CINEMATelugu Cinema

తెలుగు నాటకరంగ సీమలో రాణించిన రాయలసీమ రత్నం.. బళ్లారి రాఘవ..

తెలుగువారి సాంస్కృతిక చరిత్రలో రంగస్థల నాటకం విడదీయరాని భాగం. తొలి దశాబ్దాలలో తెలుగు సినిమా రంగాన్ని నాటక రంగం ఎంతో ప్రభావితం చేసింది. తెలుగు టాకీల ప్రస్తావనకు వస్తే సినిమాల కంటే ముందు తెలుగు ప్రేక్షకుల్ని ప్రభావితం చేసింది నాటక రంగమే. తెలుగు సినిమా టాకీ తొలి రోజులలో సినిమా నటినటులందరూ తొంభై శాతం మంది నాటక రంగం నుండి వచ్చిన వారే. అలా వచ్చిన వారిలో తెలుగు నాటకరంగంలో పేరు ప్రతిష్టలు సంపాదించిన వారు కన్నాంబ, వేమూరి గగ్గయ్య, చిలకలపూడి సీతారామాంజనేయులు, స్థానం నరసింహారావు, సురభి కమలాభాయి మొదలగున వారున్నారు. వీరి కంటే ముందుగా తెలుగు నాటక రంగంలో తనదైన ముద్ర వేసి, ఒక కొత్త ఒరవడిని సృష్టించిన విశిష్ట నటులు “తాడిపత్రి రాఘవాచార్యులు”. ఈయననే బళ్లారి రాఘవచార్యులు అని పిలుస్తారు. రాను రాను తనకు ఆచార్య పదం ఇష్టం లేకపోవడంతో ఆయనను బళ్లారి రాఘవ అని పిలిచేవారు. తన సమకాలీన నటినటులలో విలక్షణమైన నటుడిగా మెలిగి, వృత్తిపరంగా వెలిగిన శక్తి, తెలుగు నాటకరంగ సీమలో రాణించిన రాయలసీమ రత్నం “బళ్లారి రాఘవ”.

జాతి ప్రగతికి, మూఢాచారాల నిర్మూలనకు నాటకరంగం అత్యంత ప్రధానమైనదని ప్రకటించి, ప్రతి పట్టణంలోనూ అన్ని హంగులూ గల నాటకరంగం స్థాపించాలని ఎలుగెత్తి చాటిన ప్రజానటులు బళ్ళారి రాఘవ. ఆయన పుట్టుకతోనే ఆచార్యులు, విద్యావినయాల లోనూ ఆచార్యులు, అభినయంలోనూ ఆయన ఆచార్యులు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. నటన ఆయనకు ప్రవృత్తి మాత్రమే. ఒకవైపు న్యాయవాద వృత్తిలోనూ, మరోవైపు రంగస్థలం ప్రదర్శనలోనూ దాదాపు ముప్పై సంవత్సరాల పాటు తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకొన్న సవ్యసాచి బళ్ళారి రాఘవ. న్యాయవాదిగా పనిచేసిన రోజులలో తొమ్మిది యేండ్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేసిన ప్రత్యేకత అయనది. ఆయన కోర్టులో వాదించే సివిల్ కేసులైనా, క్రిమినల్ కేసులైనా కూడా ఆయన వాదనలు వినడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. బళ్లారి రాఘవకు రంగస్థలం అయినా, న్యాయస్థానమైనా రెంటిలోనూ కళా ప్రపూర్ణుడుగా పేరు తెచ్చుకున్నారు.

తన నట జీవితంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో మొత్తం 54 నాటకాలలో నటించారు. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సరోజినీ నాయుడు లాంటి వివిధ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న విశిష్ట నటులు బళ్ళారి రాఘవ. బారెడు రాగాలు, తబలామోతలు లేకుండా భావ ప్రధానమైన అభినయంతో ప్రేక్షకులను రంజింపజేసినవారు బళ్ళారి రాఘవ. “తనకు ప్రతినాయక పాత్రలపట్ల మక్కువ ఏర్పడడానికి ఆయా పాత్రల పట్ల విభిన్న కోణాలు చూడడానికి బళ్లారి రాఘవ ప్రదర్శించిన పౌరాణిక పాత్రలే ఒక కారణం” అని ఎన్టీఆర్ అన్నారు. స్త్రీ పాత్రను కూడా పురుషులే ధరిస్తున్న ఆ రోజులలో స్త్రీ పాత్రను స్త్రీలే ధరించాలని పట్టుబట్టి తనకు సాధ్యమైనంతలో విజయం సాధించిన కార్యశీలి బళ్లారి రాఘవ. ఆయన చేసిన కృషి, అందించిన ప్రోత్సాహం వలననే రంగస్థలం పై నటించడానికి కేవలం కళావంతుల కుటుంబాల నుండే కాకుండా అగ్రవర్ణానికి చెందిన కొమ్మూరి పద్మావతీ దేవి వంటి వారు కూడా ముందుకు వచ్చారు. ఆ తరువాత రోజులలో టంగుటూరి సూర్యకుమారి, భానుమతి లాంటివారు చిత్ర రంగ ప్రవేశం చేయడానికి కొమ్మూరి పద్మావతీ దేవి ఒక మార్గం వేసినారు అని చెప్పాలి.

బళ్లారి రాఘవ తన నాటక జీవితాన్ని కేవలం రంగస్థలం నాటక ప్రదర్శనకే పరిమితం చేయకుండా ఊరురా నాటక ప్రదర్శనశాలలు ఉండాలని, కళాశాలలలో, విద్యాలయాలలో నటన గురించిన కోర్సులు నిర్వహించడానికి వందేళ్ల క్రితం ఉపన్యాసాలు ఇచ్చినవారు, విశ్వవిద్యాలయాలకు సిఫారసు చేసినవారు బళ్లారి రాఘవ. నాటక రంగం, న్యాయవాద వృత్తితో బాటు నికార్సయిన మానవత్వం బళ్లారి రాఘవలోని మరో కోణం. దళిత విద్యార్థుల కోసం బళ్లారిలో తన సొంత డబ్బులతో ఒక పాఠశాల స్థాపించారు. పండుగ సమయాలలో పేద పిల్లలను తమ ఇంటికి పిలిపించి భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారికి దుస్తులు కూడా ఇస్తుండేవారు. తన కులాన్ని సూచించే ఆచార్యులు అనే పదం వదిలేయాలని సన్నిహితులతో చెబుతుండే రాఘవ తన సొంత కుల పెద్దల నుండి నిరసన వ్యక్తం అయినా ఆయన పట్టించుకునే వారు కాదు. బళ్లారి రాఘవ కృష్ణవేణమ్మను వివాహమాడారు. ఆమె తండ్రి కూడా కర్నూలులో న్యాయవాది. ఆయనకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. బళ్లారి రాఘవ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    తాడిపత్రి రాఘవాచార్య 

ఇతర పేర్లు  :  బళ్లారి రాఘవ

జననం    :     02 ఆగస్టు 1880    

స్వస్థలం   :   తాడిపత్రి, అనంతపురం 

వృత్తి      :     న్యాయవాది, రంగస్థలం నటులు 

జీవిత భాగస్వామి  :   కృష్ణవేణి 

తండ్రి    :     నరసింహాచార్యులు 

తల్లి     :    శేషమ్మ 

బిరుదు    :    రావు బహుద్దూర్

పిల్లలు   :  ఇద్దరు అమ్మాయిలు 

మరణ కారణం  :   అనారోగ్యం

మరణం    :   16 ఏప్రిల్ 1946

నేపథ్యం…

బళ్ళారి రాఘవ 02 ఆగస్టు 1880 నాడు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించారు. అతని పూర్తిపేరు తాడిపత్రి రాఘవాచార్యులు. ఆయన తండ్రి నరసింహాచారి, తల్లి శేషమ్మ. రాఘవ పుట్టింది తాడిపత్రి అయినా తన బాల్యం, ఎదుగుదల, స్థిరపడడం, రంగస్థలం జీవితం ఇవన్నీ కూడా బళ్లారిలోనే. అందువలన ఆ ఊరి పేరు మీదుగానే తన పేరు బళ్లారి రాఘవ అని స్థిరపడిపోయింది. తల్లిదండ్రులకు రాఘవ లేకలేక పుట్టిన బిడ్డ. అతను పుట్టకముందు అతని తల్లిదండ్రులు బళ్ళారిలోని బసప్ప అనే ఆధ్యాత్మిక గురువు ఆశీస్సులు తీసుకున్నారు. ఆ వెంటనే పుట్టిన బిడ్డ కావడంతో రాఘవకు మొదటగా బసప్ప అనే పేరు పెట్టుకున్నారు. క్రమేపీ వారి వైష్ణవ సంప్రదాయానుసారం రాఘవాచార్యులన్న పేరు స్థిరపరిచారు. వారిది శ్రీవైష్ణవ శాఖకు చెందిన బ్రాహ్మణ కుటుంబం. తండ్రి తాడిపత్రి పురపాలక సంఘ పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేసేవారు. రాఘవ తండ్రి అష్టావధానికి కూడా.

ఆంధ్ర నాటక పితామహునిగా పేరొందిన ధర్మవరం రామకృష్ణమాచార్యులు రాఘవకు స్వయానా మేనమామ. ఆయన కూడా బళ్లారిలోనే ఉండేవారు. రాఘవకు మేనమామ లక్షణాలు వచ్చాయి. రాఘవ పుట్టిన కొన్నాళ్ళ తరువాత శేషమ్మకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. రాఘవ ప్రాథమిక విద్య పూర్తిచేసి, ఎనిమిదవ యేట బళ్ళారిలోని పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి మొదలుపెట్టారు. పద్నాలుగవ యేట మెట్రిక్యూలేషన్ పూర్తిచేశారు. ఆ తరువాత బళ్ళారిలోని వార్డ్ లా కళాశాలలో ఎఫ్.ఎ. మరియు మద్రాసులోని క్రిస్టియన్ కళాశాలలో బి.ఎ. పూర్తిచేశారు. ఆ తరువాత బళ్ళారి తిరిగివచ్చి కొంతకాలం పాటు ఉపాధ్యాయునిగా, ఇంజనీరింగ్ కంపెనీలో గుమాస్తాగా పనిచేశారు. తన మేనమామ న్యాయవాద వృత్తిలో కొనసాగడం దగ్గరుండి గమనించిన రాఘవ తాను కూడా న్యాయవాది కావాలనే ఆకాంక్షతో తిరిగి మద్రాసులో లా కళాశాలలో చేరి న్యాయవిద్య అభ్యసించి బి.ఎల్. పట్టా అందుకున్నారు.

సాహిత్యం పై ఆసక్తి…

రాఘవ బళ్లారిలో వార్డ్ లే కళాశాలలో ఎఫ్.ఏ చదివే రోజుల్లోనే పాఠశాల కళాశాల వార్షికోత్సవంలో ప్రదర్శించే నాటకాలలో వివిధ పాత్రలు ధరిస్తూ ఉండేవారు. మద్రాసులోని క్రైస్తవ కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఆయన తమిళ, కన్నడ, మరాఠీ నాటకాలు విపరీతంగా చూస్తుండేవారు. వాటితో పాటు ఆటలకు ఆకర్షితులయ్యి టెన్నిస్ లాంటి ఆటలు కూడా ఆడుతుండేవారు. రాఘవ తండ్రి పండితుడవ్వడంతో తనకు చిన్నప్పటినుండే సాహిత్యం అంటే అభిమానం, ఆసక్తి ఏర్పడింది. నాన్నగారి వారసత్వంగా రాఘవకు కవిత్వం అలవాటయ్యింది. న్యాయ కళాశాలలో చదివేటప్పుడే వాళ్ళ నాన్నకు వ్రాసిన ఉత్తరాలలో కవిత్వం గుప్పిస్తూ ఉండేవారు. అది గమనించిన నాన్న రాఘవ న్యాయవాది కాకుండా కవిత్వం ధ్యాసలో ఎక్కడికి వెళ్ళిపోతాడేమోనని, కవిత్వం మీద కొడుకుకు ఉన్న ఆసక్తిని ఆంగ్ల సాహిత్యం వైపు మళ్ళించారు. ఆ అలవాటు రాఘవను మద్రాసులో ఉండగానే ఆంగ్ల నాటకాల వైపు ఆకర్షితుడిని చేసింది. న్యాయశాస్త్రం చదువుతూనే రాఘవ మద్రాసులో షేక్స్పియర్ నాటకాలలో ప్రధాన పాత్రలు ధరిస్తూండేవారు. ఒక వైపు నాటకాలు, మరొకవైపు ఆటలు. వీటి వలన న్యాయ పరీక్షలలో తప్పారు. దాంతో మళ్లీ ప్రైవేటుగా వ్రాసి 1905లో తన పాతికేళ్ళ వయస్సులో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు.

ఆంధ్ర నాటక ఉద్భవం..

1880 లోనే ఆధునిక ఆంధ్ర నాటకం ఉద్భవించిందని పరిశీలకు అభిప్రాయం. రాఘవ పుట్టిన సంవత్సరం కూడా అదే అవ్వడం యాదృచ్ఛికం. తొలి రోజులలో తెలుగులో నాటకాలు వ్రాసిన ప్రముఖుల్లో కందుకూరు వీరేశలింగం, బళ్లారి రాఘవ మేనమామ రామకృష్ణమాచార్యులు. కందుకూరి వీరేశలింగం రాజమహేంద్రవరంలో రంగస్థలం ప్రదర్శనను ప్రారంభిస్తే రామకృష్ణమాచార్యులు1883 లో సరస వినోదిని సభను ప్రారంభించి ఆ సంస్థ తరపున చిత్రనళినీయం, పాదుకాపట్టాభిషేకం లాంటి నాటకాలను ప్రదర్శిస్తుండేవారు. అలాగే తమిళ ప్రాంతంలో తమిళ నాటక పితామహా అని పేరున్న వ్యక్తి సంబందం మొదలియార్ నాటకాలను మొదలుపెట్టారు. ఇలా తెలుగు నాటకాలు 1980 లోనే ప్రచారంలోకి రావడం వలన రాఘవ పుట్టిన దశాబ్దంలోనే తెలుగు నాటక రంగం కూడా పుట్టింది అని చారిత్రకంగా చెప్పుకోవచ్చు.

“షేక్స్పియర్స్ క్లబ్” నాటక సంస్థ స్థాపన…

1906 లో మేనమామ రామకృష్ణమాచార్యుల వద్ద జూనియర్ న్యాయవాదిగా న్యాయవృత్తి ప్రారంభించారు. రాఘవ తమ్ముడు శేషాచార్యులు కూడా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. 1906 లో బళ్లారిలో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన బళ్లారి రాఘవ నాటకాల పట్ల అనురక్తిని వదలకపోయేవారు. అందుకు గల కారణం వాళ్ళ మేనమామ కూడా ఒకవైపు న్యాయవాదిగా పనిచేస్తూనే మరోవైపు నాటకాలు వేస్తూ ఉండేవారు. దాంతో రాఘవ కూడా ఆ విధంగా నాటకాలవైపు అడుగులు వేశారు.  ఆ రోజులలో రెండు పేరు మోసిన నాటక సంస్థలు ఉండేవి.

ఆ రెండు నాటక సంస్థలలో ఒకటి రాఘవ మేనమామ రామకృష్ణమాచార్యులు  స్థాపించిన “సరస వినోదిని సభ”. రెండోది కోలాచలం శ్రీనివాసరావు పండితులు సారథ్యంలో నడుస్తున్న “సుమనోహర సభ”. కోలాచలం శ్రీనివాసరావుకు కూడా ఆంధ్ర నాటక పితామహా అనే బిరుదు ఉండేది. కోలాచలం శ్రీనివాసరావు ఎక్కువగా చారిత్రక నాటకాలకు ప్రాధాన్యతనిస్తే, రామకృష్ణమాచార్యులు పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తూ ఉండేవారు. బళ్లారి రాఘవకు పౌరాణిక నాటకాలు అంటే ఇష్టం ఉండేది కాదు. ఆయన 1906 లో “షేక్స్పియర్స్ క్లబ్” అనే సొంత నాటక సంస్థను స్థాపించి బళ్లారిలో పూర్తిస్థాయి ఆంగ్ల నాటకాలను ప్రదర్శించేవారు. పాఠశాల, కళాశాల రోజులలో నాటకాలను మినహాయిస్తే బళ్లారి రాఘవ మొదటిసారి నటించి ప్రదర్శించిన రంగస్థలం ఆంగ్ల నాటకం “ఒథెల్లో”.

తొలి నాటకం “సునందిని”…

ఆంగ్ల నాటకాలలలో ఎక్కువ కాలం కొనసాగలేని బళ్లారి రాఘవ కోలాచలం శ్రీనివాసరావు నాటక సంస్థ అయిన “సుమనోహర సభ” లో చేరారు. మొదటి నుండి రాఘవకు చారిత్రక నాటకాలు అంటే ఇష్టం. జనాలలో చైతన్యం తీసుకురావడం, వాళ్లలో అభ్యుదయ భావాలను ప్రేరేపించడం చారిత్రక నాటకాలతోనే సాధ్యం. అదీకాక రాఘవ నాన్న “సుమనోహర సభ” లో సలహాదారుడుగా ఉండేవారు. ఇది కూడా రాఘవ “సుమనోహర సభ” లో చేరడానికి కారణం అయ్యింది. ఈ నాటక సంస్థలో సభ్యుడిగా ఉంటూనే రాఘవ తన మేనమామ వద్ద న్యాయవాదిగా కొనసాగారు. కోలాచలం శ్రీనివాసరావు “సుమనోహర సభ” లో మొట్టమొదటగా ప్రదర్శించిన నాటకం “సునందిని”. అందులో రాఘవ 70 ఏళ్ల వృద్ధుడి పాత్ర పోషించారు.

మొట్టమొదటి నుండి రాఘవది సహజమైన నటన. రాఘవ “విజయనగర పతనం” అనే నాటకంలో పఠాన్ రుస్తుం అనే పాత్ర. ఆ పాత్రకు ఆయన ప్రాణం పోస్తే, ఆ పాత్ర ఆయనకు విశేషమైన పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. హిందూ ముస్లింల సఖ్యతకు పఠాన్ రుస్తుం అనే పాత్ర భంగం కలిగిస్తుందనే సాకుతో మద్రాసు ప్రభుత్వం కొన్నాళ్లు ఆనాటకాన్ని నిషేధించింది. కానీ అదే నాటకాన్ని మైసూర్ లో ప్రదర్శించినప్పుడు ఆ నాటకాన్ని తిలకించిన హిందువులతో పాటు ముస్లింలు కూడా బ్రహ్మరథం పట్టారు. 1919లో బెంగళూరులో జరిగిన “ఫెస్టివల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్” లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన బళ్లారి రాఘవ రుస్తుం పాత్రను చూసి భారతదేశం గర్వించదగ్గ నటుడు రాఘవ అని అభినందించడమే కాకుండా శాంతినికేతన్ కు వచ్చి ప్రదర్శనలు ఇవ్వండి అని కూడా రాఘవను కోరారు.

“అమెచ్యూర్ డ్రమట్రిక్ అసోసియేషన్” లో 

కోలాచలం శ్రీనివాసరావు సుమనోహర సభలో బళ్లారి రాఘవ నటిస్తున్న రోజులలో ఆయనకు కన్నడ నాటక రంగంలో కూడా పరిచయం జరిగింది. బెంగుళూరులో ఆంగ్ల నాటకాలను బళ్లారి రాఘవ తరచూ ప్రదర్శించే వారు. ఆ నాటకాలు చూస్తూవుండే కన్నడ విమర్శకులు డాక్టర్ డి.గుండప్ప, కన్నడ రచయిత సంపత్ గిరి రావు వంటి వారు రాఘవ నటనా వైదుష్యం గురించి కన్నడ పత్రికలలో వ్రాస్తుండేవారు. ఆ విధంగా బెంగుళూరులో రాఘవ నాటకాలు చూసే వారి సంఖ్య పెరిగింది. కేవలం ఆంగ్ల నాటకాలకే పరిమితం కాకుండా, కన్నడ రంగస్థలంలో కన్నడ నాటకాలు కూడా వేయడంతో కన్నడ రంగస్థలం ఆయనను ఆదరించింది. ఆ రోజులలో బెంగుళూరులో “అమెచ్యూర్ డ్రమట్రిక్ అసోసియేషన్” అనే ఒక సంస్థ ప్రజాదరణ పొందిన కన్నడ నాటకాలను ప్రదర్శిస్తూ ఉండేది. ప్రముఖ కన్నడ నటులు ఏ.వి.వరదరాచార్య ప్రోత్సాహంతో బళ్లారి రాఘవ “అమెచ్యూర్ డ్రమట్రిక్ అసోసియేషన్” చేరి వాళ్ళతో కలిసి కన్నడ నాటకాలలో నటించడం ప్రారంభించారు. అలా ఆయన ప్రదర్శించిన కన్నడ నాటకాలలో కొన్ని “మండోదరి”, “తాళికోట”, “మోహనాస్త్ర”, “కనకదాస”, “ఇద్దతు ఇద్దహోగే” మొదలైనవి. చారిత్రక నాటకాలను ఎక్కువగా ఇష్టపడే బళ్లారి రాఘవ ఎక్కువ కాలం పౌరాణిక నాటకాలకు దూరంగా ఉండలేకపోయారు.

తొలిసారి పౌరాణిక నాటకం…

ఒకసారి కోలాచలం శ్రీనివాసరావు తాను వ్రాసిన “భారత యుద్ధం” నాటకం జరుగుతుండగా రాఘవ ప్రేక్షకులలో కూర్చుని చూస్తున్నారు. అప్పటికే మొదటి రంగం పూర్తయ్యింది. దాంతో తెరపడింది. ఆ సమయంలో ధర్మరాజు పాత్రధారికి తన కూతురు కలరాతో బాధపడుతుంది అనే దుర్వార్త అందింది. వాళ్ళ అమ్మాయి పరిస్థితి బాధాకరంగా ఉందని వెంటనే ఆయన తన వేషం తీసేసి ఇంటికి వెళ్లిపోయారు. దాంతో నాటక నిర్వాహకులు కోలాచలం శ్రీనివాస రావుకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ సమయానికి ప్రేక్షకులలో కూర్చుని నాటకాన్ని చూస్తున్న బళ్లారి రాఘవ, తన గురువు పరువు నిలబెట్టడం కోసం ఆయన గ్రీన్ రూమ్ కి వెళ్లి మేకప్ వేయించుకుని, ధర్మరాజు పాత్రకు సంబంధించిన పద్యాలు విని వేదిక మీదకు వచ్చారు.

బళ్లారి రాఘవ వేదిక మీదకి రాగానే ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవు. తాను పోషించిన పౌరాణిక పాత్ర మొదటిసారి అనే భావన ప్రేక్షకులు కలగకుండా అద్భుతంగా నటించారు. గురువు కోలాచలం శ్రీనివాసరావు తన శిష్యుడు రాఘవని అభినందించి, కృతజ్ఞతలు చెప్పారు. అక్కడి నుండి బళ్లారి రాఘవ పౌరాణిక నాటకాలు కూడా వేయడం ప్రారంభించారు. వాటిల్లో “సత్యహరిచంద్ర” లో హరిచంద్రుడు, “సతీసావిత్రి” లో యమధర్మరాజు, “ద్రౌపది మానసంరక్షణం” లో దుర్యోధనుడు, “మండోదరి” లో రావణాసురుడు, “భక్త ప్రహ్లాద” లో హిరణ్యకశపుడు, సుభద్రార్జునీయం లో అర్జునుడు లాంటి పౌరాణిక పాత్రలను ధరించారు రాఘవ.

న్యాయవాది గా ప్రాక్టీసు…

బళ్లారి రాఘవ రంగస్థలం మీద ఎంత పేరు తెచ్చుకున్నారో న్యాయవాద వృత్తిలో కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. 1912 లో తన మేనమామ రామకృష్ణమాచార్యులు  మరణించారు. అప్పటివరకు ఆయన వద్ద జూనియర్ గా పని చేసిన రాఘవ ఆ తరువాత సొంతంగా సాధన (ప్రాక్టీస్) ప్రారంభించారు. ఆ రోజులలో బళ్లారిలో ప్రముఖ న్యాయవాదులు కోలాచలం వెంకట్రావు, పి.శివరావు, కోలారు వెంకట్రావు లాంటి వాళ్లు ఉండేవారు. వారిలో పి.శివరావు అంటే సింహ స్వప్నం. ఆయన కేసు వాదిస్తూంటే ప్రత్యర్థ న్యాయవాదులు వణుకుతుండేవారు. అలాంటి పి.శివరావుకు సమవుజ్జీలు బళ్లారి రాఘవనే. వీళ్ళిద్దరూ కేసులు వాదిస్తూ ఉంటే జనాలు విపరీతంగా వస్తుండేవారు.

కేసులలో నిబద్ధత ఉంటేనే రాఘవ స్వీకరించేవారు. తప్పుడు కేసులను తీసుకునేవారు కాదు. ఆయన ఖరీదైన న్యాయవాదులు. కానీ పేదవారు వస్తే వారికి ఉదారంగా సాయం చేసేవారు. న్యాయస్థానంలో వాదించాల్సిన కేసులను కూలంకషంగా నోట్స్ వ్రాసుకునేవారు. ఖచ్చితమైన సమయానికి కోర్టుకు వెళ్లి సాయంకాలానికి ఇంటికి వచ్చేస్తే, ఆ మరునాడు ఉదయం వరకు ఆయన నటుడే. రాత్రంతా నాటకాలు, రిహార్సల్స్ గురించిన చర్చలే కొనసాగుతూ ఉండేవి. కొన్నికొన్ని సందర్భాలలో వేరే ఊరిలో నాటకాలు వేయాల్సి వస్తే అది పూర్తయ్యాక మరునాడు వాదించాల్సిన కేసులను దారిలోనే చదువుకొని రైలు దిగి సరాసరి కోర్టుకు వెళ్లిన వాదించిన రోజులు ఉన్నాయని ఆయన మిత్రులు చెబుతుండేవారు.

ప్రజాసేవలో…

ప్రజాసేవ కార్యక్రమాల నిమిత్తం విరాళాల కోసం ఎవరొచ్చినా కూడా సహాయం చేసి పంపిస్తూ ఉండేవారు. ఎక్కడెక్కడ నుండో పండితులు, కవులు, నటులు వచ్చినప్పుడు రాఘవ ఇంట్లోనే వారాల తరబడి ఉంటుండేవారు. పేదవారికి పండుగ దినాలలో దుస్తులు, దుప్పట్లు పంచిపెడుతూ ఉండేవారు. తాను న్యాయవాదిగా సంపాదించిన డబ్బులో అధిక భాగం ఇలా దానధర్మాలకే పంచిపెడుతూ ఉండేవారు. ఆంధ్రదేశంలో బళ్లారి రాఘవకు లక్షల్లో ప్రేక్షకాభిమానులు  ఉండేవారు. 1922 వ సంవత్సరం నుండి ప్రతీ సంవత్సరం కోస్తా జిల్లాలలో కొన్ని వారాలపాటు పర్యటించి నాటక ప్రదర్శన ఇస్తుండేవారు. ఆ తరువాత అయిదు, ఆరు సంవత్సరాలకు ట్రూప్ మొత్తాన్ని తీసుకుని ఆంధ్రదేశం మొత్తం పర్యటించేవారు. ఆ రోజులలో ఆంధ్రదేశం మొత్తం పర్యటించడమనేది ఖరీదైన వ్యవహారంగా పరిణమించింది. 1927 నుండి ఆంధ్రదేశం అంతటా పర్యటించినప్పుడు నాటకంలో ముఖ్యమైన నటులు కొద్దిమందిని తీసుకొని, మిగతా వారిని స్థానికంగా ఎంపిక చేసుకొని వాళ్ళకు తమతో పాటు శిక్షణ ఇచ్చి నాటకాలు ప్రదర్శించేవారు. ఈ ప్రయోగం అద్భుతమైన ఫలితాన్నిచ్చింది.

రాఘవ నటనను మెచ్చిన గాంధీజీ…

1927 వ సంవత్సరంలో బళ్లారి రాఘవ రంగూన్ లో పర్యటించి  నాటకాలను ప్రదర్శించారు. ఆయనకు “పండిట్ తారానాథ్” అనే ఒక ఆధ్యాత్మిక గురువు ఉండేవారు. ఆయన తుంగభద్ర నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తూ ఉన్నారు. ఆ ఆశ్రమానికి రాఘవ తరచూ వెళ్లి వస్తుండేవారు. ఆ పండిట్ తారానాథ్ వ్రాసిన “దీనబంధు కబీర్” అనే హిందీ నాటకాన్ని 1927 లో బెంగళూరులో  రాఘవ ప్రదర్శిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో మహాత్మా గాంధీ గారు దక్షిణ భారతదేశంలో పర్యటిస్తూ “నంది హిల్స్” లో విశ్రాంతి తీసుకుంటున్నారు. “దీనబంధు కబీర్” నాటక నిర్వాహకులు ఆ నాటకాన్ని చూడడానికి మహాత్మా గాంధీ గారిని  ఆహ్వానించారు.

రాజాజీతో కలిసి మహాత్మా గాంధీ గారు ఆ నాటకాన్ని చూడడానికి వెళ్లారు. అయనకున్న తీరికలేని సందర్శనల వలన అనేక చోట్ల పర్యటించాలి కనుక గాంధీ గారు పది నిమిషాలు మాత్రమే మీ నాటకం చూస్తారని రాజాజీ చెప్పారు. కానీ గంటసేపైనా అక్కడి నుంచి గాంధీజీ కదలలేదు. రాఘవ నటనకు మంత్రముగ్ధులై సమయాన్ని మర్చిపోయారు. బాపు ప్రార్థనకు సమయం అయ్యింది అని గాంధీజీతో రాజాజీ అన్నారు. దానికి  సమాధానంగా గాంధీజీ “ఇంకా వేరే చోటికి ప్రార్థనకు ఎందుకు మనం ఉన్నది ప్రార్థనలోనే కదా” అన్నారు ఆ “దీనబంధు కబీర్” నాటకం చూస్తూ. ఆ నాటకం అయిపోగానే రాఘవ మహారాజ్ కి జై అని గాంధీ గారు అన్నారు.

ఇంగ్లాండ్ పర్యటన…

బళ్లారి రాఘవ 1928 లో  యూరోపియన్ నాటక రంగాన్ని అధ్యయనం చేయడానికి ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడ లండన్, పారిస్, రోమ్, బ్రెజిల్స్ లాంటి నగరాలను సందర్శించి అక్కడ నాటకరంగ స్థితిగతుల గురించి అనేక మందిని కలుసుకొని చర్చించారు. ఆయా రంగాలలో అనేక నాటక ప్రదర్శనలను, వాటి నిర్వహణను కూడా దగ్గరుండి పరిశీలించారు. ఆ పర్యటన సందర్భంగా “జార్జి బెర్నార్డ్ షా” ను కలుసుకున్నారు. ఆ సమయంలో “అదేంటి? మీరు ఇక్కడికి వచ్చారేమి? మేము కదా మీ దేశానికి రావాలి! మీ కళల గురించి అధ్యయనం చేయాలి!” అని జార్జి బెర్నార్డ్ షా, రాఘవతో అన్నారట. ఆ పర్యటన నుండి ఆంధ్ర దేశానికి వచ్చాక రాఘవకు నాటక రంగాన్ని ఇంకెంత ముందుకు తీసుకెళ్లవచ్చో అవగాహన ఏర్పడింది. ఆ స్ఫూర్తితో రాఘవ వివిధ నగరాలలో నాటక రంగంలో రావాల్సిన మార్పుల గురించి, ప్రదర్శనశాలల ఆవశ్యతకు గురించి ఒక ఉద్యమంలా ఉపన్యాసం ఇచ్చారు.

1930 సంవత్సరం నుండి స్త్రీ పాత్రలను స్త్రీలే పోషించాలనే ప్రతిపాదనను ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్లారు. ఆయన పిలుపు అందుకొని సాంప్రదాయ కుటుంబం నుండి నాటకాలలో నటించడానికి ముందుకు వచ్చిన వారిలో మొదటివారు కొమ్మూరి పద్మావతీ దేవి. ఈవిడ ప్రముఖ రచయిత చలం తమ్ముడు కొమ్మూరి వెంకటరామయ్య భార్య. ఆమె కుమారుడే ప్రముఖ రచయిత స్వర్గీయ కొమ్మూరి సాంబశివరావు. కొడవగంటి కుటుంబరావు కొమ్మూరి పద్మావతీ దేవి అల్లుడు. 1930 సంవత్సరం నుండి కొమ్మూరి పద్మావతీ, బళ్లారి రాఘవతో కలిసి నటించడం మొదలుపెట్టారు. “భక్త ప్రహ్లాద” లో రాఘవ హిరణ్యకశపుడుగా, పద్మావతి లీలావతిగా నటిస్తుండేవారు. బళ్లారి రాఘవ పిలుపునందుకొని మరి కొంతమంది మహిళలు రంగస్థలం మీద నటించడానికి వచ్చారు. వారిలో కొబ్బరపు సరోజినీ, కాకినాడ అన్నపూర్ణ, మాడపాటి సరోజినీ మొదలగువారు ఉన్నారు.

తొమ్మిదేండ్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా…

1933 వ సంవత్సరంలో రాఘవను బళ్లారి పురపాలక సంఘం ఛైర్మన్ గా పోటీ చేయాల్సిందిగా మిత్రులు కోరారు. వారి అభ్యర్థనను తిరస్కరించలేక తాను కూడా సరేనన్నారు. ఎన్నికల ప్రచారానికి వీధి వీధి తిరగడం మొదలుపెట్టారు.  ఓటేయమని అడిగితే కొందరు సరే అనేవారు, మరికొందరు మౌనంగా ఉండేవారు. అలా మౌనంగా ఉన్న వారి మీద రాఘవ మిత్రుడు “కరి బసప్ప” విరుచుకుపడేవారు. ఇలాంటి సంఘటనలు రాఘవ మనస్తత్వానికి సరిపడేవి కాదు. ఓట్ల కోసం అడుక్కోవడం, సానుకూలంగా స్పందించకపోతే వారి మీద కఠినంగా మాట్లాడాల్సి రావడం, ఇలాంటి రాజకీయాలు నాకు వద్దు అని రాజకీయాలు ఉపసంహరించుకున్నారు.

బళ్లారి రాఘవ 1933 వ సంవత్సరంలో “సరిపడిన సంగతులు” అనే తొంభై పేజీల నాటకం వ్రాశారు. దానిని అదే సంవత్సరం మద్రాసులోని “వావిళ్ళ రామదాసు అండ్ సన్స్” వారు పుస్తకంగా ప్రచురించారు. వితంతు వివాహాలే ప్రధానాంశాలుగా తీసుకొని ఆ నాటకం వ్రాశారు. మూడు అంకాలు, పదకొండు రంగాలు కలిసిన అతిపెద్ద నాటకం అది. నిడివి ఎక్కువగా ఉండటం వలన ఆ నాటకం ప్రదర్శించడం వీలుకాలేదు. నాటక రంగంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ, ఎంతో కళా సేవ చేస్తున్న రోజులలోనే బళ్లారి రాఘవ వృత్తిపరంగా కూడా ఎదగి ప్రత్యేక గుర్తింపు పొందడం గమనార్హం. 1927 ప్రాంతంలో ప్రభుత్వం రాఘవను పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పి..పి) గా నియమించడంతోపాటు, ఆయనకు “రావు బహుదూర్” బిరుదును కూడా ఇచ్చి సత్కరించింది. రాఘవ సుమారు తొమ్మిదేళ్లపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కొనసాగారు.

చిత్రరంగ ప్రవేశం..

1936 వ సంవత్సరంలో రెండు పోటీ చిత్రాలు నిర్మాణం అయ్యాయి. హెచ్.వి.బాబు దర్శకత్వం వహించిన “ద్రౌపదీ వస్త్రాపహరణం” (1936) మరియు ఎన్. జగన్నాథ స్వామి దర్శకత్వం వహించిన “ద్రౌపది మాన సంరక్షణ” (1936). “ద్రౌపది మాన సంరక్షణ” సినిమాలో దుర్యోధనుడి పాత్రలో బళ్లారి రాఘవ నటిస్తే, “ద్రౌపదీ వస్త్రాపహరణం” సినిమాలో దుర్యోధనుడిగా యడవల్లి సూర్యనారాయణ నటించారు. “ద్రౌపది మాన సంరక్షణ” సినిమాలో దుర్యోధనుడి పాత్రలో బళ్లారి రాఘవ మొట్టమొదటిసారిగా వెండితెర మీద కనిపించారు. ఆ సినిమాలో నటించే సమయానికి ఆయన వయస్సు 55 సంవత్సరాలు. సమకాలీన నటులందరూ బళ్లారి రాఘవ కంటే చిన్నవారు. దురదృష్టవశాత్తు రాఘవ నటించిన “ద్రౌపతి మాన సంరక్షణ” పరాజయం పాలైంది. దానికి పోటీ చిత్రమైన “ద్రౌపది వస్త్రాపహరణం” విజయవంతమయ్యింది.

ఆ తరువాత బళ్లారి రాఘవ నటించిన రెండవ చిత్రం “రైతుబిడ్డ” (1939). గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ఇది. 27 ఆగస్టు 1939 లో ఈ చిత్రం విడుదలైంది. ఇందులో బళ్లారి రాఘవదే ప్రధాన పాత్ర. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. ఈ రెండు చిత్రాలలో బళ్లారి రాఘవకు జంటగా కొమ్మూరి పద్మావతీదేవి నటించారు. బళ్లారి రాఘవ నటించడం మూడవ చిత్రం, అలాగే ఆఖరి చిత్రం “చండిక”. ఈ చిత్రంలో వీరమల్లుపాత్రలో బళ్లారి రాఘవ నటించారు. ఈ చిత్రం 1940లో విడుదలైంది. ఈ సినిమా తరువాత బళ్లారి రాఘవ ఏ సినిమాలోనూ నటించలేదు.  అప్పటికి బళ్లారి రాఘవ వయస్సు 60 సంవత్సరాలు. మొత్తంగా ఆయన నటించిన చిత్రాలు మూడు. ఆ మూడింటిలో మొదటిది “ద్రౌపతి మాన సంరక్షణ” పౌరాణిక చిత్రం,  రెండవ చిత్రం “రైతుబిడ్డ” సాంఘిక చిత్రం, ఇక మూడవ చిత్రం “చండిక” జానపద చిత్రం. ఈ మూడు సినిమాల తరువాత బళ్లారి రాఘవ సినిమాలలో నటించడం మానేశారు.

నటరాజ సాయుజ్యం…

బళ్లారి రాఘవ సినిమాలలో మానేశాక కూడా ఆయన నాటక రంగం కొనసాగింది. బళ్లారిలో ఒక నాటక ప్రదర్శనశాలను నిర్మించాలని ఆయన ప్రయత్నం చేశారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆయన మద్రాసు ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి పి.వి.రాజమన్నార్ తో కలిసి “తెగని సమస్య” అనే నాటకం రచించారు. ఈ నాటకాన్ని చాలాసార్లు ప్రదర్శించాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నం చేసినప్పుడల్లా ప్రదర్శన ఆగిపోయింది. అలా ఆగిపోయినప్పుడు బళ్లారి రాఘవలో పట్టుదల మరింత పెరిగిపోయేది. ఎట్టకేలకు “తెగని సమస్య” అనే నాటకం 23 మార్చి 1946 బళ్లారిలోని మ్యాక్స్ స్టేడియంలో ప్రదర్శించారు. నాటక సహా రచయిత మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.వి.రాజమన్నార్ ఈ నాటకాన్ని ప్రదర్శించారు.

ఆ నాటక ప్రదర్శన విజయవంతం అయ్యింది. ఆ నాటక ప్రదర్శనతో ఇన్నాళ్ల నా వాంఛ నెరవేరింది అని బళ్లారి రాఘవ తన బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇది జరిగిన రెండు వారాలకు బళ్లారి రాఘవ ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆయనకు వెక్కిళ్లు ఆగకుండా  వస్తుండేవి. ఆయన మధ్య మధ్యలో స్పృహ తప్పడం, మతిస్థిమితం కోల్పోవడం జరిగేవి. ఆయన కోలుకోవడం అసంభవం అని వైద్యులు చెప్పారు. అలాంటి సందర్భంలో కూడా ఆయనను పరామర్శించడానికి వచ్చిన మిత్రులతో నాటకాల గురించే ఎక్కువగా మాట్లాడుతుండేవారు. ఆ రోజు 16 ఏప్రిల్ 1946 నిండు పున్నమి. ఆ రోజు హంపి క్షేత్రంలో విరూపాక్షుడి రథోత్సవం జరుగుతుంది. అదే బళ్లారి రాఘవ జీవితంలో ఆఖరి రోజు. ఆ రాత్రి 11 గంటలకు బళ్ళారి తాడిపత్రి రాఘవచార్యులు చివరి శ్వాస విడిచారు. నాటక రంగంలో తనదైన ముద్రవేసిన బళ్లారి రాఘవ నటరాజ సాయుజ్యం పొందారు. ఆయన నాటక బృందంలోని సభ్యులు ఆయన అంతిమయాత్రలో ఆయన మృతదేహానికి గొడుగు పట్టారు. అది ఆయన సంపాదించుకున్న గౌరవానికి ఒక చిన్న ఉదాహరణ. 

ఆచార్య ఆత్రేయ వ్రాసిన కవిత..

బళ్లారి రాఘవను స్మరిస్తూ ఆచార్య ఆత్రేయ ఒక కవిత వ్రాశారు. ఆయన వ్రాసిన కవిత జమీన్ రైతు పత్రికలో ముద్రించబడింది.

“తొలుత తూర్పున క్రొంగొత్త కళను రేపి

విజయయాత్రను పశ్చిమ వీధిలోన

అరుణ కేతనమెత్తిన ఆంధ్ర నాట్య

రంగమార్తాండ మూర్తి మా రాఘవుండు.

దినదినానికి దిగజారి దిక్కులేక

పాడుబడుతున్న కళగాంచి

ఆంధ్రులారా మేల్కొనండి  అని అరిచినాడు.

వినని జాతిని విడి నేడు వెడలినాడు.

నాటక కళాప్రపూర్ణ ఏనాటికేమి

నీ ఋణము తీర్తుము నిశ్చయమ్ము.

ఆంధ్ర జాతికి నీ వాణి అమరమగును.

నిత్య సమాధి వీధిలో నిద్దుర పొమ్ము”..

@ పుట్టపర్తి నారాయణచార్యులు వ్రాసిన చిరు కవిత

“అవిశాల లోచనాలు,

అనంత భావాల దర్పణాలు,

అనాసిక

అతిలోక సౌందర్యాని కనుప్రవేశిక

అతని వంటి నటకుడు నాడు లేడు

ఇక రాడు,

ఆ జ్యోతికి సర్వ ప్రపంచం నివాళులిచ్చింది

ఆ మరణానికి కాలమే నిట్టూర్చింది”.

Show More
Back to top button