
భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన నటీమణులలో ఒకరు వహీదా రెహమాన్. ఆమె ఆరు దశాబ్దాలకు పైగా తన అందం, చక్కదనం, అభినయం మరియు ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆమె లాలిత్యానికి చిరునామా. ఆమె అందం, అభినయం, సౌకుమార్యం మూర్తిభవించిన భారతీయ నటీమణి. ఏడు దశాబ్దాల క్రితం తెలుగు వెండి తెరపై అరంగేట్రం చేసి అనతి కాలంలోనే ఉత్తరాది నటిగా తారంపథం లోకి దూసుకుపోయిన తార ఆమె. రోజులు మారాయి సినిమాతో తెలుగు వెండితెరపై తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి, తరువాత తమిళ చిత్రాలలో మెరిసి నటులు నిర్మాత గురుదత్ కంటపడి హిందీ చిత్రసీమలో అడుగుపెట్టి అజరామర హిందీ చిత్రాలలో తాను భాగమయ్యారు వహీదా రెహమాన్. ఆమె అందానికి ఫిదా అయిన ఆయన తన “సీఐడీ” చిత్రంలో కథానాయికగా తీసుకున్నారు. అలా హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. సీఐడీ సినిమా 1956 నాటికి భారతీయ సినిమాలోనే అత్యధిక డబ్బులు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.
తెలుగు ముస్లీం కుటుంబానికి చెందిన వహీదా రెహమాన్ చిన్నప్పటి నుండే నాట్యంపై అభిలాషతో నృత్యం నేర్చుకున్నారు. కష్ట కాలంలో ఆ నృత్యమే అక్కరకు వచ్చి వేదికలపై నృత్యాలు చేయడం చూసి నందమూరి తారకరామారావు తన “జయసింహా” సినిమాలో అవకాశం ఇచ్చారు. దానిని సద్వినియోగం చేసుకున్న వహీదా తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో తనదైన ముద్రవేసి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రెండవ అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా ఎదిగారు. ప్యాసా, గైడ్, కాగజ్ కే ఫూల్, సాహిబ్ బీబీ ఔర్ గులామ్ మరియు తీస్రీ కసమ్ వంటి అన్ని కాలాలలో అత్యంత గుర్తుండిపోయే చిత్రాలలో ఆమె నటించారు. 13 యేండ్లకే తండ్రి మరణం, 19 యేండ్లకే తల్లి మరణం, ఒంటరి జీవితం అయినా కూడా కుంగిపోకుండా తనకు తెలిసిన నటనతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. తనకు అవకాశం ఇచ్చిన గురువు గురుదత్ తో ప్రేమ వ్యవహారాలు నడిపినట్లు వదంతులు వచ్చినా పట్టించుకోలేదు. ఎక్కువ సినిమాలు తీసిన దేవ్ ఆనంద్‌తో ప్రేమ వ్యవహారం నడిపినట్లు పుకార్లు వచ్చినా లెక్కచేయకుండా తనను ఇష్టపడ్డ వ్యక్తి, తనతో కలిసి “షంగూన్” అనే హిందీ చిత్రంలో నటించిన బాలీవుడ్ నటుడు శశిరేఖిని 1974లో వివాహం చేసుకున్నారు.
వహీదా రెహమాన్ తన నటనా నైపుణ్యంతో పాటు, అద్భుతమైన కుట్టుపని ఎంపికలకు, ముఖ్యంగా ఆమె చీరల ఎంపికకు కూడా ప్రసిద్ధి చెందారు. ఆమె తెరపైన మరియు తెర వెలుపల అత్యంత అద్భుతమైన చీరలను ధరించి, తన చక్కదనం మరియు శైలికి ఒక ప్రమాణాన్ని ఏర్పాటు చేశారు. రంగుల ప్రపంచంలో శాశ్వత ముద్ర వేసిన వహీదా రెహమాన్ దేవ్ ఆనంద్ తో కలిసి “గైడ్” సినిమా చిత్రీకరణ జరిగినప్పుడు బాలీవుడ్ లో “నక్షత్రాలలో చంద్రుడు” గా పరిగణించబడే అనేక ఐకానిక్ చీరలను ధరించారు. చిత్రీకరణ సెట్ లో ఉన్నప్పుడు కూడా ఆవిడ ధరించే అనేక రకాల చీరలలో ఆమె అతీంద్రియంగా కనిపించేవారు.
అందం, ఆహార్యం, నటనతో బాటు అనేక పురస్కారాలను గెలుచుకున్న ఆవిడ సత్యజిత్ రే బెంగాళీ చిత్రం “అభిజాన్” (1962) లో నటనకు గానూ జాతీయ చలనచిత్ర అవార్డు పురస్కారాన్ని దక్కించుకున్నారు. నీల్ కమల్ (1968), గైడ్ (1965) చిత్రాలకు రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు దక్కించుకున్నారు. ఆమెకు భారతీయ అత్యున్నత నాలుగవ పురస్కారం పద్మశ్రీ (1972), మరియు భారతీయ అత్యున్నత మూడవ పురస్కారం పద్మభూషణ్ (2011) పురస్కారాలు గెలుచుకున్నారు. భారతీయ సినిమా రంగానికి ఆమె చేసిన సేవలకు గానూ ఆమెకు భారతదేశపు సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (2021) కి ఎంపికై , ఆ పురస్కారాన్ని 2023లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.
జీవిత విశేషాలు…
జన్మనామం : వహీదా రెహమాన్
ఇతర పేర్లు : వహీదా
జననం : 03 ఫిబ్రవరి 1938
స్వస్థలం : చెంగల్పట్టు, తమిళనాడు, భారతదేశం
వృత్తి : భారతీయ సినిమా నటి
తండ్రి : మహమ్మద్ అబ్దుల్ రెహమాన్
తల్లి : ముంతాజ్ బేగం
జీవిత భాగస్వామి : శశిరేఖి (మరణం.. 2000)
నేపథ్యం…
వహీదా రెహమాన్ 03 ఫిబ్రవరి 1936 నాడు తమిళనాడు రాష్ట్రంలోని చంగల్‌పట్‌లో జన్మించారు. మహమ్మద్ అబ్దుల్ రెహమాన్, ముంతాజ్ బేగం దంపతులకు వహీదా రెహమాన్ జన్మించారు. జిల్లా కమిషనర్‌గా దక్షిణాదిలోని పలు పట్టణాలలో పని చేసిన అబ్దుల్ రెహమాన్ కు నలుగురు అమ్మాయిలు. జహీదా, షహీదా, సహీదా, వహీదా. ఏకైక, అనుపమ అనే అర్థాలను ఇచ్చే “వహీదా” అనే పదం అరబిక్ భాషలోనిది. 1930 ప్రాంతంలో “వహీదా” నాన్న సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై జిల్లా కమిషనరుగా మంచి ఉద్యోగం చేస్తుండేవారు. అలా ఉద్యోగం చేస్తున్న క్రమంలో “వహీదా” జన్మించే సమయానికి వారు తమిళనాడులోని చెంగల్పట్టు లో ఉన్నారు. ముగ్గురు అక్కల తర్వాత పుట్టిన ఆడపిల్ల కావడంతో అందరూ వహీదాను గారాబంగా చూసేవారు.
అమ్మ ముంతాజ్ బేగం బడిలో చదువుకోకపోయినా ఇంట్లోనే చదువుకున్న చదువుతోనే అప్పటి ఆంగ్ల పత్రికలు ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, రీడర్స్ డైజెస్టివ్ చదివేవారు. అప్పుడప్పుడు ఆమె టెన్నిస్ కూడా ఆడేవారు. చదువుకున్న వారు కావడం, అలాగే అభ్యుదయ భావాలు ఉన్న కుటుంబం వారిది, అయిన కూడా నమాజ్ చేసేవారు, రెండు పూటలా రంజాన్ మాసం ఉపవాసాలు విధిగా పాటించేవారు. వహీదా నాన్న మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ కు ఉద్యోగరీత్యా తరచూ బదిలీలు అయ్యేవి. ఆ విధంగా తమిళనాడులోని పలు ప్రాంతాలతో పాటు, కేరళ నుండి విశాఖపట్నం వరకు ఉద్యోగ రీత్యా బదిలీలు అవ్వడం వలన అరవంతో పాటు తెలుగు, మలయాళ భాషలను అర్థం చేసుకోగలిగే వారు వహీదా రెహమాన్.
బాల్యం…
బదిలీలపై తరుచూ వివిధ ప్రాంతాలకు వెళుతూ ఉండే వహీదా కుటుంబం, ఆమెకు ఐదేళ్ల వయస్సున్నప్పుడు కేరళలోని “పాల్ఘాట్” కి బదిలీపై వెళ్లారు. ఓనం పండుగ ఘనంగా జరిపే పాల్ఘాట్ లో ఏనుగులకు ముస్తాబు చేసి ఊరేగించడం అక్కడ ఆనవాయితీ. అక్కడ ఒక ఏనుగు పిల్లని పెంచుకుందామని వహీదా నాన్నతో మారాం చేసేవారు. అది పెరిగి పెద్దదయితే ఇంటిలో పట్టనంత అవుతుందని నాన్న ఎంతో ఓపిగ్గా చెప్పేవారు. అయినా సరే ఏనుగు మీద మోజు తగ్గని వహీదా వాళ్ళ కుటుంబం నాగపట్నంలో ఉన్న రోజులలో ఒక మావటి తీసుకొచ్చిన ఏనుగుకు ఒక కొబ్బరికాయ అందించి తృప్తి తీరక ఆమె ఏనుగుతో పాటు కొంత దూరం తిరిగేవారు. చిన్నప్పుడు చదువుకుని వైద్యురాలు (డాక్టరు) అవ్వాలని కోరుకునే వహీదా, అనారోగ్యం కారణంగా బడికి సరిగ్గా వెళ్ళలేకపోయేవారు కాదు.
తమ ఇంట్లో ఎవ్వరికి ఏదైనా చిన్న జబ్బు చేసినా కూడా ఆమెకు తెలిసిన ఏదో ఒక వైద్యం చేస్తుండేవారు. ఒకసారి వాళ్ళ పనిమనిషి తలనొప్పితో బాధపడుతూ ఉంటే కొబ్బరి నూనెలో “టాల్కమ్ పౌడర్” వేసి దానిని కలిపి తలకు రుద్దుకుని మిగిలింది తాగేయమని చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె చెప్పినట్లే చేయడం వలన అతనికి తగ్గిపోయిందని చెప్పడంతో ఇంట్లో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వహీదా పెద్దయిన తరువాత కూడా ఆమెకు ఈ వైద్యం పిచ్చి వదల్లేదు. అప్పట్లో “హమ్ దర్ద్ దవఖాన” వాళ్ళు పత్రికలో ఇచ్చే చిట్కాలు ఆమె నేర్చుకుని అనేక ప్రయోగాలు చేసేవారు. ఆవిడ పెళ్ళయ్యాక ఒక్కసారి ఆమె భర్తకు విపరీతమైన దగ్గు వచ్చింది. ఆమెకు తెలిసిన పాలు, పసుపులతో వైద్యం చేయగానే తగ్గిపోయింది. కానీ తన భర్త మాత్రం నీ వైద్యం ఎప్పుడో కొంపముంచుతుంది. నీ చేతిలో ఎవరో ఒకరు టపా కట్టడం ఖాయం అని నవ్వేవారు.
తొలిసారి వేదికపై నృత్య ప్రదర్శన…
వహీదా నాన్న గారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి లలో కూడా కమీషనరుగా పనిచేశారు. రాజమండ్రిలో పనిచేస్తున్నప్పుడు “కమలా లక్ష్మణ్” నాట్యం చూసే అవకాశం వచ్చింది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ నృత్యం చూశారు. అది చూసిన వహీదా నేను కూడా నృత్యం నేర్చుకుంటాను అని పట్టుబట్టారు. దాంతో చేసేది లేక రాజమండ్రిలోనే ఉన్న రామచంద్రన్ అనే నాట్య గురువు శిక్షణలో నాట్యం నేర్పించడం మొదలుపెట్టారు. ఆయన ప్రతీరోజు ఇంటికి వచ్చి వహీదాకు భరతనాట్యం నేర్పేవారు. వహీదా నృత్యం చేస్తుంటే అక్కయ్య సహీదా మృదంగం వాయించేది. ఆ తరువాత ఆమె కూడా భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. విచిత్రం ఏమిటంటే తరుచూ ఆస్తమాతో బాధపడే వహీదా భరతనాట్యం శిక్షణ మొదలుపెట్టిన తరువాత విచిత్రంగా తన ఆస్తమా తగ్గుముఖం పట్టింది.
ఆమె భరతనాట్యం నేర్చుకుంటూ ఉంటే బంధువులు “మన ముస్లింలు భరతనాట్యం నేర్చుకోవడం ఏమిటి అని అభ్యంతరం పెట్టేవారు. కానీ వహీదా నాన్న మాత్రం అవేమీ పట్టించుకోలేదు. అలా ప్రారంభమైన తన భరతనాట్య శిక్షణ సంవత్సరాల పాటు కొనసాగింది. మద్రాసులో తిరుచందూర్ మీనాక్షి సుందరం పిళ్ళై, బొంబాయిలో జయలక్ష్మి అల్వార్ వద్ద నాట్య శిక్షణ కొనసాగించారు వహీదా. ఆ తరువాత సంవత్సరాలలో కేవలం ఆసక్తితోనే నేర్చుకున్న భరతనాట్య నృత్యమే కానీ వేదికలపై ప్రదర్శన కోసం వహీదా, సహీదాలు నృత్యం నేర్చుకోలేదు. కానీ ఒక్కసారి మాత్రం తప్పని పరిస్థితిలో విశాఖపట్నంలో పనిచేస్తున్న సమయంలో బహిరంగ ప్రదర్శన ఇవ్వవలసి వచ్చింది. విశాఖపట్నం పర్యటనకు వచ్చిన అప్పటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలచారి గౌరవార్థం నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తు నృత్య ప్రదర్శన కార్యక్రమం రద్దు చేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో వహీదా నాన్న గారి బాస్ కోరిక మేరకు వేదిక మీద వహీదా నృత్యం చేయాల్సివచ్చింది.
కుంగదీసిన తండ్రి మరణం…
1951 వ సంవత్సరం వచ్చేసరికి వహీదా రెహమాన్ కు 13 సంవత్సరాలు వచ్చేశాయి. పెద్దక్కలిద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. వాళ్ళు భర్తల వద్దకు వెళ్లిపోయారు. ఆ సమయానికి వహీదా నాన్న విజయవాడలో పనిచేస్తున్నారు. అయనకప్పుడు 52 ఏళ్ళ వయస్సు. ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే ఆయన ఉన్నట్టుండి జ్వరం వచ్చి చాలా రోజులు తగ్గలేదు. టైఫాయిడ్ జ్వరం అని మందులు కూడా వాడటం మొదలుపెట్టారు. జ్వరంలో కూడా కార్యాలయంకి సంబంధించిన ఫైళ్ళు ఇంటికి తెప్పించుకొని చూస్తుండేవారు. ఈ విషయం తెలిసిన వాళ్ళ బాస్ విశ్రాంతి తీసుకో, పని తరువాత చూసుకుందువు కానీ అని అయనపై కేకలేశారు. జ్వరం తగ్గిపోయిన తరువాత విశాఖపట్నంకు బదిలీపై వెళ్లారు. తోడుగా అమ్మ వహీదా, సహీదా వెళ్లారు. ఆరోగ్యం కుదుటపడినా కూడా ఎందుకనో విశాఖపట్నం వెళ్లిన ఆరు నెలలకు వహీదా నాన్న కన్నుమూశారు. వహీదా కుటుంబం రోడ్డున పడ్డంత పనైంది. తల్లి ముంతాజ్ బేగం ఎప్పుడూ కూడా బయటకు వెళ్ళింది కాదు. పరిస్థితులు జీవిత పాఠాలు నేర్పుతాయన్నట్లుగా వారిద్దరినీ తీసుకొని తల్లి నాట్య ప్రదర్శనలకు వెళ్లసాగారు.
వెండితెర అరంగేట్రం...
వహీదా, సహీదా లు కలిసి రంగస్థలంపై నృత్యాలు ప్రదర్శించి, ఆ నాట్య ప్రదర్శనలకు వచ్చిన డబ్బులతో జీవితం గడపసాగారు. 1953 వ సంవత్సరంలో సహీదాకు వివాహం జరిగింది. భర్తతో కలిసి పాకిస్తాన్ కి వెళ్ళిపోయింది. ఆవిడ వెళుతూ వెళుతూ వహీదాని తీసుకెళ్తానంది. కానీ అందుకు వహీదా ఒప్పుకోలేదు. అమ్మతోపాటు ఇక్కడే ఉండిపోయింది. సరిగ్గా ఒక సంవత్సరం గడిచింది వహీదా 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. తల్లి ఆమెకు పెళ్లి చేయాలనుకుంది. కానీ తల్లి మాటను కాదని వహీదా ఉద్యోగం చేస్తానంది. ఆమె చదువులు అంతంత మాత్రమే. అందువలన ఆమెకు ఉద్యోగం రాలేదు. నాట్య ప్రదర్శనలే జీవనాధారంగా ఎంచుకున్నారామె. సరిగ్గా ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్న జయసింహా (1955) చిత్రానికి వహీదాను ఎంపిక చేసుకున్నారు. ఆ తరువాత ఆమె “రోజులు మారాయి” (1955), కన్యాదానం (1955) సినిమాలకు కూడా ఎంపికయ్యారు.
నిజానికి ముందు విడుదల అయిన సినిమా “రోజులు మారాయి” అయినా కూడా ఆమె కెమెరా ముందు తొలిసారి కనిపించిన సినిమా “జయసింహా” (1955). డి. యోగానంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం 19 జనవరి 1955 నాడు వాహినీ స్టూడియోలో చిత్రీకరణ మొదలైంది. మొట్టమొదటి సినిమా అయినా కూడా వహీదా అద్భుతంగా నటించారు. అట్లూరి పుండరీకాక్షయ్య ఆమెకు నటనలో మెలకువలు నేర్పారు. రాజకుమారి పద్మినిగా ఈ సినిమాలో అభినయించిన వహీదాకు తెలుగు మాటలను డబ్బింగ్ చెప్పింది షావుకారు జానకి. అక్టోబరు 1955లో “జయసింహా” సినిమా విడుదలైంది. వహీదా ఎంపికైంది తొలిసారి కెమెరా ముందు నిలబడింది జయసింహానే అయినా విడుదలైన మొట్టమొదటి చిత్రం మాత్రం “రోజులు మారాయి”. జయసింహా కంటే ముందే ఆమె నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 1955 లో “రోజులు మారాయి” విడుదలయితే, జూలై 1955 లో “కన్యాదానం” విడుదలయ్యింది.
“ఏరువాకా సాగారో అన్నో చిన్నన్నా” పాటతో…
రోజులు మారాయి (1955) చిత్రంలో ప్రత్యేక గీతం కోసం ముందుగా చాలా మంది పేర్లను పరిశీలనలోకి తీసుకున్నారు. వారిలో కుచలకుమారి, రీటా, ఇ.వి.సరోజ లాంటి వారి కూడా ఉన్నారు. “రోజులు మారాయి” చిత్ర నిర్మాతలలో ఒకరైన వై. రామకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి వహీదా నాన్నకు మిత్రులు. ఆ పరిచయంతో ఆమెను మద్రాసుకు పిలిపించి అవకాశం ఇచ్చారు. “రోజులు మారాయి” సినిమా విడుదల అవ్వడం, అందులోని “ఏరువాక సాగారో ఎన్నో చిన్నన్నా” అనే పాట విజయవంతం కావడంతో వహీదా పేరు ఆంధ్రదేశమంతటా మారుమ్రోగిపోయింది. నిజానికి “ఏరువాక సాగారో” అనే పాటకు వహీదా నృత్యం చేయడం ఆ చిత్రం నృత్య దర్శకులు వెంపటి సత్యంకి ఇష్టం లేదు. ఆయన మనసులో మరెవరో ఉన్నారు. ఆయన వారం రోజులు శిక్షణ ఇచ్చిన తరువాత వహీదా రెహమాన్ ఆ పాటలో నటించారు. అందుకు పారితోషికంగా 500 రూపాయలు ఆమెకు ఇచ్చారు. ఆ పాటని కొసరాజు రాఘవయ్య చౌదరి “పాలేరు” (త్రిపురనేని గోపీచంద్) సినిమా కోసం వ్రాశారు. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో “రోజులు మారాయి” చిత్రానికి ఆ పాటను ఉపయోగించారు. ఆ సినిమా తరువాత తమిళ చిత్రాలు “కాలం మారి పోచు” (1956), ఎం.జి.ఆర్, భానుమతిల “ఆలీబాబా 40 దొంగలు” చిత్రాలలో నటించారు.
హిందీలో తొలిచిత్రం “సి.ఐ.డి”…
ఇదిలా ఉండగా “రోజులు మారాయి” సినిమా విజయోత్సవ సభలో వహీదా రెహమాన్ ను చూసిన హిందీ చిత్ర అగ్రనటులు “గురుదత్” ఆమెకు తన సినిమాలో అవకాశాలు ఇస్తానని మాటిచ్చారు. అన్నట్టుగానే 1955 చివరలో బొంబాయి రమ్మని “గురుదత్” నుండి పిలుపు వచ్చింది. అప్పటికి వహీదా 15 ఏళ్ల అమ్మాయి, పైగా మైనర్ బాలిక. తల్లి భర్తను పోగొట్టుకున్న వితంతువు. వారు దూర ప్రాంతాలకు వెళ్లలేరు. బొంబాయి వెళ్లాలా, వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో “రోజులు మారాయి” నిర్మాత రామకృష్ణ ప్రసాద్ భరోసా ఇచ్చి బొంబాయికి పంపించారు. తోడుగా లింగం అనే వ్యక్తిని ఇచ్చి పంపించారు. వహీదా రెహమాన్ హిందీలో నటించిన మొదటి చిత్రం “సిఐడి”. అందులో దేవ్ ఆనంద్ సరసన రెండవ కథానాయికగా నటించారు. గురుదత్ నిర్మాతగా “రాజ్ ఖోస్లా” దర్శకత్వం వహించిన చిత్రం “సి.ఐ.డి”.
ఇది 1956లో విడుదలైన భారతీయ నేర పరిశోధన సంబంధిత చిత్రం. ఇందులో దేవ్ ఆనంద్ , షకీలా , జానీ వాకర్ , కెఎన్ సింగ్ మరియు వహీదా రెహ్మాన్ నటించారు. ఈ సినిమాలో కామిని పాత్రకు వహీదా రెహమాన్ ను ఎంపిక చేశారు. ఒకరకంగా అది వేశ్య తరహా పాత్ర అయినా ఎంతో సున్నితంగా ప్రవర్తిస్తుంది. సిఐడి చిత్రం పలుచోట్ల రజోత్సవాలు జరుపుకుంది. ఈ చిత్రం నుండి దేవ్ ఆనంద్ తో వహీదాకు మంచి స్నేహం ఏర్పడింది. ఆ తరువాత కాలంలో ఆయన సినిమాలో వహీదా ఎక్కువగా కథానాయిక పాత్రలు చేయడానికి కారణం తొలి చిత్రం సిఐడి సినిమాతో వేసుకున్న స్నేహ పునాది. ఈ సినిమా సమయంలో వహీదా పేరు మార్చుకోమని దర్శకుడు చెప్పినా వినలేదు. అలాగే తనకు ఇష్టం లేని దుస్తులు ధరించమంటే కుదరని చెప్పేశారు. ఆ విధంగానే ఒప్పంద పత్రాలపై సినిమాలపై సంతకం పెట్టారు వహీదా. మూడు సంవత్సరాలు గురుదత్ సినిమాలలో నటించేందుకు గానూ ఒప్పందం కుదుర్చుకున్నారు.
అజరామరంగా “ప్యాసా” (1957)…
“సిఐడి” చిత్రం తరువాత గురుదత్ కథానాయకుడిగా, వహీదా నటించిన చిత్రం “ప్యాసా”. సిఐడి నిర్మాణం జరుగుతున్న సమయంలోనే గురుదత్ “ప్యాసా” చిత్రాన్ని మొదలుపెట్టారు. ప్యాసాలో కథానాయకుడి పాత్ర కోసం ముందు దిలీప్ కుమార్ ను అడిగితే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తే నటిస్తాను అన్నారు. అందుకు గురుదత్ ఒప్పుకోలేదు. ఆ తరువాత అశోక్ కుమార్ ని అడిగితే ఆ పాత్ర పట్ల అంత సుముఖత చూపలేదు. చివరకు దేవానంద్ ని కూడా అడిగారు గురుదత్. దానికి దేవ్ ఆనంద్ “నీ మనసులో పుట్టిన పాత్ర అది. ఆ పాత్రను నువ్వు చేస్తేనే న్యాయం చేకూరుతుంది. నాలాంటి కథానాయకులు ఆ తరహా పాత్ర చేస్తే వాణిజ్యపరమైన ప్రభావానికి అవరోధం” అని గురుదత్ ని సున్నితంగా ఒప్పించారు. చేసేది లేక చివరికి ప్యాసాలోని విజయ్ పాత్ర తానే చేయాలని గురుదత్ నిర్ణయించుకున్నారు.
ప్యాసా చిత్రంలోని వహీదా పోషించిన వేశ్య పాత్ర “గులాబో” కోసం నర్గీస్, మధుబాల వంటి వారు పోటీపడ్డారు. కానీ కావాలంటే అందులో “మీనా” పాత్ర తీసుకోమన్నారు గురుదత్. దానికి వాళ్ళిద్దరూ ఇష్టపడలేదు. ఆ పాత్రను “మాలా సిన్హా” వేశారు. ప్యాసా చిత్రానికి ఎస్.డి.బర్మన్ సంగీతం ప్రాణం పోసింది. 19 ఫిబ్రవరి 1957 నాడు విడుదలైన ఈ సినిమా ఎంత అజరామరంగా నిలిచిపోయిందో, అందులో వహీదా పోషించిన గులాబో పాత్ర కూడా అంతే అజరామరంగా నిలిచిపోయింది. ప్యాసాలో వహీదా కనిపించిన ప్రతీ “ఫేం” ఆమె అద్భుతమైన నటనకు, ప్రత్యేక హోదాకి పారదర్శకంగా నిలిచిపోయింది. ఒక నటిగా వహీదాకు 500 రూపాయలు పారితోషికంగా ఇవ్వాలి. కానీ ఈ సినిమాకు గురుదత్ మొదట్లో 2000 రూపాయలు, ఆ తరువాత 3000 రూపాయలు ఇచ్చారు.
తల్లి మరణం…
గురుదత్ ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ గురుదత్ సినిమాలలో వహీదా పోషించిన పాత్ర ప్రశంసనీయం. వహీదా లో గురుదత్ మంచి నటిని చూడగలిగారు. ఆయన తీసిన సినిమాలు, ఆ సినిమాలలో ఆమె పాత్రలను తీర్చిదిద్దిన విధానం, వాటిల్లో వహీదా ఒదిగిపోయి వాటికి న్యాయం చేకూర్చి, ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ పొందడం, ఆమెను హిందీ చిత్ర రంగంలో నిలదొక్కుకోవడానికి ఎంతో దోహదం చేశాయి. వచ్చిన పారితోషికంతో వహీదా ముంబైలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కొనుక్కుని అక్కడికి మారారు. గురుదత్ చెల్లెలు లలితతో వహీదాకి మంచి స్నేహం ఏర్పడింది. రాజ్ ఖోస్లా దర్శకత్వంలో “సోల్వా సాల్” (1958) లో దేవ్ ఆనంద్ సరసన వహీదా నటించారు.
“సోల్వా సాల్” చిత్రీకరణ జరుగుతున్నప్పుడే 12 డిసెంబరు 1957 నాడు వహీదా తల్లి గుండెపోటుతో మరణించారు. ఆవిడ మరణించే నాటికి వహీదా వయస్సు 19 సంవత్సరాలు. 19 ఏళ్లకే ఒంటరి పోరాటానికి కొనసాగించాల్సిన పరిస్థితి వహీదాకు వచ్చింది. గురుదత్ వచ్చి తల్లికి అంత్యక్రియలు జరిపించారు. సహీదా భర్తతో కలిసి వచ్చి వహీదా దగ్గర ఉండిపోయింది. మరో అక్కయ్య భర్తతో విడాకులు తీసుకుని ఆమె కూడా తన పిల్లలతో వహీదా దగ్గరకు వచ్చేసింది. ఇల్లంతా సందడితో నిండిపోయింది. ఆమె ఒంటరితనం పోయింది. ఆ తరువాత వహీదా నటించిన “కాగజ్ కే ఫూల్” (1959) విడుదలైంది. కాలా బాజార్ (1960), చౌద్విన్ కా చంద్ (1960), సాహిబ్ బీబీ ఔర్ గులామ్ (1962) మొదలగు సినిమాలలో నటించారు.
సత్యజిత్ రే “అభిజాన్” (1962)…
బిరేన్ నాగ్ దర్శకత్వంలో 1962లో “బీస్ సాల్ బాద్” విడుదలైంది. కథానాయకుడు బిశ్వజిత్ ఛటర్జీ బెంగాలీ నటుడు. అతనికి ఇదే మొట్టమొదటి హిందీ సినిమా. ఇందులో వహీదా అమాయకమైన నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తరువాత సత్యజిత్ రే దర్శకత్వంలో అభిజాన్ (1962) లో నటించారు. భిన్నమైన మరియు ఎంతో వైవిధ్యమైన భావోద్వేగాలను ప్రదర్శించవలసిన సినిమా అభిజాన్ కు వహీదాను ఎన్నుకున్నారు.
వహీదాను ఎంపిక చేసే ముందు సత్యజిత్ రే ఒక లేఖను వహీదాకు ఇలా వ్రాశారు. “మీరు నటించిన సినిమాలు చూశాను. నేను తీయబోయే సినిమాకు కథానాయికగా మీరు సరిపోతారు అని మా కథానాయకుడు సౌమిత్ర ఛటర్జీ, నేను అనుకుంటున్నాము. మీరు అంగీకరిస్తే చాలా సంతోషిస్తాము” అని వ్రాశారు. ఆమె నమ్మలేదు. చివరికి కలకత్తా వెళ్లి సత్యజిత్ రే ని కలుసుకున్న తరువాత ఆమెకు నమ్మకం కలిగింది. కేవలం ఆమె యొక్క 19 రోజుల డేట్స్ మాత్రమే తీసుకుని అభిజాన్ (1962) సినిమాను పూర్తి చేశారు సత్యజిత్ రే. ఆ సంవత్సరం అభిజాన్ సినిమా జాతీయ రెండవ ఉత్తమ చిత్రంగా బహుమతి అందుకుంది.
అద్భుతమైన నటనతో హిందీ చిత్ర రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని అత్యధిక పారితోషకం తీసుకునే రెండవ నటి స్థాయికి ఎదిగారు వహీదా. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిండ్ – మోరెనాలోని చంబల్ లోయ లోయలలో పోలీసు రక్షణలో చిత్రీకరించబడిన ఈ చిత్రం “ముఝే జీనే దో” (1963). ఈ సినిమాలో వహీదా ఛాలెంజ్ పాత్ర పోషించారు. సునీల్ దత్ ఈ సినిమాకు నిర్మాత మరియు కథానాయకుడు. ఆ సినిమాలో చమేలీ జాన్‌గా వహీదా రెహ్మాన్ నటించారు. “రాత్ భీ హై కుచ్ భీగీ భీగీ” అనే పాటలో నల్ల రంగు పూసిన అద్దం మీద నృత్యం చేశారు వహీదా. ఇది ఆ సంవత్సరంలో నాల్గవ అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా నిలిచిపోయింది. అలాగే 1964 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు అధికారికంగా ఎంపికయ్యింది.
అజరామర చిత్రం “గైడ్” (1965)…
1964 లో గురుదత్ మరణం ఆమెను కలిచివేసింది. ఆయన మరణాంతరం “గురుదత్ జీ నాకు వెండితెర జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు. ఆయనకు నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయనకు నాకు మధ్య ప్రేమ అనేది పదిమంది పుట్టించిన పుకార్లు మాత్రమే. అంతే తప్ప ఇలాంటి ప్రశ్నలు మా సన్నిహితులు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ అడగలేదు. మా నట జీవితాన్ని చూడండి. కానీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడకండి” అన్నారు వహీదా. ఆయన మరణంతో వహీదా జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది. కానీ ఆయన సృష్టించిన కళాఖండాల ద్వారా వారిద్దరి కలయిక దశాబ్దాలుగా వెండితెరను అలరిస్తూనే ఉంది.
ఆర్.కె. నారాయణ్ 1958లో రాసిన నవల ది గైడ్ ఆధారంగా విజయ్ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం “గైడ్” (1965). దేవానంద్ హీరో అద్భుతమైన విజయం సాధించింది. హిందీ చలనచిత్ర చరిత్రలోనే మరుపురాని చిత్రం గైడ్. అనేక వివాదాల మధ్య విడుదలై అద్భుతమైన విజయం దిశగా దూసుకెళ్లింది. 1966 లో నటించిన “తీస్రీ కసమ్”, 1967లో “పత్తర్ కే సనమ్”, “రామ్ ఔర్ శ్యామ్”, “నీల్ కమల్” (1968) విజయం సాధించాయి. 1969 లో “ఖామోషి” చిత్రంలో సవాలుగా విసిరిన పాత్ర, (తెలుగులో “చివరికి మిగిలేది” లో సావిత్రి ధరించిన పాత్ర) లాంటి విజయవంతమైన చిత్రాలలోనూ, వైవిధ్య భరతమైన చిత్రాలలోనూ నటిస్తూ కొనసాగారు.
వివాహం…
కమల్జీత్ (శశి రేఖి) తో కలిసి “షాగూన్” (1964) చిత్రంలో నటించారు వహీదా. ఆ సినిమా పరాజయం చవిచూసింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వహీదా పై కమల్జీత్ (శశి రేఖి) ఇష్టం పెంచుకున్నారు. కానీ చెప్పలేదు. ఆ సినిమా ఘోరంగా దెబ్బ తినడం, ఆ తరువాత రెండు మూడు సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో సినిమాలకు స్వస్తిచెప్పి లండన్ వెళ్లారు. ఆ తరువాత కెనడాలో కొన్నిరోజులు ఉన్నారు. అక్కడినుండి భారతదేశంకు దుస్తులు దిగుమతి వ్యాపారం చేసి బాగా సంపాదించారు. దుస్తులు తయారీ వ్యాపారం పనుల మీద అప్పుడప్పుడు బొంబాయి వస్తుండేవారు.
“ముఝే జీనే దో”, “గైడ్” సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా చేసిన యశ్ జోహార్ ద్వారా కమల్జీత్, వహీదా రెహ్మాన్ లు కలుసుకున్నారు. అదే సమయంలో వహీదా ప్యారిస్ లో ఇండియన్ రెస్టారెంట్ పెట్టాలని కమల్జీత్ తో మాట్లాడుతున్న సమయంలో ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు తన మనసులోని మాటను చెప్పారు. ముందు వహీదా ఒప్పుకోలేదు. కాస్త ఆలోచించిన తరువాత ఆమె తన అంగీకారం తెలిపారు. 26 జూలై 1974 నాడు ముస్లిం సాంప్రదాయం ప్రకారం వహీదా వివాహం కమల్జీత్ (శశిరేఖి) తో జరిగింది. అప్పటికీ వహీదా వయస్సు 36 సంవత్సరాలు, శశిరేఖికి 40. మరుసటి సంవత్సరం 1975లో అబ్బాయి సోహెల్, 1976లో అమ్మాయి కాశ్వీ జన్మించారు.
భర్త మరణం…
వివాహం తరువాత కథానాయిక పాత్రలు తగ్గించి గుణచిత్ర పాత్రలవైపు మళ్ళి, అద్భుతమైన నటన ప్రదర్శిస్తూ హుందాతనాన్ని చాటుతూ వచ్చారు. కభీ కభీ (1976), చాందిని (1989), లమ్హే (1991), యాక్షన్ చిత్రాలు త్రిశూల్ (1978), మషాల్ (1984) లలో నటించారు. 1982లో నామ్కీన్ మరియు నమక్ హలాల్ చిత్రాలలో సహాయక పాత్రలు చేస్తూ వచ్చారు. 1983లో బొంబాయి నుండి బెంగళూరుకు మకాం మార్చారు. 16 సంవత్సరాల పాటు బెంగళూరులోనే ఉండిపోయారు. మధ్య మధ్యలో బొంబాయి వచ్చి సినిమాలో నటిస్తూ ఉండేవారు. అల్లా రఖా (1986), చాందినీ (1989), లమ్హే (1991) లాంటి చిత్రాలు కొన్ని ఉదాహరణలు. శశిరేఖి కి 1997 లో గుండెపోటు వచ్చింది. డయాబెటిస్, రక్తపోటు మొదలగు సమస్యలతో కుంగుబాటుకు గురై పాతిక సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం నవంబరు 2000లో కమల్జీత్ (శశి రేఖి) చనిపోయారు.
భర్త చనిపోయే నాటికి పిల్లల వయసు 25 సంవత్సరాలు. భర్త చనిపోయాక ఐదారు సినిమాలలో మాత్రమే నటించారు. వాటిల్లో ఒకటి రంగ్ దే బసంతి (2006), మరొకటి “చుక్కల్లో చంద్రుడు” (2006). జయసింహ సినిమాలో 1955 లో కెమెరా ముందు నిలబడ్డ వహీదా రెహమాన్ సరిగ్గా 50 సంవత్సరాల తరువాత 2006లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకోవడం విశేషం. ఆమెతో నటించిన ప్రముఖులందరూ వెళ్లిపోయారు. ప్రస్తుతం 87 ఏళ్ల వయస్సులో ఆనాటి సినీ వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ వహీదా రెహమాన్ సవాలు విసిరిన పాత్రలు, అద్భుతమైన పాత్రలు, చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయిన పాత్రలు, వైవిధ్యమైన భరితమైన పాత్రలు అన్నింటినీ అభినయించి చలనచిత్ర ప్రపంచంలో హుందాగా రాజీ లేని జీవితాన్ని హాయిగా గడిపేస్తున్నారు.

