
అది విజయనగరం జిల్లా బలిజిపేట మండలం దగ్గరలో గల “గుంపు” అనే శైవక్షేత్రానికి అయిదేళ్ల ఒక బాలుడిని తీసుకొని ఎడ్ల బండిలో వెళ్ళింది తల్లి నరసమ్మ. అక్కడ దిగీదిగగానే ఓ పుస్తకాల కొట్టులో ఉన్న భాగవతం చూసి అది తనకు కావాలన్నాడు ఆ పిల్లవాడు. రంగయ్య అనే ఆ కొట్టువాడు పిల్లాడిని చూసి నీకు భాగవతాలు ఎందుకయ్యా కుర్రవాడివి అన్నాడు. అప్పుడు ఆ కుర్రాడు భాగవతంలో వున్న పద్యాలను టకటకా అప్పగించేసాడు. అవాక్కయిపోయిన రంగయ్య పిల్లవాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుని భాగవతం పుస్తకంతో పాటు ఐదు రూపాయలు దక్షిణ కూడా చేతిలో పెట్టి దండం పెట్టాడు.
ఆ అయిదేళ్ల బాలుడు మరెవరో కాదు హరికథ పితామహులు ఆదిభట్ల నారాయణ దాసు. సంగీత, సాహిత్య, నాట్యాల మేలి కలయిక అయిన అరుదైన కథారూపమే హరికథ. తెలుగువారి విశిష్ట కళారూపమైన హరికథకు ప్రాణం పోసి, దానికి నిర్దిష్ట రూపాన్ని కల్పించి, దానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కళాకారులు ఆదిభట్ల నారాయణ దాసు. సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయితగా, కవిగా, బహుభాషా కోవిదుడిగా, గొప్ప తాత్వికుడిగా నారాయణ దాసు పేరు పొందారు. తెలుగు నేలపైనే గాక పలు ఇతర ప్రాంతాల్లోనూ ఆయన ప్రదర్శనలిచ్చారు.
ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన వారు పలువురు పలువిధములుగా ఉంటారు. కానీ మిక్కిలి ప్రతిభలు ఒక్కరివద్దనే ఉండేవారు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి బహుముఖ ప్రజ్ఞాధురీణులలో అవతారమూర్తి, ఆంధ్ర విద్వజ్జ్యోతి “హరికథా పితామహ” శ్రీమదజ్జాడాదిభట్ల కులశేఖరులగు నారాయణ దాసు ఒకరు. నారాయణ దాసు పుంభావ సరస్వతి. హరికథా వాఙ్మయానికి ఆదిభట్టు, కావ్యశిల్పానికి కవిసమ్రాట్టు. ఆయన కథాకల్పనకు ఆటపట్టు, కథావధానమునకు మూలవిరాట్టు, భక్తిపారవశ్యానికి పెన్నిధి. నారాయణ దాసు నవరసాలకు కళానిధి, యుక్తి ప్రయుక్తులకు మహోదధి, సంగీత సాహిత్యాలకు తాను సరస్వతి. ఆయన బహుభాషా పాండిత్యానికి పట్టుకొమ్మ, లయబ్రహ్మ కూడనూ. శ్రీమత్”, “అజ్జాడ” పదాలు కలిపి “శ్రీమదజ్జాడ నారాయణ దాసు” అయిన ఆ గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.
నారాయణ దాసు సహజ పాండిత్య సాధనమున వారు సంగీతము, సాహిత్యము, నాట్యము, పాత్రాభినయము, కవిత్వము, వేదాంతము, వ్యాకరణము, జ్యోతిష్యము, ఆయుర్వేదము మొదలయిన విద్యలయందు అలాగే తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పారశీకం భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. ఆయన అష్టావధానాలు చేసేవారు. అచ్చతెలుగులోను, సంస్కృతంలోను, వివిధ విషయాలపై శతాధిక గ్రంథాలు రచించిన మహా పండితులు నారాయణ దాసు. ఆయన జగజ్యోతి, హరికధామృతం, తారకం, రామచంద్ర శతకం, కాశీ శతకం లాంటి రచనలు చేశారు. “దశవిధ రాగ నవతి కుసుమ మంజరి” పాటలో మంజరీ వృత్తంలో రాగాలు కూర్చడమే కాక ఋక్ సంగ్రహం అనే బృహత్తర కావ్యంలో ఋగ్వేదంలోని 300 పైచిలుకు ఋక్కులకు సంగీతాన్ని సమకూర్చి, వాటిని వీణమీద వాయించడం విద్యార్ధులకు నేర్పారు. కవిత్వం, సంగీతం, నాట్యం అను మూడు రంగాలలోనూ తనకున్న ప్రతిభాపాటవాలను జోడించి “హరికథ” అనే కళను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లి ఈ మూడింటి కలయికకూ భక్తి అనే భావం ప్రాణంగా “హరికథలు” రచించారు ఆదిభట్ల నారాయణ దాసు.
జీవిత విశేషాలు…
జన్మనామం : అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు
ఇతర పేర్లు : సూర్యనారాయణ
జననం : 31 అక్టోబరు 1864
స్వస్థలం : అజ్జాడ, బలిజిపేట, బొబ్బిలి, విజయనగరం
వృత్తి : తెలుగు హరికథలు, సాహిత్యం
తండ్రి : వేంకటచయనులు
తల్లి : లక్ష్మీ నరసమాంబ
మరణ కారణం : వృద్ధాప్యం
మరణం : 02 జనవరి 1945
నేపథ్యం..
ఆదిభట్ల నారాయణ దాసు 31 ఆగష్టు 1864 నాడు ఆంధ్రప్రదేశ్ లోని ఇప్పటి విజయనగరం జిల్లా, బొబ్బిలి దగ్గరలో గల ప్రస్తుతం బలిజిపేట మండలంలో ఉన్న అజ్జాడ గ్రామంలో లక్ష్మీ నరసమాంబ, వేంకటచయనులు దంపతులకు జన్మించారు. నారాయణదాసు అసలు పేరు సూర్యనారాయణ. ఆయన హరికథకుడిగా ప్రసిద్ధి పొందిన తరువాత ఆయన నారాయణదాసుగా ప్రఖ్యాతిగాంచారు. తల్లిదండ్రులకు ఉన్న పేదరికం కారణంగా నారాయణ దాసు బడికి వెళ్ళలేదు. అయినా కూడా చిన్నతనంలో , పద్యాలు, శ్లోకాలు విని, కంఠతా పట్టి తిరిగి వల్లించేవారు. తాను ఐదేళ్ళ చిరు ప్రాయంలోనే, భాగవతం లోని ఎన్నో పద్యాలు చెప్పేవారు. పిల్లవాడికి అయిదేళ్లు వచ్చేసరికి తల్లి నరసమ్మ పిల్లవాడిని తీసుకొని ఎడ్ల బండిలో “గుంపు” అనే శైవక్షేత్రానికి వెళ్ళింది. అక్కడ దిగీదిగగానే ఓ పుస్తకాల కొట్టులో ఉన్న భాగవతం చూసారు సూర్యనారాయణ. అది తనకు కావాలన్నారు. రంగయ్య అనే ఆ కొట్టువాడు పిల్లాడిని చూసి నీకు భాగవతాలు ఎందుకయ్యా కుర్రవాడివి అన్నాడు. అప్పుడు ఆ కుర్రాడు భాగవతంలో వున్న పద్యాలను టకటకా అప్పగించేసాడు. అవాక్కయిపోయిన రంగయ్య పిల్లవాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుని భాగవతం పుస్తకంతో పాటు ఐదు రూపాయలు దక్షిణ కూడా చేతిలో పెట్టి దండం పెట్టాడు
తాత దగ్గరే సంగీత పాఠాలు…
ఆదిభట్ల నారాయణ దాసుకు పదేళ్లు వచ్చేసరికి తన తాత గారి గ్రామం “వంతరం” వెళ్లాడు. అక్కడ ఆరుగు మీద కూర్చుని రాగయుక్తంగా భాగవతం పద్యాలు పాడడం చూసి అబ్బురపడ్డ తాత “వాసా సాంబయ్య” గారు ఆ కుర్రాడిలో విద్యుత్తును గ్రహించి చనువుగా తన కూతురుతో వాడిని నాతో పంపించేయకూడదు, అద్భుతమైన సంగీత విద్వాంసుడిని చేసి పంపిస్తాను అన్నాడు. డానికి తల్లి లక్ష్మీ నరసమాంబ సరేనంది. అంతే అక్కడి నుండి తాత మనుమల మధ్య గురుశిష్య సంబంధం ఆరంభమైంది. దాంతో అప్పటిదాకా, ఎటో సాగుతున్న నావకి చుక్కాని దొరికినట్లయ్యింది.
ఒకప్రక్క సంగీత సాధన, ఇంకో ప్రక్క విద్యాభ్యాసం. చిన్నవయసులోనే ఇలా రెంటినీ అతను ఎంతో నేర్పుగా సంబాళించగలిగాడు. సంగీత జ్యోతి వెలిగింది. వెలుగులు విరజమ్మడం ఆరంభించింది. కవిత్వం అబ్బింది, గానం అబ్బింది. బంగారానికి పరిమళం అబ్బింది. అదేవిధంగా విజయనగరం మహారాజ వారి కళాశాలలో ఆంగ్లము విద్యాభ్యాసం మొదలుపెట్టారు. కేవలం ఆంగ్లము మాత్రమే కాదు తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పారశీకం భాషలలో ఆయన ప్రావీణ్యం సంపాదించాడు. అష్టావధానాలు చేసేవాడు, అచ్చ తెలుగులోను, సంస్కృతంలోను, సంస్కృతభూయిష్టమైన తెలుగులోను కూడా వివిధ విషయాలపై తరువాత కాలంలో శతాధిక గ్రంథాలు రచించిన మహా పండితుడు.
కంచు కంఠంతో హరికథ…
ఆదిభట్ల నారాయణ దాసు లోని అపూర్వమైన విద్య “హరికథ” ని కనిపెట్టి విజయనగరంలో తొలి “హరికథ” కచేరీ పెట్టించిన వారు జయంతి కామేశం గారు. ఆ రోజులలో మైకులు లేవు, విద్యుత్తు దీపాలు లేవు. నూనె దీపాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తన కంచు కంఠంతో శంభో అన్న శంఖనాదం తో మొదలుపెట్టారు. ఊరు ఊరే ఉలిక్కిపడింది. హరికథ ఆరంభమైంది. ఒక చేతితో చిడతలు, కాలికికేమో గజ్జలు. జన్మించాడు తొలి హరిదాసు, “హరికథ పితామహుడు”. ఆ రూపాన్ని పేరేశ్వర నరసింహ కవి వర్యులు ఇలా వర్ణించారు.
“ఒడలికి చందనంబుచిత రీతినలంది
కనులం గాటుక నొడికముగదీర్చి
నుదుటిపై తిలకంబును పదిలంబుగా దిద్ది
సిగముడిపై పూల చెండు జుట్టి
చిక్కని మెడలోన జక్కని యొకపూల
దండ సొంపగురీతి నుండజేసి
పట్టు పుట్టము గట్టి పైన బనారసు
కండువా నడుమున గ్రాల జుట్టి
వేళ్లగట్టిన గజ్జెలు ఘల్లుమనగ
జేత శ్రీరామ పట్టాభిషేక పటము
బూని, మానవ గంధర్వుడే నాతండు
పనియె నల్లన నల రాజ సౌధములకు”…
మైసూరు మహారాజు చేత సన్మానం…
రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ఆ మొదటి కచేరీ తరువాత నారాయణ దాసు వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన ఖ్యాతి వీధివీధిన, వాడవాడలా వ్యాపించింది. అది తెలిసి మైసూర్ మహారాజు గారి నుండి ఆహ్వానం కూడా అందింది. మైసూర్ మహారాజా వారు ఆ హరికథకి ముగ్ధుడైపోయారు. దానితో పాటు వీణాగానం కూడా అడిగి మరీ విన్నారు. తృప్తిపడక వీణ కూడా వాయించమని కోరారు. వీణా వాదనకి, హరికథకి ముచ్చటపడిపోయిన రాజావారు ఆ వాగ్గేయకారునికి బంగారు మొరుగులు, రెండు జతల శాలువాలు, ఒక జత వీణ, ఒక తంబుర, వెయ్యినూటపదహారు వెండి రూపాయల బిల్లలను ఇచ్చి గౌరవించారు. ఇది నారాయణదాసుకు దక్కిన మొదటి సన్మానం.
కవిత్వం, సంగీతం, నాట్యం అనే మూడు రంగాలలోనూ తనకున్న ప్రతిభను జోడించి నారాయణదాసు “హరికథ” అనే కళను అత్యున్నత శిఖరాలకు కొనిపోయాడు. ఈ మూడింటి కలయికకూ భక్తి అనే భావం ప్రాణంగా హరికథలు రచించారు, చెప్పారు, నేర్పారు. ఆయన హరికథ వినడం ఒక గొప్ప అనుభూతిగా అప్పటివారు చెప్పుకొనేవారు. మొత్తం మీద ఆదిభట్ల నారాయణ దాసు తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చతెలుగులో ఒకటి హరికథలను రచించారు. కొన్నిసార్లు ఒక్కొక్క వర్ణన నాలుగైదు పేజీల నిడివి వరకూ కొనసాగేవి. ఒకసారి నారాయణదాసు కలకత్తాలో “శ్రీకృష్ణజన్మ హరికథ” ను సంస్కృతంలో గానం చేసి, దాని భావాన్ని హిందీలో వివరించారు.
వ్యాయామశాలలో ఒంటిపై గోచి గుడ్డతో పాట..
ఆదిభట్ల నారాయణ దాసు సంగీత ప్రతిభ ఆయన సాహితీ ప్రకర్షకు సమస్థాయిలో పరిమళించింది. ఆయన కీర్తనలు మెల్లిమెల్లిగా ఆంధ్రోత్తర ప్రాంతాలకు కూడా ప్రాకడం మొదలెట్టాయి. ఆనాటి సంగీత విద్వాంసులు ఆయనను లయబ్రహ్మ అనీ, పంచముఖి పరమేశ్వర అనీ సన్మానించారు. పంచముఖి ప్రదర్శన ఆయన నైజం. ఒకేమారు ఐదు తాళాలకు అనుగుణంగా పాడడం ఆయన ప్రత్యేకత. ఈ పంచముఖి ప్రదర్శనలో నారాయణదాసు రెండు చేతులు, రెండు కాళ్ళు, తలలతో ఐదు తాళాలకూ దరువు చూపేవారు. ఆ సమయంలో ఆయనకు ఐదుగురు వివిధ వాద్యకారులు సహకరించేవారు. సంగీత సాహిత్య స్వర బ్రహ్మ అని ఆయనకు బిరుదు కూడా ప్రసాదించారు.
ఆనంద గజపతి అనే రాజు నారాయణ దాసును తన ఆస్థాన విద్వాంసునిగా నియమించారు. ఒకసారి సభలో రాజు గారు దాసును ఏదో రాగం పాడమని అడిగారట. డానికి నారాయణ దాసు నేను పాడను అని సభలో నుండి వెళ్ళిపోయారట. ఆ సందర్భంలో రాజు గారు కూడా ఏమి కోపం తెచ్చుకోలేదు. ఐతే తరువాత నారాయణ దాసు వ్యాయామశాలలో వ్యాయామం చేస్తున్నప్పుడు, ఎందుకో ఆ రాగం గుర్తుకు వచ్చి, పాడడం మొదలుపెట్టారట. నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి. చుట్టూరా జనాలు ఉన్నారు. కానీ ఇవేవీ పట్టించుకొనే స్థితిలో నారాయణ దాసు లేరు. చివరికి పాడడం అయినతరువాత చూసుకుంటే ఒంటి మీద కేవలం గోచీ తప్ప ఇంకేమీ లేదట. ఆ రాగం విన్న ప్రజలంతా ఆనందంతో ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఆ జనంలో ఆనంద గజపతి రాజు కూడా ఉన్నారట.
కన్యాకుమారిలో సాహిత్య ప్రబంధం వ్రాసి…
“బార్స్ వెల్” అనే దొరగారు నారాయణ దాసు ప్రజ్ఞా పాటవాల్ని, అపూర్వ సాహితీ శక్తికి సంతోషించి “నోబెల్ బహుమతి” కోసం ప్రోత్సహించారు. కానీ నారాయణ దాసు ఆ నోబెల్ బహుమతిని “తృణప్రాయం” గా భావించి ప్రయత్నం చేయలేదు. నిజానికి నారాయణ దాసుకి నోబెల్ బహుమతి వచ్చి ఉంటే ఒక అపూర్వ కళారూపం “హరికథ” బ్రతికిపోయేది. కానీ మనకు అంత మంచి యోగం లేదు.
ఒకసారి నారాయణ దాసు కన్యాకుమారి వెళ్లి, అక్కడ అమ్మవారిని పూజించి దేవిస్థవం చేసి అక్కడే “దశవిధరాగ నవతి కుసుమ మంజరి” అనే సంగీత సాహిత్య ప్రబంధాన్ని వ్రాశారు. అది ఒక కొరకని కొయ్య. ఆ గ్రంథం సంస్కృతాంధ్ర వాజ్ఞ్మయానికి, కర్ణాటక సంగీతానికి తుదిమెట్టు అని నారాయణ దాసు అన్నారు.
ఈ సాహిత్య ప్రబంధానికి ఉపోద్ఘాతం వ్రాయమని మహావిద్వాంసులు అయిన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, ద్వారం వెంకటస్వామి నాయుడు, కర్రా సూర్యనారాయణ లాంటి వారికి ఇచ్చారు. వీరు అంతా గొప్ప గొప్ప విద్వాంసులే. అయితే వీరంతా ఈ గ్రంథాన్ని పరిశీలించి తాము దానికి ముందుమాట వ్రాయడానికి అనర్హులమని సవినయంగా ఒప్పుకున్నారట.
పిఠాపురాన్ని మణి ప్రవాళ భాషలోవర్ణన…
తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పార్శీ భాషలలో ప్రావీణ్యం సంపాదించి, అష్టావధానాలు చేసిన నారాయణ దాసు పిఠాపురాన్ని మణి ప్రవాళ భాషలో క్రింది విధంగా వర్ణించారు..
★ సంస్కృతం..
భ్రాజలే కుక్కుటేశ్వర మాధవాలయా భ్యాం ఘనరూఢ సౌదంతరేనా..
★ పార్శి..
హాసిల్ హమీషా జహన్ తజ్ నమూన భిషిష్మత్తు పాపిర్చి హిరిపాల..
★ ఇంగ్లీష్..
రావ్ సూర్యారావ్ రాజా బహదూర్ది చారిట చిత్రాల్వె ప్రెసెంట్స్ ఎరెవ్రి..
★ తెలుగు…
చదువుల పుట్టిల్లు చల్వ తెమ్మెర జల్లు మేల్నాల్లు పాగడిగ మీరజెల్లు..
మేటి పంటల టెంకి కల్మి మెడలంకి
బెస్టుటేని టీవీ నోడవరి ఈస్ట్ ది సీజె
లుర్దు కీర్ర జనస్ జనల్ మీర్జనన
పీటకాపురి మేన తాలిష్ట పమీహ..
మరణం…
1919 వ సంవత్సరంలో అప్పటి విజయనగరం మహారాజు స్థాపించిన “శ్రీ విజయరామ గాన పాఠశాల” కు మొదటి ప్రధానాధ్యాపకునిగా ఆదిభట్ల నారాయణ దాసును నియమించారు. ప్రసిద్ధ వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు ఈయనకు సహాధ్యాపకునిగా ఉన్నారు. ఆంధ్రదేశానికి ఈ విద్యాసంస్థ నుండి ఎందరో ప్రముఖ కళాకారులు లభించారు. వారిలో ఘంటసాల వెంకటేశ్వరరావు ఒకరు. నారాయణ దాసు ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో చదువుకొన్నామని చెప్పుకోవడం అప్పట్లో వారు ప్రతిష్ఠాత్మకంగా భావించేవారు.
“హరిదాసు” పేరు ఎత్తగానే నారాయణ దాసు గుర్తొస్తారంటే ఆయన తెలుగువారి మనసుల మీద వేసిన ముద్ర ఎన్ని తరాలకైనా చెరిగిపోదు. అవధానం పేరు ఎత్తితే తిరుపతి కవుల కలాలకు మొక్కితే గాని ముందుకెళ్ళలేం. అలాగే హరికథ పేరు ఎత్తితే నారాయణదాసుకు దాసోహమనక తప్పదు. తన జీవితం మొత్తం, తాను జన్మించిన తెలుగు గడ్డకి తన వంతు సేవ చేసిన ఇంతటి వాగ్గేయకారుడు 02 జనవరి 1945 నాడు (సరిగ్గా ఆరోజు త్యాగరాజు స్వామి వారి జయంతి) స్వర్గస్తులయ్యారు. ఇంతటి ప్రతిభావంతులని స్మరించుకునే అదృష్టం మనకు కలగడం మన పూర్వజన్మ సుకృతం.
ఆదిభట్ల నారాయణ దాసు జీవితంలో కొన్ని ఘట్టాలు…
★ ఒకసారి ఒరిస్సా రాష్ట్రానికి వెళితే రాత్రికి రాత్రి అంబరీష చరిత్రను వ్రాసి మరునాడు ఉదయం “హరికథ” గా చెప్పారు నారాయణ దాసు…
★ 1984 – 85 వ సంవత్సరం “లోకనాథం” అనే ఊర్లో “సంగీత సాహిత్య” అష్టావధానం…
★ 1886 మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత. అదే సంవత్సరం విశాఖపట్నంలో రెండు నెలల్లో 12 హరికథలు చెప్పడం. విక్టోరియా మహారాణి జూబిలీకి ప్రత్యేక ఆహ్వానంపై హరికథా కాలక్షేపం, గజేంద్రమోక్షం రచన. ఇదే సంవత్సరం నారాయణ దాసు వివాహం చేసుకున్నారు.
★ 1888 వ సంవత్సరంలో విశాఖపట్నంలో ఎఫ్.ఏ చదివారు. ఖసింకోట జమీందారుని “హరికథ” ల చేత మెప్పించి స్కాలర్షిప్ సంపాదించారు. విశాఖపట్నంలో 80 హరికథలు చెప్పారు. అల్లిపురం జమీందారుకు హవేలీ సాహిత్య సంగీత అష్టావధానం చేశారు. నారాయణ దాసుకు పిఠాపురం రాజావారిచే సన్మానం జరిగింది.
★ 1889 వ సంవత్సరంలో బాటసారి కావ్య రచన, కాకినాడ నాటక సమాజం వారికి (మహాకవి) కాళిదాసు విక్రమోర్వశీయం రూపకం ప్రదర్శన, శిక్షణ. రాజు పాత్రధారణ. అదే సంవత్సరం బందరులో టికెట్టు పెట్టి అష్టావధానం, కొందరు సంగీత విద్వాంసులకు శృంగభంగం..
★ 1890 వ సంవత్సరంలో “సారంగధర” నాటకాన్ని రచించారు. ఉర్లాం మండలంలోని గంజాం లో “హరికథా” గానం చేశారు.
★ 1894 వ సంవత్సరంలో “స్వీయ చరిత్ర” వ్రాశారు. అదే సంవత్సరం మైసూర్ మహారాజా వారి ఆస్థానంలో సంగీత కాలక్షేపం చేసి సన్మానం పొందారు.
★ 1895 లో ఖసింకోటలో “హరికథ” గానం చేయగా వారిని తిరుపతి వెంకట కవులు అభినందించారు..
★ 1898 “ప్రహ్లాద చరిత్ర”, “రుక్మిణి కళ్యాణం”, (శ్రీకృష్ణ జననం సంస్కృత హరికథ) వ్రాశారు.
★ 1900 – 1901 వ సంవత్సరంలో ఉర్దూ, పార్శీ, అరబ్బీ భాషల అధ్యయనం చేశారు.
★ 1902 వ సంవత్సరంలో “భీష్మ చరిత్ర”, “సావిత్రి” చరిత్రల రచన..
★ 1903 వ సంవత్సరంలో నారాయణ దాసు ఏకైక పుత్రిక సావిత్రి జననం..
★ 1910 వ సంవత్సరంలో “తారకమ్” అన్న సంస్కృత ప్రబంధ రచన చేయడం ద్వారా జర్మన్ దేశపు ప్రొఫెసర్ చేత మెప్పుపొందారు.
★ 1912 వ సంవత్సరంలో రాజమహేంద్రవరంలో వీరేశలింగం పంతులు గారిచే “నవరత్న భుజకీర్తి” ప్రధానం చేసి సన్మానం చేశారు.
★ 1913 వ సంవత్సరంలో రేవా మహారాణి సర్కారు చేత నారాయణ దాసుకి సన్మానం జరిగింది.
★ 1913 వ సంవత్సరంలో నారాయణ దాసు కాశీయాత్ర చేశారు. అదే సంవత్సరం కలకత్తాలో తాను ప్రదర్శించిన “శ్రీకృష్ణ జననం” హరికథ విని విశ్వకవి రవీంద్రుడు మెచ్చుకొన్నారు.
★ 1914 వ సంవత్సరం మచిలీపట్నంలో వీణ వాదన చేసినందుకు గానూ చల్లపల్లి రాజా వారిచే గండపెండేర సన్మానం చేయించుకున్నారు. అదే సంవత్సరం “కాశీ శతక” రచన చేశారు.
★ 1916 వ సంవత్సరంలో నారాయణ దాసుకి భార్యవియోగం కలిగింది..
★ 1919 వ సంవత్సరంలో విజయనగరం సంగీత కళాశాలకు ప్రధానాచార్యులుగా పదవిని స్వీకరించారు.
ఇలా ఒకటి, రెండుకాదు ఆయన జీవితంలో జరిగిన గండపెండేరాలు, గజారోహణలు, సన్మానాలు, సత్కారాలు సాక్షాత్తు సార్వభౌముడు శ్రీనాథ కవి మళ్లీ జన్మించి కనకాభిషేకం చేయించుకున్నట్టుగా ఉండేది.