CINEMATelugu Cinema

భారతీయ చిత్రసీమలో అత్యధిక పారితోషికం అందుకునే నటులు.. రజనీకాంత్.

నడిచొచ్చిన దారిని మరచిపోనివాడు, వెనక్కి తిరిగి చూసుకోవడానికి భయపడని వాడు, తన చిన్నప్పటి జ్ఞాపకాల గురించి చెప్పుకోవడానికి

బేషజం లేనివాడు రజనీకాంత్..

శివాజీ సినిమాకు రజనీకాంత్ గారు తీసుకున్న పారితోషికం ఎంతంటే అమితాబచ్చన్, హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ అందరి సినిమా కలిపి ఒక సినిమాకు వచ్చే పారితోషికం ఎంతో అంత మొత్తం పారితోషికం తీసుకున్నాడు. ఆసియా ఖండంలో జాకీచాన్ తర్వాత అంత మొత్తం పారితోషికం తీసుకున్న నటుడు కూడా రజనీకాంత్ గారే. ఒక ప్రాంతీయ భాషా చిత్ర నటుడు, తాను జాతీయ నటుడు కానప్పటికీ అంత పారితోషికం తీసుకున్నారంటే తన సినిమాకు ఎంతమంది అభిమానులు ఉన్నారో, ఎంతమంది అంతర్జాతీయంగా తన సినిమా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. శివాజీరావు గైక్వాడ్ నుండి రజినీకాంత్ వరకు రూపాంతరం చెంది ఆ తరువాత సూపర్ స్టార్ దాకా కొనసాగిన వైనం వరకు తన జీవితాన్ని తీసుకుంటే రజనీకాంత్ గారి విజయం అసామాన్యమైనది, అనితరసాధ్యమైనది, స్ఫూర్తిదాయకమైనది.

రజినీకాంత్ గారు భారతీయ చలనచిత్ర నటులు, నిర్మాత, రచయిత. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రాచుర్యం కలిగిన, విజయవంతమైన దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందారు. తన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఈయన ప్రధానంగా తమిళ చిత్రాలలో ఎక్కువగా నటిస్తారు. తమిళనాట తనను సూపర్ స్టార్ అని, తలైవర్ అని అభిమానంతో పిలుచుకుంటుంటారు. చలన చిత్రాలలో రజనీకాంత్ గారు పలికే సంభాషణలూ, ప్రత్యేకమైన శైలీ దక్షిణాది ప్రేక్షకుల్లో తనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి. సుమారు యాభై సంవత్సరాలకు పైగా సాగుతున్న తన సినీ ప్రస్థానంలో అన్ని భాషల్లో కలిపి 160 కి పైగా చిత్రాల్లో నటించారు.

రజనీకాంత్ గారు 1975 లో కె.బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన “అపూర్వ రాగంగళ్” చిత్రంతో తన సినీ ప్రస్థానం ప్రారంభించిన తాను కొన్నాళ్ళు ప్రతినాయక పాత్రలు పోషించారు. 1995 లో సురేశ్ కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన “బాషా” చిత్రం  అద్భుతమైన ఘన విజయం సాధించి రజినీకాంత్ గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. 2007 లో వచ్చిన “శివాజీ” చిత్రం వందకోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమాగా పేరు గాంచింది. 2010 లో వచ్చిన రోబో, 2018 లో వచ్చిన 2.0 సినిమాలలో రజనీకాంత్ గారు శాస్త్రవేత్తగా, రోబోగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ రెండు సినిమాలు అత్యంత ఖరీదైన సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి.

చలనచిత్ర రంగానికి రజనీకాంత్ గారు చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని, 2016 లో పద్మవిభూషణ్ పురస్కారాన్నీ బహుకరించింది. ఒక జాతీయ పురస్కారం, ఏడు సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, ఒక నంది పురస్కారం, ఒక ఫిల్మ్‌ఫేర్ పురస్కారం అందుకున్న రజనీకాంత్ గారు భారతీయ చిత్ర పరిశ్రమ అందించే విశిష్ట పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే (2020) పురస్కారాన్ని  అందుకున్నారు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    శివాజీరావు గైక్వాడ్

ఇతర పేర్లు  :  రజనీకాంత్, రజినీ  

జననం    :     12 డిసెంబరు 1948    

స్వస్థలం   :    బెంగళూరు, మైసూరు రాష్ట్రం (ప్రస్తుతం కర్ణాటక)

వృత్తి      :     నటుడు, నిర్మాత

తండ్రి    :     రామోజీరావు గైక్వాడ్ 

తల్లి     :     రాంబాయి 

జీవిత భాగస్వామి :  లత రజినీకాంత్ 

పిల్లలు     :     ఐశ్వర్య, సౌందర్య

పురస్కారాలు   :  దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం, పద్మ విభూషణ్, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, పద్మభూషణ్, కళైమామణి

నేపథ్యం…

బెంగుళూరు నుండి కనకాపూర్ వెళ్లే దారిలో 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే “సోమనహళ్లి” ఒక పల్లెటూరిలో రానోజీరావు గైక్వాడ్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఆ ఊరు నుండి 30 కిలోమీటర్లు వెళితే “నేరళహట్టి” అనే గ్రామం ఉంటుంది. వారు మహారాష్ట్ర, పుణె సమీపంలోని మావడి కడెపత్తార్ నుంచి ఇక్కడికి వలస వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళ ముఖ్య వృత్తి వ్యవసాయం. “నేరళహట్టి” గ్రామంలోని స్త్రీ రాంబాయితో రానోజీరావు గైక్వాడ్ కు వివాహం జరిగింది. వీరు రజనీకాంత్ తల్లిదండ్రులు. “నేరళహట్టి” నుండి కిలోమీటరున్నర దూరంలో “అరటెక్కల” అనే ఊరు ఉంది. ఇది తమిళనాడులోని “ధర్మపురికి” చెందింది. అంటే వీరు తమిళనాడు, కర్ణాటక సరిహద్దులలో ఉండేవారు.

ఈ రానోజీరావు గైక్వాడ్, రాంబాయి దంపతులకు జన్మించిన పెద్దమ్మాయి పేరు అశ్వత్ బాలూభాయి. తరువాత పుట్టిన అబ్బాయి పేరు సత్యనారాయణ, ఆ తరువాత అబ్బాయి పేరు నాగేష్. ఈ ముగ్గురు సంతానం తర్వాత 12 డిసెంబరు 1948 అర్ధరాత్రి 12 గంటల 40 నిమిషాలకు నాలుగో సంతానం, మూడో కుమారుడు జన్మించారు. మరాఠా సామ్రాజ్యపు చక్రవర్తి ఛత్రపతి శివాజీ మీదుగా తన పేరు శివాజీరావు గైక్వాడ్  అని పెట్టారు. వీరి ఇంట్లో మరాఠీ, బయట కన్నడ భాషా మాట్లాడేవాళ్ళు. 1956 లో రానోజీరావు గైక్వాడ్ పదవీ విరమణ తర్వాత వీరి కుటుంబం బెంగళూరులోని హనుమంతనగర్‌కు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. శివాజీరావు గైక్వాడ్ కు 12 సంవత్సరాల వయస్సులో తల్లి చనిపోయింది. తన తల్లి చనిపోయే వరకు ఒక రకమైన బాల్యం, చనిపోయాక ఒక రకమైన బాల్యం గడిచింది.

బాల్యం…

చిన్నప్పుడు ఎలిమెంటరీ పాఠశాలలో శాంతమ్మ, ప్రభావతి అనే ఉపాధ్యాయినులు ఉండేవారు. ప్రభావతి అనే ఆవిడ శివాజీరావు ను తరుచూ కొడుతూ ఉండేది. అందుకే ఆమెకన్నా శాంతమ్మ అంటేనే శివాజీకి ఇష్టం ఉండేది. శివాజీరావు బడిలో పిల్లలను కూర్చోబెట్టి కథలు చెబుతుండేవాడు. తనకు పొంగల్ తినడం ఇష్టం. పొంగల్ కోసం ఉదయాన్నే గుడికి వెళుతుండేవాడు. తాను అంగడికి వెళ్లి తన అన్నయ్య దుకాణం నుండి 30 పైసలు దొంగతనం చేసి, ఆ డబ్బుతో సినిమా చూసి వచ్చి బడి పిల్లలకు ఆ సినిమాన కథ చెప్పేవాడు. ఈ అల్లరి చేష్టలు గమనించిన వాళ్ళ అన్నయ్య సత్యనారాయణ శివాజీరావు ను “వివేకానంద బాలుర ఆశ్రమం” లో చేర్పించారు. ఏడేళ్ల వయస్సులో ఆశ్రమంలో తొలిసారి “అనుకరణ – అనుసరణ అనే నాటకంలో నటించారు. తన 12 ఏళ్ల  వయస్సులో తల్లి చనిపోయింది.

మొండితనం, తలతిక్క, క్షణికావేశం అలా అన్నీ అలవాటయ్యాయి. తల్లి చనిపోయాక తన జీవితం అదుపుచేయలేని స్థితికి వెళ్ళింది. శివాజీరావు స్నేహితులతో కలిసి జిమ్ కు వెళ్లేవాడు. వచ్చేటప్పుడు ఛాతి కనపడే విధంగా చొక్కా గుండీలు రెండు విప్పేసి, తల అటు ఇటు తిప్పుతూ గంభీరంగా నడుస్తుండేవారు. స్నేహితులతో కలిసి కల్లు త్రాగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఉల్లిగడ్డలు నమిలి వెళ్లేవాడు. వాళ్ళ అన్నయ్యను ఎవరైనా తిడితే సైకిల్ ఛైన్ పట్టుకుని వీధి వీధికి తిరిగేవాడు. తనతో రాజా, రాము, మరియస్వామి, చంద్రశేఖర్ అనే నలుగురు మిత్రులు ఉండేవారు. వీరు ఒకసారి అర్కెస్ట్రా కి వెళ్లారు. అందులో ఒక అమ్మాయి తనని చూసి నవ్వింది అని శివాజీరావు ఆ అమ్మాయిని అనుసరిస్తూ వెళ్లాడు. అతనితో స్నేహితులు కూడా వెళ్లారు. ఒక కారులో వచ్చిన వ్యక్తి వీళ్ళ ఐదుగురిని రక్షకభట నిలయం (పోలీస్ స్టేషన్) లో అప్పగించారు. చిన్నపిల్లలు అని భావించి మరుసటి రోజున ఆ వ్యక్తి వచ్చి వాళ్ళని విడుదల చేయించారు.

తొలి సంపాదన ఒక్క రూపాయి అరవై పైసలు…

ఈ అల్లర్ల మధ్య శివాజీరావు ఎస్.ఎస్.ఎల్.సి తప్పింది. వాళ్ళ నాన్నగారు తనను టైపింగ్ పంపించారు. అది వదిలేసి క్రికెట్ ఆడేవారు. ఎంపైర్ తో గొడవకు దిగేవాడు. ఇక లాభం లేదని తలచిన వాళ్ళ నాన్నగారు శివాజీరావును వర్క్ షాప్ లో హెల్పర్ గా పెట్టారు. రోజుకు తన జీతం ఒక్క రూపాయి అరవై పైసలు. అంటే ఈరోజు 100 కోట్ల పైనే పారితోషికం అందుకునే రజనీకాంత్ (శివాజీరావు గైక్వాడ్) జీతం అప్పట్లో రోజుకి ఒక్క రూపాయి అరవై పైసలు. అక్కడినుండి ఒక కార్పెంటర్ దగ్గర చేర్పించారు. అక్కడ రెండు రోజులకు మించి ఉండలేదు. అక్కడినుండి కాపర్ పరిశ్రమలో పనిలో పెట్టారు. నెలకు 60 రూపాయలు జీతం. అక్కడ పట్టుమని పది రోజులకు మించి చేయలేదు.

బస్సు కండక్టరు గా….

తన బంధువు సిఫారసు తో శామ్ రాజు పేట బజారులోని మార్కెట్ లో కూలిగా చేరాడు. ఇలా కాదని చివరికి బస్సు కండక్టర్ గా చేర్పించారు. బెంగుళూరు లోనే బి.టి.ఎస్ బస్సు డిపోలో కండక్టరు గా చేరారు. ఆ తర్వాత బి.టి.ఎస్ – 2 డిపో, జయానగర్ నాలుగవ డిపోలో బస్సు కండక్టర్ గా చేస్తూ వస్తున్నాడు. జీతం నెలకు 150 రూపాయలు, రోజుకు రూపాయిన్నర బేటా ఇచ్చేవారు, టోకెన్ నెంబర్ 33. శివాజీరావు కండక్టర్ గా ఉన్నప్పుడు తనకు డ్రైవర్ గా రాజ్ బహదూర్ ఉండేవారు. శివాజీరావు జీవితాన్ని మలుపు తిప్పడానికి కారణమైనది కూడా రాజ్ బహదూరే.

“కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ” లలిత కళా సమితి అసోసియేషన్ (1969) లో చేరిన శివాజీరావు గైక్వాడ్ “హిరణ్మయి మిత్రమండలి” లాంటి వాటిలో నాటకాలు వేస్తుండేవాడు. పగలంతా కండక్టర్ గా డ్యూటీ చేస్తూ , సాయంత్రం నాటకాలకు రిహార్సల్ చేస్తుండేవాడు. జీవితం ఒక గాడిలో పడినట్లు అనిపించింది తనకు. నాటకాలలో బరువైన పాత్రలు తీసుకుంటూ ఉండేవారు. “సదారమే”, “కురుక్షేత్ర”, “హెచ్చరు నాయక” లాంటి పౌరాణిక పాత్రలు వేస్తుండేవాడు. ఎన్టీఆర్ గారు “శ్రీకృష్ణ పాండవీయం” చూసి అలాంటి పాత్రలు వేసేవాడు.

కుటుంబం…

రజనీకాంత్ గారు లతా రంగాచారిని వివాహం చేసుకున్నారు. ఆవిడ యతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాల లో విద్యార్థిని. ఆమె తన కళాశాల మ్యాగజైన్ కోసం రజనీకాంత్ గారిని ఒకసారి ఇంటర్వ్యూ కూడా చేసింది. వీరిరువురు వివాహం 26 ఫిబ్రవరి 1981 నాడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రము లోని తిరుపతిలో జరిగింది. ఈ దంపతులకు ఐశ్వర్య రజనీకాంత్ మరియు సౌందర్య రజనీకాంత్ అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. రజనీకాంత్ సతీమణి లత “ది ఆశ్రమ్” పేరుతో పాఠశాలను నడుపుతోంది. ఐశ్వర్య రజనీకాంత్ 18 నవంబరు 2004 నాడు తమిళ నటుడు ధనుష్‌ను వివాహం చేసుకుంది. వారిరువురికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు జన్మించారు.

రజనీకాంత్ గారి చిన్న కుమార్తె పేరు సౌందర్య, తాను తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకురాలిగా, నిర్మాతగా, గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. సౌందర్య రజనీకాంత్ 03 సెప్టెంబరు 2010 నాడు ప్రముఖ పారిశ్రామికవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌ను వివాహం చేసుకుంది. వారికి వేద్ కృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. వీరు  సెప్టెంబరు 2016 లో విభేదాల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సౌందర్య వెల్లడించింది. జూలై 2017 లో ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఆమె 11 ఫిబ్రవరి 2019 నాడు చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో నటుడు, వ్యాపారవేత్త అయిన విశాఖన్ వనంగముడిని వివాహం చేసుకుంది.

సినీ రంగ ప్రవేశం…

శివాజీరావు దుర్యోధనుడి పాత్ర వేస్తూ విభిన్న రీతిలో గదను అటూ ఇటూ త్రిప్పుతూ భుజం మీద వేసుకొనేవారు. పౌరాణికాలు మాత్రమే కాకుండా, సాంఘిక నాటకాలు కూడా వేస్తూ ఉండేవారు. ఒకసారి “యారుసోలే” (ఎవరు వేశ్య) అనే నాటకంలో తండ్రి పాత్ర ధరించి మెప్పించారు. ఒకసారి శల్యుడి నాటకం వేస్తున్నారు. అందులో శివాజీరావు శల్యుడి పాత్ర పోషిస్తున్నాడు. అందుకోసం తాను 200 రూపాయలు టికెట్లు అమ్మాలి. మరియు తన సొంతంగా 25 రూపాయలు నాటకానికి ఇవ్వాలి. నాటకం చూడడానికి శివాజీ రావు కుటుంబ సభ్యులు వచ్చారు. తాను వంద రూపాయల టిక్కెట్లు మాత్రమే అమ్మగలిగారు. దాంతో వంద రూపాయలు ఇవ్వనందుకు సగం మేకప్ వేశారు. శివాజీరావు వంద రూపాయలు తర్వాత ఇస్తానన్నా వాళ్ళు వినలేదు  సగం మేకప్ వేసి వదిలేసారు. శల్యుడి పాత్ర సంభాషణలు తీసేశారు. దాంతో శివాజీరావు కు దుఃఖం ఆగలేదు. కన్నీళ్ళతో సగం మేకప్ తడిసిపోయింది. అక్కడి నుండి తాను సినిమాలలో నటించడానికి పునాదులు మొదలయ్యాయి.

కన్నడ సినిమా లో చేజారిన అవకాశం…

బస్సు డ్రైవర్ రాజ్ బహదూర్ మిత్రుడు చంద్రశేఖర్ సినిమాలలో దర్శకుడిగా వెళ్లారు. తనతో పాటు నాటకాలు వేసిన వాళ్లలో కొంతమందిని తీసుకుందామని శివాజీరావును “పులి బంతు హులి” అనే కన్నడ సినిమాలో వేటగాడి వేషం ఉందని శివాజీరావు కు 500 బాయానా ఇచ్చాడు. అప్పటిదాకా కండక్టర్ గా 150 రూపాయలు జీతం. అలాంటప్పుడు 500 అడ్వాన్స్ అనేది ఎక్కువనే. కానీ పాత్రనిడివి ఎక్కువ అవ్వడంతో తన పాత్రను తొలగించారు. ఆ విధంగా తాను కన్నడ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేయాల్సిన అవకాశం చేజారింది.

నటనలో శిక్షణకు ఎంపిక…

“దక్షిణ భారత సినిమా మండలి” ప్రకటిన చూసిన డ్రైవర్ రాజ్ బహదూర్ శివాజీరావు దరఖాస్తును నింపి 12 రూపాయలు ఫోటోలకు ఖర్చు చేసి దరఖాస్తు పంపించారు. కొన్ని రోజుల తరువాత ఇంటర్వ్యూకి రమ్మని ఆహ్వానం వచ్చింది. రాజ్ బహదూర్ శివాజీరావుని మద్రాసుకు పంపించాడు. అక్కడికి వెళ్లిన 40 మందిలో ఆరుగురు ఎంపికయ్యారు. వారిలో ఒకరు అశోక్, తాను కన్నడలో యాక్టర్.  ఒకరు రవీంద్రనాథ్ కన్నడ దర్శకులు. అమర్ ఉల్వా, చంద్రహాస్ హల్వా కన్నడలో “కాలేజ్ హీరో” సినిమాకు దర్శకుడు.  రఘునందన్ మరియు శివాజీరావు గైక్వాడ్  ఉన్నారు. శివాజీరావు కు ఖర్చులకు నెలకు 200 రూపాయలు రాజ్ బహదూర్ పంపించేవాడు. అవి అయిపోయేవి. డబ్బులు ఉండేవి కావు. రాజ్ బహదూర్ కు చెప్పేవాడు కాదు. అది తెలిసిన రాజు బహదూర్ తన బంగారు గొలుసు తనకి ఇచ్చారు. డబ్బులు అవసరం అయితే తాకట్టు పెట్టుకుని, నేను పంపించగానే విడిపించమని చెప్పారు. ఒక మిత్రుడు కోసం ఇంత సాహసం చేయడం మామూలు విషయం కాదు.

బాలచందర్ “అపూర్వ రాగంగళ్” తో తొలి అవకాశం…

అందులో ఎంపికైన ఆరుగురి కలిసి ఒక హోటల్ లో ఉండడానికి నిర్ణయించుకున్నారు. అరుణ హోటల్, 28 నెంబర్ రూమ్ లో ఉండేవారు. రఘునందన్ ఉడ్ ల్యాండ్ హోటల్ లో సాయంత్రం రిసెప్షనిస్ట్ గా చేరి, వీళ్ళ ఆరుగురికి రాత్రిపూట భోజనం పెట్టించేవాడు. పక్కనే ఉన్న ఏ.వీ.ఎం ఫంక్షన్ హాల్ లో ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుండేది. అప్పుడు వీరంతా వెళ్లి భోజనం చేసి వచ్చేవారు. ఒకరోజు ఇన్స్టిట్యూట్ లో భాగంగా కన్నడ నాటకం వేస్తున్నారు. దీనిని చూడడానికి బాలచందర్ గారు వచ్చారు. శివాజీరావు ప్రదర్శించిన నాటకాన్ని తిలకించిన బాలచందర్ గారు ఈ నాటకం అయిపోగానే “చూడు శివాజీ నీలో ఏదో ప్రత్యేకత ఉంది, అది నాకు అంతుపట్టడం లేదు. ఒకసారి నువ్వు వచ్చి నన్ను కలువు ఇంటర్వ్యూ చేస్తాను.  ఇంటర్వ్యూ చేసిన తర్వాత చెప్తాను” అన్నారు.

బాలచందర్ గారు చెప్పిన సమయానికి శివాజీ రావు ఇంటర్వ్యూకి వెళ్లాడు. అప్పుడు శివాజీరావు “తుగ్లక్” నాటకంలోని కొన్ని సన్నివేశాలను వేసి చూపించాడు. అప్పుడు నీలో స్పార్క్ ఉంది. నీవు తమిళం నేర్చుకుంటే నా తదుపరి సినిమాలోని అవకాశం ఇస్తానని చెప్పారు బాలచందర్ గారు. మళ్లీ బెంగళూరు వెళ్ళి తన మిత్రుడు, గురువు రాజ్ బహుదూర్ వద్ద తమిళం నేర్చుకుని బాలచందర్ గారిని కలిశాడు శివాజీరావు. “అపూర్వరాగంగల్” (తెలుగులో తూర్పు పడమర) లో విలక్షణమైన విలన్ పాత్రకు శివాజీరావు ఎంచుకున్నారు బాలచందర్ గారు. 

రజనీకాంత్ గా గా మారిన శివాజీరావు గైక్వాడ్…

అప్పటికే సినిమాలలో శివాజీ గణేషన్ గారు ఉండడంతో తన పేరు  చంద్రకాంత్, శ్రీకాంత్, రజనీకాంత్ లలో ఏదో ఒక పేరు ఎంచుకోవలసిందిగా తెలియజేస్తూ రజనీకాంత్ అయితే బావుంటుంది అని శివాజీరావు కు సూచించారు బాలచందర్ గారు. దాంతో శివాజీరావు గారు రజనీకాంత్ అనే పేరును ఎంపిక చేసుకున్నారు. అప్పటినుండి శివాజీరావు పేరు రజనీకాంత్ గా మారిపోయింది. అపూర్వ రాగంగళ్ నటించడం మొదలుపెట్టారు. బాలచందర్ గారు చాలా స్ట్రిక్ట్. అనుకున్నది అనుకున్నట్టు వచ్చేవరకు చిత్రీకరిస్తూనే ఉండేవారు. రజనీకాంత్ నటన పర్వాలేదు, కానీ సంభాషణలు పలకడం సరిగ్గా రాదు. శతాబ్ది ఎక్స్ ప్రెస్ వేగంతో సంభాషణలు పలికేవారు. దాంతో బాలచందర్ గారు విపరీతంగా కోప్పడేవారు. సినిమాల నుండి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు రజనీకాంత్ గారు. కానీ మిత్రుడి సలహాతో సంభాషణలు నెమ్మదిగా పలకడం అలవాటు చేసుకుని సినిమా పూర్తి చేశారు. అందులో హీరో కమలహాసన్ గారు.

చేజారిన కండక్టరు ఉద్యోగం…

కండక్టర్ ఉద్యోగం నుండి తొలగిస్తున్నామని రజనీకాంత్ గారికి బెంగళూరు నుండి ఫోన్ వచ్చింది. రజనీకాంత్ తో పాటు 13 మందిని తొలగించారు. తన ఉద్యోగం తొలగించవద్దు అని క్లర్క్ శివశంకర్ ని వేడుకున్నారు రజనీకాంత్ గారు. శివశంకర్ పై అధికారులకు సిఫారసు చేశాడు, కానీ ఫలితం లేదు. శివ శంకర్ వెనక్కి వచ్చే ఉద్యోగం ఇవ్వలేరు అని చెప్పారు. అలా రజనీకాంత్ గారితో చెప్పగానే కళ్ళ వెంబడి కన్నీటి చుక్కలు కార్చారు. 836 రూపాయల 60 పైసలు పిఎఫ్ డబ్బులు ఇప్పించారు శివశంకర్. ఆ డబ్బులు తీసుకొని మద్రాస్ కు వచ్చారు రజనీకాంత్ గారు. ఆ డబ్బులు తీసుకొని మద్రాసు వచ్చారు. పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు లేవు. అవకాశాల కోసం తిరుగుతున్నారు. మద్రాసులో జెమిని స్టూడియోస్ పక్కన సఫే హోటల్ దగ్గర నిలబడేవారు, టీ నగర్ లోని శాంత భవన్ హోటల్ దగ్గర కొద్దిసేపు నిలబడే వారు, అక్కడి నుండి పాండి బజారులో కాసేపు నిలబడే వారు రజనీకాంత్ గారు.

బాలు జేను కన్నడ సినిమాలో…

కన్నడ సినిమాకు మేనేజరు గా వున్న రాజన్న రజనీకాంత్ గారిని బెంగళూరులో రూపొందే కన్నడ సినిమాలో చిన్న వేషం ఇప్పించి 500 రూపాయల అడ్వాన్స్ ఇచ్చి పంపారు. కానీ ఆ సినిమాలో వేషం ఇవ్వలేదు. రజనీకాంత్ గారు అక్కడి నుండి మద్రాసుకు చేరుకున్నారు. కుణిగల్ నాగభూషణ్ గారు నిర్మాత బాలన్ గారిని ఒప్పించి అంబరీష్ గారి స్థానంలో రజనీకాంత్ గారిని తీసుకున్నారు. ఆ సినిమా పేరు బాలు జేను (1976). అందులో కూడా విలన్ పాత్రలోనే నటించారు.  1116 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. ఊటీలో 22 రోజులపాటు చిత్రీకరణ. తన చిత్రీకరణ పూర్తిఅయ్యింది. మైసూర్ లో రాజ్ కమల్ థియేటర్ ప్రక్కన మయూర అనే హోటల్లో ఉండి చిత్రీకరణకు వెళ్లేవారు రజనీకాంత్ గారు. తన చిత్రీకరణ అయిపోగానే అదనంగా నాలుగు రోజులు అక్కడే ఉన్నారు.

మయూర హోటల్ లో తనకు ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ఒకరోజు రాత్రి ఒంటి గంటకు హోటల్ కు వెళితే తలుపులు తీయలేదు. దాంతో గోడ దూకి వెళ్లి మేనేజర్ ను చితకబాదాడు రజనీకాంత్ గారు. మేనేజర్ ని కొట్టడం చూసి అందులో ఉన్న ఉద్యోగులు, పనివాళ్ళు తిరిగి రజనీకాంత్ గారిని కొట్టడం మొదలుపెట్టారు. రజనీకాంత్ గారి చొక్కా చిరిగింది, పెదవి పగిలింది. అరుపులు విన్న దర్శకులు కుణిగల్ నాగభూషణ్ గారు పరిగెత్తుకు వచ్చి వాళ్ళను వారించి, ఒక డ్రైవర్ ను ఇచ్చి రజనీకాంత్ ను కారులో పడుకోబెట్టి బయటకు పంపించారు.  వేసి ఉన్న గేటును కారుతో బద్దలు కొట్టి 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ఒక అటవీ ప్రాంతంలో పాడుబడ్డ బంగ్లా వద్ద ఆపాడు డ్రైవరు. తెల్లవారుజామున లేచి చూశాడు డ్రైవర్ నారాయణ జరిగినంత చెప్పి రజనీకాంత్ గారిని బెంగళూరుకు తీసుకువచ్చారు.

తెలుగులో తొలి సినిమా “అంతు లేని కథ”…

బాలు జేను అనే సినిమాలో పేరు రజనీకాంత్ గారి పేరు శివాజీరావు గైక్వాడ్ అనే ఉంటుంది. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ఒక షూటింగ్లో కలిసిన కుణిగల్ నాగభూషణ్ గారు ఆరోజు హోటల్లో జరిగిందంతా రజనీకాంత్ గుర్తు చేశారు. ఆ సందర్భంలో డ్రైవరు నారాయణ గురించి చెప్పారు రజినీకాంత్ గారు. నీకు ఇంకా డ్రైవరు గుర్తున్నారా అని ఆ దర్శకుడు అడుగగా, తనను నా సొంత డ్రైవరు గా పెట్టుకున్నాను, నా సొంత డబ్బులతో వాళ్ళ అమ్మాయి పెళ్లికూడా దగ్గరుండి చేశానని రజనీకాంత్ గారు చెప్పుకొచ్చారు. రాజన్న “కథా సంగమం” అనే కన్నడ  సినిమాకు నిర్మాత, దాని దర్శకులు పుట్టన్న కనగల్. “కథ సంగమం” సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించారు రజినీకాంత్ గారు. నిర్మాత రాజన్న తర్వాత రోజులలో మద్యానికి బానిసైన సందర్భంలో రజనీకాంత్ గారే రాజన్నను ఆదుకున్నారు.

తెలుగులో రజనీకాంత్ గారి తొలి సినిమా “అంతులేని కథ”. దక్షిణ భారతదేశంలోని దర్శకులలో అత్యధిక సంఖ్యలో నటీ నటులకు తెర జీవితాన్ని ఇచ్చినవారు బాలచందర్ గారు. కమలహాసన్, రజనీకాంత్, రాధ, జయసుధ, జయప్రద, ఇలా దాదాపు 100 మంది నటీ నటులను పరిచయం చేశారు బాలచందర్ గారు. తెలుగులో “అంతులేని కథ” లో రజనీకాంత్ గారు తాగుబోతు విలన్ గా నటించారు.ఒకానొక సందర్భంలో ఈ సినిమాలో రజనీకాంత్ గారి నటన సరిగ్గా రాకపోవడంతో విసుగు చెందిన బాలచందర్ గారు రజనీకాంత్ గారి చెంప పగలగొట్టారు.

ఎదిగినా ఒదిగి వుండే వైనం…

అతట్టడుగు మట్టి పొరల్లోంచి బయలుదేరి ఆకాశమంత ఎత్తు ఎదిగినందుకు, అంత ఎత్తులో నిలిచినందుకే కాదు, అంత ఎత్తుకు ఎదిగినా కూడా మట్టి వాసన మరిచిపోకుండా ఉన్నందుకు రజనీకాంత్ గారి గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అందుకే తన జీవిత చరిత్రను భారతదేశంలో సి.బి.యస్ పాఠ్య గ్రంథంలో కూడా చేర్చారు. తాను నటించిన రోబో సినిమా యొక్క నిర్మాణ వ్యవహారాలని ఐ.ఐ.యం అహ్మదాబాద్ వాళ్లు దానిని ఒక పఠనీయమైన అంశంగా, విశ్లేషణాంశంగా చూస్తున్నారు. రజినీకాంత్ గారి సినిమాలు జపాన్ లాంటి విదేశాలలో విడుదవ్వడంతో బాటు మలేషియా, మారిషస్ లాంటి దేశాలలో తన సినిమాలు విడుదలైనప్పుడు సెలవు కూడా ఇస్తుంటారు.

ఇంత ఎత్తుకు ఎదిగినా కూడా రజనీకాంత్ గారు తన మిత్రులు ఎవ్వరినీ మర్చిపోలేదు. రజనీకాంత్ గారు తన మిత్రులకు సహాయార్థం తమిళంలో “వల్లి” అనే సినిమా నిర్మించి ఆ డబ్బులను బ్యాంకులో తన మిత్రుల పిల్లల పేర్ల మీద వేయించారు. పదవీవిరమణ చేసి బెంగళూరులోని శ్యామ్ రాజుపేట లో ఉంటున్న తన మిత్రుడు ఆత్మీయుడు, బస్సు డ్రైవరు రాజ్ బహదూర్ ను తరుచూ కలుస్తుండేవారు రజనీకాంత్ గారు. రాజ్ బహదూర్ బ్రహ్మచారి, అవివాహితుడు. అతను రజనీకాంత్ గారిని ఏ సహాయం కూడా కోరేవాడు కాదు. ఒకసారి రజనీకాంత్ గారు రాజ్ బహదూర్ కి బ్లాంక్ చెక్ ఇచ్చి నీ ఇష్టం వచ్చినంత డబ్బులు వ్రాసుకోమని చెప్పగా అందుకు నిరాకరించిన అతడు దానిని వాడుకోలేదు. రాజ్ బహదూర్ ఇంటికి వెళ్ళినప్పుడు రజనీకాంత్ గారు తానే స్వయంగా ఛాయ్ కలిపి రాజ్ బహదూర్ కు ఇచ్చేవారు. అతను త్రాగిన తరువాత ఆ కప్పును తానే స్వయంగా కడిగేవారు రజనీకాంత్ గారు.

రజనీకాంత్ గారు మద్రాసులో కట్టించిన రాఘవేంద్ర కళ్యాణమండపం ప్రారంభోత్సవం చేయడానికి 14 డిసెంబరు 1989 నాడు పదకొండు మంది ప్రముఖులను ఆహ్వానించారు. శివాజీ గణేషన్, కరుణానిధి, వాజ్ పేయి, ప్రముఖ పాత్రికేయులు రామస్వామి లాంటి వారిని పిలిపించారు. ఆ పదకొండు మంది ప్రక్కన తన మిత్రుడు రాజ్ బహదూర్ ని నిలబెట్టారు. తనని అందరికీ పరిచయం చేశారు. చిట్టచివరికి రాజ్ బహదూర్ తోనే ఆ కల్యాణ మంటపం ప్రారంభోత్సవం చేయించారు. అందుకే శూన్యం నుండి శిఖరాగ్రానికి ఎదిగినందుకే కాదు, ఎదిగి కూడా ఒదిగినందుకు రజనీకాంత్ గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమాత్రం బేషజం లేకుండా, తాను బయటకు వచ్చినప్పుడు విగ్గు లాంటివి ధరించకుండా, లుంగీతో, హవాయి చెప్పులతో బయటకు రావడం చేసేవారు. నేను బయట శివాజీరావు గైక్వాడ్ నిమాత్రమే. రజినీకాంత్ ను చూడాలంటే తెరమీదనే చూడాలని చెప్పేవారు.

సశేషం…

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు “ఆట” అనే సినిమాలో ఒక పాట వ్రాశారు.

“ఇటునుంచి అటు వెళ్లారు సినిమా హీరోలంతా..

దివి నుండి దిగిరాలేదు మన తారాగణమంతా..

మనలోనే ఉండుంటారు కాబోయే ఘనులంతా…

పైకొస్తే జై కొడుతారు అభిమానులై జనమంతా”…

ఇది రజినీకాంత్ గారి జీవితానికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది.  దారం తెగిన గాలిపటం కొండలు, కోనలు దాటి హోరుగాలులు, జడివానలు తట్టుకొని, కొండ శిఖరాన్ని చేరువైన వైనం రజనీకాంత్ గారి జీవితం. ఆకాశాన్ని వీడిన వాన చినుకు వాతావరణంలోని పొరలన్నీ చీల్చుకొని ముత్యపు చిప్పలో చేరిన అద్భుతం రజనీకాంత్  గారి సినీ ప్రస్థానం. కష్టాల కొలిమిలో కాలినప్పుడే మనుషుల అసలైన వ్యక్తిత్వం బయటికి వస్తుంది, దానికి రజనీకాంత్ గారి జీవితం ఉదాహరణ. బాధల బరువులు మోసినప్పుడే బ్రతుకు తీపి అర్థమవుతుంది, దానికి రజనీకాంత్ గారే ఉదాహరణ. అపజయాలను, అవమానాలను అధిగమిస్తేనే విజయం వరిస్తుంది, దీనికి ఉదాహరణ రజనీకాంత్ గారే. ఒక ఆశయం, ఒక సముద్రం, ఒక ప్రభంజనం, ఒక బీభత్సం, ఒక తుఫాను, ఒక సునామి, ఒక రజనీకాంత్. రజనీకాంత్ ఒక అద్భుతం..

Show More
Back to top button