GREAT PERSONALITIESTelugu Politics

‘రాజీవ్ గాంధీ’ పాలన దేశానికే తలమానికం…!

నెహ్రూ కుటుంబం… దేశానికి ముగ్గురు అత్యుత్తమ ప్రధానమంత్రులను అందించింది. తాత(జవహర్ లాల్ నెహ్రూ), కుమార్తె(ఇందిరా గాంధీ), మనవడు(రాజీవ్ గాంధీ)గా మూడు తరాల వరకు భారతదేశ రాజకీయరంగాన్ని సుసంపన్నం చేసింది. తమ మేధస్సును, జీవితాన్ని దేశం కోసం, ప్రజల బాగు కోసం ధారపోసి, ప్రధానమంత్రి త్రయాన్ని దిగ్విజయంగా సాగించారు. ఒక్క రాజరిక వ్యవస్థలో తప్ప… ప్రజాస్వామిక రాజ్యాలలో ఇలాంటి సందర్భాలు చూసి ఎరుగం..

1984 అక్టోబర్ 31న పంజాబ్ ఉగ్రవాదులు శ్రీమతి ఇందిరాగాంధీని ఆమె స్వగృహంలోనే దారుణంగా హత్యగావించారు. ఇందిరాగాంధీ మరణాంతరం తిరిగి ప్రజాభిమానాన్ని పొందేందుకు శ్రీ రాజీవ్ గాంధీ 1984 నవంబర్ 27న పార్లమెంటుకు ఎన్నికలు జరిపించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 415 సీట్లకు పైగా స్థానాలను సంపాదించి అఖండ విజయాన్ని అందుకుంది. ఫలితమే.. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు. రాజకీయ కల్మషాన్ని కడిగివేయగల సమర్ధుడిగా పేరు తెచ్చుకున్నాడు. మితభాషి, వాస్తవిక దృక్పథంతో ఆలోచించే స్వభావం, సంయమనంతో నిర్ణయాలు తీసుకునే నేర్పుగల వ్యక్తిగా భారతదేశ రాజకీయ చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించాడు. 

1947 ఆగస్టు నెల 15న స్వాతంత్య్రం సిద్దించిన నేపథ్యంలో ఆ యోధుల చరిత్రలను స్మరించుకోవాల్సిన ఆవశ్యం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా నేడు భిన్న ప్రాముఖ్యత కలిగిన రాజీవ్ గాంధీ జీవిత, రాజకీయ విశేషాలను ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం:

నేపథ్యం…

1944 ఆగస్టు 20న బొంబాయిలోని షిరోద్కర్ నర్సింగ్ హోమ్ లో జన్మించాడు శ్రీ రాజీవ్ గాంధీ. ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ.. తల్లిదండ్రులు. మొదట రాజీవ్ రత్న అని నామకరణం చేశారు. రాజీవ్ అనగా తామరపువ్వు. తల్లిదండ్రుల పేర్లు కలిసి వచ్చేలా ఈయనకు పేరు పెట్టడం జరిగింది. రెండు సంవత్సరాల తరువాత 1946 డిసెంబర్ 14న సంజయ్ గాంధీ జన్మించాడు. తల్లి ఇందిర పెంపకంలో, తాతగారింట్లో ఎక్కువ కాలం గడిపాడు రాజీవ్… ప్రాథమిక విద్య ఇంటి దగ్గరే పూర్తైంది. బాల్యం నుంచి చిత్రలేఖనంలో ఆసక్తి ఎక్కువ. తర్వాత డెహరాడూన్ వెల్కమ్ స్కూల్లో చేరాడు. చదువులో ఎప్పుడు చురుగ్గా ఉండేవాడు. రాజీవ్ కు తన తాత జవహర్ లాల్ నెహ్రూ పోలికలు ఎక్కువ ఉండేవి. డూన్ స్కూల్లో విద్యాభ్యాసం ముగిశాక, ఇంగ్లడు వెళ్ళి అక్కడ ట్రినిటీ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. అక్కడ ఉండగానే ఇటాలియన్ యువతి అయిన సోనియా మైనాతో స్నేహం కుదిరింది. వేసవి సెలవుల్లో ఫ్లైటింగ్ నేర్చుకున్నాడు. విమానం నడిపే పైలట్ వృత్తిలో స్థిరపడాలనేది రాజీవ్ కల. చివరికి అదే వృత్తిని స్వీకరించాడు. ఆఫ్రో 748 కెప్టెన్ గా తరువాత హెయింగ్ పైలెట్ గా రాజీవ్ వృత్తి బాధ్యతలను నిర్వర్తించాడు. విమానం నడపడం ప్రమాదమని, ఉద్యోగం మానెయ్యమని తల్లి ఇందిరాగాంధీ చెబితే.. విమానం నడపడం తేలిక, కారు నడపడమే కష్టం అని వాదించి, తల్లిని ఒప్పించాడు. అనంతరం, 1968 జనవరిలో తల్లి ఇందిరాగాంధీ ఆశీస్సులతో రాజీవ్, సోనియాలు ఒక్కటయ్యారు. శ్రీమతి సోనియా ఇటలీలో సంపన్న కుటుంబంలో పుట్టింది. రాజీవ్ తో వివాహం జరిగాక, అత్తగారైన శ్రీమతి ఇందిరాగాంధీ కనుసన్నల్లో సోనియా మెలిగింది. భారతీయ వస్త్రధారణకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది, గృహిణిగా ఇంటి పట్టునే ఉంది. వీరిద్దరికి ప్రియాంక, రాహుల్ లు సంతానం. ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ట్రైనీ పైలట్ గా రాజీవ్ చాలాకాలం ఉద్యోగిగా కొనసాగారు.

రాజకీయాల్లోకి… 1980 జనవరి 14 నుంచి 1984 అక్టోబర్ 31వరకు ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉన్నారు. ప్రతిపక్షాలు స్పష్టించిన అరాచక పరిస్థితుల వల్ల దేశంలో ఎమర్జెన్సిని విధించవలసి వచ్చింది. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ ఓడిపోయి, జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజీవ్ గాంధీ తమ్ముడైన సంజయ్ గాంధీ తల్లికి చేదోడువాదోడుగా ఉండేవాడు. యువజన కాంగ్రెస్ లో సంజయ్ ది చురుకైన పాత్ర అని చెప్పాలి. సంజయ్ గాంధీ పంజాబ్ యువతి మేనకను వివాహం చేసుకొన్నాడు. అతి పిన్నవయస్సులో రాజకీయాల్లోకి ప్రవేశించిన సంజయ్ గాంధీ ఆనాటి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1980 జనవరిలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో జనతా ప్రభుత్యం ఓడిపోయి, తిరిగి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ఐ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. 1980 జనవరి 23న నిత్యకార్యక్రమంలో భాగంగా విమానం నడుపుతూ, ఆకాశంలో విహరిస్తూ ఉండగా.. ప్రమాదవశాత్తూ సంజయ్ గాంధీ దుర్మరణం చెందారు. ఇది ఇందిరను ఎంతగానో కుంగదీసింది. ఈ సమయంలో రాజీవ్ తల్లికి చేదోడుగా నిలిచారు. ఆయన వ్యక్తిగతంగా రాజకీయాలంటే సుముఖత చూపేవారు కాదు. సోనియాగాంధీకి సైతం ఇష్టం లేదు. తప్పని అనివార్యమైన పరిస్థితుల్లో 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో… అమేథీ నియోజక వర్గం నుంచి రాజీవ్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. దీంతో ప్రత్యక్షంగా రాజకీయాల్లో భాగమయ్యారు.1981 జూన్ 5న యువజన కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. రెండేళ్లకు, 1983 ఫిబ్రవరి 2న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ ప్రతినిధిగా ఆయన రాష్ట్ర పర్యటన గావించారు. అక్కడి నుంచి ప్రధాని అయ్యేంతవరకు కీలక పదవుల్లో సేవలు అందించారు. 

ఎన్నో కీలకమైన నిర్ణయాలు…

1984 అక్టోబర్ 31న, శ్రీమతి ఇందిరాగాంధీ హత్య చేయబడిన తదుపరి, ఆయన ఎవ్వరిపైనా కక్షసాంధింపు చర్యల్ని చేపట్టలేదు. వీటికి అతీతంగా వ్యవహరించి, దేశ ప్రజల మన్ననల్ని పొందాడు. తల్లి హత్యకు కారణమైన పంజాబ్ సమస్యను పరిష్కరించారు. 1985 సెప్టెంబర్ 28న ఎన్నికలు జరుగగా, ప్రజాస్వామ్య పరిపాలనను అందించారు. రాజీవ్ ను అంతా ‘మిస్టర్ క్లీన్’ అని అంటూ ఉండేవారు. ప్రధానిగా దేశ, విదేశీ సమస్యలను సున్నితంగా పరిష్కరించేవాడు. వర్థమాన దేశాల అభివృద్ధికి ఎంతగానో కృషిచేశాడు. సార్క్ సమావేశాల్లో చురుకుగా పాల్గొని, ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలను నెరిపాడు. మాల్దీవులపై టెర్రరిస్టులు దాడి చేసినప్పుడు, తగినంత సైన్యాన్ని పంపి, టెర్రరిస్టుల బారినుంచి మాల్దీవ్ ప్రజల్ని రక్షించి, ఆ దేశ ప్రధాని మెప్పు పొందాడు.దేశ సమస్యలను రాజీవ్ సునిశితంగా పరిశీలించి, మౌలికమైన నిర్ణయాలు తీసుకొనేవాడు. 

*రోజ్ గార్ పథకం… ఈ పథకాన్ని ప్రవేశపెట్టి, పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నేరుగా నిధులను అందజేసి, గ్రామాలఅభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందించాడు. ఈ పథకం పంచాయితీ వ్యవస్థలోనే కీలకం.అలాగే స్థానిక సంస్థల పునర్నిర్మాణానికి దోహదం చేసే ప్రణాళికను రూపొందించి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించి మొత్తంగా పంచాయతీ, పురపాలక సంస్థలకు కొత్త రూపును సంతరించేలా చేశాడు.

*షాబోనో కేసులో సుప్రీంకోర్టు తీర్పును ముస్లిం పర్సనల్ లా బోర్డు కమిటి తీవ్రంగా వ్యతిరేకించి, ముస్లిం మతవిశ్వాసాలకు విరుద్ధంగా    ఉన్నారంటూ అప్పట్లో పెద్ద అలజడి చెలరేగింది. ఆ సందర్భంలో సెక్యులర్ వ్యవస్థలో ఒక మతం వారి మత విశ్వాసాలను మన్నించడం అవసరమనే భావనతో ఆర్డినెన్స్ రూపంలో రాజీవ్ గాంధీ షాబానో కేసుకు సంబంధించిన సమస్యను సంస్కరణ రూపంలో పరిష్కరించారు. అయితే రాజీవ్ చర్య చాలామంది దృష్టిలో విమర్శకు గురైంది. ఇలాంటిదే రాజస్థాన్ లో జరిగిన సతీసహగమనం సంఘటనలో రాజీవ్ ప్రకటనలు అభ్యుదయవాదులకు, మహిళాసంఘాలకు ఆగ్రహం తెప్పించాయి.  రాజీవ్ హయాంలో కాంగ్రెసు వంద సంవత్సరాల దినోత్సవంను జరుపుకుంది. 1985 డిసెంబరు 28 నాటికి ఈ పార్టీకి 100 సంవత్సరాలు నిండాయి. రాజీవ్ గాంధీ ఈ పార్టీకి అధ్యక్షుడు మాత్రమే కాదు, దేశ ప్రధానమంత్రి కూడా.

నెహ్రూ.. ఇందిరా.. తీరులో రాజీవ్ పాలన… నెహ్రుకాలంలో అప్పటి దేశ సమస్యలు భిన్నం. బ్రిటిషు పాలకులు వైదొలగిన కాలంలో, దేశ ఆర్ధిక పరిస్థితి, విదేశాంగ విధానం తదితర సమస్యలను ఆయన చతురతతో వ్యవహరించి వాటన్నిటిని చక్కదిద్దాడు. ఇప్పుడున్నట్లు టెర్రరిజం, వేర్పాటువాద ధోరణులు, రాజకీయ సంక్షోభాలు అప్పట్లో వుండేవికావు. అందుచేత ప్రధాని నెహ్రూ నాయకత్వం అనేది నల్లేరు మీద నడకలా సాగిందని చెప్పవచ్చు.ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన రోజుల్లో పార్టీ రెండుగా చీలింది. కాంగ్రెస్ సంస్థలో అనైక్యత తారాస్థాయికి చేరింది. గ్రూపులు, ముఠాలతో పాత కాంగ్రెస్ పేర్లతో చీలిపోయింది. అయినప్పటికీ ఇందిరాగాంధీ చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాల అమలు, సామాన్య పేద వర్గాల అభ్యున్నతికి తోడ్పాటును అందివ్వడంతో ఇందిరాగాంధీ కాంగ్రెస్ ను, అసలైన కాంగ్రెస్ గా ప్రజలు గుర్తించి, ఆమెను గెలిపించారు. అప్పటికే నెలకొన్న పార్టీ చీలికలతో దేశం అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంది. మరోవైపు టెర్రరిజం పెరిగింది. ఈ కారణంగా దేశాన్ని సుస్థిరతవైపు తీసుకెళ్లే ప్రయత్నంలో ఆమె ప్రాణాలే కోల్పోయింది.

*రాజీవ్ గాంధీ ప్రధానిగా వచ్చిన రోజు, ఇందిరా గాంధీని హత్య చేసిన రోజు ఒకేరోజు.. అయితే ఇందిరాగాంధీ ఎదుర్కొన్న రాజకీయ సంక్షోభం ఆమెతోనే అంతం కాలేదు సరికదా, రాజీవ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మరింత బలపడింది. తాత్కాలికంగా రాజకీయ సంక్షోభం నుంచి కొంత ఉపశమనం పొందినా, అంతర్గతంగా సంక్షోభం మాత్రం అలానే కొనసాగింది. ఇది మొదలు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో నైతికత, ప్రజాసామ్య విలువలు పూర్తిస్థాయిలో లోపించాయి. పదవీ వ్యామోహం, వ్యక్తిగత స్వార్ధం, ధనకాంక్ష, అవినీతి అంతటా జడలు విప్పుకొని ఉంది. ఓట్లకోసం, గెలుపు కోసం రాజకీయ పార్టీలు అన్ని రకాల విలువల్ని వదులుకొన్నాయి. దేశభవిషత్తు, జాతి మనుగడ వంటి ప్రధానమైన అంశాలను కూడా రాజకీయ ప్రలోభానికి నాయకులు ఉపయోగించుకుంటున్నారు. ఈ తరుణంలో.. రాజకీయ నాయకులనే పావులుగా చేసుకొని దేశద్రోహులు, మాఫియా ముఠాలు, నేరస్థులు, కిరాయి హంతకులు తమ కార్యకలాపాలను విచ్చలవిడిగా సాగిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వీగిపోయింది…

బోఫోర్స్ గొడవను శ్రీ వి.పి. సింగ్ లేవదీశారు. స్విట్జర్లాండ్ నుంచి బోఫోర్స్ శతఘ్నులను కొనుగోలు చేయడంలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందనీ, రాజీవ్ గాంధీ అండదండలతోనే కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారాయని శ్రీ వి.పి. సింగ్ ఆరోపణ చేస్తూ, తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతేకాక మరికొంతమంది అనుచరులతో కాంగ్రెసు పార్టీకి రాజీనామా ఇచ్చేలా పెద్దఎత్తున అలజడి లేవదీశాడు. ఈ పర్యవసానంతో ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించి, అవినీతి ప్రభుత్వంగా చిత్రించేలా ప్రచారం గావించాడు. శ్రీ వి.పి. సింగ్ కు తోడు ప్రతిపక్షాలు సైతం చేతులు కలిపాయి. 

ఈ దశలో 1989 నవంబర్ 22, 24, 26లలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో లోక్ సభలో కాంగ్రెసుకు 193 సీట్లు మాత్రమే వచ్చి, అధికారంలోకి రావడానికి అవకాశం లేకుండా పోయింది. రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెసు పార్టీ ఎన్నికలలో ఏకైక పార్టీగా గెలిచినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీలేని కారణంగా, ప్రతిపక్ష పార్టీగానే ఉండిపోయింది. ఎవరినైనా కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రెసిడెంటు ఆహ్వానించినప్పటికీ రాజీవ్ ఇందుకు అంగీకరించలేదు. ప్రతిపక్షాలు, వామపక్షాలు, కాంగ్రెసులోని ఇతర చీలికదారులంతా కలిసి మిశ్రమ ప్రభుత్వంగా ఏర్పడి ఫలితంగా శ్రీ వి.పి. సింగ్ ప్రధాని అయ్యాడు. పూర్వ జనతా పార్టీ, సోషలిస్టు వర్గం, కాంగ్రెసు తిరుగుబాటుదార్లతో ‘జనతాదళ్’ అనే నూతన పార్టీ ఏర్పడింది. కాంగ్రెసు పార్టీ ప్రతిపక్ష పార్టీగా.. శ్రీ రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నాయకునిగా లోక్ సభలో వ్యవహరించడం జరిగింది. 

కాంగ్రెసేతర పార్టీలు.. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన నాటినుంచి నేటివరకు రెండుసార్లు మాత్రమే కేంద్రంలో ప్రతి పక్షాలు అధికారంలోకి వచ్చారు. 1977లో జనతా పార్టీ, 1989 నవంబరులో జనతాదళ్ ప్రభుత్వాలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి. అయితే ఈ రెండు ప్రభుత్వాలు పూర్తికాలం కొనసాగలేదు. ఈ రెండు దఫాలలో కూడా కాంగ్రెసు తిరుగుబాటుదారులే ప్రధానులుగా ఉన్నారు. 1977 నాటి జనతా పార్టీ నాయకులైన మొరార్జీదేశాయ్, చరణ్ సింగ్ లు, 1989 నాటి శ్రీ వి.పి. సింగ్, చంద్రశేఖర్ లు కుడా కాంగ్రెసువాదులే. కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయిన బీజేపీ కమ్యూనిస్టులు, కాంగ్రేసేతర పక్షాల సహకారం వీరికి తోడైంది. సుస్థిరతలేని చీలిక పార్టీలు పరిపాలనా వ్యవహారం మున్నాళ్ళ ముచ్చటాగానే సాగింది. తిరిగి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడం చర్వితచరణమైంది.

1990లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఈసారి శ్రీ రాజీవ్ గాంధీ హయాంలోని కాంగ్రెసు పార్టీ గెలుపు ఖాయం అంతటా స్పష్టత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల బరిలో నిలిచి, తమ తమ ఎన్నికల ప్రణాళికలు, వాగ్దానాలతో బహిరంగ సభలు పెట్టి ప్రజలను ఆకర్షించే పనిలో ఉన్నాయి. అప్పటికే అధికారంలో ఉన్న ప్రతిపక్షాల తీరుతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపారు. అందుకు తగినట్లుగానే కాంగ్రెస్ సుస్థిర నినాదాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళింది. దేశమంతటా పర్యటిస్తూ, కాంగ్రెసు గెలుపుకు తీవ్రంగా కృషి చేశారు రాజీవ్. ఓసారి ఎన్నికల కార్యక్రమంలో రాజీవ్ గాంధీ తమిళనాడు పర్యటనకు వచ్చారు. 1991 మే 21న మద్రాసు సమీపంలోని శ్రీ పెరంబుదూరులో బహిరంగసభలో రాజీవ్ ప్రసంగించేందుకు వచ్చారు. సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆరోజు రాత్రి 10:25 గంటలకు వేదిక పై వచ్చి ఉన్నారు. చుట్టూ రాజకీయ నాయకులు, కాంగ్రెసు కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు. ఇదే సమయంలో రాజీవ్ కు పూలమాల సమర్పించేందుకు ఒక యువతి వచ్చింది. రాజీవ్ పాదాలకు నమస్కరించడానికి అన్నట్లు ముందుకు వంగింది. అంతే, మరు క్షణంలో పరిసర ప్రాంతమంతా పెద్ద శబ్దంతో బాంబు పేలింది. సభా వేదికంతా భీభత్సంగా మారి, రక్తసిక్తమైంది. తీరా చూస్తే, రక్తపుమడుగులో రాజీవ్ గాంధీ హత్య చేయబడ్డాడు. తమిళ టైగర్ గా భావించబడుతున్న ఆ హంతకి నడుముకు బెల్టుబాంబును ధరించి, ముందే చేసుకున్న ఏర్పాటుతో బటన్ నొక్కి బాంబు పేల్చి, రాజీవ్ ను హత్య చేసింది.

1989 నవంబరు వచ్చేనాటికి జరిగిన అయిదేళ్ళ పదవి కాలంలో రాజీవ్ గాంధీ కాలం ఇట్టే గడిచిపోయింది. తన అయిదేళ్ల పరిపాలనా కాలంలో పంజాబ్, అస్సాం సమస్యలను పరిష్కరించడం, సార్క్ దేశాల సమావేశాలు, మాల్దీవులకు సహకారం, శ్రీలంకకు శాంతి సైన్యాన్ని పంపడం వంటి వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వర్తించారు. దేశ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని, అభివృద్ధిదిశలో పయనించేలా విశేష కృషి సలిపిన మహనీయుడు!!

Show More
Back to top button