Impact-Site-Verification: b20cfd03-d90b-4ecc-ae79-d8e03144682f
CINEMATelugu Cinema

శ్రోతల హృదయవీణలపై మధురస్వరాలు పలికించిన సంగీత “చక్రవర్తి”

ఈయన పేరు “అప్పారావు చెవికాడ”. పాండీ బజార్ హమీదియా హోటల్ ముందు ఎవరో పరిచయం చేశారు అతన్ని. “ఏం చేస్తుంటారు”? మద్రాసు కొత్తగా వచ్చిన అతను వినయంగా అడిగాడు అప్పారావుని. “ఏదైనా చేస్తాను. రచన, సంగీతం, నటన, దర్శకత్వం, ఒళ్ళు మండితే ఫైటింగ్, డాన్సింగ్, ఎడిటింగ్ ఏదైనా చేస్తాను. ఇచ్చే దమ్మున్న వాడు దొరకాలి అంతే” అని మొహం అంతా వ్యాపించేటట్టుగా పెద్ద నవ్వు నవ్వాడు అప్పారావు.

ఈ మధ్యన చటర్జీ గారి “మూగ ప్రేమ”, “శారద” కి సంగీత దర్శకత్వం చేశాడితను. అప్పారావుని పరిచయం చేసిన అతను మళ్లీ చెప్పాడు. వాటికి సంగీతం సమాకూర్చింది “చక్రవర్తి” కదా అనుమానంగా అడిగాడు అతను. ఈ అప్పారావు గాడే ఆ చక్రవర్తి. సంగీత అప్పారావు అనడం కంటే సంగీత చక్రవర్తి అనడం ఘనంగా ఉంటుందని నలుగురు అనడంతో పేరు మార్చేసుకున్నా అంటూ మళ్ళీ నవ్వాడు. ఈసారి ఆ నవ్వు అతని నుండి పొంగి చుట్టూ ఉన్న అందర్నీ ముంచేసింది. మనుషులంతా నవ్వుతారు, నవ్వగలరు. కానీ కొంతమంది నవ్వుల్లోనే నిజాయితీ, అమాయకత్వం, నిర్మలత్వం ఉంటుంది. చక్రవర్తి అంతటి నవ్వు ఆ నవ్వే.

చక్రవర్తి నిండుకొలను లాంటివాడు. చవిటి పర్రల్లో, హరితశాద్వలాల్లో, కొండ కోనల్లో యథేశ్చగా ఒరుసుకుంటూ తన ఉరవడితో అవరోధాలను ప్రక్కకు జరుపుకుంటూ చిమ్ముకుపోయే ఏరులాంటివాడు. ఔపమ్యంతో పనిలేదు. అతన్ని చూస్తేనే తెలుస్తుంది క్షణమైనా నిలువని ప్రవాహ లక్షణం కలవాడు.  అప్పుడు చిత్ర పరిశ్రమలో ఉండే అగ్ర దర్శకులు, అగ్ర నిర్మాతలు టాప్ బ్యానర్లు అతని కోసం, అతని ట్యూన్ కోసం తిరుగుతున్నా ఒకేరోజు నాలుగైదు థియేటర్స్ అతని పేరు మీద బుక్ చేసి ఉన్నా, ఒక్కరోజులో ఏడు, ఎనిమిది పాటలు రికార్డింగు చేసిన సంఘటనలు ఉన్నా ఆంధ్రదేశంలో వినిపించే పాటలలో తొంభై శాతం అతనివే ఉన్నా, అతనికి గర్వం, పొగరు, ఫోజు లాంటి అదనపు ఆకర్షణలు ఏ రోజునా రాలేదు. ఎప్పుడూ వినయంగా, గౌరవంగా, స్నేహంగానే ఉండేవాడు.

పూర్వం కాశీ మజిలీ కథలలో ఉత్తరదిక్కు వెళ్లొద్దంటే వెళ్లిన రాకుమారుడి లాగా ఎలాంటి అసాధారణ గమ్యమైనా చేరుకోవాలనే పట్టుదల ఉంది. కనుకనే చక్రవర్తి సంగీతం చేస్తే చిత్రంలో కనీసం సగం పాటలైన హిట్ అవుతాయని “హామీ” నిర్మాతలకు, “ధీమా” ప్రేక్షకులకు ఏర్పడింది. చక్రవర్తి సంగీతం ఛందోరాహిత్యంలో చందస్సును సృష్టించుకున్న సహజ సాహిత్యం వంటిది. సాహిత్య రాహిత్యంలో సరస హృదయాలను అలరింపగల ఆమని కోయిల తీయని పిలుపు వంటిది. వేటూరి, బాలు, చక్రవర్తి ముగ్గురిదీ చాలా గొప్ప కలయిక. గోలపాట, గాలి పాట, లాలి పాట, జాలి పాట, గుండెను తాకే జోల పాట, ఏదైనా సరే అశువుగా వేటూరి వ్రాసేయడం, అతి తేలికగా చక్రవర్తి ట్యూన్ కట్టేయడం, అనర్గళంగా బాలు పాడేయడం జరిగిపోయేది. ముగ్గురికి కూడా ఒకరంటే ఒకరికి వళ్ళమాలిన అభిమానం, ఇష్టం ఉండేది. కాకపోతే అప్పుడప్పుడు అలకలు, చిన్న చిన్న అల్లర్లు.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    కొమ్మినేని అప్పారావు

ఇతర పేర్లు   :    చక్రవర్తి 

జననం    :    08 సెప్టెంబరు 1936

స్వస్థలం   :  పొన్నెకల్లు గ్రామం, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా

తండ్రి   :   బసవయ్య

తల్లి     :   అన్నపూర్ణమ్మ 

జీవిత భాగస్వామి   :   రోహిణీ దేవి 

పిల్లలు   :   నలుగురు కుమారులు

వృత్తి      :    నేపథ్య గాయకుడు , సంగీత దర్శకుడు, చిత్ర దర్శకుడు 

మరణ కారణం   :   అనారోగ్యం 

మరణం   :   03 ఫిబ్రవరి 2002

నేపథ్యం..

చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. అప్పారావుది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా, పొన్నెకల్లు గ్రామం. వీరి తల్లిదండ్రులు కొమ్మినేని బసవయ్య, అన్నపూర్ణమ్మ. వారిది వ్యవసాయ కుటుంబం. బసవయ్య, అన్నపూర్ణమ్మలకు ముగ్గురు సంతానం. హైమావతి దేవి, అప్పారావు, శేషగిరిరావు. వీరి పుట్టిన ఊరు పొన్నెకల్లు గుంటూరు పట్టణానికి 9 మైళ్ళ దూరంలో ఉంటుంది. కొమ్మినేని అప్పారావు 8 సెప్టెంబరు 1936 వ తేదీన జన్మించారు.   కొమ్మినేని అప్పారావు ప్రాథమిక విద్య సొంతవూరు అయిన పొన్నెకల్లులోనే సాగింది. ఆ తరువాత తాడికొండలోనూ, గుంటూరులోనూ అప్పారావు విద్యనభ్యసించారు. గుంటూరు హిందూ కళాశాలలో డిగ్రీ చదివారు. వీరి తల్లిదండ్రులు సంగీతజ్ఞానం కలవారు. అప్పారావు తండ్రి రంగస్థల నటుడు కూడా. తల్లి మంచి గాయని. తన తల్లి ప్రభావం చక్రవర్తి మీద ఎంతో వుంది.

ఆ కారణంగా అతనికి సంగీతంపై విపరీతమైన ఆసక్తి కలిగింది. అప్పారావు ఉత్సాహం చూసిన తన తండ్రి గారు గుంటూరులో ఉన్న మహావాది వెంకటప్పయ్య శాస్త్రి దగ్గర సంగీతం నేర్పించారు. ఒక పక్క చదువు, మరో పక్క సంగీతాభ్యాసం నిరాటంకంగానే సాగుతూ వచ్చాయి. గుంటూరులో బి.ఏ.ఎకనామిక్స్ చేసిన అప్పారావు, హిందీ విశారద, టైపు రైటింగ్ లో హయ్యర్ పూర్తి చేశారు. కూని రాగాలతో ప్రారంభమైన తన సంగీతం పట్ల శ్రద్ధ కీర్తిశేషులు ఘంటసాల గారి కుంతీ కుమారి పద్యాలతో మరింత పెరిగింది. తెలుగుదేశానికి లలిత సంగీతం అంటే అర్థం చెప్పిన ఘంటసాల గీతాలను అప్పారావు ఎక్కువగా అనుసరించేవారు. కీర్తిశేషులు మహావాది వెంకటప్పయ్య గారి వద్ధ శిష్యరికం చేసినా కూడా అప్పారావుకు సంగీతం పెద్దగా అబ్బలేదు. తన చదువుకు సంగీతానికి సామ్యం సరిగ్గా కుదరలేదు. అయితే మేల్కొని ఉన్నంత సేపు పాడుకోవడమే తనకు ధ్యాసగా అయిపోయింది.

సంగీత సారథ్యం…

1968 ప్రాంతంలో వచ్చిన “భలే గూఢచారి” అనే సినిమాకి సంగీత దర్శకుడు పేరు “చక్రవర్తి” అని చూసి ఏ బెంగాలీ వాడో, హిందీ వాడో అనుకున్నారు. కొంతమంది సినీ సంగీతం మీద గురి ఉన్నవారికి “కళ్యాణి రాగం” మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. సర్వసాధారణంగా ఆ చిత్రంలో “లోకులంతా చూస్తారు నా రాజా” అన్న పాట ఆ రాగంలోనే మలచబడడం విని ఇతను ఎవరో గాని బాగానే కట్టాడు అని అనుకున్నారు. ఇదిలా ఉండగా “మూగ ప్రేమ” సినిమా విడుదల అయ్యింది. అందులోని “కళావతి” రాగంలో ఉత్తరాది కళలు సంతరించుకున్న “ఈ సంజెలో కేంజాయలో” పాట “మాది ప్రత్యేకమైన అభిరుచి” అని గీర్వాణం పోయే వారిని సైతం ఒక్కక్షణం పాటు ఎవరీ చక్రవర్తి అని ఆలోచించుకునేటట్టు చేసింది.

“తల్లి కూతుళ్లు” లో రాజబాబు నటించిన రెండు పాటలు “రామా హరి రామ రమాహరి”, “చిట్టి పొట్టి బేబీ” లను పాటల పుస్తకంలో “చక్రవర్తి” అని వ్రాసి ఉండడం చూసి వాకబు చేస్తే “చక్రవర్తే అప్పారావు, అప్పారావే చక్రవర్తి” అని తేలింది. చక్రవర్తి “ఇదాలోకం” లోని “నీ మనసు నా మనసు ఏకమై”, “గుడిలోన నా సామి”, “నిత్య సుమంగళీ నీవమ్మా” పాటలతోనూ, “శారద” సినిమాలోని పాటలన్నిటితోను జనాల హృదయాలలో గూడు కట్టేసుకున్నారు. “జేబుదొంగ”, “బలిపీఠం”, “చీకటి వెలుగులు”, “జ్యోతి”, “నా పేరే భగవాన్”, “బాబు”, “కల్పన”, “ఆమె కథ”, “జీవితంలో వసంతం”, “జీవన తీరాలు”, “యమగోల”, “మల్లెపూవు”, “ప్రేమాభిషేకం”, “అమరజీవి”, “చంటబ్బాయ్” చిత్రాలు చక్రవర్తిని తిరుగులేని సంగీత దర్శకుడుగా విని వీధుల్లోనే కాదు ప్రేక్షకుల “వీను వీధుల” లో నిలబెట్టాయి.

నటనతో కూడా…

“నాగులేటి వాగులోనా”, “గుడిలోన నా సామి”, “కలిసి పాడుదాం తెలుగు పాట”, “చూశాను పొద్దంతా”, “సిరిమల్లె పువ్వల్లే నవ్వు”, “దిక్కులు చూడకు రామయ్య”, “పువ్వులనడుగు గువ్వలనడుగు”, “ఓరయ్యో చంద్రయ్య కొడకా”, “ఓలమ్మీ తిక్కరేగిందా”, “వయసు ముసురుకొస్తున్నదీ వాన మబ్బులా”, “రావయ్య ఓ తెలుగు బావ”, “రాయి రా దేవుడు తాగినా వూగడు”, “నీలాల నింగిలో మేఘాల తేరులో”, “ఎవరీ చక్కని వాడు”, “ఓహో లలిత నా ప్రేమ కవిత”, “చకచక లాడే చక్కని బుల్లెమ్మా”, “ఎవరికి తెలుసు చితికిన మనసు” లాంటి పాటల ఎఫెక్ట్ కోసం రాగపరిమితిని దాటి రక్తి కట్టించే చక్రవర్తికున్న “రసపట్టుదల” కి తార్కాణాలుగా నిలిచిపోతాయి.

ఒకపక్క సంగీతాన్ని ఆస్వాదిస్తూ పాటలు పాడుతూ, మరో ప్రక్క “ఊర్వశి” లో “సంజీవ్ కుమార్” కి, “కల్పన” లో వరప్రసాద్ కి, “మన్మథలీల”, “ప్రేమ పూజారి” లలో కమలహాసన్ కి, “ప్రేమలేఖలు”లో అనంత నాగ్ కి, “ఆమె కథ” లో రజనీకాంత్ కి, “సీతారామ కళ్యాణం” లో రాముడిగా వేసిన రవికి, “మనీ” లో పరేష్ రావెల్ కి గాత్రదానం చేశారు. అంతే కాకుండా “గోపాలరావు గారి అమ్మాయి” లో చెవిటి లాయర్ గా, “పక్కింటి అమ్మాయి” లో తమిళ సంగీత మాస్టారుగా, “ఆమె కథ” లో ఇన్సూరెన్స్ ఏజెంట్ గా, “అల్లరి బుల్లోడు” లో రేషన్ ఆఫీసర్ గా, “సీతాపతి సంసారం” లో తిండిపోతు అధికారిగా, “అతనికంటే ఘనుడు” లో మోటారుషాపు యజమానిగా పాత్రధారణ చేశారు.

దర్శకుడు కాబోయి.. 

సంగీత దర్శకుడు చక్రవర్తి ఒకప్పుడు డబ్బింగ్ పనులతో బాటు చిత్రాలకు సహాయ దర్శకత్వం కూడా చేసేవారు. ఒకసారి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి కొందరు మిత్రులు డబ్బుతో సహా మద్రాసు వచ్చి ఒక చిత్రాన్ని తీసి పెట్టమని చక్రవర్తిని అడిగారు. మరునాడు చటర్జీ గారు చక్రవర్తిని కలిసి “మూగ ప్రేమ” చిత్రానికి నువ్వే సంగీత దర్శకుడివి అన్నారు. చిక్కుల్లో పడ్డట్టు అయ్యింది తనకి. ఆరోజు రాత్రి చక్రవర్తి విపరీతంగా మదనపడ్డారు. అప్పుడు తన భార్య శ్రీమతి రోహిణి దేవి “కరణేషు మంత్రి” అనే సూక్తిని నిజం చేస్తూ దర్శకుడుగా ఒక చిత్రం అపజయం పాలైతే మరో చిత్రం రావడం కష్టం. అలాగే సంగీత దర్శకుడుగా ఒక పాట పోయినా కూడా ఇంకో పాటతో ఆకట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కో చిత్రంలో కనీసం నాలుగు పాటలైనా ఉంటాయి. కాబట్టి సంగీత దర్శకుడిగా మంచి భవిష్యత్తు ఉంటుంది అనే దివ్యమైన సలహా ఇచ్చారు. ఆ సూచన చక్రవర్తికి బ్రహ్మాండంగా ఉందనిపించింది. ఇదే సమయముగా భావించి సంగీత దర్శకుడికే ఓటేశారు. కానీ చక్రవర్తితో ఆరోజు సినిమా తీయాలనుకుని వచ్చిన సత్తెనపల్లి మిత్రులకు చిత్రం తీయలేదు. ఎప్పటికైనా చక్రవర్తి దర్శకత్వం చేయాలంటూ అలానే ఉండిపోయారు వారు.

ఒక్క రాత్రిలో నాలుగు పాటలు…

ఒక్కోసారి సంగీత దర్శకులకు మనస్సు స్థిమితంగా ఉండాలే గానీ ఒక్క పాటకు ట్యూన్ కట్టడానికి ఐదు నిమిషాలు సరిపోతుంది. సంగీత దర్శకులు, నటులు చక్రవర్తి అదే కోవకు చెందుతారు. తాను సంగీతం కోసం ఊటీ, కాశ్మీర్ లకు వెళ్లాల్సిన అవసరం లేదు. తనకు ఫ్లాష్ వస్తే అది ఎక్కడైనా ఒకటే. తనకు ఏకాగ్రత రానప్పుడు ఆరు నెలలు కూర్చున్నా ఒక్క పాటకు కూడా ట్యూన్ ఇచ్చేవారు కాదు. ఈనాటికీ ప్రశంసలందుకుంటున్న “ప్రేమాభిషేకం” సినిమాలోని పాటలలో నాలుగింటిని ఒక్క రాత్రిలో కంపోజ్ చేశారు అంటే అతిశయోక్తి కాదు. చక్రవర్తి సుమారు రాత్రి 11 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ లో టెలిఫోన్ రూమ్ ప్రక్కన గదిలో పాటలకు సంగీతం అందించడం మొదలుపెట్టారు. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ గార్లు చలిని ఆపుకుంటూ “టీ” లు త్రాగుతూ పాటలకు సంగీతం అందించడం పూర్తి అయ్యేవరకు అలాగే ఉన్నారు. అలా నాలుగు పాటలు పూర్తయ్యాయి. అవి “తారలు దిగి వచ్చిన వేళ”, “నందనం అభివందనం”, “కోటప్పకొండకు వస్తావని మొక్కుకున్నా”, “నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని”. అందరి తృప్తి మేరకు అవి పూర్తయ్యేసరికి తెల్లవారుజాము మూడున్నర అయ్యింది. చక్రవర్తి మెడ జివ్వు జివ్వున లాగుతున్నా కూడా, అలానే ఉదయం విమానంలో మద్రాసు బయలుదేరి వెళ్ళిపోయారు. అక్కడ 9 గంటలకు  పాటల రికార్డింగ్ కు అందుకున్నారు.

అనుకరణకు ఇష్టపడని చక్రవర్తి…

ఏదైనా ట్యూన్ ని కాపీ చెయ్యమంటే సంగీత దర్శకుడు చక్రవర్తి చాలా బాధపడేవారు. వీలైనంతవరకు నిర్మాతలకు నచ్చజెప్పి ఆ ప్రయత్నాన్ని విరమింపజేయడానికి చూసేవారు. “పదహారేళ్ల వయస్సు” సినిమాలో “సిరిమల్లె పువ్వా” పాటకి తమిళంలో హిట్ అయిన “సింధూరపువై” అనే పాటను యథాతథంగా తెలుగులో సంగీతం చేయమన్నారు చక్రవర్తిని. వేరే పాటను ప్రత్యేకంగా బాగా చేస్తానని ఎంతగానో నచ్చచెప్పారో చక్రవర్తి. ఇంతలో ఢిల్లీ నుంచి ఒక వార్త వెలువడింది. అది విని అందరూ సంతోషించారు గానీ, చక్రవర్తి మాత్రం ముఖం ముడుచుకున్నారు. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే జానకి తమిళంలో పాడిన “సింధూరపువై” పాటను జాతీయ బహుమతికి   ఎంపిక చేశారట. ఇక ఆ పాటను తెలుగులోకి అనుకరించక తప్పదని తెలిసిపోయింది చక్రవర్తికి. అసలు ఆ తమిళ పాటని అంత బాగా ఎందుకు పాడావు? అని జానకితో అంటూ నిస్సహాయంతో కూడిన బాధతో మదనపడ్డారు కూడా. ఏది ఏమైనా చివరికి ఆ పాటను తెలుగులో అనుకరించక తప్పలేదు చక్రవర్తికి.

గాయకుడిగా చక్రవర్తి…

చక్రవర్తి మద్రాసు వచ్చి హెచ్.ఎమ్.వి. వారికి గ్రామఫోను పాటలు పాడటం మొదలుపెట్టారు. చక్రవర్తికి ఒక రికార్డింగులో సంగీతదర్శకులు రాజన్, నాగేంద్రలు అవకాశం ఇప్పించి పాడించారు. బి.విఠలాచార్య చక్రవర్తికి తన సినిమా జయ విజయ (1959)లో “ఆడాలి … పెళ్ళాడాలి” అనే పాటను పాడించారు. ఆ పాటను చిత్రంలో హాస్యనటుడు బాలకృష్ణ పాడతారు. చక్రవర్తి సినిమాలలో పాడిన మొదటి పాట ఇదే. సినిమాలలో చక్రవర్తి 200లకు పైగా పాటలు పాడారు. కొన్ని కలిసి పాడినవి ఐతే, మరికొన్ని యుగళ గీతాలు. పరమానందయ్య శిష్యుల కథ (1966) సినిమాలో ఘంటసాలతో “పరమగురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడురా” అనే పాటను పాడారు. బంగారు సంకెళ్ళు (1968) చిత్రంలో “తొలగండెహే” అనే తాగుడు పాటని రాజబాబుకి పాడారు. నిలువు దోపిడి (1968)లో ఎన్.టి.రామారావుకి ఒక పద్యం చదివినప్పుడు, నాగార్జున పద్యాలు, శ్లోకాలు చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. గాయకునిగా “తల్లీ కూతుళ్ళు”, “దేవి లలితాంబ”, “నిలువుదోపిడీ”, “రాముని మించిన రాముడు”, “పక్కింటి అమ్మాయి”, “స్వరాజ్యం” వంటి సినిమాలలో చక్రవర్తి పాటలు పాడారు.

చక్రవర్తి ఔదార్యం..

“అభినందన” సంస్థ గత చాలా సంవత్సరాలుగా ఎంతోమంది కళాకారులను సంగీత దర్శకులను పురస్కారాలతో సత్కరించింది. అయితే చాలామంది పురస్కారాలను తీసుకోవడానికి ఒప్పుకొని విమాన రవాణా చార్జీలను తెప్పించుకొని వెళ్లకుండా కనీసం ఫోన్ అయినా చేయకుండా ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. 04 డిసెంబరు 2001 ఘంటశాల గారి జన్మదిన సందర్భంగా “అభినందన” వారు అవార్డును ఇస్తామని ఫ్లైట్ చార్జెస్ పంపుతామని చక్రవర్తి గారికి ఫోన్ చేస్తే, ఆయన తాను సీనియర్ సిటిజెన్ ను అని 4600 రూపాయలు పంపితే చాలు అని ఫోన్లో చెప్పారు. దాంతో “అభినందన” నేను పంపాను అనారోగ్య కారణాల వలన ఆయన అవార్డు ఫంక్షన్ కి రాలేకపోయారు. అభినందన వాళ్ళు చాలా బాధపడ్డారు. 15 రోజుల తర్వాత ఆయన హైదరాబాదుకు వచ్చినప్పుడు అభినందన వారికి ఫోన్ చేసి భవానీ గారు మీ అవార్డుల ఫంక్షన్ కు నేను రాలేకపోయాను. మీరు ఇచ్చిన ఫ్లైట్ చార్జెస్ 4600 రూపాయలు మీకు తిరిగి ఇస్తాను అని నన్ను పిలిపించి నాకు ఆ డబ్బు వాపసు ఇచ్చేశారు. 18 సంవత్సరాల అభినందన అనుభవంలో డబ్బు వాపసు రావడం నాకు ఇదే మొదటిసారి. ఆశ్చర్యంతో, ఆనందంతో ఏం మాట్లాడాలో తెలియక అవార్డు ఆయనకు అందజేసి భవానీ గారు ఇంటికి వెళ్లిపోయారు.

సాహిత్య చక్రవర్తి…

చక్రవర్తి మంచి చమత్కారి. ఆడతాడు, పాడతాడు, ఆడిస్తాడు, పాడిస్తాడు. లయ చెప్పినట్లు వింటుంది. సాహిత్యంలో కూడా తాతకు దగ్గులు నేర్పుతాడు.

మానవుడు అంటే ఎవరు..??

మమతల చెఱలో వేదన ఊరిలో

సతమతమయ్యే ఒక జీవి..

ప్రేమికుడు అంటే ఎవరు..?

తియ్యటి కలతో ఎగిరే అలలా

చాలని వయసున తీరని తమితో

కాల ప్రవాహంలో తీరం తెలియక

పయనించే ఒక నావికుడు..

బాధితుడు అంటే ఎవరు..?

నీరైపోయే రక్తం విలువ

నిరంతరంగా అంకితమిచ్చే

నిరంకుశత్వపు బానిస

నిత్యం సచ్చే కార్మికుడు..

స్వర్గం అంటే ఏది..?

ప్రతీ మనిషీ ఒక దైవం

ప్రతీ హృదయం ఒక ఆలయం

ఆర్తులు లేని ధూర్తులు లేని

పండే నేల నిండే కడుపు వెలిసిన స్థానం అదీ..

దేవుడు అంటే ఎవరు..?

(ఎవడు) నింగిని భూమిని దూరం చేసి

సమస్త జీవుల మోసం చేసి

ఎండమావుల సాగరాలలో

భక్తుల దొలగుచు

పరవశమొందే ఒక మాంత్రికుడు..

సంగీత దర్శకుడు చక్రవర్తి వ్రాసి ఇచ్చినవి నిజమైన నిర్భయ నిత్యసత్య నిర్వచనాలు..

మాటంటే మాటే…

కొన్ని సంవత్సరాలుగా సంగీత దర్శకుడు చక్రవర్తి ఒక అలవాటును పాటించేవారు. అది ప్రతీ సంవత్సరం జనవరి ఒకటో తేదీన బాలసుబ్రమణ్యం, సుశీల పాడగా ఒక యుగళగీతాన్ని రికార్డు చేయడం. ఇది ఇంచుమించుగా ఆయన సంగీత దర్శకుడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించినది మొదలుగా ఆ అలవాటును అవలంబిస్తూ వచ్చారు. బాలసుబ్రమణ్యం, సుశీల కూడా తమ దినచర్యలో జనవరి ఒకటవ తేదీన చక్రవర్తి రికార్డింగ్ అని వ్రాసుకుంటూ ఉండేవారు. వాళ్లకి చివరి నిమిషం వరకు కబురు చేయకపోయినా సరే వారు తయారుగా ఉండేవారు. ఒక్కసారి మాత్రం చక్రవర్తికి చిన్న చిక్కొచ్చి పడింది. శ్రీమతి సుశీల దగ్గర అదే రోజుకి ఎమ్మెస్ విశ్వనాథన్ డేట్ తీసుకున్నారు. చక్రవర్తి, ఎమ్మెస్ విశ్వనాథన్ రికార్డింగులను పరిశీలిస్తే చక్రవర్తి రికార్డింగులు కొంచెం త్వరగా అయిపోతాయి.

ఆ సంగతి శ్రీమతి సుశీల చక్రవర్తికి చెప్పేసి మీ రికార్డింగ్ కొంచెం ముందుగా అయ్యేటట్టు చూడగలరని అడిగారు. చక్రవర్తి కూడా సరే అన్నారు. 31 డిసెంబరు  అనగానే పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతారు కనుక చాలా హడావుడిగా ఉంటుంది. ఆ రోజు చిత్రపరిశ్రమలో అయితే హడావుడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అదీగాక చక్రవర్తి తీరికలేని సంగీత దర్శకుడు కాబట్టి మోహమాటాలు ఇంకా ఎక్కువ మోతాదులోనే ఉంటాయి. ఉదయాన్నే రికార్డింగు అయిపోవాలంటే మ్యూజిక్ సంబంధించిన బిట్లు అన్ని గాయనీ గాయకులు రాకముందే సిద్ధం చేసుకుని ఉండాలి. రాత్రి పన్నెండు గంటల వరకు పార్టీలో పాల్గొని, తిరిగి విజయా గార్డెన్స్ కు వచ్చి నిద్రపోకుండా ఉదయం 8:30 కల్లా సుశీల, బాలు పాడవలసిన పాట మొత్తం బిట్లతో సహా పూర్తి చేసేసి అనుకున్న ప్రకారం జనవరి ఒకటో తేదీన వారి చేత పాడించి రికార్డు చేసి సుశీలను ఎమ్మెస్ విశ్వనాథన్ రికార్డింగు కోసం ముందుగా అనుకున్న సమయానికే పంపించారు చక్రవర్తి.

వివాహం…

చక్రవర్తి తన మేనమామ కుమార్తె అయిన రోహిణి దేవిని వివాహం చేసుకొని 1958లో కుటుంబంతో కలిసి మద్రాసు చేరాడు. వీరికి నలుగురు కుమారులు. దర్శకుడిగా రాణించిన కొమ్మినేని శేషగిరిరావు చక్రవర్తి గారి తమ్ముడే. చక్రవర్తి రెండవ కుమారుడు శ్రీ కూడా తెలుగు సినిమా సంగీతకారుడిగా విశేషంగా రాణించాడు.

మరణం…

తన అద్భుతమైన బాణీలతో చక్రవర్తి సంగీత దర్శకత్వం అందించిన చిత్రాల సంఖ్య 959. 1000 చిత్రాలను పూర్తిచేయాలని తాను తపన పడేవారు. ఆ మిగిలిన సంఖ్య కూడా పూర్తిచేసి 1000 చిత్రాల దర్శకుడిగా రికార్డు నెలకొల్పాలని చక్రవర్తికి ఆశగా వుండేది. చివరి సారిగా అమ్మోరు చిత్రానికి సంగీతాన్ని అందించిన చక్రవర్తి 03 ఫిబ్రవరి 2002 నాడు అనంత లోకాలకు వెళ్లిపోయారు. వీరి శిష్యుడు ఏ.ఆర్.రెహమాన్ ప్రపంచ స్థాయి గుర్తింపు పొంది ఆస్కార్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. చక్రవర్తి రెండవ కుమారుడు అయిన శ్రీ సినీ సంగీత రంగంలో పనిచేస్తున్నాడు.

ఉత్తమ సంగీత దర్శకుడిగా “నేటిభారతం” (1983), “శ్రావణ మేఘాలు” (1986) చిత్రాలకు నంది బహుమతులను అందుకున్నారు చక్రవర్తి. ఎక్కడో రాలిన ఓ చిన్న చినుకు నీరై.. ఏరై.. వరదయి ముంచేసినట్టు, ఓ నాటి అప్పారావ్ చక్రవర్తి అయి.. సంగీత చక్రవర్తి అయి.. ప్రతి నోటా తన పాట పాడుకునేటట్లు చేసి హఠాత్తుగా ఎటో వెళ్లిపోయాడు.. ఎప్పుడైనా రాత్రివేళ ఒంటరిగా కూర్చుని.. చక్రవర్తి చేసిన అప్పటి పాటలు కొన్ని వింటుంటే ఎందుకో తాను జాలిగా నవ్వుతున్నట్టు అనిపించి కళ్ళ నీళ్లు కదులుతాయి.. తేరుకొని చూస్తే చక్రవర్తి మనకు అగుపించడు.. తన పాట మాత్రమే అగుపిస్తుంది..

భారత తపాలశాఖ వారు గుంటూరులో 9 సెప్టెంబరు 2014 నాడు చక్రవర్తి గారిపై ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు.

Show More
Back to top button