తెలుగు మూకీ సినిమా భీష్మ ప్రతిజ్ఞ (1921) నిర్మించిన రఘుపతి వెంకయ్య నాయుడు, అర్దేషిర్ ఇరానీ నిర్మాతగా తెలుగు టాకీ “భక్త ప్రహ్లాద” (1932) ను తెరకెక్కించిన దర్శకులు హెచ్.ఎమ్.రెడ్డిని కలుపుకొని ఇప్పటివరకు 102 యేండ్ల తెలుగు సినిమా ప్రస్థానాన్ని తిరగేస్తే అనేకమంది తెలుగు దర్శకులు వారి వారి విభిన్న శైలితో రకరకాల చలనచిత్రాలతో అలరించారు, అలరిస్తూనే ఉన్నారు. ఒక్కో దర్శకుడిది ఒక్కోరకమైన శైలి. వారి వారి శైలికి అనుగుణంగా, వారి ఆలోచనలతో ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు తీస్తూ వస్తున్నారు. పాతతరం దర్శకుల విషయానికి వస్తే ఎంతో మంది దర్శకులు పురాణ, ఇతిహాసాలను, ఎన్నో అజరామర చిత్రాలను తెరకెక్కించారు.
కొందరు దర్శకులు ఇప్పటి తరం ప్రేక్షకులు చూసే విధంగా అప్పట్లోనే సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమాలను రూపొందించారు. ఆవిధంగా చిత్రాలను రూపొందించడంలో మేటి అనిపించుకున్నారు దర్శకులు పి.చంద్రశేఖర రెడ్డి. ఆయన చిత్రాలు కుటుంబ బాంధవ్యాలు, కుటుంబ సంబంధాల సువాసనలు చుట్టూనే తిరుగుతుంటాయి. అలా కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కిస్తూనే అత్తలు కోడళ్లు (1971), విచిత్ర దాంపత్యం (1971) సినిమాలను ఏక కాలంలో విడుదల చేసి అద్భుతమైన విజయంతో తన సినిమా ప్రస్థానానికి నాంది పలికారు.
పి.సి.రెడ్డి అగ్రతారలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటివారితో పని చేశారు. అంతేకాదు నాటి ప్రముఖ హీరోలు అందరి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. వాణిజ్యపరంగా దూసుకుపోతున్న ఎన్టీఆర్‌తో “బడిపంతులు” అనే సినిమాలో ఓ వృద్ధ పాత్ర చేయించి విజయం సాధించారు పి.సి.రెడ్డి. తొలి చిత్రం “అనురాధ” తో మొదలుకొని తన చివరి సినిమా శాంతి సందేశం వరకు సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించిన పి.సి.రెడ్డి ఆయన దర్శకత్వం చేసిన సినిమాలలో “పాడిపంటలు”, “మానవుడు దానవుడు”, “ఇల్లు ఇల్లాలు”, “పట్నవాసం”, “నాయుడు బావ”, “భోగభాగ్యాలు”, “బంగారు భూమి”, “నా పిలుపే ప్రభంజనం” వంటి అద్భుతమైన విజయం సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. దర్శకులు చంద్రశేఖర రెడ్డి సూపర్ స్టార్ కృష్ణతో దాదాపు 22 చిత్రాలను తెరకెక్కించారు.
తన దర్శకత్వంలో తొలి విజయం నమోదుచేసిన “అత్తలు – కోడళ్ళు” లోనూ, తొలి సిల్వర్ జూబ్లీ సినిమాగా రూపొందిన “ఇల్లు ఇల్లాలు” లోనూ సూపర్ స్టార్ కృష్ణనే కథానాయకులు. అద్భుతమైన విజయం సాధించిన అల్లూరి సీతారామరాజు సినిమా తరువాత వరుస ఫ్లాపులు చవిచూసిన కృష్ణకు చంద్రశేఖర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన “పాడిపంటలు” సినిమా మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత కృష్ణ కథానాయకుడిగా “గౌరి”, “స్నేహబంధం”, “కొత్తకాపురం”, “పగబట్టిన సింహం”, “బంగారుభూమి”, “నా పిలుపే ప్రభంజనం” లాంటి అద్భుతమైన విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. కథానాయకుడు శోభన్ బాబుతో పి.సి.రెడ్డి తెరకెక్కించిన మానవుడు – దానవుడు సంచలన విజయం నమోదుచేసిన తరువాత వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలేవీ అంతగా అలరించలేదు.
పి.సి.రెడ్డి 48 సంవత్సరాల సినీ జీవితం మొత్తం నల్లేరు మీద బండి నడకలా హాయిగా సాగిపోయింది. అవకాశాల కోసం ఆయన ఎవరి వెంటా పడలేదు. ఆయనకు ఛీత్కారాలు, అవమానాల అనుభవాల లాంటివి ఏమైనా కూడా ఆయనకు ఎదురుకాలేదు. తనకు వచ్చిన అవకాశం మంచిదా, చెడ్డదా అని అంచనా వేసుకోకుండా తన సహాయం కోరి వచ్చిన ప్రతీ ఒక్కరిని సమాదరించిన సహృదయ శిఖరం పి.సి.రెడ్డి. కృష్ణ హీరోగా నటించిన “అనూరాధ” చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించిన పి.సి.రెడ్డి సినీ ప్రస్థానం, కృష్ణ ప్రధానపాత్ర పోషించిన “శాంతి సందేశం” సినిమాతోనే ముగిసింది. 74 సంవత్సరాల వయస్సులో కూడా ఎప్పుడూ పని చేస్తూ ఉండాలన్నదే ఆయన తపన.
ఆయన ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. ఆయన జీవితం అంతా ఆనందమే. సహాయ దర్శకుడిగా గొప్ప జీవితాన్ని చవిచూసిన పి.సి.రెడ్డి 45 సంవత్సరాలలో నాలుగైదు రోజులు కూడా ఖాళీగా ఉన్న సందర్భాలు లేవు అనవారు. టీ.వీ రంగంలో కూడా ఆయన చేసిన మొదటి టీ.వీ సీరియల్ “అన్నయ్య” లో కూడా కృష్ణ గారే కథానాయకుడు కావడం వారిరువురి అనుబంధానికి గొప్ప గుర్తు. పి.సి.రెడ్డి ఈటీవీకి “అన్నయ్య”, దూరదర్శన్ కి “భీష్మ”, సోనీ టీవీకి “బుద్ధ” సీరియల్స్ చేశారు. ఆయన జీవితంలో కష్టాలు, కడగండ్ల జీవనం లేనప్పటికీ ఆసక్తిదాయకంగా అనిపించే మంచి సందర్భాలు సంఘటనలు చాలా ఉన్నాయి అని చెప్పేవారు.
జీవిత విశేషాలు…
జన్మనామం : పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి
ఇతర పేర్లు : పి.సి.రెడ్డి
జన్మదినం : 15 అక్టోబరు 1933
స్వస్థలం : అనుమసముద్రం పేట, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, భారతదేశం.
తల్లి : సుబ్బమ్మ
తండ్రి : పందిళ్లపల్లి నారపరెడ్డి
వృత్తి : సినిమా దర్శకులు
మరణ కారణం : అనారోగ్యం
మరణం : 03 జనవరి 2022,
మద్రాసు, భారతదేశం
నేపథ్యం…
పి.సి.రెడ్డి, పి.చంద్రశేఖరరెడ్డిగా సినిమారంగంలో పరిచితుడైన పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలోని అనుమసముద్రం పేట మండలానికి చెందిన అనుమసముద్రం పేటలో 15 అక్టోబరు 1933 నాడు జన్మించారు. వీరి తల్లిదండ్రులు పందిళ్ళపల్లి నారపరెడ్డి, సుబ్బమ్మ. వీరిది గొప్పగా కలిగిన కుటుంబం కాకపోయినా ఉన్నంతలలో ఏ కొరత లేకుండా ఉన్న కుటుంబం. వీరి నాన్న గ్రామ మునసబుగా పనిచేశారు. అందువలన పండగలకు వారి గ్రామములో హరికథలు, బుర్రకథలు, నాటకాలు నిర్వహించేవారు. దాంతో చిన్న వయస్సు నుండి ఆ ఊరిలో కూర్చుని ఆ కార్యక్రమాలు చూస్తూ పెరిగినప్పటికీ చంద్రశేఖరరెడ్డి మీద వాటి ప్రభావం పెద్దగా ఉండేది కాదు. ఆయన మూడవ తరగతి వరకు అనుమసముద్రం పేట లోనే చదువుకున్నారు. నాలుగవ తరగతి కోసం మద్రాసు వెళ్లారు. మద్రాసులో పి.సి. రెడ్డి అన్నయ్య బలరామిరెడ్డి ఉండేవారు. అక్కడ ఆయన బియ్యం వ్యాపారం చేస్తుండేవారు. పి.సి. రెడ్డి అన్నయ్య వద్ద ఉంటూ ఉన్నత చదువులు అయిపోయే వరకు (నాలుగో తరగతి నుండి డిగ్రీ వరకు) మద్రాసులోనే చదివారు. సినిమా వాతావరణానికి అనుకూలంగా ఉండే మద్రాసులో ఆయన చదువులు సాగినప్పటికీ ఆయనకు సినిమా రంగం పట్ల ఏనాడూ ఆసక్తి కలిగేది కాదు. ఆ సినిమా రంగం వైపు వెళ్లాలనే ఆలోచన కూడా తనకు ఉండేది కాదు.
తొలిసారిగా నాటకంలో…
పుస్తకాలు చదవడం, ఆటలు ఆడడం ఆయన వ్యాపకాలలో ప్రధానమైనవి. ఆంగ్ల నవలలు, తెలుగు నవలలు చదువుతూ ఉండడంతో ఆయనకు ఆంగ్ల, ఆంధ్ర భాషలలోని సమకాలీన నవలా సాహిత్యంపై విశేషమైన అవగాహన ఏర్పడింది. సాహిత్యంపై ఏర్పడిన ఆ అవగాహన తన సమీప భవిష్యత్తులో అక్కరకు వస్తుందని, తన ఎదుగుదలకు దోహదపడుతుందని ఆయన ఏనాడూ ఊహించలేదు. ఒకసారి చంద్రశేఖర రెడ్డి మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుండగా అదే కళాశాలలో బి.ఏ. ఆనర్స్ చదువుతున్న వోరుగంటి రామచంద్ర రావు (తరువాత రోజులలో ప్రముఖ దర్శక, నిర్మాత అయ్యారు) తో పరిచయం అయ్యింది.
రామచంద్ర రావు కళాశాల సాంస్కృతిక కార్యకలాపాలలో విరివిగా పాల్గొంటుండేవారు. నాటకాలు వ్రాయించడం, నాటకాలు వేయించడం వంటి నిర్వాహణ కార్యక్రమాలలో నిత్యం తీరికలేకుండా ఉండే వోరుగంటి రామచంద్ర రావు ద్వారా పి. చంద్రశేఖర రెడ్డికి రంగస్థల నటులు, వ్యాఖ్యాత, ప్రజా కళాకారులు వల్లం నరసింహారావు పరిచయమయ్యారు. ఆయన రామచంద్ర రావు నిర్వహించే నాటకాలకు దర్శకత్వం వహించడం కోసం వచ్చేవారు. వోరుగంటి రామచంద్ర రావు, వల్లం నరసింహారావుల బలవంతం మీద ఒక నాటకంలో నటించారు చంద్రశేఖర రెడ్డి. ఆ నాటకానికి వేదికపైన బహుమతి కూడా అందుకున్నారు. అయినా కూడా ఆ నాటకాల పట్ల చంద్రశేఖర రెడ్డికి అంత ఆసక్తి కలుగలేదు .
దర్శకుడా? పోలీసు అధికారా?
డిగ్రీ చదువుతున్న పి. చంద్రశేఖర రెడ్డి ఒకరోజు సినిమా నటులు వల్లం నరసింహారావుతో కలిసి సరదాగా సినిమా చిత్రీకరణ చూద్దామని వెళ్లారు. ఆ సినిమాలో కథానాయకుడు వల్లం నరసింహారావు. అప్పటివరకు చిత్రీకరణ మొదలుకాలేదు. అందరూ ఒక వ్యక్తి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఆయనే ఎన్.జగన్నాథ్. ఆయనే ఆ చిత్ర దర్శకులు. ఆయన రావడంతో సెట్ లో అందరూ ఆయనకు నమస్కారాలు పెడుతున్నారు. సినిమా రంగంలో దర్శకుడంటే ఎంత మర్యాద ఉంటుందో మొదటిసారి దగ్గరుండి చూశారు పి. చంద్రశేఖర రెడ్డి. ఆ తరువాత కొన్నిరోజులకు వల్లం నరసింహారావుతో కె.వి.రెడ్డి, పి.పుల్లయ్య తీసే సినిమా చిత్రీకరణలకు కూడా వెళ్లారు. అక్కడ కూడా దర్శకులకు అలాంటి గౌరవమే ఇస్తుండడం కళ్లారా చూశారు. దాంతో చంద్రశేఖర రెడ్డి ఆలోచన సినిమారంగం మీదికి మళ్ళింది. సినిమా రంగంలోకి వస్తే ఇలా గౌరవించబడుతున్న దర్శకుల స్థానంలోనే రావాలని ఆయనకు అనిపించింది.
చంద్రశేఖర రెడ్డి నాన్న పందిళ్లపల్లి నారపరెడ్డి మునసబు కావడంతో ఆయన రాగానే అందరూ లేచి నిలబడేవారు. కానీ ఊర్లోకి ఎవరైనా పోలీసు అధికారి వస్తే నారపరెడ్డి లేచి నిలబడేవారు. చంద్రశేఖర రెడ్డి అమ్మ సుబ్బమ్మ “ఊర్లో అందరూ మీ నాన్న వస్తే లేచి నిలబడి నమస్కరిస్తారు. కానీ మీ నాన్న పోలీసు వస్తే లేచి నిలబడతాడు. ఎప్పుడైనా మనిషికి గౌరవం ముఖ్యం. కాబట్టి నువ్వు పోలీసు అధికారి కావాలి” అని కొడుకుతో అంటూ ఉండేది. పోలీసు అధికారికి ఉండాల్సిన ఎత్తు, బరువు మంచి శరీర సౌష్టవం కలిగి ఉండడంతో చంద్రశేఖర రెడ్డికి కూడా మొదట్లో పోలీసు అధికారి కావాలని కోరిక ఉండేది. చేసే వృత్తి వలన మన విలువను పెంచే విధంగా, గౌరవించబడేలా ఉండాలని భావన తనలో బలంగా బలపడింది. దాంతో చంద్రశేఖర రెడ్డి మనసులో రెండు వృత్తులు బలంగా నాటుకుపోయాయి. సినిమా దర్శకుడు కావడమా లేక పోలీసు అధికారి కావడమా? అనే సందిగ్ధంలో పడిపోయారు.
సినీ రంగ ప్రవేశం…
పోలీసు అధికారి అవ్వాలా? లేక దర్శకుడు అవ్వాలా? అని సందిగ్ధంలో ఉన్న పి.సి.రెడ్డి (చంద్రశేఖర రెడ్డి), వోరుగంటి రామచంద్రరావు, వల్లం నరసింహారావుల సలహాతో సినిమారంగం వైపే మొగ్గుచూపారు. పోలీసయితే ఏమొస్తుంది కేవలం జీతంతో కూడిన జీవితం, అదే సినిమా దర్శకుడివి అయితే ఆ ప్రజాదరణ వేరు అంటూ వాళ్ళు చేసిన ఉద్బోధ వల్ల ఆయన మనసు సినిమా రంగం వైపు మరలింది. వారిద్దరూ సంయుక్తంగా పి.సి.రెడ్డిని దర్శకులు ఎన్.జగన్నాథ్ వద్ద సహాయ దర్శకుడిగా చేర్పించారు. ఆవిధంగా 1959లో “శ్రీకృష్ణ రాయబారం” చిత్రానికి సహాయ దర్శకుడిగా తన చలనచిత్ర జీవితం ప్రారంభమైంది.
తొలి చిత్రంతోనే ఆయన దర్శకత్వ శాఖకు అవసరమైన సాంకేతిక విషయాలు నేర్చుకున్నారు. దర్శకులు జగన్నాథ్ స్వయంగా పి.సి.రెడ్డి అనేక విషయాలు నేర్పించారు. ఆ చిత్రం తరువాత జగన్నాథ్ కు కొంతకాలం సినిమాలు లేకపోవడంతో పి.సి.రెడ్డిని మిత్రుడు వల్లం నరసింహా రావు, దర్శకులు వి.మధుసూదన రావు వద్ద సహాయ దర్శకుడిగా చేర్పించారు. ఆ సమయంలో “సతీ తులసి” పూర్తి చేసుకుని నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మొదటి చిత్రం “అన్నపూర్ణ” కు దర్శకత్వం వహిస్తున్నారు. అది వి. మధుసూదన రావుకు రెండవ సినిమా. నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మరియు వి.మధుసూదన రావు లతో పి.సి.రెడ్డికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వారికి ఇష్ట శిష్యుడు అయ్యారు. అలా వి.మధుసూదన రావు వద్ద పదకొండు సంవత్సరాల పాటు పనిచేశారు పి.సి.రెడ్డి. ఆయన తెరకెక్కించిన ప్రతీ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేయడంతో తనకు పరిశ్రమలో మంచి గుర్తింపు, గౌరవం లభించాయి.
నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ తో సాన్నిహిత్యం…
నిజానికి వి.మధుసూదన రావుకు చిత్ర పరిశ్రమలో కోపిష్టి, చందశాసనుడు అనే పేరు ఉంది. ఆయన దగ్గర ఎలా పని చేస్తున్నావని తన మిత్రులు పి.సి.రెడ్డి మీద సానుభూతి చూపించేవారు. కానీ ఆయన దగ్గర పనిచేసిన పదకొండు సంవత్సరాల కాలంలో పి.సి.రెడ్డిపై ఏనాడూ కోప్పడింది లేదు. తాను కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నందున దర్శకులు వి. మధుసూదన రావు అభిమానం చురగొనడమే కాకుండా, ఆయన పని చేసిన చిత్రాల నిర్మాతలు అందరికీ కూడా పి.సి.రెడ్డి అభిమాన పాత్రుడయ్యారు. ముఖ్యంగా ఆయనను నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ బాగా ఇష్టపడేవారు. హైదరాబాదులో ఏదైనా సెట్ వేస్తే దానిని చూడడానికి తనతో పాటే పి.సి.రెడ్డిని విమానంలో తీసుకెళ్లేవారు.
అలాగే రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి కూడా పి.సి.రెడ్డిని బాగా ఇష్టపడేవారు. కొన్ని సందర్భాలలో నటీనటుల పారితోషికం కూడా ఆయనతో మాట్లాడించేవారు. వారిలో నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, సావిత్రి, సూర్యకాంతం, ఆత్రేయ ఇలా అందరికీ కూడా అభిమాన పాత్రుడైన సహా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పి.సి. రెడ్డి వయస్సులో చిన్నవాడే అయినప్పటికీ దర్శకులు మధుసూదన రావు తప్ప, పైన ఉదాహరించిన వారంతా కూడా ఆయనను రెడ్డి గారు అని గౌరవంగా పిలిచేవారు. వి.మధుసూదన రావు ఎంతో మంది నిర్మాతలలకు సినిమాలు చేసినప్పటికీ తన సాన్నిహిత్యం ఎక్కువగా నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తోనే ఉండేది.
ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా…
ఉన్నట్టుండి ఒకరోజు దుక్కిపాటి మధుసూదన రావు నుండి పిలుపు రావడంతో పి.సి.రెడ్డి అక్కడికి వెళ్లారు. వారు అన్నపూర్ణ బ్యానరులో అదుర్తి సుబ్బారావు దర్శకుడిగా “పూలరంగడు” సినిమా తీస్తున్నారు. అప్పటివరకు సహాయ దర్శకులుగా ఉన్న కళాతపస్వి కె.విశ్వనాథ్ “ఆత్మ గౌరవం” దర్శకులయ్యారు. దాంతో ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయ దర్శకుడిగా ఖాళీ ఏర్పడింది. పూలరంగడు సినిమా కథనాయకులు అక్కినేని నాగేశ్వరావు మరియు ఇతర నటీనటులతో మంచి అనుబంధం ఉండడం వలన సహాయ దర్శకుడిగా పి.సి.రెడ్డి అయితే బాగుంటుందని వారి అభిప్రాయం. అలా దుక్కిపాటి మధుసూదన రావు “అన్నపూర్ణ సంస్థ” లో “పూలరంగడు” చిత్రానికి చేరి సహాయ దర్శకుడిగా పనిచేశారు.
ఆదర్శ దర్శక, నిర్మాతలైన ఆదుర్తి సుబ్బారావు, దుక్కిపాటి మధుసూదన రావు లాంటి కలయికలో పనిచేయడం పి.సి.రెడ్డికి మధురానుభూతి. అయితే వెంటనే దుక్కిపాటి మధుసూదన రావు ఆయనకు దర్శకుడిగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అనుకోకుండా “పూలరంగడు” చిత్రం ఘనవిజయం సాధించడంతో, ఇంత పెద్ద ఘనవిజయం తరువాత వచ్చే సినిమా మీద భారీ అంచనాలు ఉంటాయి. కనుక కొత్త దర్శకుడితో ప్రయోగం చేయడం ఇబ్బందికరం. ఒక్కోసారి అటుఇటు అయితే బాగా నష్టపోతామని దుక్కిపాటి మధుసూదన రావు ఆయనకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడానికి సంకోచించారు. ఇట్టి విషయాన్ని పి.సి.రెడ్డి ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే సహా దర్శకుడిగా సినీరంగంలో ఇష్టమైన స్థానం ఉంది. అప్పుడప్పుడే దర్శకత్వ బాధ్యతలు ఎందుకని భావిస్తున్నారు. అందువలన దర్శకత్వం చేయాలనే కుతూహలం పెద్దగా ఉండేది కాదు. అంతకుముందు ఒకసారి జూనియర్ సముద్రాల ఒక నిర్మాతను తీసుకొస్తే తాను చేయనని తెగేసి చెప్పేశారు.
తొలి దర్శకుడిగా రెండు సినిమాలు ఒకేరోజు విడుదల…
కొన్నేళ్లుగా పి.సి.రెడ్డి ప్రతిభను, ఎదుగుదలను, పరిచయాలను దగ్గరుండి గమనిస్తున్న ఆయన స్నేహితుడు ఎస్వీ ప్రభాకర్ రెడ్డి నిర్మాతగా పి.సి.రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా నిర్మించడానికి సిద్ధపడ్డారు. దాంతో పి.సి.రెడ్డి తన మొదటి సినిమా అక్కినేని నాగేశ్వరావుతో తెరకెక్కించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ అక్కినేని కొత్తవారికి అవకాశం ఇవ్వరు. దర్శకుడైనా, నిర్మాత అయినా అనుభవజ్ఞులైన వారు ఉంటేనే అవకాశం ఇస్తారు. అందువలన అక్కినేనిని అడిగి వద్దనిపించుకోవడం బావుండదు అని భావించి, కృష్ణను సంప్రదించారు. కొత్త వాళ్ళను ప్రోత్సాహిస్తూ, వాళ్ళకు అవకాశాలు ఇవ్వడంలో ఏమాత్రం జంకు లేని కృష్ణను అడగగానే కథ తయారుచేసుకోమని చెప్పారు. నిర్మాత యస్వీ ప్రభాకర రెడ్డితో కూర్చొని ఒక కథను తయారుచేసిన పి.సి.రెడ్డి రచయిత ఆత్రేయతో సంభాషణలు వ్రాయించుకున్నారు. సంగీతం కే.వీ.మహదేవన్ ను ఒప్పించగా, నటీనటులుగా కృష్ణ, విజయనిర్మల, ఎస్వీ రంగారావు, జీ.వరలక్ష్మీ, రాజబాబు, రాజశ్రీ, కృష్ణంరాజు వంటి తారాగణంతో పి.సి.రెడ్డి దర్శకత్వంలో తొలి చిత్రానికి రంగం సిద్ధమైంది.
వి.బి.రాజేంద్రప్రసాదు ప్రోద్బలంతో 1970 వ సంవత్సరంలో పి.సి.రెడ్డి దర్శకత్వంలో తొలి చిత్రం “అనురాధ” ప్రారంభమైంది. అయితే అనురాధ సినిమా తొలి షెడ్యూల్ కూడా పూర్తికాకముందే ఉషశ్రీ ప్రొడక్షన్స్, నందిని ఫిలిమ్స్ సంస్థల నుండి మరో రెండు సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలు వచ్చాయి. అవి ఉషశ్రీ ప్రొడక్షన్స్ లో శోభన్ బాబు, విజయనిర్మల కలయికలో “విచిత్ర దాంపత్యం” (1971) చిత్రం, అలాగే నందిని ఫిలిమ్స్ నిర్మాణంలో కృష్ణ, వాణిశ్రీ కలయికలో “అత్తలు కోడళ్లు” (1971) చిత్రం. అనురాధ చిత్రం కొద్దిరోజులు చిత్రీకరణ తరువాత ఆగిపోయింది. అయితే “విచిత్ర దాంపత్యం”, “అత్తలు కోడళ్లు” చిత్రాలను తన దర్శకత్వంలో తెరకెక్కించారు. అయితే రెండు చిత్రాలు ఒకేరోజు విడుదలకు సిద్ధమయ్యాయి. మొదటిసారి దర్శకత్వం వహించిన నూతన దర్శకుడిగా ఒకేరోజు రెండు సినిమాలు విడుదల అవ్వడం ఒక అరుదైన రికార్డు. ఇది పి.సి.రెడ్డి సినీజీవితంలో మర్చిపోలేని రోజు.
తొలి చిత్రమేదో తెలియని సందిగ్ధంలో…
ఆరోజు 14 ఏప్రిల్ 1971. అత్తలు కోడళ్లు (1971), విచిత్ర దాంపత్యం (1971) సినిమాలు విడుదలకి పి.సి.రెడ్డి విజయవాడ వెళ్లారు. రెండు సినిమాల ఇద్దరు నిర్మాతలు హోటల్లో గదులు అద్దెకు తీసుకున్నారు. ఇద్దరు కూడా కార్లు పెట్టారు. ముందుగా ఎవరు “విచిత్ర దాంపత్యం” సగం ఆట చూసి, అక్కడ నుండి “అత్తలు కోడళ్ళ”కు వెళ్ళి రెండవ భాగం చూశారు. రెండు సినిమాలు అద్భుతమైన విజయం సాధించాయి. తాను మొదలుపెట్టిన తొలి చిత్రం “అనురాధ” విడుదల అవ్వకుండా తరువాత మొదలుపెట్టిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. యస్వీ రంగారావు నటించకుండా నిర్మాతలను, నటించి ప్రేక్షకులను ఏడ్పించేవారు. “అనురాధ” చిత్రం ఎస్వీ రంగారావు అతిగా మద్యం సేవించి చిత్రీకరణకు గైర్హాజరు కావడంతో చిత్రీకరణ షెడ్యూల్స్ అన్నీ తారుమారు అయ్యాయి.
అందువలన పి.సి.రెడ్డి తొలి చిత్రంగా ప్రారంభమైన “అనురాధ” (1971) మూడవ సినిమాగా విడుదల అయ్యింది. కానీ ఓ మోస్తరు విజయం నమోదుచేసింది. అది కూడా 1971లోనే విడుదల కావడంతో ఒకే సంవత్సరంలో మూడు సినిమాలు విడుదలైన రికార్డు కూడా పి.సి.రెడ్డికి దక్కింది. ఒకవేళ “అనురాధ” సినిమా గనుక ముందు విడుదలయ్యి ఉంటే దర్శకుడుగా ఆయన భవిష్యత్తు ఎలా ఉండేదో తెలిసేది కాదు. అంతేకాకుండా “అనురాధ”, “విచిత్ర దాంపత్యం”, “అత్తలు కోడళ్ళు” మూడు చిత్రాలలో పి.సి.రెడ్డి తొలి చిత్రం ఏమిటో తనకే తెలియదు. ఎందుకనగా ముందు మొదలైన “అనురాధ” మూడో చిత్రంగా విడుదలయ్యింది. మిగిలిన రెండు చిత్రాలు ఒకేరోజు విడుదలయ్యాయి. మొత్తానికి రెండు చిత్రాల ఘనవిజయాలతో దర్శకుడిగా తొలి ప్రయాణం ఘనంగా ప్రారంభమైంది.
ఎన్టీఆర్ తో “బడిపంతులు”…
తొలి రెండు చిత్రాలతోనే విజయం దక్కించుకుని విజయవంతంగా సినీ ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించిన పి.సి.రెడ్డి తన వృత్తిలో ఏనాడూ వెనుదిరిగి చూసుకున్నది లేదు. ఆయన తొలిప్రయత్నంలోనే విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఉషశ్రీ ప్రొడక్షన్స్, నందిని ఫిలిమ్స్ కు చెందిన సంస్థలకు వెనువెంటనే రెండు చిత్రాలు అంగీకరించారు. అందులో ఒకటి శోభన్ బాబు హీరోగా “మానవుడు దానవుడు”, సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా “ఇల్లు ఇల్లాలు”. ఈ రెండు చిత్రాల మొదటి షెడ్యూల్ పూర్తవ్వకముందే పేర్రాజు అనే కొత్త నిర్మాత నందమూరి తారకరామారావుతో సినిమా తీయాలని పి.సి.రెడ్డిని కోరగా వారిరువురు వెళ్లి నందమూరి తారకరామారావును కలిసి విషయం చెప్పారు. సినిమా చేద్దాం మంచి కథ సిద్ధం చేసుకోండి అని వారితో అన్నారు.
దాంతో కన్నడంలో “స్కూల్ మాస్టర్” (1958) సినిమా మలయాళ వర్షన్ “పుట్టన్న కనగల్” (1964) పి.సి.రెడ్డికి బాగా నచ్చింది. అగ్రతారలు నటించడంతో రెండు భాషలలో విజయవంతం అయ్యింది. దానిని రామారావుతో పునర్నిర్మించదలచి అదే కథను “బడిపంతులు” గా తీయాలనుకున్నారు. రామారావుది వయస్సు మళ్ళిన ముసలి పాత్ర. ఆయనకు ఇద్దరు కొడుకులు, అల్లుడు, మనమరాలు కూడా తోడుగా ఉంటారు. అప్పటికి కుర్ర కథానాయకులు కృష్ణంరాజు, రామకృష్ణలను కొడుకులుగా, హాస్యనటులు రాజబాబుని అల్లుడుగా తీసుకున్నారు. ఎస్వీ రంగారావు, గుమ్మడి వంటి గుణచిత్ర నటులు చేయాల్సిన ముసలి పాత్రను పోషించడానికి రామారావు సంకోచించలేదు.
ఒకే సంవత్సరంలో మూడు సిల్వర్ జూబిలీ హిట్స్…
ఒకవైపు “మానవుడు – దానవుడు” (1972), “ఇల్లు ఇల్లాలు” (1972) విడుదలై సంచలన విజయాన్ని నమోదుచేసే దిశగా అడుగులు వేస్తుండగానే “బడిపంతులు” (1972) కూడా విడుదలకు సిద్ధం అయ్యింది. ఆ సినిమాకు “పూర్ణ పిక్చర్స్” వారు పంపిణీదారులుగా వ్యవహారించారు. ఈ సినిమాలో కథకు ఆయువుపట్టు లాంటి పాట ఒకటి ఉంది. అదే “మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు”. సినిమా మొదటి భాగంలో వస్తుంది. ఇంత నెమ్మదిగా ఉన్న పాటను ఎవరు చూస్తారు? దాన్ని తీసేయండి అన్నారు పూర్ణ పంపిణీదారుల అధినేత కామరాజు. ఆత్రేయ సలహా తీసుకుని ఆ పాటను తీసేసేది లేదని చెప్పేశారు పి.సి.రెడ్డి.
ఈ విషయంలో పంపిణీదారుల భేదాభిప్రాయాలు ఎలా ఉన్నా ఆ రోజులలో చిత్రపరిశ్రమలో ఉండే మనుషుల్లో కొన్ని విలువలు ఉండేవి. దర్శకుడు ఆ సన్నివేశాన్ని తీసివేయకపోతే ఇంకెవ్వరికీ తీసేసే అధికారం ఉండదు. కానీ ఈ రోజులలో ప్రతీ సన్యాసి కత్తెర పట్టుకుని సినిమాలోని సన్నివేశాన్ని తీసేస్తారు. కానీ ఆ రోజులలో దర్శకులను వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి సహకరించడం వలన, ఆ పాటతో సహా యదాతథంగా బడిపంతులు సినిమా విడుదలైంది. ఆ పాట, ఆ చిత్ర విజయానికి ఎంత దోహదపడిందో వేరే చెప్పనక్కర్లేదు.
విడుదలకు ముందు రోజు రామారావు తల్లిదండ్రులు “బడిపంతులు” సినిమా ప్రత్యేక ప్రదర్శన చూశారు. చూడడం అయిపోయిన తరువాత తల్లిదండ్రులకు పి.సి.రెడ్డిని పరిచయం చేశారు రామారావు. రామారావు అద్భుతమైన నటనను చూసి పులకించిపోయిన తల్లి సినిమా చాలా బాగుంది, నువ్వే దర్శకత్వం చేసి ఉంటావు అన్నారు. దాంతో కొంచెం ఇబ్బందికి లోనైన రామారావు వాళ్ళమ్మను పంపించి దర్శకులు పి.సి.రెడ్డిని కలిసి అమ్మ అలా అని ఉండకూడదు మన్నించమని అడిగారు. దానికి పి.సి.రెడ్డి “నేను మాత్రం గొప్ప ప్రశంసగా తీసుకున్నాను. ఎందుకంటే పి.సి.రెడ్డి అనే కొత్త దర్శకుడు తీసిన సినిమా చూసి ఎన్టీ రామారావు తెరకెక్కించిన సినిమా అన్నారంటే అంతకు మించిన అభినందన ఏమంటుంది”? సార్ అన్నారు. ఆ సమాధానికి రామారావు చాలా సంతోషించారు.
ఆ మరుసటి రోజు 22 నవంబరు 1972 నాడు విడుదలైన “బడిపంతులు” సినిమా విజయ విహారం చేసింది. మరోవైపు “మానవుడు దానవుడు”, “ఇల్లు ఇల్లాలు” వజ్రోత్సవ చిత్రాలయ్యాయి. “బడిపంతులు” కూడా సిల్వర్ జూబ్లీ సినిమా అయ్యింది. తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో కన్నా కూడా తెలుగులోనే అది ఘనవిజయాన్ని నమోదుచేసింది. ఇలా ఓకే సంవత్సరంలో మూడు సిల్వర్ జూబ్లీ విజయాలు ఇచ్చిన అరుదైన రికార్డు కూడా పి.సి.రెడ్డి సొంతమైంది. ఆయన సినీ ప్రస్థానంలో 1972 వ సంవత్సరం మరపురాని స్వర్ణ సంవత్సరంగా మిగిలిపోయింది.
కృష్ణతో అత్యధికంగా 22 సినిమాలు…
పి.సి.రెడ్డి సినీ ప్రస్థానం విజయవంతంగానే కొనసాగిందని చెప్పవచ్చు. 1959 లో సహాయ దర్శకుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన పి.సి.రెడ్డి సినీ జీవితం 2005 వరకు నిర్విరామంగానే సాగింది. తన 45 సంవత్సరాల సినిమా జీవితంలో నాలుగు రోజులు పని లేకుండా ఖాళీగా గడిపిన సందర్భం లేదు. ఆయన 75 సినిమాలకు దర్శకత్వం వహించారు. వాటిలో కేవలం ఏడెనిమిది సినిమాలు తప్ప నిర్మాతకు నష్టం తెచ్చిన సినిమాలేవీ లేవనే చెప్పాలి. ఎన్టీఆర్ తో “బడిపంతులు” సినిమా తెరకెక్కించిన తరువాత నాలుగైదు సార్లు ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాలు వచ్చిన కూడా ఖాళీ లేక చేయలేకపోయారు.
ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణతో ఉన్న సాన్నిహిత్యం వలన దర్శకులు విజయనిర్మల, కే.ఎస్.ఆర్.దాస్ ల తరువాత కృష్ణతో ఎక్కువగా చిత్రాలను దర్శకత్వం వహించిన దర్శకులు పి.సి.రెడ్డి. కృష్ణను కథానాయకుడిగా ఎంచుకోవడానికి నిర్మాతలు వస్తే ఆయన దర్శకుడిగా పి.సి.రెడ్డి పేరు సూచించేవారు. అలాగే పి.సి.రెడ్డిని దర్శకుడిగా పెట్టుకోవడానికి వచ్చే నిర్మాతలకు ఆయన కథానాయకుడిగా కృష్ణను సూచించేవారు. ఆ విధంగా పి.సి.రెడ్డి జీవితంలో ఎక్కువ పనిదినాలు కృష్ణ తోనే గడిచిపోయాయి.
మరణం…
పి.సి.రెడ్డి తన సినీ జీవితంలో సంఖ్యాపరంగా, విజయాల పరంగా, వ్యక్తిగత జీవితపరంగా ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండేవారు. ఆయన దర్శకత్వంలో ప్రారంభమైన నాలుగైదు సినిమాలు రకరకాల కారణాల వలన పూర్తవ్వలేకపోయాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయంలో చేసిన “చిన్నపులి – పెద్దపులి” (1980) అనే సినిమా కూడా ఉంది. చిరంజీవి ప్రక్కన గీత, కవిత కథానాయికలుగా చేశారు. తన సినీప్రస్థానం మొత్తం మీద ఆగిపోయిన నాలుగైదు సినిమాలు మినహాయిస్తే విడుదలైనవి 75 సినిమాలు ఉన్నాయి.
కథానాయకుడిగా కృష్ణతో ఎక్కువ చిత్రాలు చేయగా, నిర్మాతగా ఎన్.వి. సుబ్బారాజుతో ఎక్కువ సినిమాలు తీశారు. ముత్యాల సుబ్బయ్య, బి. గోపాల్, పి.ఎన్.రామచంద్ర రావులు పి.సి.రెడ్డి వద్ద సహాయ దర్శకులుగా చేస్తుండగానే వారికి దర్శకత్వ అవకాశం వచ్చి వెళ్ళిపోయారు. అంతేకాకుండా శరత్, వై.కె.నాగేశ్వరరావు మొదలుకొని సుమారు 45 మంది పి.సి.రెడ్డి దగ్గర సహాయ దర్శకులుగా చేశారు. ఇంత విజయవంతమైన దర్శకులుగా పేరుతెచ్చుకున్న పి.చంద్రశేఖర రెడ్డి తన 89వ యేట అనారోగ్యంతో బాధపడుతూ 03 జనవరి 2022 నాడు చెన్నైలో మరణించారు.