రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే సోదరుడు, సోదరి మధ్య శత్రుత్వం తీసుకొస్తాను అన్నట్లుగా.. అదే రూపాయి షర్మిల, జగన్ మధ్యకు వచ్చి బంధాన్ని షేర్లు, కోట్ల రూపాయల ఆస్తులుగా తూకం వేసి చిచ్చురేపుతోంది. ఏమి జరిగిందంటే.. వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విభేదాల గురించి మరొకసారి చర్చ మొదలైంది. తాజాగా ఓ కంపెనీలోని వాటాల గురించి వైఎస్ జగన్, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)లో పిటిషన్ వేయడమే ఇందుకు కారణం.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో వాటాల బదిలీకి సంబంధించి ఎన్‌సీఎల్‌టీలో వైఎస్ జగన్, ఆయన భార్య వైఎస్ భారతి పిటిషన్ వేశారు. ఇందులో వైఎస్ జగన్ పిటిషనర్–1గా, ఆయన భార్య వైఎస్ భారతి పిటిషనర్–2గా ఉన్నారు. క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పిటిషనర్–3గా ఉంది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో వైఎస్ జగన్‌కు, ఆయన భార్యకు చెందిన వాటాలను ‘అక్రమంగా’ తన తల్లి వైఎస్ విజయమ్మ పేరు మీదకు బదిలీ చేశారని, ఆ షేర్ల బదిలీని రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు.
వైఎస్ జగన్‌కు ఆయన సోదరి షర్మిలకు మధ్య 2019లో ఆస్తి పంపకాలపై అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటికే ఉన్న కోర్టు వివాదాలు కొలిక్కి వచ్చిన తర్వాత ఆస్తులు, కంపెనీలలో వాటాల బదిలీ జరుగుతుందని పేర్కొన్నారు. 2021 జులై 26న మరో గిఫ్ట్ డీడ్ రాసుకున్నారు. 2019 ఆగస్టు 31న ఇద్దరి మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు మొత్తం 13 ఆస్తుల పంపకాలకు ఇరువురు అంగీకరించారు. జగన్‌పై నమోదైన మనీ లాండరింగ్ కేసులతో పాటు దర్యాప్తు సంస్థల జప్తులో ఉన్న ఆస్తుల వ్యవహారం కొలిక్కి వచ్చిన తర్వాత వీటి పంపకాలు చేసుకోవాలని నిర్ణయించారు. అయితే, 2019 నాటి ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్టు జగన్ రాసిన లేఖపై షర్మిల కూడా స్పందించారు.
తండ్రి బతికున్న సమయంలో ఆయన మనుమలు, మనవరాళ్లు నలుగురికి ఆస్తుల్లో సమాన వాటాలు దక్కాలని నిర్ణయించిన విషయం గుర్తు చేశారు. తనపై ఉన్న ప్రేమ అప్యాయతతో ఆస్తుల పంపకానికి ఒప్పుకుంటున్నట్టు ఎంఓయూలో పేర్కొనడం అర్థ సత్యమేనని షర్మిల ఆరోపించారు. సాక్షి, భారతీ సిమెంట్స్, వంటి సంస్థల్లో మెజార్టీ షేర్లు జగన్ చేతిలో ఉన్నాయని, అతని ఆధిపత్యమే కొనసాగుతోందని గుర్తు చేశారు. బలం ఉందనే ఉద్దేశంతో బలవంతంగా ఎంఓయూని రాసుకున్నట్లు ఆరోపించారు.
వివాదానికి అసలు కారణం వేరే..
జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తి పంపకాల వివాదంలో ఇతరుల ప్రమేయం ఉందని ఇరుపక్షాలు భావిస్తుండటమే సమస్యకు కారణమని వైఎస్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. అన్నా చెల్లెళ్లకు సంబంధించిన వ్యవహారంలో తల్లి మాత్రమే మధ్యవర్తిత్వం వహించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదని, ఇతరుల జోక్యం ఎక్కువ కావడం, ఆస్తులు, డబ్బు, ఆధిపత్యం వ్యవహారంలో జగన్ ఒత్తిళ్లకు లొంగిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే విషయంలో తలెత్తిన స్పర్థలు కూడా ఈ పరిణామాలకు కారణంగా చెబుతున్నారు. సోదరితో తలెత్తిన విభేదాలను సామరస్యంగా పరిష్కరించే అవకాశం ఉన్నా రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసేందుకే ప్రత్యర్థుల సాయంతో వివాదాన్ని సృష్టిస్తున్నారనే అపోహల్ని కొందరు జగన్‌కు కల్పిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.