Telugu Cinema

నాట్య కళా కోవిదుడు, భరత కళా ప్రపూర్ణుడు…  వేదాంతం రాఘవయ్య.

వేదాంతం రాఘవయ్య (8 జూన్ 1919 – 19 అక్టోబర్ 1971).

తెలుగు రాష్ట్రాలకు కూచిపూడి నాట్యం అత్యంత ప్రసిద్ధి. కృష్ణా జిల్లాలో గల కూచిపూడి గ్రామం అంతా కూచిపూడి నాట్యం, యక్షగానం లతో భాసిల్లుతుంది . కూచిపూడికి యక్షగాన సొబగులు అద్దిన అపర నాట్య గురువు, కూచిపూడి నాట్యత్రయంలో ఒకరు చింతా వెంకట్రామయ్య గారి మనవడు వేదాంతం రాఘవయ్య గారు కూచిపూడి నాట్యంలో అద్భుత ప్రతిభ కలవారు. తెలుగు చిత్రసీమకు కూచిపూడి నృత్యాన్ని పరిచయం చేసింది వేదాంతం రాఘవయ్య గారే. తొలిసారి తెలుగు సినిమాలో దశావతార నృత్యాన్ని ప్రదర్శించిన ఘనత రాఘవయ్య గారికే దక్కుతుంది. చిన్నతనంలోనే బ్రిటిష్ వలస పాలకుల నుండి బంగారు పతకాన్ని పొందిన ఘనత రాఘవయ్య గారి సొంతం.

యుక్తవయసులో, రాఘవయ్య గారు తన ప్రసిద్ధ పాత్రలైన ఉష, శశిరేఖ మరియు మోహినీ పాత్రలతో పాటు సీత, చంద్రమతి, లీలావతి వంటి పాత్రలు కూడా పోషించారు.

వాటితో పాటు తాను కృష్ణుడు, రాముడు మరియు హరిశ్చంద్రుడు వంటి పురుష పాత్రలను అద్భుతంగా ఆవిష్కరించడంలో విశిష్టుడు.

రాఘవయ్య గారు నట్టువాంగం, సూత్రధారణలో అసమాన్యుడు. నాట్య, నాటకాలలో విభిన్న పాత్రలు పోషించడం, తన సమకాలీన కళాకారులను సేకరించి వేదికపై దర్శకత్వం వహించడం మరియు సోలో డ్యాన్స్ ప్రదర్శనలు ఇవ్వడం రాఘవయ్య గారి ప్రత్యేకత. కూచిపూడి నాట్యంతో సినీ రంగ ప్రవేశం చేసిన రాఘవయ్య గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాఘవయ్య గారు దేశవ్యాప్తంగా అవార్డులు మరియు రివార్డులతో పాటు అత్యున్నత విశిష్టతను సంపాదించారు.

తాను దర్శకత్వం వహించిన మూడవ చిత్రం దేవదాసు (1952) తో యావత్ భారతదేశ సినీ ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకున్న విజయవంతమైన చిత్రాల దర్శకులు రాఘవయ్య గారు.

రాఘవయ్య గారికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంది. ఎప్పుడూ స్క్రిప్ట్ లేకుండా సెట్స్‌కి వచ్చేవాడు. ప్రతీ సంభాషణ మరియు అన్ని సన్నివేశాలకు అవసరమైన నటన తనకు ఖచ్చితంగా తెలుసు.

చిత్రీకరణ సమయంలో రాఘవయ్య గారు నటీనటులకు ఎలా కావాలో చూపించడానికి తానే కొన్ని సన్నివేశాలను స్వయంగా నటించేవారు.

కొన్నిసార్లు తాను సుమారు పది రకాలుగా సన్నివేశాలను రూపొందించి చివరి షూట్‌కు సరిపోయేదాన్ని ఎంచుకోమని నటీనటులను కోరేవారు.

ఆంధ్రప్రదేశ్‌లోని సాంప్రదాయ కూచిపూడి నృత్య-నాటక కుటుంబానికి చెందిన వేదాంతం రాఘవయ్య గారు దేవదాసు, అనార్కలి, సువర్ణ సుందరి, భలే రాముడు, చిరంజీవులు, ప్రేమ పాశం, ఆడ బ్రతుకు, రహస్యం లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. స్వర్గసీమ, మాయలోకం, పల్నాటి యుద్ధం, గొల్ల భామ, యోగి వేమన, బాల రాజు, రత్నమాల, కీలుగుఱ్ఱం, లైలా మజ్ను లాంటి అనేక చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించడమే కాకుండా, 30కి పైగా తెలుగు, తమిళం, హిందీ మరియు కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    వేదాంతం రాఘవయ్య 

జననం    :    08 జూన్ 1919

స్వస్థలం   :    కూచిపూడి, కృష్ణా జిల్లా , భారతదేశం

తండ్రి   :   రామయ్య 

తల్లి     :  అన్నపూర్ణమ్మ 

ఇతర పేర్లు  :   భరత కళా ప్రపూర్ణ 

వృత్తి      :    చిత్ర దర్శకుడు, సినిమా నిర్మాత, స్క్రీన్ రైటర్, నృత్య దర్శకుడు

భార్య        :    సూర్యప్రభ 

మరణం   :              19 అక్టోబర్ 1971

జననం..

వేదాంతం రాఘవయ్య గారు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో గల కూచిపూడి లో 8 జూన్ 1919 నాడు జన్మించారు. రాఘవయ్య గారి తండ్రి రామయ్య, తల్లి అన్నపూర్ణమ్మ. రాఘవయ్య గారి తండ్రి రామయ్య గారు వీధి భాగవతంలో సూత్రధారుడిగా నటిస్తుండేవారు. కూచిపూడి వీధి భాగవతంలో “యక్ష గానం” ప్రముఖమైనది. ఈ “యక్ష గానం” లో ప్రహ్లాద, హరిశ్చంద్ర, మోహిని రుక్మాంగద, ఉషా పరిణయం మొదలైనవి నాటకాల రూపంలో ప్రదర్శిస్తుంటారు. వీటిలో “ప్రహ్లాద” యక్షగానాన్ని మూడు రాత్రులు వరుసగా ప్రదర్శిస్తుండేవారు. కూచిపూడి లోని అందరి పిల్లలాగే రాఘవయ్య గారికి కూడా కూచిపూడి నాట్యంలో శిక్షణ ప్రారంభమైంది. వీరి తాతగారు ప్రముఖ యక్షగాన పితామహులు “చింతా వెంకట్రామయ్య” గారే రాఘవయ్య గారి మొట్టమొదటి గురువు గారు.

బాల్యం…

వేదాంతం రాఘవయ్య గారికి ఏడు సంవత్సరాల వయస్సులో “చింతా వారి మేళ్లం” లో సభ్యునిగా బందరు లో “భక్త ప్రహ్లాద” యక్షగానంలో పాల్గొనే అవకాశం వచ్చింది. “భూలోక హిరణ్యకశపుడు” గా పేరు తెచ్చుకున్న హరి చలపతిరావు గారితో మూడు రాత్రులు సాగిన యక్షగాన ప్రదర్శనలో పాల్గొని అద్భుత అభినయం ప్రదర్శించారు. ఆ నాటకం చూసిన ఆనాటి బందరు జిల్లా కలెక్టర్ బ్రిటిష్ ప్రభుత్వ అధికారి, ప్రభుత్వం ముద్ర ఉన్న బంగారు పథకాన్ని రాఘవయ్య గారికి బహుకరించారట. తొమ్మిది సంవత్సరాల వయస్సులో 5వ తరగతిలోనే పాఠశాల చదువు మానేశారు.

నాట్యం నేర్చుకోవడం, నాట్య ప్రదర్శనలు ఇవ్వడం, నాటకాలలో నటించడం ఇదే జీవితం అయింది. ఊరురా తిరిగి ప్రదర్శనలు ఇచ్చేవారు. పన్నెండు సంవత్సరాల వయస్సులో గుడివాడ దగ్గర పెదపాడు గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వాటిని శిష్ట్లా చంద్రమౌళి శాస్త్రి గారు నిర్వహించారు. “ఉషా పరిణయం” లో “ఉషా కన్య” అనే స్త్రీ పాత్ర ధరించిన రాఘవయ్య గారు బాల నటుడిగా ఒక్కో మెట్టు పైకి ఎదిగి బాగా పేరు తెచ్చుకున్నారు. ఉషా కన్య అనే పాత్ర తనకు బాగా పేరు తెచ్చి పెట్టింది. సీత, చంద్రమతి, లీలావతి, శశిరేఖ, మోహిని ఇలాంటి స్త్రీ పాత్రలే కాకుండా కృష్ణుడు, రాముడు, హరిచంద్రుడు లాంటి పురుష పాత్రలు కూడా ధరిస్తుండేవారు.

1936లో మద్రాసు లో జరిగిన “ఆంధ్ర నాటక కళాపరిషత్తు” ఆరవ వార్షికోత్సవాలు జరిగాయి. ఆ వార్షికోత్సవాలు నిర్వహించిన వారు దేశోద్ధారకుడు కాశీనాథ్ నాగేశ్వరరావు గారు, గోవిందరాజులు సుబ్బరావు గారు, గూడవల్లి రాంబ్రహ్మం గారు. వీరి ఆధ్వర్యంలో ఉషా పరిణయం నాటకం ప్రదర్శించారు. స్థానం నరసింహారావు, బళ్లారి రాఘవ, అద్దంకి శ్రీరామమూర్తి, కపిలవాయి రామనాథ శాస్త్రి లాంటి వారి ప్రదర్శనలు జరిగిన ఆ ఉత్సవాల్లో వేదాంతం రాఘవయ్య గారు పాల్గొన్న ఉషా పరిణయం నాటకానికి బహుమతి లభించడమే కాకుండా రాఘవయ్య గారిని ఉత్తమ కళాకారుడుగా గుర్తించి బహుమతి కూడా ఇచ్చి సన్మానం జరిపారు.

వివాహం…

వేదాంతం రాఘవయ్య గారికి చిన్న వయస్సు లోనే తన మేనమామ కూతురు శ్రీరామ లక్ష్మమ్మ గారితో 1934 లో వివాహం జరిగింది. అప్పటికీ వేదాంతం రాఘవయ్య గారి వయస్సు 15 సంవత్సరాలు. వారికి 1945లో మొదటి సంతానం లలిత దేవి గారు జన్మించారు. ఆ తరువాత రాజ్యలక్ష్మి, మధుసూదన అనే కుమార్తెలు, శ్రీరామమూర్తి అనే కుమారుడు కూడా జన్మించారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో భార్య పిల్లల్ని కొన్నాళ్ళు మద్రాసులోనే ఉంచారు. కానీ ఆ తర్వాత శ్రీరామలక్ష్మి గారు, పిల్లలతో కూచిపూడి లోనే ఉండేవారు. రాఘవయ్య గారే మద్రాసు నుండి కూచిపూడి వస్తూ ఉండేవారు. తాను వచ్చారంటే కుటుంబానికే కాదు, ఆ ఊరిలో వారందరికీ కూడా పండగే అన్నట్లు ఉండేది.

చాలా విలాసవంతమైన కారు కూచిపూడి వచ్చిందంటే వేదాంతం రాఘవయ్య గారు వచ్చినట్లే. రాఘవయ్య గారు మద్రాసు లో ఎంత పేరు మోసిన దర్శకులైనా కావచ్చు, కానీ స్వగ్రామానికి వస్తే నిరాడంబరంగా అందరితో కలిసి మెలిసి ఉండేవారు. తానే అందరి ఇళ్లలోకి వెళ్లి పలకరిస్తూ ఉండేవారు. తమ ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు కూచిపూడి లోనే చేశారు. శ్రీ రామ లక్ష్మమ్మ గారు 2005లో కూచిపూడి లోనే పరమపదించారు. రాఘవయ్య గారి కూతురు లలితాదేవి, అబ్బాయి శ్రీరామ మూర్తి మరణించారు. రాఘవయ్య గారి రెండో కుమార్తె రాజ్యలక్ష్మి గారు విశాఖపట్నంలోనూ, మూడవ కుమార్తె మధుసూదన గారు బెంగళూరులోనూ నివసిస్తున్నారు.

నటి సూర్య ప్రభ తో వివాహం..

వేదాంతం రాఘవయ్య గారు తన దర్శకత్వంలో తొలి చిత్రం “స్త్రీ సాహసం” తీస్తున్న సమయంలో, అందులో నటిస్తున్న నటి “సూర్య ప్రభ” తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రణయంగా మారింది. దాంతో రాఘవయ్య గారు సూర్యప్రభ గారిని వివాహమాడినారు. బాలీవుడ్ అగ్ర నటి రేఖ తల్లి అయిన పుష్పవల్లి గారికి చెల్లెలు సూర్యప్రభ గారు. రాఘవయ్య గారిని వివాహం చేసుకున్న తర్వాత సూర్యప్రభ గారు సినిమాలలో నటించడం మానేశారు. రాఘవయ్య, సూర్యప్రభ దంపతులకు తొమ్మిది మంది సంతానం. ఎనిమిది మంది అమ్మాయిలు, ఒక అబ్బాయి. మొదటి అమ్మాయి ప్రతిభ, రెండో అమ్మాయి శుభా దేవి, మూడో అమ్మాయి హేమా దేవి. శుభా దేవి సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి “గూడుపుఠాణి” సినిమాలో నటించారు. మూడో కూతురు హేమాదేవి మతాంతర వివాహం చేసుకున్నారు.

చిత్ర రంగ ప్రవేశం…

మద్రాసులో జరిగిన “ఆంధ్ర కళా నాట్య పరిషత్” ఆరవ వార్షికోత్సవ సందర్భంగా వేదాంతం రాఘవయ్య గారు ప్రదర్శించిన కూచిపూడి “యక్ష గానం” తిలకించిన దర్శకులు చిత్రపు నరసింహారావు గారు కథానుగుణంగా తన సినిమాలో కూచిపూడి నృత్యం ఉంటే బావుంటుందని భావించి తాను తీస్తున్న “మోహినీ రుక్మాంగద” అనే సినిమాలో బాలగోపాలుడి తరంగం కోసం వేదాంతం రాఘవయ్య గారిని మద్రాసుకు తీసుకెళ్లారు. రాఘవయ్య గారు అందులో స్త్రీ పాత్రలో నృత్యం చేశారు. అదే రాఘవయ్య గారి మొదటి సినిమా. తర్వాత గూడవల్లి రామబ్రహ్మం గారు తీసిన “రైతుబిడ్డ” కోసం రాఘవయ్య గారిని తీసుకెళ్లి అందులో కూచిపూడి నాట్యం చేయించారు. ఇది అయిపోగానే రాఘవయ్య గారు తన స్వగ్రామం కూచిపూడి వచ్చేశారు.

కూచిపూడి నృత్యంలో అధునాతన పోకడలు ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో తనకంటే చిన్నవాళ్ళైన వెంపటి పెద్ద సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి గారితో కలిసి “ప్రభాకర నాట్యమండలి” అనే సంస్థను స్థాపించారు. వెంపటి పెద్ద సత్యం గారికి పిలుపు రావడంతో మద్రాసుకు వెళ్ళిపోయారు. రాఘవయ్య గారికి 1943 లో మద్రాసు నుండి ఒకేసారి రెండు అవకాశాలు వచ్చాయి. మొదటిది ఘంటసాల బలరామయ్య గారి “గరుడ గర్వభంగం” అనే చిత్రంలో గరుత్మంతుడి పాత్ర ధరించడానికి, రెండోది గూఢవల్లి రామ బ్రహ్మం గారి “పంతులమ్మ” చిత్రానికి నృత్యాలు రూపొందించడానికి. నృత్య దర్శకుడుగా ఈ రెండు అవకాశాలు వచ్చేసరికి రాఘవయ్య గారు మద్రాసుకు ప్రయాణం కట్టారు.

“స్వర్గసీమ” రాఘవయ్య గారి నృత్య దర్శకత్వంలో విజయవంతమైన సినిమా. అక్కినేని గారి మొదటి చిత్రం “సీతారామ జననం” కు కూడా రాఘవయ్య గారే నృత్య దర్శకులు. 1945లో అక్కినేని గారు నటించిన చిత్రం “మాయలోకం” కు నృత్య దర్శకుడు గానే కాకుండా, అక్కినేని గారికి తాత పాత్ర కూడా ధరించారు. 1946లో “త్యాగయ్య”, 1947లో “పల్నాటి యుద్ధం”, “గొల్లభామ”, “యోగి వేమన”, 1948 లో “బాలరాజు”, “రత్నమాల”, 1949లో “కీలుగుఱ్ఱం”, “లైలా మజ్ను” లాంటి చిత్రాలకు వేదాంతం రాఘవయ్య గారు నృత్య దర్శకత్వం చేశారు. 1948లో భానుమతి, రామకృష్ణ గార్లు “భరణి పిక్చర్” పతాకం పై నిర్మించిన మొట్టమొదటి చిత్రం “రత్నమాల” నుండి చాలా చిత్రాలకు రాఘవయ్య గారే నృత్య దర్శకత్వం నిర్వహించేవారు.

ఒక నృత్య దర్శకత్వమే కాక అన్ని విభాగాలలో పని చేసే అవకాశం తనకు లభించింది. దర్శకత్వ శాఖలోని వివిధ భాగాల గురించి కూడా తెలుసుకునేవారు. “భరణి పిక్చర్స్” వాళ్ళ “లైలా మజ్ను” చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కినేని నాగేశ్వరావు గారు పిచ్చివాడిగా నవ్వాల్సిన ఒక సన్నివేశంలో, తనకు నవ్వడం రాకపోతే అసిస్టెంట్ దర్శకుడిగా ఉన్న రాఘవయ్య గారే ఎలా నవ్వాలో నవ్వి చూపించారు. రాఘవయ్య గారు “భరణి పిక్చర్స్” లో తాను పనిచేసిన అన్ని విభాగాలతో పాటు దర్శకత్వ శాఖ మీద కూడా మంచి పట్టు లభించింది. కేవలం తెలుగు సినిమాలే కాకుండా, తమిళ చిత్రాలకు కూడా నృత్య దర్శకుడిగా కూడా అవకాశాలు వచ్చాయి. అలా తమిళంలో కే.రామ్ నాథ్ దర్శకత్వం వహించిన జూపిటర్ వాళ్ళ “కన్నియన్ కాదలే” చిత్రానికి 1949లో నృత్య దర్శకత్వమే కాకుండా, చిత్రికరణ పద్ధతులు కూడా నేర్చుకున్నారు.

1950 వచ్చేసరికి వేదాంతం రాఘవయ్య గారికి దర్శకుడిగా 10 ఏళ్ల అనుభవం వచ్చింది. అప్పటికే 20 సంవత్సరాల నృత్య అనుభవం కూడా ఉంది.

సీనియర్ సముద్రాల గారు, సి.ఆర్.సుబ్బరామన్ గారు, డి.ఎల్.నారాయణ గారితో వేదాంత రాఘవయ్య గారికి స్నేహం ఉండేది.

వీళ్లంతా “భరణి పిక్చర్స్” లో చేస్తున్నప్పుడే వారితో స్నేహం ఏర్పడింది. వీళ్ళతో కలిసి “లైలా మజ్ను” లో పనిచేశారు. నలుగురు కలిసి ఒక చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించాలని అనుకున్నారు.

దాని పేరు “వినోద పిక్చర్స్”. మొదటిగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో “స్త్రీ సాహసం” అనే చిత్రం తీశారు. 1951 ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది.

దేవదాసు...

1951 అక్టోబర్ 24 రాత్రి 7 గంటల 45 నిమిషాలకు రేవతి స్టూడియోలో దేవదాసు చిత్రం ప్రారంభమైంది. అందరి చూపు దేవదాసు సినిమా పైనే ఉంది. జానపద చిత్రాలలో నటించే అక్కినేని గారు దేవదాసు పాత్ర వేయడం ఏమిటి? దానికి నిన్న కాక మొన్న దర్శకుడైన వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం చేయడం ఏంటి? అని అందరూ అవాక్కయ్యారు. షూటింగ్ పది రోజులు నడిచింది. చిత్ర నిర్మాతలు సీనియర్ సముద్రాల, సి.ఆర్. సుబ్బారామన్, డి.యల్. నారాయణ, వేదాంతం రాఘవయ్య గార్లు. ఈ నలుగురు మిత్రులు ఆలోచనలో పడి దేవదాసు చిత్ర నిర్మాణాన్ని ఆపుదామని నిర్ణయం తీసుకున్నారు. కానీ నిర్మాణ సంస్థ లో చిత్ర నిర్మాణం కొనసాగి ఏదో ఒక సినిమా తీయాలి. కాబట్టి “కొవ్వలి లక్ష్మీ నరసింహారావు” గారి కథ తీసుకొని రెండు మూడు నెలల్లోనే “శాంతి” అనే తక్కువ బడ్జెట్ తో సినిమా తీశారు.

వినోద బ్యానర్లో తీసిన ఈ చిత్రానికి కూడా దర్శకుడు వేదంత రాఘవయ్య గారే. తనకు దర్శకుడుగా “శాంతి” రెండవ సినిమా. ఈ సినిమా ద్వారా రామచంద్ర కశ్యప, పేకేటి శివరాంల ను పరిచయం చేశారు రాఘవయ్య గారు. ఇందులో సావిత్రి గారు ప్రధాన పాత్ర చేశారు. 1952 ఫిబ్రవరి 15 విడుదలయ్యి ఓ మాదిరి విజయం సాధించింది. ఈ సినిమా పూర్తవగానే ఆ నలుగురు మిత్రులు “దేవదాసు” చిత్రం నిర్మాణం కొనసాగించాలని చర్చలు ప్రారంభించారు. డి.ఎల్.నారాయణ తప్ప మిగతా ముగ్గురు వేదాంతం రాఘవయ్య, సముద్రాల, సి.ఆర్.సుబ్బరామన్ లు దేవదాసు చిత్రాన్ని ఆపేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. డి.ఎల్.నారాయణ గారికి దేవదాసు పై గట్టి నమ్మకం ఉంది. నిర్మాతగా బాధ్యతలు నేను చూసుకుంటాను మీ విభాగాలు మీరు కానిచ్చేయండి అని డి.ఎల్.నారాయణ గారు అన్నారు. మిగతా వాళ్ళు సరేనన్నారు. దేవదాసు చిత్రం నిర్మాణం మళ్ళీ పట్టాలకెక్కింది. 

వినోదా చిత్ర దురదృష్టం, యావత్ దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమ దురదృష్టం, ముఖ్యంగా సినీ సంగీతాభిమానులు దురదృష్టం, “దేవదాసు” చిత్రం పునః ప్రారంభమైన కొద్ది నెలలకే 1952 జూన్ లో వినోదా పిక్చర్స్ లో ఒక భాగస్వామి అయిన సి.ఆర్.సుబ్బరామన్ గారు హఠాన్మరణం. ఆ తర్వాత మిగతా పాటల్ని సుబ్బరామన్ గారి శిష్యుడు ఎమ్మెస్ విశ్వనాథన్ గారు పూర్తి చేశారు. 1953 జూన్ 29 విడుదలైన దేవదాసు చిత్రం చరిత్ర సృష్టించింది.

ఈ విజయానికి కారణమైన వ్యక్తి “వేదాంతం రాఘవయ్య” గారు కావడం విశేషం. విమర్శించిన వాళ్ళందరూ వేదంతం రాఘవయ్య గారిని వేనోళ్ల పొగిడారు.

దేవదాసులో తాగుబోతు పాత్ర సహజంగా రావడానికి అక్కినేని నాగేశ్వరావు గారిని రాత్రిళ్ళు నిద్రపోకుండా ఉంచి కనులు మూతపడే సమయంలో చిత్రీకరణ జరిపేవారట.

జానపదం, సాంఘికం, నవలా చిత్రం ఇలా మూడు విభిన్న సినిమాలు తీసి విజయం పొందిన దర్శకులు వేదాంతం రాఘవయ్య గారు.

అంజలి పిక్చర్స్ కు దర్శకుడిగా…

వేదాంతం రాఘవయ్య గారు అంజలీదేవి, పి.ఆదినారాయణ రావు సంయుక్తంగా నిర్మించిన పరదేశి చిత్రానికి నృత్య దర్శకత్వం చేశారు. అలాగే అంజలి దేవి గారు నిర్మించిన పది చిత్రాలకు వేదాంతం రాఘవయ్య గారే దర్శకత్వం చేయడం గమనార్హం. వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం వహించిన 16 చిత్రాల్లో అంజలీదేవి గారే కథనాయిక కావడం విశేషం. దేవదాసు చిత్రం తర్వాత అంజలి పిక్చర్స్ తో 1955  “అనార్కలి” నుండి మొదలయిన వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వ ప్రస్థానం 1968లో “కుంకుమ భరణి” సినిమా వరకు కొనసాగింది.

1955 ఏప్రిల్ 28 “అనార్కలి” సినిమా విడుదల అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తరువాత విమర్శకులు వేదాంతం రాఘవయ్య గారిని మరింత మెచ్చుకున్నారు. “లైలా మజ్ను”, “దేవదాసు”, “అనార్కలి” మూడు చిత్రాలలో అక్కినేని గారే కథనాయకులు.

ఈ మూడు చిత్రాలు విషాదంగా నడిచిన ప్రేమ కథా చిత్రాలు. ఇందులో “లైలా మజ్ను” చిత్రానికి వేదాంతం రాఘవయ్య గారు నృత్య దర్శకులు.

మిగతా రెండింటికి (“దేవదాసు”, “అనార్కలి”) రాఘవయ్య గారు దర్శకులు. ఈ మూడు సినిమాలు విజయవంతం కావడం విశేషం.

భలే రాముడు..

తెలుగులో అక్కినేని నాగేశ్వరావు గారు, తమిళంలో జెమినీ గణేషణ్ గారు కథనాయకులుగా వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం “భలే రాముడు”. సావిత్రి, గిరిజ లు మాత్రమే తెలుగు, తమిళ రెండు చిత్రాల్లో నటించారు. మిగతా వారు తమిళ చిత్రానికి తమిళ నటులు, తెలుగు చిత్రానికి తెలుగు నటులు నటించారు. తెలుగులో “భలే రాముడు”, తమిళంలో “ప్రేమ పాసం” పేర్లతో తెరాకెక్కించారు. ఈ చిత్రం నిర్మాత పి.ఎల్.నర్సు అనే తమిళ నిర్మాత. 1956 మార్చిలో తమిళ వర్షన్ “ప్రేమ పాశం” విడుదల చేసి, ఆ తర్వాత నెల రోజులకు 1956 ఏప్రిల్ లో తెలుగు వర్షన్ “భలే రాముడు” విడుదల చేశారు. ఈ రెండూ కూడా శత దినోత్సవం జరుపుకున్నాయి. ఈ చిత్రాలు “వేదంతం రాఘవయ్య” గారిని విజయవంతమైన దర్శకుడిగా మరో మెట్టు ఎక్కించాయి.

చిరంజీవులు..

ఎన్టీఆర్, జమున నాయకా, నాయికలుగా వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం వహించిన చిత్రం చిరంజీవులు. చందమామ బ్యానర్ పై డి.ఎల్.నారాయణ గారు నిర్మించిన ఈ చిత్రం 1956 ఆగస్టు 15 విడుదలైంది. విషాదవంతమైన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం వహించిన ఎనిమిదవ చిత్రం ఈ “చిరంజీవులు”. 1948లో “వాడే పిక్చర్స్” తీసిన “నేల” అనే హిందీ చిత్రానికి అనుకరణ ఈ చిరంజీవులు చిత్రం. అప్పటివరకు వయస్సుకు మించిన ముసలి పాత్రలు ధరించిన గుమ్మడి గారు ఈ చిత్రంలో తన వయస్సుకు తగ్గ పాత్రలో నటించి మెప్పించారు. దేవదాసు, అనార్కలి, చిరంజీవులు మూడు విషాద చిత్రాలు. ఈ మూడు విషాద చిత్రాలను విజయవంతం చేసిన ఘనత “వేదాంతం రాఘవయ్య” గారిదే.

సువర్ణ సుందరి…

“మాయాబజార్” విడుదలై ఆంధ్రదేశాన్ని ఒక కుదుపు కుదిపేస్తున్న సమయంలో “మాయాబజార్” శత దినోత్సవము కాకముందే విడుదలైన “సువర్ణసుందరి” అద్భుతమైన విజయం సాధించింది. అక్కినేని నాగేశ్వరావు, అంజలీదేవి గార్లు  నటించిన అద్భుతమైన చిత్రం “సువర్ణ సుందరి”. అంజలి పిక్చర్స్ పతాకం పై వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1957 మే 10న విడుదల అయ్యింది. ఈ బ్లాక్ బస్టర్ చిత్రం 48 కేంద్రాల్లో 50 రోజులు, 18 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. ఈ చిత్రం హిందీ వర్షన్ కు కూడా వేదాంతం రాఘవయ్య గారే దర్శకులు. అందులో కూడా అక్కినేని నాగేశ్వరావు, అంజలీదేవి గార్లు ప్రధాన పాత్రలు పోషించారు. అక్కినేని గారు హిందీలో నటించిన ఏకైక చిత్రం కూడా వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం వహించిన “సువర్ణ సుందరి” కావడం విశేషం. ఆ తరువాత ఎన్టీఆర్, దేవిక, కాంతారావు లు నటించిన “ఆడ బ్రతుకు”,  అక్కినేని, కాంతారావు, కృష్ణకుమారి  నటించిన “రహస్యం” చిత్రాలకు వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం వహించారు. వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం వహించిన అఖరు చిత్రం “భలే ఎత్తు చివరికి చిత్తు.

దర్శకుడిగా చిత్ర సమాహారం…

స్త్రీ సాహసము

శాంతి

దేవదాసు

అన్నదాత

అనార్కలి

చిరంజీవులు

భలే రాముడు

ప్రేమ పాసం

సువర్ణ సుందరి

భలే అమ్మాయిలు

ఇరు సాగోదరిగల్

మనలానే మంగయిన్ భాగ్యం

రాజా నందిని

ఇంటి గుట్టు

బాల నాగమ్మ

జై భవన

అడుత వీటు పెన్

మామకు తగ్గ అల్లుడు

రుణానుబంధం

స్వర్ణ మంజరి

మంగైయర్ ఉల్లం మంగతా సెల్వం

ఆడ బ్రతుకు

నాన్న కర్తవ్య

బడుకువ దారి

సతీ సక్కుబాయి

రహస్యం

సతీ సుమతి

కుంకుమభరిణ

సప్త స్వరాలు

ఉలగం ఇవ్వాలవుతాన్

భలే ఎత్తు చివరి చిత్తు

మరణం…

చలనచిత్ర పరిశ్రమలో తన విజయ పరంపరతో తిరుగులేని విధంగా విజయవంతమైన దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. చివరి అయిదు సంవత్సరాలు తీసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.

విజయవంతమైన చిత్రలకన్నా, ప్లాఫ్ చిత్రాలే ఎక్కువగా పలకరించాయి. చివరి రెండు సంవత్సరాలలో తన దర్శకత్వంలో ఏ సినిమా రాలేదు.

ప్రేక్షకుల అభిరుచులు మారడంతో, చివరి అయిదు సంవత్సరాల సినిమాల పరాజయం కూడా రాఘవయ్య గారిని విపరీతంగా బాధించి ఉండవచ్చు.

అతి తక్కువ వయస్సులో 19 అక్టోబర్ 1972 నాడు మద్రాసు జనరల్ ఆసుపత్రిలో కన్నుమూశారు.

తాను లోకాన్ని విడిచి వెళ్లే సమయానికి “వేదాంత రాఘవయ్య” గారి వయస్సు కేవలం 52 సంవత్సరాలు.

Show More
Back to top button