CINEMATelugu Cinema

వెండితెరపై విశాఖ వెన్నెల కురిపించిన బాలచందర్ “మరోచరిత్ర” సినిమా.

స్వప్న.. ప్రేమంటే ఏమిటి? ఏమి లేదు రెండక్షరాలు.. మరి పిచ్చి కూడా రెండక్షరాలే కదా? 

అంటే ప్రేమికులు పిచ్చివాళ్లంటావా?  కావాలి మరి.. అవును మనం ఎప్పుడూ ఈ శిథిలాల వెంట తిరుగుతున్నామెందుకు?

ఈ శిథిలాల వెనుక ఎన్నో కథలుంటాయి గనుక. చిరిగిపోయిన చరిత్ర పుటలు ఎంత చిందరవందరగా ఉన్నా శాశ్వతంగా గుర్తుంటాయి. బాలూ మన కథ కూడా ఒక చరిత్ర అవుతుందేమో?

స్వప్న మనం పెళ్లి చేసుకోకూడదు. ఏం ప్రేమంతా అయిపోయిందా? 

కాదు.. పెళ్లి చేసుకుంటే మనము కూడా ఆలుమగలుగా మిగిలిపోతాము. ప్రేమ ఫలించకపోతేనే కథనాయకులం అవుతాం.

మనది కథ ఎందుకు కావాలి? చరిత్ర కాకూడదా?

మరోచరిత్ర సినిమా ప్రారంభంలో ప్రేయసి, ప్రియుడు స్వప్న, బాలుల మధ్య సంభాషణ. ఈ సినిమాను విషాదాంతం చేయడమే కాదు, మొదటి సన్నివేశంలోనే సినిమా ముగింపు ఏమిటో ప్రేక్షకులు తెలిసేలా చేసి ఉత్కంఠను దాచకుండా చేసిన ధైర్యం చేశారు కైలాసం బాలచందర్. మొదట్లోనే ఈ సన్నివేశం పెట్టడమేంటి అని ఆయన వద్ద ప్రస్తావిస్తే, నవ్వుతూ ముగింపు ఎలా ఉంటుందో ఒకసారి చూసిన ప్రేక్షకుడు ఎలాగో బయట చెప్పేస్తాడు. ఇంకా మనం దాచి ఏం ప్రయోజనం. పైగా ఇది ఒక విషాద గాథ అని ముందే చెప్పేస్తే అందుకు మానసికంగా ప్రేక్షకుడు ముందే సిద్ధం అయిపోతాడుగా అన్నారు బాలచందర్. ఆయన అనుకున్నట్టుగానే సినిమా తీసి ఘన విజయం సాధించారు.

“ప్రేమిస్తే కలిసి ఉండాలి.. లేదంటే చచ్చిపోవాలి”. ప్రేమలో అంత లోతైన భావన ఉంటుందా? ప్రేమలో ఒకరికొకరు చచ్చిపోయేంత ఏముంటుంది?

ఏముంటుంది? ప్రేమే ఉంటుంది. లోతైన ఆర్థ్రతతో గమనిస్తే మనసుకు ప్రేమ స్ఫురిస్తుంది. అగాథంలోకి తొంగి చూస్తే లోతైన ప్రేమ కనబడుతుంది. పర్వతాలెక్కి పిలిస్తే ప్రేమ ప్రతిధ్వనిస్తుంది.  షరతులతో సంకెళ్లు వేస్తే ప్రేమ పట్టారానిదైపోతుంది. అదే కాంక్షలతో కాటేస్తే? కక్షలతో చంపేస్తే? ప్రేమ “మరోచరిత్ర” అవుతుంది. ఇలాంటి సినిమా చూడకపోతే ప్రేమ భవసాగరంలో కొట్టుకుపోతుంది. ఇదే సూత్రంతో “మరోచరిత్ర” సినిమాను తెరకెక్కించారు దర్శకులు కె.బాలచందర్. ఈ సినిమా చూసిన భగ్నప్రేమికులు ఇందులో లీనమైపోయారు. ఎంతలా లీనమయ్యారు అంటే! ఈ ఒక్క సినిమా వల్ల ఎంతోమంది ప్రేమికులు తమకు తాముగా ప్రేరణకు గురై ఆత్మహత్య చేసుకునేంతలా లీనమయ్యారు. మరోచరిత్ర సినిమా ఇప్పటికీ ఎప్పటికీ ఒక చరిత్ర అని చెప్పాలి. ఎంతమంది దర్శకులు, ఎంత గొప్ప నటులతో ఎన్ని సినిమాలు తీసినా ఈ సినిమాకు ఉన్న ఆ చరిత్ర ఎప్పటికీ చరిత్రలో అలా నిలిచిపోయి ఉంటుంది.

మరోచరిత్ర సినిమాతో బాలచంద్రుడు వెండితెరపై విశాఖ వెన్నెల కురిపించాడు. అంతవరకు తెలుగు, తమిళ చిత్రాలతో మద్రాసు మెరీనా బీచ్ మెరిసిపోయేది. 46 ఏళ్ల క్రితం 1978లో తమిళ దర్శక దిగ్గజం కైలాసం బాలచందర్  అంతకన్నా రమణీయంగా వైజాగ్ సాగర తీరాన్ని వెండితెర పై బంధించి “మరో చరిత్రను” సృష్టించి వీక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. నిజానికి మరోచరిత్ర చిత్రీకరణ నాటికి “విశాఖ ఉక్కు ఖర్మాగారం” నిర్మాణం పూర్తి కాలేదు. ప్లాంట్ శంకుస్థాపన పైలాన్ దగ్గర నిల్చుని హీరో, హీరోయిన్లు (కమలహాసన్, సరితల) మధ్య సంభాషణ ఇలా ఉంటుంది. మన ప్రేమ ఎప్పుడు ఫలిస్తుంది అని కథానాయిక అడిగితే విశాఖలో స్టీల్ ప్లాంట్ పూర్తయినప్పుడు అని హీరో అంటాడు. గణేష్ పాత్రో వ్రాసిన ఈ సంభాషణ వింటే ఈ చిత్రంలో దర్శకుడు విశాఖకు ఇచ్చిన ప్రాధాన్యం చెప్పకనే చెబుతుంది. ఆర్కే బీచ్ తీరం, యారాడ కొండ భీమిలి సాగరతీరం ఇలా వైజాగ్ ప్రకృతి సోయగాలన్నిటిని వెండితెరపై మెరిపించారు బాలచందర్.

చిత్ర విశేషాలు….

  • దర్శకత్వం   :    కె. బాలచందర్ 
  • కథ           :       కె. బాలచందర్
  • నిర్మాణం   :     రామ అరంగన్నాల్ 
  • స్క్రీన్ ప్లే     :     కె. బాలచందర్ 
  • తారాగణం  :   కమల్ హాసన్, సరిత
  • సంగీతం    :     యం.యస్. విశ్వనాథన్ 
  • నేపథ్య గాయకులు :  బాలు, రామోల, వాణి జైరాం,      పి. సుశీల , కమల్ హాసన్, యస్. జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి
  • సాహిత్యం  :  ఆచార్య ఆత్రేయ
  • ఛాయాగ్రహణం  :   బి.యస్. లోకనాథ్ 
  • నిర్మాణ సంస్థ    :    ఆండాళ్ ప్రొడక్షన్స్
  • నిడివి      :     169 నిమిషాలు
  • విడుదల తేదీ   :     19 మే 1978
  • భాష     :     తెలుగు

చిత్ర కథ సంక్షిప్తంగా…

బాలు (కమల్ హాసన్) విశాఖపట్నంలో పనిచేస్తున్న తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి తమిళనాడు నుండి విశాఖపట్నం వస్తాడు. తనకు తెలుగు భాష రాదు. వారి పక్కింటి అమ్మాయి స్వప్న (సరిత) తో ప్రేమలో పడతాడు. వచ్చీరాని తెలుగుతో బాలు, సరితల ప్రేమాయణం సరదాగా సాగుతుంది. అన్ని కథలలాగానే వారి ప్రేమ వ్యవహారం బయట పడుతుంది. ఇద్దరి తల్లిదండ్రులు (ముఖ్యంగా బాలు తండ్రి, స్వప్న తల్లి) వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. తమ మనసు మార్చుకొనేది లేదని బాలు, స్వప్న తెగేసి చెబుతారు. ఒక సంవత్సరం పాటు ఒకరినొకరు చూడకుండా, కలవకుండా, మాట్లాడకుండా, ఉత్తరాలు కూడా వ్రాసుకోకుండా ఉండాలని, ఆ తరువాత కూడా వాళ్ళు పెళ్ళి చేసుకోవాలని ఇష్టపడితే అప్పుడు ఆలోచిస్తామని పెద్దవాళ్ళు షరతు పెడతారు. దానికి ఇరుకుటుంబాల వారు మరియు బాలు, స్వప్నలు అంగీకరిస్తారు. 

ఒప్పందం తరువాత బాలు విశాఖపట్నం నుండి హైదరాబాదు వస్తాడు. అక్కడ అతనికి ఒక నర్తకి (మాధవి) తో పరిచయమౌతుంది. స్వప్నతో బాలు ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకొన్న మాధవి అతనిని ప్రోత్సహించి నాట్యం నేర్పుతుంది. మధ్యలో ఒకసారి విహారయాత్రలో కలుసుకొనే అవకాశం వచ్చినా గానీ స్వప్న దృఢంగా అతనికి కనపడకుండా ఉంటుంది. చూస్తూనే యేడాది పూర్తవుతుంది. పూర్తయినాక బాలు విశాఖపట్నం తిరిగి వస్తాడు. ఆ రోజును సంతోషంగా జరుపుకోవాలనుకొన్న స్వప్న అపాయంలో చిక్కుకుంటుంది. ఎప్పటి నుండో ఆమెపై కన్ను వేసిన మరొక యువకుడు ఆమెపై అత్యాచారానికి పూనుకొంటాడు. బాలును అపార్థం చేసుకున్న మాధవి అన్నయ్య అతడిని చంపేందుకు రౌడీలను పంపుతాడు. అలా అత్యాచారానికి గురైన స్వప్న, చావుదెబ్బలు తిన్న బాలు చావుబతుకుల మధ్య కలుస్తారు. చివరికి కొండపై నుంచి పడి ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని మరణిస్తారు.

బాలచందర్…

“కెప్టెన్ ఆఫ్ ది షిప్” అని దర్శకుడుని అంటారు. ఆ పేరుకు తగ్గ గౌరవాన్ని వాల్ పోస్టర్ లో ఎవ్వరికీ చూపించుకోవాలని అనిపించలేదు. కానీ ఆ గౌరవానికి వన్నె తెచ్చి వాల్ పోస్టర్ అడుగు భాగాన మిగతా సాంకేతిక నిపుణులతో కలిసి ఉన్న పేరును పైకి లాగి దర్శకుడి పేరును శిఖరం మీద నిలబెట్టినవాడు కైలాసం బాలచందర్. నిలబెట్టడమే కాదు దానిని ఇంకొంచెం పైకి లాగి నింగిలో ప్రతిష్టించాడు. ఇంటి పేరులో ఊర్ధ్వముఖం యానం ఉన్న తర్వాత వాల్ పోస్టర్ లో ఉండాలన్న ఆలోచన రాకపోతుందా? ఖచ్చితంగా వస్తుంది. దీనిని తాను తు.చ తప్పకుండా పాటించారు. ఇదే తెలుగులోను ప్రముఖ దర్శకులకు అనుసరించడానికి వనరు అయ్యింది.

నూలు వస్త్రాలపై కలంకారి వంటి రంగుల్ని అద్దటానికి “సన్నిలం” గ్రామం చాలా ప్రసిద్ధి. దర్శకులు కైలాసం బాలచందర్‌ ది ఇదే ఊరు. తంజావూరు జిల్లాలో అన్నామలై యూనివర్సిటీ పట్టభద్రుడు. అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ తీరిక సమయాల్లో నాటక రచనను ప్రవృత్తిగా మార్చుకుని వాటిని దర్శకత్వం చేస్తూ ఉండేవారు బాలచందర్. తాను వ్రాసిన నాటకం ఎంజీఆర్‌ దృష్టిని ఆకర్షించింది. ఆయన ప్రోత్సాహంతో 1965లో “దైవత్తాయ్‌” అనే సినిమాకు మాటలు, స్క్రీన్‌ ప్లే సమకూర్చారు. ఆనాటి సినిమాలు సింహభాగం శౌర్యం, వీరత్వం మీదనే ఆధారపడి నడుస్తుండేవి. సుఖాంతమయ్యే సినిమాలు చూడటానికి అలవాటు పడ్డ ప్రేక్షక జనానికి విషాదాంతాలను అలవాటు చేశారు బాలచందర్. 

ఆచారాలు కట్టుబాట్ల పేరుతో నలిగిపోతున్న స్త్రీ జీవితాలమీద కథ అల్లుకుని జయప్రదతో తెలుగులో “అంతులేని కథ” ను  తెరకెక్కించారు. మగవాడి దౌర్జన్యాలకు గురి కాకుండా, స్త్రీ స్వతంత్రంగా బతకాలనే నేపథ్యంలో సుహాసినితో “సింధుభైరవి” నిర్మించారు. “సత్తెకాలపు సత్తెయ్య” సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచమైన బాలచందర్‌ కు తమిళంలో ఎంతపేరుందో తెలుగు చిత్రసీమలో కూడా అంతే పేరుంది. ఆ తరువాత విభిన్న కోణంతో ఉండే బొమ్మా బొరుసా వంటి సినిమా తీశారు. మెగాస్టార్‌ చిరంజీవిని 47 నాట్కళ్‌ (47 రోజులు) సినిమాతో తమిళ చిత్రరంగానికి పరిచయం చేశారు. అలాగే అందమైన అనుభవం, ఆడవాళ్లూ మీకు జోహార్లు, తొలికోడి కూసింది వంటి చిత్రాలు బాలచందర్‌ దర్శకత్వంలోనే వచ్చినవే. తమిళ సినిమా అరంగేట్రంలో ఒక బ్రాహ్మణ యువతి కుటుంబ బాధ్యతలు మోసేందుకు పడుపు వృత్తిలోకి దిగుతుంది. బాలచందర్‌ తలపోసే ఇలాంటి కథలు వివాదాస్పదమయ్యేవి.

నాయిక ప్రాధాన్య చిత్రాలకు బీజం…

చలనచిత్ర పరిశ్రమ అంతా కథనాయకుల ఏలుబడిలో వాణిజ్యాంశాలకు లోబడి సినిమాలలో కథానాయికలకు విలువ లేకుండా పోవడం చూశాడు. మధ్యతరగతి జీవితాల్ని సున్నితంగా తడిమి, ఒకటొకటిగా విధి వంచితల వృత్తాంతంలో ప్రేక్షక హృదయాలని గెలుచుకున్నాడు. తన కొత్త పంథా తన ఒరవడి అయ్యింది. మనోతత్వశాస్త్రమే ముడిసరుకు అయ్యింది. మనసు చుట్టే రీళ్లు చుడతాడు. మనసు కవి ఆత్రేయ లాగా బాలచందర్ మనసు దర్శకుడు.

“బొమ్మ బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పైచేయి” అన్న పాట చాలా మంది వినే ఉంటారు. తెలుగులో బాలచందర్ తొలిఅడుగు అది. తాను అప్పటినుంచి తెలుగులో ఉన్నాడు 1971 నాటికి “బొమ్మ బొరుసా” సినిమా అతను తెలుగులో తీర్చిదిద్దిన తొలి చిత్రమైంది. “అంతులేని కథ”, “మరోచరిత్ర”, “ఆకలి రాజ్యం”, “47 రోజులు”, “ఇది కథ కాదు”, “ఆడవాళ్లు మీకు జోహార్లు”, “కోటి విద్యలు కూటి కొరకే”, “కోకిలమ్మ”, “రుద్రవీణ”, “గుప్పెడు మనసు” ఇవన్నీ ప్రత్యేకించి తెలుగు వాళ్ల కోసం తన హృదయాలను ఒలిచి మలిచిన సజీవ చిత్రాలు. మరో 90 దాకా తమిళ, కన్నడ, హిందీ సినీ ప్రస్థానంలో కొలువుదీరాయి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా ఏడు జాతీయ పురస్కారాలు జై కొడుతూ తన ఇంట్లో చేరిపోయాయి.

48 ఏళ్ళ వయస్సులో మరోచరిత్ర కథతో సాహసం..

1930లో జన్మించిన బాలచందర్ “మన్మథలీల” సినిమా సమయానికి 46 యేండ్ల వయస్సులో ఉన్నాడు. మాములుగా ఆ వయస్సున్న దర్శకులు యువత నాడి పట్టుకోలేక, యువతను మెప్పించే సినిమాలు చిత్రీకరించలేక పాత వాసనలతో చాదస్తంగా మిగిలిపోతారు. కానీ బాలచందర్ అలా కానే కాదు. కుర్ర కారుపై సినిమా తీసి ఉర్రూతలూగించాడు. తన 48వ ఏట “మరో చరిత్ర” అనే బాణాన్ని ఎక్కుపెట్టి మరీ యూత్ ని కిర్రెక్కించాడు. ఎంతలా కిర్రెక్కించాడంటే ఒక తెలుగు సినిమా, అరవం మాట్లాడే మద్రాసులో తమిళ తంబీలు నాలుగు ఆటలు 365 రోజులు ప్రదర్శింపబడేంతగా. ఎంతలా కిర్రెక్కించాడంటే ప్రముఖ దర్శకులు యల్వీ ప్రసాద్ గారు దానిని హిందీలో పునర్నిర్మిస్తే అక్కడ కూడా 365 రోజులు ఆడేటట్టుగా. ఎంతలా కిర్రెక్కించాడంటే కన్నడం, తమిళం, తెలుగులో కూడా పునర్నిర్మించేంతలా. అంతలా ఈ “మరోచరిత్ర” సినిమా సంచలన విజయంలో మనసు, వయస్సుల లడాయిని చూపిస్తాడు.

“విధి చేయు వింతలన్నీ మతి లేని చేతలేనని” ఆచార్య ఆత్రేయ చేత వ్రాయించి కమలహాసన్ మనసుకి ప్రతీకగా చేసి, వయస్సుకు సింబాలిజంగా సరితను చూపి, సయ్యాటలో మిగతా లోకాన్ని ఆదమరిస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా  ఉంటాయో హెచ్చరిస్తాడు. ఈ పరిణామాలకు విధి అనే పేరు పెడతాడు కైలాసం బాలచందర్. విధి అనే అంశం ఆ రోజుల్లో సినిమా యొక్క బాక్సాఫీస్ సూత్రంగా ఏలుకుంటుంది. విధి సృష్టించే విషాదాంతం ఆ ధోరణిలో భాగమైపోయింది. “మరోచరిత్ర” విషాదాంతం పునర్జన్మకు ప్రారంభమే, కాకపోతే పుట్టుకలు లేవు. బాలు, స్వప్నల (కమల్, సరిత) ఆత్మలు తమ కథలు చెప్పుకుంటున్నాయి. సముద్రపు హోరులో ఆ శిథిల సౌధంలో వాళ్ళ స్వీట్స్ నథింగ్సే వినిపిస్తుంటాయి. ఇహ లోకంలో వారు ఒక్కటి కాలేకపోయినా, ఆర్తి ఆ సంభాషణలలో ప్రస్ఫుటమవుతూ ఉంటుంది.

బాలచందర్ విజయ రహస్యం..

పతాక సన్నివేశాలలో సినిమాలకి ముగింపు రెండు రూపాల్లో ఉంటుంది. కథ ముగింపు ఒకటైతే, కథనం ముగింపు రెండోది. మొదటి ఉద్దేశించిన కథకు న్యాయం చేకూరుస్తుంది. అంటే కమలహాసన్, సరితలు ఒప్పందం ప్రకారం ఏడాది ఎడబాటును జయించి ఏకమైపోవడం అన్నమాట. నిజానికి అప్పుడున్న సినిమా ముగింపుల ప్రకారం ఇదే జరుగుతుందని ప్రేక్షకులు ఆశించవచ్చు. కానీ బాలచందర్ తెరకెక్కించిన ఏ సినిమా చూసినా కూడా చివర్లో ఒక షాక్ ఇస్తాడు. షాక్ ట్రీట్మెంట్, వాస్తవ ముగింపులు అతనికి రెండు కళ్ళు. ఇక్కడ ముగింపు కథకు, సమాన ముగింపుతో ముడి పెట్టేసి తమాషా చూస్తాడు. ఫ్లాట్ ముగింపు కథనం లోంచి పుడుతుంది. కథనంలో మాధవి అన్న కమలహాసన్ మీద కక్ష్య కట్టిన బీట్ ఉంటుంది. అలాగే అటు సరితతో అసభ్యంగా ప్రవర్తించి అవమాన పడ్డవాడు పగబట్టి బీట్ కూడా ఉంటుంది. ఈ రెండు ఉన్నాక కథ ముగింపు ఊసులో లేకుండా అప్రస్తుతం అయిపోతుంది.

గొప్ప సినిమాలో నిగూఢ సత్యాల కోసం చూడాలనుకుంటాడు అంతర్జాతీయ ప్రసిద్ధ రచయిత జేమ్స్ బోనెట్. ప్లాట్ క్లైమాక్స్ ద్వారా వీటిని ప్రోది చేశాడు బాలచందర్. బాలచందర్ దృష్టిలో విధి అంటే కేవలం తమ అహాన్ని బట్టి పనిచేసుకుపోయే యాంత్రిక శక్తి మాత్రమే. మన అహంతో మనం పోగొట్టుకున్న మంచి, చెడ్డల కర్మల తూకాన్ని బట్టి జీవితంలో ఘట్టాలు ఉంటాయి. అదే విధి విలాసం. దీనితో దేవుడికి సంబంధం లేదు. దేవుడు ఉపయోగించుకోమని విచక్షణ జ్ఞానం గల మెదడు మాత్రమే ఇచ్చాడు. ఎలా ఉపయోగించుకుంటే అలా ఉంటాం. సరిత తన వయస్సు ప్రభావం చేత ఎలా నడుచుకోవాలో మరిచిపోయి తనతో అసభ్యంగా ప్రవర్తించిన వాడి అహాన్ని దారుణంగా దెబ్బతీసింది. గత్యంతరం లేక తప్పించుకోలేని దాని ఫలితం అనుభవించింది. కమలహాసన్ కూడా మనసు మీద అదుపు కోల్పోయి ప్రేయసినే అనుమానించి పర్యవసానంగా చోటుచేసుకున్న మలుపులతో మాధవి అన్నతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటాడు. ఎవరైనా తొందరపడి నిర్ణయం తీసుకోకుండా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అదే మరోచరిత్ర విజయానికి బలమైన రహస్యం.

కథానాయికతో మొదటిరోజు తిప్పలు…

నిజానికి బాలచందర్ సినిమాలంటే సంచలనాలకు కేంద్రబిందువులు. అప్పటికే రంగుల చిత్రాలు విరివిగా వస్తున్న రోజులలో ఈ సినిమాను నలుపు – తెలుపుల మిశ్రమంలో తీసే సాహసం చేయడమే ఒక అద్భుతంం. ఇంత అద్భుతంగా సృష్టించిన ఈ వెచ్చటి అనుభవానికి బాలచందర్ ఆస్థాన విద్వాసులందరూ ఉన్నారు. ఆచార్య ఆత్రేయ, ఎమ్మెస్ విశ్వనాథన్, గణేష్ పాత్రో, లోకనాథ్ ప్రభృతులు. ఎందరో అమ్మాయిలను కాదని 163 వ అమ్మాయిగా వచ్చి కథనాయిక పాత్రకు ఎంపిక అయిన సరితతో పెద్ద షాకే. తొలిరోజు చిత్రీకరణలో సరిత కమలహాసన్ చేతిని ముద్దాడి “ఏమిటి తప్పా”?అనాలి. విశాఖపట్నంలో చిత్రీకరణ ప్రారంభిస్తూ శ్రీకారం చుట్టిన ఈ మొదటి షాట్ కి సరితతో తిప్పలే. ఎన్నో టేకులు తింటుంది. సంభాషణ పలకడం రావడంలేదు. ఇక లాభం లేక ఆరోజుకు చిత్రీకరణకు స్వస్తి చెప్పేసి కథనాయికను మార్చేద్దాం అనుకున్నారు.

ఆ రాత్రి సహాయ దర్శకులు సరిత గదికి వచ్చి “చూడమ్మా రేపు నువ్వు బాగా చేస్తే దర్శక మహాశయులు నీకు చాక్లెట్లు ఇస్తారట అన్నాడు. మరుసటి నాడు అద్భుతంగా నటించి చాక్లెట్లు అందుకుంది సరిత. ఇంకేదైనా జరిగి ఉంటే లేదు మాస్ వేస్తూ టాలెంటెడ్ నమ్మిన బాలచందర్ తనకు కట్టుబడ్డారు అంతే. తెలుగులో ఈ సినిమా తెలుగులో రికార్డులు బద్దలు చేస్తుంటే, డబ్బింగ్ చేయకుండా అలాగే తెలుగు వర్షన్ ను మద్రాసులో విడుదల చేస్తే ప్రేక్షకులు ఏడాది పాటు తమిళ తంబీలు విరగబడి చూశారు. ఎల్వి ప్రసాద్ గారు హిందీలో “ఏక్ దూజ్ కేళియే” గా నిర్మిస్తే దానిని 365 రోజులు ఆడించారు హైదరాబాదీలు. ఈ అజరామర ప్రేమకథ ఈ మధ్య కనడంలో పునర్నిర్మాణం అయ్యింది. తమిళంలోనూ పునర్నిర్మాణం అవుతోంది. తెలుగులో కూడా 2010 లో పునర్నిర్మాణం అయ్యింది.  కావున ప్రేమికుల రేసులో “దేవదాసు” సరసన చేరుతున్న “మరో చరిత్ర” కి కోటి దండాలు, శతకోటి దండాలు చేద్దాం.

చిత్ర విశేషాలు…

★ దర్శకులు బాలచందర్ గారు 1979లో సదరన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకునిగా గెలుపొందారు.

★ 1981 వ సంవత్సరంలో బాలచందర్ గారు మరోచరిత్ర చిత్రాన్ని హిందీలో “ఏక్ దూజుకే లియే” పేరుతో చిత్రీకరించారు. కమల్ హాసన్ మళ్లీ తన పాత్రలో తానే నటించగా, కథానాయిక సరిత స్థానంలో పంజాబీ నటి రతీ అగ్నిహోత్రిని తీసుకున్నారు.

★ మరోచరిత్ర సినిమాను హిందీలో పునర్నిర్మించినా కూడా విజయవంతమైంది. ఈ రెండు చిత్రాలు 2013లో CNN-IBN యొక్క ఆల్ టైమ్ 100 భారతీయ చిత్రాలలో జాబితా చేర్చబడ్డాయి.

★ ఈ చిత్రం కన్నడలో లవ్ స్టోరీ ( 2005), ఒడియాలో తు మోరీ పేన్ (2009) గా మరియు 2010లో అదే టైటిల్ తో ఈ సినిమా తెలుగులోకి పునర్నిర్మాణం చేయబడింది.

★ మరోచరిత్ర సినిమా మలయాళంలో “తిరకల్ ఎఝుతియ కవిత” పేరుతో డబ్ చేయబడింది.

★ మరోచరిత్ర సినిమా డబ్బింగ్ లేకుండా తమిళనాడులో తెలుగులోనే విడుదల చేయబడి మద్రాసులో సంవత్సరంపాటు నడచింది.

★ మరోచరిత్ర సినిమా ఆంద్రప్రదేశ్‌లో విజయం సాధించడంతో ఆయా భాషల్లోకి డబ్ చేయకుండానే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు , కర్ణాటకల్లో విడుదల చేశారు. ఇది తమిళనాడు మరియు కర్ణాటకలోని థియేటర్లలో అత్యధిక కాలం నడిచిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది.

★ బాలచందర్ గారు మరోచరిత్ర సినిమాలో కథానాయిక కోసం వెతుకుతూ స్వప్న పాత్రకు నటి శ్రీదేవిని మొదట ఎంపిక చేశారు. ఎన్టీఆర్, అక్కినేని లతో వెనువెంటనే చిత్రీకరణ కారణంగా ఆమె తప్పుకుంది.

★ ఈ చిత్రంలో క్రాస్-కల్చరల్ రొమాన్స్‌తో కూడిన నటన ఉంటుంది. కాబట్టి, మహిళా ప్రధాన పాత్రలో కొత్త నటిని ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు బాలచందర్. ఈ పాత్ర కోసం చాలా మంది అమ్మాయిలను ఆడిషన్ చేసారు. చివరికి పదో తరగతి చదువుతున్న అభిలాష అనే “పెద్ద కళ్ళు ఉన్న ముదురు రంగు చర్మం గల అమ్మాయి”ని ఎంచుకున్నాడు.

★ చిత్ర నిర్మాణ యూనిట్ సభ్యులు ఆమె ముదురు రంగు మరియు లావుగా ఉన్న శరీరాకృతితో ఉన్నప్పటికీ బాలచందర్ గారు ఆమెనే ఖరారు చేశారు. తరువాత ఆమెకు బాలచందర్ గారు స్వయంగా సరిత అని పేరు పెట్టారు.

★ 2005లో ది హిందూకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్రం ఆడిషన్ కోసం వచ్చిన వారిలో సరిత 162వ అమ్మాయి అని ఆమె చెప్పింది.

★ ఈ చిత్రం ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మరియు భీమునిపట్నంలలో చిత్రీకరించబడింది.

★ ఆ కాలంలో రంగుచిత్రాలు విరివిగా వస్తున్నా కూడా వాటికి విరుద్ధంగా “మరో చరిత్ర” సినిమాను నలుపు – తెలుపు రంగులలో చిత్రీకరించబడింది.

★ చిత్రం యొక్క చివరి పొడవు 4,648.51 మీటర్లు (15,251.0 అడుగులు).

Show More
Back to top button