CINEMATelugu Cinema

తెలుగు వెండితెర తొలి గయ్యాళి అత్త… తాడంకి శేషమాంబ.

తెలుగు సినిమాలు మాటలు నేర్చిన తొలిరోజుల నుండి గయ్యాళి అత్త పాత్ర అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చే నటి సూర్యాకాంతం. ఎందుకంటే తెలుగు సినిమాలలో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ఆవిడ ప్రాచుర్యం పొందారు. అందుకే నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో “నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది. “సూర్యకాంతం” అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు” అని స్వయంగా అన్నానని చెప్పారు. కానీ ఆమెకంటే ముందుగానే 1939 లో వందేమాతరం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసి గయ్యాళి అత్త పాత్రల పోషణకు ఒక కొత్త ఒరవడిని తెచ్చిన మరొక నటి కూడా వున్నారు. ఆవిడే “తాడంకి శేషమాంబ”. తెలుగు సినిమాకు తొలి “బుల్ డాగ్” ఆవిడ.

నిజానికి తెలుగు సినిమా ప్రారంభదశలో గయ్యాళి అత్త పాత్రలు పోషించిన నటీమణులు ఎవ్వరూ లేరు. 1935లో వచ్చిన సతీసక్కుబాయి చిత్రంలోని అత్త పాత్ర గయ్యాళిదే, అయినా ఆ పాత్రను “సూరవరపు వెంకటేశ్వర్లు” పోషించారు. ఆ తరువాత కూడా గయ్యాళి అత్త పాత్రను పోషించినవారు ఉన్నారు. కానీ వారు ఎవ్వరూ వెలుగులోకి రాలేదు. కేవలం తాడంకి శేషమాంబకు మాత్రమే అది సాధ్యపడింది. గయ్యాళి అత్త పాత్రను శేషమాంబ మాత్రమే చేయాలనే ఒక అభిప్రాయాన్ని అందరిలో నాటుకుపోయేలా ఆమె చేయగలిగారు.

నిజానికి తెలుగులో సూర్యకాంతం కంటే ముందు గయ్యాళి పాత్రలో వెండితెరను ఏలిన ఘనపాటి తాడంకి శేషమాంబ. పాలు త్రాగే పసిపాపలని సైతం హడలు కొట్టే  గొంతు, నిప్పులు చెరిగే కళ్ళు, భారీ శరీరం శేషమాంబకు పెట్టని ఆభరణాలు. ఆమెది గుంటూరు జిల్లా రేపల్లె. వృద్ధ బ్రాహ్మణుడితో 11 యేండ్ల బాల్య వివాహంకు నిదర్శనంగా పుట్టిన కూతురుని భుజాన వేసుకుని, భర్త పోయిన బాధలో వైధవ్యాన్ని అనుభవిస్తూ ఉదరపోషణార్థం బయలుదేరారు. మొదట డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు ప్రోత్సహంతో నాటకాలలో నటించేవారు. అటుపిమ్మట బి.ఎన్.రెడ్డి నిర్మించిన వందేమాతరం (1939) చిత్రంతో అరంగేట్రం చేసి, తొలి సినిమాలోనే గయ్యాళి అత్త పాత్రను దక్కించుకుని ఆ పాత్రను  సమర్థవంతంగా నిర్వహించిన ఘనాపాటి తాడంకి శేషమాంబ.

ఆ తరువాత సుమంగళి, దేవత, తల్లి ప్రేమ, శ్రీ లక్ష్మమ్మ కథ, చిన్న కోడలు వంటి ఎన్నో చిత్రాలలో శేషమాంబ అత్త పాత్రలలో నటించారు. సినిమాలో ఆమెను చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఆమెను తిట్టకుండా ఉండలేకపోయేవారట. అంతగా గయ్యాళి పాత్రలలో ఆమె జీవించేవారు. తాడంకి శేషమాంబ చివరి చిత్రం పెద్దమనుషులు (1958) కాగా, ఆమె కూతురు స్వరాజ్యలక్ష్మి కూడా తల్లి బాటలోనే పయనించి “దొంగ రాముడు”, “చంద్రహారం”, వంటి పలు చిత్రాలు నటించారు. గంభీరమైన వాచకంతో ప్రసిద్ధి చెందిన 40వ దశకం వెండితెర నటుల్లో వేమూరి గగ్గయ్య, తాడంకి శేషమాంబలను ప్రత్యేకంగా చెప్పుకునేవారు. సూర్యకాంతం, ఛాయాదేవిలు కూడా తమ ఆదర్శ నటిగా శేషమాంబని చెప్పుకునేవారు అంటే తెలుగు సినిమా తొలి నాళ్ళలో ఆమె ప్రాభవం ఏంటో, నటనా పరంగా ఆమె సత్తా ఏంటో తెలుసుకోవచ్చు.

జీవిత విశేషాలు…

జన్మనామం  :  తాడంకి శేషమాంబ

ఇతర పేర్లు  :  శేషమాంబ 

జననం   :       1908

స్వస్థలం :    కృష్ణా జిల్లా 

వృత్తి   :       నటి, రంగస్థల కళాకారిణి 

జీవిత భాగస్వామి  :   తాడంకి వెంకయ్య,

పిల్లలు   : కూతురు స్వరాజ్యలక్ష్మి 

మరణ కారణం  :   వృద్ధాప్యం

మరణం   :   14 నవంబరు 1958, తెనాలి…

నేపథ్యం…

తాడంకి శేషమాంబ తెనాలిలో సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అప్పట్లో ప్రాచుర్యంలో ఉన్న కన్యాశుల్కం (బాల్యవివాహ వ్యవస్థ) కారణంగా శేషమాంబకి తన 11 వ యేటనే వృద్ధుడు తాడంకి వెంకయ్యతో వివాహం జరిగింది. ఆమెకు ఒక కూతురు జన్మించిన తర్వాత భర్త వెంకయ్య మరణించారు. దాంతో శేషమాంబ దిక్కులేనిది అయిపోయింది. ఒకప్రక్కన భర్త పోయి ఒంటరి జీవితం, మరో ప్రక్కన తన కూతురును పోషించడానికి డబ్బులు లేని పరిస్థితి, అయోమయంలో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టులాడుతున్న స్థితి నుండి బయటపడడానికి ఆమెకు ఆర్థిక భరోసా కావాలి. ఆమెలో గల మొండితనాన్ని, ఆమెలో ఉన్న ముక్కుసూటి తనాన్ని గమనించిన ప్రముఖ న్యాయవాది నండూరు శేషాచార్యులు, ప్రముఖులు డాక్టరు గోవిందరాజుల సుబ్బారావులు పూడగడవని పరిస్థితిని నుండి ఆమెను తప్పించడం కోసమే ఆమెలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించి, నటనలో శిక్షణ ఇప్పించి, ఆమెతో రంగస్థల అరంగేట్రం చేయించారు. ఆ విధంగా గురజాడ వారి “కన్యాశుల్కం” నాటకంలో మధురవాణి పాత్రతో తొలిసారిగా రంగస్థలంపై అడుగుపెట్టిన శేషమాంబ, తన అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను అలరించారు, ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు.

నాటకాలలో కర్ణుడు, కమలాదేవి పాత్రలలో…

ఆకలి, అవసరాలు, కుటుంబ స్థితిగతులను ఎదుర్కోవడానికి శేషమాంబకు నాటకాలు ఎంతగానో దోహదం చేశాయి. తన అభినయంతో ఏ పాత్రలోనైనా అవలీలాగా జీవించగల నేర్పును ఆమె సాధించారు. తన నటనతో నాటకాలలో తిరుగులేని స్థానాన్ని ఏర్పరుచుకున్న శేషమాంబ నాటకాలలో తీరికలేకుండా అవ్వడంతో ఆమెకు తన కుటుంబ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు. ఆమె నటించిన నాటకాలలో ముఖ్యమైనవి “పాండవోద్యోగ విజయాలు”, “ఖిల్జీ రాజ్య పతనం”. “పాండవోద్యగవిజాయాలు” నాటకంలో తాడంకి శేషమాంబ “కర్ణుడు” పాత్రలో, ఖిల్జీ రాజ్య పతనంలో కమలారాణి పాత్రలో ఆమె చేసిన నటనకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి. తన అభినయం గూర్చి, ఆమె ప్రేక్షకాదరణ గురించి పత్రికలలో వ్రాస్తూ ఆమె ఫోటోలు కూడా ప్రచురించేవారు. ఆ విధంగా ఆమె నాటకాలలో నటిస్తూ తన జీవనం కొనసాగిస్తూ వచ్చారు.

సినిమా రంగం…

వాహినీ పిక్చర్స్ పతాకంపై, బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో చిత్తూరు నాగయ్య, కాంచనమాల నాయకా, నాయికలుగా నటించిన 1939నాటి తెలుగు సాంఘిక చలనచిత్రం వందేమాతరం. ఈ సినిమాని తెరకెక్కించిన దర్శక, నిర్మాత బి.ఎన్.రెడ్డికి అందులో గయ్యాళి అత్త పాత్రను పోషించడానికి సరైన నటి దొరకలేదు. ఆ పాత్ర అన్వేషణలో ఉన్న ఆయన అంతకుముందే ఒక పత్రికలో శేషమాంబ ఫోటో చూశారు. పైగా తన మిత్రుల ద్వారా కూడా శేషమాంబ గురించి విని ఆమెను పరీక్షించడానికి కె.వి.రెడ్డి, సముద్రాల, ఎ.కె.శేఖర్ లను తెనాలి పంపారు. వారు తెనాలిలో నటుడిగా పేరు మోసిన నండూరు శేషాచార్యులను కలిసి తాము వచ్చిన విషయం చెప్పి, శేషాచార్యులతో బాటుగా తాడంకి శేషమాంబ ఇంటికి వెళ్లారు.

అలా వెళ్లిన వారిలో శేషాచార్యులు శేషమాంబతో శేషమ్మా! ప్రక్క వీధిలో ఉన్న మా వియ్యంకుడు ఒకడు నీ గురించి దుర్భాషలాడుతున్నాడని  అన్నారట. దాంతో తోక తొక్కిన త్రాచుపాములా రెచ్చిపోయి పరుష వ్యాఖ్యలు ఉచ్చరిస్తూ ఆమె తన కొంగు బిగించారట. అప్పుడు శేషాచార్యులు అక్కడ వున్న శేషమాంబను శాంతపరిచి, నిన్ను పరీక్షించడానికి ఆడిన అబద్ధమది అని అసలు విషయం చెప్పారట శేషాచార్యులు. అప్పుడు వాళ్లు ఆమెతో మాట్లాడి, వందేమాతరం సినిమాలో గయ్యాళి అత్త పాత్రకు ఒప్పించి, ఆమెతో ఒప్పందం కుదుర్చుకొని తిరిగి మద్రాసు  వెళ్ళిపోయారు. అలా ఆమె వందేమాతరం (1939) సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.

అత్త పాత్రలతోనే ప్రజాదరణ పొంది…

శేషమాంబ నిజ జీవితంలో అత్త అదమాయింపులు, ఆడబిడ్డల  ఆరళ్లు ఆమె చాలా కాలం అనుభవించారు. అందువలన ఆ అనుభవాల సారాన్నంతా ఉపయోగించుకుని తన తొలి చిత్రమే అయినా కూడా “వందేమాతరం” (1939) చిత్రంలోని అత్తపాత్రలో రంగరించి, అభినయించడంతో గయ్యాళి అత్తగా తనని తాను నిరూపించుకోవడంలో నూటికి నూరు శాతం సఫలమయ్యారు. గయ్యాళి అత్త పాత్రలో తనదైన శైలిలో కనిపించారు. సహజమైన తన నటనతో అద్భుతమైన అభినయాన్ని, అలనాటి అత్తల గయ్యాళి పాత్రలో ఆమె జీవించడంతో “వందేమాతరం” సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఆమెను తిట్టకుండా ఉండలేకపోయారు. వందేమాతరం సినిమా నిర్మించిన వాహినీ సంస్థ వారే నిర్మించిన మరొక రెండు చిత్రాలు “సుమంగళి” (1940), దేవత (1941) చిత్రాలలో కూడా శేషమాంబ నటించారు.

అలాగే రాజ రాజేశ్వరి పతాకంపై కడారు నాగభూషణం నిర్మించిన “తల్లిప్రేమ” (1941), పాదుకా పట్టాభిషేకం (1945), ప్రతిభా ఫిలింస్ పతాకం క్రింద ఘంటసాల బలరామయ్య నిర్మించి, దర్శకత్వం వహించిన “శ్రీ లక్ష్మమ్మ కథ” (1950), చిన్న కోడలు (1952) తదితర చిత్రాలతో నటించిన తాడంకి శేషమాంబ మరింత ప్రజాదరణ పొందారు. అలాగే ప్రకాష్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ఎస్. ప్రకాశరావు నిర్మించి, దర్శకత్వం వహించిన “దీక్ష” (1951), శ్రీ గజాననా ప్రొడక్షన్స్ పతాకంపై కె.వేంబు, కె.ఎస్.రామచంద్రరావుల దర్శకత్వంలో వచ్చిన “కోడరికం” (1953), అవర్ ఇండియా ఫిల్మ్స్ పతాకంపై చిత్తూరు నాగయ్య దర్శకత్వంలో వచ్చిన నా ఇల్లు (1953), అనంద పిక్చర్స్ పతాకంపై బి.వి.రామానందం తెరకెక్కించిన వరూధిని (1946), శోభనాచల పిక్చర్స్ బ్యానర్ పై సి.కృష్ణవేణి నిర్మించిన “లక్ష్మమ్మ” (1952), వాహినీ పిక్చర్స్ పతాకంపై నిర్మాత, దర్శకుడు బి. ఎన్ రెడ్డి నిర్మించిన రంగులరాట్నం (1927) తదితర చిత్రాలలో శేషమాంబ పోషించిన గయ్యాళి పాత్రలు పేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

నిష్క్రమించిన “బుల్ డాగ్” శేషమాంబ…

తెలుగు సినిమా మాటలు నేర్చిన తొలిరోజులలో అత్త పాత్రకు తాడంకి శేషమాంబ, ఆ తరువాత రోజులలో నటి సూర్యకాంతం తెలుగు సినిమాలలో అత్త పాత్రలకు కొత్త ఒరవడిని సృష్టించారు. అందుకే ప్రముఖ దర్శక, నిర్మాత ఘంటసాల బలరామయ్య, తాడంకి శేషమాంబను బుల్ డాగ్ అని, సూర్యకాంతాన్ని అల్షేషన్ డాగ్ అని పిలిచేవారు. ఆయన వీరిద్దరికి తన సినిమాలలో అవకాశాలు ఇచ్చేవారు. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుని వైధవ్యాన్ని అనుభవించిన శేషమాంబ తన జీవితంలో తనకు తోడుగా ఉండడం కోసం ఆమె నాయుడుని పెళ్లి చేసుకున్నారు. నాయుడు కూడా శేషమాంబ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు. అలాగే శేషమాంబ కూతురు “స్వరాజ్యలక్ష్మి” కూడా సినిమారంగం లోకి వచ్చి నటిగా స్థిరపడ్డారు. దర్శకులు కె.వి.రెడ్డి నటి స్వరాజ్యలక్ష్మిని ఎంతగానో ప్రోత్సహించేవారు. ఆయన వలననే “పెద్దమనుషులు”, “దొంగరాముడు”, “రంగులరాట్నం”, “చంద్రహారం” తదితర చిత్రాలలో స్వరాజ్యలక్ష్మిని నటించారు. గయ్యాళి అత్తగా నాటితరం ప్రేక్షకులను భయపెట్టిన శేషమాంబ 14 నవంబరు 1958 నాడు అనారోగ్యం కారణంగా ఈ లోకం నుండి నిష్క్రమించారు.

Show More
Back to top button