CINEMATelugu Cinema

తెలుగు తెరపై మాటలు నేర్చిన తొలి పసికందు.. భక్త ప్రహ్లాద..

వినాయకుడి విగ్రహం పాలు భక్త ప్రహ్లాద తాగిందంటేనో, ఏ గ్రహాంతర జీవి మన ఊర్లో దిగాడంటేనో మనం ఎంత ఆశ్చర్యానికి గురవుతామో తెరమీద బొమ్మ కదలడాన్ని చూసి అంతకు రెట్టింపు విస్మయాన్ని వ్యక్తపరిచారు నాటి జనం. ఇంకా మన దేశానికి స్వాతంత్రం రాని రోజులవి. తెల్ల దొరల పాలనలో చిమ్మ చీకట్లో ప్రజలు మగ్గుతున్న సమయం అది. నాటి ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక వినోద సాధనం “నాటకం”. అవి కూడా పౌరాణికాలే.

మూడు, నాలుగు గంటల పైగా సాగే ఈ నాటకాలను వీక్షించి తెగ మురిసిపోయిన ప్రజానీకాన్ని ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది సినిమా అదే నూతన ప్రక్రియ. ఎవరో మాయ చేసినట్టు, ఇంకెవరు మంత్రం వేసినట్టు, తెరమీద బొమ్మలు కదలడం ఏమిటి అని కొంతమంది భయపడ్డారు, ఇంకొంతమంది మనకేదో కీడు సంభవిస్తుందని కంగారుపడ్డారు. చాలామంది కదిలే బొమ్మల్ని వెక్కిరించారు కూడా. పౌరాణిక నాటకాల ప్రభంజనం ముందు ఈ కదిలే బొమ్మల ఆటలు సాగలేదు.

అందుకే కొన్ని చోట్ల ఈ కదిలే బొమ్మల సినిమాకి పెద్దగా ఆదరణ లభించలేదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. సాంకేతికత అద్భుతంగా వెలిసిన “సినిమా” రోజురోజుకి కొత్త హంగుల్ని సముపార్జించుకుంటుంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ మూకీ బొమ్మ మాటలాడింది. పాట నేర్చుకుంది. కొత్త నీటి ధాటికి పాతనీరు కొట్టుకుపోయిన చందాన ఈ టాకీ సినిమా దెబ్బకి నాటకం కాలక్రమేనా కనుమరుగైపోయింది.

ప్రస్తుత సినిమా రంగంలో రకరకాల డిజిటల్ కెమెరాలు, మోషన్ క్యాప్చరింగ్ సాంకేతిక పరిజ్ఞానం, మాయ సాఫ్ట్ వేర్, పలు రకాల విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అదే 90 ఏళ్ల క్రితం ఇవేమీ లేవు. శూన్యం. ఈ శూన్యంలోంచి అద్భుతాన్ని సృష్టించాలి. అప్పటి జనానికి వినోదం అంటే “నాటకం”, “తోలుబొమ్మలాట” ఇంకేదో. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఎక్కడో మూల సినిమా పుట్టింది. తెర, ఎదురుగా ప్రొజెక్టర్ ఆన్ చేస్తే తెరమీద కదిలే బొమ్మలు. జనానికది ఓ అద్భుతం. తెరమీద బొమ్మలు కదలడం ఏమిటని కొందరు భయపడ్డారు.

ఇంకొందరు కీడు సంభవిస్తుందని కంగారుపడ్డారు. మరికొందరు వెక్కిరించారు. అయినా సినిమా వెనక్కు తగ్గలేదు. పైగా మాటలు నేర్చింది ఇది ఇంకో షాక్. ఛీ కొట్టిన నోటితోనే జై కొట్టించుకున్న సినిమా. ప్రపంచమంతా సినిమా వైపు ఆకర్షితం కాసాగింది. మనదేశంలో మొదట స్పందించింది ఆర్దేషిర్ ఇరానీ. “షో బోట్” అనే పాశ్చాత్య టాకీను చూసి మంత్రముగ్ధుడైపోయి, విదేశాల నుండి శబ్ద గ్రహణ యంత్రాన్ని దిగుమతి చేసుకొని, హిందీలో “ఆలం ఆరా” తీశాడు. తొలి భారతీయ శబ్ద చిత్రం అదే. 14 మార్చి 1931 బొంబాయి లోని మెజిస్టిక్ థియేటర్ లో తొలి షో పడింది. సువిశాల భారత క్షేత్రంలో మాటల సినిమా మొగ్గ తొడిగింది.

తొలి కథనాయకుడు…

ప్రహ్లాదుని పాత్ర పోషించిన సింధూరి కృష్ణారావు గారు టాకీ సినిమాల తొలి కథనాయకుడు అని చెప్పుకోవాలి. ఆ సినిమాలో నటించే నాటికి తన వయస్సు తొమ్మిదేళ్లు. సినిమా టైటిల్స్ లో “మాస్టర్ కృష్ణ” అని పడుతుంది. ఖమ్మంలో పుట్టిన కృష్ణారావు గారు తాను అప్పటికే వివిధ నాటకాలలో బాలకృష్ణుడు, కనకసేనుడు, ప్రహ్లాదుడు, లోహితాస్యుడు లాంటి పాత్రలు పోషించారు. ప్రహ్లాదుని పాత్ర కోసం బొంబాయి వచ్చిన ఐదుగురు పిల్లల్ని పరీక్షించిన హెచ్.ఎమ్.రెడ్డి గారు కృష్ణారావు గారు పాడిన “అమ్మా ఇటు బంగారు బండి నాకియ్యవే” పాట విని అతని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో నటించినందుకు గాను 400 రూపాయలు పారితోషం అందుకున్నారు. తాను నటించింది ఒక్క సినిమానే. బొంబాయిలో మతకలహాలు రావడంతో భయపడి అతని తల్లిదండ్రులు తనని తమ ఊరికి తీసుకుపోయారు. అక్కడ సురభి నాటక సమాజంలో హార్మోనిస్టుగా చేరారు. ఆ తరువాత కిరాణా కొట్టు పెట్టుకున్నారు. చివరికి కూలి పని కూడా చేశారు. ఈ వృద్ధ ప్రహ్లాదుడు గురించి తెలుసుకున్న మూవీ ఆర్ట్ అసోసియేషన్ తనకు 2001లో ఆర్థిక సాయం కూడా చేసింది. 2004 చివర్లో ఆయన కన్నుమూశారు.

తొలి కథానాయిక…

సురభి కమలాభాయి గారు భక్త ప్రహ్లాద చిత్రానికి తొలి కథానాయిక. తొలి టాకీ చిత్రానికి మొదటి హీరోయిన్. తన కుటుంబం అంతా రంగస్థలం కళాకారులే. యాదృచ్ఛికంగా కమలాభాయి గారు కూడా రంగస్థలం మీదనే జన్మించారు. కమలాభాయి తల్లి గర్భవతిగా ఉండి నాటకం ఆడుతుండగానే ప్రసవించడం జరిగింది. అలా సురభి రంగస్థలం మీద జన్మించిన కమలాభాయి గారు తెలుగు టాకీలో తొలి హీరోయిన్ కావడం చాలా గామ్మత్తైన విషయం. ఈ సినిమా చేసే నాటికి కమలాభాయి గారి వయస్సు 18 సంవత్సరాలు. ఈ చిత్రానికి ఆమె పారితోషికం మొదట 500 రూపాయలుగా నిర్ణయించి, చిత్రం పూర్తయిన తర్వాత నిర్మాతలు 1116 బహుకరించి, రైలు ఖర్చులు కూడా ఇచ్చి వీడ్కోలు పలికారు. ఈ తొలి తెలుగు కథానాయిక తెలుగులో విడుదలైన మలి సినిమా “పాదుకా పట్టాభిషేకం”, మూడో చిత్రం “శకుంతల” లో కూడా ముఖ్యపాత్రధారిణి. విజయా వారి “పాతాళభైరవి” (1951) లో ఎన్టీఆర్ గారి తల్లిగా నటించారు. హిందీ, తమిళం, తెలుగు చిత్రాలలో వృద్ధాప్యం వరకు నటిస్తూనే వచ్చారు.

తొలి ప్రతినాయకుడు…

తొలి టాకీ చిత్రంలో తొలి ప్రతినాయకుడు సుబ్బయ్య గారు. తన అసలు పేరు వల్లూరు వెంకట సుబ్బారావు. తన స్వగ్రామం గుంటూరు జిల్లా మునిపల్లె కావడంతో అదే పేరుతో తనని పిలిచేవారు. సుబ్బారావు గారు వెంకటగిరి రాజావారి చేత “నటశేఖర! బిరుదు పొందారు. సురభి నాటక సమాజంలో అత్యధిక పారితోషికం తీసుకునే తాను 1929లో తండ్రి చనిపోవడంతో గ్రామానికి తిరిగి వచ్చారు. హెచ్.ఎం.రెడ్డి గారి కోరిక మేరకు దొరస్వామి నాయుడు (ఇంద్రుడు పాత్రధారి) మునిపల్లె వెళ్లి సుబ్బయ్య గారిని బొంబాయికి తీసుకువెళ్లారు. ప్రహ్లాదుని పేరు మీదుగా సినిమా ఉన్నా కూడా వెండితెర మీద ఎక్కువగా కనిపించేది హిరణ్యకశపుని పాత్రధారి సుబ్బయ్య “ద్రౌపది మాన సంరక్షణ”, “సతీ సులోచన” తదితర చిత్రాలలో సుబ్బయ్య గారు నటించారు.

తొలి సంగీత దర్శకుడు…

హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి గారిది కర్ణాటకలోని హోస్పేట. సంగీతం కుటుంబంలో పుట్టిన హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి గారికి “భక్త ప్రహ్లాద” కు పని చేసే నాటికి తన వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. భక్త ప్రహ్లాద సినిమాలో పాటలు, పద్యాలు గ్రామ్ ఫోన్ రికార్డుగా రాకపోవడంతో అవి మనకు ఎక్కడా కూడా వినపడవు, కనపడవు కూడా. ఈ సినిమా తర్వాత పద్మనాభ శాస్త్రి “చిత్రనళీయం”, “తెనాలి రామకృష్ణ”, “ఘరానా దొంగ” తదితర చిత్రాలకు స్వరాలందించారు. చిత్తూరు నాగయ్య గారి “భక్త రామదాసు”  శాస్త్రి గారు చేసిన ఆఖరి సినిమా.

తొలి గీత రచయిత…

చందాల కేశవదాసు గారు ప్రసిద్ధ నాటక రచయిత. కనకతార ఒక్కటి చాలు, తన ప్రతిభ గురించి చెప్పడానికి. తన పేరు ప్రఖ్యాతులు విని హెచ్.ఎం.రెడ్డి గారు తనను పిలిపించారు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు నాటకంలో వ్రాసిన పాటలు, పోతన భాగవత పద్యాలు ఉన్నా కూడా కేశవదాసు గారితో మూడు పాటలు వ్రాయించుకున్నారు. సురభి కమలాభాయి పై చిత్రీకరించిన “పరితాప భారంబు భరింప తగునా”, “తనయా ఎటులన తగదుర పలక”, మునిపల్లె సుబ్బయ్య గారిపై తీసిన “భీకరమగు నా ప్రతాపంబునకు భీతిలేక” పాటలు వ్రాశారు. నాటక క్రమంలోనే సినిమా తీశారు కాబట్టి, ఈ సినిమా మొదట వచ్చే పాట “వింతాయెన్ వినన్ నంతసమాయెనుగా” అనేదే మన తొలి తెలుగు సినిమా పాట. అది వ్రాసింది ధర్మవరం రామకృష్ణమాచార్యులు. అయితే ఈ సినిమా నిర్మాణం నాటికి తాను బ్రతికి లేరు. అప్పటికి చందాల కేశవదాసు గారు ఉన్నారు కాబట్టి తననే తొలి పాటల కవి గా పేర్కొనడం సమంజసమని తెలుగు సినిమా పాటలు పై పరిశోధన చేసిన డాక్టర్ పైడిపాల గారు చెబుతారు.

మూకీ దర్శకునిగా…

1892లో బెంగళూరులో జన్మించిన హెచ్.ఎం.రెడ్డి గారి పూర్తి పేరు హనుమంతప్ప మునియప్ప రెడ్డి. మాములుగానే హెచ్.ఎం.రెడ్డి జాగీర్ధార్ కళాశాలలో ఆంగ్లం బోధిస్తుండేవారు. హైదరాబాదులో ప్లేగు వ్యాధి రావడంతో బొంబాయిలో ఉంటున్న తన బామ్మర్ది దగ్గరికి వెళ్లారు. బామ్మర్ది హెచ్.వి.బాబు అక్కడ సినిమాలలో వేషాల కోసం ప్రయత్నిస్తున్నాడు. బామ్మర్ది గాలి బావగారి వైపు కూడా మళ్ళింది. ఇంకేముంది హెచ్.ఎం.రెడ్డి కూడా చిత్ర సీమ లో చేరిపోయారు. 1927లో అక్కడ శారదా ఫిలిం కంపెనీలో రిఫ్లెక్టర్ బాయ్ గా పనికి కుదిరారు. చిన్నాచితకా వేషాలు వేస్తూ సినిమా టెక్నిక్ అర్థం చేసుకోసాగారు. రెడ్డి గారి లోని సృజనాత్మకత ఉత్సాహం వల్ల చివరకు శారదా ఫిల్మ్ కంపెనీ అధినేత “భోగీలాల్ ధనే” దృష్టిలో పడ్డారు. “భోగీలాల్ ధనే” గారు హెచ్.ఎం.రెడ్డి గారికి మూకీ సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. పృధ్విరాజ్ కపూర్ ముఖ్య పాత్రధారిగా “ప్రిన్స్ విజయ్ కుమార్” (1930), ఎ మేజర్ ఇన్ లవ్ (1931) సినిమాలు దర్శకత్వం చేసారు హెచ్.ఎం.రెడ్డి గారు. భోగీలాల్ ధనే జర్మనీ వెళుతూ తన మిత్రుడు ఆర్దేశిర్ ఇరానీ గారికి హెచ్.ఎం.రెడ్డి గారిని పరిచయం చేశారు. అప్పుడు ఇరానీ తనను “ఆలం అరా” కు అసిస్టెంట్ గా తీసుకున్నారు.

టాకీ సినిమాకు మార్గదర్శకుడు..

తొలి తమిళ టాకీ “కాళిదాసు” సృష్టికర్త హెచ్.ఎం.రెడ్డి గారే. అతిరథ మహారథులు అనదగ్గ వారంతా హెచ్.ఎం.రెడ్డి గారి వల్లనే వెలుగులోకి వచ్చారు. పులి మీసాలతో గంభీరంగా కనిపించే రెడ్డి గారంటే అందరికీ హడల్. సినిమా నిర్మాణం అనేది సమిష్టి కృషి అని త్రికరణ శుద్ధిగా నమ్మేవారు. అందుకే కథా చర్చలో చిన్న, పెద్ద అందరు పాల్గొనేలా చేసి వారి అభిప్రాయాలు కచ్చితంగా తెలుసుకునేవారు. భక్త ప్రహ్లాద, కాళిదాసు (తమిళం) తర్వాత అనేక చిత్రాలు దర్శకత్వం వహించారు, నిర్మించారు. “సావిత్రి”, “సీతా స్వయంవరం”, ఉష (హిందీ), గృహలక్ష్మి, మాతృభూమి (తమిళం), తెనాలి రామకృష్ణ, సత్యమే జయం, జస్టిస్ (హిందీ), ప్రతిష్ట తదితర చిత్రాలు తాను రూపొందించారు. హెచ్.ఎం.రెడ్డి గారు చేసినన్ని ప్రయోగాలు, పరిచయాలు అన్నీ ఇన్నీ కావు. చిత్ర నిర్మాణంలో అనేక కొత్త మార్పులకు మార్గదర్శకులు హెచ్.ఎం.రెడ్డి గారు.

నిర్మాణం…

ఆర్దేశిర్ ఇరానీ గారికి భారతీయ తొలి టాకీ చిత్రం “ఆలం అరా” ఘనవిజయం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. హిందీలో తీసినట్టుగానే ఇతర భారతీయ భాషలలో కూడా టాకీ చేయాలని కంకణం కట్టుకున్నారు. తెలుగు, తమిళ భాషలో టాకీ సినిమా తీసే పనిని హెచ్.ఎం.రెడ్డి గారికి అప్పగించారు. ఆ రోజులలో పౌరాణిక నాటకాలనే ప్రేక్షకులు బాగా ఇష్టపడేవారు. ప్రేక్షకులను సినిమా వైపు ఆకర్షితం చేసుకోవాలన్నా, ఇటు నాటకాల నటీనటులను సినిమాలోకి తెచ్చి రంగులు వేయించాలన్నా కూడా ప్రసిద్ధి చెందిన నాటకాన్ని తెరకెక్కించాలి. అందుకే “భక్త ప్రహ్లాద” వైపు మొగ్గుచూపారు హెచ్.ఎం.రెడ్డి గారు. అయితే ఆ సమయానికే 19 భక్త ప్రహ్లాద నాటకాలు చలామణిలో ఉన్నాయి. ఆంధ్ర నాటక పితామహులు ధర్మవరం రామకృష్ణమాచార్యులు వ్రాసిన భక్త ప్రహ్లాద నాటకం జనాదరణ పొంది ఉంది. ఈ నాటకం తోనే తెలుగు టాకీకి శ్రీకారం చుట్టాలని కంకణం కట్టుకున్నారు హెచ్.ఎం.రెడ్డి గారు.

“సురభి నాటక సమాజం” వారికి ఈ నాటకం కొట్టినపిండి. వాళ్ళని కలిసి మీ నాటకాన్ని సినిమాగా తీస్తాను అని చెబితే హెచ్.ఎం.రెడ్డి గారిని వాళ్ళు పిచ్చోడిలా చూశారు. మీకు మంచి డబ్బులు ఇస్తాం, దారి ఖర్చులు ఇస్తాం, చక్కటి వసతి సమకూరుస్తామని వాళ్ళని బ్రతిమాలి ఒప్పించారు. అందుకు హెచ్.ఎం.రెడ్డి గారికి నటులు సి.ఎస్.ఆర్.ఆంజనేయులు గారు సహాయం చేశారు. చివరికి ఎలాగోలా “సురభి” మొత్తాన్ని బొంబాయి తీసుకువెళ్లారు. సంగీత దర్శకులు హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి, ఛాయా గ్రాహకులు గోవర్ధన్ భాయ్ పటేల్, ఇతర సాంకేతిక నిపుణులు అంతా రెడీ. ఇంపీరియల్ స్టూడియోలో షూటింగ్ బయటి వాళ్ళని ఎవ్వరినీ కూడా లోపలికి రానివ్వకూడదు, చిత్రీకరణ అంతా గోప్యంగా ఉండాలని ముందే ఒప్పందం చేసుకున్నారు.

లీలావతి పాత్రధారి కమలాభాయి పై మొదటి షాట్ తీశారు. హిరణ్యకశపునిగా మునిపల్లె సుబ్బయ్య, మొద్దబ్బాయిగా ఎల్వీ ప్రసాద్, ప్రహ్లాదునిగా మాస్టర్ కృష్ణారావు, దేవేంద్రునిగా దొరస్వామి నాయుడు నటించారు. చిత్రపు నరసింహారావు బ్రహ్మ, ఛండ మార్కుల పాత్ర పోషించారు. మూకీ వేరు, టాకీ వేరు. మూకీలైతే హావాభావాలు వ్యక్తం చేసే సామర్థ్యం ఉంటే చాలు. అదే టాకీలకి వచ్చేసరికి రకరకాల భావోద్వేగాలకు తగ్గట్టుగా సంభాషణ చెప్పే ఛాతుర్యం కావాలి. వీటన్నిటిని జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ హెచ్.ఎం.రెడ్డి గారు సినిమాను పూర్తి చేయగలిగారు. రోజుకి దాదాపు 20 గంటల చిత్రీకరణ జరిపేవారు. 04 గంటలు మాత్రమే విశ్రాంతి. ఏడుపు సన్నివేశాల కోసం గ్లిజరిన్ వాడడం అనేది అప్పటికి లేదు. ఏదోరకంగా ఏడవాల్సిందే. 21 రోజుల్లో చిత్రీకరణ పూర్తి అయ్యింది. 9700 అడుగుల నిడివి తో 20 వేల రూపాయల ఖర్చుతో తొలి తెలుగు టాకీ సినిమా సిద్ధమైంది.

ప్రేక్షకుల తొలి స్పందన…

15 సెప్టెంబరు 1931 నాడు తొలి టాకీ సినిమా బొమ్మ పడింది. మాట్లాడుతున్న “భక్త ప్రహ్లాదు” ని వీక్షించిన ప్రేక్షకులు ఆహా, ఓహో అన్నారు. ఇప్పటిలాగా రోజుకు నాలుగు షో లు ఉండేవి కాదు. అప్పట్లో రోజుకి రెండు షోలు మాత్రమే. ఒకటి మొదటి ఆట సాయంత్రం 6 గంటలకు, రెండోది రెండవ ఆట రాత్రి 9 గంటలకు. శని ఆదివారాలలో మాత్రం మధ్యాహ్నం మూడు గంటలకు ఇంకో ఆట ప్రదర్శన చేసేవారు. టికెట్ల కోసం ప్రేక్షకులు ఎగబడేవారు. అప్పటికి క్యూ పద్ధతి లేదు. ఎవరి బల ప్రదర్శనను బట్టి వాళ్లకు టికెట్లు దొరికేవి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత నే థియేటర్ల వద్ద క్యూ పద్ధతి మొదలైందని అప్పటి తరం ప్రేక్షకులు చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా లోను చాలా ఏరియాలో “భక్త ప్రహ్లాద” ను తెలుగు వారు బాగా ఆదరించారు. సికింద్రాబాదు లో అయితే 10 నెలలు ఆడింది. పత్రికలైతే ఓపక్క మెచ్చుకుంటేనే, మరోప్రక్క మొట్టికాయలు కూడా వేశారు.

సశేషం...

భక్త ప్రహ్లాద కథ ఇంతకు ముందు తెలిసినదే కావొచ్చు, బొమ్మ స్పష్టంగా లేకపోయి ఉండొచ్చు, శబ్దాల్లో హెచ్చుతగ్గులు ఉండి సంభాషణలు, పాటలు, పద్యాలు సరిగ్గా వినపడకపోయి ఉండొచ్చు. ఇవన్నీ కాదు మనం చూడాల్సింది. హెచ్.ఎం.రెడ్డి గారు చేసిన గొప్ప యజ్ఞాన్ని, అతి గొప్ప ప్రయత్నాన్ని మనం గమనించాలి, విశ్లేషించాలి. నున్నటి సిమెంట్ రోడ్డు మీద 150 కిలోమీటర్ల స్పీడ్ తో కాడు నడపడం గొప్పకాదు. అసలు దారేలేని చోట, గమ్యం తెలియని చోట, అవరోధాల ముళ్ళకంపలు పేరుకుపోయిన చోట, ఒంటరిగా ప్రయాణం చేస్తూ కంపల్ని ఏరేస్తూ, గుంతల్ని పూడ్చేస్తూ, ఓ రహదారి ఏర్పరచడం అంటే ఎంత గొప్ప విషయం. హెచ్.ఎం.రెడ్డి గారు చేసింది ఇదే.  ఇప్పుడు ఆ దారి అందరికీ రహదారి. ఇన్ని కోట్ల టర్నోవర్. ఇన్ని వేల కార్మికుల జీవితాలు. ఇంత పేరు, ఇంత ప్రఖ్యాతి, ఇన్ని అద్భుతాలు. వీటన్నిటికీ పునాది “భక్త ప్రహ్లాద”. ఇంత చేసిన మన తొలి తెలుగు టాకీ నెగిటివ్ నైనా కాపాడుకోలేకపోయాం. మన వారికి మన మూలాలపై ఉండే శ్రద్ధ అలాంటిది. కనీసం ఆ సినిమా జ్ఞాపకాలనైనా సజీవంగా నిలుపుకొని అనుకూల శక్తితో , భవిష్యత్తు సినిమా లకు బాటలు వేద్దాం.

విశేషాలు….

★ దక్షిణ భారతదేశంలో విడుదలైన తొలి టాకీ చిత్రం “కాళీదాస్” తెలుగు – తమిళ భాషలలో తెరకెక్కింది. ఇది 31 అక్టోబరు 1931 నాడు విడుదలయ్యింది…

★ తెలుగు లో విడుదలైన తొలి టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” 15 సెప్టెంబరు 1931 విడుదల అయినట్టుగా చూపించారు. కానీ నిజానికి 22 జనవరి 1932 నాడు సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకుని 06 ఫిబ్రవరి 1932 నాడు విడుదలయ్యింది.

★ తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” కు దర్శకులుగా హెచ్.ఎం.రెడ్డి గారు, సహాయ దర్శకులుగా ఎల్.వి.ప్రసాద్ గారు పనిచేశారు.

★ తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” కు నిర్మాత గా హెచ్.ఎం.రెడ్డి గారు గారు వ్యవహారించారు. భారత్ మూవీ టోన్ నిర్మాణ సంస్థ సారథ్యం లో ఈ సినిమా నిర్మించబడింది. 

★ తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” కు సురభి నాటక సమాజము వారి నుండి ఈ కథను ఎంచుకున్నారు.

★ తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” కు మునిపల్లె సుబ్బయ్య, సురభి కమలాబాయి, షిండే కృష్ణారావు, ఎల్.వి.ప్రసాద్, దొరస్వామి నాయుడు, బీ.వి.సుబ్బారావు, చిత్రపు నరసింహారావు లు తారాగణంగా వ్యవహారించారు.

★ తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” కు సంగీతం హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి గారు సమకూర్చారు.

★ తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” కు చందాల కేశవదాసు గారు గీతరచన చేశారు. 

★ తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” కు ఛాయాగ్రహణం గోవర్ధన్ భాయి పటేల్ గారు అందించారు.

★ తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” ను 15 సెప్టెంబరు 1931 నాడు విడుదల చేశారు.

★ తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” లో హిరణ్యకశిపుడు గా మునిపల్లె సుబ్బయ్య పాత్ర ధరించారు

★ తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” లో ప్రహ్లాదుని పాత్రలో   కృష్ణాజిరావు సింధే గారు నటించారు.

★ తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” లో చండామార్కుల్లో ఒకడు గా చిత్రపు నరసింహారావు గారు నటించారు.

★ తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” లో మొద్దబ్బాయిగా. ఎల్.వి.ప్రసాద్ గారు నటించారు.

★ తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” సినిమా నిర్మాణానికి సుమారు 20 వేల రూపాయలు ఖర్చు అయ్యింది.

★ తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” సినిమా నిర్మాణానికి సుమారు 20 రోజుల సమయం పట్టింది.

★ తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” సినిమాని బొంబాయి లోని ఇంపీరియల్ స్టూడియో లో నిర్మించారు.

★ తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” సినిమాకి మొట్టమొదటి కథనాయకుడు సింధురి కృష్ణా రావు గారు ప్రహ్లాదుడి పాత్రలో నటించారు.

★ తొలి తెలుగు టాకీ చిత్రం “భక్త ప్రహ్లాద” సినిమాకి మొట్టమొదటి కథానాయిక సురభి కమలాభాయి లీలావతి పాత్రలో నటించారు.

★ భారతదేశం లో నిర్మించబడ్డ తొలి మూడు టాకీలలో నటించిన ఏకైక నటుడిగా యల్వీ ప్రసాద్ గారు చరిత్రకెక్కారు. వీరు భారతీయ తొలి టాకీ “ఆలం అరా”, తొలి తమిళ టాకీ “కాళిదాస్”, తొలి తెలుగు టాకీ “భక్త ప్రహ్లాద” లలో (మూడు చిత్రాలలో నటించిన ఏకైక నటుడిగా) నటించారు.

Show More
Back to top button