CINEMAGREAT PERSONALITIESTelugu Cinema

తెలుగు చిత్ర పరిశ్రమలో సుత్తి మెత్తని హాస్యానికి చిరునామా.. సుత్తి వేలు..

కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు ( 7 ఆగస్టు 1947 – 16 సెప్టెంబరు 2012 )

నవ్వు నాలుగు విధాల చేటు అంటారు. కానీ నవ్వు నలభై విధాలా సబబే. మనసు బాగోనప్పుడు, చికాకులో ఉన్నప్పుడు ధ్యాస మళ్లించుకునేందుకు, మనసారా నవ్వుకునేందుకు హాస్యాన్ని వెతుక్కుంటాం. నిజమే హాస్యాన్ని  మించిన  ఔషధం ఉందా? నవరసాల్లో హాస్యం ప్రధానమైంది. అందుకేనేమో అసలు నవ్వని వాడు రోగి. నవ్వటం ఒక భోగం అంటారు జంధ్యాల గారు. మన వాస్తవ జీవితంలో  హాస్యంగా మాట్లాడడం , చెణుకులు, చతురోక్తులు విసరడం వాటికి పడీపడీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వడమో లేదా ముసిముసి నవ్వులు విసరడమో  చేస్తుంటాం.

మనిషి జీవితంలో వచ్చే పలు ఒత్తిడులు, అశాంతి నుండి బయటపడి మనశ్శాంతిగా, ఆనందంగా ఉంచగలిగే సున్నితమైన ఆయుధం హాస్యం అని చెప్పొచ్చు. ఈ హాస్యం ఏ మాత్రం పట్టుతప్పినా అపహాస్యం పాలవుతుంది. అటువంటి హాస్యాన్ని తమ నటనతో, వాచకంతో ఎంతో మంది హాస్య నటులు కస్తూరి శివరావు, చదల వాడ, నల్లరామ్మూర్తి, రమణారెడ్డి, రేలంగి, వంగర, శివరామ కృష్ణయ్య, రాజబాబు, బ్రహ్మానందం, బాబూమోహన్, కోటశ్రీనివాస రావు, సుత్తి వీరభద్ర రావు తదితరులు తమ ప్రత్యేకమైన నటనతో, హాస్యంతో ప్రేక్షకులను నవ్వించగలిగారు. ఆయా సన్నివేశాలను చూసినప్పుడు నవ్వని ప్రేక్షకులు కూడా ఉండరు. అలా ప్రేక్షకులకు నవ్వుకు చిరునామాగా మారిన, హాస్యాన్నేకాదు, బాధను సైతం తన నటనలో పలికించిన వారిలో సుత్తివేలు గారు ఒకరు.

సాధారణంగా తాము నటించిన తొలి చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మలుచుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. ఒక పాత్ర యొక్క వ్యవహారశైలి ద్వారా, పాత్ర తీరుతెన్నును బట్టి ఒక నటుడు పేరు మారిపోవడం, చరిత్రలో ఆ పేరుతోనే మిగిలిపోవడం చాలా విచిత్రమైన విషయం. చిత్ర సీమలో అలాంటి అదృష్టం దక్కిన అరుదైన నటులలో సుత్తివేలు ఒకరు. కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు అనే అసలు పేరుతో ఆయన తెలిసింది చాలా కొద్దిమందికే. వేలెడంత లేవు, ఏమిటి అల్లరి అని చిన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు పిలవడంతో వేలు అనే పేరే ముద్దు పేరుతోనే ప్రసిద్ధమైన వ్యక్తి సుత్తివేలు గారు.

తన్నులు తినకుండా, బూతులు మాట్లాడకుండా, వెకిలి చేష్టలు చేయకుండా, కేవలం పాత్ర వల్ల, నుడికారం వల్ల, నువ్వు తెప్పించి గౌరవప్రదమైన గుర్తింపు పొందిన హాస్య జంటలు పేర్లు చెప్పాల్సి వస్తే కచ్చితంగా సుత్తి వీరభద్రరావు – సుత్తి వేలు పేర్లు చెప్పాల్సిందే. రేలంగి రమణారెడ్డి తర్వాత అలాంటి హాస్య జంట సుత్తి వీరభద్రరావు – సుత్తి వేలు. 

నాలుగు స్తంభాలాట చిత్రంలో సుత్తి కొట్టే పాత్ర సూపర్ హిట్ కావడంతో వేలు పేరు ముందుకు సుత్తి చేరింది. ఆనాటి నుంచి ఆయన సుత్తివేలు అయిపోయారు. సుత్తి వీరభద్ర రావు విషయంలో అదే జరిగింది. అందుకే వీళ్ళిద్దరి కలయిక కోసం ప్రత్యేక పాత్రలు సిద్ధం చేసేవారు దర్శకులు. వీరిరువురు కలిసి 50 సినిమాలు వరకు చేశారు. హాస్యం బాగా పండాలని డబ్బింగ్ కూడా ఇద్దరు కలిసే చెప్పేవారు.

ఈ రోజులలో హాస్య నటులు అంటే నిన్న మొన్న వచ్చిన హీరోల చేత కూడా చెంప పగలగొట్టించుకొని, కాలితో తన్నించుకోవాలి. లేదంటే అరే, ఒరే అనే తిట్లు తినాలి. కానీ సుత్తివేలు గారు అలాంటి కోవకు చెందలేదు. హాస్య నటుడుగా తన స్థానాన్ని తాను నిలబెట్టుకున్నారు. సుత్తి వీరభద్రరావు గారితో కలిసి కొంతకాలం, ఆ తర్వాత తానే సొంత స్వతంత్రంగా ఉనికి పొందారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు

ఇతర పేర్లు  :    సుత్తివేలు

జననం    :   7 ఆగస్టు 1947 

స్వస్థలం   :     భోగిరెడ్డిపల్లి, మచిలీపట్నం మండలం, కృష్ణా జిల్లా

తండ్రి       :    శేషసత్యనారాయణ శర్మ

తల్లి       :      భాస్కరమ్మ

వృత్తి      :    నటుడు, హాస్యనటుడు

భార్య     :    లక్ష్మీరాజ్యం

పిల్లలు    :    కుమార్తెలు శ్రీదేవి, భువనేశ్వరి, కుమారుడు జగన్నాథ ఫణి కుమార్

మరణ కారణం  :   గుండెపోటు

మరణం    :  16 సెప్టెంబరు 2012, మద్రాసు, భారతదేశం

జననం…

సుత్తివేలు గారి అసలు పేరు “కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు”. 1947 లో ఆంధ్రప్రదేశ్ లో గల కృష్ణాజిల్లా లోని భోగిరెడ్డిపల్లి శేషసత్యనారాయణ శర్మ, భాస్కరమ్మ దంపతులకు జన్మించారు. వీరి సంతానంలో సుత్తి వేలు గారు మూడవ వాడు. చిన్నతనంలో సుత్తి వేలు గారు చాలా బక్కపలుచగా ఉండేవారు. విపరీతమైన అల్లరి కూడా చేసేవారు. దాంతో పక్కింటావిడ తనను ఏడిపించడానికి వేలెడంత లేవు నువ్వు అంటూ వేలు వేలు అని పిలవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత తనను అందరూ అలాగే పిలుస్తుండడంతో అదే సుత్తివేలు గారికి ముద్దు పేరుగా స్థిరపడిపోయింది. తనకు చిన్నప్పుడే నాటకాలపై ఆసక్తి ఏర్పడడంతో ఏడేళ్ల వయసున్నప్పుడు మేకప్ వేసుకున్నారు. వేలు తమ ఊర్లో జరిగిన నాటకాలలో నటించేవారు.

క్రమశిక్షణకు మారు పేరు అయిన సుత్తి వేలు గారి తండ్రి ఉపాధ్యాయులు. సుత్తి వేలు గారు డ్రామాలలో నటించడం తన తండ్రి గారికి ఇష్టం ఉండేది కాదు. సుత్తి వేలు ను పిలిచి గట్టిగా చదువుకోమని మందలించేవారు. కానీ నాటకాలు వేయడం సుత్తివేలు గారి సొంత నిర్ణయం. కాబట్టి సుత్తివేలు గారు వినలేదు. అలాగని చదువుని కూడా తాను ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి హైదరాబాదులో చిన్న ఉద్యోగంలో చేరారు. భోగిరెడ్డిపల్లిలో సుత్తి వేలు గారికి అక్క, అన్న, చెల్లి ఉన్నారు. సుత్తివేలు గారు నాటకాలు వేస్తున్నందుకు వాళ్ళ నాన్న గారు కేకలేస్తుంటే, బామ్మ గారు వెనకేసుకొచ్చేదట. తన తాతగారు దానధర్మాలతో ఆస్తంతా పోగొట్టుకున్నారట. అందువల్ల సుత్తివేలు గారు జీవన పోరాటం చేస్తూ, డిగ్రీ పూర్తిచేశారు.

బాల్యం..

చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయని సుత్తివేలు గారు పి.యు.సి చేసి హైదరాబాదులో చిన్న ఉద్యోగంలో చేరారు. అక్కడ కొన్ని రోజులు ఉద్యోగం చేసి, ఆ తర్వాత బాపట్లలో మరో ఉద్యోగం దొరికగానే హైదరాబాదు లో ఉద్యోగం మానేసి బాపట్లకు వచ్చేశారు. కొన్నాళ్ల తరువాత బాపట్ల లో చేసిన ఉద్యోగం వదిలిపెట్టి నాటకాలపై దృష్టిసారించారు. చివరికి విశాఖపట్నం డాక్ యార్డులో పర్మినెంట్ ఉద్యోగం రావడంతో తన మకాం అక్కడికి మార్చేశారు. అప్పటికి కూడా సుత్తివేలు గారు నాటకాలను వదల్లేదు. అలా నాటకాలకు అభిమాన పాత్రుడయ్యారు. నాటకాలలో “అంతా ఇంతే” అనే నాటకం సుత్తివేలు గారికి మంచి పేరు తీసుకొచ్చింది. తాను నటించిన “మనిషి నూతిలో పడితే” అనే నాటకం తిలకించి తనకు చాలామంది అభిమానులు అయ్యారు.

సినీ నేపథ్యం…

నిజానికి నాటకాల తోనే విపరీతమైన పేరు తెచ్చుకున్న సుత్తివేలు గారికి జంధ్యాల గారి చొరువతోనే సినీరంగ ప్రవేశం జరిగిందనే చెప్పాలి. “అంతా ఇంతే” అనే నాటకం వేలుకు మంచి పేరునే తీసుకొచ్చినా కానీ “మనిషి నూతిలో పడితే” అనే నాటకం తరువాత నే అనేకమంది ప్రేక్షకులకు అభిమాన పాత్రులు అయ్యారు. ముఖ్యంగా ఈ నాటకాన్ని జంధ్యాల గారు చూడడం తన సినిమాలో సుత్తివేలు గారికి తన సినిమాలో అవకాశం ఇవ్వడం జరిగిపోయాయి.

తొలి సినిమా ముద్దమందారం..

హాస్య ప్రధాన చిత్రాలకు పెట్టింది పేరు దర్శకులు జంధ్యాల గారు. తాను పరిశీలించి, శోధించి, ప్రత్యేకంగా సుత్తివేలు గారిని ఎంచుకున్నారు. వైజాగ్ నావెల్ డాక్ యార్డ్ లో అసిస్టెంట్ స్టోర్ కీపర్ గా ఉద్యోగం చేస్తూనే నాటకాలు వేస్తుండే సుత్తివేలు గారిని తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా “ముద్దమందారం” తోనే చిత్ర రంగ ప్రవేశానికి ద్వారాలు తెరిపించారు. అందులోసుత్తివేలు గారు వేసింది చిన్న పాత్రనే అయినా అది ఆ తరువాత రోజులలో తనను హాస్య నటుడిగా పేరు ప్రఖ్యాతులు పొందడానికి పూల దారినే పరిచిందని చెప్పాలి. “ముద్దమందారం” సినిమాలో సుత్తివేలు గారికి హోటల్ రిసెప్షన్ పాత్ర ఇచ్చారు జంధ్యాల గారు. అలా ఊహించని విధంగా సుత్తివేలు తన సినీరంగ ప్రవేశం జరిపారు. ఆ తరువాత జంధ్యాల గారు తాను తీసిన “మల్లె పందిరి” చిత్రంలో కూడా నాలుగైదు సన్నివేశాలు ఉన్న పాత్రలో నటించారు.

జంధ్యాల గారితో మరుపురాని అనుబంధం..

వాస్తవానికి జంధ్యాల గారు లేకపోతే సుత్తివేలు గారు లేరు. ఈ విషయం సుత్తివేలు గారే చాలా సందర్భాలలో చెప్పుకున్నారు. జంధ్యాల గారి “చిన్ని కృష్ణుడు” మినహా దాదాపు జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన 20 చిత్రాల్లోనూ సుత్తివేలు గారు నటించారు. జంధ్యాల గారు సుత్తివేలు గారి నటనను ఎలా వాడేశారంటే తన సినిమాల్లో సుత్తివేలు గారు చేసిన పాత్రలు, అన్ని కోణాలు ఇంకెవరూ చేయలేదు కాబోలు.

సుత్తివేలు గారు అనుమానం పెళ్ళాం వేధింపులకు బలైన బలహీనమైన భర్తగా “శ్రీవారికి ప్రేమలేఖ” చిత్రంలో తన నటనకు జేజేలు పలికించుకున్నారు. “వివాహ భోజనంబు” లో వీధిలో పులి ఇంట్లో పిల్లిలా ఉండే హెడ్ కానిస్టేబుల్ అప్పలస్వామి గాను, “బాబాయ్ అబ్బాయ్” చిత్రంలో తాను అసిస్టెంట్ ను పెట్టించుకుని మరీ బి.పి.తగ్గించుకునే ప్రసాదరావు గానూ, “రెండు రెళ్ళు ఆరు” చిత్రంలో సి.ఎస్.ఆర్ గళాన్ని అనుకరించే గిరీశం గాను, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. నిజానికి జంధ్యాల గారి “పడమటి సంధ్యారాగం” చిత్రంలో సుత్తివేలు గారు పెద్ద పాత్రలోనే నటించాలి. కానీ తనకు వెల్లువలా వచ్చిపడ్డ అవకాశాల వలన అనేక చిత్రాలలో నటిస్తూ తీరికలేక పోవడంతో అమెరికా వెళ్ళలేని పరిస్థితి. అందుకే జంధ్యాల గారు తన సెంటిమెంట్ ను కొనసాగిస్తూ సుత్తివేలు తో ఒక చిన్న సన్నివేశంలో నటింపజేశారు.

“ఆహా నా పెళ్లంట” చిత్రం బ్రహ్మానందం గారి నట జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. నిజానికి అందులో బ్రహ్మానందం గారు పోషించిన నత్తి గోవిందం పాత్ర నిజానికి సుత్తివేలు చేయాలి. కానీ తీరిక లేని సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ పాత్ర బ్రహ్మానందం గారిని వరించింది. కానీ పట్టువదలని విక్రమార్కుడు జంధ్యాల గారు మాత్రం సుత్తివేలు గారితో “అఖిల భారత పీనాసి సంఘం” అధ్యక్షుడిగా చిన్న వేషం వేయించారు. “చూపులు కలిసిన శుభవేళ” సినిమా సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంతో చిన్న కొండదొర పాత్ర గల చిన్న వేషంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సుత్తివేలు గారి సినిమా ప్రస్థానంలో అత్యధికంగా పేరు తెచ్చినవి జంధ్యాల గారి సినిమాలే కావడం విశేషం.

“నాలుగు స్తంభాలాట”…

“సిగ్గూ ఎగ్గూ ఉన్న సన్నాసివైతే ఇలా పిల్లల భోజనాల పద్దులో తలనొప్పి బిళ్లల ఖర్చు రాస్తావా? చెప్పు ఎందుకు వచ్చాయివి”. ఇల్లెగిరిపోయేలా అరిచాడు వీరభద్రయ్య.

“అయ్యా.. అవి నేను వేసుకున్న పండయ్య” భయంతో కూడిన వినయం తో కూడిన గౌరవంతో సమాధానం ఇచ్చాడు వేలు.

“చేతులతో పని చేస్తుంటే తలకు, మొలకు నొప్పులేమిటి నీ శ్రార్ధం” మళ్ళీ అరిచాడు వీరభద్రయ్య.

“చేతులతో చేస్తే రాదండయ్యా.. కానీ ఈ మధ్య నా చేతులకంటే చెవులకే పని ఎక్కువైపోయిందండయ్యా.. మీ సుత్తి పుణ్యమా అని” అసహనంగా సమాధానం ఇచ్చాడు వేలు.

40 ఏళ్ల క్రితం వచ్చిన నాలుగు స్తంభాలాట సినిమాలో ఈ సంభాషణలు విని జనాలు నవ్వారు. పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వారు. గుర్తు తెచ్చుకొని మరీ నవ్వారు. ఇంకా నవ్వుతూనే ఉన్నారు. రాబోయే తరాలకు కూడా నవ్వుతారు అందులో సందేహం లేదు. జంధ్యాల గారి దర్శకత్వంలో నరేష్, ప్రదీప్, పూర్ణిమ, తులసి ముఖ్యపాత్రల్లో నటించగా నవతా కృష్ణంరాజు నిర్మించిన 1982 నాటి చలనచిత్రం “నాలుగు స్తంభాలాట”. నలుగురు యువతీయువకుల జీవితంతో ప్రేమ, పెళ్ళిళ్ళతో జీవితం ఆడుకున్న ఆటగా ఈ కథను వ్రాసుకున్నారు జంధ్యాల గారు.

భారమైన ప్రేమకథలో సినిమాల్లో అంతగా అనుభవం లేని నాయిక, నాయకులతో నటింపజేసి జంధ్యాల గారు విజయం సాధించారు. ఇందులో సుత్తి వీరభద్ర రావు, సుత్తి వేలు గార్ల జంట ఎంత ప్రసిద్ధి అంటే ఈ సినిమాతోనే వారిద్దరికీ “సుత్తి జంట” అని పేరొచ్చి, వారి పేర్ల ముందు సుత్తి అనేది ఇంటి పేరు అయిపోయింది. గొప్ప హాస్య సన్నివేశాలు పదేపదే చూడాల్సి వస్తే ఏంట్రా బాబు ఈ సుత్తి అంటాం. కానీ ఈ సుత్తి జంట పండించిన హాస్య సన్నివేశాలను మాత్రం జనాలు పదేపదే చూశారు.

కురుమద్దాలి లక్ష్మీనరసింహా రావు ని “సుత్తివేలు” గా ప్రసిద్ధి చేసిన ఈ “నాలుగు స్తంభాలాట” చిత్రం తో వీరభద్రరావు, సుత్తివేలు గార్లు సుత్తి జంటగా ప్రాచుర్యం పొందారు. దర్శకులు కేవలం వీరికోసమే ప్రత్యేకంగా ప్రాతలు సృష్టించేవారు. వీరిద్దరూ జంటగా సుమారు 50 సినిమాలు చేశారు. వీరభద్ర రావు గారి వద్ద గుమస్తాగా పనిచేస్తూ నసుగుతూ ఉండే పాత్రను సుత్తివేలు పోషించిన తీరు తలుచుకుంటేనే పొట్ట చెక్కలు అవ్వడం ఖాయం.

నాణేనికి రెండో వైపు..

సుత్తి వేలు గారు కేవలం హాస్య పాత్రల్ని మాత్రమే పోషించడమే కాదు, గుండెల్ని పిండేసే పాత్రలు ధరించి స్ఫూర్తిని నింపగల అభ్యుదయ నటులు కూడానూ. తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన దర్శకులు టి.కృష్ణ, ముత్యాల సుబ్బయ్య, వేజెళ్ళ సత్యనారాయణ మొదలైన వారు. హాస్య నటుడిగా తీరిక లేకుండా ఉన్న సుత్తివేలు గారిని గుణ చిత్ర నటుడిని చేసింది వేజెళ్ళ గారే. తన దర్శకత్వంలో వచ్చిన “ఈ పిల్లకు పెళ్లి అవుతుందా”, “ఈ చదువులు మాకొద్దు” సినిమాలతో వేలు గుణ చిత్ర నటుడయ్యారు. ఇక టి.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఆరు చిత్రాలలో సుత్తివేలు గారు గొప్ప పాత్రలు పోషించారు.

వందేమాతరం చిత్రంలో సుత్తివేలు గారి నటనకు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం లభించింది. “ప్రతిఘటన”లో విధి వంచితుడైన మాజీ పోలీస్ కానిస్టేబుల్ శ్రీశైలం గా తన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. “తందనానా బలా తందనానా, గుండాలకే ఓటు” అనే పాటకు సుత్తివేలు గారి అభినయం ఇప్పటికీ కూడా మరువలేము. ముత్యాల సుబ్బయ్య గారి సినిమాల్లో కూడా చెప్పుకోదగ్గ పాత్రలే పోషించారు. “కలికాలం” చిత్రంలో అల్సర్ వ్యాధితో బాధపడుతున్న వృద్ధుని పాత్ర తన సినీ ప్రస్థానంలో చెప్పుకోదగ్గ పాత్రలలో ఒకటి. భరతనారి సినిమాలో అయితే ప్రధాన ప్రతి నాయకులుగా నటించారు.

ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో వచ్చిన చాలా చిత్రాల్లో తండ్రిగా, అన్న గా, మామగా గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. సుత్తి వేలు గారు తన సినీ జీవితంలో 500 పైగా సినిమాల్లో నటించారు. కలెక్టర్ గారి అబ్బాయి, రాము, ఆదిత్య 369, ఒసేయ్ రాములమ్మ, శశిరేఖా పరిణయం, చంటబ్బాయ్, ఖైదీ, ప్రతిఘటన, దొంగమొగుడు, యముడికి మొగుడు, చిట్టెమ్మ మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, చిట్టెమ్మ మొగుడు, సాహస వీరుడు సాగర కన్య, పెళ్లిచేసుకుందాం, ఆ నలుగురు ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో ఆయన నటించారు.

అసిస్టెంట్ గణపతిగా చంటబ్బాయ్..

చంటబ్బాయ్ సినిమాలో చిరంజీవి గారికి అసిస్టెంట్ గా నటించారు సుత్తివేలు గారు. ఆ చిత్రం లో తన పాత్ర పేరు గణపతి. జేమ్స్ బాండ్ పాండుగా నటించిన చిరంజీవి గారిని అడుగడుగునా ఇరకాటంలో పెట్టే పాత్రలో తాను అద్భుతమైన హాస్యం పండించారు. సుహాసిని తో మాట్లాడుతూ ఓ సందర్భంలో చిరంజీవి గారు వేలు గారిని పిలిచి సిగరెట్లు తెమ్మంటాడు. వెంటనే చిరంజీవి గారిని సుత్తివేలు గారు డబ్బులడిగే విధానం ప్రేక్షకులను నవ్వుతో పొట్ట చెక్కలు అయ్యేలా చేస్తుంది. ఇప్పటికి ఆ సన్నివేశం చూస్తే నవ్వని వారు ఉండరంటే అతిశక్తి కాదు.

వందేమాతరం లోని పాత్రకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా, దేవాలయం, గీతాంజలి, మాస్టారు కాపురం చిత్రాల్లోని పాత్రలకు బెస్ట్ కమెడియన్ గా నాలుగు సార్లు నంది పురస్కారాలు వరించాయంటే నటనలో తన గొప్పతనం ఎంతో, తాను ఎంత గొప్ప నటుడో అర్థం చేసుకోవచ్చు. తన ఆఖరి చిత్రం రామాచారి తాను చనిపోయాక విడుదలైంది. నటన నే ప్రేమించి, నటనలో జీవించి, నటిస్తూనే మరణించడం గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తి సుత్తివేలు గారు. అందుకే సుత్తివేలు గారు తెలుగు సినిమా హాస్యానికి చేసిన మేలుని ఇప్పటికి ఎవ్వరూ మర్చిపోలేరు.

వ్యక్తిగత జీవితం…

సుత్తివేలు గారి వివాహము లక్ష్మీరాజ్యం తో జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరికి ముగ్గురు అమ్మాయిలు భువనేశ్వరి, శ్రీదేవి, సత్యవాణి. ఒక అబ్బాయి జగన్నాథ ఫణికుమార్ లు సంతానము. తాను షూటింగ్‌కి వెళ్లేటప్పుడు భార్య లక్ష్మీరాజ్యం క్యారేజీ ఇచ్చేది. అది కనీసం పది మందికి సరిపోయేది. సుత్తివేలు గారు శాకాహారి, పరిమితంగా తినేవారు. పెళ్లయిన కొత్తల్లో విశాఖపట్టణంలో పని చేసేటప్పుడు సుత్తివేలు గారే వంటంతా చేసిపెట్టి వెళ్లిపోయేవారు. అప్పటికి భార్య లక్ష్మీరాజ్యం కు వంటరాదట. సుత్తివేలు గారు పొద్దున్నే పూజ చేసుకునేవారు. సినిమాలలో ఎంత హాస్యంగా కనిపిస్తారో, ఇంట్లో అంత మౌనంగా ఉండేవారు. తనకు సరదా కలిగినప్పుడు తాను తన భార్య లక్ష్మీరాజ్యం తో కలిసి చెస్‌ ఆడేవారు. ఎక్కువసార్లు సుత్తివేలు గారే గెలిచేవారు. తెలుగు భాషను, తెలుగు సంప్రదాయాల్ని ఎక్కువగా ఇష్టపడే సుత్తివేలు గారు ఇంటి దగ్గర తెల్ల పంచెను లుంగీగా కట్టుకునేవారు.

పురస్కారాలు…

★ నంది పురస్కారాలు…

1985 వ సంవత్సరం లో వందేమాతరం చిత్రం లో నటించినందుకు గానూ సుత్తి వేలు గారు ఉత్తమ సహాయ నటుడు గా నంది పురస్కారాన్ని దక్కించుకున్నారు..

దేవాలయం చిత్రం లోని పాత్రకు గానూ 1985 వ సంవత్సరం లో సుత్తి వేలు గారు ఉత్తమ హాస్యనటుడు గా నంది పురస్కారాన్ని అందుకున్నారు.

“గీతాంజలి” చిత్రానికి గానూ 1989 వ సంవత్సరం లో సుత్తి వేలు గారు ఉత్తమ హాస్యనటుడు గా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు.

1990 వ సంవత్సరం లో “మాస్టర్ కాపురం” చిత్రం లో నటనకు గానూ సుత్తి వేలు గారు ఉత్తమ హాస్యనటుడు గా పురస్కారం పొందారు.

మరణం…

గుండె గదుల్లో వేదాంతం, ఒకింత విషాదం, జీవిత విచారం గూడుకట్టుకున్న వారే హాస్యాన్ని అలవోకగా పలికించగలరనడానికి సుత్తివేలు గారిని ఉదాహరణగా చెప్పవచ్చు. 1988 లో సుత్తి వీరభద్ర రావు గారి మరణం  తర్వాత జంధ్యాల గారి జోరు తగ్గడం చిత్ర పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాదుకు మారడంతో సుత్తివేలు గారు హాస్యం పండించడంలో వెనుకబడిపోయారు. ఆ తర్వాత ఆ స్థాయిని అందుకోవడానికి చాలా కష్టపడ్డారు. కానీ మళ్ళీ ఆ వెలుగు రాలేదు. తొలి రోజుల్లో దూరదర్శన్ లో “ఆనందో బ్రాహ్మ” లో ఓ వెలుగు వెలిగిన వేలు, జీవిత చరమాంకంలో తన భార్య ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి లతో సంసారం ఈదడం కోసం టీవీ సీరియల్ లలో కూడా నటించారు.

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుత్తివేలు గారిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్సకు కూడా సహకరించని తన శరీరం గుండెపోటు కు గురయ్యి 16 సెప్టెంబర్ 2012 ఆదివారం తెల్లవారుజామున 3:30 నిముషాల ప్రాంతంలో చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. తనకు ఆంగ్ల రచయిత షేక్స్పియర్ గారు అంటే అభిమానం. మద్రాసులో అంతరంగికులతో కలిసినప్పుడు రాగయుక్తంగా పద్యాలు, పాటలు, ఛలోక్తుల జడివానతో సందర్భాన్ని రసభరితం చేసే సుత్తివేలు గారు “రెండు జెళ్ళ సీత”, “శ్రీవారికి ప్రేమలేఖ”, “ఆనంద భైరవి”, రెండు రెళ్ళు ఆరు”, “సీతారామ కళ్యాణం”, “చంటబ్బాయ్” లాంటి సినిమాలు చూస్తే తాను చిరస్మరణీయం చేసిన మధుర ఘట్టాలెన్నో అగుపిస్తాయి.

Show More
Back to top button