నారాయణో హరిః అనే వ్యాఖ్యం ఉంది. అంటే వైద్యులు దేవుళ్లతో సమానం అని అర్థం. అలాంటిది, కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్లో ట్రైనీ డాక్టర్ అత్యాచారం ఆపై హత్యకు గురైన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలి(అభయ) పోస్టుమార్టం రిపోర్టులో పలు సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. వీటిపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏం జరిగింది? దీనిపై దేశ వ్యాప్తంగా ఎందుకు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి? అనే విషయాలు తెలుసుకుందాం.
ఈ ఘటన ఆగస్టు 9న తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల మధ్య ట్రైనీ డాక్టర్ అతి కిరాతకంగా ఆసుపత్రిలోనే హత్యకు గురైంది. ఈ హత్యాచారం ఎంత కిరాతకంగా ఉందంటే.. బాధితురాలి బాడీ నుంచి 151 మి.గ్రా స్పెర్మ్ దొరికినట్టు పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఒక నరరూప రాక్షసుడు సెమినార్ హాల్లో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న ఆ ట్రైనీ డాక్టర్ను చిత్రహింసలు పెట్టి చంపినట్టు ఫోరెన్సిక్ రిపోర్టు కూడా చెబుతోంది.
పోస్టుమార్టం రిపోర్టులో వైద్యురాలిని ఎంత కిరాతకంగా చంపాడో బయటపడింది. అది చదివిన ప్రతి ఒక్కరి రక్తం ఉడికిపోతోంది. ఇద్దరికీ ఎలాంటి శత్రుత్వం లేకపోయినా కేవలం తన శారీరక వాంఛ కోసం భయానకంగా చంపడం అనేది ఒక మానసిక రుగ్మతగానే భావించాలి. సాటి మనిషిని అతి కిరాతకంగా చంపి ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్లి నిద్రపోయాడంటే అతనిలో ఏమూల తప్పు చేసిన ఫీలింగ్ లేదంటే అతను మనసు ఎంత కరుడుకట్టుకు పోయిందో. ఇలాంటి మానవ మృగాలు గతంలో కూడా చరిత్రలో తారసపడ్డారు. వారిని ఇలాంటి హేయమైన చర్యలకు ప్రేరేపించేది ఏమిటి? వారి పెంపకమా? వారిలో ఉన్న మానసిక రుగ్మతా? లేక బాల్యంలో అనుభవించిన గాయాలా? మానసిక శాస్త్రవేత్తలు ఆ విషయాన్ని వివరిస్తున్నారు.
ఎవరైనా తీవ్ర నేరం చేసినప్పుడు వారి ప్రతికూల ప్రవర్తనకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువే మానసిక కారకాలు ఉండే అవకాశం ఉంది. 2017లో నేరం చేసిన 228 మంది ఖైదీలపై అధ్యయనాన్ని నిర్వహించారు పరిశోధకులు. వారిలో 80 శాతానికి పైగా నేరస్తులు వ్యక్తిత్వ లోపాన్ని కలిగి ఉన్నట్టు గుర్తించారు. అలాగే వారిలో మేజర్ డిప్రెసివ్ డిజార్డర్, డిపెండెంట్ పర్సనాలిటీ డిజార్డర్, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్, బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలు కూడా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఇలాంటి డిజార్డర్ల బారిన పడిన వారే ఎదుట వ్యక్తిని కనీస మానవత్వం లేకుండా అతి కిరాతకంగా తమ అవసరం కోసం చంపేస్తారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి బిడ్డ పుట్టినప్పుడు అప్పుడే విరిసిన పువ్వులా స్వచ్ఛంగా ఉంటారు. కానీ వారు ఎదిగిన వాతావరణమే వారిలో నేర ప్రవర్తనను పెంపొందిస్తుందని వివరిస్తున్నారు. ఒక పిల్లవాడు తన బాల్యంలో శారీరక వేధింపులకు, నిర్లక్ష్యానికి గురైనప్పుడు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల వల్ల మానసికంగా దెబ్బతిన్నప్పుడు, అలాగే వారి కుటుంబ సభ్యులు మరణాన్ని నేరుగా చూసినప్పుడు…వారి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆ పరిణామాలు వారిలో దీర్ఘకాలంగా కొనసాగుతాయని వివరిస్తున్నారు. అవి మానసిక రుగ్మతలుగా కూడా మారతాయని తెలియజేస్తున్నారు.
ఈ హత్యాచార ఘటనలో దిగ్భ్రాంతిగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారానికి తెగబడిన దుర్మార్గుడు.. కళ్లు, గోళ్లు, మెడతో పాటు జననాంగాలపై గాయాలు చేసి అతి కిరాతకంగా ఆమె ప్రాణాలు తీశాడు. ఉక్కిరిబిక్కిరి చేసి, గొంతు నులిమి చంపేయడంతో థైరాయిడ్ మృదులాస్థి విరిగిపోయినట్లు గుర్తించారు. ఆగస్టు 8న నైట్ డ్యూటీలో ఉన్న బాధితురాలు.. తన సహచరులతో కలిసి ఒలింపిక్స్ చూసింది. నీరజ్ చోప్రా మ్యాచ్ ముగిసిన తర్వాత తోటి వైద్యులతో కలిసి డిన్నర్ పూర్తిచేసి.. సెమినార్ హాల్‌లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పి వెళ్లింది. కానీ, అదే ఆమె పాలిట యమపాశమైంది.తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. ఆమెను హత్య చేసినట్టు పోస్ట్‌మార్టమ్ నివేదిక తెలిపింది. బాధితురాలి బొడ్డు, పెదవులు, వేళ్లు, ఎడమ కాలికి గాయాలు గుర్తులు ఉన్నాయి. ఆమె కేకలు వేయకుండా నోరు మూసేసి.. తలను గోడ లేదా నేలకు బలంగా కొట్టినట్టు గుర్తించారు. సహాయం కోసం అరవకుండా బాధితురాలి నోరు, గొంతును నిరంతరం నొక్కి ఉంచారని, కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం జరిగిందని నివేదిక వెల్లడించింది.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్‌ను అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన ఆర్జీ రాయ్ ఆస్పత్రి వద్ద ఉండే పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద నిందితుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. పోర్న్‌కు బానిసైన కామాంధుడు.. హింసాత్మక క్లిప్‌లను చూసేందుకు ఇష్టపడుతాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అతడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్టు గుర్తించారు. ఇక, నేరం చేసిన తర్వాత తన బ్యారక్‌కు వెళ్లిన సంజయ్ రాయ్ చాలా గంటలు నిద్రపోయినట్టు తేలింది. మేల్కొన్న తర్వాత నేరాన్ని కప్పిపుచ్చుకోడానికి బట్టలు ఉతికేసి.. షూపై రక్తపు మరకలు తుడిచేశాడు.
* బ్లూ టూత్ పట్టించింది..
సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడ్ని పోలీసులు 6 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. బ్లూటూత్ అతడిని పట్టించింది. నిందితుడు పొద్దున 4 గంటల సమయంలో ఆ బిల్డింగ్‌లోకి ఎంటరయినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. అప్పుడు నిందితుడు ఇయర్‌ఫోన్‌లు పెట్టుకున్నాడు. అయితే 40 నిమిషాల తర్వాత ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, అతని చెవుల్లో ఇయర్ ఫోన్‌లు లేవు. సెమినార్ హాల్‌లో విరిగిన బ్లూటూత్‌ను పోలీసులు గుర్తించారు. అది నిందితుడి ఫోన్‌కు కనెక్ట్ అయినట్లు గుర్తించారు. ఘటనాస్థలంలో సేకరించిన ఆధారాలతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
కోల్‌కతాలో వైద్య విద్యార్థిపై అత్యాచారం, హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎంపిక సేవలను నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ, ముంబై, కోల్‌కతాతో పాటు అనేక ఇతర నగరాల్లోని వైద్యులు ప్రకటన చేశారు. కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో బాధితురాలికి న్యాయం జరగాలనేది మొదటి డిమాండ్‌గా వినిపిస్తోంది. ఆస్పత్రిలోని బిల్డింగ్కు లేదా లైబ్రరీకి మృతిరాలి పేరు పెట్టాలి. ఈ ఘటనపై వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించాలి అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన వైద్యురాలి కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించి ఈ విషయంలో సత్వరమే న్యాయం చేయాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు సెంట్రల్ హెల్త్‌కేర్ ప్రొటెక్షన్ యాక్ట్‌ని తీసుకురావాని వైద్యులు కోరుతున్నారు. వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎంపిక సేవలను నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ, ముంబై, కోల్‌కతాతో పాటు అనేక ఇతర నగరాల్లోని వైద్యులు ప్రకటన చేశారు తమ డిమాండ్లు పరిష్కారమయ్యేవరకూ ఆందోళన
కొనసాగిస్తామని వైద్యులు స్పష్టం చేశారు.
ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు సైతం వేడెక్కాయి.. తృణమూల్ ప్రభుత్వం బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది.. బీజేపీ నేతలు క్యాండిల్ మార్చ్, నిరసనలు చేపట్టారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలంలో వైద్యులు బీభత్సం సృష్టించడంతో పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయు గోళాలు ప్రయోగించాల్సి రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. దాడిలో ఎమర్జెన్సీ వార్డు పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో నేరస్థలంలోని కీలక సాక్ష్యాధారాలకు నష్టం వాటిల్లినట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయాల నీలినీడలు ప్రసరించడం శోచనీయం. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పాతవైరానికి కొత్త ముడిసరుకుగా ఈ ఘటన మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మమత నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వానికి ఈ ఉదంతం ఓ అగ్నిపరీక్షలా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని తృణమూల్ సర్కారుకు మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పులా కొనసాగుతున్న నేపథ్యంలో హత్యాచార ఉదంతం ఆ వైరానికి ఆజ్యం పోస్తున్నది.
2012లో జరిగిన నిర్భయ ఘటనను నిర్భయ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత కూడా అదే నిరసనలు చేయాల్సి వస్తోంది. “12ఏళ్ల తర్వాతా.. అదే స్టోరీ.. అదే నిరసన. కానీ మనం ఇంకా మార్పు కోసం వేచిచూస్తున్నాం” పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలో.. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. యూపీ సరిహద్దుల్లో ఓ నర్సు హత్యాచారానికి గురయ్యింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపుర్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న బాధితురాలు.. జులై 30న డ్యూటీకి వెళ్లి కనిపించకుండా పోయింది. ఆమె సోదరి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.