1945లో ఐక్యరాజ్యసమితిలోని ‘ఆహార, ఆరోగ్య సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్)‘ వ్యవస్థాపక దినాన్ని పురస్కరించుకొని 1979లో ఐరాస తీర్మానం ప్రకారం 1981 నుండి 150కి పైగా దేశాలలో ప్రతి ఏటా 16 అక్టోబర్ రోజున విశ్వవ్యాప్తంగా ‘ప్రపంచ ఆరోగ్య దినం (వరల్డ్ ఫుడ్ డే)’ పాటించడం జరుగుతోంది. ఆహార భద్రతకు సంబంధించిన ‘వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్’ వేదికలు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్యహిస్తారు.
ప్రపంచ ఆహార దినం-2024 నినాదం:
ప్రపంచవ్యాప్తంగా 99 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన 821 మిలియన్ల ప్రజలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. ప్రపంచ మహిళల్లో 60 శాతం ఆకలి/రక్తహీనత సమస్యలతో, 20 మిలియన్ల శిశు మరణాలు తక్కువ బరువు వల్ల జరుగుతున్నాయని తేలింది. పోషకాహార లోపంతో 5 ఏళ్ళలోపు పిల్లలు 50 శాతం చనిపోతున్నారనే వార్త చాలా విచారకరం. పేదరికం, కరువులు, ఆకలి చావులు, అవిద్య, అధిక జనాభా, అధిక ధరలు, మరియు నిరుద్యోగ సమస్యలు ఆహార భద్రతకు విఘాతాలుగా చాలా దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఆహార లభ్యతకు ఆధారం వ్యవసాయమే. ఆహారంతో ఆరోగ్యం, విద్య ముడివడి ఉంటాయి. ప్రపంచ ఆహార దినం-2024 థీమ్‌గా “ఆహార హక్కు : ఉన్నత జీవితానికి ఉన్నత భవిష్యత్తు (రైట్ టు ఫుడ్ : ఫర్ ఏ బెట్టర్ లైఫ్ అండ్ ఏ బెట్టర్ ఫ్యూచర్)”ని తీసుకొని పలు కార్యక్రమాలుగా సెమినార్లు, కార్యశాలలు, అవగాహనలు నిర్వహించడం జరుగుతోంది. ఆహారధాన్యాల ఉత్పత్తి, పంపిణి మరియు భద్రతలను శాస్త్రీయంగా చేయాల్సి ఉంటుందనే విషయాలను చర్చిస్తారు.
పోషకాహారం హక్కు కావాలి:
అందరికీ పోషకాహారం కనీస హక్కు. ఆహార కొరతతో ఆకలి చావులు జాతికే అవమానకరం. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో ఆహార భద్రత సమస్య ఎండమావిలా వెంటాడుతోంది. కరోనా వైరస్ కల్లోల కాలంలో పోషకాహారమే ఏకైక అవసరం అని, సమతుల ఆహారంతోనే రోగనిరోధకశక్తి పెరుగుతుందని విన్నాం. ఆహార కొరత నుండి బయట పడడానికి ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు, ఆహార ధాన్యాలను సమర్థవంతంగా సకాలంలో ప్రజలకు పంపిణీ చేయడం లాంటి చర్యలు దోహదపడతాయి. ఆహార పదార్థాలలో బియ్యం, పప్పులు, పండ్లు, మాంసాహారం, చేపలు, గుడ్లు, కూరగాయలు, దుంపలు, తృనధాన్యాలు, చిక్కుల్లు, కాఫీ, టీ వంటివి వస్తాయి. ప్రపంచీకరణ, పట్టణీకరణ, ఆధునిక ఆహారపు అలవాట్లు, పెరిగిన ఆదాయాలు వంటి అంశాలు కూడా ఆహార భద్రతను ప్రభావితం చేస్తున్నాయని ఐరాస ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ అంటోంది.
ఆహార అభద్రతకు కారణాలు, అధిగమించే మార్గాలు:
భారతదేశంలో ఆహార ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలకు రెక్కలు రావడం జరుగుతోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, అస్పష్ట జాతీయ విధానాలు, అవినీతి, పేదరికం, నిరక్షరాస్యత, అధిక జనాభా, పెట్టుబడి సహాయం లేక పోవడం, కరువు కాటకాలు, అనారోగ్యం, పర్యావరణ కాలుష్యం, సంప్రదాయ వ్యవసాయ పద్దతులు, పంపిణీలో లోపాలు, మార్కెట్లు అందుబాటులో లేకపోవడం, రవాణ మరియు సాంఘీక సమస్యలు లాంటి సమస్యలు ఆహార కొరతకు కారణాలుగా నిలుస్తున్నాయి. గ్రామీణ వ్యవసాయానుబంధ మౌళిక వసతుల కల్పన, మద్దత్తు ధర, ఆధునిక వ్యవసాయ పద్దతులకు చేయూత, చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడి సకాలంలో అందించడం, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా నిర్వహించడం, జనాభా నియంత్రణ, రవాణా వ్యవస్థను కల్పించడం లాంటి చర్యలు ఆహార కొరతను తగ్గిస్తాయి.
ఆకలిగా ఉన్నపుడు కడుపు నింపడానికి ఆహారం తీసుకోవడం మాత్రమే ఆరోగ్యానికి పరిష్కారం కాదని, మనం తీసుకునే ఆహారం సమతుల పోషకాలతో నిండి ఉండాలనేది అతి ముఖ్యమని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఆకలింపు చేసుకొని ఆకలి చావులు లేని సంపన్న భారతదేశాన్ని నిర్మించే యజ్ఞంలో మనందరం భాగస్వాములం అవుదాం.