CINEMATelugu Cinema

తన కంఠస్వరం తో జలపాతపు ఝరి కురిపించగల గాయని.. యల్.ఆర్.ఈశ్వరి..

మొదట్లో కోరస్ లే పాడాను. చాలామంది కోరస్ లే పాడటం చాలా తక్కువగా భావిస్తారు. అది తప్పని నేను అనుకుంటాను. అందుకే కోరస్ లు పాడానని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందరితోనో కలిసి పాడడం వల్ల, పెద్ద గాయనులకు కోరసులు పాడటం వల్ల వాళ్ళందరూ పాడే విధానాన్ని పరిశీలించే అవకాశం వస్తుంది. ఆ గాయనుల దగ్గర నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను కోరస్ లు పాడడం ఎప్పుడూ మర్చిపోను”. “మేము ఇక్కడికి వచ్చినప్పుడు, నేను కోరస్ లు పాఠం వల్లనే మా కుటుంబానికి గడిచింది. అదే నాకు సినీ రంగంలో నిలబడడానికి బలాన్నిచ్చింది” అంటారు ఎల్లారీశ్వరి ( యల్.ఆర్.ఈశ్వరి ). ఆమె పేరు వింటేనే ఉత్సాహం ఉరకలేస్తుంది. చిన్న – పెద్ద అని తేడా లేకుండా అందరూ ఆమె గళంలోని కైపుకు దాసోహమైన వాళ్లే. దశాబ్దాల పాటు మత్తెక్కించే పాటలతో పాటు ఎన్నో భక్తి గీతాలను కూడా పాడి దక్షిణాది సినీ అభిమానులను అలరించిన గాయని ఎల్. ఆర్. ఈశ్వరి. వీరి పూర్తి పేరు లూర్డ్ – మేరీ రాజేశ్వరి ఈశ్వరి.

“మాయదారి సిన్నోడు… మనసే లాగేసిండు…” అంటూ “అమ్మమాట” సినిమాలో జ్యోతిలక్ష్మి చిందేసిన పాట ఆ రోజుల్లో భలేగా కనువిందు చేసింది. ఆ పాట పాడిన ఎల్.ఆర్.ఈశ్వరి గారు రసికుల మనసులు ఇట్టే లాగేసింది. జనం చెవులకు ఆనందం కలిగిస్తూ తనదైన పంథాలో పయనించిన ఎల్.ఆర్.ఈశ్వరి “స్వరభాస్వరం” గా పేరొందారు. వెండితెర పై నాట్యరాణి “జ్యోతిలక్ష్మి” తళుక్కున మెరుపులా మెరిసి, హోయలు కురిపిస్తే, తెర వెనుక ఆ భంగిమలకు, గుండె భంగపాటకు, జ్యోతిలక్ష్మి ఆహార్యానికి, విరుపులకు, కదలికలకు పరిపూర్ణతను సాన పెట్టినట్లు పాడే ఏకైక గాయిని మన యల్.ఆర్.ఈశ్వరి గారు తప్ప వేరే ఎవరు పరిశ్రమలో లేదన్నది నిర్విదాంశం. తెలుగు సినిమాలో జ్యోతిలక్ష్మి అంటే యల్.ఆర్. ఈశ్వరి అలాగే, యల్.ఆర్. ఈశ్వరి అంటే జ్యోతిలక్ష్మి అనేట్టు వారసత్వ సాంప్రదాయం అన్నట్లు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. 

యల్.ఆర్. ఈశ్వరి గారు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. విలక్షణమైన పాటలకు మేటిగా నిలిచారు.  కెరియర్ లో తొలి రోజుల్లో కొంత అస్పృశ్యతకు, కొంత అవవమాలకు గురి అయినా కూడా దీక్షగా, పట్టుదలతో కృషి చేసి నేపథ్య గాయనిగా స్థిరపడారు. ఒకానొక సమయంలో ఎంత అభిమానాధరణ వచ్చిందంటే ఒక రకమైన పాట పాడాలంటే కంపోజర్లు, నిర్మాతలు తన వైపు మొగ్గేలా మజిలీ చేరుకోవడం విశేషం. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. పాట విషయంలోనూ, గాయనుల విషయంలోనూ, సంగీత దర్శకుల విషయంలోనూ, దేనిలోనైనా నిరంతరం కొత్తదనం కోసం అన్వేషిస్తూ ఉండడం చిత్ర పరిశ్రమ లక్షణం.

అప్పటికీ కూడా ఎంతో ప్రముఖ స్థానంలో ఉన్న గాయినిల గొంతులనుండి వేరుగా వినిపిస్తూ మంచి చమత్కారంగా ఉన్న ఎల్.ఆర్.ఈశ్వరి కంఠాన్ని గుర్తించి మొట్టమొదట విడిపాట (సోలో) గా తనను పాడించినవారు యం.బి.శ్రీనివాస్. ఆ పాట ఎంతో పాపులర్ అయ్యింది. అదే సి.నారాయణరెడ్డి గారు వ్రాసిన “నా పేరు సెలయేరు, నన్నెవ్వరాపలేరు”. నిజంగానే ఈ పాట తరువాత ఎల్.ఆర్.ఈశ్వరి ని ఎవ్వరూ ఆపలేదు, ఆమె కంఠానికి ఒక విలక్షణమైన శైలి ఉంది. ఎక్కడో ఒకచోట జమునారాణి పోలిక ఉందే అనిపించినా అంతకంటే బలమైన విసురైన కంఠం, శృతి కూడా కొంచెం హెచ్చు. హుషారు పాటలు, కొంటె పాటలు, మధువొలకబోసే మత్తు పాటలు ఈశ్వరి సొత్తయినాయి. తాను పలికించే నిషా, కురిపించే మత్తూ అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆమె పాడిన ప్రతీ పాట ప్రజాదరణ పొందుతూ వచ్చింది. విజయలలిత, జ్యోతిలక్ష్మి జయమాలిని లాంటి హుషారు తారలకు ఆమె గొంతు చక్కగా అమరింది..

జీవిత విశేషాలు…

జన్మ నామం :    లూర్డ్ మేరీ

ఇతర పేర్లు  :  రాజేశ్వరి

జననం    :    08 డిసెంబరు 1939   

స్వస్థలం   :    మద్రాసు , మద్రాసు ప్రెసిడెన్సీ, , బ్రిటిష్ ఇండియా

వృత్తి      :     గాయకురాలు

శైలులు      :    నేపథ్య గానం , కర్ణాటక సంగీతం

వాయిద్యం     :      స్వరకర్త

తండ్రి     :      దేవరాజ్ 

తల్లి      :    నిర్మల 

జీవిత భాగస్వామి :   బ్రహ్మచారి ( అవివాహితులు

నేపథ్యం…

యల్.ఆర్.ఈశ్వరి గారు తమిళనాడులో రామనాథ్ జిల్లాలో పరమకుడి అనే ఊర్లో తన బాల్యం గడిచింది. 08 డిసెంబరు 1939 లో జన్మించారు. ఎల్.ఆర్.ఈశ్వరి పూర్తి పేరు లూర్దు మేరీ రాజేశ్వరి. తనకు చిన్నప్పటినుంచి సంగీతమే ప్రాణం. తన తల్లి నిర్మల తండ్రి దేవరాజు ఇద్దరు ఆమె పాట పట్ల మక్కువ కనబరిచిన తను ఒక నేపథ్య గాయనిగా తయారు కావడానికి, ప్లేట్ బ్యాక్ పాడేందుకు, సినిమా పాటల యందు ఉత్సాహం చూపించడానికి వారి అమ్మ “నిర్మల” గారే కారణం అంటారు. ఈశ్వరి గారికి ఆమె ఇచ్చిన ప్రోత్సాహమే తనకు ఎంతో దోహదమైందంటారు కూడా. మాతృభాష తమిళమైనా కూడా తెలుగును సొంత భాష చేసుకుని ఆమె ఎన్నో పాటలు పాడారు. తెలుగు పాటలు విరుపు అవసరమైన చోట యాస తెలుగు నుడికారం ఇట్టే పట్టుకుని పాడారు. తెలుగు, మలయాళం దగ్గరగా ఉంటాయని, కానీ తమిళం తన భాష అయినా కేవలం శ్రద్ధతో, ఆసక్తితో తెలుగు తెలుసుకొని అర్థం చేసుకొని పాడారు.

“మాయదారి చిన్నోడు మనసే లాగేసిండు, నా మనసే లాగేసిండు, మాఘమాసం వచ్చేదాకా మంచి రోజు లేదన్నాడే.. ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా” అంటూ ఆమె ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపేశారు. ఈ పాట “అమ్మమాట” అనే సినిమాలో సి.నారాయణరెడ్డి వ్రాయగా, రమేష్ నాయుడు సంగీతం సమకూర్చిన పాట. “దేవుడు చేసిన మనుషులు” అనే చిత్రంలో  రమేష్ నాయుడు గారు సంగీతం కూర్చగా ఆరుద్ర గారు రచన చేసిన “మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాపటేల కలుసుకో” అనే పాట కూడా ఎంతో ప్రసిద్ధి పొందింది. అయితే ఈ పాటలన్నీ కూడా ఎల్. ఆర్. ఈశ్వరి గారికి ఒక ముద్రను, ఒక ప్రత్యేకతను తీసుకువచ్చాయి. అలాగే విజయ కృష్ణమూర్తి సంగీతంలో “రాజకోట రహస్యం” లో “నీవు నాకు రాజా – మరి నేను నీకు రోజా” అనే పాట కూడా ప్రసిద్ధి పొందింది. “మబ్బుల చాటున చంద్రునిలా” (ఇరుగు పొరుగు),   “గాలిలోన పైట చెంగు” (ప్రతిజ్ఞ పాలన) పాటలు కూడా ప్రసిద్ధి చెందాయి.

తమిళ చిత్రం “నల్ల ఇడత్తు సంబంధం” తో తొలిసారి గాయనిగా…

యల్.ఆర్.ఈశ్వరి గారి తండ్రి మద్రాసు స్పెన్సర్ కంపెనీలో మంచి ఉద్యోగమే చేస్తూ ఈశ్వరి అయిదేళ్ల వయస్సులో ఉండగా మరణించారు. తల్లి “నిర్మల” తన మొత్తం కుటుంబ భారాన్ని మోసేవారు. అయితే నిర్మల మంచి గాయని కూడా కావడంతో సినిమాలలో అవకాశాలు వచ్చినప్పుడల్లా పాటలు పాడుతూ ఉండేవారు. ఈశ్వరి గారు తన చదువును ఎస్.ఎస్.ఎల్.సి తో ఆపేశారు. గాయనిగా తల్లి ప్రభావం యల్.ఆర్.ఈశ్వరి గారి మీద అధికంగా ఉంది. ఈశ్వరి తల్లి నిర్మల సినీ గీతాలకు కోరస్ పాడేవారు ఆమెతోపాటు ఈశ్వరి కూడా రికార్డింగ్ లకు వెళ్తుండేది. ఆ సమయంలోను కొన్ని చిత్రాలకు కోరస్ బృందంలో పని చేసే అవకాశం లభించింది. తమిళ దర్శకుడు ఏ.పీ.నాగరాజన్ యల్.ఆర్.ఈశ్వరి గారి ఉత్సాహాన్ని, తపనను గమనించి సోలో సింగర్ గా పరిచయం చేయాలనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ప్రముఖ సంగీత దర్శకులు కేవీ మహదేవన్ నల్ల ఇడత్తు సంబంధం (1958) అనే తమిళ చిత్రం ద్వారా ఈశ్వరిని గాయనిగా పరిచయం చేశారు. ఆ పాట “ఇవరే దాన్ అవర్”.

అనుబంధాలు (1963) లో తొలిసారిగా తెలుగులో…

నిజానికి యల్.ఆర్.ఈశ్వరి గారు రోమన్ క్యాథలిక్ కుటుంబానికి చెందిన తమిళ వనిత. ఆమె అసలు పేరు లూర్డ్ మేరీ. అందువలన అమ్మమ్మ గారింట్లో అంతా మేరీ అని పిలిస్తే, నానమ్మ గారి ఇంట్లో (వారంతా హిందూ దేవతలు కొలుస్తారు) రాజేశ్వరి అని పిలుస్తారు. దాంతో వారు ఇరువురునీ సంతృప్తి పరచడం కోసం తన పేరు రాజేశ్వరిగా మార్చుకున్నారు. తమిళ చిత్ర రంగంలో అప్పటికే రాజేశ్వరి పేరుతో ఒక గాయని ఉండడంతో దర్శకులు ఏ.పీనాగరాజన్ లూర్డ్ రాజేశ్వరి ని ఎల్.ఆర్ ఈశ్వరిగా పరిచయం చేశారు. 1962 ప్రాంతంలో “అనుబంధాలు” (1963) సినిమా కోసం యం.బి.శ్రీనివాసన్ ఈశ్వరి గారి చేత తొలిసారిగా తెలుగు పాట పాడించారు. ఆ పాట పేరు “నా పేరు సెలయేరు, నన్నెవరాపలేరు”. ఆ తర్వాత స్వర్గీయ టీ.వీ.రాజు సంగీత దర్శకత్వంలో “శ్రీ సింహాచల క్షేత్ర మహిమ” (1965) లో పాడి తెలుగులో ప్రసిద్ధిచెందారు.

“కథానాయిక మొల్ల” లో అయిదు భాషల పాటలు…

ఈశ్వరి గారు ఇంతవరకు దాదాపు 14 భాషల్లో వేలాది పాటలు పాడారు. ఆ రోజుల్లో ఆమె కనీసం రోజుకు 20 పాటలకు తక్కువ కాకుండా పాడేవారు. ఈశ్వరి గారి మాతృభాష తమిళం అయినా గానీ తెలుగు, కన్నడం, మలయాళం, తుళు భాషలలో కూడా చాలా స్పష్టంగా పాటలు పాడేవారు. నన్నగండ ఎల్లి అనే కన్నడ చిత్రంలో మిత్రులు అతి క్లిష్టమైన పాటను సైతం పాడేశారు. ఆ పాటలోని గొప్పతనం ఏంటంటే ఒక్కో భాషకు రెండు లైన్లు చొప్పున 14 భాషల చరణాలు అందులో ఉండటం. 

అలాగే “కథానాయిక మొల్ల” (1970) చిత్రంలో అయిదు భాషల పాటలు పాడారు. దేశ్, ధర్మవతి రాగాలను ఈశ్వరి గారు అమితంగా ఇష్టపడేవారు. సంగీత దర్శకత్వం పట్ల తనకు ఆసక్తి లేదు. మంచి అవకాశం వచ్చినా చేయననే చెబుతారు. ఆశాం బోస్లే, మహమ్మద్ రఫీ, సుశీల, ఘంటసాల ఈశ్వరి గారికి అభిమాన నేపథ్య గాయకులు. ఎస్వీయార్, ఎంజీఆర్, ఏఎన్నార్, సావిత్రి ఈశ్వరి గారికి అభిమాన తారలు. ఖాళీ సమయాల్లో తాను పాడిన పాటల్ని మళ్ళీ మళ్ళీ వింటూ తన కంఠంలో లోపాలు వెతికేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆమె అలాగే వీడియోలో సినిమాలు చూడడం కూడా తనకు ఎంతో ఇష్టం.

70 వ దశకంలో తిరుగులేని గాయనిగా…

అంతకుముందు పాడిన కొన్ని పాటలు ఆదరణ పొందినప్పటికీ 1970 తర్వాత ఎల్.ఆర్. ఈశ్వరి గారు బాగా విజృంభించి పాడారు. అప్పట్లో ఆమెను అవకాశాలు కూడా ఆ విధంగా వెతుక్కుంటూ వచ్చాయి. “నందమయా గరుడ నందామయా” (జీవన తరంగాలు), “ఏదో తాపం ఏదో తాపం” (దేశోద్ధారకులు), “ఓలమ్మో ఓరి నాయనో” (జీవితం 1973),  “కంచె కాడ” (మానవుడు దానవుడు), “అర్ధరాత్రి కాడ అత్తయ్య నాకు” (కంచుకోట), ఆకులు పోకుల ఇవ్వద్దు (భార్య బిడ్డలు) లాంటి పాటలు ప్రేక్షకులు విరగబడి విన్నారు. “మొనగాడొస్తున్నాడు”, “రివాల్వర్ రాణి”, “కథానాయిక మొల్ల” వంటి చక్కని అవకాశాలు వచ్చాయి. 

జిల్లాయిలే జిల్లాయిలే (రైతు కుటుంబం) జనం నాలుకల మీద తెగ నాట్యం చేసింది. ఒక్క పాట ఉన్నా, రెండు పాటలున్నా ఎల్.ఆర్. ఈశ్వరి పాడిందంటే ఆ పాటలు పాపులర్ అయ్యి తీరవలసిందే. అదీ ఆమె ప్రతిభకు గుర్తు. తనకు చాలా వరకు రేడియో సిలన్ ప్రేరణ. అక్కడి నుండే పాటలు వింటూ నేర్చుకున్నారు. క్లాసికల్ సంగీతం నేర్చుకోవాలని ఎంతో కోరిక ఉన్నప్పుడు ఈశ్వరి గారికి అస్సలు డబ్బు లేదు. డబ్బు రావడం మొదలైనాక తనకు అసలు సమయం లేకపోయింది అంటారు ఎల్.ఆర్. ఈశ్వరి. కానీ క్లాసికల్ సంగీతం రాని లోటు తన పాటలలో ఎక్కడా కూడా కనిపించదు.

వైవిధ్యభరితమైన పాటలతో…

ఎల్.ఆర్. ఈశ్వరి గారికి అభిమానం గల సంగీత దర్శకులు రమేష్ నాయుడు గారు. సత్యం, వేణు, కె.వి.మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్ మొదలగు వారు ఎల్.ఆర్. ఈశ్వరి చేత ఎంతో వైవిధ్యం ఉన్న పాటలు పాడించారు. బలే బలే మగాడివోయ్ (మరోచరిత్ర), హలో మై డియర్ రాంగ్ నెంబర్ (మన్మథలీల) వాటికవే సాటి అనిపిస్తాయి. ఎల్.ఆర్. ఈశ్వరి గారు ఎన్నో పాటలు పాడారు. అన్నీ మూడొంతుల హిట్ అయిన పాటలే.  “జిక్కీ గారు చాలా మంచివారు. ఉత్తమరాలు. ఆమె నాకు ఎంతో సాయం చేశారు. నాకు అన్నం పెట్టారు.

ఎందరి దగ్గరికో నన్ను తీసుకెళ్లి ఈ పిల్ల బాగా పాడుతుంది చూడండి” అని నా గురించి చెప్పేవారు. అలా చెప్పే వారిని ఎక్కడ మనం చూడం. కొందరైతే అలా చెప్పరు సరి కదా మనకు వచ్చేది కూడా లాక్కుంటారు అంటూ ఎంతో స్వచ్ఛంగా చెబుతుంటారు ఎల్.ఆర్. ఈశ్వరి గారు గారు. తనకు ఒక తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. ఎల్.ఆర్. ఈశ్వరి గారు చెల్లెలు అంజలి కొన్ని పాటలు కూడా పాడారు (విజయనిర్మల గారు తీసిన “కవిత” సినిమాలో “బాజా భజంత్రీలు మ్రోగుతాయి పందిట్లో” పాట ఎల్. ఆర్. అంజలి పాడినదే). తాను అకస్మాత్తుగా చనిపోయారు. ఎల్.ఆర్. ఈశ్వరి గారి మంచి చెడ్డలన్నీ వారి అమ్మ గారే చూస్తారు. ఆమెకు ఎల్.ఆర్. ఈశ్వరి గారు అంటే ప్రాణం.

పలువురి ప్రముఖుల ప్రశంసలు…

అల్లరి పాటలతో శ్రోతల గుండె గదుల్లో అలజడి రేపిన ఈశ్వరి గారిని కొందరు ప్రముఖులు అల్లరి పేర్లతో ప్రశంసించారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు ఎల్.ఆర్ ఈశ్వరి లో యల్ అంటే లవ్, ఆర్ అంటే రొమాన్స్ గా చమత్కరిస్తే, ఆరుద్ర గారు “అల్లారు ముద్దుల” గాయనిగా, దర్శకరత్న దాసరి “పంచ భాషా ప్రవీణ” గా అభివర్ణించారు. “విజయ లలిత కళ్ళలో కైపు ఉంటే ఎల్లారీశ్వరి గొంతులో కైపు ఉంటుంది” అని ప్రముఖ దర్శకులు కే.ఎస్.ప్రకాష్ రావు గారు అప్పుడప్పుడు సరదాగా అనేవారు. పాట పాడేటప్పుడు ఆ పాటకనుగుణంగా డాన్స్ చేస్తూ పాడటం ఎల్.ఆర్ ఈశ్వరి గారికి అలవాటు. ప్రముఖ సంగీత దర్శకులు సత్యం తెలుగులో ఎల్.ఆర్ ఈశ్వరి గారిని బాగా ప్రోత్సహించారు. ఆమె కోసం చక్కని బాణీలను రూపొందించి ఎన్నో హిట్ సాంగ్స్ ను ఆమెచేత పాడించారు. “రౌడీ రాణి” లో “యేస్కో కోకాకోలా” లాంటి వెరైటీ క్లబ్ పాటలని తో ఎల్.ఆర్ ఈశ్వరి గారితో పాడించారు.

“రావు బాలసరస్వతీ దేవి” గారి ప్రశంస…

యల్.ఆర్.ఈశ్వరి గారికి ఆరెళ్ల వయస్సున్నప్పుడు తాను వేదిక ఎక్కి పాట పాడారు. ఆ పాట పూర్తి చేసి దిగగానే అందరూ వచ్చి ఈశ్వరి గారిని ఎంతగానో మెచ్చుకున్నారు. అప్పుడు ఒక అమ్మ తన దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుని ఎంతో ప్రేమతో తనకు ఒక కప్పు బహుమతిగా ప్రదానం చేశారు. అప్పుడు ఆవిడ ఎవరో తెలియదు. కానీ ఆ తరువాత రోజులలో ఆవిడ ఎవరో తెలిసింది. ఆమె “రావు బాలసరస్వతీ దేవి” గారు అని.  యల్.ఆర్.ఈశ్వరి గారికి “రావు బాలసరస్వతీ దేవి” గారి పాటలు అంటే ఎంతో ఇష్టం. అంతే కాకుండా “రావు బాలసరస్వతీ దేవి” గారు ఎంతో మంచి వారని, ఎదుట వారిలోని కళ ను చూసి ఆవిడ మైమరిచిపోతారని నాకు అర్థమైంది. నాకు జీవితంలో మరపురాని సంఘటన అది. నిజంగా ఆ సంఘటనను నేనెప్పటికీ మర్చిపోను. అది తలచుకున్నప్పుడల్లా నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. అంటారు ఈశ్వరి గారు.

“రావు బాలసరస్వతీ దేవి” గారు తమిళంలో పాడిన పాటలు ఎన్నో ఉన్నాయి. అవి ఎంతో బాగుంటాయి. అవి నాకు ఎంతో ఇష్టం అంటూ యల్.ఆర్.ఈశ్వరి గారు ఎంతో ఆనందంగా పడుతూ చెబుతారు.  మీకు ఇప్పుడు సినిమాల్లో పాటలు లేవు కదా మీకు ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే నాకేం బాధ లేదండి, నేను పాడవలసిన పాటలన్నీ పాడాను. నాకు రావలసిన కీర్తి, డబ్బు వచ్చాయి. నాకు ఇప్పుడు ఎన్నో స్టేజి ప్రోగ్రాములు వస్తున్నాయి. అదే కాక క్యాసెట్లు చేస్తున్నాం. వాటికి మంచి డిమాండ్ ఉంది  అన్నారామె ఉల్లాసంగా. “ఆనంద్ గారి” తో తాను ట్రూప్ గా వెళ్తుంటుంది. మధు నాకెంతో సహకారం ఇస్తారు. మధు పాడతారు. తెలుగులో ఎక్కువ లేరు తాను అక్కని, నన్ను ప్రేమతో చూస్తారు. నేను తానా సభలకు వెళ్లి పాడతానంటే అంతా మధు చేసింది. తానే నాకు సాయం సహకారం అందజేస్తుంటారు అని చెబుతుండేవారు యల్.ఆర్.ఈశ్వరి గారు.

“కలైమామణి” పురస్కారం… 

1984లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ గారి చేతుల మీదుగా “కలైమామణి” పురస్కారం అందుకున్నారు. చిత్రపరిశ్రమ లోని రాజకీయాల కారణంగానే తాను సినీ పరిశ్రమకు దూరమయ్యానని ఎల్.ఆర్ ఈశ్వరి గారు చెబుతుంటారు. ఆమె తమిళ సినిమాల్లో ఆడపాదడపా పాడుతూ స్టేజ్ ప్రోగ్రామ్స్ లో చాలా బిజీగా ఉన్న ఎల్.ఆర్ ఈశ్వరి గారు పాడిన భక్తి గీతాలు ప్రవేట్ సాంగ్స్ గా వచ్చాయి. ఆ మధ్య తెలుగులో “గ్రామదేవత” అనే ఆల్బమ్ కూడా విడుదలైంది. శృంగార గీతాలను రక్తి కట్టించడం అనేది చాలా కష్టం. ఆ విషయంలో బహు నేర్పరి యల్.ఆర్. ఈశ్వరి గారు. తన గళంలోని మత్తుకి, గమ్మత్తుకి, మహాత్తుకి ఎలాంటి వారైనా గులాం కావాల్సిందే.

అవివాహిత గా… 

నాలుగు దశాబ్దాలుగా పాటకు కొత్త సొబగులు అద్దుతూ 60లో ఉన్న వారిని కూడా 20లోకి తీసుకెళ్లగల సత్తా ఆమెకు మాత్రమే సొంతం. కొన్నేళ్లుగా తెలుగులో పాటలు పాడకపోయినా ఈ తరం శ్రోతలు కూడా ఆమె స్వరాన్ని, ఆ స్వరంలోని భాస్వరాన్ని ఆస్వాదిస్తున్నారు, ఆనందిస్తున్నారు. తన సోదరీ, సోదరుడు భవిష్యత్తు కోసం ఆమె అవివాహితగా మిగిలిపోయారు. పెళ్లి గురించి ఎవరైనా ప్రస్తావిస్తే తాను సంగీతాన్ని వివాహం చేసుకున్నానని చిలిపిగా సమాధానం ఇచ్చి దాటేస్తారు. 50 యేండ్లు పైబడినా శరీరం లో గానీ, గొంతులో గానీ ఏమాత్రం మార్పు కనపడకపోవడం ఎల్.ఆర్ ఈశ్వరి గారి ప్రత్యేకత. తెలుగులో గతంలో “చూసొద్దాం రండి” లో ఒక పాట పాడారు.

Show More
Back to top button