భారత స్వతంత్రదినోత్సవం.. భారత జాతికి బ్రిటిష్ వారినుంచి విముక్తి కలిగిన రోజు. తెల్లదొరలను తరిమికొట్టి బానిసత్వాలు సంకెళ్లను ముక్కలు చేసి స్వాతంత్రం సాధించిన రోజు. భారత స్వాతంత్య్రం సాధించడానికి ఎంతో మంది వీరులు దేశం కోసం అనేక పోరాటాలు, యుద్దాలు చేసి చివరికి తమ ప్రాణాలను సైతం భరతమాతకు అర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ, నెహ్రు, అంబెడ్కర్, సుభాష్ చంద్రబోస్, అల్లూరిసీతారామరాజు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సర్ధార్ వల్లభభాయ్ పటేల్, బాల గంగాధర తిలక్, లాలా లజపత్ రావు, గోపాల కృష్ణ గోఖలే, సరోజినీ నాయుడు, జాన్సీరాణి లక్ష్మిభాయి.. ఇలా ఎందరో భారత జాతి విముక్తి కోసం తమ ప్రాణాలను అర్పించారు. తెల్లజాతి వాడి తూటాలకు ఎదురునిలిచి ఎందరో మహా వీరులు అమరవీరులయ్యారు.
అయితే స్వతంత్ర పోరాటంలో మరో వీరనారి కూడా తమ ప్రాణాలకు సైతం తెగించి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని భారత మాత ఒడిలో తనువు చాలించింది. ఆమెనే మాతాంగిని హజ్రా. 72 సంవత్సాలర వయస్సులో మాతృభూమి స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారితో పోరాటం సాగించి.. వారి తూటాలకు బలై అమరవీరురాలు అయింది. ప్రజలంతా ఈమెను గాంధీ బురీ అని ముద్దుగా పిలుచుకుంటారు. ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌లోని మేథినీపుర్ జిల్లాలో తమ్లుక్‌కు సమీపంలోని హోగ్లా గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో మాతంగిని హజ్రా జన్మించారు. పేదరికం కారణంగా మాతంగిని చదువుకోలేకపోయారు. 12 ఏళ్లకే 60 ఏళ్ల త్రిలోచన్‌తో ఈమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. దురదృష్టవశాత్తు కొద్ది సంవత్సరాలకే భర్త చనిపోవటంతో 18వ ఏట వితంతువుగా పుట్టింటికి వచ్చింది. తన దురదృష్టాన్ని గుండెల్లోనే దాచుకొని.. స్వతంత్రం కోసం పోరాడాలని సంకల్పించి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది.
అలా భారత స్వాతంత్య్ర ఉద్యమం పట్ల ఆమె ఆకర్షితురాలయ్యారు. గాంధీజీ అనుసరిస్తున్న మార్గమే స్వాతంత్య్రం తీసుకొస్తుందని భావించి.. జాతిపితను స్ఫూర్తిగా తీసుకొని నూలు వడకడం మొదలుపెట్టారు. ఆ ఖాదీ దుస్తులే ఆమె ధరించేవారు. అందరిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించేందుకు నిరసన, ప్రదర్శనలు చేశారు. 1930లలో సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం,శాసనోల్లంఘన ఉద్యమం వంటి అనేక ఉద్యమాల్లో పాల్గొని తనదైన పాత్రను పోషించారు. బ్రిటిష్ సైన్యపు లాఠీ దెబ్బలకు సైతం సహించారు. పలుమార్లు అరెస్టయి జైలు జీవితం గడిపారు. ఈ క్రమంలోనే 1933లో ఆమె జిల్లా కేంద్రంలో స్వాతంత్య్రాన్ని కాంక్షిస్తూ ఉద్యమ ర్యాలీని నిర్వహించారు. ఆ సమయంలో బెంగాల్ గవర్నర్ సర్ జాన్ ఆండర్సన్ అక్కడే పర్యటిస్తున్నారు. ఎలాగైనా ఉద్యమ స్ఫూర్తిని రగిలించాలని భావించి.. పోలీసుల కన్నుగప్పి ముందుకు వెళ్లి నల్లజెండా చూపిస్తూ ‘గవర్నర్ గోబ్యాక్’ అని నినదించింది. ఈ చర్యకుగాను ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. అలా ఉద్యమంలో పాల్గొంటూనే అనేక చేదు అనుభవాలు చవిచూసింది. అయిన మడమ తిప్పకుండా ఎప్పటికప్పుడు స్వతంత్ర జ్వాలలు రగిలిస్తూనే ఉండేది.
స్వతంత్రం కాంక్షిస్తూ చేపట్టిన 1942లో క్విట్ ఇండియా ఉద్యమం నాటికి ఆమె వయసు 73 ఏళ్ళు. ఆ ఉద్యమంలో భాగంగా సెప్టెంబరు 29న సుమారు 6 వేల మంది మహిళలతో పశ్చిమ బెంగాల్ లోని తమ్లుక్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ అక్కడి పోలీసుస్టేషన్ చేరుకోగానే పోలీసులు ఉద్యమం వీడాలని హెచ్చరించారు. అయినా ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. అడుగు ముందుకేస్తే.. కాల్చి పడేస్తామని పోలీసులు తుపాకీలు ఎక్కుపెట్టారు. ఉద్యమం నీరుగారుతుందని.. భావిభారత పౌరులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆమె చేతిలో జెండాతో, వందేమాతర నినాదంతో ఎదురువెళ్ళింది. పోలీసులు లాగండి అని ఎంత హెచ్చరించినా ఆమె వినలేదు. ‘భారత్ మాతకు జై.. వందేమాతరం.. గాంధీకి జై’ అని నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. దీంతో పోలీసులు ఆమెను తుపాకులతో కాల్చారు. శరీరంలోకి దిగిన 3 వరుస తూటాలకు కుప్పకూలిపోతున్నా ఆమె స్ఫూర్తి ఏ మాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగింది. జెండాను మరింత పైకెత్తి, ఇంకా బిగ్గరగా వందేమాతరం అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది. చివరికి జెండాను పట్టుకొనే మాతాంగిని హజ్రా వీరమరణం పొందారు. ప్రాణం వదిలినా.. జెండాను మాత్రం వదలని ఆ దృశ్యాన్ని చూసి ఎందరో స్ఫూర్తి పొందారు. ఆమె ప్రేరణతో స్థానికులు మేథినీపుర్‌లో కొంతకాలం సొంతంగా స్థానిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఈమె వీరత్వానికి గుర్తుగా 1977లో కోల్‌కతా నగరంలో మాతంగిని హజ్రా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.