Telugu Special Stories

స్త్రీధన్‌ గురించి ప్రతి వివాహిత తెలుసుకోవాలి.!

స్త్రీధన్ అనగానే అర్థం అవుతుంది ఇది స్త్రీలకు సంబంధించినదని. ఇటీవల సుప్రీంకోర్టు వివాహిత మహిళల హక్కుల గురించి  కీలక తీర్పు వెలువరించింది. అదేంటంటే స్త్రీధన్ కేవలం మహిళలకు మాత్రమే చెందుతుందని వెల్లడించింది. స్త్రీధన్ అంటే మహిళలకు పెళ్లికి ముందుగాని, తర్వాత గాని తనకు వచ్చిన ఆస్తులు, వస్తువలు. వీటిపై కేవలం తనకు మాత్రమే హక్కు ఉంటుంది.

తన భర్తకు గాని, అత్తమామలకు గాని ఎలాంటి హక్కు ఉండదు. అయితే, తన ఆస్తులు, వస్తువులు భర్త లేదా అత్తమామల అదుపులో తాత్కాలికంగా ఉంచవచ్చు. కావాలనుకుంటే తర్వాత తీసుకోవచ్చు. అంతేగాని భర్త లేదా అత్తమామలు తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవడం గానీ, దుర్వినియోగం చేయడం గానీ చేయకూడదు. ఇలా చేస్తే నేరపూరిత ఉల్లంఘన కిందకి వస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.

వివాహానికి ముందు, తర్వాత సమయంలో మహిళకు బహుమతిగా వచ్చినవి కూడా స్త్రీధన్‌ కింద ఆమెకే చెందుతాయి. చర, స్థిరాస్తులే కాకుండా ఎన్నో రకాల ఆభరణాలు ఉన్నాయి. ఉదాహరణకు బంగారం, వెండి, విలువైన రాళ్లు మొదలైన వాటితో తయారు చేసిన ఆభరణాలు కూడా దీని కిందికి వస్తాయి. అలాగే, కారు లాంటి విలువైన వస్తువులు, పెయింటింగ్‌లు, కళాఖండాలు, గృహోపకరణాలు, ఫర్నీచర్‌ మొదలైనవి కూడా స్త్రీధన్‌లో భాగమే.

మహిళల తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల నుంచి వచ్చిన ఏ బహుమతి అయిన దీని కిందికే వస్తుంది. వీటితో పాటు స్త్రీ చేసే మదుపు, పొదుపు కూడా తనకే దక్కుతాయి. వాటి వల్ల వచ్చిన రాబడులు ఆమెకే దక్కుతాయి. హిందూ మతంలోనే కాకుండా ఇతర మతాలలో కూడా మహిళల ఆస్తులు లేదా వివాహ సమయంలో పొందిన బహుమతులను రక్షించడానికి ఇలాంటి నిబంధనలు ఉన్నాయి.

వివాహం తర్వాత భార్యాభర్తలు విడిపోవాలనుకుంటే మహిళలు తమ స్త్రీధన్‌ను క్లెయిం చేయవచ్చు. ఒకవేళ అత్తింటివారు ఆమె క్లెయింను తిరస్కరిస్తే.. అది గృహ హింస కిందకు వస్తుంది. దీనివల్ల భర్తతో పాటు అత్తమామలు కూడా క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ భర్త, అతడి కుటుంబం ఆమె ఆస్తిని ఆక్రమించినా, ఆమే అడిగినప్పుడు తిరిగి ఇవ్వకపోయినా ఆ స్త్రీ భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 406 ప్రకారం ‘నేరపూరిత నమ్మక ఉల్లంఘన’ (Criminal Breach of Trust) కేసు పెట్టొచ్చు.

దీని ప్రకారం కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా కూడా విధించవచ్చు. భర్త చేసిన అప్పులు తీర్చడానికి మహిళలకు సంబంధించిన ఆస్తి ఉపయోగించకూడదని కోర్టులు స్పష్టం చేశాయి. స్త్రీధన్‌ అనేది మహిళకు సంబంధించిన సంపూర్ణ ఆస్తి అని, స్త్రీధన్‌ భార్య, భర్తల ఉమ్మడి ఆస్తిగా మారదని చట్టం చెబుతోంది. కాబట్టి యజమానిగా ఆస్తిపై భర్తకు ఎలాంటి ఆధిపత్యం ఉండదు.

Show More
Back to top button