సరిదే వరలక్ష్మి ( 13 ఆగస్టు 1925 – 22 సెప్టెంబరు 2009 )
తెలుగు సినిమా ప్రారంభ దశలో కథానాయికలు గా నటించిన వారంతా సంగీతంలో అంతో ఇంతో ప్రవేశం కలిగిన వారే. పాటలు, పద్యాలు పాడగల సామర్థ్యం ఉన్నవారికి మాత్రమే అవకాశాలు లభించేవి. వీటన్నిటికీ తోడు చూడ చక్కని రూపం, నటనా సామర్థ్యం కలిగి ఉంటే బంగారానికి తావి అబ్బినట్లు అవుతుంది. సినిమా పాటకు కావాల్సింది జనరంజకత్వం. శ్రావ్యంగా, జనారంజకంగా పాడే వారికి సంగీత ప్రతిభ తోడైతే ఇక చెప్పేదేముంది. ప్రముఖ నటి, గాయని, నిర్మాత యస్.వరలక్ష్మి గారు ఇదే కోవకు చెందినారని చెప్పవచ్చు.
వరలక్ష్మి గారు పేరు వినగానే మనకు బాగా గుర్తొచ్చే పాటలు “రతిరాజా సుందరా, రణరంగ ధీరా (పల్నాటి యుద్ధం), మీర జాలగలడా నా యానతి (శ్రీకృష్ణతులాభారం), పతి రూపము నీయరయా (బాలరాజు), వరాల బేరమయా (శ్రీ వెంకటేశ్వర మహత్యం), తిరుమల తిరుపతి వెంకటేశ్వరా, లీలా కృష్ణా నీ లీలలు, శ్రీదేవిని నీదు దేవేరినీ, వేయి శుభములు కలుగు నీకు వంటి పాటలతో శ్రోతల మనసులు రంజింపచేసి లక్షలాది ప్రేక్షకుల అభిమానం చూరగొన్న సరిదే వరలక్ష్మి గారు గాయనిగా నేటికీ అభిమానుల మనస్సుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.
బాలనటి గా రంగప్రవేశం చేసి కథానాయికగా కొనసాగిన అతి కొద్ది మంది నటీమణుల్లో ఎస్.వరలక్ష్మి గారు ఒకరు. సంగీతాభిమానులకు ఎస్.వరలక్ష్మిగా, స్వరలక్ష్మిగా, సుస్వరలక్ష్మిగా సుపరిచితురాలు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, టి.ఆర్.మహాలింగం వంటి గాయకులతో కలిసి పాడటమే కాకుండా, వారితో కలిసి కచేరీలు చేశారు వరలక్ష్మి గారు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించి తమిళ ప్రేక్షకులతో కూడా అభినందన నీరాజనాలు అందుకున్న నటీమణి వరలక్ష్మి గారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేషన్, బాలకృష్ణ, కమలహాసన్, రజనీకాంత్ వంటి నటులతో నటించారు వరలక్ష్మి గారు.
బాలరాజు చిత్రంలో నటించిన వరలక్ష్మి గారే నాకు స్ఫూర్తి అని సావిత్రి, జమున గార్ల లాంటి కథానాయికలు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. హిట్ పెయిర్ అని పిలిపించుకోవడం అక్కినేని, వరలక్ష్మి జోడీ తోనే మొదలైంది. పాత తరం వాళ్లకు ఇల్లాలు, రైతుబిడ్డ, మాయలోకం, పల్నాటి యుద్ధం, సతీసక్కుబాయి, శ్రీకృష్ణతులాభారం ఇలాంటి చిత్రాలు గుర్తొస్తే, ఆ తర్వాత తరానికి మహామంత్రి తిమ్మరసు, శ్రీకృష్ణార్జునయుద్ధం, ఆస్తులు అంతస్తులు, బొమ్మ బొరుసా, ఉమ్మడి కుటుంబం, శ్రీ వెంకటేశ్వర మహత్యం లాంటి సినిమాలు స్ఫురణకొస్తాయి. ముద్దుల కృష్ణయ్య, నేటి భారతం, దార వీర శూరకర్ణ, చాణక్య చంద్రగుప్త లాంటి చిత్రాలు వరలక్ష్మి గారి జీవితంలో మలిదశ చిత్రాలుగా పరిగణించవచ్చు.
మధుర గాయనిగా, నటిగా, తెలుగు, తమిళ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన స్వరమే యస్.వరలక్ష్మి. నటిగా బాలరాజు, వెంకటేశ్వర మహత్యం, శ్రీకృష్ణార్జునయుద్ధం, సత్య హరిచంద్ర లాంటి ఎన్నో చిత్రాలలో ప్రధాన భూమిక పోషించారు వరలక్ష్మి గారు. సత్యభామ లోని స్వాతిశయం తన లోనే చూడాలి. గాయని గా, కథనాయికగా, గుణ చిత్ర నటి గా, గయ్యాళి అత్తగా తాను కనబరిచిన బహుముఖ ప్రతిభ తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రమయ్యాయి.
@ జీవిత విశేషాలు…
జన్మ నామం : సరిదే వరలక్ష్మి
ఇతర పేర్లు : యస్.వరలక్ష్మి
జననం : 13 ఆగస్టు 1927
స్వస్థలం : జగ్గంపేట, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, భారతదేశం)
తండ్రి : నాలాచలం నాయుడు
వృత్తి : గాయని, నటి
భర్త : ఎ.ఎల్.శ్రీనివాసన్
పిల్లలు : కూతురు నళిని, కుమారుడు గగన్
మరణ కారణం : తీవ్రమైన వెన్నుపోటు
మరణం : 22 సెప్టెంబరు 2009, మద్రాసు, భారతదేశం
@ జననం…
వరలక్ష్మి గారు 13 ఆగస్టు 1927 నాడు కాకినాడ దగ్గర ఉన్న జగ్గంపేట లో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నాడు పుట్టారు. అందుకే అమ్మ నాన్నలు తనకు వరలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. వరలక్ష్మి గారి నాన్న గారి పేరు సరిదె నాలాచలం నాయుడు. ఆయనకు ఆడ పిల్లలంటే అస్సలు నచ్చదు. ముఖ్యంగా వరలక్ష్మి గారంటే మరీనూ. తాను ఎదుట పడితే ఆయన భోజనం కూడా చేసేవారు కాదట. అందుచేత ఆయన భోజనానికి వచ్చే సమయంలో వరలక్ష్మి గారిని వాళ్ళ అమ్మ తనను గదిలో పెట్టి దాచేసేది. నాలాచలం నాయుడు గారు వ్యసనపరుడు, విలాస పురుషుడు. వరలక్ష్మి గారి పెద్దమ్మ గారు తనను నాలుగు సంవత్సరాల వయస్సులో కర్నూలుకు తీసుకెళ్ళి పెంచుకున్నారు. వరలక్ష్మి గారి పెద్ద నాన్న రంగయ్య నాయుడు గారికి వరలక్ష్మి గారంటే వల్లమాలిన ప్రేమ. ఎంతో శ్రద్ధ తీసుకొని తనకు స్వయంగా సంగీతం నేర్పిస్తుండేవారు.
@ సినీ నేపథ్యం…
రంగయ్య నాయుడు గారికి కర్నూలు లో సంగీత వాయిద్యాలు, గ్రామ ఫోన్లు అమ్మే దుకాణం ఉండేది. ఒకనాడు గూడవల్లి రాంబ్రహ్మం గారు ఏదో పని మీద కర్నూలు వచ్చి రంగయ్య నాయుడు గారి షాపులో ఏదో కొనుగొలు చేయాడానికి వచ్చారు. వరలక్ష్మి గారి పెద్ద నాన్న గారు నెమ్మదిగా గూడవల్లి గారిని మాటల్లో దించి వరలక్ష్మి గారిని పిలిపించి పాట పాడించారు. ఇరుగు పొరుగు ఇళ్లలో ఉన్న అమ్మలక్కలు, స్నేహితురాళ్లు తన గొంతు విని పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిని చూసిన ఉత్సాహంలో కృత్తి తర్వాత కృతి ఐదు కృతులు పాడారు వరలక్ష్మి గారు.
అది విన్న రామబ్రహ్మం గారు ఆనందంతో పరవశించిపోయారు. తాను బెజవాడ వెళ్ళిన తర్వాత కబురు పంపుతానని చెప్పి వెళ్లిపోయారు. రెండు నెలల తర్వాత గూడవల్లి గారి నుండి పిలుపు వచ్చింది. వరలక్ష్మి గారు గుర్రపు బండి ఎక్కుతుంటే ఇరుగు పొరుగు వాళ్లంతా వచ్చి సాగనంపారు. ముందుగా బెజవాడ వెళ్లిన వరలక్ష్మి గారు గూడవల్లి రామబ్రహ్మం గారితో కలిసి మద్రాసు వచ్చిన తాను గూడవల్లి గారు దర్శకత్వం వహించిన “బాలయోగిని (1937)” సినిమాలో ఒక నౌకరు కుమార్తెగా నటించారు. అలా తొలిసారి గా బాలనటిగా రంగ ప్రవేశం చేశారు.
@ గూడవల్లి రామబ్రహ్మం గారితో అనుబంధం…
వరలక్ష్మి గారిని బాల నటిగా పరిచయం చేసింది గూడవల్లి గారే. అలాగే తనని కథనాయికగా కూడా పరిచయం చేసింది కూడా గూడవల్లి గారే. బాలయోగిని (1937) నిర్మాణ సమయంలో యస్.వరలక్ష్మి గారి వయస్సు సుమారు తొమ్మిది సంవత్సరాలు. చిన్నపిల్ల కావడంతో గూడవల్లి రామ బ్రహ్మంగారితో చనువు ఏర్పడింది. చక్రాలాంటి కళ్ళు తిప్పుకుంటూ, చిలక పలుకులతో ఆడుకుంటూ ఎప్పుడు రామబ్రహ్మం గారి పక్కన కూర్చునేవారు. ఆ తర్వాత రామబ్రహ్మం గారు తీసిన రైతుబిడ్డ (1939) లో పి.సూరిబాబు కూతురుగా నటించారు. “అపవాదు” లో నటించే నాటికి తన వయస్సు 12 ఏళ్లు.
సాధారణంగా 12 నుండి 15 ఏళ్ళ లోపు వారు ఆట పిల్లలు కాదు, ఇటు పెద్దవాళ్ళు కాదు. అందువల్ల తాను మూడేళ్లు సినిమాలలో నటించలేదు. దీంతో తన సినిమా జీవితమే సమాప్తమైనట్టు భావించారు. వరలక్ష్మి గారు రేడియో లో పాడిన పాటలు విన్న గూడవల్లి గారు అప్పటికే తాను తీస్తున్న మాయలోకం (1945) లో అక్కినేని నాగేశ్వరరావు సరసన నటించే అవకాశం ఇచ్చారు. దాంతో మొదటిసారి కథనాయికగా మాయలోకం సినిమాలో నటించేశారు. తరువాత రామబ్రహ్మం గారి “పల్నాటి యుద్ధం” లో నటించారు. వరలక్ష్మి గారికి తెలుగులో బాగా పేరు తెచ్చిన చిత్రం బాలరాజు (1948). బాలరాజుగా అక్కినేని నాగేశ్వరావు గారు నటించిన ఈ చిత్రం లో వరలక్ష్మి గారు కథానాయిక. ఈ చిత్రం బ్రహ్మాండమైన విజయం సాధించింది.
@ తొలి రజతోత్సవ చిత్రం “బాలరాజు”..
ఘంటసాల బలరామయ్య గారి దర్శక, నిర్మాణం లో అక్కినేని నాగేశ్వరావు, యస్.వరలక్ష్మి గార్ల కలయికలో వచ్చిన “బాలరాజు” (1948) చిత్రం తెలుగు సినిమా మార్కెట్ స్థాయి ఏంటో తొలిసారి చూపించి అనూహ్యమైన సంచలనాన్ని రేపింది. అప్పటి వరకూ మూడు పదుల వయసు దాటిన కథానాయకుల చిత్రాలే ఎక్కువగా వచ్చాయి. అంతా ఓ సంప్రదాయ పద్ధతిలో వెళ్లే కథలే. “బాలరాజు” ఆ ధోరణికి తెరదించింది. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు, కస్తూరి శివరావు గార్ల సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. తెలుగులో మొదటి రజతోత్సవ చిత్రం కూడా ఇదే. ఈ సినిమాలో 20 పాటలున్నాయి.
అందులో వరలక్ష్మి గారు “ఎవరినే …నేనెవరినే”, “నీకు నీవారు లేరు”, “ఓ బాలరాజా”, “వరుణా వరుణా వర్షించగదయ్యా”, “తేలి చూడుము హాయి”, “రాజా రారా – నారాజా రారా”, “రూపము నీయరయాపతి” , “వేరేలేరయా పరమేశా”, “చాలు వగలు” లాంటి పాటలు ఆలపించారు. అక్కినేని గారికి తొలిసారి నేపథ్యగానం చేసే అవకాశం ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి ఈ సినిమాతోనే దక్కింది. వీళ్లిద్దరూ మద్రాసులో ఒకే గదిలో ఉండేవారు. అప్పట్లో చిన్న కేంద్రాలైన మదనపల్లి, ప్రొద్దుటూరుల్లో కూడా రజతోత్సవాలు జరిగాయి. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారిని చూసి పొడుగాటి జుట్టుని పెంచిన మగాళ్లెందరో? ఆ కేశాలంకరణ, మీసకట్టు “బాలరాజు స్టైల్”గా పేరొందాయి.
ఆ తర్వాత వరలక్ష్మి గారు టింగు రంగా (1952), కోడరికం (1953) మొదలైన చిత్రాలలో నటిస్తూ పాటలు పాడారు. కోడరీకంలో నటిస్తున్నప్పుడే వరలక్ష్మి గారికి సూర్యకాంతం గారితో పరిచయం ఏర్పడింది. కోడరీకంలో శేషమాంబ గారు అత్తగారు, సూర్యకాంతం గారు ఆడపడుచు గాను, వరలక్ష్మి గారు కోడలుగాను నటించారు. అందులో ఒక సన్నివేశంలో అత్తగారు కోడల్ని కొప్పు పట్టుకొని లాగాలి. శేషమాంబ గారు వరలక్ష్మి గారి కొప్పు గట్టిగా లాగేశారు. దాంతో నొప్పిని తట్టుకోలేక వరలక్ష్మి గారు చిత్రీకరణకు రానని ఇంటికి వెళ్లిపోయారు.
మర్నాడు ఆడపడుచుగా సూర్యకాంతం ఆ సన్నివేశంలో కొప్పు పట్టుకునే పాత్ర చేశారు. అపుడు సూర్యకాంతం ఊరికినే కొప్పు మీద చేయి వేస్తానమ్మా, నీవు చేయి విదిలించుకో నువ్వు ఎంత విదిలించుకుంటే నేనంత గట్టిగా లాగినట్టు అని వరలక్ష్మి గారితో చెప్పి నటింపజేసింది. ఆ విధంగా గయ్యాళి పాత్రలని సున్నితంగా ఎలా నటించవచ్చో సూర్యకాంతం గారి దగ్గర తెలుసుకున్నారు వరలక్ష్మి గారు. ఈ పద్ధతి తర్వాత తాను అత్త వేషాలు వేసేటప్పుడు సహాయపడింది అని చాలా సందర్భాలలో వరలక్ష్మి గారు చెప్పుకొచ్చారు.
@ కథనాయికగా అఖరు చిత్రం “సత్యహరిశ్చంద్ర “..
వరలక్ష్మి గారు ఎక్కువగా శ్రీ రాజరాజేశ్వరి వారి చిత్రాల్లోనే నటించారు. సతీ సక్కుబాయి (1954), శ్రీకృష్ణ తులాభారం (1955), నాగపంచమి (1956) ఇలా అన్ని కన్నాంబ గారి నిర్మాణంలోనే నటించారు. శ్రీకృష్ణ తులాభారంలో తాను సత్యభామ పాత్ర పోషించారు. తాను పాడిన “మీర జాలగలడా” అనే పాట తనకు బాగా పేరు తెచ్చి పెట్టింది. చిత్రం కూడా శతదినోత్సవం జరుపుకుంది. పద్మశ్రీ పుల్లయ్య గారు తీసిన “శ్రీ వెంకటేశ్వర మహత్యం” (1960) లో శ్రీ మహాలక్ష్మి గా నటించారు. వరలక్ష్మి గారు, సావిత్రి గారు, గుమ్మడి గారు, పి.శాంత కుమారి గారు, ఎన్టీ రామారావు గారు ఇలా చాలా మంది నటించారు.
కే.వీ.రెడ్డి గారు స్వయంగా నిర్మించిన శ్రీకృష్ణార్జునయుద్ధం (1963) లో వరలక్ష్మి గారికి సత్యభామ పాత్ర ఇచ్చారు. ఇందులో కృష్ణుడుగా ఎన్టీ రామారావు గారు. ఈ చిత్రంలో శ్రీకృష్ణుని సత్య కాలితో తన్నే సన్నివేశం లో రామారావు గారు ఏమనుకుంటారో అని వరలక్ష్మి గారు భయపడ్డారు. అప్పుడు రామారావు గారు చొరవ తీసుకుని ఇది సినిమా కదా, మీరు చూడాల్సిన నన్ను కాదు నాలోని కృష్ణుడిని. మీరు సత్యభామ అంతే గాని మరొకటి కాదు అని చెప్పారు. వరలక్ష్మి గారు తెర మీద సన్నివేశం బాగానే పండించారు. తాను కథనాయికగా నటించిన ఆఖరి చిత్రం విజయా వారి “సత్య హరిచంద్ర” (1965). రామారావు గారు హరిశ్చంద్రుడు, వరలక్ష్మి గారు చంద్రమతి గా నటించారు.
@ గుణ చిత్ర నటి గా…
కథనాయికగా సినిమాలు ఆపేసిన వరలక్ష్మి గారు గుణచిత్ర నటిగా చాలా సినిమాలు చేశారు. ఉమ్మడి కుటుంబం (1967), దానవీరశూరకర్ణ (1977), చాణక్య చంద్రగుప్త ఇలా రామారావు గారు తాను తీసిన సినిమాల్లో దాదాపు అన్నింట్లో వరలక్ష్మి గారికి పాత్రలు ఇచ్చేవారు. కృష్ణ, శోభన్ బాబు, మురళీమోహన్, చిరంజీవి, బాలకృష్ణ వంటి కథనాయకులతో కూడా నటించారు. వరలక్ష్మి గారి నటన అంటే విపరీతంగా ఇష్టపడే టి.కృష్ణ గారు తన చిత్రం “నేటి భారతం” (1983) లో నటింపజేశారు.తెలుగులో తన చివరి చిత్రం “ముద్దుల కృష్ణయ్య” (1986). గొల్లపూడి మారుతి రావు గారి సరసన నటించారు. అందులో బాలకృష్ణ గారికి అత్తగా నటించి ఒక పద్యం కూడా పాడారు. ఆ తర్వాత తాను సినిమాలలో నటించలేదు.
@ నిర్మాత గా వరలక్ష్మి…
వరలక్ష్మి గారు కన్నాంబ గారి ప్రోత్సహంతో నిర్మాతగా మారి “వరలక్ష్మి పిక్చర్స్” ప్రారంభించి తొలిసారిగా “సతీసావిత్రి” (1957) నిర్మించారు. ఈ చిత్రం తోనే మంగళపల్లి బాలమురళీకృష్ణ గారిని చిత్ర రంగానికి పరిచయం చేసిన ఘనత వరలక్ష్మి గారిదే. (తాను కొంతకాలం బాలమురళీకృష్ణ గారి వద్ద యువత శాస్త్రీయ సంగీత సాధన కూడా చేశారు). ఈ చిత్రానికి ఎనిమిది మంది సంగీత దర్శకులు పనిచేయడం ఈ సినిమా యొక్క విశేషం. వాళ్ళందరితో చక్కని వరసలు చేయించారు. ఇందులో వైదేహితో కలిసి పాడిన “నమ్మితినే జననీ” అనే రాగమాలిక గనుక వింటే చెవులకు పట్టిన తుప్పు వదిలిపోతుంది. గూడవల్లి రామబ్రహ్మం గారికి వరలక్ష్మి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. తాను తీసిన “పల్నాటి యుద్ధం” లో మాంచాల పాత్ర చాలా తక్కువ నడివిగలదని “మగువ మాంచాల” పేరుతో ఒక సినిమా తీయాలి అనుకున్నారు. కానీ గూడవల్లి గారి అకాలమరణంతో ఆ సినిమా తెరమీదకి రాలేదు.
@ అక్కినేని పెళ్లికి వరలక్ష్మి కచేరి..
వరలక్ష్మి గారికి బాలరాజు (1948) సినిమా తెచ్చి పెట్టిన పేరు ప్రతిష్టలు కారణమేమో కాబోలు శాస్త్రీయ సంగీతాన్ని ఇంకా బాగా నేర్చుకోవాలి అనుకున్నారు. నా చెల్లెలు చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన పాండురంగన్ గారు తనకు గురువు. ఈ సాధన ఫలితంగా కచేరీలు చేసి సంగీత విద్వాంసుల మెప్పు పొందే ప్రతిభ తనకు చేకూరింది. ఆ రోజుల్లోనే తన కచేరీలకు మంచి ఆదరణ ఉండేది. వరలక్ష్మి గారు ఆ సమయంలోనే అక్కినేని నాగేశ్వరరావు గారి పెళ్లికి కచేరి చేశారు. ఒక సందర్భంలో ఏ.పీ.కోమల గారు మాట్లాడుతూ మేము చిన్నతనంలో రేడియోలో పాడేందుకు వెళుతున్నప్పుడు ఎం.ఎల్.వసంతకుమారి, ప్రయాగ నరసింహ శాస్త్రి గార్లు మాతో “సంగీతం ఎలా పాడాలో వరలక్ష్మి పాడుతుంటే చూసి నేర్చుకోండి” అని చెప్పేవారు.
@ వైవాహిక జీవితం…
తమిళ రచయిత కన్నదాసన్ గారి అన్నయ్య ఏ.ఎల్.శ్రీనివాసన్ గారిని వరలక్ష్మి గారు 1952 వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఏ.ఎల్.శ్రీనివాసన్ గారు దర్శకులు, నిర్మాత మరియు పంపిణీదారులు కూడా. వరలక్ష్మి గారి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోయింది. ఏ.ఎల్.శ్రీనివాసన్, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి నళిని, ఒక అబ్బాయి గగన్. నళిని పిల్లలు సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాల్లో ఉన్నారు. కానీ అబ్బాయి గగన్ మాత్రం మానసికంగా ఎదుగుదల లేని స్థితిలో ఉండిపోయారు.
వరలక్ష్మి గారి జీవితానికి ఏదైనా అసంతృప్తి మిగిలి ఉందంటే అది తన కుమారుడి మానసిక స్థితి మాత్రమే. వరలక్ష్మి గారు మరణించే వరకు కూడా తన కుమారుడిని ఒక చిన్న పిల్లాడిలా ఎంతో అపురూపంగా చూసుకున్నారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు నటనలో తనదైన ప్రతిభ చూపిస్తూ భానుమతి గారు వంటి ప్రతిభ కలిగిన గాయనితో పోటీపడుతూ తనదైన శైలిలో పరిశ్రమలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు వరలక్ష్మి గారు.
@ చిత్ర సమాహారం…
★ నటిగా…
బాలయోగిని (1936) (బాలనటిగా)
సేవాసదన్ (1938)
రైతు బిడ్డ (1939)
మాయాలోకం (1945)
పల్నాటి యుద్ధం (1947)
బాలరాజు (1948)
జీవితం (1949)
వాలి సుగ్రీవ (1950)
స్వప్నసుందరి (1950)
సౌదామిని (1950)
సతీ సక్కుబాయి (1954)
ఎత్తిరపరదత్తు (1954)
కనకతార (1956)
సతీ సావిత్రి (1957)
చక్రవర్తి తిరుమగళ్ (1957)
మాంగల్యబలం (1958)
వీరపాండియ కట్టబొమ్మన్ (1959)
శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (1960)
అభిమానం (1960)
మహామంత్రి తిమ్మరుసు (1962)
శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)
లవకుశ (1964)
భబృవాహన (1964)
సత్య హరిశ్చంద్ర (1965)
శ్రీకృష్ణ పాండవీయం (1966)
శ్రీకృష్ణావతారం (1967)
భామా విజయం (1967)
అపూర్వ పిరవైగళ్ (1967)
ఆదర్శ కుటుంబం (1969)
ప్రేమనగర్ (1971)
బొమ్మా బొరుసా (1971)
బాలభారతం (1972)
నథయిల్ ముత్తు (1973)
అభిమానవతి (1975)
గుణ (1992)
మూగకు మాటొస్తే (1980)
కోరుకున్న మొగుడు (1982)
శ్రీరామచంద్రుడు (1989)
★ గాయనిగా…
మాయాలోకం (1945)
పల్నాటి యుద్ధం (1947)
బాలరాజు (1948)
జీవితం (1949)
స్వప్న సుందరి (1950)
సతీ సక్కుబాయి (1954)
మహామంత్రి తిమ్మరుసు (1962)
సత్య హరిశ్చంద్ర (1965)
@ శివైక్యం..
కథానాయికలు జమున, గీతాంజలి అంటే వరలక్ష్మి గారికి చాలా ఇష్టం. జమున గారు ఎప్పుడు మద్రాసు వచ్చినా వరలక్ష్మి గారిని కలిసే వెళ్లేవారు. ఒక్కోసారి వరలక్ష్మి గారిని కలవడం కోసమే జమున గారు మద్రాసు వచ్చేవారు. “నన్ను నేను మరచిపోయి చాలా కాలమైంది. జమున వస్తే నాకు అమృతం తాగినట్లుంటుంది” అని అనేవారు వరలక్ష్మి గారు. “ఈ జీవితంలో నేను ఎవరికైనా ఋణపడ్డాను అంటే ఒక్క “జమున”కే అని అనేవారు.
ఒక వెండి తెర సామ్రాజ్ఞి గా వెలుగొందిన నేపథ్య గాయని ఎస్.వరలక్ష్మి ఒకానొక సమయాన అనుకోకుండా మంచం మీద నుంచి పడినందువల్ల తీవ్రమైన వెన్నుపోటుతో ఆరు నెలలు బాధపడ్డారు. తన 84 వ యేట 22 సెప్టెంబరు 2009 మంగళవారం నాడు రాత్రి చెన్నై మహాలింగపురం లోని తన స్వగృహంలో రాత్రి 11 గం.లకు యస్.వరలక్ష్మి గారు నిశ్శబ్దంగా నిష్క్రమించారు.
అందరికీ తెలుసు మరణం తథ్యమని. ఆత్రేయ గారు చెప్పినట్లు “పోయినోళ్లందరూ మంచోళ్లే, కానీ ఉన్న వాళ్ళందరూ పోయినోళ్ల తీపి గుర్తులే”. సినిమా శైశవ ప్రాయంలో అడుగుపెట్టి జీవితమంతా సినిమాకే ధారపోశారు వరలక్ష్మి గారు. తెలుగు సినిమా భవనపు పునాది రాళ్లలో ఒకరు ఎస్.వరలక్ష్మి గారు. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం.
@ వ్యక్తిగత జీవితం…
యస్.వరలక్ష్మి గారు సాధారణంగా ఎవరిని ఎక్కువ కలిసేవారు కాదు. ఎక్కడికి వెళ్ళేవారు కాదు. పలు విషయాలలో కన్నాంబ గారిని ఆదర్శంగా తీసుకునేవారు. మద్రాసు లోని మహాలింగాపురంలో పెద్ద మేడ లో ఉండేవారు. తాను అప్పుడప్పుడు పి.శాంతకుమారి గారి ఇంటికి తప్ప ఎవ్వరింటికీ పెద్దగా వెళ్ళేవారు కాదు. శాంతకుమారి గారి కూతురు పద్మకు, వరలక్ష్మి గారి కూతురు నళినికి చాలా చక్కటి స్నేహం ఉండేది. ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నా మానసికంగా ఒంటరితనాన్ని అనుభవించేవారు. తన ఒక కుమారుడు మానసికంగా ఎదగలేదు. ఇది తనను నిరంతరం బాధించేది.
తన భర్త ఏ.ఎల్.శ్రీనివాసన్ గారు మరణించిన తర్వాత వరలక్ష్మి గారు చాలా ఆస్తి పోగొట్టుకున్నారు. అయినా తాను చెక్కు చెదరని గుండె నిబ్బరంతో జీవించారు. “కళలకు పరమావధి మానవ హృదయాన్ని క్షణకాలమైనా దైవత్వం వైపు మళ్ళించగలగడం”. వరలక్ష్మి గారు తన పాటలతో ఈ బృహత్కార్యాన్ని సునాయాసంగా చేయగలిగారు. ఆమె పాటలు ఎంతటి నిశి రాత్రులనైనా వెన్నెల రాత్రులు చేయగలవు. ఎప్పటికీ యస్.వరలక్ష్మి గారు స్వరలక్ష్మి నే. తన గాత్రానికి వారసులు లేరు. తన గొంతులోని జిలుగు ఎవరికీ ఇవ్వరు. ఔత్సాహిక గాయనీ, గాయకులు ఎవ్వరూ వరలక్ష్మీ గారి పాటలు ఎన్నుకుని పాడరు. ఎందుకంటే అవి పాడడం అన్యులకు చేతగాని విద్య కాబట్టి.