Telugu Cinema

చిత్ర సీమలో స్వచ్ఛమైన తల్లి పాత్రలకు పెట్టింది పేరు. డబ్బింగ్ జానకి.

డబ్బింగ్ జానకి ఒంటికి నలుగు పెట్టి.. మొఖానికి ఇంత పసుపు… కురులకు సాంబ్రాణి పొగ పెట్టిస్తే… అచ్చం అమ్మవారిలా ఉంటుంది కదండీ…. ” అని సప్తపది లో జానకి గారు చెప్పిన సంభాషణ ఇది.

సంప్రదాయ బద్ధమైన ఓ పదహారణాల తెలుగు అమ్మాయిని తన కోడలుగా చేసుకుంటున్న తరుణంలో తన భర్తతో చెప్పిన మాటలు ఇవి. వాటిని బట్టి ఓ తెలుగింటి అత్తగా తన అభిలాషను చెప్పకనే చెబుతున్నారు. ఆ పాత్ర లో జీవించిన గుణచిత్ర నటి డబ్బింగ్ జానకి. నిజ జీవితంలో జానకి గారికి పదహారేళ్లు వచ్చేప్పటికే పెళ్త్లెంది. భర్తది మిలటరీ ఉద్యోగం. ఆయనకీ నాటకాలంటే ఆసక్తి. పెళ్లయ్యాక తన నుంచీ ప్రోత్సాహం లభించింది. దాంతో ఒక తెలుగింటి అమ్మ, తెలుగింటి అత్త, తెలుగింటి బామ్మ తెలుగు తెరకు లభించినట్లైంది.

దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ జానకి గా సుప్రసిద్ధురాలైన నటి దాసరి జానకి గారు ఎన్టీఆర్ గారి “భూ కైలాస్” చిత్రంతో మొదలైన తన సినీ ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. తొమ్మిదేళ్ళ వయసు నుంచే నాటకాలలో నటించడం ప్రారంభించిన తాను 1958 లో వచ్చిన భూకైలాస్ చిత్రంతో సినిమాకు పరిచయం అయ్యింది. తన 73 సంవత్సరాల జీవిత కాలంలో 65 సంవత్సరాలు చిత్ర పరిశ్రమకే తన సమయాన్ని వెచ్చించడం మాములు విషయం కాదు.

ఇంతటి సుదీర్ఘ సినీ ప్రస్థానంలో జానకి గారు దాదాపు 600 పై చిలుకు చిత్రాలలో నటించిడం విశేషం. తాను ఎక్కువగా తల్లి పాత్రలను పోషించారు. సాగర సంగమం చిత్రంలో కమల్ హాసన్ తల్లిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు. గాంధీ సినిమాకు తెలుగులో కస్తూర్బా పాత్రకు డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ జానకి గా మారారు. సినిమాల్లోనే కాకుండా టీవీ ధారావాహికల్లో కూడా నటిస్తున్నారు.

“మాతృ దినోత్సవం” వచ్చిందంటే చాలు తాను నటించిన “20వ శతాబ్దం” చిత్రం లోని “అమ్మను మించి దైవమున్నదా” పాట టీవీల్లో కచ్చితంగా వస్తుంది. అందులో తాను కథనాయకులు సుమన్ గారికి తల్లిగా చేసిన పాత్రకి మంచి పేరొచ్చింది. తాను అభినయం చేసిన సినిమాలలో తొంభై శాతం వరకూ కంట తడిపెట్టించే సెంటిమెంటు పాత్రలే. గ్లిజరిన్ బాటిల్ ఎప్పుడూ తన పక్కన ఉండాల్సిందే. సెట్‌లో ఏడ్చీ ఏడ్చీ ఇంటికి వెళ్లేసరికి తన కళ్లు ఎర్రగా వాచిపోయేవి. ఒకసారి “రక్తకన్నీరు” నాటకం వేసినప్పుడు ఏకథాటిగా మూడు గంటలు ఏడవాల్సి వచ్చింది. ఆ నాటకం పూర్తయ్యేసరికి కళ్లలో నీళ్లు పూర్తిగా ఇంకిపోయాయి.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    జానకి

ఇతర పేర్లు  :    డబ్బింగ్ జానకి

జననం    :   28 ఆగస్టు 1949 

స్వస్థలం   :     పెద్దాపురం, ఆంధ్రప్రదేశ్

తండ్రి       :    దాసరి అప్పారావు 

తల్లి       :      వీరమ్మ 

వృత్తి      :    నటి, డబ్బింగ్ కళాకారిణి 

ప్రముఖ పాత్రలు   :    సాగర సంగమం, గీతాంజలి, జంబలకిడిపంబ

భర్త     :    రామకృష్ణన్

పిల్లలు   :   ముగ్గురు

జననం…

ప్రముఖ నటి డబ్బింగ్ జానకి గారు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం లో 28 ఆగస్టు 1949 లో దాసరి అప్పారావు, వీరమ్మ దంపతులకు జన్మించారు. ప్రముఖ నటి అంజలీదేవి, జానకి గార్లు ఒకే ఊరికి చెందినవారు. జానకి గారి తండ్రి వ్యాపారం చేసేవారు, తల్లి నేత పనిచేసే వారు. వారివురికి గల 14 మంది సంతానంలో జానకి గారు తొమ్మిదో వారు. వారిలో ఎనిమిది మంది చనిపోగా ఆరుగురు సంతానం మిగిలారు. తాను పెద్దాపురం మున్సిపల్ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివారు. తన చెల్లెలు పార్వతి రాజమండ్రిలో హిందీ టీచర్ గా రిటైర్ అయ్యారు. బాల్యం నుండి పార్వతి, జానకిలది విడదీయరాని అక్కాచెల్లెళ్ళ బంధం.

రంగస్థలం పై..

జానకి గారు తాను నాలుగో తరగతిలో ఉన్నప్పుడే తన ప్రతిభను గుర్తించి తనను నటిగా తీర్చిదిద్దారు అలనాటి రంగస్థలం నటులు, దర్శకులు, రచయిత “గోరు మల్లికార్జునరావు” గారు. మూడు నెలల ప్రత్యేక శ్రద్ధతో జానకి సంభాషణలు వల్ల వేయిస్తూ హావాభావాలు పలికిస్తూ మంచి వఉచ్ఛారణతో శిక్షణ ఇచ్చారు. అలా తొలిసారి పెద్దాపురంలోనే “ప్రశాంతి” నాటకంలో కథనాయికగా రంగస్థలం ప్రవేశం చేశారు. ఈరోజు నేను ఇంత స్థాయిలో ఉండడానికి మా గురువు మల్లికార్జున రావు గారి శ్రద్ధ పట్టుదలే కారణం అంటుంటారు జానకి గారు. ప్రశాంతి నాటకం తనకు గొప్ప పేరు తెచ్చిపెట్టడంతో ఇక రంగస్థలంపై తాను తిరుగులేని నటిగా వెలుగొందారు. “పినిశెట్టి శ్రీరామమూర్తి” గారు రచించిన “కులం లేని పిల్ల” తో సహా లెక్కకు మిక్కిలి నాటకాలలో వందల ప్రదర్శనలు ఇచ్చారు. పరిషత్ పోటీల్లో జానకి గారు ఎన్నో బహుమతులు దక్కించుకున్నారు.

రక్త కన్నీరు నాటకం..

జానకి గారు మద్రాసు వెళ్ళాక మొదటిసారి టీ నగర్ లో “కృష్ణా గాన సభ” లో పద్మనాభం గారి చలువతో నరసింహారావు గారు స్థాపించిన “రేఖ మురళి బ్యానర్” పై పద్మనాభం గారికి చెల్లెలుగా శాంతి నివాసం నాటకంలో నటించారు. కోదండపాణి గారి సంగీతంలో సుశీల, జానకి గార్లు కూడా ఆ నాటకానికి పాటలు పాడారు. ఆ నాటక ప్రదర్శన బృందం ఆంధ్రదేశం అంతటా తిరిగి వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఈ నాటకం తరువాతే కోదండపాణి గారికి సినిమా అవకాశాలు వచ్చాయి. కన్నడ నటి “రమాదేవి”, పాతాళభైరవి చిత్రంలో “వగలోయి వగలు తళుకు బెలుకు వగలు “అనే పాటకు నాట్యం చేసిన లక్ష్మీకాంతం గారు కూడా ఇందులో నటించారు. ఈ నాటకం చూసిన తరువాతనే నాగభూషణం గారు తన “రక్త కన్నీరు” నాటకంలో జానకి గారిని తన భార్య ఇందిర పాత్రకు తీసుకున్నారు.

వివాహం..

డబ్బింగ్ జానకి గారికి తాను పదహారేళ్ళ వయస్సులో ఉండగానే తనకు వివాహం జరిగింది.

నిజానికి అది ప్రేమ వివాహం. తన భర్త జాన్ బాబు భారత సైన్యములో పనిచేసే వారు. వారికి ముగ్గురు పిల్లలు.

పెద్దబ్బాయి శ్యామ్ రాజ్ సంగీతం కంపోజ్ చేస్తున్నాడు. రెండో అబ్బాయి రవీంద్రనాథ్ హార్డ్వేర్ ఇంజనీర్.

అమ్మాయి శ్రీలక్ష్మి తెలుగు చిత్రాలకు డబ్బింగ్ చెబుతుంది. అల్లుడు విజయసాగర్ వ్యాపారం చేస్తున్నారు.

తన భర్త జాన్ బాబు గారికి నాటకాలంటే అమితమైన ఆసక్తి.

జానకి గారికి పెళ్లయ్యాక తన భర్త నుండి మంచి ప్రోత్సాహం లభించింది. సినిమాలలోకి వెళ్లకముందే వీరు చెన్నైలో స్థిరపడ్డారు.

పరిషత్ ప్రదర్శనలు, పురస్కారాలు..

మిలిటరీలో పని చేసే జానకి గారి భర్త గారు సెలవుల్లో వచ్చినప్పుడు జానకి గారు నటించే నాటకాలకు మధ్య మధ్యలో హార్మోనియం వాయించేవారు. “రాయచూరు రైల్వే సంస్థ” పినిశెట్టి గారి రచన “పంజరంలో పక్షులు”, ఆత్రేయ గారి “భయం” నాటకాలు, పాలకొల్లు పరిషత్తు, రాజమండ్రి, ఎల్కేఎన్ పరిషత్తు, బళ్లారి రాఘవ కళాపరిషత్తు, ఇలా ఎన్నో చోట్ల నాటకాలను ప్రదర్శించే వారు. రాజమండ్రి లలిత కళాపరిషత్తు తరపున “భయం” నాటకం ప్రదర్శించినప్పుడు 1979లో తనకు కన్నాంబ పురస్కారంతో బాటుగా వెండి కిరీటం కూడా బహుకరించారు.

బళ్లారి రాఘవ కళాపరిషత్ తరపున “పంజరంలో పక్షులు” నాటక ప్రదర్శనకు ఉత్తమ నటిగా స్వర్ణ పతకం ఇచ్చారు. ఇలా ఎన్నో నాటకాలు కళాపరిషత్ ల తరుపున ప్రదర్శించేవారు. జానకి గారు కేవలం నాటకాలలో నటించడం కోసం, నాటక ప్రదర్శనల కోసం కుటుంబ సమేతంగా తన మకాం మద్రాసుకు మార్చేశారు. మద్రాసు “వాణి మహల్” లో నాగభూషణం గారి “రక్త కన్నీరు”, పద్మనాభం గారి బ్యానర్ తరపున “మాంగల్య భాగ్యం”, “శ్రీకాళహస్తి మహత్యం” నాటకాలను మద్రాసు లోనే కాకుండా ఆంధ్రదేశమంతటా అన్ని జిల్లాలలో ప్రదర్శించే వారు.

సినీ నేపథ్యం…

ఒకసారి జానకి గారు తన భర్తతో కలిసి బస్సులో ప్రయాణం చేస్తుండగా అసిస్టెంట్ డైరెక్టర్ ఏ.వి.యం మియప్ప చెట్టియార్ గారు జానకి గారితో మీకు అభ్యంతరం లేకపోతే నా సినిమాలో మీరు నటిస్తారా అని అడిగారు. అది గమనిస్తూనే వున్న తన భర్త వెంటనే సమ్మతించారు. తన స్టూడియోకి పిలిపించిన చెట్టియార్ గారు తనను పర్మినెంట్ ఆర్టిస్ట్ గా బుక్ చేసుకుంటానన్నారు. అప్పటికే జానపద హీరోయిన్ రాజశ్రీ పర్మనెంట్ ఆర్టిస్ట్ గా ఉన్నారు. కానీ కొందరు నాటక సమాజంలో వారు ఇచ్చిన సలహా మేరకు పర్మనెంట్ ఆర్టిస్ట్ గా ఒప్పుకోకుండా, పిలిచినప్పుడల్లా వచ్చి మీ బ్యానర్ లో పనిచేస్తానని చెప్పారు. దానికి చెట్టియార్ గారు సరే అన్నారు.

తొలి చిత్రం “భూకైలాస్”…

తన పదిహేడేళ్ల ప్రాయంలోనే జానకి గారు తొలిసారిగా ఏ.వి.యం వారి “భూకైలాస్” లో జమున గారికి తన ఎనిమిది మంది చెలికత్తెలలో ఒక చెలికత్తె గా నటించారు. నిజానికి పాత్ర చిన్నదే. కానీ తెలుగు ఉచ్ఛారణ సరిగ్గా ఉందా లేదా అని జాగ్రత్తగా పరిశీలన చేసి ఎంపిక చేశారు.

ఆ విధంగా మొదలైన తన ప్రస్థానం “చెంచులక్ష్మి”, “బండరాముడు”, “కనకదుర్గ పూజా మహిమ” లాంటి ఎన్నో చిత్రాలలలో చిన్న చిన్న పాత్రలు చేశారు. కొన్నిసార్లు గ్రూప్ డాన్స్ లో కూడా నటించేవారు.

నటి శ్రీదేవి తల్లి రాజేశ్వరి గారు కూడా గ్రూప్ డాన్సులు చేసేవారు. అయితే తన నుండి జానకి గారికి మంచి సహకారం లభించేది. అటు నాటకాలలో, ఇటు సినిమాల్లో నటించే జానకి గారికి రెండు రంగాల్లో మంచి నటిగా పేరు రావడం మొదలైంది. ఆ సమయంలో జానకి గారి ప్రతిభను పసిగట్టిన ఈరంకి శర్మ గారు తన దర్శకత్వంలో “నాలాగే ఎందరో”, “కుక్క కాటుకు చెప్పు దెబ్బ”, “సీతాదేవి” చిత్రాలలో ముఖ్యపాత్రలలో అవకాశం ఇచ్చారు. ఆ చిత్రాలతో గుర్తింపు లభించిన తాను చిత్ర సీమ నుండి వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది.

కళాతపస్వి గారి చిత్రాలలో…

కళాతపస్వి కె.విశ్వనాధ్ గారు రూపొందించిన అన్ని చిత్రాలలో జానకి గారు నటించారు. తాను “శంకరాభరణం” చిత్రంలో నటించడానికి ఒకరకంగా ఏడిద నాగేశ్వరావు గారే కారణం. తన సిఫారసు మేరకు జానకి గారిని విశ్వనాథ్ గారు “శంకరాభరణం” సినిమాలో అవకాశం ఇచ్చారు. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన “ప్రెసిడెంట్ పేరమ్మ” చిత్రంలో రమణ మూర్తి గారికి జోడిగా ప్రధాన పాత్రలో నటించారు.  డి.వి.ఎస్.రాజు గారి 1979 నాటి చిత్రం విజయవంతంగా ఆడింది.

ఆ చిత్రం చూసి ఏడిద నాగేశ్వరరావు గారు జానకి గారి పాత్ర నచ్చడంతో విశ్వనాథ్ గారికి చెప్పారు. శంకరాభరణం లో జానకి గారు ఎంత సహజంగా నటించారంటే ఆ కట్టు, బొట్టు ఎంతో సహజంగా ఉంది. ముఖ్యంగా చీర మడిచి పెట్టుకుంటూ మాట్లాడటం సంప్రదాయం బద్దంగా ఉన్నాయి. ఆ తరువాత “సాగర సంగమం”, “స్వాతిముత్యం”, “ఆపద్బాంధవుడు”, “సప్తపది” ఇలా విశ్వనాథ్ గారి మరిన్ని చిత్రాలలో జానకి గారు నటించారు. “తాయారమ్మ బంగారయ్య”, “జంబలకడిపంబ”, “నాలుగు స్తంభాలాట”, “అహనా పెళ్ళంట”, “ఆలయ శిఖరం”, “20 వ శతాబ్దం” ఇలా ఎన్నో చిత్రాల్లో తాను నటించి ప్రేక్షకులను మెప్పించారు.

డబ్బింగ్ జానకిగా స్థిరపడిన పేరు…

జానకి గారిని చిత్ర పరిశ్రమలో మామూలుగానే జూనియర్ జానకి అనేవారు. మరీ ముఖ్యంగా పద్మనాభం గారు తనను జూనియర్ జానకి అని మాత్రమే పిలిచేవారు.

కారణం అప్పటికే ఇద్దరు జానకి లు సినీ రంగంలో ఉన్నారు.

ఒకరు షావుకారు సినిమా లో నటించిన షావుకారు జానకి, ఇంకొకరు పాటలు పాడే నేపథ్య గాయని జానకి. తాను కూడా జానకి నే.

అందువల్ల తనను జూనియర్ జానకి అంటుండేవారు. ఒకసారి శంకరాభరణం చిత్ర శతదినోత్సవ వేడుకలలో పత్రికల వారు చిత్రరంగంలో మీతో కలిసి ముగ్గురు జానకిలు ఉన్నారు.

ఒకరు షావుకారు జానకి, ఒకరు సింగర్ జానకి, మీరు ఎలాగో డబ్బింగ్ చెబుతున్నారు కదా అందుకని డబ్బింగ్ జానకి అని వ్రాస్తామన్నారు.

దానికి ఆవిడ గారు సరేనన్నారు. ఆనాటినుండి అందరూ తనను డబ్బింగ్ జానకి అని పిలుస్తూ వచ్చారు.

మరువలేని చిత్రం నీడ

జానకి గారి నట జీవితంలో మరువలేని చిత్రం “నీడ”. సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు నటించిన ఆ చిత్రంలో హీరో తల్లిగా ప్రధాన పాత్రలో నటించారు. ఆ చిత్రం చూసిన కృష్ణ గారు తనను ఎంతగానో అభినందించారు. ఆ చిత్ర దర్శకులు దాసరి నారాయణరావు గారు తీసిన “సీతారాములు”, “అద్దాలమేడ”, “ఉగ్ర నరసింహం” చిత్రాలలో కూడా జానకి గారు మంచి పాత్రలు పోషించారు. 1988 లో  జీ.వి.సోమయాజులు గారికి జోడీగా నటించిన “ఇదునమ్మాళ్” చిత్రంలో తాను పోషించిన పాత్రకు కూడా మంచి పేరొచ్చింది. దానినే తెలుగులో మోహన్ బాబు, రమ్యకృష్ణ జోడీగా అదిరింది అల్లుడుగా తెరకెక్కించారు.

టీ.వీ. సీరియల్ లలో…

జానకి గారు తెలుగు లో 20కి పైగా సీరియల్స్, తమిళంలో మరో 15 సీరియల్స్ లో నటించారు.

అన్నపూర్ణ వారి బ్యానర్ పై వచ్చిన “శశిరేఖ పరిణయం” పూర్తయింది.  మళ్ళీ ఇదే బ్యానర్ పై “పున్నాగ” సీరియల్ చేస్తున్నారు.

ప్రస్తుతం తాను నటించిన “సావిత్రి” సీరియల్ వస్తుంది. అదే విధంగా “చిన్న కోడలు” సీరియల్ లో కూడా తనకు ఎంతగానో నచ్చిన పాత్ర చేస్తున్నారు.

చెట్టుపై నుంచి దూకే సన్నివేశం

“నిండు సంసారం” చిత్రంలో నందమూరి తారక రామారావు గారికి చెల్లిగా అనిత నటిస్తే, మరొక చెల్లెలు లాంటి పాత్రలో జానకి గారు అభినయించారు.

ఆ చిత్రంలో చెట్టుపై నుంచి నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకునే సన్నివేశంలో నీళ్లలో దూకేశారు.

గజఈత గాడు తనను పైకి లాగి ఎత్తుకోవడానికి కొన్ని క్షణాల ఆలస్యం చేశారు.

ఈ లోపే తాను సగం నీళ్లు మింగేశారు. చనిపోతానేమోనని భయపడ్డారు జానకి గారు. కానీ తనను ఎలాగోలా ఒడ్డుకు తెచ్చారు.

దర్శకులు రావు గారు ఈతగాడిని బాగా తిట్టారు.

ఆ ఉదంతంతో తర్వాత సినిమాలలో నటించాలంటే ముందు జాగ్రత్తగా నీళ్లలో దూకే సన్నివేశం ఉందా లేదా అని చూసుకొని ఒప్పుకునేవారు.

తాను ఇంతటి స్థాయికి ఎదగడానికి నాటక రంగంలో తనకు అశాంతి అనే పుస్తకం ఇచ్చి ప్రోత్సహించిన గోరు మల్లికార్జున రావు గారు పెట్టిన భిక్షనే అని తాను పలు సందర్భాలలో చెప్పుకునేవారు.

అఖరు చిత్రం “జయంబు నిశ్చయమ్మురా”…

శివరాజ్ కనుమూరి దర్శకత్వం లో వచ్చిన విజయవంతమైన చిత్రం “జయంబు నిశ్చయంబురా” తన అఖరు చిత్రం.

సాగరసంగమం చిత్రంలో తన నటన చూసి ఈ పాత్ర తనతోనే చేయించాలని పట్టుదలతో జానకి గారిని ఒప్పించారు.

చిత్ర దర్శకులు శివరాజ్ గారు జానకి గారిని వెతుక్కుంటూ వెళ్లడం ఒక రకంగా గొప్ప విషయమే.

అక్కినేని కుటుంబరావు గారి దర్శకత్వంలో వచ్చిన “అమూల్య” చిత్రంలో నటించినందుకు గానూ తాను ఉత్తమ గుణచిత్ర నటులుగా నంది పురస్కారం అందుకున్నారు.

పలురకాల పురస్కారాలను అందుకున్న జానకి గారు పద్మమోహన సంస్థ వారు అందజేసిన జీవిత కాల సాఫల్య పురస్కారం తన జీవితంలో మరచిపోలేనిది.

Show More
Back to top button