంతా డాక్టరుగా ప్రాక్టీస్ చేయడం, రాత్రిపూట నాటకాలు వేయడం చేసేవారు. నాటకాలు వేయడం కోసం వేరే ఊరు వెళ్లేవారు. ప్రతాపరుద్రీయం, కన్యాశుల్కం నాటకాలు సుబ్బారావు గారికి బాగా పేరు తెచ్చాయి. ఇలా తనకు 40 సంవత్సరాలు వచ్చే వరకు కొనసాగింది…

@ సినీ నేపథ్యం…

తెనాలి లో నిర్వహించబడిన “రామ విలాస సభ” కొన్నాళ్ళకు మూతబడింది. ఆ తర్వాత గోవిందరాజుల సుబ్బారావు గారు విడిగా నాటకాలు వేస్తుండేవారు. అందులో పని చేసిన “భీమవరపు నరసింహారావు” గారు (హార్మోనిస్టు) మద్రాసుకు వెళ్లి సినిమాలలో అవకాశం తెచ్చుకున్నారు. వారికి గూడవల్లి రామ బ్రహ్మంగారు పరిచయమయ్యారు. “మాలపిల్ల” సినిమా తీస్తున్న గూడవల్లి గారు సనాతన ఛాందసవాది అయిన బ్రాహ్మణుని పాత్రకు అదే సామాజిక వర్గానికి చెందిన నటుడిని ఎంపిక చేసుకోవడం కోసం గోవిందరాజులు సుబ్బారావు గారిని సంప్రదించి తనను ఒప్పించారు. సుందర రామశాస్త్రి పాత్రలో నటించడానికి గోవిందరాజుల సుబ్బారావు గారు ఒప్పుకున్నారు. ఈ పాత్రకు సుబ్బారావు గారు ప్రాణం పోశారు.

@ మాలపిల్ల…

మాలపిల్ల చిత్రంలో సుందర రామశాస్త్రి పాత్రకు గూడవల్లి రామబ్రహ్మం గారు గోవిందరాజుల సుబ్బారావు గారిని ఎంపిక చేయడంతో అప్పటివరకు రంగస్థలం నటుడుగా పేరు తెచ్చుకున్న సుబ్బారావు గారు చలనచిత్ర నటుడయ్యారు. దీని వెనుక కూడా ఒక చిన్న కథ ఉంది. మీసాల మీద ప్రత్యేక ఆసక్తితో గోవిందరాజుల సుబ్బారావు గారు వాటిని జాగ్రత్తగా సంరక్షణ చేసుకునేవారు. మీసాలు లేకుండా నటించాల్సి ఉంటుందని గూడవల్లి గారు చెప్పడంతో ఆలోచించి చెబుతానని వెళ్లిపోయారు. మీసాలు తీసేయడం సుబ్బారావు గారికి యాంటీ సెంటిమెంట్, అశుభంగా అనిపించింది. తాను తల్లిదండ్రులు జీవించి ఉండగా మీసాలు తీసేయకూడదని, స్మశాన వాటికకు వెళ్లకూడదని బలంగా నమ్ముతారు.

అందువలన తీవ్రంగా ఆలోచించి తల్లి అనుమతి తీసుకున్నాక తన అంగీకారాన్ని గూడవల్లి రామబ్రహ్మం గారికి టెలిగ్రామ్ రూపంలో ఇచ్చారు. “మాలపిల్ల” చిత్రంలో మేకప్ చేసుకోవడానికి ముందు మీసం తీసేయాలి. ఆ సమయంలో ఆ చిత్ర సంగీత దర్శకులు భీమవరపు నరసింహారావు గారు కొబ్బరికాయతో కొంత ప్రాయశ్చితం చేయించి, అప్పుడు మీసం తీయించారట. బ్రాహ్మణ యువకుడు మాలపిల్లని వర్ణాంతర వివాహం చేసుకోవడం, వ్యవసాయ కూలీల సమస్య, కిసాన్ మూమెంట్ తదితర అంశాలు ఆధారంగా రూపొందిన “మాలపిల్ల” 1938లో విడుదలై ఒక విప్లవ చిత్రంగా గుర్తింపబడింది.

అందులో నటించిన కాంచనమాల, గాలి వెంకటేశ్వరరావు, సుందరమ్మ, సూరిబాబు ప్రభృతులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. ఛాందస బ్రాహ్మణుడిగా చాదస్తం, మొండిపట్టు, తిక్కదనం ఉన్న పాత్రను అద్భుతంగా పోషించారు గోవిందరాజుల సుబ్బారావు గారు. మాలపిల్ల చిత్రాన్ని అసాంఘిక చిత్రంగా అస్పృశ్యత చిత్రంగా భావించిన వారు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో సినిమా గురించి అందరూ చెబుతుంటే కొందరు అయిష్టంగానే సినిమా చూడడానికి వెళ్లి తిరిగి వచ్చాక తల స్నానం చేసి సంధ్యావందనం, గాయత్రి జపం యధావిధిగా చేసిన వారు కూడా ఉన్నారని చెప్పుకునేవారు. సినిమాని నిరసిస్తున్న బ్రాహ్మణ కుటుంబాలను ఆకర్షించడానికి ఉచితంగా సినిమా చూపించే ఏర్పాట్లు కూడా థియేటర్లో చేశారు. దర్శకుడి సూచనలతో చిత్ర ప్రదర్శకులు

@ ఇతర చిత్రాలు…

హెచ్.ఎం.రెడ్డి గారు దర్శకత్వం వహించిన గృహలక్ష్మి చిత్రంలో గోవిందరాజులు పాత్రను పోషించారు. ఆనాటి సాంఘిక సమస్యలు, తాగుడు, వ్యసనం దళిత అంశాలపై బాగా పేరు తెచ్చుకున్న “రంగూన్ రౌడీ” నాటకమే “గృహలక్ష్మి” గా రూపొందింది. “బాలనాగమ్మ” చిత్రంలో “మాయల మరాఠీ” గా భయపెట్టారు సుబ్బారావు గారు. భానుమతి రామకృష్ణ గారు నిర్మించిన “రత్నమాల” చిత్రంలోనూ ఓ ముఖ్య పాత్ర పోషించారు సుబ్బారావు గారు. 1947లో విడుదలైన గూడవల్లి రామబ్రహ్మం, ఎల్వీ ప్రసాదు ల “పల్నాటి యుద్ధం”, “లక్ష్మమ్మ” చిత్రాలలో గ్రామ పెద్దగా రక్తి కట్టించారు గోవిందరాజుల గారు. “గుణసుందరి కథ” లో రాజుగా, “షావుకారు” చిత్రంలో షావుకారు చెంగయ్య గా, కన్యాశుల్కం లో లుబ్ధావధానులు గా, చరణదాసిలో బసవయ్యగా నటించిన పేరు తెచ్చుకున్నారు సుబ్బారావు గారు. “ధర్మాంగద”, “ముగ్గురు మరాఠీలు”, “మాయలోకం”, “శాంతి”, “భాగ్యరేఖ”, “పాండురంగ మహత్యం” తదితర చిత్రాలలో గోవిందరాజుల సుబ్బారావు గారు నటించారు.

@ వ్యక్తిగత జీవితం…

గోవిందరాజుల సుబ్బారావు గారు కామేశ్వరమ్మ గారిని వివాహం చేసుకున్నారు. పగలంతా వైద్యునిగా ప్రాక్టీస్ చేయడం, రాత్రిపూట ఊరూరు తిరిగి నాటకాలు వేయడం లాంటివి చేసేవారు. బాలనాగమ్మ సినిమా విజయవంతం అవ్వడంతో  తాను వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకపోవడంతో తెనాలిలో ఉన్న తన కుటుంబాన్ని మద్రాసుకు తీసుకొచ్చి మైలాపూర్ లోని ప్రతిభ పిక్చర్స్ కార్యాలయం కు, చర్చికి మధ్యలో ఉన్న “వన్ కెనడీ రోడ్” లో కృష్ణస్వామి అయ్యర్ గారి ఇల్లు కొనుక్కున్నారు గోవిందరాజు సుబ్బారావు గారి దంపతులు. వారికి పిల్లలు లేరు. తమ తమ్ముడు పిల్లలనే తన పిల్లలుగా చూసుకునేవారు. తమ్ముడు గారి పెద్దకొడుకు దత్తత తీసుకొని తనను కూడా ఎం.బి.బి.ఎస్ చదివించారు.

సుబ్బారావు గారి సోదరి వితంతువు. ఆమెను కూడా తనతో పాటు తీసుకొచ్చారు. తమ్ముడికి 13 మంది పిల్లలు. ఆరుగురు అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిలు. తన తమ్ముడు గారి సంతానంలో మూడో అబ్బాయికి మద్రాసులో ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఒకరు బాపు గారు, ఇంకొకరు ముళ్లపూడి వెంకటరమణ గారు. ఆ పరిచయం మూలన గోవిందరాజులు గారి యొక్క రెండో అమ్మాయిని బాపు గారికి ఇచ్చి పెళ్లి జరిపించారు. గోవిందరాజులు గారి తమ్ముడి రెండో అబ్బాయి “మల్లీశ్వరి (1951)” లో ఎన్టీఆర్ గారి చిన్నప్పటి పాత్ర వేశారు. తమ్ముడు పిల్లల చదువులన్ని కూడా గోవిందరాజుల సుబ్బారావు గారే చూసుకునేవారు. తమ్ముడు గారి పిల్లలు యోగక్షేమాలు చివరి దాకా తానే చూశారు.

@ మోక్షప్రాప్తి…

గోవిందరాజుల సుబ్బారావు గారు కేవలం నటులు మాత్రమే కాదు, శాస్త్రవేత్త కూడా. అణుశాస్త్రం పై, ఇతర అంశాలపై గ్రంథాలు కూడా వ్రాశారు. హోమియోపతి వైద్యం చేసేవారు. గుణచిత్ర నటులు అంటే గోవిందరాజుల సుబ్బారావు గారే అనే వారు సినీ ప్రముఖులు. ఆ మరపురాని మంచి నటులు 29 అక్టోబరు 1959 నాడు మద్రాసులో తన స్వగృహములో మోక్షప్రాప్తి పొందారు. తాను అరవై ఏళ్ల వయస్సులో కూడా అద్భుతాభినయాన్ని కనబరిచారు. 1957లో వచ్చిన “పాండురంగ మహత్యం” తన చివరి సినిమా. 

ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి గోవిందరాజుల సుబ్బారావు గారి ఇంటికి కారు వచ్చింది. సుబ్బారావు గారు ఉన్నారా, స్టూడియో వాళ్ళు రమ్మంటున్నారు. ఒక వేషం ఉంది అని కారు పంపించారు అని కారు లో వచ్చిన ఒక పెద్ద మనిషి అడిగారు. సుబ్బారావు గారు చనిపోయి కొన్ని గంటలు అయ్యిందండి అని ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సంగీతం, నాటక అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులుగా గోవిందరాజుల సుబ్బారావు గారు కొన్నాళ్లు పనిచేశారు. ఆంధ్రదేశం అంతటా కూడా తన సంతాప సభలు జరిపారు. విజయనగరం, రాజమండ్రి, తెనాలి, బందరు లాంటి పట్టణాలు, పల్లెలలో ఎక్కడైతే నాటక ప్రియులున్నారో అక్కడ సంతాప సభలు జరిపారు.

తెనాలిలో జరిగిన సంతాప సభలో బాగా పేరున్న రంగస్థల నటులు పులిపాటి వెంకటేశ్వర్లు గారు ప్రసంగం ఇలా కొనసాగించారు “శిలా విగ్రహం నెలకొల్పలేము, సుబ్బారావు గారికి కళామందిరం నిర్మించలేము, ఉద్యానవనం ఏర్పాటు చేయలేము, పుస్తక బాంఢాగారాన్ని నెలకొల్పలేము, చివరికి పఠన మందిరాన్ని కూడా వారి స్మృతికి చిహ్నంగా స్థాపించలేని అథమాధమ స్థితిలో ఉన్నామని మా అసమర్థతను వెల్లడిస్తూ అశ్రుతర్పణం వదులుతున్నాము, వారి కుటుంబానికి మా హృదయపూర్వక సానుభూతిని అర్పిస్తున్నాము” అని పత్రికా ప్రకటన ఇచ్చారు.

@ సశేషం…

గోవిందరాజుల సుబ్బారావు గారికి సినిమాలలో అవకాశాలు, వేషాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడలేదు. అలాగని తాను ఖాళీగా ఎప్పుడూ కూర్చోలేదు. వచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ తన ప్రత్యేకతలు నిలబెట్టుకుంటూ ఇరవై సంవత్సరాలు చిత్ర సీమలో కొనసాగారు. దారుడ్యమైన దేహం, దేహానికి తగ్గ ఠీవీ, ఠీవీకి తగ్గ చురుకుదనం, అన్నింటిని మించి పాత్ర తప్ప తాను కనిపించని సహజ నటన, రంగస్థలం మీదనే కాకుండా సినిమా రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ వెలుగొందిన డాక్టరు గోవిందరాజుల వెంకట సుబ్బారావు గారు వైద్యుడిగా చాలా మందికి ఉచితంగా సేవలు అందించిన విషయం ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకున్నారు. బహుముఖ నటులు, ప్రజ్ఞావంతులు, మంచి మనసున్న వ్యక్తులు ఆనాటి సినీరంగంలో అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ప్రథమ పంక్తులుగా పరిగణించదగ్గ వ్యక్తులు డాక్టర్ గోవిందరాజులు వెంకట సుబ్బారావు గారు.

Show More
Back to top button