Telugu News

ఓ ఉద్యమం 2 దేశాల మధ్య వైరాన్ని తీసుకొచ్చింది

క ఉద్యమం.. పౌరుల హక్కులు, సామాజిక న్యాయం, సమాజ శ్రేయస్సు లాంటి వాటి కోసం జరుగుతుంది. కానీ, అదే ఉద్యమం 2 దేశాల మధ్య వైరాన్ని పెంచుతోంది. వేర్పాటువాదం అనే నినాదంతో ఏర్పాటైన ఖలిస్థాన్‌ ఉద్యమం కెనడా, భారత్‌ల మధ్య చిచ్చుకు కారణమైంది. విద్య, వాణిజ్యంలో సత్సంబంధాలు కలిగిన ఇరు దేశాలు నువ్వా.. నేనా.. అనేలా వ్యవహరిస్తున్నాయి. దీనంతటికీ కారణం ఖలిస్థాన్‌ ఉద్యమకారుడు హర్‌దీప్ సింగ్‌ నిజ్జర్‌ హత్య. నిజ్జర్ హత్యలో భారత్‌  ప్రమేయం ఉందని.. తమ దేశ సార్వభౌమత్వాన్ని విదేశీ ప్రభుత్వాలు హరిస్తున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపిస్తుండగా.. అవి అసంబద్ధ, ప్రేరేపిత విమర్శలని భారత్‌ ఖండించింది. అంతేకాక ఇరు దేశాలు దౌత్యవేత్తలనూ బహిష్కరించాయి. మరి ఈ వైరానికి కారణమైన నిజ్జర్‌ ఎవరు? ఖలిస్థాన్‌ ఉద్యమానికి కెనడాకు సంబంధమేంటి? ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండనున్నాయి? వంటి విషయాలు తెలుసుకుందాం.

* ఈ సెగ ఇప్పటిది కాదు..!

ఖలిస్థాన్ అంటే పరిశుద్ధ భూమి అని అర్థం. మనదేశంలో మతం ఆధారంగా సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్‌తో ఖలిస్థాన్ ఉద్యమం మొదలైంది. భారత్, పాకిస్థాన్‌లలోని పంజాబ్ ప్రాంతంతో ఖలిస్థాన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ దేశ విభజన సమయంలో తెర మీదకు వచ్చింది. ఈ వేర్పాటువాదాన్ని దేశ భద్రతకు ముప్పుగా భావించిన భారత ప్రభుత్వం.. 1984లో స్వర్ణ దేవాలయంలో జరిగిన నిరసనలను ఆపేందుకు సైన్యాన్ని పంపించింది. సైన్యం జరిగిన కాల్పుల్లో వందలాది మంది ఖలిస్థాన్ వేర్పాటువాదులు హతమయ్యారు. దీనికి ప్రతీకారంగా 1984 అక్టోబర్‌ 31న నాటి ప్రధాని ఇందిరా గాంధీని సిక్కులైన ఆమె బాడీగార్డులు దారుణంగా చంపేశారు.  

* హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు?

హర్‌దీప్ సింగ్ నిజ్జర్ భారత సంతతికి చెందిన కెనడా పౌరసత్వం ఉన్న వ్యక్తి. భారత్‌లోని పంజాబ్‌లో జలంధర్‌కు సమీపంలో ఉన్న బార్సింగ్‌పూర్‌ అనే గ్రామంలో ఈయన జన్మించారు. 1997లో భారత్ నుంచి కెన‌డాకు వ‌ల‌స వెళ్లిన హర్‌దీప్ సింగ్ నిజ్జర్.. శ‌ర‌ణార్ధిగా ఉండేందుకు పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను అక్కడి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో అక్కడే ఓ మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నారు. మొదట్లో ఈయన వడ్రంగి పని చేశారు. తర్వాత బ్రిటిష్ కొలంబియాలో ప్రముఖ సిక్కు నాయకుడిగా ఎదిగారు. దీంతో ఆ తర్వాత నుంచి అతను ఖలిస్థాన్ మిలిటెన్సీ గ్రూప్‌లో కీలకంగా పని చేశారు. భారత్ ప్రభుత్వం నిషేదిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్‌గా కొనసాగారు. ఇక పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపిస్తున్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ 2020లో భారత ప్రభుత్వం నిజ్జర్‌ను ‘ఉగ్రవాది’గా ప్రకటించింది.

2022లో నిజ్జర్‌ కోసం NIA రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అయితే, హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారాలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

ఆయన హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయంపై కెనడా ఇంటెలిజెన్స్‌కు విశ్వసనీయమైన సమాచారం ఉందని కెనడా ప్రధాని ట్రూడో వెల్లడించారు.

ఇటీవల జరిగిన జీ20 సదస్సులో భారత ప్రధానితో కూడా ట్రూడో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

‘కెనడా గడ్డపై ఒక కెనడియన్ పౌరుడిని విదేశీ శక్తులు హత్య చేయడం మా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, ఇది స్వేచ్ఛా, ప్రజాస్వామిక సమాజాలు అనుసరిస్తున్న ప్రాథమిక నియమాలకు విరుద్ధం’అని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ట్రూడో వ్యాఖ్యానించారు.

ఇందులో భాగంగానే భారతదేశ దౌత్యవేత్త పవన్ కుమార్ రాయ్‌ను బహిష్కరించింది.

అయితే, కెనడా చేసిన ఆరోపణలు, దౌత్యవేత్తపై వేటును భారత్ తీవ్రంగా ఖండించింది.

* భారత్ కెనడా మధ్య సంబంధాలు, పరిస్థితులు ఏంటి?

సాధారణంగా అమెరికా తర్వాత భారత్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వెళ్లే దేశం కెనడా ఉండడం గమనార్హం.

అయితే, ప్రస్తుతం ఇరుదేశాల మధ్య దౌత్య పరంగా టెన్షన్ వాతావరణం నెలకొనడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ఇప్పటివరకు భారత్, కెనడాల మధ్య బలమైన సంబంధాలు ఉండగా.. కెనడా ప్రధాని చేసిన సంచలన వ్యాఖ్యలతో అవి దెబ్బతిన్నాయి.

దీంతో ఇప్పటికే కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థులు, సాధారణ పౌరులే కాకుండా వెళ్లడానికి సిద్ధమైన వారి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది.

మరోపక్క కెనడాలో ఉన్న భారతీయ హిందువులు, సిక్కులకు మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇక ఈ రెండు దేశాల మధ్య ట్రేడింగ్ విషయానికి వస్తే… గత సంవత్సరాలతో పోలిస్తే తగ్గుతూ వస్తుంది.

కాబట్టి ఇది ఏ మాత్రం ప్రభావం చూపదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు

Show More
Back to top button