CINEMATelugu Cinema

తెలుగు చిత్ర సీమలో కుల వివక్షను నిరసించిన మొట్టమొదటి చిత్రం.. మాలపిల్ల..

వందేళ్ళ క్రితం 1921 లో తెలుగు సినిమా పితామహుడు మాలపిల్ల “రఘుపతి వెంకయ్య నాయుడు” కుమారుడు లండన్ లో శిక్షణ పొంది వచ్చిన ప్రకాష్ “భీష్మ ప్రతిజ్ఞ” అనే మూకీ చిత్రాన్ని తొలి తెలుగు సినిమాగా జాతికి అందించి చరిత్ర పుటలకెక్కారు. తర్వాత టాకీలు ప్రారంభమయ్యాక, 1931 లో హెచ్.ఎం.రెడ్డి “భక్త ప్రహ్లాద” తో పౌరాణికాల ట్రెండ్ సెట్ చేశారు. 1937 వరకూ “పాదుకా పట్టాభిషేకం”, “శకుంతల”, “సావిత్రి”, “లవకుశ”, “సీతా కళ్యాణం”.. ఇలా సుమారు 47 వరకూ పౌరాణికాలే రాజ్యమేలాయి. తెలుగులో మొదటి టాకీ 1931 లోనే వచ్చినా మన సినిమా సంస్కరణల పథం తొక్కింది మాత్రం 1938 నుండే. అక్కడి నుంచి తెలుగు సినిమా కథలో, కథనంలో సంగీత సాహిత్యాలలో కొత్త పుంతలు తొక్కడం ఆరంభించింది. సినిమా ప్రయోజనం నిరూపణలో హెచ్.ఎం.రెడ్డి, గూడవల్లి రామబ్రహ్మం, బి.యన్.రెడ్డి, చిత్తజల్లు పుల్లయ్య తదితరులు ముందడుగు వేశారు.

అంటరానితనం అడుగంటాలని, కుల వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించివేయాలని ఒక మహోన్నతమైన సంస్కరణ వాదంతో రూపొందించిన చిత్రం “మాలపిల్ల”. బ్రాహ్మణాధిక్యత గల అలనాటి సమాజంలో మాలల దుస్థితి ఎలుగెత్తి చెప్పడమే కాకుండా, ఇతర కులాలవారు వారిని పెళ్ళాడి వారిని మనుషులుగా గుర్తించాలని కూడా ఆ చిత్రం సూచించింది. పైగా, మనుషులంతా ఒక్కటేనన్న సందేశాన్నిచ్చింది. మద్యపాన దురాలవాటును చెండాడుతూ టాకీ పులి తీసిన “గృహలక్ష్మి” అఖండ విజయం సాధించింది. సాంఘిక దురాచారాలను దుయ్యపడుతూ రామబ్రహ్మం గారు తీసిన “మాలపిల్ల” తెలుగు నాట పెద్ద సంచలనం సృష్టించి సినిమా సత్తాను చాటింది. సినిమా పట్ల అంతకుముందు ఒక వర్గంలో ఉన్న చులకన భావాన్ని పటా పంచలు చేసింది. తెలుగులో ఆ తర్వాత చాలా సినిమాలు సంచలనాలకు కేంద్ర బిందువు అయినా, తెలుగునాట ఆ తరహా సినిమాలకు తెరతీసింది మాత్రం నిస్సందేహంగా “మాలపిల్లే”..

రామబ్రహ్మంకి గారికి నాటి జాతీయోద్యమాలతో బలీయమైన అనుబంధం వుండడంతో, వాటి ప్రభావానికి లోనై, తెలుగు సినిమాలు సంఘ సంస్కరణకి తోడ్పడాలన్న ధ్యేయాన్ని ఏర్పరచుకుని, 1938లో “మాలపిల్ల” నిర్మించారు. సమాజంలో పాతుకుపోయిన అంతరానితనం మీద కొరడా ఝళిపిస్తూ, ఒక సనాతన బ్రాహ్మణుడు మాలపిల్లని ప్రేమించి పెళ్ళి చేసుకునే ఇతివృత్తంతో, ఈ ప్రసిద్ధ సినిమా నిర్మించి తెలుగు సినిమాని అభ్యుదయ పథం వైపు నడిపించారు గూడవల్లి రామబ్రహ్మం గారు. మనువాదుల ప్రభావంలో కొట్టుకుపోయిన దర్శక నిర్మాతలు, రచయితలు, కవులు సమాజాన్ని వెనక్కి నడిపించే చలన చిత్రాలు ఇప్పటికీ తీస్తున్నారు. మానవ హక్కుల్ని దెబ్బతీసే హింస, దౌర్జన్యాలు ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు. వీరంతా 85 ఏళ్ల క్రితమే మాలపిల్లను ఎంతో ధైర్యంగా చిత్రీకరించి ఘన విజయం సాధించిన గూడవల్లి రామబ్రహ్మం గారి నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. కనీసం తామెంత వెనకబడి ఉన్నామన్నది ఆత్మవిమర్శ చేసుకోవాలి

కరడు గట్టిన అగ్రవర్ణాల పెత్తనం కొనసాగుతున్న సమయంలో గూడవల్లి రామబ్రహ్మం గారు ఈ “మాలపిల్ల” చలన చిత్రం తీసి  సంచలనాలకు తెరలేపారు. తెలుగు చలన చిత్ర నిర్మాణ ప్రారంభ దశలోనే ఈ చిత్రం తీయడం ఆశ్చర్యం కలిగించే విషయం. మనువాదుల ప్రభావంలో కొట్టుకుపోయిన దర్శక నిర్మాతలు, రచయితలు, కవులు సమాజాన్ని వెనక్కి నడిపించే చలన చిత్రాలు ఇప్పటికీ తీస్తున్నారు. ఈ ధోరణికి స్వస్తి పలికిన గూడవల్లి రామబ్రహ్మం గారు “మాలపిల్ల” తో సామాజిక సంస్కరణకు తెరలేపి మూస ధోరణికి ముగింపు పలికారు.

చిత్ర విశేషాలు…

దర్శకత్వం    :    గూడవల్లి రామబ్రహ్మం

నిర్మాణం     :    సారధి ఫిలిమ్స్ 

కథ              :     గుడిపాటి వెంకటచలం

చిత్రానువాదం    :   గూడవల్లి రామబ్రహ్మం

తారాగణం   :   గోవిందరాజులు సుబ్బారావు, కాంచనమాల, భానుమతి, సుందరమ్మ, పి.సూరిబాబు, గాలి వెంకటేశ్వరరావు, వెంకటసుబ్బయ్య, రాఘవన్, గంగారత్నం, లక్ష్మీకాంతమ్మ, టేకు అనసూయ, పువ్వుల అనసూయ

సంగీతం    :   భీమవరపు నరసింహారావు

సంభాషణలు   :   గుడిపాటి వెంకటచలం, తాపీ ధర్మారావు

గీతరచన      :    బసవరాజు అప్పారావు, జయదేవ కవి, తాపీ ధర్మారావు నాయుడు

కూర్పు      :      ధరంవీర్ సింగ్

శబ్ద గ్రాహకులు   :     పి.వి.విశ్వనాథ శర్మను

కళాదర్శకులు      :     ఎస్.వి.ఎస్. రామారావు

ఛాయాగ్రహణం   :    శైలేన్ బోస్

నిర్మాణ సంస్థ  :    సారధి ఫిలిమ్స్

విడుదల తేదీ   :    25 సెప్టెంబరు 1938

భాష        :      తెలుగు

కథ సంక్షిప్తంగా…

కళ్యాణపురం అనే గ్రామంలో గాంధీ మహాత్ముని ప్రేరణతో రాధాబాయమ్మ తదితరులు హరిజనోద్యమాన్ని లేవనెత్తుతారు. బ్రాహ్మణులకు ఇది ఆగ్రహం కలిగిస్తుంది. మాలలు ఆలయ ప్రవేశం చేయబోతుంటే అడ్డుకుంటారు ధర్మకర్త సుందర రామశాస్త్రి. బ్రాహ్మణులకు, హరిజనులకు రాజీ కుదిర్చి వైశమ్యాలు దూరం చేయాలని ప్రయత్నిస్తుంటాడు చౌదరి. అటు సుందరామశాస్త్రి కొడుకు నాగరాజుకు, మాలపిల్ల శంపాలతో పరిచయం ఏర్పడి అది ప్రణయంగా మారుతుంది. పంతానికి పోయిన బ్రాహ్మణుల కారణంగా మంచినీళ్లు దొరక్క మాలపల్లి అలమటిస్తుంది.

చెప్పుడు మాటలు విని నాగరాజును అనుమానిస్తుంది శంపాలత. ఇటు వూళ్ళో వైషమ్యాలు పెరుగుతుంటాయి. చౌదరి ఆధ్వర్యంలో హరిజనులు ఊళ్లో తమ పనులన్నీ ఆపివేస్తారు. బ్రాహ్మణులతో సహా అగ్రవర్ణాలంతా అల్లాడిపోతారు. శంపాలతతో కొడుకు సాన్నిహిత్యం గురించి తెలుసుకున్న సుందర రామశాస్త్రి ఈ ప్రేమ తగదని వారిస్తాడు. అక్కడ ప్రేమికుల మధ్య అనుమానపు పొరలు విడిపోతాయి. ధైర్యం చేసి ఇద్దరు ఊరు విడిచి కలకత్తా పారిపోతారు. శంపాలత తనకు తోడుగా చెల్లెలు అనసూయని కూడా తీసుకు వెళుతుంది.

కలకత్తాలో నాగరాజు ఉద్యోగం సంపాదించుకుని శంపాలతకు విద్యాబుద్ధులు నేర్పుతాడు. ఇక్కడ గ్రామంలో అగ్నిప్రమాదంలో చిక్కుకున్న సుందర రామశాస్త్రి భార్యను హరిజనులు కాపాడుతారు. మానవతా విలువలను అర్థం చేసుకున్న సుందర రామ శాస్త్రి దేవాలయంలోకి హరిజనల ప్రవేశాన్ని అనుమతిస్తాడు. అయితే ఆయన నిర్ణయం ఆ కులంలోని మల్లికార్జున శర్మ వంటి ఇతర పెద్దలకు నచ్చదు. వాళ్లంతా విభేదిస్తారు. చివరికి పోలీసుల రంగ ప్రవేశంతో అంతా సద్దుమడుగుతుంది. మాలలు ఆలయ ప్రవేశం చేస్తారు. తండ్రి అనుమతితో శంపాలతను పెళ్లాడుతాడు నాగరాజు.

కథకు మూలం…

మాలపిల్ల చిత్ర దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం గారు 1937 డిసెంబరులో తన మిత్ర బృందంతో కలిసి “సారథి ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్” ఏర్పాటు చేసి సొంతంగా చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు.

ఆ సంస్థ నుండి వచ్చిన మొదటి సినిమా “మాలపిల్ల”. దర్శకునిగా రామబ్రహ్మం గారికి ఇదే తొలి చిత్రం.

సారథి ఫీలిమ్స్ కు గూడవల్లి గారు మేనేజింగ్ డైరెక్టర్. ఈ సంస్థ చైర్మన్ చల్లపల్లి రాజా యార్లగడ్డ శివ రామకృష్ణ ప్రసాద్, తుమ్మల సీతారామ బ్రహ్మం, లింగం, సత్యనారాయణ మొదలగు వారు ఇతర దర్శకులు.

సారథి, రథసారథులుగా చాలా కథలనే పరిశీలించారు. ఆ కథలు ఒకరికి నచ్చితే మరొకరికి నచ్చేవి కావు.

గుడిపాటి వెంకటాచలం వ్రాసిన అమద్రిత నవల పేరు “మాలపిల్ల” అందరికీ నచ్చింది. హరిజన సమస్యలు, అస్పృశ్యతల మీద నడిచే ఈ కథను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు.

అప్పటివరకు తెలుగులో వచ్చిన సినిమాల సుమారు 50 ఉంటాయి. వీటిలో 90 శాతం చిత్రాలు పౌరాణికాలే.

సాంఘిక రెండే రెండు వచ్చాయి. అవి ప్రేమ విజయం (1936),  గృహలక్ష్మి (1938) మూడో చిత్రం మాలపిల్ల.

చలం గారు అందించిన కథలో “మాలపిల్ల” ను విద్యాధికుడైన బ్రాహ్మణ యువకుడు ఛాందసుడైన తన తండ్రిని ఎదిరించి వివాహం చేసుకోవడం వరకే ఉంది.

చలం గారు కథ ఇచ్చారు కానీ, కథా చర్చలకు రాలేదు.

గూడవల్లి గారు పాత్రికేయ వృత్తిలో తనకు గురువైన “తాపీ ధర్మారావు నాయుడు” గారిని రచయితగా ఎన్నుకొని తనతో కూర్చొని ఈ కథను సినిమాకు అనుగుణంగా మార్చుకున్నారు గూడవల్లి గారు.

స్వదేశీ వస్త్రధారణ, హరిజన దేవాలయ ప్రవేశం, మద్యపాన నిషేధం వంటి మరికొన్ని అంశాలను జోడించి స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు.

సంభాషణలు కూడా తాపీ ధర్మారవు నాయుడు గారే వ్రాశారు. నవలలో చలం రాసిన కొన్ని సంభాషణలు యథాతథంగా వాడుకున్నారు.

ఆనాటి సామాజిక స్థితిగతులు పరికించినట్లయితే ఆ కథను ఎన్నుకోవడం సాహసమే అవుతుంది.

నటీ నటులు…

“మాలపిల్ల” చిత్రంలోని నటీనటుల విషయానికి వస్తే “తెనాలి” లో వైద్యునిగా మంచి ప్రాక్టీస్ చేస్తూ రంగస్థలం మీద వీర విహారం చేస్తున్న డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావును కీలకమైన పాత్ర సుందర రామశాస్త్రి వేశానికి తీసుకున్నారు. మాలపిల్ల సినిమాతోనే ఆయన తరంగ్రేటం చేశారు. నాయకుడు నాగరాజుగా పాత్ర వేసింది గాలి వెంకటేశ్వరరావు. ప్రముఖ సంగీత దర్శకులు గాలి పెంచల నరసింహారావు గారి తమ్ముడు. నాయిక శంపాలతగా కాంచనమాల గారిని తీసుకున్నారు. ఆవిడకి ఇది నాలుగో చిత్రం శ్రీకృష్ణతులాభారం (1935) లో మిత్రవింద వేషంతో తెరమీదకి వచ్చిన కాంచనమాల గారు తర్వాత వీరాభిమన్యు (1936) లో ఉత్తరగా, విప్రనారాయణ (1937) లో దేవదేవిగా, గృహలక్ష్మి (1938) లో మాధురిగా నటించింది.

సుందర రామశాస్త్రి భార్యగా పువ్వుల లక్ష్మికాంతం ను తీసుకున్నారు. కీలకమైన చౌదరి పాత్రకి “పువ్వుల సూరిబాబు” ను తీసుకున్నారు. అంతవరకు పౌరాణిక చిత్రాల్లో మాత్రమే సూరిబాబును చూసిన ప్రేక్షకులకు ఆయన లాల్చీ పైజామాతో ఈ సినిమాల్లో కనిపించడం ఒక ఆకర్షణ. నాయిక చెల్లెలు అనసూయమ్మ గా సుందరమ్మ నటించింది. నాయిక తల్లిదండ్రులు మునెయ్య దంపతులుగా ఎం.సీ.రాఘవన్, గంగారత్నం లు నటించారు. గాంధేయవాది రాధా భాయమ్మ గా హేమలత దేవి నటించారు. మల్లికార్జున శర్మగా వంగర వెంకటసుబ్బయ్య గారు, మిగతా పాత్రల్లో టేకు అనసూయ, పువ్వుల అనసూయ, భానుమతి, పువ్వుల సూర్య ప్రకాశం తదితరులు నటించారు.

నటి కాంచనమాల…

మాలపిల్ల సినిమా విడుదల కాగానే ఆంధ్రదేశమంతా కాంచనమాల గారి అందానికి చిత్తయిపోయింది సినిమాలో నాయిక, నాయకులు కలకత్తా పారిపోతారు.

అక్కడ ఆమెకు నాయకుడు చదువు సంద్యలు నేర్పుతారు. అక్షర జ్ఞానంతో పాటు ఆమె కట్టుబొట్టు కూడా మారిపోతుంది.

వాలు జడ, చెవులకు రింగు, స్లీవ్ లెస్ జాకెట్టు, నైలెక్స్ చీర, పమిట పిన్ను, సిగలో చిన్న గులాబీ.

కాంచనమాలను చూడడానికి తెలుగు ప్రేక్షకుడికి రెండు కళ్ళు చాలలేదు.

ఫిలిం ఇండియా బాబురావు పటేల్ “ఊంఫ్ గర్ల్” అంటూ కితబిచ్చాడు.

సినిమా పబ్లిసిటీ కోసం ఈ గెటప్ లో తీసిన కాంచనమాల స్టిల్ కేకుల్లా అమ్ముడుపోయింది.

వందల వేల క్యాలెండర్ లు వచ్చాయి. సహనటి గాయని సుందరమ్మతో కలిసి ఈ సినిమాలో కాంచనమాల పాడిన “నల్లవాడే గొల్ల పిల్లవాడే” పాట ఆరోజుల్లో చాలా ఇళ్లలో సుప్రభాత గీతం అయ్యేది.

మాలపిల్ల సినిమా నాటికి దేవదేవి (విప్రనారాయణ),  మాధురి (గృహలక్ష్మి) అందరి హృదయాలలో స్థానం సంపాదించుకున్న కాంచనమాలను గూడవల్లి గారే నాయికను చేశారు. 

అయితే ఇంతమందిని ఇంత అనందపరచిన కాంచనమాల అందం చివరికి అడవి కాచిన వెన్నెల అయ్యింది.

బాలనాగమ్మ (1942) నిర్మాణ సమయంలో జెమినీ వాసన్ తో వచ్చిన తగాదాల కారణంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురై కాంచనమాల, ఆ తరువాత పిచ్చిదైపోయింది.

దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం..

సినిమా దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం గారు సాంఘిక చైతన్యం కోసం సినిమా ప్రక్రియను శక్తివంతంగా ఉపయోగించుకోవాలని కలలు కనేవారు. కృష్ణాజిల్లా, నందమూరికి చెందిన తాను డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసి స్టేషనరీ వ్యాపారం చేసి భారీగా నష్టపోయారు. నాటకాలు, సినిమాలు గూడవల్లి గారి అభిమాన విషయాలు. 1931లో జరిగిన అఖిలాంధ్ర రైతు మహాసభ సారథి కమిటీకి గూడవల్లి గారు చైర్మన్. అదే ఏడాది మద్రాసు వచ్చి “సమదర్శిని” పత్రికలో సహాయ సంపాదకుడిగా చేరారు. ఆ పత్రికకు అప్పట్లో సంపాదకులు తాపీ ధర్మారావు గారు.

తదనంతర కాలంలో మందస రాజా గారి అబ్బాయికి చదువు చెప్పడానికి తాపీ వారు వెళ్లిపోవడంతో “సమదర్శిని” సంపాదక బాధ్యతలు రామబ్రహ్మం గారిని వరించాయి. తర్వాత కాలంలో కొందరు స్నేహితులతో కలిసి గూడవల్లి గారు ప్రజామిత్ర పత్రిక ప్రారంభించారు. ప్రజామిత్ర కార్యాలయం అప్పట్లో తెలుగు సినిమా రచయితలకు, కళాకారులకు పెద్ద నెలవు. సాయంత్రం అయ్యేసరికి మహామహులంతా అక్కడ కలుసుకునేవారు. వారిలో తాపీ ధర్మారావు, సముద్రాల రాఘవాచార్య, కపిల కాశీపతి, నార్ల వెంకటేశ్వరరావు, ఎస్.వీ.ఎస్ రామారావు గార్ల వంటి ఉద్దండులు ఉండేవారు. ఆ కాలంలోనే రామబ్రహ్మం గారికి సినిమా వాసన బాగా ఎక్కింది.

గూడవల్లి గారు వేల్ పిక్చర్స్ దాసు గారు తీసిన సీతా కళ్యాణం (1934), కృష్ణ లీలలు (1935), శశిరేఖ పరిణయం (1936) చిత్రాల పబ్లిసిటీ విషయాల్లో సలహాలు ఇస్తుండేవారు. బెజవాడకు చెందిన సరస్వతి టాకీస్ వారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని కొల్హాపూర్ లో వాళ్ళు తీసిన ద్రౌపది వస్త్రాపహరణం (1936), ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేశారు. తర్వాత వాళ్లే తీసిన కనకతార (1937) చిత్రానికి ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేశారు.

డిసెంబరు 1935 లో తన మిత్ర బృందంతో కలిసి “సారథి ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్” ఏర్పాటు చేసి సొంత చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు గూడవల్లి రామబ్రహ్మం గారు.

వాళ్ల మొదటి సినిమా మాలపిల్ల. దర్శకుడుగా రామబ్రహ్మం కు మాలపిల్ల నే తొలి చిత్రం.

నిర్మాణం…

మాలపిల్ల చిత్రీకరణ 1 మే 1938   తేదీన మద్రాసులోని “మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ కంబైన్స్ స్టూడియో” లో ప్రారంభమైంది. అలనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం మంత్రివర్గ సభ్యుడిగా ఉన్న “బెజవాడ గోపాలరెడ్డి” షూటింగ్ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు.

స్టూడియోలోనే 40 రోజులలో సినిమా పూర్తి చేయడానికి 14 వేల రూపాయలు చెల్లించడానికి స్టూడియోతో ఒప్పందం కుదుర్చుకున్నారు రామబ్రహ్మం గారు. అనుకున్నట్టుగానే 40 రోజులలో షూటింగ్ పూర్తి చేశారు.

మాలపిల్ల సంచలన విజయంతో గూడవల్లి గారు తదుపరి చిత్రం కూడా సాంఘిక సమస్య మీదే తీశారు.

అదే “రైతుబిడ్డ”. జమీందారు వ్యవస్థలో రైతుల బ్రతుకులకు అద్దం పడుతూ రామబ్రహ్మం గారు ఈ సినిమా తీశారు.

మాలపిల్ల సినిమా కథావేదిక అయిన కళ్యాణపురం గ్రామంగా చెన్నపట్నం సమీపాన ఉన్న క్రోమ్ పేట, పల్లవరం మధ్యన ఒక గ్రామాన్ని చూపించారు.

జై మహదేవ్ అంటూ హరిజనులంతా కలిసి పాడే పాట, హరిజనుల ఆలయ ప్రవేశం సన్నివేశాలను తిరునీర్ మలైలో తీశారు. మిగతా చిత్రీకరణ అంతా స్టూడియోలోనే జరిగింది.

సంగీతం…

అలనాటి చిత్రాలలో కథ తో పాటు సంగీతానికి చాలా ప్రాధాన్యత ఇస్తుండేవారు. పాటలు, పద్యాలు ఎక్కువగా ఉంటేనే ప్రేక్షకులు సినిమాకు వచ్చేవారు.

మాలపిల్ల సినిమాలో పదిహేడు సందర్భాలలో పాటలు జతచేశారు. వాటితో బాటు అరడజను దాకా పద్యాలు పెట్టారు.

బసవరాజు అప్పారావు గారు వ్రాసిన “కొల్లాయి గట్టితేనేమీ”, “నల్లవాడే గొల్ల పిల్లవాడే”, “ఆ మబ్బు ఈ మబ్బు” వంటి గీతాలను తీసుకున్నారు.

జయదేవుని అష్టపది “సావిరహే తవదీనా” ను కూడా ఈ సినిమాలో వాడుకున్నారు. మిగిలిన పాటలను, పద్యాలను తాపీ ధర్మారవు గారు వ్రాశారు.

అప్పటివరకు తెలుగు సినిమాలకు రచయిత అంటే ఒక్కరే. ఆ ఆనవాతికి స్వస్తి పలుకుతూ తెలుగులో ఒక సినిమాకు ఇద్దరు, ముగ్గురు రచయితలకు పనిచేయడం “మాలపిల్ల” తోనే మొదలైంది.

సాంఘిక చిత్రం లోని పాటలు తెలుగు నాట వాడవాడలా పాకడం అన్నది కూడా “మాలపిల్ల” తోనే ఆరంభమైంది.

ఆ ఘనత ఈ సినిమా సంగీత దర్శకులు భీమవరపు నరసింహారావు గారికి దక్కుతుంది.

తెలుగు సినిమా చరిత్రలో సంగీతంలో ఆధునికతను తీసుకువచ్చిన తొలి సంగీత దర్శకులు నరసింహారావు గారే అని సుప్రసిద్ధ సంగీత దర్శకులు ఆదినారాయణ రావు గారు అనేవారు.

మాలపిల్ల కు ముందు తెలుగు సినిమా పాటల్లో చరణం పాడిన తర్వాత ఆ వరసే మళ్లీ ఆర్కెస్ట్రాతో వినిపించేవారు.

ఈ పద్ధతికి స్వస్తి చెబుతూ సంగీతం దర్శకులు నరసింహారావు గారు చరణాల మధ్య లింక్ సంగీతం ఇచ్చి సంగీతంలో వైవిధ్యానికి నాంది పలికారు.

అలాగే పాటల బాణీలు కూడా జానపద రీతిలో ఉండి ప్రతీ ఒక్కరు హాయిగా పాడుకునేలా తయారైనాయి.

అలతి అలతి పదాలతో అందరూ తేలిగ్గా పాడుకునేలా తాపీ ధర్మారావు గారు పాటలను వ్రాశారు.

విడుదల…

మాలపిల్ల సినిమా 15 జూన్ 1938 నాటికి చిత్రీకరణ పూర్తయ్యింది. అదే రోజు సారధి కార్యాలయంలో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు గూడవల్లి గారు విందు ఇచ్చారు. అందులో నగర ప్రముఖులు, పత్రికాధిపతులు కూడా పాల్గొన్నారు. ఆ మరుసటి నెలలోనే రీ రికార్డింగ్, ప్రింటింగ్ పనులు బొంబాయిలో పూర్తి చేశారు. ఆగస్టు నాటికి సినిమా యొక్క మొదటి ప్రింట్ వచ్చేసింది. నిర్మాణానికి మొత్తం ఒక లక్షా పదివేల రూపాయలు ఖర్చు అయ్యింది. ఆ ఖర్చు చూసి అంతా అవాక్కయ్యారు. అందరి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ఆ రోజుల్లో తెలుగు సినిమా నిర్మాణ వ్యయం లక్ష రూపాయలకు మించేది కాదు. అలా మాలపిల్ల అత్యధిక వ్యయం సినిమా అయ్యింది.

భారతదేశంలో ప్రప్రథమంగా హరిజనులకు తమ సంస్థానంలోని దేవాలయ ద్వారాలను తెరిపించిన తిరువనంతపురం రాజావారిని అభినందిస్తూ ఈ సినిమా పతాక సన్నివేశాలు, సంభాషణలు వ్రాయించారు రామబ్రహ్మం గారు. తను ఎంతగానో అభిమానించే ఆంధ్రపత్రిక సంపాదకులు దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులుకు ఈ సినిమాను అంకితం ఇచ్చారు. ఈ మాలపిల్ల సినిమా విడుదలయ్యే నాటికి పంతులుగారు కాలం చేశారు. 25 సెప్టెంబరు 1938 విజయదశమి కానుకగా మాలపిల్ల ఆంధ్రనాట పదకొండు కేంద్రాలలో విడుదల అయ్యింది. (దుర్గా కళామందిరం – బెజవాడ,  సత్యనారాయణ – తెనాలి, ఫిలిప్స్ – గుంటూరు, బృందావన – బందరు,  రామకృష్ణ – ఏలూరు, వినాయక – నెల్లూరు, హనుమాన్ – రాజమండ్రి, క్రౌన్ – కాకినాడ, పూర్ణా – విశాఖపట్నం, శ్రీకృష్ణ – విజయనగరం, రాజేశ్వరి – సికింద్రాబాద్) కేంద్రాలతో పాటు మెజిస్టిక్ – బెంగుళూరు లో కూడా విడుదలైంది.

అంతకు ముందు వచ్చిన ఏ తెలుగు సినిమా కూడా ఏకకాలంలో ఇన్ని కేంద్రాల్లో విడుదల కాలేదు.

మాలపిల్ల విడుదలకు కాస్త ముందుగానే సెప్టెంబర్ 15వ తేదీన మద్రాసు మినర్వా థియేటర్లో పత్రిక వారికి ప్రత్యేక ప్రదర్శన వేశారు రామబ్రహ్మం గారు.

ప్రివ్యూ కు వచ్చిన సినిమా ప్రముఖులంతా రామబ్రహ్మం గారి ధైర్యానికి విస్తుపోయారు.

సంచలనాత్మక చిత్రంగా, విప్లవాత్మక చిత్రంగా “మాలపిల్ల” సినిమాని ప్రశంసించారు. ప్రేక్షకుల మాట కూడా అదే అయ్యింది. విడుదలైన తొలినాళ్లలో కొన్ని వర్గాల వారు చిత్రాన్ని ప్రశంసించారు.

మరికొన్ని వర్గాల వారు నిరసించారు. సనాతన ధర్మాన్ని దుయ్యబట్టి, బ్రాహ్మణ్యాన్ని మంట కలిపిందని కొందరు చీత్కరిస్తే, కులభేదాలు లేవని, అంటరానితనం కూడాదని చెప్పిందంటూ మరికొందరు కీర్తించారు.

వాదవివాదాలతో మొత్తం మీద ఆంధ్ర ప్రాంతం అట్టుడికిపోయింది. అలా మాలపిల్ల మంచి చెడ్డల గురించి వివాదం రేపి సంచలనం కలిగించింది.

వాదంలో పాల్గొనేందుకు అసలు సినిమాలో ఏమి ఉందో చూడాలి కదా. ప్రతివారు విరగబడి సినిమా చూశారు. మాలపిల్ల అఖండ విజయం సాధించింది.

ఆనాటి తెలుగు సినిమాల వసూళ్ల చరిత్రలో ఆల్ టైం రికార్డుగా నిలిచింది. నిర్మాతగా గూడవల్లి రామబ్రహ్మం అనుకున్నది సాధించారు. దర్శకుడుగా ఘనవిజయం సంపాదించారు.

Show More
Back to top button