
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో) ఘనమైన కిరీటంలో మరో కలికితురాయి చేరి మురిసింది. భవ్య భారతం మరో చారిత్రక అంతరిక్ష విజయం సగర్వంగా స్వంతం చేసుకుంది. 2024 ముగుస్తున్న శుభ గడియల్లో ఇస్రో ప్రయోగించిన 99వ పిఎస్‌ఎల్‌వి-సి60 మానవరహిత అంతరిక్ష ఉపగ్రహాల అనుసంధాన (స్పేస్ డాకింగ్ ఎక్సపరిమెంట్ మిషన్, స్పెడెక్స్) మిషన్‌ను 07 డిసెంబర్ 2024న శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించగా 16 జనవరి 2025 వేకువ జామున అనుసంధాన లక్ష్యాన్ని ఛేదించడంలో విజయం సాధించిన అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన 4వ దేశంగా చేరడం ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలుస్తున్నది.
ఈ అంతరిక్ష ఉపగ్రహ అనుసంధాన ప్రక్రియ విజయవంతం కావడంతో రానున్న రోజుల్లో ఇస్రో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రలకు కీలక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టనున్నది. స్పెడెక్స్ మిషన్ ద్వారా ఒక్కొక్కటి 220 కేజీల బరువు కలిగిన రెండు స్రేస్‌క్రాఫ్ట్స్ లేదా వ్యోమనౌకలను పిఎస్‌ఎల్‌వి రాకెట్ సహాయంతో భూమికి 475 కిమీ దూరంలో ఒకే కక్ష్యలో ఒక్కొక్క దానికి 15 కి మీ దూరం ఉండే విధంగా ప్రవేశపెట్టారు. ఈ రెండు స్పేస్‌క్రాఫ్టుల్లో ఒక దానిని ‘టార్గెట్’ అని, రెండవ దానిని ‘చేజర్’ అని పిలుస్తారు. ఈ రెండు వ్యోమనౌకలు 16 జనవరి 2025 ఉదయం వేళ వేగ నియంత్రణతో పరస్పరం దగ్గరకు తీసుకువచ్చి అనుసంధానం కావడంతో ఛేజర్ నెమ్మదిగా టార్గెట్‌కు చేరువై రెండు ఉపగ్రహాలు అనుసంధాన ప్రక్రియ పూర్తి కావడంతో స్పెడెక్స్ ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు సగర్వంగా ప్రకటించారు.
* విజయవంతమైన స్పెడెక్స్ ప్రయోగ ప్రధాన ప్రయోజనాలు
స్పేస్‌క్రాఫ్టుల అనుసంధాన ప్రక్రియ టెక్నాలజీ పునాదిగా రానున్న రోజుల్లో అనేక అత్యాధునిక అంతరిక్ష సవాళ్లను అధిగమించడానికి మార్గం సుగమం అయినట్లు వివరిస్తున్నారు. స్పెడెక్స్ ప్రయోగాలతో ఉపగ్రహాల రిపేరింగ్ లేదా సర్వీసింగ్, 2035 నాటికి అంతరిక్షంలో “భారతీయ అంతరిక్ష స్టేషన్” ఏర్పాటు, చంద్ర మండల సాంపిల్స్ తీసుకురావడం, ఒక ఉపగ్రహం లేదా వ్యోమనౌక నుంచి మరో దానికి మెటీరియల్ బదిలీ చేయడం, ఒక స్పేస్‌క్రాఫ్ట్ నుంచి మరో స్పేస్‌క్పాఫ్ట్‌లోకి మానవుల బదిలీ, విద్యుత్ శక్తి బదిలీ, చంద్రమండలంపై ప్రయోగాలను ముమ్మరంగా చేయడం, వ్యోమనౌకలకు ఇంధనం అందించడం, వ్యోమనౌకల జీవితకాలాలను పెంచడం, బహురాకెట్ల ప్రయోగాలను సులభంగా చేయడం, మేక్రోగ్రావిటీలో భారీ మౌళిక వనరులను అసెంబ్లింగ్ చేయడం, ప్రైవేట్ భాగస్వామ్యాలతో అంతరిక్ష ప్రయోగాలకు ఊపిరులూదడం లాంటి అత్యాధునిక అంతరిక్ష ప్రయోగాలకు ప్రయోజనాలు చేకూరనుంది.
* 2024లో ఇస్రో సాధించిన ఘన విజయాలు
2023లో “చంద్రయాన్-3” ప్రయోగంతో ఎవరూ ప్రయత్నించని చంద్ర మండల దక్షిణ దృవంపై వ్యోమనౌక కాలుమోపడంతో ఆ ఘనత సాధించిన నాలుగవ దేశంగా కీర్తిని గడించడం చూసాం, హర్షాతిరేకాలు వ్యక్తం చేసాం. అదే ఊపులో 2024సో ఇస్రో చేసిన అంతరిక్ష ప్రయోగాల్లో అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాల యాత్రలో భారతం తన స్థానాన్ని పదిలం పరుచుకోవడం సంతోషదాయకం.
2024లో ఇస్రో ప్రయోగించిన ముఖ్య ప్రయోగాల్లో ఎక్స్-రే అధ్యయన పిఎస్‌ఎల్‌వి-సి58, సౌర అధ్యయనానికి ఉద్దేశించిన ఆదిత్య-ఎల్1 హారంలో ఆర్బిట్, అత్యాధునిక వాతావరణ అంచనాకు ప్రయోగించిన జిఎస్‌ఎల్‌వి-ఎఫ్14/ఇన్సాట్-3డిఎస్, విపత్తు/ పర్యావరణ నిర్వహణకు ఈఓఎస్-08, సమాచార వితరణకు జిఎస్‌ఏటి-ఎన్2లతో పాటు ఏడాది చివరన విజయవంతంగా ప్రయోగించిన 99వ ఇస్రో ప్రయోగం “స్పెడెక్స్” ఉపగ్రహ అనుసంధాన ప్రయోగాలు భారత అంతరిక్ష పరిశోధనలకు మచ్చుతునకలుగా నిలుస్తున్నాయి.
2025 జనవరి చివర వారంలో ఇస్రో ప్రయోగించనున్న 100వ జిఎస్‌ఎల్‌విఎంకె-2 రాకెట్ మన ఇస్రో విజయ ప్రస్థానాన్ని కొనసాగించనుంది. 2028లో తొలి వీనస్ మిషన్ చేపట్టేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తున్నది. 2027లో నిర్వహించనున్న మరో చంద్రయాన్-4 ప్రోగ్రామ్ ద్వారా చంద్రమండలంపై శాంపిల్స్ సేకరించి మరో ఉపగ్రహ అనుసంధానంతో వాటిని తీసుకురానున్నారు.
భారత అంతరిక్ష చరిత్రలో మరో వినూత్న అధ్యాయానికి తెర లేపిన ఇస్రో రానున్న రోజుల్లో పలు అత్యాధునిక సాంకేతిక కలిగిన ఉపగ్రహాల ప్రయోగంతో ప్రపంచ దేశాలను అబ్బుర పరచాలని, 2035 నాటికి మనదైన భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, నేటి డాకింగ్ ప్రయోగాలతో రేపటి అంతరిక్ష యాత్ర కొత్తపుంతలు తొక్కాలని కోరుకుందాం. స్పెడెక్స్ ప్రయోగం విజయవంతం కావడంలో అహర్నిషలు కృషి చేసిన శాస్త్రవేత్తల బృందానికి శుభాకాంక్షలు తెలియజేద్దాం.