అత్తగారు రెండు రకాలు. ఒకరు సౌమ్యం, రెండో వారు గయ్యాలి. మాములుగానే అత్తగారు కోడలు మీద పెత్తనం చెలాయిస్తుంది. ఆ పెత్తనం పెడసరం అయితే గయ్యాలితనం క్రింద మారుతుంది. గయ్యాలితనం అంటే రాసిరంపాన పెట్టడం. నిజానికి అత్తగారు కోడల్ని బాధపెడుతూ ఉంటే చూసే వాళ్లకు కోడలు మీద జాలి, అత్త మీద కోపం కలగాలి. కానీ ఈ సినిమా అత్తగారు మాత్రం నవ్వు తెప్పిస్తారు. అలా గయ్యాళి అత్త పాత్ర ద్వారా తెలుగు వెండితెరపై నవ్వులు తెప్పించగల ఆ తార పేరు సూర్యకాంతం. “సూర్యకాంతం” పేరు చెబితేచాలు ఉభయ రాష్ట్రాల ఆంధ్ర దేశపు కోడళ్లకు ఓ పీడకల.
సుమారు అరవై యేండ్ల నుండి రాష్ట్రంలోని ఏ తల్లిదండ్రులు కూడా తమ కూతురికి ఆ పేరు పెట్టడానికి సాహసించరు. ఒక స్త్రీ బహిరంగంగా వాదిస్తే, వెంటనే ఆమె “సూర్యకాంతం” అని ముద్ర వేయబడుతుంది. అత్తకి మరో పేరు సూర్యకాంతం. మామూలు మాటల్లో ఎవరైనా అత్తల గురించి మాట్లాడినప్పుడు అమ్మో ఆవిడ అత్తగారు అచ్చు “సూర్యకాంతమే” అని చెప్పుకోవడం వింటూనే ఉంటాం. అలాంటి పేరుప్రఖ్యాతులు ఆవిడ సంపాదించారు. ఆమె వందల సినిమాలలో అత్త వేషం వేసి ఎడమ చేయి విసురుతూ ధుమధుమలాడుతూ నటించినా కూడా ప్రేక్షకులలో విసుగు కనిపించకపోవడం ఒక విశేషం. ఒకే రకమైన పాత్రని దాదాపు అన్ని చిత్రాలలో నటిస్తూ అన్ని పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఏకైక నటి సూర్యకాంతం మాత్రమే.
సూర్యకాంతం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో గల వెంకట కృష్ణరాయపురంలో జన్మించారు. అమ్మ నాన్నలకు ఆమె 14వ సంతానం కానీ వారిలో పది మంది పిల్లలు మరణించారు. ఆరేళ్ల వయస్సులోనే ఆవిడ పాటలు పాడడం, నృత్యం చేయడం నేర్చుకున్నారు. ఆమె బాల్యంలో పెరిగే క్రమంలో హిందీ సినిమా పోస్టర్లు ఆమెను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాలలో నటించాలనే కోరిక ఆమెను మద్రాసు చేరేలా చేసింది. ఆమెకు జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ (1946) లో నృత్యకారిణిగా అవకాశం వచ్చింది. ఆ సమయంలో నెలవారీ వేతనం 65 రూపాయలు ఇవ్వబోతే సూర్యకాంతం నిర్మాత మరియు ఇతర యూనిట్ సభ్యులతో పోరాడి 75 రూపాయలకు ఇచ్చేలా చేశారు.
లీలా కుమారి సిఫారసుతో సూర్యకాంతంకు “నారద నారధి” లో సహాయపాత్ర నటిగా అవకాశం వచ్చింది. కానీ చిన్న చిన్న పాత్రలు ఆమెలోని కళాకారిణిని సంతృప్తిపరచలేదు. ఆ తర్వాత “గృహప్రవేశం” సినిమాలో మంచి గుణచిత్ర నటిగా నటించారు. నిజానికి ఆమెకు “సౌధామిని” సినిమాలో కథానాయికగా నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో ఆమె కారు ప్రమాదంతో (సూర్యకాంతం ముఖానికి గాయమైంది) కథానాయిక అవకాశం ఆమె నుండి చేజారిపోయింది. ఆ తరువాత ఆమెకు “సంసారం” లో క్రూరమైన అత్తగారి పాత్రను పోషించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆ తరువాత ఆవిడ వెనుదిరిగి చూసుకోలేదు. ఒకరకంగా చెప్పాలంటే దేవుడు ఆమెకు నిజంగా విలువైనదే నిర్ణయించాడు.
సూర్యకాంతం సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి. వెండితెరపై ఆమె సుమారు ఐదు దశాబ్దాల పాటు నటిగా తనదైన ముద్రవేశారు. అప్పటి ప్రేక్షకులు ఆమెను చూసినా ఆమె స్వరం విన్నా పగలబడి నవ్వేవారు. ముక్కు, కళ్ళు, నోరు వంకర్లు తిప్పుతూ కోతి చేష్టలు లాంటివి చేస్తూ ఆమె హాస్యం పలికించేది కాదు. కేవలం సంభాషణా చాతుర్యమే ఆమె వందలాది సినిమాలకు సాక్ష్యం. అందువలననే ఆవిడ అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. చిత్ర పరిశ్రమలో దగ్గర వాళ్ళని వరుసలు పెట్టి పిలవడం అలవాటుగా ఉన్న ఆ రోజులలో చిత్తూరు వి. నాగయ్య ను నాన్నగారు అని, నందమూరి తారకరామారావును అన్నగారు అని పిలుస్తుండేవారు. అదే వరుసలో సూర్యకాంతంను అత్తగారు అని ఎవ్వరూ పిలిచేవారు కాదు. అలా పిలవాలంటే చాలామందికి భయం. అందుకే ఆమె చాలామందికి అక్కగారు, కొందరికి దొడ్డమ్మ గారు.
రేలంగి – సూర్యకాంతం, యస్వీ రంగారావు – సూర్యకాంతం, రమణారెడ్డి – సూర్యకాంతం కలయిక సినిమాలలో ఉంటే చాలు ఆ సినిమాలలో నవ్వుల పంటనే. అందుకే అలనాటి నిర్మాతలు కథాచర్చలు జరుగుతున్నప్పుడు సూర్యకాంతం పాత్ర ఉన్నదా లేదా అని వెతికేవారు. సూర్యకాంతం మీ చిత్రంలో ఉన్నదా అని ప్రేక్షకులు అడిగినట్లుగా డిస్ట్రిబ్యూటర్లు కూడా నిర్మాతలను అడిగేవారు. అంతటి గొప్ప నటులు సూర్యకాంతం. ఆమె తుదిశ్వాస వరకు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఆవిడే గనుక బ్రతికుంటే ఇంకా ఎన్ని సినిమాలు చేసుండేవారో. ఆవిడ తన డెబ్భై యేండ్ల వయస్సులో 1994 వ సంవత్సరంలో కన్నుమూశారు. ఈ 28 అక్టోబరు 1924 లో జన్మించిన సూర్యకాంతం 28 అక్టోబరు 2024 నాటికి ఆమె శత జయంతిని జరుపుకుని వందో ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె చేష్టలతో నవ్వులు తెప్పించిన కొన్ని సన్నివేశాలను మనం గుర్తుచేసుకుందాం.
ఫిల్మ్ తినడం లేదుగా…
సూర్యకాంతాన్ని హాస్యనటిగా ముద్ర వేయడానికి వీల్లేదు. సహాయనటి లేదా గుణచిత్ర నటి అని అనాలి. అయితే ఈ “తెర గయ్యాలి”, తెర వెనుక చాలా సౌమ్యురాలు. ఆమె తన చక్కటి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేవారు. పండగలు, పబ్బాలు వస్తే సినిమా చిత్రీకరణకు తినుబండారాలు తీసుకువచ్చి చిన్న – పెద్ద అనే తేడా లేకుండా అందరికీ పంచిపెట్టేవారు. అందులో పనిచేసే క్రిందిస్థాయి కూలీలకు కట్నాలు కూడా పెట్టేవారు. ఆమె చిత్రీకరణలో ఉంటే సందడే సందడి. సరదాగా జోకులు వేయడం చేయడం సరే సరి. చిత్రీకరణ సెట్ లో “సూర్యకాంతం”, “ఛాయాదేవి” లు గనుక ఉంటే వివాహ భోజనంబులే. వారు ఇరువురు పోటీలు పడీ మరి తెప్పించుకుని తింటూ ఉండేవారు. అలా ఓసారి వారు తింటున్నది చూసిన రేలంగి “ఏం తింటారు రా బాబు” అని విసుకున్నారు. అది విన్న సూర్యకాంతం “మేము తెప్పించుకుంటాం, తింటాం. ఫిల్మ్ తినడం లేదుగా అనేశారు. అయితే నాకు కూడా పెట్టండి అంటూ ఆ నవ్వుల రాజా రేలంగి చెయ్యి చాచారు.
హడలిపోయిన పాత్రికేయులు…
ఒకసారి ఒక పాత్రికేయుడు సూర్యకాంతంను సంప్రదించి దీపావళికి ప్రత్యేక సంచిక తెస్తున్నామని దానికి ఏదైనా ఇంటర్వ్యూకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సరే చూద్దాం లే అన్నారామె. ఆ ప్రత్యేక సంచిక యొక్క విశేషాలను ముందు సంచికలో వేస్తూ “సూర్యకాంతం” తో ప్రత్యేక ఇంటర్వ్యూ అని వేశారు. అది చూసిన ఆ పాత్రికేయుడిని సౌమ్యంగా ఆమె తన ఇంటికి పిలిపించారు. వచ్చిన తరువాత అతడిని ఝాడించేశారు. నేను చూద్దామన్నాను గానీ ఇంటర్వ్యూ ఇస్తాను అని అన్నానా? ఎందుకు ఇలా ప్రచురించారు అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ పాత్రికేయుడితో వచ్చిన మరొక పాత్రికేయుడు కూడా హాడలిపోయారు. దాంతో వారు జరిగిన పొరపాటుకు క్షమించమన్నారు. వారు బిక్క మొహాలు పెట్టి చూశారు. ఏడుపు మొహాలు పెట్టబోయే ఆ సమయంలో ఆమె నవ్వుతూ “ఊరికే అన్నా నాయనా. మిమ్మల్ని భయపెట్టాలని సరదాగా ఒక చిన్న జోక్ చేశాను”. రండి ఇంటర్వ్యూకి కూర్చుందాం అని కాఫీలు తెప్పించారు. ఆ సన్నివేశానికి సరిపడా వేడివేడి కాఫీ త్రాగిన వారు, శీతల పానీయాలు (కూల్ డ్రింక్స్) త్రాగినట్టు చల్లబడ్డారు. ఇలాంటి ప్రయోగాత్మక హాస్యాలంటే ఆమెకు భలే సరదా.
తన ముందే కారు బాగుచేయాలి…
సూర్యకాంతం గుణానికి సౌమ్యురాలు అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఆమె కాస్త కటువుగానే వ్యవహారించేవారు. ఆమె చాలా కఠినంగా ఉండేవారు. ఆమె నికార్సైన మనిషి, అమాయకురాలు కాదు, అలాగే అందరినీ నమ్మేవారు కాదు. నమ్మనివాళ్ళను ఆవిడ దూరంగా నిలబెట్టేవారు. తన కారు పాడయితే దానిని బాగుచేయడానికి వచ్చిన పరికర కర్త (మెకానిక్) ఆమె ఇంటికి వచ్చి ఏ విభాగం పాడైపోయిందో, అది ఎందుకు పాడైపోయిందో ఆమెకు చెప్పాలి. దానిని కొనుక్కొచ్చి తన ఎదుటనే దానిని మార్చాలి. అంత కచ్చితంగా ఆమె వ్యవహరించేవారు. అలాగే ఆమె అవసరమైన వాళ్ళకి మాత్రమే ఆర్థిక సాయం చేసేవారు. అంతేగానీ అనవసరమైన అపాత్ర దానము అనిపిస్తే మాత్రం తన చేతినుండి పూచికపుల్ల విదిల్చేవారు కాదు. తనకు రావలసిన పారితోషికాన్ని అడగవలసిన నిర్మాతల దగ్గర నుంచి గట్టిగా అడిగేవారు. నమ్మకం గల నిర్మాతలను తన పారితోషికం గురించి ఆమె ఏనాడూ అడిగేవారు కాదు.
దర్శక నిర్మాతలంటే భయం, భక్తి…
“ఒక పాత్రను తల వెనుక భాగం కనిపించేలా నిలబెట్టి, ఎదుటి పాత్ర సంభాషణలను తీసుకుంటారు”. వాటిని సినిమాలలో “సజెషన్ షార్ట్స్” అనేవారు. ఒక దర్శకుడు అమ్మా మీ సజెషన్ తో షార్ట్స్ తీసుకుంటాను అంటే, ఓహో నా సజెషన్స్ తో మీరు షార్ట్స్ కూడా తీస్తారన్నమాట అని ఆవిడ చమత్కరించారు. జోకులు, చమత్కారాలు ఎలా ఉన్నా కానీ దర్శకులన్నా, నిర్మాతలన్నా గానీ సూర్యకాంతంకు భయం, భక్తి ఉండేది. దుక్కిపాటి మధుసూదన రావు అన్నా, చక్రపాణి అన్నా ఆమెకు విపరీతమైన భక్తి, భయం.
ఓసారి సినిమా చిత్రీకరణలో పాటకు సంబంధించిన చిత్రీకరణ చేయబోతూ “సైలెన్స్ అవుట్ సైడ్” అని మేనేజరు గట్టిగా అరిచాడు. ఆయన అరుపుకు సూర్యకాంతం “ఓ..” అని అరిచారు. అమ్మా అమ్మా సైలెన్స్ అమ్మా అన్నాడు అతను దీనంగా. దానికి సూర్యకాంతం “నువ్వు సైలెన్స్ అవుట్ సైడ్ అన్నావు” కదా. నేను లోపల ఉన్న దానిని గనుక అరిచాను అన్నారు సూర్యకాంతం పిల్ల చేష్టలు చేసి చిరునవ్వు నవ్వుతూ.
అదనంగా ఏదైనా ఇప్పించండి…
చిత్రీకరణ సమయంలో దృశ్యంలోని సంభాషణలను సొంతం చేసుకుని చెప్పడం సూర్యకాంతంకు అలవాటు. సంభాషణలు సహజంగా ఉండాలంటే ఉన్న సంభాషణలను ఏమాత్రం మార్చకుండా వీలైనంత వరకు సొంతం చేసుకుంటాను అని ఆవిడ చెప్పేవారు. “శ్రీమంతుడు” చిత్రీకరణలో ఒక పెద్ద షాటులో సూర్యకాంతం తన సంభాషణలు చెప్పడం పూర్తియిపోయినా కూడా ఆమె ఇంకా ఏదో చెబుతూనే ఉన్నారు. దర్శకుడు ప్రత్యగాత్మ కట్ చెప్పలేదు. చెప్పుకుంటూ వెళ్లి ఒకచోట ఆగారు. అప్పుడు ఆమె కట్ అయ్యారు. దాంతో ఆమె అక్కడి సన్నివేశం “షాటు కట్ చెప్పలేదు” ఏం నాయనా? అని ఆమె దర్శకులు ప్రత్యగాత్మను అడిగారు.
దానికి ఆయన సమాధానంగా మీరు చెబుతున్నారు కదా అని ఊరుకున్నాను అన్నారు ప్రత్యేకంగా నవ్వుతూ. మరి అదనపు సంభాషణలు చెప్పాను కదా, అదనంగా ఏదైనా ఇప్పించండి అని జోక్ చేశారు సూర్యకాంతం. ఇదిలా ఉంటే ఒక చిత్రంలో చిత్తూరు వి.నాగయ్యను తిట్టే దృశ్యం ఒకటి చిత్రీకరణ జరుపుతున్నారు. ఆ సన్నివేశంలో చిత్తూరు వి.నాగయ్యను తిట్టి తిట్టి షార్ట్ కట్ అయిన తరువాత ఆయన కాళ్ళ మీద పడి అపరాధం క్షమించండి అని ఆమె వేడుకున్నారు. దానికి ఆయన “సంభాషణ కదమ్మా. దానికి నువ్వా తిట్టావు? పాత్ర కదా” అని చిత్తూరు వి. నాగయ్య చెప్పినా వినకుండా చెమర్చిన కళ్లు తుడుచుకున్నారావిడ. అది ఆమె సున్నిత హృదయంలోని భక్తికి ఉదాహరణ.
అక్కడ డబ్బులు ఇస్తారు…
బయట సూర్యకాంతం కనిపిస్తే అభిమానులు దూరంగా నిలబడేవారు కానీ ఆమె దగ్గరికి వచ్చేవారు కాదు. దానికి సూర్యకాంతం “ఓసి మీ కడుపులు బంగారం గానూ ఎందుకర్రా అంత భయం”? అని అడిగేవారు సూర్యకాంతం. దానికి బదులుగా “మీరు చేయి విసురుతారేమోనని” అన్నాడు ఆ కుర్రాడు కొంటెగా. ఆ విసురుడంతా సినిమాల్లోనే కదా! “అక్కడ డబ్బులు ఇస్తారు. నువ్వేమి ఇస్తావు? ఇవ్వవు కదా? అందుచేత చేయి విసరను, రాయి విసరను దగ్గరికి రా” అని గదమాయించిన సూర్యకాంతాన్ని, ఆమె పాత్రల్ని ఎవ్వరూ మర్చిపోలేరు.