
2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉక్రెయిన్‌పై రష్యా దాడులు పూర్తి యుద్ధంగా మారి గత వెయ్యి రోజులు దాటుతూ 1058వ రోజు దాటుతున్న వేళ, ఈ యుద్ధ మారణహోమానికి ముగింపే కనిపించడం లేదు. గత 15 మాసాలుగా జరిగిన ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధం కాల్పుల విరమణ, యుద్ధ ముగింపుకు అంగీకారం కుదరడం హర్షదాయకం. ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో ఇరు పక్షాలకు చెందిన లక్షల మంది సైనికులు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోగా, మిలియన్ల కొద్దీ గాయపడడం, పది మిలియన్లకు పైగా ఉక్రెనియన్లు నిర్వాసితులుగా మారడంతో శరణార్థి శిబిరాల్లో అమానవీయ దుస్థితుల్లో బలవంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. వివిధ అంచనాల ప్రకారం ఇప్పటి వరకు లక్ష వరకు ఉక్రెనియన్ బలగాలు చనిపోగా, 4 లక్షలకు పైగా గాయపడ్డారు. అదే విధంగా కనీసం 1.5 లక్షల రష్యా బలగాలు ప్రాణాలను కోల్పోయారని తెలుస్తున్నది. రష్యా ఆక్రమించిన భూభాగాన్ని వెనక్కి తీసుకోవడానికి ఉక్రెయిన్, ఉక్రెయిన్‌ను ఆక్రమించాలని రష్యా తమ తమ పోరాటాలను ఉధృతంగా చేస్తున్నాయి.
ఉక్రెయిన్ గత చరిత్ర – యుద్ధం ప్రారంభం:
1700లో రష్యా సామ్రాజ్య పాలనలో ఉన్న ఉక్రెయిన్ 1917లో రష్యా ఉద్యమంతోరష్యా సామ్రాజ్య పాలన నుంచి విముక్తమై 1922లో సోవియట్ యూనియన్‌లో భాగమై పోయింది. 1930లో మిలియన్ల ఉక్తెనియన్లు కరువుకాటకాలతో ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంతో ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా నిలబడింది. రష్యాలోని మెజారిటీ ప్రజలే కాకుండా పుతిన్ లాంటి నాయకులు కూడా ఉక్రెయిన్ తమ దేశంలో భాగమే అని భావించడంతో రెండు దేశాల మధ్య విభేదాలు రోజు రోజుకు పెరగడం, చివరకు 2022 ఫిబ్రవరి 24న రష్యా పూర్తి స్థాయి దాడి చేయడంతో యుద్ధం అనివార్యం అయ్యింది. 2019లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పాటు అమెరికా, యూరోప్ దేశాల సహకారంతో యుద్ధం మారణహోమంగా మారింది. రష్యా పక్షాన చైనా, ఇరాన్, ఉత్తర కొరియాలు నిలవడంతో నువ్వా నేనా అనే రీతిలో మారణహోమం కొనసాగుతున్నది.
సమీపంలో కానరాని యుద్ధ విరమణ ఆలోచనలు:
నేడు ఉక్రెయిన్-రష్యా యుద్ధం కాల్పుల విరమణ లేదా ముగింపుకు రావాలంటే ఇరు పక్షాలను ఒక టేబుల్‌పై చర్చలకు కూర్చోబెట్టాల్సి ఉంది. ఇది చాలా కష్టసాధ్యమని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ యుద్ధానికి చరమగీతం పాడడానికి నాలుగు మార్గాలు కనిపిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. వీటిలో యుద్ధం దీర్ఘకాలం కొనసాగడం, యుద్ధ తీవ్రత తగ్గడం, యూఎస్ యూరోప్‌ల సహకారంతో ఉక్రెయిన్ గెలవడం, లేదా రష్యా గెలుపు బాటన నిలవడం లాంటి పరిష్కార మార్గాలు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్పంప్ కూడా యుద్ధ ముగింపును కోరుతున్నప్పటికీ రష్యా ఆధిపత్యాన్ని అంగీకరించడం అసాధ్యమే. యూఎస్, యూరోప్‌ల మిలటరీ, ఆర్థిక సహకారంతో మాత్రమే ఉక్రెయిన్ పై చేయి సాధించగలదు.కాల్పుల విరమణ లేదా యుద్ధ విరమణ చర్చలకు ఉక్రెయిన్ అంగీకరిస్తున్నప్పటికీ ఈ ప్రతిపాదనలను రష్యా వ్యతిరేకిస్తున్నది.
ఎవరు పట్టు వారిది. యుద్ధ భూమిలో పోతున్న ప్రాణాలు ఇరువురివి. ఇరు దేశాలు పౌర సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. దౌత్యపరమైన ప్రతిపాదనలు ఆదిలోనే తుంచబడుతున్నాయి. జెలెన్‌స్కీ, పుతిన్‌లు మంకు పట్టు పట్టుకొని మారణహోమం చూస్తున్నారు. మరణాల లెక్కలను సవరించుకుంటున్నారు. ఆకలి కేకలను మించి యుద్ధ మోతలు మోగిస్తున్నారు. రష్యా గెలుపు పశ్చిమ దేశాలకు ఓటమితో సమానం. ఉక్రెయిన్ గెలుపు రష్యా-చైనాలకు తల వంపులు అవుతున్నది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మారణహోమ మరుభూమి తప్ప అభివృద్ధి ఆనందాలు కనిపించవు. యుద్ధం కొనసాగితే ఇరు దేశాల ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్త 840 కోట్ల ప్రజలు దాని దుష్ప్రభావ వేడికి ప్రభావితం అయ్యారు, అవుతూనే ఉంటారు. గాజా మారణోమం అంతానికి మార్గం దొరికినట్లు, రష్యా దండయాత్రకు కూడా ఓ పరిష్కారం సత్వరమే దొరకాలని కోరుకుందాం.