HISTORY CULTURE AND LITERATURETelugu Featured NewsTelugu Special Stories

భువిపై ఉన్న స్వర్గపురి అయోధ్య నగరం

శతాబ్దాల కల… సాకారమవుతున్న వేళ… కోట్ల మంది హిందువుల కల నెరవేరే సమయం

చరిత్రలో నిలిచిపోనున్న ఆధ్యాత్మిక ఘట్టం రాముని ఖ్యాతి ఇనుమడింపజేసేలా రామాలయ నిర్మాణం

జనవరి 22.. ఇప్పుడు ఈ తేదీ అంటే అందరికీ మదిలో మెదిలే ఒకే ఒక్క మాట అయోధ్య రామ మందిరం. రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కోసం యావత్ భారతదేశం 

తో పాటు ఇతర దేశాలలో ఉన్న హిందువులు సైతం ఈ మహత్తర, ఆధ్యాత్మిక ఘట్టం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంకో మూడు రోజుల్లో ఈ ఆలయంలో ఆ జగదానందకారకుడు, కోదండరాముడు సీతారామచంద్రస్వామికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఎవరిని పలకరించినా అందరి నోటా ఒకటే మాట జైశ్రీరామ్.. రామ అనే పదం వింటేనే మనసంతా ఆహ్లాదంతో నిండిపోతుంది.  అయోధ్య అంటేనే ఒళ్లంతా పులకరించిపోతుంది. అయోధ్యలో శ్రీరామచంద్రుని ఆలయ నిర్మాణం ఓ పెద్ద సాహసం అనే చెప్పాలి. దశాబ్దాలుగా కన్న కల జనవరి 22న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టతో సాకారం కానుంది. రామ మందిరం కోసం ఎన్నో విద్వాంసాలు జరిగాయి. ఆ శ్రీరామచంద్రుడు పుట్టిన గడ్డమీద ఆయన మరోసారి ప్రాణం పోసుకోనున్నారు.  జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం, శ్రీరామచంద్రుని విగ్రహావిష్కరణ ప్రధాని మోదీ చేతుల మీదుగా   జరగనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నియమ నిష్ఠలతో, శాస్త్రబద్ధంగా  ఆచారాలను పాటిస్తున్నారు. 11 రోజులుగా ఆయన సాత్విక ఆహారం తీసుకుంటూ.. కటిక నేలపై నిద్రిస్తూ.. దీక్షను చేపట్టారు. అయోధ్య రామ మందిరానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ?  అయోధ్య నగరం ఆనాటి కాలం నుండి ఈనాటి వరకు ఏం జరిగింది..?  రామ మందిరం నిర్మాణ చరిత్ర, అయోధ్య నగరం చరిత్ర ఏమిటో ముందుగా మనం తెలుసుకుందాం.

@ శ్రీరాముని జన్మస్థలం అయోధ్య నగరం..

అయోధ్య నగరం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ముఖ్య పట్టణం.భారతదేశంలోని అతిపురాతన నగరాలలో అయోధ్య ఒకటి. అయోధ్యను సాకేతపురమని కూడా పిలుస్తారు. మహా విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య గా పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాదుని ఆనుకుని ఉంది. సముద్రమట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉన్న అయోధ్య కోసలరాజ్యానికి రాజధానిగా ఉండేదట. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరంగా రామాయణంలో రాసి ఉంది. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది. 

అయోధ్య అత్యంత ప్రాచీనమైన, విశాలమైన, అత్యద్భుతమైన నగరంగా చెప్పవచ్చు. హిందూ పురాణాల ప్రకారం సూర్యవంశానికి చెందిన రాజు దశరథుని రాజ్యమైన కోసల రాజ్యానికి, రాజధానిగా ఉండేది. రామాయణంలోని ప్రారంభ అధ్యాయాలలో ఈ నగరం యొక్క గొప్పతనాన్ని, అక్కడి ప్రజల మంచితనాన్ని గురించి వర్ణించడం జరిగింది.

జైన మతానికి చెందిన ఐదుగురు తీర్థంకరులు కూడా ఇక్కడే జన్మించారు. జైన మతానికి ఆధ్యుడైన శ్రీ వృషభనాథుడు కూడా ఇక్కడే జన్మించాడు. భగవాన్ స్వామి నారాయణ్ కూడా తన బాల్యం ఇక్కడే గడిపాడు. ఆయన భారతదేశం అంతటా ఏడు సంవత్సరాలు పర్యటించినపుడు, ఆ యాత్రను ఇక్కడ నుంచే ప్రారంభించాడు. తులసీదాసు కూడా తానురచించిన రామచరిత మానస్ గ్రంథాన్ని సా.శ.1574 లో ఇక్కడ నుంచే ప్రారంభించాడు.

@ అయోధ్యకు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. ?

పురాణ కథల ప్రకారం మహారాజైన ఆయుధ్ ను శ్రీరాముని పూర్వీకునిగా పేర్కొన్నారు. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది. ఆయుధ్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చినట్లు పురాణ కథలు చెబుతున్నాయి. అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్ధం. గౌతమబుద్ధుని కాలంలో ఈ నగరం పాళీ భాష లో అయోజిహాగా పేర్కొన్నారు. అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్ధాన్ని ఇస్తుంది. పురాణాలలో గంగానది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది.

సామాన్య శకం మొదటి శతాబ్ధాలలో ఈ నగరాన్ని సాంకేతపురంగా పేర్కొన్నారు. సా.శ.127 సాంకేతపురాన్ని కుషన్ చక్రవర్తి చేత జయించబడింది. కుషన్ చక్రవర్తి తూర్పుప్రాంతంనికి అయోధ్యను కేంద్రంగా చేసి పాలించాడు. 5వ శతాబ్దంలో ఈ నగరం ఫాక్సియన్ అన్న పేరుతో పిలువబడింది. చైనా సన్యాసి యుఁవాన్‌ త్స్యాంగ్‌ సా.శ.636 లో తన భారతదేశ యాత్రలో ఈనగరాన్ని అయోధ్యగా పేర్కొన్నాడు. కాని ఈ పేరు మార్పు ఎప్పుడు జరిగిందన్న విషయంలో స్పష్టత లేదు. మొఘల్ పాలనా కాలంలో ఇది గవర్నర్ ఆయుధ్ స్థానంగా ఉండేది. బ్రిటిష్ పాలనా సమయంలో ఈనగరాన్ని అయోధ్య, అజోధియగా పేర్కొన్నారు . అలాగే అయోధ్య, బ్రిటిష్ వారి కేంద్రపాలిత ప్రాంతాలైన ఆగ్రా-అయుధ్ ప్రాంతాలలో ఒక భాగంగా ఉండేది.

@ అయోధ్యలో హిందూ ముస్లిం వివాదం.. బాబ్రీ మసీదు..

మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ అయోధ్య రామ జన్మభూమిగా చెప్పుకునే ప్రదేశంలో స్థలంలో 16 వ శతాబ్దంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన. 1984 సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ బాబ్రీ మసీదు స్థలాన్ని రామ ఆలయం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఒక ఉద్యమం ప్రారంభించింది. 1992 వ సంవత్సరం డిసెంబర్ 6 న రామ భక్తులు, దేశం నలుమూలల నుండి తరలివచ్చారు.ఒక హిందూ జాతీయవాద ర్యాలీలో జరిగిన అల్లర్లు, బాబ్రీ మసీదు కూల్చివేతకు దారి తీశాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది. అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది పి.వి. నరసింహారావు దీన్ని నివారించలేక పోయిన ఆయనకు ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చలా మిగిలిపోయింది. 2019 నవంబరు 09 న అయోధ్య తుదితీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. ‘2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్‌కు అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వాలని ఆదేశాలిచింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఆ భూమిని ట్రస్ట్‌కి అప్పగించాలని, ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులను ట్రస్ట్ చేపట్టాలని’ ఆ తీర్పులో వెల్లడించింది.

@ మసీదు విధ్వంసం.. చెలరేగిన అల్లర్లు..

బాబ్రీ మసీదు విధ్వంసంతో దేశవ్యాప్తంగా ముస్లిములు అల్లర్లకు తెగించారు. ఆగ్రహ జ్వాలలతో హిందువులపై దాడులకు దిగారు.  పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇతర ముస్లిం దేశాలంతా ఒకటయ్యాయి. అనేక నెలల పాటు జరిగిన మతకలహాల్లో హిందువులు ముస్లింలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇళ్ళు, దుకాణాలు, ప్రార్థనా స్థలాలను తగలబెట్టారు, దోచుకున్నారు. పలువురు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు, వీహెచ్‌పీని కొంతకాలం ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ, అల్లర్లు ముంబై, సూరత్, అహ్మదాబాద్, కాన్పూర్, ఢీల్లీ, భోపాల్ అనేక ఇతర నగరాలకు వ్యాపించాయి. సుమారుగా 2,000 మందికి పైగా – ప్రధానంగా ముస్లింలు- మరణించారు. ఒక్క ముంబై అల్లర్ల లోనే సుమారు 900 మంది మరణించారు. సుమారు, 9,000 కోట్ల ఆస్తి నష్టం కలిగింది. డిసెంబరు – 1993 జనవరిలలో  జరిగిన ఈ అల్లర్లలో శివసేన పెద్ద పాత్ర పోషించింది. 1993 ముంబై బాంబు దాడులకు, ఆ తరువాతి దశాబ్దంలో జరిగిన అనేక అల్లర్లకూ వెనుక ఉన్న ప్రధాన కారకాలు ఈ కూల్చివేత, ఆ తరువాత జరిగిన అల్లర్లే. భారతీయ ముజాహిదీన్లతో సహా జిహాదీ గ్రూపులు తమ ఉగ్రవాద దాడులకు బాబ్రీ మసీదును కూల్చివేయడం ఒక కారణమని పేర్కొన్నాయి.

@ 2019 సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు…

అయోధ్య వివాదంపై 2019లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో నిర్మాణానికి మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆలయ నిర్మాణం కోసం ‘శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్’ని ఏర్పాటు చేసింది. 2020 ఆగస్టు 5న దేశ ప్రధాని నరేంద్ర మోదీ వైభవంగా, అట్టహాసంగా ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. తమ చిరకాల వాంఛ నెరవేరింది అంటూ సంబరాలు జరుపుకున్నారు. ఆనాటి నుంచి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1988లో అహ్మదాబాద్ లోని సోంపురా కుటుంబం రూపొందించిన డిజైన్ పై ఆలయ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇక నాలుగు రోజుల్లో అయోధ్యలోని రామమందిర మహోత్సవం జనవరి 22 సోమవారం రోజున మధ్యాహ్నం 12:20 గంటలకు జరగనుంది. ప్రధానమంత్రి మోదీ సహా వీవీఐపీ అతిథులు ఈ వేడుకకు భారీగా హాజరుకానున్నారు.

రామమందిరంలో జరిగే ప్రతిష్ఠాపన వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు ఆలయాన్ని నిర్మించే వైభవానికి అనుగుణంగా ఉన్నాయి.

@ అబ్బురపరిచే ఆలయ నిర్మాణం.. 

రామయ్య ప్రాణ ప్రతిష్ట వేళ అయోధ్యలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రామ మందిర నిర్మాణాన్ని చూస్తే ఔరా అనిపిస్తుంది. ఆలయ నిర్మాణం అబ్బురపరిచే విధానంగా ఆకట్టుకుంటుంది. ఆలయం 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు ఉంది. శిఖరం ఎత్తు 161 ఫీట్లు ఉంది. ఆలయంలో రెండు మండపాలు నిర్మించారు. 360 పిల్లర్లతో ఆలయం రూపుదిద్దుకుంది. మన దేశంలో ప్రాచీన ఆలయ నిర్మాణ పద్ధతిలో ఒకటైన ‘నగరా శైలిలో’ అయోధ్య రామాలయం రూపుదిద్దుకుంది. దాదాపు 1000 సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా ఉండేవిధంగా రామమందిర నిర్మాణం జరిగింది.

ఈ చారిత్రాత్మక నిర్మాణానికి ప్రణాళిక రచించింది ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపురా. చంద్రకాంత్ 35 ఏళ్ల క్రితమే రామ మందిర నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారట. చంద్రకాంత్ స్వస్థలం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్. చంద్రకాంత్ వారి కుటుంబం 15 తరాలుగా ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నారు. దేశంలోని ఎన్నో ప్రసిద్ధ ఆలయాలకు సోంపురా కుటుంబీకులే ప్రణాళిక రచించారట. గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సోమనాధ ఆలయానికి చంద్రకాంత్ తాత ప్రభాకర్ సోంపురా నిర్మాణ ప్రణాళికలు చేపట్టారట. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించనున్న విగ్రహం ఐదేళ్ల బాలుడి రూపంలో ఉన్న  రామ్ లల్లా ను ప్రతిష్టించనున్నారు.

@ నల్లని పద్మ పీఠంపై ఐదేళ్ల బాల రాముడు

ఈనెల 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. నేపాల్ లోని గండకీ నది తీరం నుంచి శిలలను అయోధ్యకు తీసుకువచ్చి.. కృష్ణ శిలతో రామ విగ్రహం తయారు చేశారు. విగ్రహం పొడవు 5 అడుగులు,  బరువు 150 కేజీలు. నల్లని పద్మ పీఠంపై ఐదేళ్ల బాలరాముడు కొలువై ఉన్నాడు. శిల్పి అరుణ్ యోగి రాజ్ విగ్రహాన్ని రూపొందించారు. కాశీకి చెందిన జ్ఞానేశ్వర్ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ట జరగనుంది. ప్రతి ఏటా శ్రీరామనవమికి రామయ్య నుదుటిపై తిలకంలా సూర్య కిరణాలు పడేలా శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు.

జనవరి 22న రామయ్య ప్రాణ ప్రతిష్ట రోజు నుంచి ఆలయంలో 20 మంది నూతన అర్చకులు రోజువారి పూజలు చేయనున్నారు. ఈ క్రమంలో రామ భూమి తీర్థ ట్రస్ట్ 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తుంది.

@ కృష్ణ శిలలకు ఎందుకంత ప్రాముఖ్యత..?

కృష్ణ శిలలు సుమారు 6 కోట్ల సంవత్సరాల నాటి కాలానికి చెందినవిగా పురాణ గాథలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారి మూల విరాట్ కూడా గండకీ నదీ తీరం నుంచి తీసుకువచ్చిన కృష్ణశిల తోనే విగ్రహం రూపుదిద్దుతుందని చెబుతున్నారు. గండకీ నది శిలలు చాలా శ్రేష్టమైనవి అందుకే అయోధ్య బాల రాముని విగ్రహా తయారీకి కూడా కూడా కృష్ణ శిలనే ఎంపిక చేశారట.

@ భక్తుల కోసం పటిష్ట ఏర్పాట్లు…

జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కొరకు వచ్చే భక్తుల కోసం ఉత్తర ప్రదేశ్  సర్కార్ అధికారులు పటిష్ట చర్యలను చేపట్టారు. రామయ్య ప్రాణ ప్రతిష్టకు ప్రధాని మోదీ తో సహా 130 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. అయోధ్యలోని రామ మందిరాన్ని చేరుకొనుటకు మూడు మార్గాలను అధికారులు ఏర్పాటు చేశారు. ‘రామ్ పథం, భక్తి పథం, జన్మభూమి పథం’ ద్వారా రామయ్య గర్భగుడికి చేరుకోవచ్చు. ఈ మార్గాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. వర్షం, ఎండ తగలకుండా  మార్గాలలో తగు ఏర్పాట్లు చేశారు. భక్తుల కదలికలను ఎప్పటికప్పుడు భద్రతా సిబ్బంది పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. సుమారు 80 వేల మంది భక్తులకు వసతి సౌకర్యం కల్పించేలా అధికారులు ఏర్పాటు చేశారు. మాజా గుప్తార్ ఘాట్ వద్ద 20 ఎకరాల్లో 25 వేల మందికి వసతి కల్పించేలా ఏర్పాటు చేశారు. బ్రహ్మ కుండ వద్ద 30 వేల మందికి వసతి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా బాగ్ బీజేసీ వద్ద కార్ సేవక్ పురం, మణిరాం దాస్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో 25వేల మందికి వసతి కల్పిస్తూ ఏర్పాట్లు చేశారు.

@ రామ మందిరం  వివరాలు…

రాముని ఖ్యాతి ఇనుమడింపజేసేలా రామాలయం నిర్మాణం జరిగింది. అయోధ్యలో దివ్య, నవ్య, భవ్య రామ మందిరంలో రామయ్యకు ప్రాణ ప్రతిష్ట వేడుక జరగనుంది. మూడు అంతస్తుల్లో రామ మందిరాన్ని నిర్మించారు. శ్రీరామ ధర్భార్,  ప్రధాన ఆలయ గర్భగుడి, మరోపక్క బాల రాముని విగ్రహం దర్శనమివ్వనున్నాయి. ఆలయంలో ఐదు మండపాలు నిర్మించారు. నృత్యం మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, కీర్తనా మండపం అద్భుత శైలిలో నిర్మించారు. ఆలే స్తంభాలు, గోడలపై దేవతా మూర్తుల విగ్రహాలు దర్శనమిస్తాయి. దేవతామూర్తుల విగ్రహాలు చూస్తుంటే కనువిందు కలగక మానదు.  తూర్పు సింహద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించే విధానంగా ఆలయాన్ని రూపొందించారు. ఆలయ గర్భగుడికి వెళ్లాలంటే 32 మెట్లు ఎక్కాల్సిందే. అయితే నడవలేనటువంటి దివ్యాంగులు, వృద్ధుల కోసం ర్యాంపు, లిఫ్ట్ సౌకర్యాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. మరోపక్క 732 మీటర్ల పొడవుతో ప్రహారీ గోడని నిర్మిస్తున్నారు. అసలైతే నగర విధానాలు నిర్మించే ఆలయాలకు గోడలు ఉండవు కానీ.. అయోధ్యలో 14 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ప్రహరీ గోడను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉండేలా 70 ఎకరాల్లో 30% మాత్రమే ఆలయాన్ని నిర్మించి మిగతా ప్రదేశాన్నంతా గ్రీనరీతో పచ్చదనాన్ని కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని,  స్వచ్ఛమైన గాలిని అందించేందుకు  అధికారులు ఏర్పాటు చేశారు. ఉత్తర, దక్షిణ ఆలయ నిర్మాణాలకు ఈ ఆలయం ప్రత్యేకగా నిలుస్తుంది అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు.

@ నిఘా నీడలో అయోధ్యా నగరం…

రామ మందిరం ప్రతిష్ట ప్రారంభోత్సవ ఏర్పాట్లతో అయోధ్య నగరం బిజీబిజీగా ఉంది. ఇప్పటినుంచి సందర్శకుల తాకిడి మొదలైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామ మందిరం తోపాటు అయోధ్య నగరం నిఘా నీడలో ఉంది. అయోధ్య నగరం శత్రుదుర్భేద్యంగా మారింది. 50 వేలమంది మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ఆలయం చుట్టూ పటిష్ట బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. కమాండోలు, భద్రత దళాలు రంగంలోకి దిగాయి. యాంటీ డ్రోన్ వ్యవస్థతో నిఘా నీడలో అయోధ్య నగరం ఉంది. ఆలయం చుట్టూ భద్రతా దళాలు రెండు జోన్లుగా ఏర్పడ్డాయి. భద్రతా బలగాల పర్యవేక్షణలో అయోధ్య నగరం విరాజిల్లుతుంది.

కోట్ల మంది హిందువుల కళ నెరవేరిన సందర్భంగా మరో మూడు రోజుల్లో జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవం కోసం యావత్ దేశం వేయి కళ్ళతో ఎదురుచూస్తుంది.. ఇప్పటికే అయోధ్య నగరం కాషాయ రంగును పులుముకొని జైశ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగుతుంది.

@  అయోధ్యలో మరిన్ని చూడదగ్గ ప్రదేశాలు…

అయోధ్య నగరం అంటేనే భువిపై ఉన్న స్వర్గపురిలా కనిపిస్తుంది. శ్రీరామచంద్రుని జన్మభూమి అయినటువంటి అయోధ్య నగరంలో రాముడికి సంబంధించిన మరికొన్ని ప్రదేశాలను కూడా చూడవచ్చు. సరయూ నది స్నాన ఘట్టం, అన్నదాన సమాజం, కౌసల్యాదేవి మందిరం, హనుమద్ మందిరం, వాల్మీకి మందిరం, కనకమహాల్, హనుమద్ ఆలయం కూడా అయోధ్య నగరం ప్రదేశాలు. ఈ ప్రదేశాలకు దేశ విదేశాల నుండి వచ్చే పర్యటకుల తాకిడి ఎల్లప్పుడూ ఉంటుంది.

Show More
Back to top button