Telugu News

డిజిటల్ మాధ్యమాలకు బలవుతున్న బాల్యం

ఫోన్, టీవీ, గంటల తరబడి కాలక్షేపం -నిద్రాహారాలకూ దూరం -చుట్టుముడుతున్న ఆరోగ్య సమస్యలు

చదువుకుంటూ, ఆడుకుంటూ హాయిగా కాలం గడపాల్సిన వయసులో చిన్నారులు టీవీలు, సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. వాటిని చూస్తూ నిద్రాహారాలు కూడా మరిచిపోతున్నారు. సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు. డిజిటల్ మాద్యములకు బలై పోతున్నారు చిన్నారులు. గత కొన్ని సంవత్సరాలుగా చిన్నారుల్లో ఈ ధోరణి బాగా ప్రబలుతుంది దేశంలోని చిన్నారులంతా ఎక్కువ శాతం మంది టీవీలు సెల్ ఫోన్లు ఇతర డిజిటల్ మాధ్యమాలను చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు.   గంటల తరబడి టీవీలు, ఫోన్లు చూపుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని ఇటీవల జరిపిన అధ్యయనం తెలింది. కరోన రాకముందు నుండి కంటే కరోనా వచ్చిన తర్వాత చిన్నారులు డిజిటల్ మాధ్యమాలకు బానిసలు అయినట్లు అధ్యాయం వెల్లడించింది. మారుతున్న కాలంతో పాటు ఇంటర్నెట్, ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉండడమే దీనికి కారణం అని అధ్యయనాలు చెబుతున్నాయి. 

సాంకేతిక పరిజ్ఞానాన్ని విపరీతంగా వాడుతూ దానిపై ఆధారపడడాన్నే స్క్రీన్ అడిక్షన్ అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఓ వ్యసనం. స్మార్టోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు, టీవీలు దీనికి సాధనాలు. రోజువారీ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నప్పటికీ ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం బాగా పెరుగుతోంది. ముఖ్యంగా పని ప్రదేశంలో, విద్యాసంస్థలో వీటి అవసరం ఎక్కువ. సామాజిక సంబంధాలను పెంచుకోవడానికి కూడా వీటి పైనే ఆధారపడుతున్నారు. 

దేశంలో 52 శాతం మంది చిన్నారులు రోజుకు రెండు గంటలకు పైగా డిజిటల్ మాధ్యమాలకు దాసోహమంటున్నారని ఓ ఆన్లైన్ సర్వే తెలిపింది. ఆందోళన కలిగించే విషయమేమంటే 15-18 నెలల వయసున్న పిల్లలలో సైతం 88 శాతం మంది రోజుకు గంటకు పైగా స్క్రీన్ ఆధారిత మీడియాకు అలవాటు పడుతున్నారు. సంవత్సరంన్నర వయసు కూడా రాకముందే ఇలా డిజిటల్ మాధ్యమాలకు అలవాటు పడడం వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మయోపియా (దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేకపోవడం), నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి పిల్లలలో ఎదుగుదల కూడా ఆలస్యమవుతోంది.

ఎన్నో అనర్థాలు..

ఇక యువత సంగతి చెప్పనక్కరలేదు. వారిలో 14-25 శాతం మంది తమ స్మార్ట్ఫోన్పై మూడు గంటల కంటే ఎక్కువ సమయమే గడుపుతున్నారు. దీంతో వారు శారీరక శ్రమకు దూరమవుతూ మానసిక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. 

ఆందోళన.. నిరాశ.. 

 ‘సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఇవాళ పిల్లలకు మునివేళ్లపై ఎంతో సమాచారం అందుబాటులో ఉంటోంది. అయితే విచారకరమైన విషయమేమంటే ఈ సమాచారంలో ఎక్కువ భాగం మన చుట్టూ ఉన్న డిజిటల్ స్క్రీన్లలోనే లభిస్తోంది’ అని తిరునల్వేలిలోని కావేరీ ఆస్పత్రికి చెందిన పిల్లల నిపుణురాలు డాక్టర్ అన్నే ప్రవీణ గురుశేఖర్ చెప్పారు. ఎక్కువ సేపు తెరను చూస్తూ గడపడం వల్ల కలిగే ప్రభావాన్ని ఆమె వివరిస్తూ ‘తెర ముందు ఎక్కువ సేపు గడిపే చిన్న పిల్లలకు మాటలు రావడం ఆలస్యమవుతుంది. వారిలో జ్ఞాపకశక్తి కూడా తక్కువగా ఉంటుంది. ప్రవర్తనలోనూ మార్పులు వస్తాయి. సామాజిక నైపుణ్యాలు అలవడడంలో జాప్యం జరుగుతుంది.

నిరాశ, ఆందోళన అనేవి సహజంగా వచ్చే సమస్యలే’ అని తెలిపారు.

ఏం చేయాలంటే…

పిల్లలు ఎక్కువ సమయం డిజిటల్ మాధ్యమాలకు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. చిన్నారులను వేరే వ్యాపకాల వైపు మళ్లిస్తే అనేక సమస్యలు దూరమవుతాయి. ఈ విషయంలో ఏం చేయాలనే విషయంపై ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం రెండు సంవత్సరాలలోపు వయసున్న పిల్లలను స్క్రీన్కు దూరం చేయాలి. బంధువులకు అప్పుడప్పుడూ వీడియో కాల్స్ చేసి చూపించవచ్చు. 2-5 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు రోజుకు గంటకు మించి ఏ విధమైన తెర వైపు చూడకూడదు.

కొంచెం పెద్ద వయసున్న పిల్లలు, యువత ఇతర కార్యకలాపాలతో స్క్రీన్ సమయాన్ని సమన్వయం చేసుకోవాలి. ఇతర కార్యకలాపాలు అంటే ఓ గంట పాటు ఆటలు ఆడాలి. తగినంత సమయం నిద్ర పోవాలి. స్కూల్ వర్క్ చేసుకోవాలి. భోజనానికి, ఇతర హాబీలకు, కుటుంబంతో గడపడానికి సమయాన్ని కేటాయించాలి. భోజనం చేసేటప్పుడు టీవీ, ఫోన్ ఉపయోగించకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రీడలు, కళలు వంటి వాటిపై ఆసక్తి కలిగించాలి. మానవ సంబంధాలు పెంచుకునేలా ప్రోత్సహించాలి. ఫోన్, టీవీ చూస్తుంటే మధ్యలో కొంత విరామం ఇచ్చేలా చూడాలి.

Show More
Back to top button