Telugu Cinema

నిస్వార్థమైన ప్రేమకు నిజమైన ముగింపు.. సీతామాలక్ష్మి సినిమా..

కొన్ని సార్లు బలమైన కథకు కమర్షియల్‌ హంగులు, సీతామాలక్ష్మి సినిమా స్టార్‌ నటులు లేకపోయినా విజయం దక్కుతుంది. కథ బలంగా వుండి, కథనం నడిపించే విధానం బావుంటే ఆ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. కె. విశ్వనాథ్ గారి చలన చిత్రాలు ఎక్కువ భాగం ఈ కోవలోనికే వస్తాయి. కె. విశ్వనాథ్ గారు తన చలనచిత్ర సేద్య సామర్థ్యంతో ఆధునిక క్షేత్రాల్లో సంప్రదాయాన్ని సాగుచేశారు. సంప్రదాయ కేదారాల్లో అభ్యుదయాన్ని పండించారు. అభ్యుదయ మాగాణి కమతాల్లో ఆధునికతను ఏపుగా పెంచారు. అన్నింటా అచ్చతెలుగుదనాన్ని పెంచి పోషించారు.

ఒక మారుమూల పల్లెటూరు లో ఒక చిన్న సినిమా హాలు. అందులో కొండయ్య, సీతాలు అనే ఇద్దరు వ్యక్తులు పని చేస్తుంటారు. సినిమా హాలు ను శుభ్రం చేస్తూ ఆ చీపురును మూలన పడేసి పకోడీలు తినుకుంటూ తెరమందు కూర్చుని ఆసక్తిగా సినిమా చూడటం వారిరువురికి సరదా. సినిమాలు చూసిన సీతాలు తాను చూసిన సన్నివేశాన్ని, విన్న ప్రతీ మాటని, ప్రతీ పాటని  అభినయించి మరీ చూపిస్తుంది.

నిజానికి కొండయ్య అమాయకుడైన పల్లెటూరి రైతు. తాను చాలా హుషారైన వాడు. సీతాలు అంటే కొండయ్య కు పంచప్రాణాలు. అలాగే తన కళ్లెదురుగా ఎలాంటి అన్యాయం జరిగినా కూడా శివమెత్తుతాడు. ఈ విషయంలో కొండయ్య, సీతాలు ఎప్పుడు గిల్లికజ్జాలే. వీళ్ళిద్దరివీ చిలిపి కలహాలే. వాస్తవానికి సినిమాలో జరిగినట్టుగానే సీతాలు పెద్ద సినిమా హీరోయిన్ అయిపోయింది. కథ కొత్త మలుపు తిరిగింది. విధి సీతాలు, కొండయ్య జీవితాలతో వింత ఆట ఆడేసింది.

ఈ కథ తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది. అసలు ఇలాంటి కథలో వాణిజ్య విలువలు ఎక్కడున్నాయి. ఇది తెలుగు సినిమా ఫార్ములాకు చాలా దూరంలో ఉంది. అసలు ఈ సినిమాలో హీరోయిజమే లేదు. ఒకవేళ తీసినా ఎవరు చూస్తారు. ఇలాంటి ఎన్నో సందేహాలు ఏ సాధారణ నిర్మాత, దర్శకుడు మెదడునైనా తొలిచేస్తాయి. కానీ ఈ చిత్ర నిర్మాతలు మాత్రం అలా అనుకోలేదు. ఈ కథలోని సింగారాన్ని కొత్తదనాన్ని మనసుతోనే వీక్షించారు. అందుకే ఈ సినిమా వాళ్లకి బంగారు పంట పండింది. ఆ చిత్రమే “సీతామాలక్ష్మి”.

సినిమాలు తీయడం కొందరికి వ్యాపారం, మరికొందరికి సినిమా అంటే ఒక ఆరాధన, ఒక తపన. సినిమా తీయడాన్ని ఆరాధిస్తారు. సినిమా తీయడం కోసం తపిస్తారు. ఆ కోవకు చెందిన నిర్మాణాత్మక విలువలున్న నిర్మాత కె.మురారి. తన నిర్మాణంలో వచ్చిన సినిమాలన్నీ నిత్యనూతనంగా ఉంటాయి. ఆ ప్రయత్నంలోనే 1978 లో తీసిన చిత్రం సీతామాలక్ష్మి. మురారి గారు తొలి ప్రయత్నం లోనే కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 27 జులై 1978 లో విడుదల అయి సంచలన విజయం సాధించింది.

  చిత్ర విశేషాలు…

దర్శకత్వం    :    కె. విశ్వనాథ్

నిర్మాణం     :    మురారి నాయుడు 

కథ              :    కె. విశ్వనాథ్ 

తారాగణం   :    చంద్రమోహన్, తాళ్లూరి రామేశ్వరి 

సంగీతం    :   కె. వి. మహాదేవన్

సంభాషణలు   :   జంధ్యాల 

నేపథ్య గానం    :    యస్.పి. బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల , జి. ఆనంద్ , వాణీ జయరాం, విజయలక్ష్మి శర్మ 

గీతరచన      :     వేటూరి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి..

ఛాయాగ్రహణం   :  యు. రాజగోపాల్

కూర్పు   :   జి. జి. కృష్ణారావు 

విడుదల తేదీ   :     27 జులై 1978

భాష        :      తెలుగు

చిత్ర కథ…

మదనపల్లి దగ్గరలోని బురదలకోట అనే పల్లెటూరుకు చెందిన కొండయ్య, సీతాలు ఓ టూరింగ్ టాకీస్ హాలు ఊడ్వడం, సినిమా పోస్టర్లు అంటించడం, సినిమా ప్రకటన చేయడం వృత్తిగా జీవిస్తుంటారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ప్రతీ సినిమా చూసి హీరోయిన్ లా సీతాలు నటిస్తుంది. ఆ ఊరికి వచ్చిన కొక్కోరోక్కో నిర్మాత మూర్తి సీతాలును హీరోయిన్ ని చేస్తానని హామీ ఇస్తాడు. కొండయ్య లో ఆశ కలుగుతుంది. ఊళ్ళో వాళ్ళు అవహేళన చేయడంతో పట్టుదల వచ్చిన కొండయ్య సీతాలును తీసుకుని హైదరాబాద్ వస్తాడు. నిర్మాత మూర్తి మాట తప్పడంతో అసహనానికి గురైన కొండయ్య ఈ సినిమా రంగం వద్దనుకుంటాడు. చిత్రకారుడు రవి ద్వారా సీతాలుకు హీరోయిన్ అవకాశం వస్తుంది. సీతాలు పేరును సరితాదేవి గా మారుస్తాడు రవి.

సీతాలు హీరోయిన్ అయిందని తెలిసి ఆమె అన్న, వదిన, తండ్రి ఆమె పంచన చేరుతారు. సీతాలుతో హీరో చనువుగా ప్రవర్తించడంతో అతని మీద చేయి చేసుకుంటాడు కొండయ్య. అక్కడి వాతావరణంలో ఇమడలేక కొండయ్య తిరిగి తన పల్లెటూరికి వెళ్లిపోతాడు. సీతాలు ఒకే ఒక సినిమాతో టాప్ హీరోయిన్ అవుతుంది. ఇక సినిమాలు చేయనని చెబుతుంది. దాంతో కొండయ్య మీద ఆమె మనసు విరిచేయడానికి సీతాలు అన్న వదినలు ప్రయత్నిస్తారు. సీతాలు, కొండయ్య ఇద్దరూ ఒకరికొకరు దూరమైపోతారు. చివరికి కొండయ్య ప్రేమలోని నిజాయితీని గుర్తించిన సీతాలు అతని దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటుంది. రవి సలహా మేరకు “సరితా దేవి” గా చనిపోయి సీతాలు గా కొండయ్య కౌగిలిలోకి చేరుకుంటుంది.

తారాగణం…

సీతాలు…    తాళ్ళూరి రామేశ్వరి

కొండయ్య…    చంద్ర మోహన్

శ్రీధర్

రైల్వే స్టేషన్ మాస్టర్‌… వంకాయల సత్యనారాయణ

ఈశ్వరరావు

జానకి డబ్బింగ్

పల్లవి…   మాస్టర్ తులసిరామ్

మాస్టర్ హరి

పల్లవి

పిఎల్ నారాయణ

సాక్షి రంగ రావు..

నటీనటుల ఎంపిక…

ఈ సినిమా లో ముందుగా కొత్త కుర్రాడిని ఎంచుకుందామని అనుకున్నారు. సమర్థుడు దొరకక చంద్రమోహన్ గారిని తీసుకున్నారు. చంద్రమోహన్ గారు అంతకుముందే విశ్వనాథ్ గారితో సిరిసిరిమువ్వ హిట్ కావడంతో ఈ కలయిక కు ఆదరణ పెరిగింది. అలాగే శ్రీధర్ పాత్రకు ముందుగా రజనీకాంత్ ను తీసుకుని అడ్వాన్స్ కూడా ఇచ్చారు. రజనీకాంత్ గారు చిన్న పాత్ర అని తెలిసి వెనకంజ వేశారు. ఇక కథానాయిక విషయానికి వస్తే రాజశ్రీ పిక్చర్ అధినేత తారాచంద్ బర్జాత్యా “దుల్హన్ వహీ జోపియా మాన్ భాయే” సినిమా నిర్మిస్తూ అందులో పెళ్లికూతురు పాత్రకు కొత్త అమ్మాయిని తీసుకున్నారు. ఆ అమ్మాయి అప్పుడే పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటనలో ఓనమాలు నేర్చుకుని వచ్చింది.

ఈ అమ్మాయి అభినయానికి ముగ్ధులైన ప్రముఖ హిందీ నటులు అశోక్ కుమార్ “ఫిలింఫేర్ పత్రిక”లో ఆ అమ్మాయి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారట. ఫిలింఫేర్ తిరిగేస్తున్న మురారి దృష్టి ఆ ఆర్టికల్ మీద పడింది. ఆ అమ్మాయి వివరాలు ఆసక్తిగా చదివితే “తాళ్లూరి రామేశ్వరి” అని తెలిసింది. ఇదేదో తెలుగు అమ్మాయి పేరు లా ఉంది. మన సినిమాకి పనికొస్తుందేమో అని మురారి గారు ఆగమేఘాల మీద ముంబైకి ఉత్తరం వ్రాశారు. ఆ రామేశ్వరీ గారి సొంత ఊరు తిరుపతి. ఏదో పనిమీద తిరుపతి వచ్చిన రామేశ్వరి గారు తన అక్క బావతో కలిసి సరదాగా మద్రాసు వెళ్లారు.

రామేశ్వరి గారు దర్శకులు కె.రాఘవేంద్రరావు గారిని కలిశారు. కె.రాఘవేంద్రరావు గారే విశ్వనాథ్ గారికి పరిచయం చేశారు. విశ్వనాథ్ గారికి రామేశ్వరీలో సీతామాలక్ష్మి కనిపించింది. వెంటనే మా చిత్రంలో నటిస్తావా అని అడిగేశారు. రాఘవేంద్రరావు గారు తప్పకుండా చేస్తుంది అని హామీ ఇచ్చారు. అలా విశ్వనాథ్ గారు సీతామాలక్ష్మి గా తాళ్లూరు రామేశ్వరి గారిని ఎంపిక చేసుకున్నారు. చిత్రం ఏమిటంటే రామేశ్వరీ గారు ఈ సినిమా తర్వాత కేవలం రెండే రెండు తెలుగు సినిమాలు చేశారు. అవి “మంగళ తోరణాలు”, “చిన్నోడు పెద్దోడు”. ఈ రెండింటిలో కూడా చంద్రమోహన్ గారే హీరో కావడం విశేషం.

సాంకేతిక వర్గం…

దర్శకుడు…    కె. విశ్వనాథ్

అసిస్టెంట్ డైరెక్టర్…    నందూరి విజయ్

నిర్మాతలు…   మురారీ ,  నాయుడు

ప్రొడక్షన్ కంపెనీ…  యువ చిత్ర

కథ….   కె. విశ్వనాథ్

సంభాషణలు…    జంధ్యాల

చిత్రానువాదం…    కె. విశ్వనాథ్,

జాంధ్యాల, కె. మురారీ

ఆర్ట్ డైరెక్టర్…    తోటా తరణి

ఫోటోగ్రఫి డైరెక్టర్..  యు.రాజగోపాల్

ఫిల్మ్ కూర్పు…    జి.జి.కృష్ణరావు

సంగీత దర్శకుడు…  కె.వి.మహదేవన్

అసిస్టెంట్ కంపోజర్..   పుహలేండి

సాహిత్యం…  దేవులపల్లి కృష్ణశాస్త్రి , వేటూరి సుందరరామమూర్తి

నేపథ్య గానం, గాయకులు…  ఎస్పీ బాలసుబ్రమణ్యం, పి. సుశీల, జి. ఆనంద్, వాణీ జయరామ్, విజయలక్ష్మి శర్మ

“సీతామాలక్ష్మి” టైటిల్ కు అంకురం..

సీతామాలక్ష్మి సినిమా లో “చాలు చాలు విరహాలు” పాటను బసవరాజు గారు వ్రాశారు. ఇందులో మరో పాటను కూడా తానే వ్రాశారు. సిరిసిరిమువ్వ లో విశ్రాంతి తర్వాత వచ్చే “అందానికి అందం ఈ పుత్తడిబొమ్మ” పాట తరహాలో కె.విశ్వనాథ్ సెంటిమెంట్ గా గుడిలో సన్నివేశం సృష్టించి వేటూరితో “సీతాలు సింగారం” పాట వ్రాయించుకున్నారు. తొలత కథానాయక పాత్ర కు పేరుని సీతాలు మాత్రమే అనుకున్నారు. వేటూరి గారు పాటను వ్రాస్తూ “సీతాలు సింగారం, మాలచ్చి బంగారం, సీతామాలచ్చిమంటే భగవంతుడవతారం” అని వ్రాశారు. ఇదేదో బాగుందని కథానాయిక పేరుని “సీతామాలక్ష్మి” గా మార్చారు. అలా ఆ పాటలోంచి “సీతామాలక్ష్మి” టైటిల్ పుట్టింది.

చిత్రీకరణ…

సీతామాలక్ష్మి సినిమా మొత్తం రాయలసీమలోనే చిత్రీకరించబడింది. కొంత భాగం సారథి స్టూడియోలో తీశారు. కొండయ్య, సీతామాలక్ష్మి ల కలుసుకునే స్థలం ఓ కొండ, దేవుని విగ్రహాలు ఈ సన్నివేశాలు చిత్తూరు దగ్గరలో ఉన్న పల్లెటూర్లో తీశారు. 400 అడుగుల ఎత్తున్న కొండలు ఎక్కడం మామూలు మనుషులకు సాధ్యం కాదు. అందుకే మెట్లు చెక్కించారు. కెమెరాలను తాళ్లతో పైకి లాగే వారు. విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేయించారు. సినిమాను ముందు విషాదంతం చేయాలనుకున్నారు. సీతామాలక్ష్మి చనిపోయిందని పేపర్లో చదివి కొండయ్య గోడమీద ఎక్కి దూకి చనిపోయినట్టుగా తొలిత కథలో అనుకున్నారు. కానీ మురారి గారు మాత్రం కథను సుఖాంతం చేస్తేనే బాగుంటుందని భావించారు.

అందుకే కొండయ్య కొండను ఎక్కి దూకపోతుంటే మామ అంటూ సీతాలు రావడం ఇద్దరు కలవడం గా పతాక సన్నివేశాలను మార్చడం జరిగింది. పతాక సన్నివేశంలో రవి సలహా మేరకు హీరోయిన్ “సరిత దేవి” ఆత్మహత్య చేసుకున్నట్టు అందరిని భ్రమింపజేసి సీతాలు తమ ఊరు బయలుదేరుతుంది. రైల్వే స్టేషన్లో సీతాలు ను కలుస్తాడు రవి. తాను అంతకుముందు గీసిన సీతాలు చిత్రం మీద ఆటోగ్రాఫ్ చేయమంటే ఆమె అమాయకంగా వేలిముద్ర పెట్టి సీతాలుకు అక్షర జ్ఞానం లేదు, అన్నీ తెలిసిన సరిత దేవి ఎప్పుడు చచ్చిపోయింది కదా అంటుంది. ఎంత భావగర్భితమైన సన్నివేశం. కె.విశ్వనాథ్ గారికి ఈ విషయంలో అభినందనలు తెలుపాలి.

సంగీతం…

కళాతపస్వి విశ్వనాథ్ గారి సినిమా లో సంగీతం అద్భుతంగా ఉంటుంది. విశ్వనాథ్ గారికి మురారి గారి అభిరుచి కూడా తోడవ్వడంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టుంది. దాంతో కె.వి.మహదేవన్ గారి సంగీతం తెలుగు నాట పెను తుఫాను సృష్టించింది. ఈ తరం కుర్రకారు కూడా సీతామాలక్ష్మి సినిమా అనగానే “మావిచిగురు తినగానే”, “సీతాలు సింగారం” పాటలు గుర్తుకు తెచ్చుకుంటారు. తెలుగులో వంద అత్యుత్తమ గీతాలు ఎంపిక చేస్తే వాటిలో తప్పనిసరిగా సీతామాలక్ష్మి పాట ఉంటుంది.

అటు క్లాస్ ఆడియన్స్ ని, ఇటు మాస్ అభిమానులని ఏక సమయంలో ఊర్రూతలూగించిన ఘనత సీతామాలక్ష్మిదే. పాటల కంపోజింగ్ మొదలైంది. మహదేవన్ గారి ట్యూన్ కి దేవులపల్లి కృష్ణశాస్త్రి మావిచిగురు తినగానే అనే పాటని వ్రాశారు. ఈ పాటకు కె.వి.మహాదేవన్ గారు రకరకాల ట్యూన్స్ ఇచ్చారు. మురారి గారు తనకి “నవరంగ్” లోని “ఆదా హై చంద్ర్ మా” కావాలని అడగానే కేవలం రెండు నిమిషాలలో ట్యూన్ ఇచ్చారు. మురారి గారు మిగతా నిర్మాతలలా కాకుండా అన్ని విషయాల్లోనూ ఆసక్తి చూపిస్తుంటారు. కె.వి.మహాదేవన్ గారు బ్రతికున్నంత కాలం తన తోనే సంగీతం చేయించుకున్నారు మురారి గారు.

పాటలు…

“చాలు చాలు ఈ విరసాలు” (సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి ; గాయకులు: జి. ఆనంద్ మరియు విజయలక్ష్మి శర్మ

“కొకొరొకో కోరుకో ఎం కావాలో కోరుకో” (సాహిత్యం : వేటూరి ; గాయకులు: పి. సుశీల మరియు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం )

“మావి చిగుగు తినగానే కోవిల పలికేనా” (సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి ; గాయకులు: పి. సుశీల మరియు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం)

“నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెత్తా” (సాహిత్యం : వేటూరి; గాయకులు: పి. సుశీల మరియు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం)

“పాడే పాడే పడుతున్న పాట” (సాహిత్యం: వేటూరి; గానం: పి. సుశీల; తారాగణం: తులసి)

“సీతలు సింగారం మలచ్చి బంగారం” (సాహిత్యం: వేటూరి; గాయకులు: పి. సుశీల మరియు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం)

“ఏ పాట నే పాడను బ్రతుకే పాటైనా పసివాడను” (సాహిత్యం : వేటూరి; గాయకులు: పి. సుశీల, వాణి జయరామ్ మరియు విజయలక్ష్మి శర్మ)

నిర్మాత కాట్రగడ్డ మురారి…

ఈ చిత్రం గురించి తెలుసుకునే ముందు కె.విశ్వనాథ్ గారికి మురారి గారే గుర్తొస్తారు. విశేషమేమిటంటే నిర్మాత మురారి గారికి ఇదే తొలి చిత్రం. విజయవాడకు చెందిన కాట్రగడ్డ మురారి గారు సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎం.బి.బి.ఎస్ చదువును మధ్యలో ఆపేసి వి.మధుసూదన్ రావు గారి దగ్గర సహాయ దర్శకుడిగా చేరారు. ఆ తర్వాత అదుర్తి సుబ్బారావు, బాపు, సేతు మాధవన్ గార్ల వద్ద ఏడేళ్లు పనిచేశారు. విజయా సంస్థ చక్రపాణి అంటే మురారి గారికి చాలా అభిమానం. అందుకే తన దగ్గర కొంతకాలం పనిచేశారు. తాను మురారి గారిని పిలిచి “చేయడం కన్నా చేయించుకోవడం” మీకు తెలిసిన పద్ధతని పరోక్షంగా దర్శకత్వం కన్నా నిర్మాతగా పనికొస్తాడని సలహా ఇచ్చారు. చక్రపాణి మీద గౌరవంతో తాను నడిపిన “యువ పత్రిక” పేరు వచ్చేలా “యువచిత్ర నిర్మాణ సంస్థ” ను ప్రారంభించారు మురారి గారు. తన అభిరుచికి అనుగుణంగా వస్తున్న నిర్మాణానికి ప్రయత్నాలు ఆరంభించారు.

మురారి మొదట తానే దర్శకత్వం వహించాలని అనుకున్నారు. సంగీత దర్శకులు కె.వి.మహదేవన్ ను కలిసి విషయం చెప్పి కొంత డబ్బు బయానా కూడా ఇచ్చారు. మురారి గారు దర్శకత్వం వహిస్తే తన సినిమాలో నటిస్తానని హీరో శోభన్ బాబు గారు హామీ ఇచ్చారు. ఈలోగా శోభన్ బాబు గారు కుదరక డేట్లు సర్దుబాటు చేయడం కష్టమైంది. కొద్ది రోజులు గడిచాక మురారి గారిలో కొత్త ఆలోచన కలిగింది. తన కన్నా కొంచెం అనుభవం ఉన్న వ్యక్తితో తన సంస్థలో తొలి సినిమా చేస్తే బాగుంటుందని కె.విశ్వనాథ్ గారిని దర్శకులు గా ఎంచుకున్నారు. అప్పటికే కె.విశ్వనాథ్ గారి పారితోషికం లక్ష రూపాయలు తీసుకునేవారు. మురారి గారు ముందుగా 20,000 అడ్వాన్స్ ఇచ్చారు. మురారి గారు కథా చర్చల కోసం జంధ్యాల గారిని పిలిపించారు.

అప్పట్లో జంధ్యాల పారితోషికం ఐదు వేల రూపాయలు ఉండేది. నెలకు 500 రూపాయలు చొప్పున ఇవ్వమంటారా లేక ఏక మొత్తంగా తీసుకుంటారా అని మురారి గారు అడిగితే జంధ్యాల గారు నెలవారి జీతానికి ఒప్పుకున్నారు. తీరా కథా చర్చలకు సుమారు 19 నెలలు పట్టింది. తొలుత ఒక కథ మీద ఆరు నెలలు పని చేసి వదిలేశారు. తర్వాత సీతామాలక్ష్మి కథ మీద చర్చలు జరిగాయి. ఇలా సీతామాలక్ష్మి కి జంధ్యాల గారు రెట్టింపు పారితోషికం అందుకున్నారు. జంధ్యాల, మురారి, విశ్వనాథ్, పాలగుమ్మి పద్మరాజు గార్లు ఈ కథను ఓ రూపానికి తీసుకువచ్చారు. ఇలా కథా చర్చల నుండి సంభాషల వరకు జంధ్యాల గారు ఉండడంతో ఆయన పేరు స్క్రీన్ ప్లే లోను, సంభాషణల లోను కనిపిస్తుంది. అలాగే ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను కూడా జంధ్యాల గారే పర్యవేక్షించారు.

విశేషాలు…

★ ఈ చిత్రం ఘనవిజయం సాధించడమే కాకుండా చాలా చోట్ల 100 రోజులు ప్రదర్శితమైంది. 1978 వ సంవత్సరానికి గాను ఈ చిత్రం ఎన్నో నంది పురస్కారాలను గెలుచుకుంది.

★ ఉత్తమ చిత్రం, ఉత్తమ గేయ రచయితగా దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ఉత్తమ నటిగా “తాళ్లూరి రామేశ్వరి” పురస్కారాలను అందుకున్నారు.

★ ఈ చిత్రాన్ని తర్వాత హిందీలో పునర్నిర్మించారు. మిథున్ చక్రవర్తి కొండయ్య గా, జరీనా వాహెబ్ సీతాలు గా చేశారు. సీతారా పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా విజయం సాధించింది.

★ ఒక సినిమా నటిని ప్రధాన పాత్రగా తీసుకుని రూపొందించిన తొలి తెలుగు చిత్రం ఇదే కావచ్చు. అలాగే కథానుగుణంగా చిత్రరంగంలో పోకడలను ఇందులో వ్యంగంగా చూపించడం జరిగింది.

★ ఇందులో ప్రతీ పాత్ర సహజత్వంతో సాగడంతో విశిష్టత ఏర్పడింది. క్లిష్టమైన కొండయ్య పాత్రలో చంద్రమోహన్ ఇమిడిపోయారు.

★ పల్లెటూరు అందాలతో కూడిన సీతాలు పాత్రను తాల్లూరి రామేశ్వరి పోషించిన తీరులో ఎక్కడ కూడా కొత్త నటి అన్న భావన మనకు కలగదు.

★ కల్మషం లేని ప్రేమ ప్రపంచంలో ప్లాస్టిక్ నవ్వుల్ని, మేడిపండు లాంటి జీవితాన్ని సీతామాలక్ష్మి పాత్రతో అద్భుతంగా ఆవిష్కరించారు విశ్వనాథ్ గారు.

★ ఈ సినిమా ప్రేరణగా తీసుకుని రాంగోపాల్ వర్మ రంగీలా తీశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చాలా సార్లు చెప్పారు కూడా.

★ చిత్రమేమిటంటే ఈ కాన్సెప్ట్ తోనే నేరము శిక్ష సినిమా చేయాలని నిర్మాత, నటుడు బాలయ్య దర్శకుని గా విశ్వనాథ్ ని అనుకున్నారట. సరిగ్గా రాక మళ్ళీ కథను మార్చుకున్నాడు.

★ ఈ సినిమాతో “యువచిత్ర బ్యానర్” కి ఒక స్పెషల్ ఇమేజ్ లభించింది. దీనినే అన్ని సినిమాలకు కొనసాగించారు మురారి.

★ మా సీతామాలక్ష్మి కి బి.ఎన్.రెడ్డి గారి మల్లీశ్వరి యే ప్రేరణ అని నిజాయితీగా చెబుతారు మురారి. సినిమాల మధ్య పోలికలను కూడా ఆయనే విడమర్చి చెబుతారు.

★ మల్లీశ్వరి లో మారువేషంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయలు వర్షం వస్తుందని ఓ పాడిపడిన గుహకు వస్తాడు.

అక్కడ మల్లి, రాజు ఉంటారు. వాళ్లు జామకాయలు ఇస్తే మెచ్చిన రాయలు ఏం కావాలో కోరుకోమంటారు.

రాణీవాసం పల్లకి పంపించమని సరదాగా అడుగుతుంది మల్లి. ఇచ్చిన మాట ప్రకారం రాయలు రాణీవాసం పల్లకి పంపిస్తాడు.

తనకు తెలియకుండానే ఇద్దరు ప్రేమికులను విడదీస్తాడు రాయలు. తెలియని తప్పుకు ఇద్దరు ప్రేమికులను విడదీస్తే, వాళ్ళు కలుసుకోవడమే ఆ కథకు ముగింపు.

★ ఇక సీతామాలక్ష్మి లో కొండయ్య సీతాలు సినిమా పోస్టర్లు అతికించే వాళ్ళు. ఆ ఊరికి ఔట్ డోర్ షూటింగ్ లొకేషన్స్ చూడడానికి వచ్చిన ఓ నిర్మాత సీతాలను చూసి హీరోయిన్ ఛాన్స్ ఇస్తానంటే ఇద్దరు పట్నం వెళ్తారు. ఆ తర్వాత సీతాలు పెద్ద హీరోయిన్ కావడంతో ఇద్దరు విడిపోతారు చివరికి కలుస్తారు.

★ మల్లీశ్వరిలో రాణీ వాసపు పల్లకి ఇద్దరిని వేరు చేస్తే, సీతామాలక్ష్మి లో సినిమా ఇద్దరి ప్రేమికులను విడదీస్తుంది.

అయితే చివరికి అటు మల్లీశ్వరి, సీతామాలక్ష్మి ఇద్దరు తమ ప్రేమని పండించుకున్నారు. ప్రేక్షకుల గుండెల్లో కొలువుండిపోయారు.

Show More
Back to top button