CINEMATelugu Cinema

తెలుగు చిత్రసీమలో నవ్వుల మాంత్రికుడు, గంభీర హృదయుడు… రమణారెడ్డి..

తెలుగు సినిమా స్వర్ణయుగంలో రమణారెడ్డి పాతిక సంవత్సరాలు పాటు 200 పైగా చిత్రాల్లో నటించారు. హాస్యంగా ఉంటూనే, పైకి దుర్మార్గాలు చేసే పాత్రలకు తాను అధ్యులు. కొన్ని సినిమాలలో తనను హాస్యపు ప్రతినాయకుడు (కామెడీ విలన్) అని పిలుస్తుండేవారు. ఆ రోజులలో సన్నగా పీలగా ఎవరైనా ఉంటే తన పేరు పెట్టి పిలిచేవారు. తనకున్న ప్రత్యేకతల దృష్ట్యా తనను నవ్వుల మాంత్రికుడు అంటుండేవారు. విలనిజంలో హాస్యాన్ని, హాస్యం లో విలనిజాన్ని చూపించి సినిమాలలో హాస్యానికి సరికొత్త భాష్యం చెప్పినవారు టీ.వీ.రమణ రెడ్డి గారు. పూర్తి పేరు తిక్కవరపు వెంకట రమణారెడ్డి గారు.

చేసిన ట్రిక్కే మళ్లీ చేస్తూ గారడీ చేయడం తమాషా కాదు. వేసిన వేషమే మళ్ళీ వేస్తూ కామెడీ చేయడం మజాకా కాదు. రెండోది ఒకటే రకం అయినా ఒకటో రకంగా వేయడం, ఒకటోది రెండో రకమైనా మూడో రకంగా చేయడం, ట్రిక్కు కామెక్కు కలిపే సినిమా జిక్కుల మానసికే హమేషా చెల్లే తమాషా కామెడీ, గారడి రెండింటికీ ఓ పేరడీ కోటి లోను మేటియను టి.రమణారెడ్డి అని బాపు గారు వేసిన కార్టూన్ కి రమణ గారు వ్రాసిన కవిత.

తెలుగు సినిమా స్వర్ణయుగంలో రమణారెడ్డి గారిది ఒక ప్రత్యేకమైన అధ్యాయం. అలనాటి హాస్య నటులు ప్రేక్షకుల మీద ఎలాంటి ముద్ర వేశారంటే వాళ్ళ వాళ్ళ పేరు వినగానే వాళ్ళు ధరించిన పాత్రలు, ఆకారం, మేనరిజం, హావాభావాలు, వాళ్ళ హాస్యం మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. రమణారెడ్డి పేరు వినగానే సన్నగా, బక్క పల్చగా ఉండే తన ఆకారం, వడివడిగా సాగే తన నడక, మెరుపువేగంతో తిరిగే తన చేతులు, ధారాళంగా గబగబా మాట్లాడినా కానీ స్పష్టంగా వినిపించే సంభాషణోచ్చరణ ఇవన్నీ కూడా రమణ రెడ్డి గారి విశిష్ట నటనకు సంతకాలు. రమణారెడ్డి గారు నటించిన పాత్రలు వేటికవే భిన్నంగా ఉండేవి. తాను ధరించిన పాత్రలకు తనకు పేరు తెచ్చినవి అని చెప్పే కంటే, తాను ప్రతి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారంటే సమంజసం గా అనిపిస్తుంది.

అలనాటి హాస్యనటులందరిలోనూ కూడా రమణారెడ్డి గారు తనదైన విలక్షణ శైలిని ఎంచుకున్నారు. అందుకే తాను ఎవరికీ పోటీ కాలేదు, తనకు ఎవ్వరూ పోటీ రాలేదు. మాయాబజార్ లో చిన్నమయ్య, మిస్సమ్మ లో డేవిడ్, గుండమ్మ కథ లో కంచు ఘంటయ్య, రాముడు భీముడు లో రేలంగి మామ శరభయ్య, వెంకటేశ్వర మహత్యం లో కూడా గోవులను కాసే శరబయ్య, లవకుశ లో వాల్మీకి ఆశ్రమ వాసి, కులగోత్రాలు లో సోమరిపోతు పేకాటరాయుడు, రోజులు మారాయి లో కరణం సాంబయ్య, బంగారు పాప లో రామదాసు. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే రెండు వందల పాత్రలు, అనేక మేనరిజమ్స్ అన్నీ కూడా రమణ రెడ్డి గారు తెలుగు ప్రేక్షకులకు తాను మిగిల్చి వెళ్లిన తన సొంత సంతకాలు.

ఆనాటి తెలుగు చిత్రాలలో ఆ రోజులలో నెల్లూరు యాసను బంగారు పాప చిత్రం నుంచి తెలుగు చిత్రాలలో ప్రాచుర్యంలోకి తెచ్చింది రమణారెడ్డి గారే అని పరిశీలకులు చెబుతూ ఉంటారు. దశాబ్దంపైగా విశేషమైన రంగస్థలం అనుభవం తరువాత వెలుగులోకి వచ్చిన రమణ రెడ్డి గారి గురించి వ్రాస్తూ ఒక పాత్రకేయుడు “ఆయనను నటుడు అనేకంటే కళాకారుడు అంటే సమంజసంగా ఉంటుంది” అన్నారు. రమణారెడ్డి గారి మీద వివిధ చిత్రాలలో చిత్రీకరించిన పాటలు కూడా ఎప్పటికీ అత్యధిక ప్రాచుర్యంలో ఉన్నాయి.

ఒక్క పాట చాలు రమణారెడ్డి గారి పేరు అభినయానికి సంతకంగా చెప్పడానికి “కుల గోత్రాలు” లో “అయ్యయో జేబులో డబ్బులు పోయెనే”, అలాగే “సువర్ణ సుందరి” లో రేలంగి, బాలకృష్ణ గార్లతో కలిసి “ఏరా మనతోటి గెలిచే వీరుడెవ్వడురా, భళి భళి రా సూరువ్వడు రా” లాంటి పాటలు చాలానే ఉన్నాయి. తెలుగు సినిమా నటులలో అప్పటికి, ఇప్పటికి ఏకైక ప్రొఫెషనల్ మెజీషియన్ (ఐంద్రజాలికులు) రమణ రెడ్డి గారు ఒక్కరే. రమణారెడ్డి గారు నిజజీవితంలో చాలా గంభీరంగా ఉండేవారు. అజాతశత్రువు. తాను ఒకరితో ఒక మాట అనిపించుకోవడానికి గాని, ఒకరిని ఒక మాట అనడానికి గాని తన స్వభావానికి పూర్తి విరుద్ధం.

అందరితో మంచిగా ఉండటం, తన పని తాను చూసుకోవడం. ఎటువంటి పుకార్లు తన దరిచేరనివ్వని మనస్తత్వం తనది. నిజాయితీ తనకు పెట్టని ఆభరణం. నిర్మాతలు ఇబ్బందులలో ఉంటే పారితోషికం గురించి పట్టించుకోకుండా నటించడం. ఇవన్నీ కూడా తాను చాలా దగ్గరగా ఉండి చూసిన వాళ్లకు రమణారెడ్డి గారి వ్యక్తిత్వ వికాసాలు. ఇంత ప్రత్యేకమైన, విశిష్టమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న రమణారెడ్డి గారు అతి చిన్న వయస్సులోనే అంటే 53 సంవత్సరాలకే కన్నుమూయడం అత్యంత విషాదకరమైన విషయం.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    తిక్కవరపు వెంకట రమణా రెడ్డి

ఇతర పేర్లు  :   టి.వి. రమణా రెడ్డి

జననం    :     01 అక్టోబరు 1921  

స్వస్థలం   :    జగదేవి పేట, నెల్లూరు జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ , భారతదేశం

వృత్తి      :    నటుడు, హాస్యనటుడు

తండ్రి    :   సుబ్బరామి రెడ్డి

తల్లి     :   కోటమ్మ 

జీవిత భాగస్వామి  :    సుదర్శనమ్మ 

బంధువులు   :    పట్టాభిరామ రెడ్డి, టి. సుబ్బరామి రెడ్డి

మరణ కారణం  :  దీర్ఘకాలిక అల్సరు 

మరణం    :   11 నవంబరు 1974, హైదరాబాదు

నేపథ్యం…

సుమారు 102 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా జగదేవిపేటలో సుబ్బరామిరెడ్డి, కోటమ్మ దంపతులు సంపన్న వ్యవసాయ కుటుంబం. దేనికి లోటు లేదు. వీరికి ఆరుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. పెద్దబ్బాయి పేరు బాబు రెడ్డి, మూడో అబ్బాయి పేరు దశరథ రామిరెడ్డి. పెద్దబ్బాయి బాబు రెడ్డి వాళ్ళ అబ్బాయి ప్రముఖ పారిశ్రామికవేత్త నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి. బాబురెడ్డి, దశరథ రామి రెడ్డి మధ్యలోని వాడే తిక్కవరపు రమణారెడ్డి.

01 అక్టోబరు 1921 నాడు తిక్కవరపు రమణారెడ్డి గారు జన్మించారు. తన ప్రాథమిక విద్యాభ్యాసం వాళ్ళ ఊరు జగదేవిపేట లోనే జరిగింది. పాఠశాల చదువు కోసం తనను నెల్లూరు పంపించారు. పదవ తరగతి (ఐదో ఫారం) వచ్చేసరికి లక్ష్మి కుమార్ రెడ్డి అనే అతను రమణారెడ్డి గారిని నాటకారంగానికి పరిచయం చేశారు. ఆ నాటకం పేరు “కన్యాశుల్కం” అందులో రమణారెడ్డి గారు “గిరీశం” అనే పాత్రను ధరించారు. చదువు కంటే నాటకాల మీదనే రమణారెడ్డి గారికి ఆసక్తి పెరిగింది.

నాటకాలు…

వేదం వెంకటరాయ శాస్త్రి గారు నెల్లూరు లో నాటకాలు వ్రాసి వేస్తుండేవారు. రంగస్వామి, సింగమాచారి, కృష్ణమాచార్యులు వేదం వెంకటరాయ శాస్త్రి గారి శిష్యులు. ఈ ముగ్గురు ఒక నాటక సమాజం నడుపుతుండేవారు. వాళ్ళ దగ్గర శిక్షణకు చేరి రమణారెడ్డి గారు నాటక శిక్షణ తీసుకుంటుండేవారు. ఒక వైపు చదువుతూనే మరోవైపు నాటకంలో శిక్షణ తీసుకుంటుండేవారు. ఫన్ డాక్టరు ప్రొఫెసర్ చంద్రశేఖరం గారు రమణారెడ్డి గారికి పరిచయమయ్యారు. వీరు ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి గారి మామగారు. రమణారెడ్డి గారు ఈ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారి వద్ద కూడా నాటకాలలో శిక్షణ తీసుకునేవారు. కిలాంబి నరసింహాచార్యుల సలహా మేరకు “వెంకటగిరి నాటక సంస్థ” లో చేరారు రమణారెడ్డి గారు. ఇలా నాటకాలు వేస్తుండడంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది. తాను ఇంటర్మీడియట్ మధ్యలోనే తన చదువును ఆపేశారు.

శానిటరీ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం…

రమణారెడ్డి గారి బావగారు (సోదరి గారి భర్త గారు) డేగపూడి కోదండరామిరెడ్డి గారు రమణారెడ్డి గారిని తీసుకెళ్లి శానిటరీ ఇన్స్పెక్టర్ గా శిక్షణ ఇప్పించారు. అది పూర్తి అయితే శానిటరీ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం వస్తుంది. ఇలా శిక్షణ తీసుకుంటుండగా ఒకరోజు ఫన్ డాక్టరు ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారి పిలుపు మేరకు మద్రాసులో జరిగే ఆంధ్ర కళా నాట్యపరిషత్తు పోటీలో పాల్గొన్నారు రమణారెడ్డి గారు. ఆ నాటకాలను చూడడానికి వచ్చిన దర్శకులు జగన్నాథ్ గారు రమణారెడ్డి గారిని కలిసి తాను తీయబోయే “భలే పెళ్లి” సినిమాలో నటించాల్సిందిగా సూచించారు.

కానీ తాను శానిటరీ శిక్షణ తీసుకుంటుండడం వలన రమణారెడ్డి గారు ఆ అవకాశాన్ని తిరస్కరించారు. విజయవాడలో శానిటరీ శిక్షణ పూర్తి చేసిన రమణారెడ్డి గారు గుంటూరులో శానిటరీ ఇన్స్పెక్టర్ గా తన బావ కోదండరామిరెడ్డి గారు ఉద్యోగం ఇప్పించారు. ఆ ఉద్యోగంలో చేరిన రమణారెడ్డి గారిని మశూచి టీకాలు వేయడానికి ఇంటింటికి పంపించేవారు. ఒక సంవత్సరంన్నర తరువాత ఆ ఉద్యోగం మానేశారు రమణారెడ్డి గారు.

సినీ నేపథ్యం…

రమణారెడ్డి గారు వివాహం జరిగాక కూడా నాటకాలు వేయడం మానలేదు. నెల్లూరు కే చెందిన నిర్మాత మరుపూరి కోదండరామిరెడ్డి గారి సిఫారసు తో చిత్తూరు నాగయ్య గారి సినిమాలో నటించాలనుకున్నారు రమణారెడ్డి గారు. కానీ ఆ వేషానికి బోడి గుండు చేయించుకోవలసి రావడంతో రమణారెడ్డి గారు అందుకు ఒప్పుకోలేదు. కానీ సినిమా వేషాల కోసం తాను మద్రాసు లోనే ఉండిపోయారు. కొన్నాళ్లపాటు వేషాల కోసం ఎదురుచూసి అవకాశాలు రాకపోవడంతో తాను తిరిగి నెల్లూరు వచ్చేశారు. నెల్లూరు నుండి “అరుణ రేఖ” అనే మాసపత్రిక వచ్చేది. దానికి సలహాలు, సంపాదకుడిగా రమణారెడ్డి గారు చేరారు. ఆ పత్రికకు సంపాదకత్వం చేస్తూ వచ్చారు.

తొలిచిత్రం “మానవతి”…

ఇంతలో ఒకనాడు “ఆంధ్రప్రభ” అనే పత్రిక ప్రకటనలో కొత్తగా తీయబోయే సినిమాలో రమణారెడ్డి గారి పేరును ప్రచురించారు. దాంతో ఆశ్చర్యపోవడం తనవంతయ్యింది. ఆ పేరు తనదా, కాదా తెలుసుకోవాలనుకునే సమయానికి “సర్వోదయా పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్” నుంచి ఒక ఉత్తరం వచ్చింది.

నిర్మాత శంకర్ రెడ్డి గారు ఆ ఉత్తరం పంపించారు. వారు తీయబోయే సినిమా పేరు మానవతి.

ఆ సినిమాకు దర్శకులు వై.వి.రావు గారు. ఆ సినిమా జానపద కథ. తన పాత్ర పేరు “జంగమదేవర”.

అది ఒక విలన్ పాత్ర. దాంతో సంబరపడ్డ రమణారెడ్డి గారు ఆ సినిమా చిత్రీకరణ కు వెళ్లారు.

ఆ సినిమా చిత్రీకరణ లో ఉండగానే ప్రముఖ నటి జి.వరలక్ష్మి, కె.ఎస్.ప్రకాశరావు గార్లు తీస్తున్న “దీక్ష” సినిమాలో రమణ రెడ్డి గారికి అవకాశం వచ్చింది.

చిత్రీకరణ “మానవతి” ముందుగా ప్రారంభమైనా కూడా మొదట “దీక్ష” నే విడుదలైంది.

అంటే రమణారెడ్డి గారి మొదటి విడుదల చిత్రం దీక్ష కు దర్శకులు కె.ఎస్.ప్రకాశరావు గారు అయితే, రమణా రెడ్డి గారి చిట్టచివరి చిత్రం “చీకటి వెలుగులు” కు కూడా కే.ఎస్.ప్రకాశరావు గారే దర్శకులు కావడం విశేషం.

“దీక్ష” సినిమా చిత్రీకరణ లో ఉండగానే “ఆడజన్మ” లో గుమస్తా పాత్ర వరించింది. ఈ “ఆడజన్మ”అనే సినిమా రమణారెడ్డి గారి రెండవ సినిమా గా విడుదలైంది.

తన మొదట చిత్రీకరణ ప్రారంభమైన సినిమా  “మానవతి” తన మూడవ సినిమాగా విడుదలైంది.

తాతినేని ప్రకాశరావు గారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం “పల్లెటూరు” రమణారెడ్డి గారికి నాలుగో చిత్రం. 1950లో మొదలయిన రమణారెడ్డి గారి నటజీవితం లో “మిస్సమ్మ”, “రోజులు మారాయి” చిత్రాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. తొలి సంవత్సరాలలో మొదటి రెండు సంవత్సరాలు రెండు సినిమాలలో నటిస్తే, 1953, 1954 లలో సంవత్సరానికి ఐదేసి సినిమాలలో నటించారు రమణారెడ్డి గారు. 1955లో సంవత్సరానికి ఏడు, 1956 వచ్చేసరికి సంవత్సరానికి ఎనిమిది చిత్రాలలో నటించేవారు. ఆ తరువాత సంవత్సరానికి ఏడు నుండి ఎనిమిది చిత్రాలలో నటిస్తూ వచ్చారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరోవైపు నాటకలలో రాణిస్తున్నారు రమణారెడ్డి గారు.

అనువాద చిత్రాలకు గాత్ర దానం.. 

తాను నటుడుగా ఎదుగుతున్న తొలి రోజులలో తమిళం నుండి తెలుగులో అనువదింపబడే చిత్రాలకు గాత్రదానం కూడా చేశారు.

వాటిలో కొన్ని పతిభక్తి, శభాష్ పిల్లలు, ఆలీబాబా 40 దొంగలుమొదలగున్నవి.

ఇలాంటివి హాస్య నటులు తంగవేలు, ఎం.జీ.ఆర్ గారి సోదరులు చక్రపాణి గార్లకు ఆలీబాబా 40 దొంగలు చిత్రంలో రమణారెడ్డి గారు డబ్బింగ్ చెప్పారు. 1957 వ సంవత్సరంలో విడుదలైన “అక్కాచెల్లెళ్ళు” చిత్రం రమణారెడ్డి గారి నట జీవితాన్ని మలుపు తిప్పింది.

అందులో వరహా నరసింహమూర్తి పాత్రలో సహజత్వం ఉట్టిపడేందుకు ప్రొఫెషనల్ ఐంద్రజాలికులు శేషాద్రి గారి వద్ద ఇంద్రజాలాన్ని నేర్చుకున్నారు. 1959, 1960 లలో రమణారెడ్డి గారు సొంత ఇల్లు కొనుక్కున్నారు.

ఆ ఇంట్లో అప్పుడు చిత్తూరు నాగయ్య గారు కిరాయికి ఉండేవారు. ఆ ఇల్లుని రమణారెడ్డి గారు కొనుక్కున్నారు.

ఆ గృహప్రవేశానికి తాను వెయ్యి మందికి భోజనాలు పెట్టారు.

1960లలో ఒకేసారి ఐదు, ఆరు సినిమాలలో నటించడం, రోజుకు మూడు షిప్టులు పనిచేయడం చేసేవారు.

ఆ రోజుల్లో విఠలాచార్య గారు పది సంవత్సరాల వ్యవధిలో ఒకే కథతో “వద్దంటే పెళ్లి”,

“నిన్నే పెళ్లాడుతా” సినిమాలలో ఒకే పాత్ర ధరించారు. రమణారెడ్డి గారికి ఆప్త మిత్రులు చాలామందే ఉన్నారు.

కె.ఎస్.ప్రకాశరావు, పి.గంగాధరరావు, కె.బి.తిలక్, జైహింద్ సత్యం గార్ల లాంటి వాళ్లు ఉన్నారు.

వీరు రమణారెడ్డి గారు లేకుండా సినిమాలు తీసేవారు కాదు. రమణారెడ్డి గారి మీద చిత్రీకరించిన పాటలు కూడా చాలా ఉన్నాయి. “దొరికితే దొంగలు” చిత్రంలో కూడా ఒక పాటను చిత్రీకరించారు.

క్షిణించిన ఆరోగ్యం…

1968లో తనకు అల్సర్ మరీ ఎక్కువ అయిపోయింది. శాస్త్రచికిత్సలు చేసినా కూడా ఫలితం లేకపోయింది. దాంతో సినిమాలకు సమయం కేటాయించడానికి ఇబ్బంది పడాల్సి రావడంతో తాను నటించే పాత్రలలో నిడివి తక్కువగా ఉండేలా చూసుకునేవారు. అనారోగ్య కారణంగా చిత్రీకరణకు తన ఆరోగ్యం సహకరించకపోవడంతో నటించే చిత్రాలు తగ్గించారు. “పట్టిందల్లా బంగారం”, “మనసు మాంగల్యం”, “శ్రీమంతుడు”, ఇలాంటి అతికొద్ది చిత్రాల్లో మాత్రమే పూర్తి నిడివి ఉన్న పాత్రల్లో కనిపించారు. 1971 వ సంవత్సరంలో రమణారెడ్డి గారు వాళ్ళ పెద్దమ్మాయి “వసుమతి” గారి వివాహాన్ని వైభవొపేతంగా నిర్వహించారు. పెద్దల్లుడు వైద్యులు (డాక్టరు). వివాహానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమమ అంతా తరలివచ్చారు.

స్వర్గ గమనం…

1974 వచ్చేసరికి రమణ రెడ్డి గారి ఆరోగ్యం బాగా క్షీణించింది.  1974 ఆగస్టు, సెప్టెంబరు ప్రాంతంలో అల్సరు నివారణకు మరొకసారి శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. దాంతో ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 11 నవంబరు 1974 నాడు “రమణా సర్జికల్ క్లినిక్” డాక్టరు రంగ భాష్యం గారు పెదవిరిచేశారు. రమణా రెడ్డి గారి మొట్టమొదటి చిత్రం “మానవతి” కథానాయిక అయిన జి.వరలక్ష్మి గారు రమణా రెడ్డి గారిని చూడటానికి వచ్చారు. రమణా రెడ్డి గారి పరిస్థితి చూసి ఆమె కంటతడి పెట్టుకున్నారు. సాయంత్రం భార్య సుదర్శనమ్మ, కూతురు వసుమతి గారు పక్కనే ఉన్నారు. ఏడు గంటల ప్రాంతంలో వైద్యులు విషాదగాథను ఖరారు చేశారు.

పాతికేళ్ల పాటు తన హాస్యంతోనూ, విలనిజంతోనూ నవ్వించిన తిక్కవరపు వెంకట రమణా రెడ్డి గారు తన 53 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస విడిచి స్వర్గానికి పయనమయ్యారు. 12 నవంబరు 1974 మధ్యాహ్నం 12 గంటలకు అంతిమయాత్రలో చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది పాల్గొన్నారు. రామానాయుడు గారు, శారద గారు, కే.ఎస్.ప్రకాశరావు గారు, గుత్తా రామినీడు గారు, శోభన్ బాబు గారు, రోజారమణి గారు, ఆరుద్ర గారు, రాజబాబు గారు, అల్లు రామలింగయ్య గారు, ఫన్ డాక్టర్ చంద్రశేఖరం గారు మొదలగు వారందరూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. రమణా రెడ్డి గారి పెద్దబ్బాయి ప్రభాకర్ రెడ్డి గారు, రమ ణారెడ్డి గారి భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు జరిపించారు.

కుటుంబం…

1942వ సంవత్సరంలో రమణా రెడ్డి గారికి  సుదర్శనమ్మ తో వివాహం అయ్యింది. సుదర్శనమ్మ గారిది నెల్లూరు దగ్గరలోని కోవూరు. గారికి ఆమె మేనరికం వరుసవుతారు.

గారి నిష్క్రమణ అనంతరం భార్య సుదర్శనమ్మ గారు పిల్లలను తీర్చిదిద్దిన విధానం అత్యంత స్ఫూర్తిదాయకం.

రమణా రెడ్డి గారు నటుడిగా తీరికలేకుండా ఉన్న రోజులలో పిల్లల బాగోగులు, చదువులు అన్నీ సుదర్శనమ్మ గారే చూసుకునేవారు.

సుదర్శనమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. మొదటి, చివరి సంతానం ఇద్దరు అబ్బాయిలు.

మధ్యలో ముగ్గురు అమ్మాయిలు. రెడ్డి గారు మరణించే నాటికి పెద్దబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు.

పెద్దమ్మాయి వసుమతి గారికి వివాహం జరిగింది. మిగతా ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నారు.

వారందరి వయస్సు 30 సంవత్సరాలు లోపే. చివరి అబ్బాయి వయసు 13 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి సుదర్శనమ్మ గారు పెద్దగా చదువుకోకపోయినా చదువు విలువ తెలిసినవారు.

పిల్లలందరినీ ఉన్నత విద్య వైపు మళ్ళించి గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేశారు, అనుకున్నది సాధించారు.

మగ పిల్లలు ఇద్దరినీ ఇంజనీర్లు చేశారు. ఆడపిల్లలలో ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఒకరు గ్రాడ్యుయేట్.

ప్రభాకర్ రెడ్డి గారు ఎల్ & టి లో ఉద్యోగం చేసి, పదవి విరమణ చేసి చెన్నైలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

పెద్దమ్మాయి వసుమతి భర్త డాక్టరు. వారు బ్రిటన్ లోని “బర్మింగ్ హామ్” లో స్థిరపడ్డారు.

రెండో అమ్మాయి స్వర్ణ గారి భర్త వ్యవసాయ శాస్త్రవేత్త. వాళ్ల కుటుంబం నెల్లూరులో నివాసం ఉంటున్నారు.

మూడో అమ్మాయి పద్మావతి గారి భర్త డాక్టరు. వారు పుదుచ్చేరి లో నివాసం ఉంటున్నారు.

రెండో అబ్బాయి శ్రీనివాస రెడ్డి ఇండియాలో ఇంజనీరింగ్ పూర్తి చేసి, అమెరికాలో ఎమ్మెస్ చేసి సాంకేతిక రంగంలో ఉన్నత ఉద్యోగంలో పనిచేస్తున్నారు.

వారు సిలికాన్ వ్యాలీ లో స్థిరపడిపోయారు. రమణా రెడ్డి గారు నిర్మించిన పునాదుల మీద పిల్లలతో నిర్మించిన కుటుంబ సౌధం అదొక అద్భుతం.

ఎప్పుడైనా ఆమె తన కొడుకులకు ఫోన్ చేసినప్పుడు పిల్లల చదువుల గురించి వాకబు చేసేవారు. విద్యాపట్ల తనకున్న అనురాగమే పిల్లలందరినీ విద్యాబుద్ధులు నేర్పేలా చేసింది.

ఇలా పిల్లలను అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మాతృమూర్తి సుదర్శనమ్మ గారు పరిపూర్ణమైన జీవితం గడిపి అక్టోబర్ 2018 లో తుది శ్వాస విడిచారు.

Show More
Back to top button