ఢిల్లీ గద్దెపై తెలుగోడి సత్తా చాటిన మహానాయకుడు… ఎన్టీఆర్…
నందమూరి తారక రామారావు (28 మే 1923 – 18 జనవరి 1996)
1981లో ఊటీలో “సర్దార్ పాపారాయుడు” చిత్రం చిత్రీకరణ విరామసమయంలో ఒక పాత్రికేయుడు, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? ఆని అడిగాడు. దానికి జవాబుగా “నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను”. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజు నుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తాను అని చెప్పాడు ఒక మహనీయుడు, కారణ జన్ముడు, ఓ యుగ పురుషుడు. దశాబ్దాలుగా సాగుతున్న సినీ చరిత్రలో ఓ నవ శకాన్ని లిఖించిన ఓ మహాయోధుడు. తాను చేయబోయే రాజకీయ ప్రయాణానికి అదే మొదటి సంకేతం. అతనే దివంగత ముఖ్యమంత్రి వర్యులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు.
భూమి మీద పుట్టడానికి ప్రతి మనిషికీ ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. కానీ అందరినీ కారణజన్ములు అని పిలవలేము. ఒక చర్రితకి, ఓ కొత్త శకానికి నాంది పలికేందుకు పుట్టినవాళ్లనే ఆ మాట అంటాం. “నూటికో కోటికో ఒక్కరు వందేళ్లు కాదు చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకు గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ములు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు. తాను అడుగుపెట్టిన రంగంలో చరిత్ర సృష్టించడం, ఆ రంగంలో నవశకాన్ని నిర్మించడం తనకు అలవాటైంది. ఉదాహరణకు సినిమా రంగాన్నే తీసుకుందాం. ఎన్టీఆర్ గారు రాకముందు సినిమా రంగం ఒకలా ఉండేది. ఎన్టీఆర్ గారు వచ్చాక మరొకలా మారింది. ఇప్పుడు మనం చూస్తున్న సినిమాలన్నీ తాను సృష్టించినవే. ఈ వీఎఫ్ఎక్స్లూ, బ్లూమ్యాట్లు, గ్రీన్మాట్లూ తనకు తెలియకపోవచ్చు. తీసే విధానం మారచ్చేమో కానీ ఎన్టీఆర్ గారి నటన మాత్రం ఎప్పటికీ ఒకలానే ఉంటుంది.
కారణజన్ముడు, యుగపురుషుడు, మేటి నటుడు, మహా నాయకుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు, ఈ మాటలన్నీ కేవలం నందమూరి తారకరామారావు గారి కోసమే పుట్టినా కూడా వాటికి అర్హులైన వ్యక్తి తాను తప్ప మరొకరు కనిపించరు. తెలుగు నేలకి, తెలుగు జాతికి నిండైన వెలుగులు నింపిన రూపం పేరు నందమూరి తారకరామారావు. రేయయినా, పగలైనా, ఇంకొన్ని తరాలైనా నిత్యం ప్రకాశించే ఓ తారక పేరు నందమూరి తారకరామారావు. ఈ మూడు అక్షరాలుచాలు తెలుగువారి హృదయం గర్వంతో పొంగిపోవడానికి, ఈ మూడు అక్షరాలు చాలు స్ఫూర్తిని నింపుకొని ధైర్యంగా అడుగు వేయడానికి. కళలోనైనా, సేవలో నైనా వ్యక్తిగా, మార్గదర్శకంగా నిలవడంలోనైనా తనకు సాటిగా నిలిచే పేరు మరొకటి వినిపించగలరా. అందుకే తాను యుగపురుషుడు అనిపించుకున్నారు. కథానాయకులను మించిన కథానాయకులు, పాలకులని మరిపించే పాలకులు ఇలా దేనికైనా ప్రత్యామ్నాయం ఉంటుందేమో కానీ ఎన్టీఆర్ గారికి మాత్రం ప్రత్యామ్నాయం లేరు. తాను ఒక్కరే. దర్శకుడు, రచయిత, ప్రేక్షకుడు తృప్తి చెందే వరకు అభినయించిన అరుదైన అపురూపమైన నటుడు నందమూరి తారకరామారావు గారు.
తెలుగు ప్రజల ఇంటి గోడల మీద ఇలవేల్పుగా, తెలుగు ప్రజల గుండెల్లో తెరవేల్పుగా నిలిచిన వ్యక్తి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. తెలుగు అనే పదం ఉన్నంతవరకు జాతి జనుల మీద చెరగని ముద్ర తనది. ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరిలో పుట్టిన ఒక సాధారణ రైతుబిడ్డ అసామాన్య శక్తిగా, తిరుగులేని ఏలికగా ఎదిగి మహోన్నత శిఖరాలు అధిరోహించిన వైనం అద్భుతం, అనన్య సామాన్యం. తెలుగు టాకీలు పుట్టడానికి ఎనిమిదేళ్ల మందు ఎన్టీఆర్ జన్మించారు. తెలుగు సినిమా వయస్సు సంతరించుకున్న దశలో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన దాని వ్యాప్తికి ఎంతగా కృషి చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పౌరాణిక పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసినా, నాయక ప్రతినాయక పాత్రలు పోషించినా, యువకుడి నుండి వృద్ధుడి వరకు ఏ పాత్ర చేసినా వేరు వేరు నటులు పోషించారా అనే రీతిలో అభినయాన్ని ప్రదర్శించడం కేవలం నందమూరి తారకరామారావు గారికే చెల్లింది. ఎన్టీఆర్ సినీ రంగంలో అగ్ర స్థానానికి చేరుకున్న వైనం మనం చూసినా, రాజకీయాలలో ఎందరో ఉద్ధండులను కాదని కేవలం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని హస్తగతం చేసుకున్న తీరు చూసినా కూడా నందమూరి తారకరామారావు గారు కారణజన్ములే అనిపిస్తుంది. ఇక జాతీయ స్థాయిలో ఎంతో పేరుండి, సుదీర్ఘ అనుభవం కలిగిన ఎందరో మహా నేతలు అన్నగారి వెంట తిరగడం చూసినా తాను సామాన్యుడు కానే కాదు అనిపిస్తుంది.
@ జీవిత విశేషాలు…
- జన్మ నామం : నందమూరి తారక రామారావు
- జననం : 28 మే 1923
- స్వస్థలం : నిమ్మకూరు, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం
- తండ్రి : లక్ష్మయ్య చౌదరి
- తల్లి : వెంకట్రావమ్మ
- ఇతర పేర్లు : విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, ఎన్.టి.ఆర్, అన్నగారు
- వృత్తి : సినిమా నటుడు , సినిమా దర్శకుడు, నిర్మాత , రాజకీయ నాయకుడు , రంగస్థల నటుడు
- రాజకీయ పార్టీ : తెలుగుదేశం పార్టీ
- మతం : హిందూ
- భార్య : బసవ రామ తారకం ,లక్ష్మీపార్వతి
- పిల్లలు : జయకృష్ణ, సాయికృష్ణ ,హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ, గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి
- మరణం : 18 జనవరి 1996 హైదరాబాదు, తెలంగాణ.
- @ సంక్షిప్త పరిచయం…
నందమూరి తారక రామారావు గారు గొప్ప నటులు, నిర్మాత, దర్శకులు, అంతకుమించి ప్రజానాయకులు. ఎన్టీఆర్ గా ప్రసిద్ధి చెందిన వీరు తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించారు. వీరు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ బిరుదాంకితులు. తెలుగింటి ఆడపడుచులందరూ ప్రేమగా “అన్నా” అని పిలుచుకునే తెలుగు జాతి ముద్దుబిడ్డ. ఈ ఆరడుగుల ఆజానుబావుడు, నందమూరి అందగాడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు 28 మే 1923 నాడు కృష్ణాజిల్లా గుడివాడ దగ్గరలో గల నిమ్మకూరు గ్రామంలో నందమూరి లక్ష్మయ్య, వెంకటరామమ్మ పుణ్య దంపతుల ఇంట వరాల పుత్రునిగా జన్మించారు. వీరు డిగ్రీ వరకు చదివారు. మీరు విజయవాడ యస్.ఆర్.ఆర్ కళాశాలలో చదువుతున్నప్పుడు తెలుగు పండితులు విశ్వనాథ సత్యనారాయణ గారు రామారావు గారి చేత నాగమ్మ నాటకంలో నాగమ్మ వేషం వేయించారు. తరువాత నటనలో ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. నందమూరి తారకరామారావు గారు తన మేనమామ కూతురు బసవతారకాన్ని 1942లో వివాహం చేసుకున్నారు. వీరు మంచి చిత్రకారులు కూడా. ఎన్టీఆర్ గారు కొంగర జగ్గయ్య గారితో కలిసి అనేక నాటకాలలో నటించారు.
@ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం…
సమాజంలో కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన రాజకీయాలను సామాన్యుడి చెంతకు చేర్చే లక్ష్యంతో “సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు” అనే నినాదంతో నాలుగు దశాబ్దాల క్రితం నందమూరి తారక రామారావు అమృత హస్తాలమీదుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. నందమూరి తారకరామారావు గారిని తెలుగు సినీ వినీలాకాశంలో ధృవతారగా నిలిపిన తెలుగు ప్రజల ఋణం తీర్చుకోవాలనే తపన, ఆశయం నుండి తెలుగుదేశం ఉద్భవించింది. పాలకులు పదవుల కోసం ఢిల్లీ యాత్రలు చేస్తూ తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పాలకుల పాదాక్రాంతం చేసిన పరిస్థితుల్లో తనను ఆదరించి జీవితంలో ఇంతవాణ్ణి చేసిన రాష్ట్ర ప్రజలను సమస్యల సుడిగుండం నుంచి గెట్టెక్కించడానికి నందమూరి తారకరామారావు గారు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం.
రాజకీయ కురువృద్ధుల అంచనాలను తలకిందులు చేస్తూ వందేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తొమ్మిది నెలల పసుపు గుడ్డు కూకటి వేళ్ళతో పెకిలించి భారత రాజకీయాలలో సరికొత్త అధ్యాయం సృష్టించిన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి చరిత్రను పునరుద్ధరించారు. నందమూరి తారకరామారావు గారు 29 మార్చి 1982 నాడు తెలుగుదేశం పార్టీ ఏర్పాటును ప్రకటించారు. తాను 300 మందితో నాలుగు గోడల మధ్య సమావేశం నిర్వహించి పార్టీ ప్రకటన చేయాలని భావించారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ అభిమానులు, యువత పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణ నిండిపోయింది. సమావేశాన్ని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లాన్ లోకి మార్చవలసి వచ్చింది. సభను ఉద్దేశించి ఎన్టీఆర్ గారు అరగంట పాటు ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ పైనా, ప్రభుత్వం పైనా సునిశిత విమర్శలు చేశారు. రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. పార్టీ పేరు ఏంటో చెప్పాలను కొందరు అడగడంతో ఎన్టీఆర్ గారు చిరునవ్వు నవ్వి నేను తెలుగు వాడిని, నాది “తెలుగుదేశం పార్టీ” అంటూ పార్టీ పేరును ప్రకటించారు ఎన్టీఆర్. శ్రామికుడి చెమటలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుండి, కష్టజీవుల కంటిమంటల్లో నుంచి పుట్టింది “తెలుగుదేశం పార్టీ” ఆశీర్వదించండి అంటూ పార్టీని ప్రకటించారు ఎన్టీఆర్ గారు. పార్టీ విధానం సోషలిజమా, నక్సలిజమా లేక సెక్యులరిజమా అని అడిగితే హ్యూమనిజం అంటూ బదులిచ్చారు. పార్టీని ప్రకటించి చైతన్య రథం సిద్ధం చేసి ఓట్ల కోసం జనంలోకి వచ్చారు. ఎన్టీఆర్ కు జనం నీరాజనాలు పలికారు. “రైట్ పర్సన్ అండ్ రైట్ టైం” అనే మాటను అక్షరాల నిజం చేస్తూ రాజకీయ శూన్యతను ముందే పసిగట్టిన ఢిల్లీ నాయకులను బెంబేలెత్తించి తెలుగువాడి సత్తాని చాటారు ఎన్టీఆర్ గారు.
@ చైతన్య రథం…
ఎన్టీఆర్ గారు ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించారు. ఇప్పుడు రోడ్ షోల పేరుతో నేటితరం రాజకీయ నేతలు చేస్తున్న ప్రచారానికి ఆద్యుడు ఎన్టీఆర్ గారే. చైతన్య రథం ఎక్కి ప్రచారం చేస్తూ ఎక్కడ గ్రామం కనిపిస్తే అక్కడ బహిరంగ సభ, చైతన్య రథంలోనే పడక, రోడ్డు పక్కన స్నానపానాధులు. అలా ఒక కొత్త ఒరవడికి ఎన్టీఆర్ గారు తెర తీశారు. ఎన్టీఆర్ గారు వస్తున్నారు అంటే ఊళ్ళకు ఊళ్ళు తరళి వచ్చేవి. తాను రావడం ఆలస్యం అయితే ప్రజలు రోజుల తరబడి ఎదురుచూసేవారు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశారు.
ఒక శ్రామికుడివలె ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నాడు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన ప్రచార ప్రభంజనమది. ఎన్టీఆర్ గారి ప్రసంగాలు ఉద్వేగభరితంగా, ఉద్రేకపూరితంగా ఉండి, ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. ముఖ్యమంత్రులను తరచూ మార్చడం, అదీ ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారమే తప్ప, శాసనసభ్యుల మాటకు విలువ లేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను మలచుకున్నారు ఎన్టీఆర్ గారు. కాంగ్రెసు నాయకులు కుక్కమూతి పిందెలనీ, కొజ్జాలనీ, దగాకోరులనీ, దగుల్బాజీలని, అధిష్టానం చేతిలో కీలుబొమ్మలనీ తీవ్రపదజాలంతో విమర్శించారు.
కాంగ్రెసు పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదనీ, దాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారనీ విమర్శిస్తూ, ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. “పేదవాడే నా దేవుడు, సమాజమే నా దేవాలయం” అంటూ ఎన్టీఆర్ గారు చేసిన ప్రసంగాలు ప్రజల మనసులలో బలంగా నాటుకుపోయాయి. కాంగ్రెసు నిర్వాకానికి అప్పటికే విసుగు చెందిన, ప్రజలు అతను నినాదం పట్ల ఆకర్షితులయ్యారు. 1983 జనవరి 7 న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెసు 60, సిపిఐ 4, సిపిఎం 5, బిజెపి 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఎళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్ గడ్డమీద తొలిసారిగా కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు.
@ నిజాయితీలో హరిశ్చంద్రుడు…
నందమూరి తారకరామారావు గారికి నిజాయితీ అంటే ప్రాణం. తాను తన సొంత డబ్బును ఎంత పొదుపుగా వాడేవారో, ప్రభుత్వ డబ్బు విషయంలో కూడా అంతకంటే ఎక్కువగా జాగ్రత్తగా ఉండేవారు. ముఖ్యమంత్రిగా నెలకు కేవలం ఒక్క రూపాయి గౌరవ వేతనం మాత్రమే తీసుకున్నారు. తనకు అంబాసిడర్ కారు చాలు అనేవారు. తాను సొంత ఇంట్లోనే ఉండేవారు. తన అధికారిక నివాసానికి మారలేదు. అంత నిబద్దతతో ఉండేవారు. నందమూరి తారకరామారావు గారు తాను తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే అప్పటి కార్మికశాఖ మంత్రి రామచంద్ర రావు గారిని లంచం తీసుకున్నారు అన్న ఆరోపణ రావడంతో అవినీతి నిరోధక శాఖ వారితో సోదాలు చేయించి తనను మంత్రి పదవి నుండి తొలగించారు. అలాగే మంత్రి జీవన్ రెడ్డి కలర్ టీ.వీ కొన్నాడని తెలిసి తనను ప్రశ్నించారు. జీవన్ రెడ్డి గారు తాను కలర్ టీ.వి వాయిదాల పద్ధతిలో కొన్నారని రసీదు చూపించాకే శాంతించారు. తన వారసులను రాజకీయాలకు దూరంగా పెట్టారు.
@ పటేల్ పట్వారి వ్యవస్థల రద్దు…
తెలంగాణ జిల్లాల ప్రజలను నిలువునా దోచేస్తున్న పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దుచేసి అక్కడ ప్రజలకు మరోసారి స్వాతంత్ర్యం ఇచ్చారు. తెలంగాణలో పెత్తందారీ వ్యవస్థ కుప్పకూలడానికి, భూమి రికార్డులు ప్రజలకు రావడానికి దోహద పడింది. అప్పటివరకు ఉన్న తాలూకా వ్యవస్థను రద్దుచేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఎన్నికలతో పాలనను మరింత సుగమం చేసేలా బాటలు వేశారు. ఇక అవినీతి నిర్మూలనలో ఎన్టీఆర్ స్టైల్ వేరేగా ఉండేది. ముఖ్యమంత్రి కాగానే ఉన్నతాధికారుల అవినీతిని నిర్మూలించడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఉన్నత అధికారుల కార్యాలయాలు, ఇళ్లపై దాడులు చేయించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తప్పనిసరిగా కార్యాలయంలో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 55 ఏళ్లకు తగ్గించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు రెండు నెలల పాటు సమ్మె చేశారు. ఉద్యోగుల మనోభావాలు, వారి అభిప్రాయాలకు తగ్గట్టుగా నిర్ణయాన్ని ఎన్టీఆర్ గారు వెనక్కి తీసుకున్నారు. ఇలా కొన్ని నిర్ణయాల కారణంగా సీఎం పదవి చేపట్టిన ప్రారంభంలోనే అధికారుల, ఉద్యోగుల మద్దతు ఎన్టీఆర్ గారు కోల్పోయారు.
@ మూడవ ఫ్రంట్ ఏర్పాటు…
నాదెండ్ల భాస్కరరావు రాజకీయ ఎత్తుగడలను, రాజకీయ కుట్రలను జనబలంతో తిప్పికొట్టిన ఎన్టీఆర్ గారి పేరు కేంద్ర రాజకీయాల్లో మార్మోగింది. వారసత్వ రాజకీయాలకు నిలయమైన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా దేశంలో ప్రతిపక్షాలను, వామపక్షాలను ఏకతాటిపై తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా అడుగులేసి జాతీయ శక్తిగా ఎదిగారు. దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర పార్టీల ముఖ్య నేతలని ఏకతాటిపై తెచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. తమిళనాడులో వైరిపక్షాలైన ఎం.జి.రామచంద్రన్, కరుణానిధి లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి కాంగ్రెసేతర పక్షాలను ఏకం చేశారు. దేశ రాజకీయాలలో స్టార్ వార్సా పేరొందిన చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్ పేయి, రామకృష్ణ హెగ్డే, యస్.ఆర్.బొమ్మై, చండ్ర రాజేశ్వరరావు, నంబూద్రి పాద్, జ్యోతి బసు, భీం సింగ్, బిజూ పట్నాయక్ వంటి నాయకులను ఒక్కతాటి మీదకు తెచ్చారు. ఒకే వేదిక మీదకు రప్పించగలిగారు. దేశ రాజకీయాల్లో తెలుగువాడు చక్రం తిప్పగలడన్న సత్తాను ఎన్టీఆర్ గారు ఈ వేదిక ద్వారా చాటారు. విజయవాడ లో ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించిన ఎన్టీఆర్ గారు కృష్ణా నది తీరంలో జనం మధ్యన ముఖ్యమంత్రుల సదస్సును నిర్వహించారు.
@ శాసనమండలి రద్దు…
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ప్రకారం, ఆ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించినట్లయితే, భారత పార్లమెంటు రాష్ట్ర శాసన మండలిని సృష్టించవచ్చు లేదా రద్దు చేయవచ్చు. 9 జనవరి 2024 నాటికి, 28 రాష్ట్రాలలో 6 రాష్ట్రాలు శాసన మండలిని కలిగి ఉన్నాయి. నందమూరి తారకరామారావు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన నిర్ణయాల్లో స్తబ్దత ఏర్పడుతుందని భావించిన ఎన్టీఆర్ శాసనమండలి రద్దు చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించారు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకూ పనికిరాదని ఎన్టీఆర్ గారు శాసనమండలిని రద్దు చేశారు (1 జూన్ 1985 నాడు అధికారికంగా మండలి రద్దయింది).
ఈ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలు సైతం వ్యతిరేకించినా కూడా ఎన్టీఆర్ గారు వెనక్కి తగ్గలేదు. 16 ఆగస్టు 1984 లో నాదెండ్ల భాస్కరరావు గారి ఎపిసోడ్ తెలుగు నాట మరో చరిత్ర. రామారావు గారిని అధికారం నుంచి తొలగించి తాను దొడ్డి దారిన నాదెండ్ల భాస్కరరావు గద్దెనెక్కారు అంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరుతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్లారు. ఫలితంగా సెప్టెంబర్ 16న రామారావు తిరిగి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. అయితే తాను మళ్ళీ ప్రజా తీర్పు కోరుతానంటూ మార్చి 1985 లో ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు ఎన్టీఆర్. ఆ ఎన్నికల్లో 202 స్థానాలు గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు.
@ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా..
భారతదేశానికి మూడవ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ గారు 31 అక్టోబరు 1984 తేదీన న్యూఢిల్లీ లోని సఫ్దార్జంగ్ రోడ్డు లోని తన నివాసంలో 09:20 కు హత్యచేయబడ్డారు. ఇందిరాగాంధీ గారు దారుణ హత్యకు గురయ్యాక మరుసటి సంవత్సరం కేంద్రంలో లోక్ సభ రద్దయ్యింది. ఆనాడు పంజాబ్ రాష్ట్రం మినహా 514 స్థానాలాలో జరిగిన ఎనిమిదో లోకసభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 404 సీట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించింది. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలుగుదేశం పార్టీ 30 స్థానాలు దక్కించుకుని లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది. దేశ లోక్ సభ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా గెలవడం అదే తొలిసారి. అలా తెలుగోడి సత్తా ఏంటో ఐదేళ్లపాటు ఢిల్లీ కాంగ్రెస్ కు రుచి చూపించారు ఎన్టీఆర్ గారు.
@ యువతకు రాజకీయ అవకాశాలు…
అసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్లు ఇచ్చే సమయంలో బాగా చదువుకున్న యువతకు, అప్పటిదాకా రాజకీయ అవకాశాలు అందని వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చి చట్టసభలో సామాన్యులు అడుగుపెట్టడానికి కారణమయ్యారు నందమూరి తారకరామారావు గారు. అలా కొద్ది రోజులలోనే మహా ప్రభంజనంలా మారిన తెలుగుదేశం ఆవిర్భవించిన తొమ్మిది నెలలకే 1983 ఎన్నికల్లో 199 స్థానాలతో ఘనవిజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తరువాత రాష్ట్రంలో అపజయమెరుగని కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి అధికార పీఠం దక్కించుకోవడమే కాదు, దానిని ప్రజలకు ఉపయోగపడేలా సద్వినియోగం చేయడం ఎలాగో అన్నగారిని చూసి నేతలంతా నేర్చుకోవాలి. అన్నగారు సీఎం అయ్యాక సంక్షేమ పథకాలకు కొత్త అర్థాలు ఇచ్చారు. ప్రజలకు చేరువయ్యేలా ఎన్నో పథకాల రూపకల్పన చేశారు.
@ మెరుపు వేగంతో నిర్ణయాలు…
ఎన్టీఆర్ గారు తీసుకున్న ప్రతీ నిర్ణయం ఒక సంచలనం, ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఓ ప్రభంజనం. అన్నగారు ప్రవేశపెట్టిన పథకాలలో ముఖ్యమైనది ఇప్పటికీ నేతలకు ఆదర్శంగా ఉన్నది “రెండు రూపాయల కిలో బియ్యం పథకం”. ప్రతీ పేదోడి కడుపు నింపాలనే సదాశయంతో రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్ గారు. తాను పదవిలో ఉన్నంతకాలం పథకాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. ఏ.సీ.రూములు, కాన్ఫరెన్స్ హాల్లో సమావేశాలు వంటివి తన హయాంలో ఎక్కడ వినిపించలేదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే సచివాలయం. నిర్ణయాలు తీసుకోవడంలో మెరుపు వేగం ఎన్టీఆర్ గారి సొంతం. ఓసారి నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉండగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గురించి ఇంజనీర్లు ఫైల్ ఎన్టీఆర్ దగ్గరికి తీసుకొచ్చారు. ఫైల్స్ చూడగానే ఈ ప్రాజెక్టుతో ఎంతమంది రైతులకు లబ్ది కలుగుతుందని అధికారులను అడిగారు. వాళ్ళు ఇన్ని వేల ఎకరాలకు నీరంది లక్షలాది మంది రైతులకు లబ్ది చేకూరుతుంది అని చెప్పారట. అది విన్న అన్నగారు కనీసం ఖర్చు ఎంత అవుతుంది అన్నది కూడా చూడకుండానే వెంటనే ఓకే చేసేశారట.
@ అప్రదిష్ట…
1985-89 మధ్య కాలంలో నందమూరి తారకరామారావు గారు తన ఏకస్వామ్యపాలన వలన ఎంతో అప్రదిష్ట పాలయ్యారు. పార్టీలోను, ప్రభుత్వంలోను అన్నీ తానే అయి నడిపించారు. ఎవరి మాట వినని నియంత అనే విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. మంత్రులందరిని ఒక్క కలం పోటుతో బర్తరఫ్ చేసి కొత్త మంత్రుల్ని తీసుకున్నారు. ఇలా చేయడాన్ని అప్రజాస్వామిక చర్యగా నాడు ప్రజలు భావించారు. ఇది ప్రజల్లో నిరసన భావం కలగడానికి ప్రధాన కారణమైంది. ఈ కాలంలో జరిగిన కొన్ని కుల ఘర్షణలు కూడా ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసాయి. 1989 ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెసు తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి తిరిగి అధికారానికి వచ్చింది.
ఎన్నికల్లో ఓడిపోయినా భారత దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రేసుకు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించారు. 1991లో నంద్యాల లోక్సభ ఉప ఎన్నికలలో కాంగ్రెసు తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు నిలబడగా, ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవ్వరినీ పోటీగా నిలబెట్టలేదు. ఆ తరువాత జరిగిన 1994 ఎన్నికల్లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మధ్యపాన నిషేధం వంటి హామీలతో మునుపెన్నడూ ఏ పార్టీ కూడా సాధించని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచారు.
@ క్రమశిక్షణ గల అరుదైన నాయకుడు..
రాజకీయాల్లో క్రమశిక్షణ, నిబద్దత నిజాయితీ, నిస్పాక్షికత అనేవి నందమూరి తారకరామారావు గారిని చూసి నేర్చుకోవాలి. నేటి నాయకులు ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఎలా గెలవాలాని పనిచేస్తారు. కానీ ఎన్టీఆర్ గారు గెలిచినప్పటి నుంచి ప్రజల కోసమే పనిచేశారు. తెలుగువారి ఆత్మగౌరవం విషయంలో రవ్వంత కూడా రాజీపడని నాయకులు ఎన్టీఆర్ గారు. తన పదవి పోతుందన్న పరిస్థితులు వచ్చినా కూడా తాను ఏనాడూ తల దించిందిలేదు, తల వంచింది లేదు. ఎన్టీఆర్ గారి లాంటి అరుదైన నాయకులు ఏ కాలంలో అయినా అరుదు అనే చెప్పాలి.
ఈరోజుల్లో నాయకులు అంతా ఓటు బ్యాంకు రాజకీయాలతో అధికారం కోసం అడుగులేసే వాళ్లే తప్ప జనం కోసం, జనం సంక్షేమం కోసం నిస్వార్ధంగా పనిచేసిన వాళ్ళు చాలా అరుదే అని చెప్పుకోవాలి. ఆత్మగౌరవం విషయంలో రాజీ లేదు. దేనినైనా శాసించి తీసుకోవడం తప్ప బ్రతిమిలాడడం అనే మాట ఎన్టీఆర్ గారి డిక్షనరీలో లేదు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వేదికగా నిలబెట్టిన శక్తి ఎన్టీఆర్ గారు. ప్రజల మధ్య పుట్టి, ప్రజలతోనే జీవించి, ప్రజల కోసమే జీవించి ఆఖరికి ప్రజల మధ్య కన్ను మూసిన మహా నాయకులు ఎన్టీఆర్ గారు. తెలుగువాడన్న మాటకు కేరాఫ్ అడ్రస్ ఎన్టీఆర్. అందుకే తెలుగు అన్న మూడు అక్షరాలు ఉన్నంతకాలం ఎన్టీఆర్ అన్న పేరు కూడా చిరస్థాయిగా ఉండిపోతుంది.
@ ఎన్టీఆర్ గారి విశిష్టతలు…
★ సిసలైన ప్రజానాయకుడు ఎన్టీఆర్ గారు. ఆంధ్ర ప్రదేశ్ లో, తన సమకాలికుల్లో తనంతటి ప్రజానాయకులు మరొకరు లేరు..
★ వటవృక్షంలాంటి కాంగ్రెసు పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో దీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పదనం పూర్తిగా ఎన్టీఆర్ గారిదే..
★ ఎన్టీఆర్ గారు పట్టుదలకూ, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి. ఈ కారణాల వలననే కాంగ్రెసు పార్టీని ఎదుర్కొని తాను స్థిరమైన ప్రభుత్వాన్నీ, ప్రభావవంతమైన ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగారు..
★ తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ గారే..
★ స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత నందమూరి తారకరామారావు గారిదే..
★ బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు కట్టించిన గొప్పతనం నందమూరి తారకరామారావు గారికి దక్కింది..
★ రెండు రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి, తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు నందమూరి తారకరామారావు గారు..
★ తెలుగుగంగ ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్ గారిదే..
★ దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చిన నేత నందమూరి తారకరామారావుగారే..
★ ఎందరో కొత్తవారిని, బాగా చదువుకున్నవారిని రాజకీయాలకు పరిచయం చేసి, ఒంటిచేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు నందమూరి తారకరామారావు గారు. దేవేందర్ గౌడ్, కె.చంద్రశేఖరరావు మొదలైన నేతలు తాను పరిచయం చేసినవారే..
★ “నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్” అంటూ సమర్థించటం ఒక నందమూరి తారకరామారావు గారికే చెల్లింది..
★ నందమూరి తారకరామారావు గారు మదరాసులో ఉండగా తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రీకులు మొక్కుబడిగా మదరాసు వెళ్ళి నందమూరి తారకరామారావు గారిని దర్శించుకుని వచ్చేవారు..
★ మహిళలకు ఆస్తి హక్కు, వెనుకబడినకులాల వారికి రిజర్వేషన్లు, పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం లాంటి కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు నందమూరి తారకరామారావు గారు..
★ రామారావు గారికి బాబాల, మాతల పిచ్చి లేదు. దేవునిపట్ల భక్తి ఉంది. బుద్ధునిపట్ల అపారమైన గౌరవమున్నది..
★ నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రి కాగానే సుప్రసిద్ధ పాత్రికేయులు, ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని సాంస్కృతిక సలహాదారుగా వేసుకున్నారు..
★ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా రెడ్డి కులం వారికి మాత్రమే అన్ని రాజకీయ పదవులను కట్టబెట్టడంతో, ఎన్టీఆర్ గారు మిగతా కులముల వారికి ఆశాకిరణం లాగ కనిపించారు. ఎన్టీఆర్ గారు మొట్ట మొదటి సారిగా అన్ని కులముల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలవారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు. తాను చేసిన కృషి ఫలితంగా ఈనాటికి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు..
★ తెలంగాణాలో బడుగు బలహీనవర్గాలని పట్టి పీడుస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థ లని రద్దు చేసి తెలంగాణాలోని బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్యదైవంగా మారినారు నందమూరి తారకరామారావు గారు..