చాలా మంది చిన్నప్పటి నుంచి నేను అది కావాలి.. నేను ఇది చేయాలి అని కలలు కనేవారే. కానీ కొంతమంది విఫలం చెందుతారు. కొంతమంది వాటిని చేరుకోవడంలో విజయం సాధిస్తారు. కానీ పట్టుదలకు సంకల్పం తోడైతే ఎంతటి కఠిన లక్ష్యాన్నైనా సులభంగా చేరుకోవచ్చని నిరూపించాడు 22 ఏళ్ల సఫిన్ హసన్. అతి చిన్న వయసులోనే యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి అత్యుత్తమ ర్యాంకు సాధించి ఐపీఎస్ అయ్యి.. యువతకు ఆదర్శంగా నిలిచాడు. కష్టాలను చూసి భయపడక హసన్ ఎలా విజయం సాధించాడో ఇవాళ తెలుసుకుందాం.
గుజరాత్‌లోని కనోదర్ అనే ఓ చిన్న పల్లెటూరులో పుట్టిన హసన్ తల్లిదండ్రులు వజ్రాల గనుల్లో కార్మికులుగా పనిచేసేవారు. చదువుకి డబ్బు సరిపోకపోవడంతో తన తల్లి పార్టీలు, పెళ్లిళ్లలో రోటీలను తయారు చేసి డబ్బులు సంపాదించి ఫీజులు కట్టేదట. ఇతనికి 10 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు.. తన స్కూల్‌కి కలక్టర్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు, అక్కడ అందరూ తనకు ఇచ్చే గౌరవాన్ని చూసి.. అప్పుడే తాను పెద్దగా ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నాడట. పూటకు సరిగ్గా భోజనమే దొరికేది కాదని, కొన్నిసార్లు రాత్రి పూట ఆకలితోనే నిద్రపోవాల్సి వచ్చేదని హసన్ తెలిపాడు. తల్లి కష్టానికి ఫలితంగా SSCలో 92%, ఇంటర్‌లో 92% మార్కులతో పాసయ్యాడు.
అనేక కష్టాలకోర్చి 2018లో యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఆలిండియా స్థాయిలో 570 ర్యాంకును సాధించి, జామ్‌నగర్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు చేపట్టాడు. సివిల్ సర్వీసెస్ పరీక్ష అనేది మేధస్సుకు సంబంధించిన విషయం అని.. బాగా చదవడం, పరిశీలించడం చాలా అవసరమని హసన్ చెబుతున్నాడు. ‘ప్రతీ విషయానికి ఒక నేపథ్యం ఉంటుంది. ప్రతి విషయానికి భవిష్యత్తు ఉంటుంది. వీటిని విశ్లేషించ గలిగే సామర్థ్యం అలవర్చుకోవాలి. ఇవే సివిల్ సర్వీస్‌కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కావల్సిన ఆయుధాలు’ అని సఫిన్ హసన్ తెలిపాడు.